Friday, 2 August 2013

New Andhra - New Beginning

నవ్యాంధ్రకు కొత్త ప్రస్తానం

ఏ. యం. ఖాన్ యజ్దానీ (డానీ)


       తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సాకారం అవుతుందని రాయలాంధ్రులు చాలామంది ఊహించి వుండరు. అందుకే వాళ్ళు కాంగ్రెస్ వర్కింగ్ కమిటి తీర్మానాన్ని చూసి తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. ఇలాంటి సందర్భాల్లో ఆగ్రహావేశాలు పెల్లుబకడం సహజం. ఇప్పుడు సీమాంధ్రలో జరుగుతున్నది అదే.

       ఒకరు అనుకున్నా అనుకోకపోయినా, చరిత్రలో జరగాల్సినవి జరక్క తప్పవు. గడిచి పోయిన కాలాన్ని వెనక్కు తీసుకురావడమూ కుదరదు. వై.యస్. రాజశేఖర రెడ్డి మరణం తరువాత, మరీ ముఖ్యంగా వై.యస్. జగన్ స్వంత పార్టీ పెట్టిన తరువాత, రాష్ట్రంలో జరిగిన రాజకీయ పరిణామాలన్నీ ఒక క్రమంలో సాగాయి. వీటిని నిశితంగా గమనించిన వారెవరికైనా, తెలంగాణ ఇస్తేనేగానీ, ఆంధ్రప్రదేశ్ లో,  2014 ఎన్నికలకు వెళ్లలేని పరిస్థితి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని చుట్టుముట్టిందని సులువుగానే అర్ధం అవుతుంది.

       కళ్ళముందు జరుగుతున్న రాజకీయ వాస్తవాలని సీమాంధ్రులు గమనించకుండా కళ్ళకు గంతలు కట్టింది వాళ్ల నాయకులే. సీమాంధ్ర నుండి, శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతిపార్టీ, అక్కడి ప్రజల్ని భ్రమల్లో వుంచింది. ఇందులో ప్రధానపాత్ర కాంగ్రెస్ పార్టీ సీమాంధ్ర విభాగానిది. ఢిల్లీ టెన్ జన్ పథ్ లో వీసమెత్తు విలువ లేనివాళ్ళు కూడా తెలంగాణను అడ్డుకుంటామని ప్రగల్భాలు పలికారు. ఇప్పుడు వాళ్లలో కొందరు "జీవితమే ఒక రాజీ" అని వేదాంతం వల్లిస్తుంటే, ఇప్పటికీ ప్రజల్ని భ్రమల్లో వుంచాలనుకుంటున్న మరికొందరు "తెలంగాణ ఏర్పాటును శాసనసభలో  అడ్డుకుంటాం అంటూ కొత్త పిట్ట కథలు చెపుతున్నారు.


       ప్రత్యక్షంగానో, పరోక్షంగానో తెలంగాణాకు సానుకూలంగా ఎప్పుడో ఒకప్పుడు మాట్లాడని పార్టి సీమాంధ్రలోలేదు. రోశయ్య హయాంలో, 2009 డిసెంబరు 7 న జరిగిన అఖిలపక్ష సమావేశం తెలంగాణకు అనుకూలంగా ఏకగ్రీవ తీర్మానం చేసిన విషయం తెలిసిందే. ఆయా పార్టీల అధికారిక తీర్మానాల్లో ఇప్పటికీ మార్పులేదు. ప్రస్తుతం మారిన పరిస్థితుల్లో, వైయస్సార్ సిపి శాసనసభ్యులతోపాటూ, సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాంగ్రెస్, టిడిపి శాసనసభ్యుల్లో కొందరు (లేదా, అందరూ), తెలంగాణ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయవచ్చు. దానివల్ల ఒనగూడే ప్రయోజనం ఏమీవుండదు. కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడంలో శాసనసభ తీర్మానం పాత్ర నామమాత్రమే. ఇక్కడి పరిస్థితిని రాష్ట్రపతికి తెలియపరచడానికి మాత్రమే అది పనికివస్తుంది. శాసనసభలో అంతకుమించిన అనూహ్య ఫలితాలను సాధిస్తామని ఎవరైనా అంటే, వాటిని  ఉత్తరకుమార ప్రగల్భాలు అనుకోవాలి! సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వడానికి ఆతృతను కనపరుస్తున్నారన్నది ఇక్కడ ముఖ్యం. తెలంగాణ ఏర్పాటు తీర్మానం ఒకవేళ శాసనసభలో వీగిపోయినా, సోనియా గాంధీ అభిమతానికి భిన్నంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నిర్ణయం తీసుకుంటారనుకోవడం రాజకీయ అమాయకత్వమే అవుతుంది!

     కాంగ్రెస్_ టీ‌ఆర్ ఎస్ విలీనం గురించి ఇరువైపుల నుండి ఇప్పుడు బలమైన సంకేతాలు వస్తున్నాయి. తెలంగాణాలో మొత్తం లేదా అత్యధిక  లోక్ సభ స్థానాలను  గెలుచుకోవచ్చని  కాంగ్రెస్ బలంగా నమ్ముతోంది.  రాయలాంధ్రలో ఆ పార్టీకి తక్కువ స్థానాలు దక్కవచ్చు, అస్సలు దక్కకపోనూవచ్చు. వాటి గురించి ఆలోచించే స్థితిలో ఆ పార్టి ఇప్పుడు లేదు. రాయలాంధ్రలో అత్యధిక స్థానాలు గెలుచుకున్నవాళ్లతో, ఎన్నికలానంతర  కూటమి కట్టుకోవచ్చని కాంగ్రెస్ ధీమాగా వుంది.


       తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పది అడుగుల రోడ్ మ్యాప్ ను కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రకటించేశారు. ఈ పది అడుగులు వేయడానికి సాధారణంగా ఓ పది నెలలు పడుతుందికానీ, కేంద్ర ప్రభుత్వం దీన్ని ఆరు నెలల లోపునే పూర్తి చేసేసే ఆతృతలో వుందని షిండే చెప్పకనే చెప్పారు. ఈ పది అడుగుల్లో పార్లమెంటు ఆమోదం అనే ఒకేఒక అడుగుతప్ప, మిగిలిన తొమ్మిది అడుగులు సోనియాగాంధీ కనుసన్నల్లో సాగేవే. తనవల్లనే తెలంగాణ వస్తున్నదని బీజేపి కూడా చెప్పుకుంటున్నది కనుక, ఆ పార్టి మద్దతిస్తే, ఇక పార్లమెంటు ఆమోదం అనే ఆ పదవ అడుగు కూడా కేవలం లాంఛనమే! వీటన్నింటి అర్ధం ఏమిటీ? తెలంగాణ ఆరు నెలల్లో అనివార్యంగా సాకారం అవుతుందని!

        షిండే మాటల్నిబట్టి, ఆరు నెలల తరువాత ఏ క్షణాన్నయినా సాధారణ ఎన్నికలు రావచ్చు. కాంగ్రెస్ ఆతృతను చూస్తుంటే ఆరు నెలలకన్నా ముందే తెలంగాణను ఏర్పాటు చేసి ఎన్నికలు ప్రకటించే అవకాశాలు లేకపోలేదు అనిపిస్తోంది. రాయలాంధ్ర ప్రజల దగ్గర ఇప్పుడు సమయం చాలా తక్కువగా వుంది. మనం ఒక్క క్షణం ఆలస్యం చేసినా  భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వుంటుంది.

       తెలంగాణ ఏర్పాటుతోపాటూ, పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలనీ,  హైదరాబాద్ ను ఓ పదేళ్ళు ఉమ్మడి రాజధానిగా వుంచాలనీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటి ఇప్పటికే ప్రకటించింది. పదేళ్ల తరువాత రాజధాని సంగతేంటో రాయలాంధ్రులు ఇప్పుడే తేల్చుకోవాలి. చండీఘడ్ తరహాలో ఆ పదేళ్లను అనంతంగా సాగదీసుకుంటూ వుండవచ్చని మళ్ళీ కొందరు తప్పుడు భరోసాలు ఇస్తున్నారు. ఇవి ప్రమాదకరం.

       కొత్త రాజధానిని నిర్మించడానికి చండీఘడ్ ను ఆదర్శంగా తీసుకోవాల్సిందే. అయితే, అస్థిత్వంలోవున్న రాజధానిని పంచుకోవడానికి చండీఘడ్ కూ, హైదరాబాద్ కూ పొలికే లేదు. తూర్పు పంజాబ్, హర్యాణ, హిమాచల్ ప్రదేశ్ ల సరిహద్దుల్ని కలుపుతూ  చండిఘడ్ నగరాన్ని కుత్రిమంగా నిర్మించారు. సీమాంధ్ర సరిహద్దుల నుండి హైదరాబాద్ దాదాపు రెండు వందల నుండి, రెండు వందల యాభై కిలో మీటర్ల దూరంలోవుంది. రైలు మార్గం అయితే ఇంకో వంద కిలో మీటర్లు ఎక్కువ. "మన" రాజధాని నగరానికి వెళ్ళడానికి "పొరుగు రాష్ట్రం" లో ఇంతటి వ్యయ, ప్రయాసలతో కూడిన ప్రయాణం చేయాల్సిరావడంలో వున్న సాధ్యాసాధ్యలను కూడా పరిగణనలోనికి తీసుకోవాలి.

       హైదరాబాద్ వంటి నగరాన్ని పునర్ నిర్మించగలమా? అని నిస్పృహతో నిట్టూరిస్తే ప్రయోజనం వుండదు. హైదరాబాద్ ను మించిన నగరాన్ని నిర్మించగలం అనుకుంటే మార్గం కనపడుతుంది. కొత్తగా హైదరాబాద్ వంటి నగరాన్ని నిర్మించడానికి దాదాపు ఐదు లక్షల కోట్ల రూపాయలు అవుతుందని కొందరు అంచనా వేస్తున్నారు. దాన్ని పరిశీలించాలి. కేంద్ర ప్రభుత్వ సాలీన బడ్జెట్ లో ఇది సుమారు ముడవ వంతు. హైదరాబాద్ వంటి  నగరారాల మౌళిక సదుపాయాల గురించి ప్రస్తావించే సమయంలో కొన్ని గణాంకాలను తప్పని సరిగా పరిగణనలోనికి తీసుకోవాలి. 600 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంగల భూమి, 30 వేల కిలో మీటర్ల రోడ్లు, ప్రతిరోజూ శతకోటి లీటర్ల (200 యంజీ/డి) తాగునీటి సరఫర, 5 వేల మెగావాట్ల విద్యుత్ స్తోమత అనేవి కీలకమైనవి. రాజధాని నగరం అంటే, ప్రభుత్వ విభాగాలన్నీ ఒకచోటే వుండితీరాలా? లేక వాటిని వికేంద్రీకరించి మూడు నాలుగు నగరాల్లో ఏర్పాటు చేయడం సాధ్యమేనా? వంటి అంశాల మీద కూడా విస్తృతంగా చర్చ జరగాలి.

       పదేళ్లలోపు కొత్త రాజధాని నిర్మాణం పూర్తికావాలంటే, దాని నిర్మాణం తెలంగాణ ఆవిర్భావం రోజునే మొదలవ్వాలి. కొత్త రాజధానిని నెలకొల్పడానికి అవసరమైన భవనాలు, రోడ్లు, ఇతర మౌళిక సదుపాయాల నిర్మాణానికి డిజైన్లు,  అంచనా వ్యయాలు సిధ్ధం చేయాలి. ఆ నిధుల్ని కేంద్ర ప్రభుత్వం నుండి రాబట్టుకోవాలి. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హొదా ఇవ్వడంతోపాటూ, కొత్త రాజధానికి నిధుల కేటాయింపు అంశం,  తెలంగాణ బిల్లుతోపాటే, పార్లమెంటులో ఆమోదం పోందేలా కేంద్ర ప్రభుత్వంపై అన్నిరకాల వత్తిళ్ళు తేవాలి. రాయలాంధ్రులు తమ పోరాటపటిమని ఆ దిశగా చూపించాలి. దానికోసం, అవసరమైతే, ఇన్నాళ్ళూ తెలంగాణ కోసం పొరాడిన శక్తులతోనూ ఐక్య సంఘటన కట్టడానికి అవకాశంవుంది.  వాళ్ళు కలిసి వస్తారు కూడా.

       పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి భవిష్యత్తులో, వివాదాలు రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సివుంది. అప్పటి వరకు తూర్పుగోదావరి జిల్లాలోవున్న భద్రాచలం రెవెన్యూ డివిజన్ ను పరిపాలన సౌకర్యం కోసం  1959లో ఖమ్మంజిల్లాలో కలిపారు. భద్రాచలం, మణుగూరు, వెంకటాపురం తాలూకాలతో కూడిన భద్రాచలం డివిజన్ను తిరిగి తూర్పుగోదావరి జిల్లాలో కలపాలి. సరిగ్గా ఈ రెవెన్యూ డివిజన్ లోనే, కూనవరం వద్ద శబరినది గోదావరిలో కలుస్తుంది. దిగువ గోదావరి నదిలోనికి నీరు వచ్చేది ప్రధానంగా శబరి నది ద్వారానే. తెలంగాణవాదులు కోరుకుంటున్నది  1956కన్నా ముందున్న తెలంగాణ కనుక భద్రాచలం రెవెన్యూడివిజన్ ను తిరిగి ఇవ్వడానికి వాళ్లకూ అభ్యంతరం వుండదు. 

       సుశీల్ కుమార్ షిండే ప్రకటించిన పది మెట్లలో భాగంగా, ఒక నెల రోజులు లోపునే కేంద్ర మంత్రివర్గ ఉపసంఘం రాష్ట్రానికి వస్తుంది. రాష్ట్ర విభజన విధివిధానాలపై రాష్ట్రపతికి నివేదించేది ఈ కమిటీయే. ఆ కమిటీ రాష్టానికి రాకముందే రాయలాంధ్రులు (సీమాంధ్రులు) సమిష్టిగా కొత్తరాజధాని ప్రతిపాదనలతో సిధ్ధం కావాలి. కొత్త రాజధానిని ఎంపిక చేయడం, దాని మీద ఏకాభిప్రాయం సాధించడం అంత సులభమైన వ్యవహారంకాదు. చర్చోపచర్చలకు, ఖండనమండనలకు ఇప్పుడు సమయం నెల రోజులు కూడా లేదు. కౌంట్ డౌన్ మొదలయ్యిపోయింది. ఈరోజే, ఇప్పుడే!

       వివేకాన్ని ప్రదర్శించాల్సిన చారిత్రక సమయంలో భావోద్వేగాలకు లోనయ్యి సమయాన్ని వృధాచేస్తే, తెలంగాణ ఎలాగూ ఆగదు. మన రాజధాని నిర్మాణమూ జరగదు. అదే జరిగితే, భావితరాలు మనల్ని ఎన్నటికీ క్షమించవు.

(రచయిత ఆంధ్ర జర్నలిస్టుల ఫోరం కన్వీనర్)
హైదరాబాద్
 2 ఆగస్టు  2013

ప్రచురణ : ఆంధ్రజ్యోతి దినపత్రిక
                     3 ఆగస్టు 2013


No comments:

Post a Comment