Saturday, 3 August 2013

Danny Notes 2013 June

Danny Notes
2013 July, 4
ప్రజాస్వామ్యం హత్య

జులై 4, చరిత్రలో మహత్తరమైన రోజు
1776 అమేరిక స్వాతంత్ర దినోత్సవం.
1897 విప్లవజ్యోతి అల్లూరి శ్రీరామరాజు పుట్టిన రోజు.
1946 తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రారంభం.
1970 విప్లవ రచయితల సంఘం ఆవిర్భావం.
2013 ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యన్ని హత్య చేసిన రోజు

నక్సలైట్లు ఆయుధాల్నీ, అడవినీ వదిలి ’ప్రధాన స్రవంతి’లో కలిస్తే  గొప్ప ఫలితాలు సాధించవచ్చని చాలా మంది మేధావులు అంటుంటారు. ఇందులో నాకు రెండు విషయాలు అర్ధం కావు. ప్రధాన స్రవంతి అంటే ఏమిటీ? గొప్ప ఫలితాలంటే ఏమిటీ? అని. ఈ మేధావుల మాటలు నమ్మి గంటి ప్రసాద్ ప్రధాన స్రవంతి లోనికి వచ్చాడు. ఏమయిందీ?

ప్రధాన స్రవంతి అంటే దొంగ నోట్ల, దొంగ ఓట్ల రాజ్యం.
గంటి ప్రసాద్ హంతకుల్ని ప్రభుత్వం అరెస్టు చేయలేదు. అతని మీద డాడి అన్యాయం అని చెప్పడానికి  వెళ్ళిన వరవర రావు తదితరుల్ని అరెస్టు చేసింది.
ప్రియమైన నా దేశ మేధావులారా! ఇప్పుడయినా కాస్త నోరు తెరవండి.

Danny Notes
2013 July, 4

నియంతల చావు

నియంతల చావు రెండు రకాలు. మొదటిది, ముస్సోలిన్ చావు. రెండోది, హిట్లర్ చావు.

ముస్సోలిన్ ను అతని ప్రేయసీతో సహా  ఇటలీ ప్రజలే పట్టుకుని, తుపాకితో కాల్చి చంపి, శవాల తోలు ఊడదీసి. మాంసం దుకాణంలో గొర్రెలు మేకల్ని వేలాడ దీసినట్టు కొక్కేలకి వేలాడ దీశారు.

ముస్సోలిన్ లాంటి కొక్కెపు చావు తనకు రాకూడదని హిట్లర్ భయపడ్డాడు. హిట్లర్ ప్రేయసి సైనేడ్ తాగి చనిపోయింది. హిట్లర్ తన రివాల్వర్ తోనే తన కణితిలో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ముస్సోలిన్ చావా? హిట్లర్ చావా? ఛాయిస్ నియంతలదే. రెండింటిలో వాళ్ళు దేన్నయినా ఎంచుకోవచ్చు.

 Danny Notes
2013 July, 5
అజ్ఞాత సూర్యుడు, గంటి ప్రసాదం

       అమరవీరుల బంధుమిత్రుల సంఘం గౌరవ అధ్యక్షుడు గంటి ప్రసాదం. అంటే ప్రభుత్వం సాంప్రదాయ వ్యతిరేకంగా చంపేసిన ఉద్యమకారుల శవాలకు సాంప్రదాయబధ్ధంగా అంత్యక్రియలు జరిపించడం ఆయన పని. ఇందులో ఎవరికీ అసంబధ్ధమైనదికానీ, అభ్యంతరకరమైనదికానీ ఏమీలేదు. కానీ, శవాలను చూసి భయపడే ప్రభువులూ వుంటారు. వాళ్లకు గంటి ప్రసాదం అంటే ’శవ’ స్వప్నమే! కిరాయి హంతకులను పెట్టి  ఆయన్ని చంపేస్తేగానీ ప్రభువులకు నిద్రపట్టలేదు!

కవి అజ్ఞాత సూర్యూడితో నాదీ కేవలం లవ్ స్టోరీ. నెమలూరి భాస్కరరావుదీ నాదీ  ’లవ్ అండ్ హేట్’ అనుబంధం. సృజన, అక్టోబరు  1979  సంచికలో ’రెడ్ శాల్యూట్ డియర్ ఛైర్మన్’ కవిత చదివి మేమంతా అజ్ఞాత సూర్యూడుకి అభిమానులమైపోయాం. "విలాసవంతమైన విప్లవకర జీవితంలో/ తరచుగా దొరకనిది అన్నం మాత్రమే!" " చిత్రహింసల అత్యున్నత రూపాన్ని అధిగమిస్తారు వాళ్ళు / ఫార్మూలా కరేక్టే అయినా ఫలితం రాదు వాళ్లకు" అనే కవితా పంక్తులు మాకు చాలా ఉత్తేజాన్ని ఇచ్చేవి.

నెమలూరి భాస్కర రావు  1980 / 81 లలో పీపుల్స్ వార్ లో చేరారు. ఆయన ఆధ్వర్యంలోనే పశ్చిమగోదావరి జిల్లాలో పేదవేగి కృష్ణా జిల్లాలో ఐలూరు, గురివిందపల్లి లంక భూముల పోరాటాలు  జరిగాయి.

Danny Notes

 Danny Notes
2013 July, 6
అజ్ఞాత సూర్యుడు, గంటి ప్రసాదం 2

       ఏలూరులో రాడికల్ యువజన సంఘం మహాసభలు, నెల్లూరుల్లో రైతు-కూలీ సంఘం  మహాసభలు, రాజమండ్రిలో గిరిజన  మహాసభలు మల్లిక్ అనే నెమలూరి భాస్కరరావు ఆధ్వర్యంలోనే  జరిగాయి. కారంచేడు ఉద్యమం సాగుతున్న రోజుల్లో, పీపుల్స్ వార్ రీజినల్ కమిటీకి అతనే  కార్యదర్శిగా వున్నాడు. 
కోస్తాజిల్లాలు విప్లవోత్తేజంతో రగిలిపోయిన కాలం అది. అయితే, ఆ ఉద్యమాలు దెబ్బతినడానికి ఆయన దుందుడుకు ప్రవర్తన కూడా ఒక కారణం. ఆ రోజుల్లో, అయన నన్ను చాలా డిస్టర్బ్ చేశాడు.  1986 తరువాత మల్లిక్ వ్యవహార శైలిని గట్టిగా  వ్యతిరేకించినవాళ్ళలో నేనూ ఒకడ్ని. మిగతా వివరాలు ఇప్పుడు చెప్పడం సరికాదు. అవన్నీ ప్రాసంగికతను కోల్పోయాయి.

       ఉద్యమ జీవితాన్ని వదిలిన తరువాత ఆయన చాలా విషయాల్లో పశ్చాత్తాపపడ్డాడు. వాటిల్లో, నాతో ప్రవర్తించిన తీరు కూడా ఒకటి. ఒకసారి మాట్లాడాలనుందని ఒక మిత్రుని ద్వార కబురు పంపించారు. అప్పటికే నా ప్రాధాన్యతలు మారిపోయాయి. నేను వెళ్ళదలచలేదు. ఆయన చనిపొయేనాటికి  కూడా నా కోపం చల్లారలేదు. ఆ తరువాత ఆ ఖాతా సహజంగానే ముగిసింది. 

       ఇటీవలి కాలంలో మల్లిక్ గురించి ఆలోచిస్తే, చెడు సంఘటనలన్నీ చెరిగిపోయి, మంచి సంఘటనలే  గుర్తుకువస్తున్నాయి. అతని మీద జాలి కూడా కలుగుతోంది. అతను మొండివాడేతప్పా, స్వార్ధపరుడుకాదు. ఉద్యమం నుండి బయటికి వచ్చినా ఎన్నడూ వుద్యమాన్ని తిట్టిపోయలేదు. పాత సాయుధ స్నేహితుల్ని పట్టించలేదు. తనకున్న ఇమేజ్ ని డబ్బుగా మార్చుకునే ప్రయత్నం చేయలేదు. ఒకవిధంగా తననుతాను హింసించుకుంటూ, శిక్షించుకుంటూ బతికాడు.

       అంతటి ఉత్తేజకర విప్లవ సమాజాన్ని ఆస్వాదించినవాడు, పెళ్ళాం, పిల్లలు, పొట్టకూటి వంటి అల్ప విషయాల కోసం బతకాల్సిరావడం మహావిషాదం. అనామిక్ ఆత్మహత్యలకు పురికొల్పే వాతావరణం ఇదే. *  ఇలాంటి  విషాదాన్ని తట్టుకోలేకే జంగల్ సంతాల్ మత్తులో మునిగిపోయాడు. అజ్ఞాతసూర్యుడు స్పృహలో వున్నాడు. ఉద్యమానంతర జీవిత విషాదాన్ని సాహితీకరించిన వాళ్ళలో,  నాకు తెలిసి, తెలుగులో అతనే తొలి కవి / రచయిత. 
*  Anomic suicide: People do not know where they fit in within their societies. 

Danny Notes
7 June 2013

బుర్ఖ - హిజబ్ - బుర్ఖాబ్
       పశ్చిమగోదావరిజిల్లా నరసాపురంలో మాది సాంప్రదాయ ముస్లిం కుటుంబం. మా ఇళ్ళల్లో మగవాళ్లకు గడ్దం. ఆడవాళ్లకు బుర్ఖా సాంప్రదాయం లేదు. అయితే, కొందరు వృధ్ధులు  గడ్దం వుంచేవారు. పెళ్ళీడు వచ్చిన అమ్మాయిలు బయటికి వచ్చినపుడు హిజబ్ వేసుకునేవారు, ఆడవాళ్ళు పర్దా వాడేవారు. రిక్షాల్లో, ఒంటెద్దు బండ్లల్లో ప్రయాణించేటప్పుడు పరదా కట్టేవాళ్ళు, ముస్లిం మహిళల కోసం అప్పట్లో బస్సుల్లోనూ కొన్ని సీట్లకు అడ్డంగా  పరదా కట్టే సాంప్రదాయం వుండేది. సినిమా హాళ్లలోనూ ముస్లిం మహిళల కోసం కొన్ని బెంచీలు వదిలి పరదా కట్టేవాళ్ళు. కొద్దిపాటి మార్పులతో మొగల్తూరు రాజావారి కుటుంబ మహిళలు కూడా పరదా సాంప్రాదాయాన్ని పాటించేవాళ్ళు. మావూరి జమిందారులుగా భావించే ఓసూరి గంగాధరం కుటుంబ మహిళలు కూడా ఓకరకం పరదా పాటించేవాళ్ళు. నాకు ఇరవైయేళ్ల వయస్సు వచ్చేవరకు బుర్ఖాను అసలు చూడలేదంటే అతిశయోక్తికాదు.

       విజయవాడలో కూడా ముస్లీమ్ మహిళలు హిజబ్ వేస్తారు. అక్కాడా బుర్ఖా విరివిగా వాడకంలోలేదు. హైదరాబాద్ పరిస్థితి వేరు. స్థానిక ముస్లిం మహిళలు బిచ్చగాళ్ల  నుండి, ధనవంతుల వరకు అందరూ బుర్ఖా వేస్తారు. 
       హైదరాబాద్ లో మరో విశేషం కూడా వుంది. ఇటీవలి కాలంలో ముస్లిమేతర మహిళలు కూడా ముఖం కప్పుకుంటున్నారు. వీళ్ళు వాడుతున్న వస్త్రాలు హిజబ్ కన్నా పెద్దవి, బుర్ఖాకన్నా చిన్నవి. వీటితో బుర్ఖాలాగ ముఖం కప్పుకుంటారు; హిజబ్ లాగ భుజాల వరకే కప్పుకుంటారు. వీటిని ’బుర్ఖాబ్’ అనవచ్చేమో. బుర్ఖా, హిజబ్ లకు సాంస్కృతిక సాంప్రదాయం వుంది. ’బుర్ఖాబ్’లు అలా కాదు ఆధునిక మహిళలు అవసరంగా అలవాటు చేసుకుంటున్నవి. ఇవి, ఒంటికి సన్ స్క్రీన్ లా పనికొస్తాయనీ, తల చెరిగిపోకుండా వుంటుందనీ, పోకిరీల నుండి రక్షణ కూడా ఇస్తాయని ’బుర్ఖాబ్’ మహిళలు అంటున్నారు. ఇప్పుడు ’బుర్ఖాబ్’ల సంస్కృతి నగరాల నుండి పట్టణాలకు కూడా విస్తరిస్తోంది.

Danny Notes
7 June 2013

డ్రెస్ కోడ్ - ముస్లింలు

       ముస్లిం సమాజం మహిళలపై డ్రెస్ కోడ్ విధిస్తుంది అనేది నిజమేకానీ, అది అర్ధసత్యం మాత్రమే. ముస్లిం సమాజం పురుషులకు కూడా డ్రెస్ కోడ్ విధిస్తుంది.

8 June 2013
ఈ భూమ్మీద  కార్మికులు వున్నంత వరకు కమ్యూనిజం వుంటుంది; అప్పుడప్పుడు వుధృతంగా, మిగిలిన వేళల్లో ప్రశాంతంగా

 Danny Notes
10 July 2013
విభిన్న అస్థిత్వాలు - 2

       తెలంగాణతో నా అనుబంధం చాలా సుదీర్ఘమైనది. ముఫ్ఫయి ఐదేళ్ల క్రితం నేను సభ్యుడ్ని అయ్యే నాటికే, పీపుల్స్ వార్, విరసం రెండూ తెలంగాణాను సమర్ధిస్తున్నాయి. నేను అందుకు భిన్నంగా వుండలేను. 1997లో వచ్చిన  "వరంగల్ డిక్లరేషన్" సభకు నేను ఆహ్వాసంఘం సభ్యుడ్ని. కాళోజీ నారాయణరావు ఆధ్వర్యాన జరిగిన ఆ సభలోనే ఉద్యమ కన్వీనర్ గా ప్రొఫెసర్ జయశంకర్ ను ఎన్నుకున్నారు.                    

       అప్పట్లో, టీడీపీలో రవాణాశాఖమంత్రిగా వుంటూ, పార్టీ అధినేత చంద్రబాబునాయుడితో కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్న కల్వకుంట చంద్రశేఖరరావు ప్రత్యామ్నాయాలను వెతుకుక్కునే పనిలో ఉన్నారు. తెలంగాణ వెనకబాటు మీద పరిశోధనలు చేసిపెట్టేపనిని నాకు అత్యంత సన్నిహితులైన ఇద్దరు పాత్రికేయ మిత్రులకు అప్పచెప్పారు. అలా ఏర్పడిన సెంటర్ ఫర్ సబ్ ఆల్ట్రన్ స్టడీస్ (సియస్ యస్) నిర్వాహక బృందంలో నేను సభ్యుడ్ని. సియస్ యస్ ప్రచురించిన ’అండర్ కరెంట్’ ఆంగ్ల పత్రిక్కి నేను తోలి సంపాదకుడ్ని. అయితే ఆ సంస్థ ఎక్కువ కాలం సాగలేదు. ఆ తరువాత కెసిఆర్, టీడీపి నుండి బయటికి వచ్చి   తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టారు.

Danny Notes
9 July 2013

బాలమురళీకృష్ణ (పిటీఐ)

       జర్నలిస్టు మిత్రుడు బాలమురళీకృష్ణ (పిటీఐ) చనిపోయినట్టు ఆలస్యంగా తెలిసింది.

       నాటి విజయవాడ పాత్రికేయుల్లో ఎక్కువగా చదువుకున్న కొద్దిమందిలో బాలమురళీ ఒకడు. సీనియర్ అయినా, పత్రికా విలేకరుల సమావేశాల్లో చాలా చలాకీగా వుండేవాడు.  కొంతకాలంగా అనారోగ్యంతో హైదరాబాద్ లో వున్నాడు. ఏడాది క్రితం ఒకసారి ఫేస్ బుక్ ఛాట్ లో కూడా వచ్చాడు.

       బాలమురళి కుటుంబ సభ్యులకు హృదయపూర్వక సానుభూతి. బాలమురళి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడ్ని ప్రార్ధిస్తున్నాను.

 Danny Notes
10 July 2013

Response on Ajay Mareedu's Comment today on my post

మీ కామెంట్  మీద నేను స్పందించడం లేదు.  Feather weights తో heavy weights  తలపడడం క్రీడాధర్మమూకాదు, క్షాత్రధర్మమూకాదు. మరో విషయం; మీకు భాషా సంస్కార లోపం చాలా తీవ్రంగా  వున్నట్టుంది. నాకో బలహీనత వున్నది. మెదడులేనివాళ్లతో నేను వ్యవహరించలేను. నేను సమాజశాస్త్రాన్ని చదివానుగానీ, మానసికరోగుల వైద్యశాస్త్రం చదవలేదు.  మీకు మెదడు వున్నదని మీకు విశ్వాసం కలిగినపుడు నాతో ఎప్పుడయినా తలపడవచ్చు. ఇది సవాలు కాదు; విన్నపం.



 Danny Notes
10 July 2013

విభిన్న అస్థిత్వాలు -  1

            తెలంగాణ వస్తున్నదని నేను పెట్టిన పోస్ట్ మీద మిశ్రమ స్పందన వచ్చింది. ఈ సందర్భంగా కొన్ని భావోద్వేగాలను మిత్రులతో  పంచుకోవాల్సివున్నది. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మావూరు. నేను పుట్టినపుడు అది ఉమ్మడి (అవిభక్త) మద్రాసు రాష్ట్రం. నేను అక్షరాలు దిద్దుతున్నప్పుడు అది ఆంధ్రరాష్ట్రం. స్కూల్లో చేరినపుడు అది ఆంధ్రప్రదేశ్. ఇన్ని రకాలుగా మారిన రాష్ట్రం ఇంకొన్ని రకాలుగా మరుతుంది అనుకోవడం విజ్ఞత.

       అలాగే, నాకు విభిన్న స్థిత్వాలున్నాయి. ఆ జాబితా ఎంత చెప్పినా ఇంకా తక్కువగానే వుంటుంది. ఎప్పటికి ఏ అస్థిత్వం బలంగా ముందుకు వస్తుందో దాని ఆదేశానుసారం ప్రవర్తించడమే నా పని. నా అస్థిత్వంలో నరసాపురం మాత్రమేలేదు విజయవాడ, చీరాల, హైదరాబాద్ కూడా వున్నాయి. నా తాత్విక ఆలోచనల్లో ఇస్లాం మాత్రమే లేదు; కమ్యూనిజం కూడా వుంది.

       విశాఖ ఉక్కు ఉద్యమంలో, జై‌ఆంధ్రా ఉద్యమంలో నేను చురుగ్గా పాల్గొన్నాను. అప్పట్లో ఏర్పడిన ఆంధ్రా నిరుద్యోగుల సంఘానికి అమ్మనమంచి కృష్ణశాస్త్రి అధ్యక్షుడు, నేను కార్యదర్శి. విజయవాడ వచ్చాక దేశంలో ఎక్కడ ఏ ఉద్యమం జరిగినా వెళ్ళి బాధితులకు సంఘీభావాన్ని ప్రకటించడం నా అలవాటుగా మార్చుకున్నాను.  భోపాల్  గ్యాస్ విషాదం జరిగినపుడు అక్కడికివెళ్ళి అనిల్ సద్గోపాల్ ను కలిసి వచ్చాను. ఝార్ఖండ్ ఉద్యమం జరిగినపుడు శిబు సోరేన్ ను కలిసి వచ్చాను. బలియాపాల్ లో ఉద్యమం జరిగినప్పుడు బృందాబన్ రాజ్ ను కలిసి వచ్చాను. గోర్ఖాల ఉద్యమం సాగినపుడు ఘీసింగ్ కు సంఘీభావం ప్రకటించాను.  ఐదేళ్ల క్రితం  నందిగ్రామ్ కూడా వెళ్ళొచ్చాను. దళితోద్యమం రెండవ దశలో  మాదిగవర్గానికి మద్దతు ఇచ్చాను. కారంచేడు దురంతం జరిగినపుడూ బాధితులకు సంఘీభావాన్ని చెప్పడానికి వెళ్ళి ఆ ఉద్యమంలో అంతర్భాగమైపోయాను. ఒక దశలో దానికి నాయకత్వం కూడా వహించాను. చినగంజాం ఉప్పు ఫ్యాక్టరీ వ్యతిరేక పొరాటానికి కూడా నాయకత్వం వహించాల్సివచ్చింది.


Danny Notes
10 June 2013

రంజాన్ ఉపవాసాలు

సరొజినీ దేవీ బులుసుగారూ!
నెలపొడుపు కనిపించకుండా ఏ దేశంలోనూ ఉపవాసాలు మొదలుకావు. నిన్నటి సూర్యాస్తమయం వరకు భారతదేశంలో నెలపొడుపు కనిపించలేదు. మనకన్నా రెండుగంటలు ఆలస్యంగా సూర్యాస్తమయం జరుగుతుంది కనుక నిన్న సాయంత్రం అరబ్ దేశాల్లో నెలపొడుపు కనిపించి వుంటుంది. అందువల్ల, అరబ్ దేశాల్లో నిన్న సాయంత్రం నుండే రంజాన్ ఉపవాసాలు మొదలైపోయివుంటాయి. మనకు ఈ రోజు నెలవంక కనిపిస్తుందని ఆశిద్దాం.

       మీరు ఈరోజు ఈద్ ముబారక్ చెప్పడంలో తప్పేమీలేదు. పైగా, ప్రశంసించాల్సిన అంశం. ఇండియాలో రేపటి నుండి మొదలవుతాయని గుర్తుచేయడమే నా ఉద్దేశ్యం.

       ఇస్లాం గురించి తెలుసుకోవాలనుందని మీరు రాశారు. ఎఫ్ బీ లో ఒక పోస్ట్ కూడా పెడితే బాగుంటుందని సూచించారు. మీ సూచన బాగుంది. నాకున్న అనేక అస్థిత్వాల్లో ఇస్లాం కూడా ఒకటి. నేను ఏడాదిలో ఒక నెల ముస్లింగా వుంటాను. ఐదు పూటలా నమాజ్ చేస్తాను, నెలంతా వుపవాసం వుంటాను, ఫిత్ర చెల్లిస్తాను. ఇరవై ఏడవ రోజు మా నాన్న సమాధి దగ్గరకు వెళతాను. జకాత్ ఇచ్చేంత  ఆర్ధిక స్థోమత లేదుగానీ నిరుపేదలైన మా బంధువులు, పనివాళ్ల ఇళ్ళకు వెళ్ళి కొద్దిపాటి సహాయం చేస్తాను. రంజాన్ నెలలోనే నేను  ఇస్లాం గురించి కొన్ని రచనలు చేస్తుంటాను. వాటిని తప్పక పోస్ట్ చేస్తాను. ఆసక్తివున్న మీలాంటివాళ్ళకు అవి  ఉపయోగపడవచ్చు.

       అయితే ధార్మిక అంశాల్లో, నేనేమీ నిపుణుడ్నికాను. ఇందులో నాకు గురువు మా అమ్మే.

Danny Notes
10 June 2013  

       రేపు శుక్రవారం కాంగ్రెస్ కోర్ కమిటీ తెలంగాణ ఇస్తుందా? లేదా? అన్నది ఒక రాజకీయ ఆసక్తి మాత్రమే! రేపు కాంగ్రెస్ ఇవ్వకున్నా తెలంగాణ వస్తుంది. అది అనివార్యం!

       అసలు ప్రశ్న ఏమంటే, ప్రజలు కోరుకున్న తెలంగాణ వస్తుందా? పాలకులు కోరుకున్న తెలంగాణ వస్తుందా?     



 Danny Notes
10 July 2013

భిన్నాభిప్రాయం -  1

       ప్రస్తుత తెలంగాణ ఉద్యమంలోని కొన్ని అంశాల మీద నాకు కొన్ని భిన్నాభిప్రాయాలు  (Dissent) వున్నాయి. నాకు పార్లమెంటరీ పార్టీల మీద ఎన్నడూ నమ్మకం లేదు. బీజేపి వంటి పార్టీల మీద అయితే భయం కూడా వుంది. వీళ్లంతా కలిసి ప్రజల్ని ముంచుతారని నాకు గట్టి నమ్మకం. మరే ఉద్యమంలోనూ లేనట్టుగా, ’ప్రధాన స్రవంతి’ ఉద్యమ నాయకులు అధికారాన్ని చేజిక్కించుకోక ముండే కరప్ట్ అయిపోయారు. విప్లవశక్తులు ప్రస్తుతం బలహీనంగా వున్నాయి. అన్నింటికంటే విషాదకరం ఏమంటే, ప్రగతిశీలశక్తులు ఉద్యమ కళ్ళాలని   ’ప్రధాన స్రవంతి’ నేతలకు అప్పచెప్పి చేతులు దులుపుకున్నారు. తెలంగాణలో ముస్లింల భవిష్యత్తు ఏమిటనేది నాకు అదనపు బాధ్యత. పాలకవర్గాలు ప్రజల్ని ఎలాగూ అణిచివేస్తాయి. ఈ క్రమంలో తెలంగాణ ముస్లింలు మరింత అణిచివేతకు గురౌతారు. అయితే, తెలంగాణ ప్రజల్లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసుకోవాలనే కోరిక బలంగా వుంది. అందువల్లనే నేను తెలంగాణ ఉద్యమం మీద ద్విముఖ విధానాన్ని అనుసరించాను.  పాలకుల వ్యూహాల్ని తీవ్రంగా ఖండించాను. ప్రజల ఉద్యమాన్ని సమర్ధించాను.

       ప్రజలు ఆత్రుతలోనూ, విప్లవశక్తులు బలహీనంగానూ వున్నపుడే పాలకవర్గాలు సమస్యను తమకు అనుకూలంగా పరిష్కరించుకో గలుగుతాయి. ప్రస్తుతం అలాంటి సన్నివేశం వచ్చిందని కాంగ్రెస్ అధిష్టానం నమ్ముతోంది.


 Danny Notes
11 July 2013

కమ్యునికేషన్ గ్యాప్

ఆంధ్రప్రదేశ్ ను కాంగ్రెస్ విడగొట్టాలని తెలంగాణవాదులు కోరుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ ను కాంగ్రెస్ సమైక్యంగా వుంచాలని సమైక్యవాదులు ఆశిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ నుండి ఎక్కువ లోక్ సభ సీట్లు రాబట్టుకోవాలని కాంగ్రెస్ ఆలోచిస్తున్నది.


 Danny Notes
11 July 2013

భిన్నాభిప్రాయం -  2
ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర విభజన అంశం  ముందుకు వచ్చాక, రెండు ప్రాంతాల్లోనూ యువతలో బాధ్యతా రాహిత్యం పెరిగిపోయింది. "జై తెలంగాణ" అంటేనో, "జై సమైక్యాంధ్రా" అంటేనో చారిత్రక కర్తవ్యాన్ని నేరవేర్చేసినట్టు ఎవరికివారు ఆత్మానందం పొందేస్తున్నారు.

       తెలంగాణలోని ప్రభుత్వ భూములు, వక్ఫ్ భూములు, సహజవనరుల మీద భవిష్యత్ అధికారం ఎవరికి దక్కాలి అనే సింగిల్ పాయింట్ ప్రొగ్రాం మీద వర్తమాన ఉద్యమాలు సాగుతున్నాయని తెలియకపోతే మనం చరిత్ర నుండి నేర్చుకున్నది ఏమీ లేదని అర్ధం.

       కోస్తా అంధ్రా యువకులకు తమ నేల మీద నిజంగానే ప్రేమ వుంటే, దాదాపు వెయ్యి కిలో మీటర్ల పొడవున్న సముద్రతీరాన్నీ, దండకారణ్యన్నీ పరిరక్షించుకునే ప్రయత్నం చేసివుండేవారు. ఇతర రాష్ట్రాలకు చెందిన స్వదేశీ సంస్థలు మొదలు, విదేశీ సంస్థల వరకు ఆ ప్రాంతాన్ని కొల్లగొట్టుకు పోతుంటే  ఉద్యమించాలని వాళ్ళకు అనిపించకపోవడం బాధాకరం. ఈ దోపిడీకి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో తోడ్పడే నాయకుల వెంట నడుస్తూ, ఉద్యమం చేసేస్తున్నామని నకిలీ ఆనందాన్ని పొందడం అంతకన్నా విషాదం.

       గోదావరి నదిమీద ఆనకట్ట కట్టి, ఆర్ధికరంగంలో, సంస్కృతిలో కొత్త యుగానికి ద్వారాలు తెరిచిన కాటన్ దొరను ఇప్పటికీ తలుచుకోవడం మహత్తర విషయమే! అయితే, ఇప్పుడు గోదావరి నీళ్ళు తాగితేనే చనిపోతారన్నంతగా దాన్ని విషతుల్యంగా మార్చేస్తున్నవారి మీద కోపం, కసీ రాకపోతే కోస్తా జిల్లాల యువకుల రక్తంలో ఏదో లోపం వున్నట్టే నేను బాధపడతాను. గోదావరి మన అస్థిత్వం. దాన్ని కాపాడుకుందాం!

 Danny Notes
11 July 2013

చదివితే వున్న మతికాస్తా పోయిందని సామెత

       చదివితే వున్న మతికాస్తా పోయిందనే సామెతను నేనొక హెచ్చరికగా భావిస్తాను.  కనిపించిన వార్తలన్నింటినీ చదివే అలవాటువుందిగానీ, దొరికిన పుస్తకాలన్నీ చదివేసే అలవాటు నాకు లేదు. ఆయారంగాల్లో,  నా పరిజ్ఞానాన్ని మెరుగు పరచుకోవడానికి అవసరం అనిపించినపుడు నేను పుస్తకాలు చదువుతాను.  నమ్మకమైన ఒకరిద్దరు మిత్రులు ప్రాధమిక పరిశీలన చేసి చదవదగ్గవని నాకు సూచించినపుడు, అందులోని, వస్తువు నేను తెలుసుకోవడానికో, ఖండించడానికో అవసరమైందని అనుకున్నప్పుడు నేను  పుస్తకాలు చదువుతాను. 

       తోలేటి జగన్మోహన రావు పుస్తకం ’మేం మళ్ళీ తిరిగి వస్తాం’ గురించి కంఠమనేని రాజా, కాకాని సాంబశివరావు నా దగ్గర ప్రస్తావించారు. మావో కమ్యూనిస్టు కాదని జగన్మోహన రావు రాసినట్టు వారు చెప్పారు. ఆ పుస్తకాన్ని చదవకుండా వుండడానికి ఆ ఒక్కమాట చాలు అనిపించింది.

       ఏంగిల్స్ నుండి మార్క్స్ ను కాపాడడానికీ, లెనిన్ నుండి మార్క్స్ ఏంగిల్స్ లను కాపాడడానికీ, స్టాలిన్ నుండి తొలి ముగ్గుర్ని కాపాడడానికీ యూరోపియన్ మేధావులు కొందరు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. మావో కమ్యూనిస్టుకాదనీ, కమ్యూనిస్టు ఇంటర్నేషనల్ తో అతనికి సంబంధంలేదనీ, అతనికి ఇంగ్లీషే రాదుకనుక మార్క్సిజం చదువుకునే అవకాశమేలేదనే వాదనలు  గతంలోనూ చాలా  వచ్చాయి. ఇప్పుడు ఆ విషయాన్ని కొత్తగా తెలుసుకోవడం కోసం ఒక కొత్త పుస్తకాన్ని చదవడం సమయాన్ని కౄరంగా వృధాచేయడమే!

       ఒక విప్లవ నాయకుని ప్రభావాన్ని అంచనావేసే కొలమానాలు కూడా విప్లవాత్మకంగా వుంటాయి. మావో గురించి చైనా విప్లవమే మాట్లాడుతుంది. దాని ప్రభావంతో, భారతదేశంలో రగిలి, ఇప్పటికీ కొనసాగుతున్న నక్సల్బరీ ఉద్యమం మాట్లాడుతుంది. అయినా, చరిత్రలో జరిగిన పోరాటాలన్నింటికీ కమ్యూనిస్టులే నాయకత్వం వహించారనడం ఎంత పొరపాటో, కమ్యూనిస్టుల నాయకత్వంలో సాగేవే పోరాటాలనడమూ అంతే పొరపాటు. అయితే, ఇతరులకన్నా, కమ్యూనిస్టుల నాయకత్వంలో జరిగే పోరాటాల్లో, ఫలితాలు పీడితులకు అనుకూలంగావుండే అవకాశాలు ఎక్కువ.         

       ’మేం మళ్ళీ తిరిగి వస్తాం’ పుస్తకం ప్రచురణకు ముందే మిత్రుడు ఎన్. వేణు గోపాల్ ఒక నోట్ రాశాడని ఈరోజే తెలిసింది. ఆ పుస్తకంకన్నా, దానిపై, వేణు రాసిన నోట్ చదవాలనే ఆసక్తే నాకు ఎక్కువగా వుంది.

 Danny Notes
11 July 2013

సరోజినీ దేవీ బులుసుగారూ!

ఈ రోజు నుండే మీరు కోరిన వ్యాసం పోస్ట్ చేస్తున్నాను.

’ప్రపంచాన్ని కుదిపేస్తున్న రెండు దశాబ్దాలు’,
ముహమ్మద్ ప్రవక్త ప్రవచనాలు, పోరాటాలు.

 Danny Notes
11 July 2013

వీళ్ళు మీకు తెలుసా?

1. చిట్టడి నరసింహా రెడ్డి
2. జే. అరుణా రెడ్డి
3. గుజ్జు శ్రీధర్ రెడ్డి
4. అల్లవరపు నాగమల్లీశ్వరి
మన నాయకులు చాలా ఘటికులోయ్!!

Danny Notes
13 July 2013

టోనీ బ్లేయర్ ఇస్లామోఫోబియా

బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేర్  ఆత్మకథ  A Journey: My Political Life  పుస్తకం  2010  రంజాన్ మాసంలో విడుదలైంది.  4  సెప్టెంబరు  2010 న డబ్లిన్లో, పుస్తకావిష్కరణ సభకు వచ్చిన బ్లేర్ మీద యుధ్ధవ్యతిరేక నిరసనకారులు  బూట్లు, కోడి గుడ్లు విసిరారు. ఆ ఉక్రోషంతో మరునాడు, ఏబిసి న్యూస్ చానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో  "the struggle against radical Islam is comparable to the struggle against revolutionary communism".  అన్నాడు బ్లేర్.

       కవి-మిత్రుడు ఖాదర్ మొహియుద్దీన్ అన్న ఎమ్. ఏ. రహ్మాన్ రాసిన ’విముక్తి ప్రదాత ముహమ్మద్’ (స‌అ‌వ) పుస్తకానికి ఆ రంజాన్ మాసంలో నేను ముందుమాట రాయాల్సి వుండిది. కమ్యూనిజం, ఇస్లాంలను కలిపి టోని బ్లేర్ చేసిన తీవ్ర వ్యాఖ్యానం నా ముందుమాట ’ప్రపంచాన్ని కుదిపేస్తున్న రెండు దశాబ్దాలు’కు తక్షణ కోపకారణంగా  మారింది.

       ప్రస్తుత రంజాన్ మాసంలోనూ, ఇంగ్లండ్ లో అలాంటి సంఘటనే సాగుతోంది. ఆగ్నేయ లండన్ సమీపాన వూల్విచ్ లోని బారెక్స్ వద్ద, మే చివర్లో, లీ రిగ్బీ అనే ఓ బ్రిటీష్  సైనికుడ్ని ఇస్లామిస్ట్ ఉగ్రవాదులుగా భావించే ఇద్దరు నైజీరియన్లు చంపేశారు. దానితో మళ్ళీ రెచ్చిపోయిన టోనీ బ్లేర్, " We resisted revolutionary communism by being resolute on security; but we defeated it by a better idea: Freedom. We can do the same with this (Islamist Terrorism)  అంటున్నాడు.

Danny Notes
13 July 2013
సమాజిక స్వేఛ్ఛ

సమాజంలో సభ్యులకు సమాజిక స్వేఛ్ఛమాత్రమే వుంటుంది. సంపూర్ణ స్వేఛ్ఛ సామాజిక లక్షణాలని చంపేసి, మనిషిని వ్యక్తిగా మార్చి మార్కెట్ వెనుక  పరుగులు పెట్టిస్తుంది.

Danny notes
14 July 2013

To sabiha Afreen!

Please do not interfere in to the matters of others religious scriptures unless they threat your social existence. These things are funny ones and you find such typos in the scriptures of every religion. I cannot subscribe cussedness.
Everyone can present their claim or case positively.

Danny Notes
14 July 2013

గురునానక్ మక్కాయాత్ర

       ముస్లిమేతరులు కొందరు మక్కా, మదీనా సందర్శించినట్టు కొన్ని పుస్తకాల్లో వుంది. సద్గురు గురునానక్ సాహెబ్ 1519 లో మక్కా, మదీనాలు సందర్శించినట్టు భాయి గురుదాస్ జీ వంటి శిక్కు చరిత్రకారులు రాశారు. ఇంగ్లీషు రచయిత సర్ రిచర్డ్ బర్టెన్ కూడా 1853 లో  మక్కా మదీనాలు సందర్శించినట్టు తానే రాసుకున్నాడు.  గురునానక్ ఫకీర్ దుస్తుల్లో మక్కా వెళ్లగా, రిచర్డ్ బర్టన్ ఆఫ్ఘనీ ముస్లింగా మారువేషంలో వెళ్ళాడు. ముస్లిమేతరులు మక్కా, మదీనాలు సందర్శించకుండా ఇప్పుడున్నంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు 16 వ శతాబ్దంలో బహుశ లేకపోవచ్చు.

       జ్ఞాన సముపార్జన కోసం గురునానక్ నాలుగు దిక్కులకు చేసిన సుదీర్ఘ యాత్రల్లో, ముస్లిం అయిన, అతని సహచరుడు మర్దాన కూడా పాల్గొన్నాడు. సంత్ కబీర్ ప్రభావం గురునానక్ మీద పడడానికి మర్ దా న ఒక వారధిగా వున్నాడు.

Danny Notes
15 July 2013

సీమాంధ్రకు ప్యాకేజి

లక్ష కోట్ల రూపాయల ప్యాకేజి ఇచ్చి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని ఆపడం దేనికి?
దానికి ఇంకో రెండు లక్షల కోట్ల రూపాయలు కలిపి రాయలాంధ్ర రాజధాన్ని నిర్మించవచ్చు.

 Comment :
Nabi K Khan

బావిలో కప్ప ఒడ్డున పడింది. చిత్రంగా, ఆ కప్ప మనుగడకు నీళ్ళు కావాల్సొచ్చింది. మీ వ్యాఖ్యను నిరసిస్తున్నా.

 Response :

Danny Notes
16 July 2013

నూతిలో కప్ప

నబీ కరీమ్ ఖాన్ గారికి,
       మీ కామెంట్ నాకు నచ్చింది. నాకొక నూతినైనా కేటాయించినందుకు మీకు ధన్యవాదాలు చెప్పాల్సివుంది. మీరు ప్రకాశంజిల్లాలో పుట్టారనీ, ప్రపంచాన్ని చదివారని తెలిసి చాలా సంతోషం వేసింది.

       నాకు ప్రపంచమంత జ్ఞానం లేదుగానీ ప్రకాశంజిల్లా గురించి కొంత పరిజ్ఞానం వుంది. నాకు ఒకాయన తెలుసు, మీ జిల్లాలో చాలామందికి ఆయన చాలా సన్నిహితంగా తెలుసు.

       ఇవ్వాల్టికి సరిగ్గా ఇరవై ఎనిమిదేళ్ల క్రితం మీ జిల్లా  కారంచేడులో,  1985  జులై  17  న దళితుల మీద పెత్తందారీకులాలవాళ్ళు దాడి చేశారు. ఏడుగురు దారుణ హత్యకు గురికాగా, మిగిలిన దళితులు ప్రాణరక్షణ కోసం చీరాల వెళ్ళిపోయారు. నాకు తెలిసిన ఒకాయన అప్పుడు విజయవాడలో ఉద్యోగాన్నీ, పెళ్ళాంబిడ్డల్నీ వదిలి, చీరాల వెళ్ళి శాంతినగర్లో నిర్మించిన విజయనగర్ శిబిరంలో వున్నాడు. కొంతకాలం ఆ శిబిరానికి ప్రత్యక్ష నాయకుడిగానూ వున్నాడు. మీ జిల్లాలో జరిగిన ఉద్యమంలో ఎందుకు పాల్గొనలేదు? అని మిమ్మల్ని అడగడం సమంజసంకాదు. ఎందుకంటే, అప్పుడు మీకు ముక్కులో చీమిడి తుడుచుకోవడం కూడా చేతనై వుండదు.

       ప్రపంచ బ్యాంకు ఆర్ధిక సహకారంతో, ప్రకాశంజిల్లా చినగంజాం వద్ద నెలకొల్పదలిచిన  స్నోవైట్ సాల్ట్ ఫ్యాక్టరీ నిర్మాణానికి వ్యతిరేకంగా తీరప్రాంత ఉప్పు రైతులు  2000  లో  పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అప్పట్లో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు చనిపోగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆ ఉద్యమానికి కూడా మళ్ళీ ముందు నేను చెప్పిన అతనే నాయకత్వం వహించాడు. ఆ రాత్రి చినగంజాం గ్రామంలో శవాల పక్కన పడుకున్నది కూడా అతనే. మీ జిల్లాలో జరిగిన ఉద్యమంలో ఎందుకు పాల్గొనలేదు? అని మిమ్మల్ని అడగడం ఇప్పుడు సమంజసం. ఎందుకంటే, అప్పుడు మీరు నడి ఇరవైలలో వున్నారు.

       అప్పట్లోనే చీరాల సమీపాన వాడరేవు వద్ద షిప్ బ్రేకింగ్ యూనిట్ పెట్టేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను స్థానికులు తిప్పికొట్టారు. ఆ ఉద్యమాల్లో మీరు పాల్గోనకపోయినా ఫరవాలేదు. కనీసం ఒక్క బహిరంగ సభకైనా వెళ్ళారా?

       ఏమీ చేయకుండానే, అందర్నీ నూతులో కప్పలో అనే మీ తెలివిడి బాగుంది. అసలు విషయం ఏమంటే,  మీ గుంటలో బురదకన్నా చాలామంది నూతుల్లో నీళ్ళు చాలా  తియ్యనివి.










Danny Quotes
17 July 2013

సంఘీభావం

మానవ జీవితంలో అత్యంత విలాసవంతమైనది సంఘీభావం. అది తెలిసినవాళ్ళు దాన్ని పదిలంగా దాచుకుంటారు. తెలియనివాళ్ళు తెలియనిదాని కోసం జీవితకాలం నిస్పృహతో వెతుకుతూ వుంటారు.

 Danny Notes
17 July 2013

కారంచేడు ఉత్తేజం -  1
       ఉద్యమాలు ఉద్యమకార్యకర్తలకు ఒక జీవితానికి సరిపడ ఉత్తేజాన్నిస్తాయి.  అత్యున్నత స్థాయిలో సంఘీభావాన్ని ఆస్వాదించే అవకాశాన్ని కల్పిస్తాయి. అంధ్రప్రదేశ్ సామాజిక ఉద్యమాల గతిని మలుపుతిప్పిన ఉద్యమం కారంచేడు.  నా జీవితంలో ఒక మహత్తర ఉత్తేజం కారంచేడు.

       పీపుల్స్ వార్ లో పూర్తికాలం కార్యకర్తగా వున్న నేను  1981  మే నెలలో పార్ట్ టైమర్ గా మారి, ఉద్యోగానికి ఆటోమోబైల్స్ రంగంలో చేరాను.  1983 లో పెళ్ళి చేసుకున్నాను.  1985  ఏప్రిల్ నెలలో కొడుకు పుట్టడంతో, జీవితంలో స్థిరపడే ప్రయత్నాలు చేస్తున్నాను. మానాన్న ద్వార సంక్రమించిన పూరిల్లును కూల్చేసి, పక్కాఇంటిని నిర్మిస్తుండగా కారంచేడు దురంతం జరిగింది. ఆ సమయంలో నేను రాయలసీమ టూర్ లో వున్నాను. టూర్ నుండి తిరిగొచ్చి, మా కొత్త ఇంటికి స్లాబ్ వేయాల్సివుండింది. సంఘటన జరిగిన నాలుగైదు రోజుల తరువాత, చిత్తూరులో వున్న నన్ను చలం అలియాస్ ఆనంద్ అలియాస్ సుధాకర్ కాంటాక్టు చేసి కారంచేడు వెళితే బాగుంటుంది అన్నాడు. తిరుపతి చేరే సమయానికి, అప్పట్లో రీజినల్ కమిటీ కార్యదర్శిగావున్న  నెమలూరి భాస్కరరావు అలియాస్ అజ్ఞాతసూర్యుడు అలియాస్ మల్లిక్ నుండి ఆదేశం వచ్చింది "వెళ్ళితీరాలి"అని.

       కారంచేడు ఉద్యమ చారిత్రక ప్రాధాన్యం గురించి గతంలో చాలా వ్యాసాల్లో ప్రస్తావించాను. ఆ ఉద్యమం వ్యక్తిగతంగా నా మీద వేసిన ప్రభావాన్నే ఈరోజు నెమరువేసుకుంటున్నాను. 

       కారంచేడును పీపుల్స్ వార్ కూడా మొదట వ్యవసాయకూలీల సమస్యగానే భావించింది. ఈ సంఘటనపై మొదట స్పందించింది ఆ గ్రామం మాదిగవాడలోవున్న రాడికల్ యువజన సంఘం సభ్యులే. చీరాలలో, బాధితులకు చర్చీలో ఆశ్రయం కల్పించడంతో అది క్రైస్తవ సమస్యగా మారింది. ప్రభుత్వంతో ఘర్షణ కారణంగా అది నేరుగా రాజకీయ సమస్యగా మారింది. బాధితులందరూ మాదిగ సామాజికవర్గానికి చెందినవారు కావడంతో అది కుల సమస్యగా మారింది. సంఘటన జరగ్గానే చీరాల చేరుకున్న పీపుల్స్ వార్ రాష్ట్ర ప్రతినిధులకు అక్కడ అస్థిత్వ సమస్య ఎదురైంది. సమస్య రోజురోజుకూ జటిలమైపోవడంతో, క్రైస్తవులు, దళితులు, కమ్యూనిస్టులతో ఏకకాలంలో పనిచేయగలిగే అభ్యర్ధిని ఎంపిక చేసే క్రమంలో నా పేరు పరిశీలనలోనికి వచ్చింది.



 Danny Notes
17 July 2013

కారంచేడు ఉత్తేజం -  2

       అప్పట్లో, అమ్మా, నాన్న, చెల్లి, తమ్ముడు, మేనల్లుడు, భార్య, కొడుకు అందరికీ నేనొక్కడ్నే ’బ్రేడ్ ఎర్నర్’. మల్లిక్ నుండి కబురు వచ్చాక నేను నా భార్యకు కబురు పెట్టాను.  కారంచేడులో దౌర్జన్యం జరిపింది నా భార్య సామాజికవర్గానికి చెందినవారే. తను నన్ను తప్పక వెళ్లమంది. పిల్లాడి గురించి బెంగపడవద్దంది. అవన్నీ తనే చూసుకుంటానంది. అంతే, ధైర్యంగా చీరాలలో అడుగుపెట్టాను. ఆ తరువాత జరిగిందంతా చరిత్రే! అక్టోబరు ఐదున (ఆరునా?) విజయవాడలో కత్తి పద్మారావు అరెస్టయిన రోజునే, నన్ను చీరాలలో పోలీసులు విముక్తి కలిగించారు.   

       అప్పటికి కత్తిపద్మారావుకైనా, నాకైనా మరొకరికైనా ప్రతీదీ కొత్తే. సన్నివేశాలు, సవాళ్ళు కొత్తవి. ప్రతిదానికీ కొత్త పరిష్కారాలు వెతకాలి. ఆ ఉద్యమానికి గతకాలపు మాన్యువల్ లేదు. అంతా సృజనాత్మకతే!

       కారంచేడు ఉద్యమం భూమ్మీద అద్భుతమైన పొరాటం. న్యాయస్థానాల్లో బలహీనమైన పోరాటం. దానికి ఆరేళ్ళ తరువాత జరిగిన చుండూరు ఉద్యమం భూమ్మీద బలహీనమైన పొరాటం. న్యాయస్థానాల్లో బలమైన పొరాటం.

       కారంచేడు ఉద్యమం మా ఇంటి మీద చాలా ప్రభావం చూపింది. మా ఇంటి నిర్మాణం అగిపోయింది. ఏడాదిన్నర తరువాతగానీ శ్లాబ్ వేయలేకపోయాను. పదకొండు గుమ్మాలుండి ఒక్క తలుపు కూడా లేని ఇంట్లో పదేళ్ళు కాపురం చేశాను. కారంచేడు సంఘటనకు ఒక ఏడాది ముందు, ప్రకాశం జిల్లాకేంద్రానికి పధ్నాలుగు కిలో మీటర్ల దూరంలోవున్న చేజర్ల గ్రామంలో, మా ఆఫీసు మితృలతోపాటు నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిని సంపాదించాను. కారంచేడు ఉద్యమం నాకు ఇచ్చిన ఉత్తేజంలో ఆ భూమి మీద ఆసక్తి పోయింది. దాన్ని వదులుకున్నాను. ఈ ముక్క ఇప్పుడు ఎందుకు చెపుతున్నానంటే, ఉద్యమాల్లో కోల్పోయామని చాలామంది బాధ పడుతుంటారు. నిజానికి మనకు ఉద్యమాలు ఇచ్చే ఉత్తేజం మహత్తరమైనది. ఆ ఉద్వేగం ముందు అరెస్టులు,  ఆస్తినష్టాలు చాలా చిన్న విషయాలు.

       ఉద్యమాల్లో పాల్గొనేవాళ్లకు అడ్వాంటేజెస్ వుండకపోవచ్చుగానీ, ప్రివిలేజెస్ చాలా వుంటాయి. అవి జీవితాంతం మనకు డివిడెండ్స్ ఇస్తునేవుంటాయి.

       కారంచేడు ఉద్యమంవల్ల నేను అందుకున్న ప్రివిలేజెస్ లో ఇద్దరు భాస్వాములున్నారు; బొక్కా పరంజ్యోతి, గోసాల ఆశీర్వాదం. ఈ జాబితాలో నా భార్య యేలూరి అజితను కూడా చేర్చవచ్చు.

 Danny Notes
18 June 2013

జీయస్ (సిరీస్) రాజుగారికి నివాళి

       నేను విలేఖరిగా వున్నంత కాలం కాంగ్రెస్ విభాగాన్నే చూడడంవల్ల ఆ పార్టీ నాయకులతో సన్నిహిత సంబంధాలు వుండేవి. కాంగ్రెస్ లో, జీయస్ రాజు, కాట్రగడ్డ రాజగోపాల రావు వంటి వృధ్ధులు నాతో చాలా చనువుగా పాత విషయాలు నెమరు వెసుకుంటూ వుండేవాళ్ళు.

       ఒక రోజు రాజుగారు సబర్మతీ ఆశ్రమంలో తన అనుభవాలు చెప్పడం మొదలెట్టారు. అప్పటి కాంగ్రెస్ నాయకులకు మహా అయితే ఇందిరా గాంధి తెలుసు. వారు మరీ, నెహ్రూ, గాంధీజీలను ప్రస్తావిస్తుంటే,  "రాజుగారూ! మీ వయస్సు ఎంత?" అని అడిగాను. అప్పటికి వారు డెభ్భయ్యవ పడిలో వుంటారు.

       "మీకు నా క్రనోలాజికల్ ఏజ్ కావాలా? బయోలాజికల్ ఏజ్ కావాలా? అని అడిగారు రాజుగారు.  వారు ఏం అన్నారో నాకు అర్ధం కాలేదు. అజ్ఞానాన్ని దాచుకోవడం కన్నా దాన్నుండి బయటపడడమే మంచిదనే వుద్దేశ్యంతో, నేను "మీరు చెప్పింది నాకు అర్ధం అయినట్టూ కానట్టూ వుంది. మీరే కాస్త జ్ఞానబోధ చేసేయ్యరాదూ?" అన్నాను.

       రాజుగారు అమెరికాలో యంయస్ చేశారు. "Chronological age is simply my age in Calendar years. Biological age is my age at a cellular level"  అన్నారు. మళ్ళీ వారే కొనసాగిస్తూ, "క్యాలెండర్ వయస్సు నేను చెప్పకుండానే మీకు తెలిసిపోతుంది. బయోలాజికల్ వయస్సు నేనే చెప్పాలి" అన్నారు.

"ఇప్పుడు మీ బయోలాజికల్ వయస్సు ఎంత రాజుగారూ?" అని అడిగాను.
"నలభై" అన్నారువారు చలాకీగా, చిలిపిగా ఓ నవ్వు నవ్వుతూ.

Naresh Nandam!

Danny Notes
18 JUne 2013
నరేష్ నందం :  డానీ గారూ! , నేరుగా మీరు కలిసినప్పుడు అడిగే అవకాశం ఉన్నా, మరికొందరు మిత్రుల బదులు కూడా ఈ ప్రశ్న:
మీరు ‘ఉషా ఎస్ డానీ’ ఎలా అయ్యారు?

ఉషా యస్ డానీ

నాకు సంబంధించి ఇది చాలా వ్యక్తిగత  భావోద్వేగాలతో కూడిన వ్యవహారం. ఒకటీ రెండు వాక్యాల్లో చెప్పగల విషయం కాదు. అలాగని, మీలాంటివాళ్ళు అడిగాక తప్పించుకునే అంశమూకాదు. చొప్పరపు ఉష రాణి నాకు అత్యంత ఆత్మీయ స్నేహితురాలు. మా అనుబంధాన్ని చెప్పడానికి ఈ మాటలు చాలా చిన్నవి. ఒక నాటకీయ సందర్భంలో, మేమిద్దరం అధికారికంగా పెళ్ళి కూడా చేసుకున్నాం. కాపురానికి రావడానికి ముందే ఆమె చనిపోయింది. నా కన్నా ముందే ఆమె రాడికల్. ఆ విషయం ఆమె చనిపోయాకే నాకు తెలిసింది. ఆమె మీద అభిమానంతోనే నేను రాడికల్ గా మారాను. వృత్తి ధర్మంగా, వాణిజ్య పరంగా, పొట్టకూటి కోసం రాసే రచనల్ని వదిలేస్తే, నేను నా ఆసక్తి కొద్దీ సమాజ శ్రేయస్సు కోరి రాసే రచనల్ని ఉషా యస్ డానీ పేరుతోనే రాయాలనుకుంటాను. నా పూర్తి  పేరులో ఐదు పదాలున్నా యజ్దానీ మాత్రమే నా స్వంత పేరు. మిగిలిన నాలుగు పదాలు మా వంశం పేర్లు, మా తాతల పేర్లు.  మా ఇద్దరి పేర్లు కలిపి  రాయడం నాకు చాలా సంతృప్తి నిస్తుంది. అయితే దానికీ కొన్ని అడ్డంకులున్నాయి. అది నా భార్య యేలూరి అజిత నుండి కాదు. అస్తిత్వవాద ఉద్యమాల నుండి. మన్నించండి. ఇంతకు మించి ఇప్పుడు నేనేమీ చెప్పలేను.

 Danny Notes
19 July 2013  

మూడు అసమంజస ఉద్యమాలు 

మొదటిది, షెడ్యూలు కులాల వర్గీకరణకు వ్యతిరేకంగా మాల సామాజికవర్గ నాయకులు చేసే ఆందోళన.
రెండవది, హిందూయేతర వెనకబడిన కులాల ఉద్దీపన కార్యకలాపాలకు వ్యతిరేకంగా హిందూ వెనకబడిన కులాల నాయకులు చేసే ఆందోళన.
మూడవది, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా సీమాంధ్ర నాయకులు చేసే ఆందోళన.

Dannu Notes
19 July 2013

భావోద్వేగాలు, భావోద్రేకాలుగా మారకముందే రాష్ట్ర పునర్విభజన జరగడం మేలు.

 Danny Notes
20 July 2013

తెరంజీవులు

మిత్రుడు రామ్మోహన్ నిన్నటి ఆంధ్రజ్యోతిలో, తెరాధునిక మధ్యతరగతి గురించి సందర్భోచితంగా సమర్ధమైన విశ్లేషణ చేశాడు. ముఖ్యంగా, నేటి పార్లమెంటరీ రాజకీయాల సూపర్ స్టార్ గా భావిస్తున్న నరేంద్రమోడీ గురించి చేసిన విశ్లేష చాలా బాగుంది. మోడీని సినీ రాంబోతో పోల్చడం ఇంకా బాగుంది. రాంబో సిరీస్ లో రెండోదయిన రాంబో : ఫస్ట్ బ్లడ్ పార్ట్ - టూ 1985  లో విడుదలైనపుడు రోనాల్డ్ రీగన్ అమేరికా అధ్యక్షునిగా వున్నాడు. రీగన్ ఆ సినిమా చూసి,  After seeing Rambo last night I know what to do next time this happens  అని  అన్నమాటలు అమెరికన్లకు ఒకరకం ఆత్మానందాన్ని ఇచ్చాయేమోగానీ, అప్పటికీ ఇప్పటికీ వియత్నాంలో విజయాన్ని మాత్రం ఇవ్వలేదు. 

Danny Notes
21 July 2013

ఒబామా విలాపం

       ట్రేవాన్ మార్టిన్ హత్యపై, కొంచెం ఆలస్యమైనా  బారక్ ఒబామా స్పందించాడు.  "చనిపోయిన ట్రేవాన్ మార్టిన్ 35  ఏళ్ల క్రితం నేనైనా అయ్యుండొచ్చు” అని సాక్షాత్తు అమేరికా అధ్యక్షుడు అనడం నల్లజాతివారు ఎంత అభద్రతా భావంతో జీవితం గడుపుతున్నదీ అర్ధం అవుతోంది. ట్రేవాన్ మార్టిన్ ను హత్య చేసిన జార్జ్ జిమ్మెర్ మన్ ను అమేరికా కోర్టులు నిర్దోషిగా విడుదలచేశాయి. ఈ నేపథ్యంలోనే ఒబామా మీడియా ముందుకు వచ్చాడు.

       మన దేశపరిస్థితులూ అందుకు భిన్నంగాలేవు. 1984  నాటి ఢిల్లీ అల్లర్లు, శిక్కుల ఊచకోత కేసులో, నిందితుడైన కాంగ్రెస్ నాయకుడు సజ్జన్ కుమార్ ను మూడు నెలల క్రితం ట్రయల్ కోర్టు నిర్దోషిగా పేర్కోంది. యాధృచ్చికంగా శిక్కు సామాజికవర్గానికి చెందిన వ్యక్తే ఇప్పుడు మన ప్రధానిగా వున్నారు. ఇంకో విచిత్రం ఏమంటే, శిక్కుల ఊచకోత జరుగుతున్నప్పుడూ, శిక్కు సామాజికవర్గానికి చెందిన జ్ఞానీ జైల్ సింగే దేశాధ్యక్షునిగా వున్నారు. 

       అమేరికాకన్నా ముందే, భారతదేశంలో మత అల్పసంఖ్యాకవర్దాలకు చెందినవాళ్ళు దేశాధ్యక్షులయ్యారు, ప్రధాని కూడా అయ్యారు. కానీ, ఒబామా అన్నట్టు, "ముఫ్ఫయి యేళ్ళక్రితం ఆ మృతుల్లో నేనూ వుండేవాణ్ణి" అని ఆరోజు జైల్ సింగ్ అనలేదు, ఇప్పుడు మన్మోహన్ సింగ్ అనలేరు. దేశంలో మైనారిటీల స్థితిగతులు ఇంకా మెరుగుకావాలి 

Danny Notes
23 July 2013  

అస్థిత్వాల ఐక్యత ఘర్షణ

       ఒక బిందువు వద్ద మూడు వందల అరవై కోణాలు వుంటాయని రేఖాశాస్త్రం (జామెట్రి) అంటుంది. ఇవి టూ-డైమెన్షన్ కోణాలు మాత్రమే. త్రీ-డైమెన్షన్లో అయితే, కోణాల సంఖ్య ఇంకా అనేకరెట్లు పెరిగిపోతుంది. మనిషికి కూడా ఒకే సమయంలో అనేక అస్థిత్వాలు వుంటాయి. విభిన్న అస్థిత్వాల మధ్య నిరంతరం అంతర్_బహిర్, ఐక్యతా_ఘర్షణలు కొనసాగుతూనే వుంటాయి.

       ఒక్కొక్క  చారిత్రక దశలో, ఒక్కొక్క ఘర్షణ ప్రధానంగా ముందుకువస్తుంది. దాన్ని పరిష్కరించడానికి సమాజంలో కొత్త ఐక్యత ప్రాతిపదిక మీద రెండు విరుధ్ధ శిబిరాలు ఏర్పడతాయి. రెండు శిబిరంల్లోనూ, ఆ దశకు సంబంధించి ఐక్యతే ప్రధానంగా వున్నప్పటికీ, అంతర్గత ఘర్షణ కూడా వుంటుంది. ఘర్షణలేని ఐక్యతగానీ, ఐక్యతలేని ఘర్షణగానీ వుండవు.

       చారిత్రక దశమారగానే, ప్రధాన ఘర్షణ కూడా మారిపోతుంది. నిజానికి ఇది తద్విరుధ్ధంగా జరుగుతుంది. పాత సంఘర్షణ తగ్గుముఖంపట్టి, కొత్త సంఘర్షణ ముందుకురాగానే, దాన్ని పరిష్కరించడానికి సమాజంలో మళ్ళీ కొత్త ఐక్యత ప్రాతిపదిక మీద రెండు విరుధ్ధ శిబిరాలు ఏర్పడతాయి.


Danny Notes
24 July 2013

అమేరికా విదేశాంగ విధానం

       అమేరికా విదేశాంగ విధానం అంటేనే యుధ్ధ ప్రణాళిక. ఇప్పుడు ఆ దేశపు విదేశాంగ విధానానికైనా, యుధ్ధ ప్రణాళికలకైనా ముస్లింలే ప్రధాన కొలమానంగా మారారు.

       ప్రతి దేశంలోనూ పాలకవర్గాలకూ, ప్రజలకు మధ్య ఘర్షణ వుంటుంది. ఆ ఘర్షణ అందోళన, ఉద్యమాలు, తిరుగుబాట్లుగానూ మారుతుంది. అమేరికా అన్ని అందోళనల్నీ, తిరుగుబాట్లనీ ఒక్కలాగే చూడదు. అది, ముస్లిమేతర దేశమయితే అక్కడ తిరుగుబాటుదార్లను అణిచివేయడానికి ప్రభుత్వానికి ఆయుధాలు సరఫరా చేస్తుంది. అది, ముస్లిం దేశమయితే అక్కడ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి తిరుగుబాటుదార్లకు ఆయుధాలు అందచేస్తుంది. సిరియాలో బాషర్ అస్సద్ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి, అక్కడి తిరుగుబాటుదార్లకు ఆయుధాలు అందచేయాలని 
Danny Notes
26 July 2013

అమర్త్యాసేన్ భారతరత్న

       ఉన్నత న్యాయస్థానాలకు న్యాయమూర్తుల నియామకాలు రాజకీయ పార్టీల వ్యవహారంగా మారిపోయి చాలాకాలమైంది.  ఇప్పుడు భారతరత్న వంటి బిరుదుల ప్రదానం కూడా రాజకీయ పార్టీల స్వంత ఆస్థిగా మారిపోయింది.

       నరేంద్ర మోడి వంటి కరడుగట్టిన మతతత్త్వవాది దేశప్రధాని పదవికి పనికిరాడని విఖ్యాత ఆర్ధికవేత్త అమర్త్యాసేన్ చేసిన వాఖ్యల మీద సంఘ పరివారం విరుచుకుపడింది. మళ్ళా ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడగానే గతంలో అమర్త్యాసేన్ కు ఇచ్చిన  భారతరత్న బిరుదును వెనక్కి లాక్కుంటాం (stripped of)  అంటున్నారు బీజేపి రాజ్యసభ సభ్యుడు చందన్ మిత్ర.  ఆయన రాజకీయ నాయకుడు మాత్రమేకాదు, పాత్రికేయుడు కూడా. ద పయొనీర్ దినపత్రిక్కి సంపాదకులు కూడా.

 Danny Notes
28 July 2013

వడ్డీ జీవనశైలి

       చిన్నప్పుడు వడ్డీ అనే మాట వింటే చాలు, అదో మహమ్మారి అనుకుని భయపడి వణికిపొయేవాళ్లం. మా ఇంట్లో, వడ్డికి ఇవ్వడం, తీసుకోవడం రెండూ నిషేధమే. కొత్త శతాబ్దంలో, సన్నివేశం మారింది. వడ్డీ మా ఇంట్లోనూ ప్రవేశించేసింది. డబ్బును వడ్డీకి తిప్పేటంతటి  అదనపు ఆదాయం మాకు ఎలాగూలేదు. ఫైనాన్స్ మీద గృహోపకరణాలు, వాహనాలు కొని నెలనెలా వడ్డీలు చెల్లిస్తున్నాం.

       వైయస్ రాజశేఖరరెడ్డి  హయాంలో హైదరాబాద్ జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు కేటాయించారు. దానికోసం లక్ష రూపాయలు కట్టమన్నారు. బ్యాంకు రుణం తీసుకుని కట్టాను. ఇరవై నాలుగు శాతం వడ్డీ. అలా రెండేళ్ళు గడిచాక పాత డబ్బులు తిరిగిచ్చి, కొత్తగా రెండు లక్షలు కట్టమన్నారు. రెండేళ్లకు పైగా నెలకు దాదాపు ఆరు వేల రూపాయల వడ్డీ కడుతున్నాను. ఎవో న్యాయపరమైన సమస్యలతో ఇళ్ళస్థలాలు ఇంకా రాలేదు. కానీ, వడ్డి నా జీవితంలో భాగం అయిపోయింది. అన్నవస్త్రాలకు వెళితే వున్న వస్త్రాలు పోవడం అంటే ఇదే!

       ఇంకా నేను నయం; బ్యాంకు రుణం తీసుకుని డబ్బులు కట్టాను. చాలా మంది ప్రైవేటు రుణం తీసుకుని కట్టారు. వాళ్ల పరిస్థితి మరీ దారుణం!   


Danny Notes
28 July 2013

ఈరోజు చారూ మజుందార్ వర్ధంతి. మా తరానికి ఉత్తేజాన్నిచ్చిన విప్లకారుడు చారు మజుందార్. ఈరోజు పగలంతా విరసం ఆవిర్భావ సభలో పాల్గొన్నాను. ఇలాంటి కార్యక్రమాలు పునరుత్తేజానికి దోహదం చేస్తాయి. సంజయ్ కక్ నిర్మించిన ’వైట్ యాంట్స్ డ్రీమ్’ డాక్యుమెంటరి చూశాను. ప్రపంచం స్థంభించి పోలేదు. మైదానంలో కాకున్నా, అడవిలో ఆకులు కదులుతున్నాయి.
Danny Notes
29 July 2013

ప్రస్తుతం  2003  నాటి ఫ్రెంచ్ సినిమా  Monsieur Ibrahim et les fleurs du Coran చూస్తున్నాను. ఓమర్ షరీఫ్ ప్రధాన పాత్రధారి. సినిమా ఆసక్తికరంగా వుంది. చూడాలంటే,  http://www.youtube.com/watch?v=YvTVtzTGCp4  లింకులో వుంది.

Danny Notes
30 July 2013

సాహిత్యం జీవితం

       నా ఆలోచనా సరళిలోనే ఏదో ఇబ్బంది వుంది. తరచుగా నాకు జీవితం సాహిత్యంగానూ, సాహిత్యం జీవితంగానూ అనిపిస్తూ వుంటుంది.

       నాలుగు నెలల క్రితం హైదరాబద్ లో  ఒక సంఘటన జరిగింది. నాకు తెలిసిన ఒక వాణిజ్య సంస్థను అమ్మకానికిపెట్టారు. రెండు మూడు వందల మంది ఉద్యోగులు రోడ్డున పడే పరిస్థితి. అందరూ వెళ్ళి, ఓ ఉద్యోగిని కాళ్ళ మీద పడి, సంస్థను నిలబెట్టమని ప్రాధేయపడ్డారు. పాపం ఆ అమ్మాయి తనకున్న ఆయుధాలు ఏవో  ప్రయోగించింది. ఆమె ప్రయత్నం ఫలించింది. యజమాని ఆ సంస్థనూ, ఆ అమ్మాయినీ వుంచుకోవాలని నిర్ణయించుకున్నాడు.

       ఈ వివరాలు విన్నప్పుడు నాకు నూట ముఫ్ఫయి యేళ్లనాటి గైడి మొపాసా కథ ’బౌలే డి సౌఫ్’ (Boule De Suif) గుర్తుకు వచ్చింది. ఆ వాణిజ్య సంస్థను కాపాడిన అమ్మాయి మీద విపరీతమైన సానుభూతి కలిగింది.

       ’బౌలే డి సౌఫ్’ కథ పేరు చెప్పగానే పీకాక్ బుక్స్ గాంధీ పట్టుకున్నాడు.  దాన్ని అనువదించమని పోరు మొదలెట్టాడు. ఆ పనిని ఆగస్టు మూడు, నాలుగు వారాల్లో పెట్టుకున్నాను.

Danny Notes
30 July 2013

కాంగ్రెస్ వెర్రి

       తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది ప్రస్తుత కోరిక. కాంగ్రెస్ వెర్రికాకపోతే మధ్యలో, ఈ రాయలసీమ విభజన ఏమిటీ?

       కాంగ్రెస్ తెలంగాణతో తలగోక్కుంటున్నది అనుకునేవాడిని. కాంగ్రెస్ కు ఒక కొరివి సరిపోయేటట్టులేదు. దానికి, రాయలసీమ, కోస్తాంధ్ర కొరివిలు కూడా అవసరం అయ్యేటట్టున్నాయి. 

Danny Notes
30 July 2013

చరిత్ర ముగిస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి

ఏమైనా, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.  అంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా, నీలం సంజీవరెడ్డి ఒక చరిత్ర సృష్టించగా, చివరి ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి మరో చరిత్ర సృష్టిస్తున్నారు. సంజీవరెడ్డి ఫౌండరు. కిరణ్ కుమార్ రెడ్డి లిక్విడేటరు.  


Danny Notes
30 July 2013

బహద్దూర్ షా జాఫర్ తో పోల్చవద్దు

కిరణ్ కుమార్ రెడ్డిని బహద్దూర్ షా జాఫర్ తో పోలుస్తూ కొందరు ఫేస్ బుక్కులో పోస్ట్స్ పెడుతున్నారు. జఫర్ భారతదేశపు చివరి చక్రవర్తి. కిరణ్ ఆంధ్రప్రదేశపు చివరి ముఖ్యమంత్రి. ’చివరి’ వరకే ఇద్దరి మధ్య పోలిక. పోరాటంలో పోలికే లేదు.

       జఫర్ కత్తి పట్టాడు. భారత మొదటి స్వాతంత్ర సంగ్రామానికి నాయకత్వం వహించాడు. కలం పట్టాడు అద్భుత కవిత్వాన్ని సృష్టించాడు.  కిరణ్ కు కత్తి పట్టడం రాదు. రాజీనామా చేయడానికి పెన్ను పట్టడమూ రాదు. దయచేసి జఫర్ తో పోల్చవద్దు.   

Danny Notes
30 July 2013

తెలంగాణ బంధుమిత్రులకు నూతన రాష్ట్ర శుభాకాంక్షలు

Danny Notes
30 July 2013

            ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఒక చిక్కుముడి ఈరోజు విడిపోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని యూపియే సమన్వయ కమిటీ, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలు ఏకగ్రీవ తీర్మానాలు చేశాయి. ఇక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం లాంఛనమే!

       గత అసెంబ్లీ ఎన్నికల తరువాత రాష్ట్రంలో ప్రభుత్వం పనిచేయడం మానేసింది. ప్రజా సంక్షేమం కాలగర్భంలో కలిసిపోయింది.  ఇకనైనా పరిస్థితి మెరుగు పడుతుందని ఆశిద్దాం. ఇప్పుడైనా అన్ని ప్రాంతాల్లోని వాస్తవ సమస్యలపై స్థానిక ప్రజలు దృష్టి పెట్టాల్సిన సందర్భం వచ్చింది.  

        హైదరాబాద్ మహనగరంతోవున్న ప్రగాఢ అనుబంధం కారణంగా దాన్ని వదులుకోవడం సీమాంధ్ర ప్రజలకు మనస్తాపంగానే వుంటుంది. దీన్నొక అనివార్య పరిణామంగానే స్వీకరించాలి. సీమాంధ్ర ప్రజలకు ద్రోహం చేసింది అరవైయేళ్ళుగా వాళ్లకు నాయకత్వం వహిస్తున్నవాళ్ళే. రాష్ట్ర అభివృధ్ధిని మొత్తంగా హైదరాబాద్ లో కేంద్రీకరించడం చారిత్రక తప్పిదం. ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి పరిస్థితి వస్తుందని గమనించకపోవడం నాయకత్వలోపం. దీనికి ఒకర్నో ఇద్దర్నో నిందించడం సరికాదు.  అన్ని పార్టీలలోని అందరూ దీనికి బాధ్యులే. నిజానికి  కాంగ్రెస్సే అందరికన్నా ఆఖర్లో తెలంగాణకు పచ్చజండా ఊపింది. సిపియం, యంఐయం మినహా మిగిలిన అన్ని పార్టీలూ ఎన్నడో కేంద్రానికి అంగీకార పత్రాలు ఇచ్చాయి. పైగా, కాంగ్రెస్ తన వైఖరి చెప్పాలని డిమాండ్ చేస్తూ వచ్చాయి.

       సీమాంధ్రలో కొత్త రాజధాని ఎక్కడ నిర్మించాలనేది ఇప్పుడు కొత్త చిక్కుముడి. రవాణా సౌకర్యం, నీళ్ల వసతి ప్రాతిపదికగా, కొత్త రాజధానికి స్థల ఎంపిక జరగాలి. ఇది అంత సులువైన వ్యవహారంకాదు. కేంద్రీకృత అభివృధ్ధి ఎప్పటికైనా ప్రమాదకరమని ఇప్పుడైనా గుర్తించాలి. పదేళ్ళ పాటు హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా వుంచాలనే కాంగ్రెస్ సూచన కొందరికి కొంత మానసిక ఆనందాన్నివ్వొచ్చుగానీ, అదేమీ మహత్తరమైనదేమీకాదు. కొత్త రాజధాని నిర్మాణాన్ని పదేళ్ళు వాయిదా వేయడంతప్ప దానివల్ల ఒనగూడేదేమీ వుండదు. కొత్త రాజధాని నిర్మాణానికి  మూడు లక్షల కోట్ల రూపాయలో అంతకన్నా ఎక్కువ ప్యాకేజో కేంద్ర ప్రభుత్వం దగ్గర నుండి రాబట్టుకుని పనులు ప్రారంభించడంపై సీమాంధ్ర ప్రాంత నాయకులు దృష్టిపెట్టాలి. 

       తెలంగాణేతర ఆంధ్రప్రదేశ్ ఇక మూందు కూడా అదే పెరుతో కోనసాగుతుందని కాంగ్రెస్ ప్రతినిధి దిగ్విజయ్ సింగ్ అంటున్నారు. ఈ విషయం మీద కూడా సీమాంధ్ర ప్రజలు ఆలోచన చేయాలి. సీమాంధ్రలో రాయలసీమ, తీరాంధ్ర ప్రాంతాలున్నాయి.

Danny Notes
30 July 2013
సీమాంధ్ర నాయకుల మోసం

సీమాంధ్ర నాయకులు ఇంకా ప్రజల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సోనియా గాంధీ తమ చెప్పుచేతల్లో వున్నట్లు సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు ఇంతకాలం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చారు. వాళ్లకు టెన్ జన్ పథ్ లో సోనియా కాలి చెప్పు కింద రాయంత విలువ కూడా లేదని యావత్ దేశం ఈరోజు టెలివిజన్ ల సాక్షిగా చూసింది.

       తెలంగాణ ఇవ్వాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటి, యూపియే సమన్వయ కమిటి తీర్మానం చేశాయి. ఆ తీర్మానం నచ్చకపోతే కాంగ్రెస్ నాయకులు ఢిల్లీలోనే ఆ పార్టికి రాజీనామాలు ఇచ్చిరావాలి.  మరీ ప్రగల్భాలు పలికివుంటే రాజకీయాల్నే వదిలేయాలి. అంతేగానీ, రాష్ట్ర అసెంబ్లీలో తెలంగాణ తీర్మానాన్ని ఓడించండి అని పిలుపు ఇవ్వడం దేనికీ? ప్రజలు మరీ అంత పిచ్చివాళ్ళు అనుకుంటున్నారా వీళ్ళు?  అసెంబ్లీలో చేసే తీర్మానం ఒక లాంఛనమేతప్పా, అది కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చదని వీళ్లకు తెలీదా? 

Danny Notes
31 July 2013

రాయలాంధ్ర పునర్ నిర్మాణమే తక్షణ ఎజెండా

       ప్రభుత్వాలు తీసుకునే ప్రతీ నిర్ణయం, మినహాయింపులేకుండా,  కొందరు లబ్దిదారుల్ని, కొందరు బాధితుల్ని సృష్టిస్తుంది. 1956 నాటి హైదరాబాద్ స్టేట్ లోని తెలంగాణను పునరుధ్ధరించాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తీసుకున్న నిర్ణయం సహజంగానే తెలంగాణ ప్రాంతంలో ఉత్సాహాన్నీ, రాయలసీమ, తీరాంధ్ర ప్రాంతాల్లో నిరుత్సాహాన్నీ రేపింది. యూపియే పక్షాల ప్రస్తుత నిర్ణయానికి లబ్దిదారు తెలంగాణ కనుక ఆ ప్రాంతంలోని పార్టీలన్నీ ఆ ఘనత తమదంటే తమదని చెప్పుకోవడానికి ఉవ్విళ్ళూరుతున్నాయి. "నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనకు వస్తున్నారని తెలిసే, కాంగ్రెస్  హడావిడిగా తెలంగాణ ప్రకటించేసింది" అని బీజేపి కిషన్ రెడ్డి అప్పుడే అనేశారు కూడా. మరోవైపు, రాష్ట్రాన్ని విభజించిన ’పాపం’ తమదికాదంటే తమదికాదని ఆంధ్రా ప్రాంతంలోని పార్టీలన్నీ భుజాలు తడుముకుంటున్నాయి. 

       ప్రస్తుత అలలో, తెలంగాణ నినాదానికి రాజకీయ ప్రయోజనం వుందని గుర్తించిన తొలిపార్టి బీజేపి. 1998 లోక్ సభ మధ్యంతర ఎన్నికలకు ముందు ఆ పార్టి "ఒక ఓటు రెండు రాష్ట్రాలు" అనే నినాదాన్ని ముందుకు తెచ్చింది. తీరాంధ్ర ప్రాంతంలోని కాకినాడలో జరిగిన రాష్ట్ర ప్లీనరీలో బీజేపి ఈ నిర్ణయం తీసుకోవడం ఇంకో విశేషం. ఆ ఎన్నికల్లో బీజేపికి రాష్టంలో నాలుగు లొక్ సభ స్థానాలు దక్కాయి. ఆ తర్వాత మూడేళ్లకు, కే. చంద్రశేఖరరావు తెలుగుదేశం నుండి బయటికి వచ్చి, తెలంగాణ రాష్ట్రసమితి పెట్టారు. పేరును బట్టే, టీఆర్ ఎస్ ఏకైక లక్ష్యం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు.

       1994, 1999 ఎన్నికల్లో, వరుసగా రెండుసార్లు, పరాజయాన్ని చవిచూసి, నిస్పృహకు గురైన రాష్ట్ర కాంగ్రెస్, తెలంగాణ నినాదాన్ని అందుకుని బతికి బట్టకట్టాలనుకుంది. జి. చిన్నా రెడ్డి నాయకత్వాన తెలంగాణ శాసనసభ్యుల బృందాన్ని ఢిల్లీకి పంపించింది. కాంగ్రెస్ లో ఈ ఆలోచన యంయస్ కు వచ్చిందా? డీయస్ కు వచ్చిందా? లేక షబ్బీర్ అలీకి వచ్చిందా? అన్నది అంత ముఖ్యం కాదు. ఈ బృందం అప్పటి సిఎల్పీ నాయకుడు వైయస్ రాజశేఖర రెడ్డి ఆశిస్సులతోనే, ఆ  సోనియా గాంధీ దగ్గరకి వెళ్ళిందనేది అంతకన్నా ముఖ్యమైన అంశం. ఫలితంగా, రాష్ట్ర కాంగ్రెస్ లో తెలంగాణ రీజినల్ కాంగ్రెస్ కమిటి అనే ప్రత్యేక విభాగం కూడా ఏర్పడింది. వైయస్ కరడుకట్టిన సమైక్యవాది అనే మాట వాస్తవంకాదు. ఆయనది అవకాశవాదం. స్వంత బలం వుందని భావించినపుడు ఒకవిధంగానూ, లేదని భావించినపుడు వేరే విధంగానూ ఆయన తెలంగాణ విషయంలో ప్రవర్తించేవారు.

       ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలిచితీరాలనే లక్ష్యంతోనే, వైయస్ 2004 ఎన్నికలకు ముందు టీఆర్ ఎస్ తో  పొత్తుపెట్టుకున్నారు. అయితే, ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయశాతంకన్నా టీఆర్ ఎస్ విజయశాతం తక్కువగా వుండడంతో వైయస్ ఖంగు తిన్నారు. టిఆర్ ఎస్ తో పొత్తు లేకున్నా ఎన్నికల్లో గెలవవచ్చు అనే ధీమా వచ్చాకే, ఆయన క్రమంగా కేసిఆర్ కు దూరంగా జరిగారు. వైయస్ వారసునిగా రంగ ప్రవేశం చేసిన జగన్ కూడా తెలంగాణ విషయంలో ఊగిసలాట ధోరణినే అనుసరించారు. ఆ పార్టీలో, నిన్నటి దాక ’నెంబర్ టూ’ గా కొనసాగిన కొండ సురేఖ పుట్టు తెలంగాణవాది. ఆమె కోసం జగన్ వర్గం పెట్టు తెలంగాణవాదులుగా మారిన సందర్భాలున్నాయి. సిపిఐ నారాయణ తెలంగాణకు కట్టుబడి వుండగా, చిరంజీవి ప్రజారాజ్యం కూడా  అటూ ఇటూ ఊగిసలాడింది. ఒక్క సిపియం మాత్రమే రాష్ట్ర విభజనకు దూరంగా వున్నట్టు సంకేతాలు పంపేది. అయితే, ఆ పార్టీ కూడా 2004, 2009 ఎన్నికల్లో టీఆర్ ఎస్ వున్న కూటమిలోనే కలిసే నడిచింది.

       మొదట్లో, సమైక్యవాదాన్ని గట్టిగా వినిపించిన చంద్రబాబు 2004 ఎన్నికల్లో  అధికారాన్ని ఘోరంగా కోల్పోయారు. దానితో ఆయన 2009 ఎన్నికల్లో దారి మార్చి, గులాబీ కండువా మెడలో వేసుకుని రెండు రాష్ట్రాల నినాదం చేశారు. వైయస్ కు జరిగిన అనుభవమే చంద్రబాబుకూ జరిగింది. ఆ ఎన్నికల్లోనూ టిడిపి విజయశాతంకన్నా, టిఆర్ ఎస్ విజయశాతం తక్కువ వచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో  టిడీపికి ఒక్క సీటు మాత్రమేరాగా టిఆర్ ఎస్ కు అసలు బోణీ కూడా కాలేదు. ఆ ఎన్నికల గణాంకాల్ని గమనిస్తే, టీఆర్ ఎస్ తో పొత్తు పెట్టుకోకుండా వుంటే, టిడిపియే అధికారంలోనికి వచ్చి వుండేదని తేలిగ్గానే అర్ధం అవుతుంది. మరోవైపు, కేసిఆర్ కూడా స్వంత పార్టీలోనే తీవ్ర విమర్శలకు గురయ్యారు.

       వైయస్ రాజశేఖర రెడ్డి హఠాన్మరణం తరువాత, రోశయ్య హయాంలో కెసిఆర్ చేపట్టిన నిరశన దీక్ష తెలంగాణ ఉద్యమానికి కొత్త ఊపునిచ్చింది. అది అప్పుడప్పుడు బలంగానూ, అప్పుడప్పుడు బలహీనంగాను కనిపించినా తన లక్ష్యం దిశగా సాగి గమ్యానికి చేరుకుంది. అందుకు దాన్ని అభినందించాలి. తెలంగాణ ఉద్యమంతో పోలిస్తే, సీమాంధ్రులు సాగించిన సమైక్యవాద ఉద్యమం నిర్మాణం, విస్తృతి, ఉధృతి పరంగానూ బలహీనమైనది. ప్రజలు తమ హక్కుల కోసం తాము ఉద్యమించకుండా ఒకరిద్దరు రాజకీయ నాయకుల్ని నమ్ముకుని నడిస్తే ఫలితాలు ఎలా వుంటాయో సీమాంధ్ర అనుభవం చాటిచెప్పింది.

       రాష్టంలోని రాజకీయ పార్టీలన్నీ  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు దఫదపాలుగా పచ్చజెండా ఊపాయన్నది వాస్తవం. ఇప్పుడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటి, యూపియే సమన్వయ కమిటీ, కూడా పచ్చజెండా ఊపడంతో, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఒక చిక్కుముడి విడిపోయింది. ఇక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం లాంఛనమే!

       గత అసెంబ్లీ ఎన్నికల తరువాత రాష్ట్రంలో ప్రభుత్వం పనిచేయడం మానేసింది. ప్రజా సంక్షేమం కాలగర్భంలో కలిసిపోయింది.  ఇకనైనా పరిస్థితి మెరుగు పడుతుందని ఆశిద్దాం. ఇప్పుడైనా అన్ని ప్రాంతాల్లోని వాస్తవ సమస్యలపై స్థానిక ప్రజలు దృష్టి పెట్టాల్సిన సందర్భం వచ్చింది.  

        హైదరాబాద్ మహనగరంతోవున్న ప్రగాఢ అనుబంధం కారణంగా దాన్ని వదులుకోవడం సీమాంధ్ర ప్రజలకు మనస్తాపంగానే వుంటుంది. దీన్నొక అనివార్య పరిణామంగానే స్వీకరించాలి. సీమాంధ్ర ప్రజలకు ద్రోహం చేసింది అరవైయేళ్ళుగా వాళ్లకు నాయకత్వం వహిస్తున్నవాళ్ళే అని గుర్తించాలి. రాష్ట్ర అభివృధ్ధిని మొత్తంగా హైదరాబాద్ లో కేంద్రీకరించడం తీవ్ర చారిత్రక తప్పిదం. ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి పరిస్థితి వస్తుందని గమనించకపోవడం నాయకత్వ లోపం. దీనికి ఒకర్నో ఇద్దర్నో నిందించడం సరికాదు.  అన్ని పార్టీలలోని అందరూ దీనికి బాధ్యులే.

       సీమాంధ్రలో కొత్త రాజధాని ఎక్కడ నిర్మించాలనేది ఇప్పుడు కొత్త చిక్కుముడి. రవాణా సౌకర్యం, నీళ్ల వసతి ప్రాతిపదికగా, కొత్త రాజధానికి స్థల ఎంపిక జరగాలి. ఇది అంత సులువైన వ్యవహారంకాదు. కేంద్రీకృత అభివృధ్ధి ఎప్పటికైనా ప్రమాదకరమని ఇప్పుడైనా గుర్తించాలి. పదేళ్ళ పాటు హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా వుంచాలనే కాంగ్రెస్ సూచన సీమాంధ్రలో కొందరికి కొంత మానసిక ఆనందాన్నివ్వొచ్చుగానీ, అదేమీ మహత్తరమైనదేమీకాదు. కొత్త రాజధాని నిర్మాణాన్ని పదేళ్ళు వాయిదా వేయడంతప్ప దానివల్ల ఒనగూడేదేమీ వుండదు. కొత్త రాజధాని నిర్మాణానికి  ఎన్ని లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ కావాలో ముందు దాన్ని రూపొందించుకోవాలి. దాన్ని తక్షణం కేంద్ర ప్రభుత్వం నుండి రాబట్టుకుని పనులు ప్రారంభించడంపై సీమాంధ్ర ప్రాంత ప్రజలు దృష్టిపెట్టాలి. 

       తెలంగాణేతర ఆంధ్రప్రదేశ్ ఇక ముందు కూడా అదే పేరుతో కొనసాగుతుందని కాంగ్రెస్ ప్రతినిధి దిగ్విజయ్ సింగ్ అంటున్నారు. ఈ విషయం మీద కూడా సీమాంధ్ర ప్రజలు ఆలోచన చేయాలి. సీమాంధ్రలో రాయలసీమ, తీరాంధ్ర ప్రాంతాలున్నాయి. వాళ్ల మధ్య భవిష్యత్తులో తగువు రాకుండా, రెండు ప్రాంతాలకూ ప్రాతినిధ్యం వహించేలా, కొత్త రాష్ట్రం పేరుండాలి. జమ్మూ అండ్ కాశ్మీర్ దీనికి ఒక ఉదాహరణ. ఆంధ్రప్రదేశ్ అనే పేరులో తెలంగాణకు ప్రాతినిధ్యం లేకపోవడం కూడా ప్రస్తుత ఆందోళనకు ఒకానొక కారణం అని మరిచిపోకూడదు. ’రాయలాంద్రా’ అనే పేరు బాగుంటుందేమో చర్చించాలి.

       సీమాంధ్ర నాయకులు ఇప్పటికీ ప్రజల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సోనియా గాంధీ తమ చెప్పుచేతల్లో వున్నట్లు వాళ్ళు ఇంతకాలం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చారు. వాళ్లకు టెన్ జన్ పథ్ లో వీసమెత్తు  విలువ కూడా లేదని యావత్ దేశం టెలివిజన్ ల సాక్షిగా చూసింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటి చేసిన తీర్మానం నచ్చకపోతే సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు ఢిల్లీలోనే ఆ పార్టికి రాజీనామాలు ఇచ్చిరావాలి.  మరీ ప్రగల్భాలు పలికినవాళ్ళు రాజకీయాల నుండే తప్పుకోవాలి. అంతేగానీ, రాష్ట్ర అసెంబ్లీలో తెలంగాణ తీర్మానాన్ని ఓడించండి అని పిలుపు ఇవ్వడం దేనికీ? ప్రజలు మరీ అంత పిచ్చివాళ్ళు అనుకుంటున్నారా వీళ్ళు?  అసెంబ్లీలో చేసే తీర్మానం ఒక లాంఛనమేతప్పా, అది కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చదని వీళ్లకు తెలీదా?

       పాత తప్పులు మళ్ళీ చేయరాదు. శాస్త్రీయ పధ్ధతుల్లో, సీమాంధ్ర పునర్ నిర్మాణం జరగాలి. అదే అందరికీ తక్షణ ఎజెండా కావాలి.

Danny Notes
31 July 2013

రాయలాంధ్రులు చారిత్రక కర్తవ్యాన్ని నిర్వహించడానికి కౌంట్ డౌన్ మొదలయ్యింది.

       రాయలాంధ్ర ప్రజల దగ్గర సమయం చాలా తక్కువగా వుంది. వాళ్ళు ఒక్క క్షణం ఆలస్యం చేసినా  భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వుంటుంది. తెలంగాణ ప్రకటించిన కాంగ్రెస్ ఏ క్షణాన్నయినా లోక్ సభ ఎన్నికలను ప్రకటించవచ్చు. తెలంగాణాలో, అత్యధిక లోక్ సభ స్థానాలను ఆ పార్టీ గెలుచుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. రాయలాంధ్రలో ఆ పార్టీకి తక్కువ స్థానాలు దక్కవచ్చు, అస్సలు దక్కకపోనూవచ్చు. అక్కడ అత్యధిక స్థానాలు గెలుచుకున్నవాళ్లతో, ఎన్నికలానంతర  పొత్తు కుదుర్చుకోవచ్చని ఆ పార్టీ ధీమాగా వుంది.

       ఎన్నికలు ప్రకటిస్తే, ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. అప్పుడు, కేంద్రంలో అధికారంలోవున్న పార్టికి బాధ్యతల నుండి తప్పించుకునే అవకాశం దక్కుతుంది. ఎన్నికల తరువాత అధికారం ఎవరికి వస్తుందో ఇప్పుడు చెప్పడం కష్టం. కొత్తగా అధికారంలోనికి వచ్చే పార్టి, ఇప్పుడు కాంగ్రెస్ చేసే వాగ్దానాలను అమలు చేయవచ్చు, చేయకపోనూవచ్చు. 

       అందువల్ల, తెలంగాణను ప్రకటించిన కాంగ్రెస్ పై  ఈ క్షణం నుండే, కొత్త రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధుల కేటాయింపు కోసం వత్తిడి పెంచాలి. దానికోసం, ఇన్నాళ్ళూ తెలంగాణ కోసం పొరాడిన శక్తులతోనూ ఐక్య సంఘటన కట్టవచ్చు. వాళ్ళు కలిసి వస్తారు కూడా.

       రాయలాంధ్ర ప్రజలు భావోద్వేగాల్లో మునిగిపోవాల్సిన సమయంకాదిది. వాళ్ళు కార్యసాధకులుగా వ్యవహరించాల్సిన సమయం ఇది. సమైక్యాంధ్రా వంటి అసాధ్యపు లక్ష్యాన్నీ సాధ్యం చేయాలనుకొని, కాంగ్రెస్ నో, తెలంగాణవాదుల్నో తిట్టడానికి  తమ శక్తియుక్తుల్ని, సమయాన్ని వృధా చేసుకుంటే, అది ఎన్నటికీ సరిదిద్దుకోలేని చారిత్రక తప్పిదమే అవుతుంది.

       హైదరాబాద్ వంటి నగరాన్ని నిర్మించగలమా? అని నిస్పృహతో నిట్టూరిస్తే ప్రయోజనం వుండదు. హైదరాబాద్ ను మించిన నగరాన్ని నిర్మించగలం అనుకుంటే మార్గం కనపడుతుంది. కొత్తగా హైదరాబాద్ వంటి నగరాన్ని నిర్మించడానికి దాదాపు ఐదు లక్షల కోట్ల రూపాయలు అవుతుందని కొందరు నిపుణులు అంచనా వేశారని తెలిసింది. ఇప్పుడు ఈ నిధుల కేటాయింపును సాధించడమే రాయలాంధ్రుల లక్ష్యంకావాలి. అదీ ఎన్నికల నోటిఫికేషన్ జారీకావడానికి ముందే జరగాలి.  ఎన్నికల నోటిఫికేషన్  కు కౌంట్ డౌన్ మొదలయ్యింది. తెలంగాణవాదులు, రాయలాంధ్రులు కలిసి ఒక చారిత్రక కర్తవ్యాన్ని నిర్వహించడానికి కూడా కౌంట్ డౌన్ మొదలయ్యింది.

Danny Notes
31 July 2013

సెట్లర్స్ కాదు; రాయలాంధ్రులు

రాయలసీమ, తీరాంధ్ర ప్రాంతాల్లో పుట్టి తెలంగాణ రాష్ట్రంలో స్థిరపడినవాళ్లను తీవ్రంగా వేధించే పిలుపు "సెట్లర్స్". వాళ్లను ప్రత్యేకంగా పేర్కోవాల్సిన సమయాల్లో, "రాయలాంధ్రులు" అని పిలవడం మంచిది. తెలంగాణ రాష్ట్రంలో సెట్లర్స్ పదాన్ని నిషేధించాలి. దళితులపై అత్యాచార నిరోధక చట్టం తరహాలో, రాయలాంధ్రుల పరిరక్షణ కోసం ఒక చట్టాన్ని రూపొందించాలి.


Danny Notes
31 July 2013

సెట్లర్స్

సెట్లర్ అంటే  ఇతరప్రాంతం నుండి వచ్చి స్థిరపడినవాడు అని నిఘంటువు అర్ధం. అందులో తప్పేమీలేదు. వ్యవహారిక అర్ధాలు అనేకం అవమానకరంగా వుంటాయి. బ్రిటీష్ వలస పాలకులు  19 వ శతాబ్దంలో,  127 భారత ఆదివాసి తెగల్ని నేర స్వభావంగల సమూహాలుగా పేర్కొని,  వాళ్ళ కదలికల్ని పర్యవేక్షించడానికి క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ తెచ్చి కొన్ని కాలనీలు నిర్మించారు. చీరాల సమీపాన స్టూవర్టుపురం, విజయవాడ సమీపాన తాడేపల్లి, కావలి సమీపాన బిట్రగుంట కాలనీలు ఇలా ఎర్పడ్డవే. ఆ కాలనీ వాసుల్ని స్థానికులు సెట్లర్స్ అంటారు. దేశానికి స్వాతంత్రం వచ్చాక  1952లో ఈ చట్టాన్ని అమానుషమైనదిగా భావించి రద్దు చేశారు. అయినా, వాళ్ళపై సెట్లర్స్ అనే ముద్ర పోలేదు.

Danny Notes
31 July 2013

       సాధ్యమైనంత త్వరగా, తెలంగాణ ఎర్పాటుకు పార్లమెంటు ఆమోదం పొంది, కాంగ్రెస్ ఎన్నికలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తెలంగాణ ప్రకటనతోపాటూ, పోలవరానికి జాతీయ హోదా కల్పిస్తామన్నట్టు, కొత్త రాజధాని ఏర్పాటుకు నిధులు కూడా ప్రకటించేస్తే ఒక పని అయిపోతుంది. పదేళ్ల ఉమ్మడి రాజధాని ప్రతిపాదనవల్ల రాయలాంధ్ర ప్రాంతానికి అదనంగా ఒనగూడేదేమీ వుండదు; ఒక చారిత్రక కర్తవ్యాన్ని పదేళ్ళు వాయిదా వేయడంతప్ప. ఎదో సామెత చెప్పినట్టు, ప్రస్తుతం కాంగ్రెస్ అభినేత్రికి "ముద్దొచ్చింది". ఇప్పుడే, రాయలాంధ్రులు కొత్త రాజధాని ప్యాకేజి సాధించుకోవాలి. దానికి త్రైపాక్షిక సహకారం కూడా వుంటుంది. పదేళ్ల తరువాత, ఆ ఆసక్తి ఎవరికీ వుండకపొవచ్చు. ఇప్పుడు రాయలాంధ్రాలో నిరసన ప్రదర్శనలు చేస్తున్న వాళ్ళు అటుగా దృష్టి మళ్ళిస్తే అర్ధవంతమైన ఫలితాలు వస్తాయి. కొత్త రాజధాని నగర నిర్మాణాన్ని ఇప్పుడు మొదలెడితేగానీ, పదేళ్ళకు పూర్తికాదు.

Danny Notes
31 July 2013
రాయలాంధ్ర ఆవేదన

రాయలాంధ్ర ఆవేదన, ఆక్రోశం అర్ధం అవుతున్నది.
గుండెను ఎవరో బలంకొద్దీ పిండుతున్నట్టుగా వుంది.
అర్ధం కానిది ఒక్కటే,
నా వాళ్ళకు జబ్బు అర్ధం అయింది, మందు అంతుపట్టడంలేదు.

Danny Notes
31 July 2013 

రాయలాంధ్ర వార్తల్లో సానుకూల అంశం

రాయలాంధ్ర నుండి వస్తున్న వార్తల్లో ఒక సానుకూల అంశం కనిపిస్తోంది. అక్కడ జరుగుతున్న ఆందోళనలో ఒక్క రాజకీయ పార్టీ కూడా లేదు. ప్రజల్ని కలవడానికి రాజకీయ పార్టీలు భయపడుతున్నాయి.



Danny Notes
31 July 2013

అసంతృప్తి సంతృప్తి

నేను రావాలనుకున్నవాళ్ల ద్వార తెలంగాణ రాలేదు. అదో అసంతృప్తి.
నేను రాకూడదనుకున్నవాళ్ళ ద్వార తెలంగాణ రాలేదు. అదో సంతృప్తి. 


No comments:

Post a Comment