దౌర్జన్యమేతప్ప దౌత్యనీతి ఎక్కడా?
ఏ. యం. ఖాన్ యజ్దానీ (డానీ)
అటు
సీమాంధ్రులు, ఇటు తెలంగాణులు దౌత్యనీతిని పూర్తిగా మరిచిపోయారు.
భిన్నాభిప్రాయాన్ని స్వీకరించే విషయం అటుంచి, వినడానికి కూడా ఎవ్వరూ
సిధ్ధపడడంలేదు. కనీసం, భిన్నాభిప్రాయాన్ని చెప్పుకోవడానికి చేసే ప్రయత్నాల్ని కూడా
సహించడంలేదు. సీమాంధ్రప్రాంతంలో, వసంత నాగేశ్వరరావు, కత్తి పద్మారావు తదితరులు
పెట్టిన ‘జై ఆంధ్రా’ సభలపై దాడులు చేశారు. హైదరాబాద్
లో పరకాల ప్రభాకర్ తదితరులు పెట్టిన
సమైక్యాంధ్రా సభల్ని భగ్నం చేశారు.
కలసి కాపురం చేయలేనపుడు, విడిపోవడం ఒక్కటే
పరిష్కారం. అంతవరకు నిజమేగానీ, ఆ విడిపోవడం ఘర్షణాత్మకంగా మాత్రమే
ఎందుకుండాలీ? సామరస్యపూర్వకంగా ఎందుకు
ఉండకూడదూ? ఆ పని చేయడానికి ఫక్తు
రాజకీయులు పనికిరారు. ఆలోచనాపరులు,
దౌత్యవేత్తలుకావాలి.
ప్రస్తుత
తెలంగాణ పోరాటంలో అనేక శ్రేణులు అనేక స్థాయిల్లో పనిచేశాయి. పైకి, కేసిఆర్
ప్రముఖంగా కనిపిస్తున్నా, ఆయనకు భిన్నంగా,
పోటీగా, వ్యతిరేకంగా అనేక వందల సంఘాలు ఆవిర్భవించాయి. . అనేక సంఘాలు కేసిఆర్ ను
పక్కన పెట్టిన సందర్భాలున్నాయి. కేసిఆర్ ను ఆయన సమక్షంలోనే తీవ్రంగా విమర్శించిన
సంఘటలున్నాయి. నిజానికి, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణాను ప్రకటించే సమయానికి
కేసిఆర్ వెలుగులో ఏమీలేరు. రక్షణాత్మకంగా ముఖం చాటేసివున్నారు. మొత్తమ్మీద
తెలంగాణవాదులది బృందక్రీడ.
సీమాంధ్ర ఉద్యమం అందుకు భిన్నంగా సాగింది.
అందులో శ్రేణులులేవు. వెనుక ప్రజలు, వాళ్ల ముందు ఒకళ్ళిద్దరు నాయకులు అంతే. ఆ
నాయకులు కూడా పూర్తికాలం ఉద్యమకారులుకాదు. వాళ్లకు వాళ్ళ వాణిజ్య వ్యాపకాలు చాలావున్నాయి. ఉద్యమంలో వాళ్ళది
అతిథిపాత్ర. ఆ అతిథిపాత్ర కూడా గంభీరమైనదేమీకాదు. కేతిగాడిపాత్ర. ఈ కేతిగాళ్ళు మేధోవర్గాన్ని, ఆలోచనాపరుల్ని
ఉద్యమానికి దూరంగాపెట్టి సీమాంధ్రలో భావసంచయనం అనేదే లేకుండా చేసేశారు. దానితో
ఉద్యమానికి రెండురకాల భారీ నష్టం
జరిగింది. మొదటిది, ఉద్యమంలో భిన్నశ్రేణులు ఏర్పడానికి ఆస్కారం లేకుండాపోయింది.
రెండోది, అంతకన్నా తీవ్రమైనది. ఉద్యమం మీద ప్రాయోజిత కార్యక్రమం అనే నిందపడింది.
దానితో, సమైక్యాంధ్రా ఉద్యమం ఆమోదాంశం దెబ్బతిన్నది. ఒక్కమాటలో చెప్పాలంటే సీమాంధ్ర నాయకత్వం ఉద్యమాన్ని వ్యక్తిగత క్రీడగానూ,
ప్రజల్ని ప్రేక్షకులుగానూ మార్చేసింది.
ఉద్యమకారులకు
ఆత్మవిశ్వాసం వుండాలిగానీ, అతివిశ్వాసం వుండకూడదు. తెలంగాణవాదులు ఓటమి భయంతో అతిజాగ్రత్తగా
అడుగులువేశారు. సీమాంధ్రులు విజయం తమ గుప్పిట్లోనే ఉన్నట్టు అతి విశ్వాసంతో
మిన్నకుండిపోయారు.
నిజాయితీలోనూ,
సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులది ప్రశంసనీయమైన చరిత్ర ఏమీకాదు. ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించడంలో
జాప్యం చేస్తున్నందుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామాలు ఇచ్చినవాళ్ళు
తెలంగాణాలో కనిపిస్తారు. రాష్ట్రాన్ని విభజించేదిలేదని స్పష్టంగా ప్రకటించడంలో
జాప్యం చేస్తున్నందుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా
చేసినవాళ్ళు ఒక్కరంటే ఒక్కరూ సీమాంధ్రలో కనిపించరు.
సీమాంధ్ర
నాయకులు ఆడిన వికృత రాజకీయ క్రీడలో, సామాన్యజనం దయనీయంగా మోసపోయారు. రాష్ట్ర
రాజధాని మాత్రమేగాక, దక్షణ భారతదేశంలోనే అతిపెద్ద నగరం కావడాన సహజంగానే,
తెలంగాణవాళ్లతోపాటూ, సీమాంధ్రులకు కూడా హైదరాబాద్ ఉపాధి గమ్యంగా వుంటున్నది. తెలంగాణ విడిపోతే ఉపాధికల్పన సమస్యను ఎలా
పరిష్కరించాలనే కనీసపు ఆలోచనను కూడా ఏ నాయకుడూ చేయలేదు. దాదాపు ఒక దశాబ్ద కాలాన్ని అంత నిర్లక్ష్యంగా వృధా
చేయించినవాళ్లకు ఎన్ని ఉరిశిక్షలు వేసినా తక్కువే! (ఈ వ్యాసకర్త ఉరి శిక్షలకు వ్యతిరేకి). విజయవాడలో సామ్యవాద
భావాలుగల సీనియర్ న్యాయవాది కర్నాటి రామ్మోహనరావు వంటివాళ్ళు తెలంగాణ_సీమాంధ్ర
ఉద్యమాలకు కొన్ని ప్రత్యామ్నాయాలు ప్రతిపాదించడానికి చేసిన ప్రయత్నాలని సమైక్యవాద
కార్యకర్తలుగా తీవ్రంగా ప్రతిఘటించారు. దానితో అక్కడ భావసంచయనానికి తెరపడిపోయింది.
కాంగ్రెస్
వర్కింగ్ కమిటీ తెలంగాణ ప్రక్రియకు పచ్చజెండా ఊపిన తరువాత, సీమాంధ్రలో ఉవ్వెత్తున
లేచిన నిరసన అచ్చమైన ప్రజాఉద్యమం. నిన్నతీదాక నాయకులుగా డాంబికాలు పోయినవాళ్ళు
ఇప్పుడు ప్రజల ధాటికి ఢిల్లీపారిపోయి పలాయన జీవితం గడుపుతున్నారు.
ఇప్పుడైతే,
రౌడిజానికి పుట్టినిల్లని ఎద్దేవగా చెప్పుకుంటున్నారుగానీ, గతంలో విజయవాడ ఒక
చైతన్యపురి. ఆంధ్రప్రదేశ్ రాజకీయ రాజధాని హైదరాబాద్ అయితే, సాంస్కృతిక రాజధాని
విజయవాడ అని చాలాకాలం చెప్పుకునేవారు. జాతీయ రాజకీయాలకు సహితం మార్గదర్శకులుగా
నిలిచిన భోగరాజు పట్టాభిసీతారామయ్య, చండ్ర రాజేశ్వరరావు, కొండపల్లి సీతారామయ్య,
యన్టీ రామారావు, పుచ్చలపల్లి సుందరయ్యల కార్యక్షేత్రం విజయవాడ. ముందు విజయవాడ
ఆలోచిస్తుంది తరువాత రాష్ట్రం ఆలోచిస్తుంది అనేది అప్పటి మాట! ఇప్పుడు విజయవాడ
ముందుగా కాదుకదా చివర్న కూడా ఆలోచించడంలేదు.
తెలంగాణ రైతాంగ సాయుధపొరాటానికి ఆలోచన, ఆయుధ, ఆర్ధిక సంపత్తిని అందించిన
విజయవాద 65 యేళ్ల
తరువాత, తెలంగాణ ధాటికి తల్లడిల్లిపోవడం నాయకత్వలోపం కాకపొతే మరేమిటీ? దేశానికే జాతీయ జెండాను అందించామని గర్వంగా
చెప్పుకునే ప్రాంతం, ఏ జెండా వెనుక వెళ్ళాలో నిర్ణయించుకోలేని స్థితికి చేరుకోవడం విషాదంకాక మరేమిటీ?
ప్రజారాజకీయాలని కార్పొరేట్ రాజకీయాలు, అల్లరి మూకల రాజకీయాలు మింగేసిన ఫలితం ఇది.
సామ్యవాదభావాలకేకాదు
విజయవాడ దౌత్యసంబంధాలకు కూడా మహత్తర చరిత్రవుంది. ఇప్పటికి సరిగ్గా వందేళ్లక్రితం ఆంధ్రమహాసభ
పుట్టింది. అది పుట్టిన పుష్కరకాలంలోనే ఆంధ్రుల మధ్య లుకలుకలు మొదలయ్యాయి. 1926 లో వచ్చిన ఆంధ్రా విశవ్విద్యాలయాన్ని
విశాఖపట్నంలో నిర్మించడంతో తీరాంధ్రుల మీద రాయలసీమవాసుల్లో అనుమానాలు పొడచూపాయి.
దానితో వాళ్ళు అంధ్రమహాసభకు దూరమయ్యారు. "దక్షణజిల్లాల (తమిళనాడు) వారి
ఆధిపత్యము వలన నిన్నటి దినముల వరకూ అనుభవించిన బాధను మరువలేము. ఇక నిప్పుడు
ఉత్తరజిల్లాల (తీరాంధ్ర) వారి ప్రాబల్యమును రుచి చూచుచున్నాము" అని కడప కోటిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఒక బహిరంగ సభ
అభిప్రాయపడింది. ‘సాధన’ పత్రిక సంపాదకులు పప్పూరి రామాచార్యులు మరో అడుగు ముందుకేశారు.
"చెన్నరాజధాని నుండి ఆంధ్ర రాష్ట్రము విడివడుట లాభకరమైనచో, ఆంధ్ర రాష్ట్రము
నుండి రాయలసీమ విడిపోవుట మరింత లాభము కదా?" అని ప్రశ్నించారు.
రాయలసీమ
నాయకులను ఆంధ్రా జాతీయ స్రవంతి లోనికి తీసుకురావడానికి తీరాంధ్ర నాయకులు సత్సంబంధాలను
కొనసాగించారు. 1937 అక్టోబరు నెలలో కడప కోటిరెడ్డి, పప్పూరి రామాచార్యుల్ని ఆహ్వానించి, విజయవాడ
నగర వీధుల్లో ఏనుగు అంబారీలపై ఊరేగించి సన్మానించారు. దానితో, శాంతించిన రాయలసీమ
నాయకులు, కొన్ని షరతులతో, తీరాంధ్రప్రాంతంతో, రాయలసీమను కలపడానికి అంగీకరించారు.
దానికి అనుగుణంగానే, 1937 నవంబరు 16న, దేశోధ్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు మదరాసు నివాసం శ్రీభాగ్ లో
ఇరుప్రాంతాల పెద్దమనుషులు ఒక ఒప్పందం చేసుకున్నారు. ఒక పత్రికాధిపతి ఇంట్లో
చేసుకున్న ఈ ఒప్పందానికి చట్టబధ్ధత, రాజ్యాంగ ప్రతిపత్తి వంటివి ఏమీలేవు. అయినప్పటికీ
పెద్దమనుషుల ఒప్పందానికి ఇప్పటికీ రాజ్యాంగానికి మించిన విలువ వుంది.
సరిగ్గా
ఇలాంటి సంఘటనే, మరొకటి ఆంధ్రా_తెలంగాణ విలీనం
సందర్భంగా జరిగింది. విలీనాన్ని వ్యతిరేకించిన ప్రముఖుల్లో కేవీ రంగారెడ్డి
ముఖ్యులు. అనేక దౌత్యప్రక్రియల తరువాత వారు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు ఒప్పుకున్నారు.
కేవీ రంగారెడ్డి దెభ్భయ్యవ పుట్టిన రోజుని 1960లో
నాటి పెద్ద మనుషులు విజయవాడలో ఘనంగా నిర్వహించారు. విజయవాడ ప్రముఖులు అయ్యదేవర కాళేశ్వరరావు అప్పట్లో
రాష్ట్ర శాసనసభ స్పీకరుగా వున్నారు.
ఈసారికూడా,
దౌత్యసంబంధాలను పాటించివుంటే పరిస్థితి ఇంత తీవ్రంగా మారేదికాదు. నిజానికి అలాంటి
అవకాశం విజయవాడకు పుష్కలంగా వుండింది. వరంగల్లుకు చెందిన ప్రముఖ పౌరహక్కుల నేత డాక్టర్ రామనాధం
1985లో
హత్యకు గురైన తరువాత తీవ్రవాద
వామపక్ష ప్రముఖులు, పౌరహక్కుల నాయకులు అనేకులు విజయవాడకు వలసవచ్చారు. నిర్భంధం
కారణంగా కొందరు, ఉపాధి కారణంగా మరి కొందరు విజయవాడలో చాలా కాలం వున్నారు. తెలంగాణ
ఉద్యమానికి మేధోసంపత్తిని అందించిన
బాలగోపాల్, వరవరరావు మొదలుకుని అల్లం నారాయణ, కే. శ్రీనివాస్, బీయస్ రాములు,
యన్ వేణుగోపాల్, కెయన్ చారి వరకు అందరూ ఎంతో కొంతకాలం విజయవాడలో నివాసం
వున్నవాళ్ళే. విజయవాడలో అనేక మందితో వాళ్లకు ఆత్మీయ అనుబంధాలున్నాయి. కానీ దౌత్య
సంబంధాలు కొనసాగించడానికి మనకు ఇప్పుడు కాశీనాధుని నాగేశ్వర రావు పంతులూలేరు.
అయ్యదేవర కాళేశ్వర రావూ లేరు!!.
అభిప్రాయ
సేకరణ, దౌత్యప్రక్రియలో కాంగ్రెస్ ది ‘ఎదురుమతం’. అత్యంత కీలక అంశాల్లోనూ,
ముందుగా చేయాల్సిన ప్రక్రియల్ని వెనుకా,
వెనుక చేయాల్సిన ప్రక్రియల్ని ముందూ చేస్తుంది ఆ పార్టీ. కేంద్ర హోంమంత్రి హోదాలో చిదంబరం 2009 డిసెంబరు 9న తెలంగాణ ప్రక్రియ ఆరంభమయిందని ప్రకటించాక, ఆ అంశంపై
శ్రీకృష్ణకమిటీ వేశారు. నిజానికి ముందు కమిటీ వేసి, ఆ కమిటీ సిఫార్సులపై కేంద్ర
ప్రభుత్వం ఒక ప్రకటనచేయాలి. ఈసారి కూడా
అంతే. కూటమి రాజకీయాల్లో ముందుగా సభ్యపార్టీలు తీర్మానాలు చేయాలి. ఆ తరువాత కూటమి
సమన్వయ కమిటి ఒక నిర్ణయాన్ని ప్రకటించాలి. ఇది తలకిందులుగా జరిగింది. ముందు యూపీయే
కోఆర్డినేషన్ కమిటీ తెలంగాణ ఇవ్వాలని నిర్ణయించిన తరువాత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ
ఆ అంశాన్ని ఆమోదించింది. ఈ ప్రహసనం
అంతటితో ఆగలేదు, యూపీయే కో_ఆర్డినేషన్ కమిటీ
తీర్మానాన్ని కేంద్ర మంత్రివర్గానికి పంపించాల్సిన సమయంలో, ఏపీలోని
మూడుప్రాంతాల ప్రజల మనోభావాలు,
భయాందోళనలు, సూచనలు తెలుసుకోడానికి ఏకే ఆంథోని నాయకత్వాన నలుగురు సభ్యుల కమిటీని కాంగ్రెస్ పంపడం కొత్త విచిత్రం. ఆంటోనీ కమిటీకి హైలెవల్
అనే పదాడంబరాన్ని పక్కనపెడితే, అది కూడా శ్రీకృష్ణకమిటీలా అరడజను ఆప్షన్లే
ఇస్తుందో డజను ఆప్షన్లు ఇస్తుందో చెప్పడం కష్టం. అప్పుడు కథ మళ్ళీ మొదటికి
వస్తుంది.
రాష్ట్ర విభజన సమస్య కమిటీలతో తేలేదికాదు. మూడు ప్రాంతాల మధ్య
సంభాషణ మొదలుకావాలి. అది ఆలోచనాపరులతో
మొదలయితే ఇంకా మంచిది. ప్రధాన కోర్కెలు, అనుబంధ కోర్కెల జాబితా తయారుకావాలి.
విడిపోవడంవల్ల వివిధరంగాలలో కొత్తగా వచ్చే సమస్యలకు పరిష్కారాలు కనుగొనాలి. వాటి
నిర్వహణ, నియంత్రణకు ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. ఆంధ్రరాష్ట్రం
ఏర్పడుతున్నప్పుడు బళ్ళారి, దావణగిరె
జిల్లాలను రాయలసీమ వదులుకొగా, గంజాం, గజపతి జిల్లాల్ని సర్కారు ప్రాంతం వదులుకుంది. అలాంటి పట్టువిడిపులు ఇప్పుడూ
వుండాలి. బిగిసిన పిడికిళ్లతో కరచాలనం సాధ్యంకాదు. ఇరువర్గాలు చేతులు తెరిస్తే
కరచాలనం. చేతులు చాస్తే ఆలింగనం.
(రచయిత ఆంధ్రా జర్నలిస్టుల ఫోరం కన్వీనర్)
మొబైల్ : 90102 34336
హైదరాబాద్
9 ఆగస్టు
2013
ప్రచురణ : సూర్య దినపత్రిక,
11 ఆగస్టు 2013
No comments:
Post a Comment