Sunday, 11 August 2013

Identity and Struggle

8/7/2013 11:12:55 PM
అస్తిత్వం, ఆత్మీయత ఘర్షణ
‘నమస్తే తెలంగాణ’ దినపవూతిక ఆదివారం సంచికలో, ప్రాణహిత కాలమ్ కింద ‘కాలం చెల్లిన సమైక్యాంధ్ర’ శీర్షికన అల్లం నారాయణ రాసిన వ్యాసాన్ని ఇప్పుడే చదివాను. అందులో నా గురించి రాసిన వాక్యాలను చదివినప్పుడు కొంచెం ఉద్వేగానికి గురయ్యాను. నారాయణ అంటే నాకు చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచనా విధానం అంత ఇష్టం. మా ఇద్దరి ప్రధాన ఉనికి అదే! నారాయణ ఇప్పుడు తెలంగాణ జర్నలిస్టుల ఫోరం కన్వీనర్. నేను ఆంధ్రా జర్నలిస్టుల ఫోరం కన్వీనర్. ఆ మేరకు మా మధ్య కొన్ని భిన్నాభివూపాయాలున్నప్పటికీ, ఐక్యతే ఎక్కువగా ఉన్నది. వీటికి ఆవల, మా మధ్య అపారమైన ఆత్మీయత ఉన్నది. తనే రాసినట్టు, అల్లం నారాయణ ఒక యుద్ధాన్ని గెలవడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. పీపుల్స్‌వార్‌లో క్రియాశీలంగా వుం టున్న రోజుల్లో, ఆంధ్రావూపాంతపు నక్సలైట్లతోపాటు సహజంగానే నేనూ తెలంగాణ ఉద్యమాన్ని సమర్థించాను. ఇప్పుడు వున్నవాళ్లలో, నేను అత్యంత ఎక్కువగా గౌరవించే వరవరరావు సూచన మేరకు 1997లో విజయవాడ నుంచి వచ్చి, కాళోజీ వరంగల్ ప్రకటన సదస్సుకు ఆహ్వాన సంఘం సభ్యుడిగా వున్నాను. ప్రొఫెసర్ జయశంకర్‌ను ఉద్యమ కన్వీనర్‌గా ఎన్నుకున్నది ఆ సదస్సులోనే. ఆతరువాత టీఆర్‌ఎస్ ఆవిర్భవించింది. నేను, హైదరాబాద్‌కు మకాం మార్చి, సచివాలయం రిపోర్టరుగా మారిన తరువాత, కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ల మధ్య నాకేమీ తేడా కనిపించలేదు.

నక్సలైట్లు వెనక్కి తగ్గి, ఉద్యమ నాయకత్వం టీఆర్‌ఎస్ చేతుల్లోకి వెళ్ళిపోవడం నాకు నచ్చలేదు. టీఆర్‌ఎస్ -బీజేపి ప్రేమ వ్యవహారం అంతకన్నా నచ్చలేదు. ముస్లిం అనేది నా అస్తిత్వాల్లో ఒకటనీ, అంతర్జాతీయంగా అమెరికాతో, దేశీయంగా సంఘ్ పరివారంతో నాది పుట్టు వైరమని కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. దాన్ని దాచుకోవాల్సిన పని అంతకన్నా లేదు. తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించలేక, దాని నాయకత్వాన్ని సమర్థించలేక నేను కొంతకాలం చాలా ఇబ్బందిపడ్డాను.
తెలంగాణలో ప్రజల పక్షాన నిలబడే ఆలోచనాపరులు అదృష్టవంతులు. వాళ్లకు తమ నేలమీద ఆదరణ లభించింది. సీమాంవూధలో ప్రజల పక్షాన నిలబడే ఆలోచనాపరులు దురదృష్టవంతులు వాళ్లకు తమ నేల మీద ఆదరణ దక్కలేదు. తెలంగాణలో పార్లమెంటరీ పార్టీలు వెనుకంజ వేసినప్పుడల్లా, రెండవ యుద్ధరంగంగా నిలబడుతున్నది ఇక్కడి ఆలోచనాపరులే! సీమాంవూధలో రెండవ యుద్ధరంగం నిర్మాణమే జరగలేదు; లేదా, జరగనివ్వలేదు. సరిగ్గా ఈ అంశమే ప్రస్తుతం ఇరువైపులా సాగుతున్న ఉద్యమాల్లో గెలుపు ఓటముల్ని నిర్ణయిస్తుంది.

తెలంగాణ వెనుకబాటుతనం గురించీ, ఆర్థిక రంగంలో సాగుతున్న విధ్వంసం గురించీ, బలహీన వర్గాలు ఎదుర్కొంటున్న అణిచివేత గురించీ ప్రపంచానికి తెలిసినట్టుగా, సీమాంధ్ర గురిం చి తెలీదు. మద్రాసు, కలకత్తా మహానగరాలను కలుపుతూ బ్రిటీ ష్ వలస పాలకులు నిర్మించిన గ్రాండ్ ట్రంక్ రోడ్డు, రైలుమార్గం ఆంధ్రా తీరవూపాంతాన్ని, భౌగోళికంగానే కాకుండా, వర్గ ప్రాతిపదికపైనా చీల్చివేసింది. గ్రాండ్ ట్రంక్ రోడ్డుకు తూర్పు దిక్కున ఉన్నది ససశ్యామల ప్రాంతంకాగా, పశ్చిమ దిక్కున వున్నది అడవి లేదా దాదాపు ఎడారి ప్రాంతం. తెలంగాణ నాయకులు తరచుగా విరుచుకుపడే కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లోని పశ్చిమ ప్రాంతాల్లో కరువు స్థిర నివాసం ఏర్పరచుకుందని బయటి ప్రపంచానికి తెలీదు. తీరాంవూధలోని తూర్పు ప్రాంత పు ఖ్యాతి లేదా అపఖ్యాతుల హోరులో పశ్చిమ ప్రాంత పు ఆక్రందనలు బయటికి వినిపించలేదు. ఆ ప్రాంతపు పీడితుల దృష్టిని మళ్లించేందుకే భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి అక్కడి పాలకవర్గాలు.

తెలంగాణపైనా సందిగ్ధాన్ని రెండు పరిణామాలు తొలగించా యి. మొదటిది, సీమాంవూధలో మొదలయిన సమైక్యాంధ్ర ఉద్య మం.ండోది, తెలంగాణ ప్రాంతంలో సాగిన సకల జనుల సమ్మె. ఒక భయంకరమైన జబ్బుకు తప్పుడు మందు సమైక్యాం ధ్ర ఉద్యమం అని నా అభివూపాయం. మరోవైపు, నేను సకల జను ల సమ్మెకు మద్దతు పలికాను. తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఆహ్వానం మేరకు ఒకరోజు అందులో పాల్గొన్నాను. నా ఆత్మీయుల ఆనందంలో పాలుపంచుకోవాలనే వుద్దేశ్యంతోనే, జూలై 31 ఉదయం గన్‌పార్క్ స్తూపం దగ్గరికి వెళ్ళాను, ఆ తరువాత ఇక జరుగుతున్నది వర్తమానమే!
అల్లం నారాయణ తన సీమాంధ్ర ఆత్మీయులు చాలామందిని తలచుకున్నాడు. నా తెలంగాణ అత్మీయుల జాబితా వరవరరావు నుంచి, నాలుగేళ్ళ క్రితం చనిపోయిన కే నరసింహాచారి వరకు చాలా చాలా పెద్దది. ఆ జాబితాను ఇప్పుడు ఇవ్వలేను, పొరపాటున కొందరి పేర్లను మరిచిపోతానేమోననే వినయం వల్ల.
వర్తమాన తెలంగాణ పరిణామాలు నాకు సంతృప్తికరంగానూ లేవు అలాగని అసంతృప్తికరంగానూ లేవు. నేను రావాలనుకున్నవాళ్ల ద్వారా తెలంగాణ రాలేదు. అదో అసంతృప్తి. నేను రాకూడదనుకున్న వాళ్ల ద్వారా కూడా తెలంగాణ రాలేదు. అదో సంతృప్తి. 
-డానీ


Published : Namaste Telangana Daily 
8 August 2013

No comments:

Post a Comment