కటాఫ్ తేదీ నవంబరు 1, 1956
భద్రాద్రి పట్టని సీమాంధ్ర నేతలు
ఏయం ఖాన్ యజ్దానీ (డానీ)
అస్థిత్వాలకు
చంచల (volatile) స్వభావం
వుంటుంది. స్థల కాలాలనుబట్టి వాటి ప్రవర్తన మారుతూ వుంటుంది. కొన్ని
స్థలకాలాల్లో కొన్ని అస్థిత్వాలు
మేల్కొంటే, మరికొన్ని మగతలో వుంటాయి. అస్థిత్వాన్ని బల్బు ఫిలమెంటుతో పోల్చవచ్చు.
విద్యుత్ సరఫరా వున్నప్పుడు బల్బు వెలుగుతుంది, లేనపుడు ఆరిపోతుంది. అలాగే, బహుళ
అస్థిత్వాల్ని బల్బుల తోరణంతో పోల్చవచ్చు. ఒక వరుస వెలుగుతుంటే, ఇంకో వరస
ఆరిపోతుంటాయి. ఒక స్థల కాలంలో క్రియాశీలంగావున్న అస్తిత్వాలు, ఆ స్థలకాలాలు
మారగానే మగతలోనికి జారిపోతాయి. అప్పుడు కొత్త అస్థిత్వాలు మేల్కొంటాయి.
ప్రస్తుతం
కొనసాగుతున్న ఆంధ్రప్రదేశ్ విభజన వివాదంలో స్థలం తెలంగాణ జిల్లాలు. కాలం 1 నవంబరు 1956. దానికి ఒక్కరోజు వెనక్కి వెళ్ళినా, ఒక్క రోజు ముందుకు వచ్చినా ఈ వివాదం
అస్థిత్వాన్నే కోల్పోతుంది. ఒక్కరోజు వెనక్కి వెళితే, అది మరో నాలుగు మరాఠ జిల్లాలు, ఇంకో నాలుగు కన్నడ జిల్లాలు కలిసిన
హైదారబాద్ స్టేట్ అవుతుంది. అయితే, ఇప్పుడు కొనసాగుతున్న ఉద్యమం హైదరాబాద్ స్టేట్
పునరుధ్ధరణ కోసం కాదని గుర్తుపెట్టుకోవాలి. కన్నడ, మరాఠా జిల్లాలు కలిసిన అఖండ
తెలంగాణ కావాలని కూడా కొందరు ఔత్సాహికులు తొలి దశలో అన్నారుగానీ దానికి విద్యుత్
సరఫర అందలేదు. అంటే, స్థల, కాలాలు కలిసిరాలేదు. అలాగే, ఒక్కరోజు ముందుకు జరిగినా ఈ
వాదం అస్థిత్వాన్ని కోల్పోతుంది. ఎందుకంటే అప్పటికి, తీరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలతో
కూడిన అంధ్రప్రదేశ్ అస్థిత్వంలోనికి వచ్చేసింది. అదే ఇప్పుడు సమైక్యాంధ్ర
అస్థిత్వానికి ఆధారంగా మారింది. అంచేత,
మనం అస్థిత్వాల గురించి ప్రస్తావించే సందర్భాల్లో, తప్పని సరిగా స్థల, కాలాల్ని
కఛ్ఛితంగా నిర్ధారించుకోవాలి.
సందర్భం
వచ్చిందిగాబట్టి ఒక చారిత్రక వాస్తవాన్ని చెప్పాలి. తెలంగాణ, ఆంధ్రా రాష్ట్రాల్ని
అప్పుడు కలిపినదాన్నే ఇప్పుడు విడగొడుతున్నామని కేసిఆర్ తరచుగా అంటున్నారు. ఇది
పాక్షిక సత్యం మాత్రమే, తెలంగాణతో కలిసేనాటికి ఆంధ్రాప్రాంతం ప్రత్యేక రాష్ట్రంగా
అస్థిత్వంలోవుంది. కానీ, తెలంగాణ ప్రాంతం అప్పుడేకాదు, అంతకు ముందు కూడా ఎన్నడూ
విడిగా ఒక రాష్ట్రంగా లేదు.
రాష్ట్ర
విభజన జరిగినా, భద్రాచలం రెవెన్యూ డివిజన్ ను తెలంగాణలోనే కొనసాగించాలంటూ ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి
రామిరెడ్డి వెంకట రెడ్డి ప్రయత్నాలు మొదలెట్టారు. అప్పటి వరకు, తూర్పు
గోదావరిజిల్లాలో అంతర్భాగంగావున్న
భద్రాచలం రెవెన్యూ డివిజన్ ను, పరిపాలనా సౌకర్యం కోసం 1959
నవంబరులో ఖమ్మం జిల్లాలో కలిపారు. ఇప్పటి విభజనకు
ఆంధ్రప్రదేశ్ అవతరణను ప్రాతిపదికగా తీసుకుంటే,
నాటి భద్రాచలం, మణుగూరు, వెంకటపురం తాలుకాలతో కూడిన భద్రాచలం రెవెన్యూ
డివిజన్ ను తిరిగి సీమాంధ్ర ప్రాంతంలో కలపాలి.
భద్రాచలంను
తెలంగాణలోనే కొనసాగించాలనేవాళ్ళు ఒక కొత్త వాదనను ముందుకు తెస్తున్నారు.
భద్రాచలాన్ని బ్రిటీష్ పాలకులకు ఇచ్చింది తమ నిజాం నవాబే కనుక దాని మీద హక్కు తమదే
అనేది ఈ వాదన సారాంశం. ఈ వాదన చాలా ఆసక్తికరమైనది. ఎందుకంటే, నిజాం నవాబులు ఒక్క
భద్రాచలాన్నేకాడు; ఇప్పుడున్న రాయలసీమ,
తీరాంధ్ర ప్రాంతాల్నీ కూడా బ్రిటీష్ వాళ్ళకు ఇచ్చాడు. అది అక్కడితో ఆగలేదు, ఇంకా
వివరాల్లోకి వెళితే, ఇప్పటి ఒడీషాలోని గంజాం, గజపతి జిల్లాలు, కర్ణాటకలోని
బళ్ళారి, దావణ్ గిరే జిల్లాల్ని కూడా
అలాగే ఇచ్చాడు.
చరిత్ర
గురించి అంతగా తెలియనివాళ్ళు కొందరు, నిజాం నవాబులు ఆ ప్రాంతాల్ని దానంగా ఇచ్చారనే
అభిప్రాయంతో వుండవచ్చు. అలా జరగలేదు. మరాఠ్వాడాలు, టిప్పూసుల్తాన్ చెరోవైపు నుండి
చేస్తున్న దాడుల నుండి కాపాడినందుకు యుధ్ధకప్పంగా 1796లో రెండవ నిజాం ఆసఫ్ ఝా నేటి రాయలసీమ ప్రాంతాన్ని బ్రిటీష్ ఈస్ట్ ఇండియా
కంపెనీకి దత్తత చేశాడు. ఇప్పటికీ ఆ ప్రాంతాన్ని దత్తమండలం (సీడెడ్) అనే
పిలుస్తారు. సైనిక నిర్మాణంలో సాంకేతిక సహకారం, శిక్షణ అందించినందుకు ఇప్పటి
సర్కారు జిల్లాల్లో సగభాగాన్ని రాసిచ్చిన నిజాం నవాబ్, 1823లో మిగిలిన సగాన్ని కూడా వెలకట్టి బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి నేరుగా
అమ్మేశాడు.
అవన్నీ
కలుపుకుంటే ఇప్పటి అంధ్రప్రదేశ్ కన్నా రెండింతలు పెద్ద రాష్ట్రమే అవుతుంది. పైగా,
రెండు వందల యేళ్లనాటి నిజాం సంస్థానంలోని ప్రజల సంతతి అందరూ మళ్ళీ కలిసి జీవించినట్టుగా
వుంటుంది. ఒక్క తెలంగాణ అనేముందీ, మొత్తం నిజాం సంస్థానాన్నే పునరుధ్ధరించవచ్చు.
అలా కలుపుకోవడానికి తెలంగాణ రాష్ట్రవాదులు సిధ్ధమేనా? కాదు. ఆ అస్థిత్వానికి
ఇప్పుడు విద్యుత్ సరఫరా లేదు!
పెద్దమనుషుల
ఆధ్వర్యాన గ్రామసభలు నిర్వహించి, అక్కడి ప్రజల కోరిక మేరకు భద్రాచలం వివాదాన్ని
పరిష్కరించవచ్చని కొందరు తెలంగాణ ఆలోచనాపరులు సూచిస్తున్నారు. ఇది కూడా
ఆహ్వానించదగ్గ ప్రక్రియే. ఈ ప్రక్రియను భద్రాచలం ప్రాంతానికే ఎందుకు పరిమితం
చేయాలీ?. హైదరాబాద్ తో సహా, మొత్తం అంధ్రప్రదేశ్ కు వర్తించవచ్చు. ఏ కొలమానమైనా సార్వజనీనమై
వుండాలి. సార్వజనీనం కానిది కొలమానంకాజాలదు.
తెలంగాణవాదులు
రెండు వందల సంవత్సరాలు వెనక్కి వెళ్ళడానికి సిధ్ధంగాలేరు. వాళ్ళు యాభై ఏడేళ్ళు
మాత్రమే వెనక్కి వెళ్లదలిచారు. అంచేత, తెలంగాణ అస్థిత్వానికి స్థలం తెలంగాణ
జిల్లాలు. కాలం కఛ్ఛితంగా, 1 నవంబరు 1956.
మరోవైపు,
రాయలాంధ్ర ఉద్యమంపై మళ్ళీ డేగలు వచ్చి వాలాయి. మొదటి రెండు రోజులు కలుగుల్లో
దాక్కున్న పార్లమెంటరీ పార్టీల నేతలు
మళ్ళీ ఉద్యమాన్ని హైజాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్క సిపిఐయం తప్ప
మిగిలిన అన్ని పార్టీలు తెలంగాణ ఏర్పాటుకు సానుకూలంగా కేంద్ర ప్రభుత్వానికి లేఖలు
ఇచ్చినవే. ఈ పార్టీల నాయకులంతా తెలంగాణ ఇమ్మని ఊరుకున్నారేతప్ప, కొత్త
రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేటప్పుడు పాటించాల్సిన విధివిధానాల గురించి ఒక్కరంటే
ఒక్కరూ మాట్లాడలేదని మనం గుర్తుపెట్టుకోవాలి.
కాంగ్రెస్
పార్టి సీమాంధ్ర నాయకులైతే మరీ బరితెగించి కపట నాటకం ఆడారు. "మీ నిర్ణయమే
మాకు శిరోధార్యం" అని ఢిల్లీలో పార్టి అధినేత్రి సోనియా గాంధీకి సర్వ హక్కులు
ఇచ్చేసి వచ్చింది వీళ్ళే. ఇక్కడికొచ్చి, "మా క్రికెట్టు జట్టులో గండరగండ
బ్యాట్స్ మెన్ చాలామంది వున్నార"ని ప్రగల్భాలు పలికిందీ వీళ్ళే. ఢిల్లీలో
ఉత్తరకుమారులు, సీమాంధ్రలో పాండవుల్లా
పోజులిచ్చారు. నిలదీయండి వీళ్లని. ఆ స్టార్ బ్యాట్స్ మెన్ ఏమయ్యారూ? అసలు బ్యాట్
పట్టుకున్నారా? లేదా? క్రీజ్ లోకి దిగారా? లేదా? బుకీల డమ్ములు మింగి స్పాట్
ఫిక్సింగుకు పాల్పడ్డారా? అని నడిరోడ్డు మీద నిలబెట్టి అడగండి.
తెలంగాణలో
ఉద్యమం మొదలయినపుడే సీమాంధ్రులు కళ్ళు తెరిచి వుండాల్సింది. రాష్ట్రాన్ని
సమైక్యంగా వుంచాలనుకుంటే తెలంగాణ వాళ్లతో ఎలాంటి సంబంధాలను కొనసాగించాలి? రాష్ట్రం
విడిపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎలా చేసుకోవాలి? మొదలయిన అంశాలను విస్తృతంగా
చర్చించి ఈపాటికే ఒక నిర్ణయానికి రావల్సివుండింది. న్యాయంగా అయితే, 2004 లోనే దీని మీద చర్చ మొదలవ్వాలి. 2009 తరువాత కూడా చర్చ మొదలు కాలేదంటే, అ
నిర్లక్ష్యానికి భారీగానే మూల్యం చెల్లించాల్సి వుంటుంది.
ఇన్నాళ్ల
సీమాంధ్ర వెనుకబాటుతనానికి కారణమైనవాళ్ళకే మళ్ళీ నాయకత్వాన్ని అప్పచెప్పడం చారిత్రక
నేరం. కొత్త నాయకుల్ని వెతకండి. ఈ దశలో తక్షణం మహత్తర విజయాలు సాధ్యం కాకపోవచ్చు.
కానీ, జరగబోయే నష్టాన్ని చాలా వరకు తగ్గించవచ్చు.
(రచయిత ఆంధ్రా జర్నలిస్టుల ఫోరం కన్వీనర్)
హైదరాబాద్
4
ఆగస్టు 2013
ప్రచురణ : సూర్య దినపత్రిక, 6 ఆగస్టు
2013
No comments:
Post a Comment