Saturday 31 May 2014

Jaiandhra to Samaikyaandhra

జై ఆంధ్రా  జై సమైక్యాంధ్రాగా ఎలా మారిందీ?  
డానీ
"చారిత్రక సంధి సమయంలో ఆంధ్రజాతిని మేల్కొలిపి, కర్తవ్యాన్ని బోధించడానికి వచ్చిన అశేష ప్రజానీకానికి వందనాలు" అని మొదలెట్టే గౌతు లచ్చన్న ఉపన్యాసాల్నీ ఆ తరం ఇప్పటికీ మరిచిపోదు. 1972-73  నాటి జై‌ ఆంధ్రా ఉద్యమాన్ని గౌతు లచ్చన్న, కాకాని వెంకట రత్నం, తెన్నేటి విశ్వనాధం, బీవి సుబ్బారెడ్డి  వంటి సీనియర్లు ముందుండి నడిపించగా, యం. వెంకయ్య నాయుడు, వసంత నాగేశ్వరరావు వంటి రెండవతరం నాయకులు దానికి జవసత్వాల నిచ్చారు. కృష్ణా, గోదావరి నదుల్లా గలగల పారే సుంకర సత్యనారాయణ ఉపన్యాసాలు వినడానికి జనం తెగ ఆసక్తి కనపరిచేవారు. సుంకర ఉపన్యాసానికి కొనసాగింపే వెంకయ్యనాయుడు ఉపన్యాస శైలి.

తెలంగాణ విద్యార్ధులు 1969లో ముల్కీ హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమాన్ని సాగించారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాసు బ్రహ్మానంద రెడ్డి అప్పట్లో ముఖ్యమంత్రిగా వున్నారు. ఆ తరువాత, బ్రహ్మానంద రెడ్డి దిగిపోయి పివీ నరసింహారావు ముఖ్యమంత్రి అయ్యారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన నాయకుడు ముఖ్యమంత్రి కావడం అదే మొదటిసారి. ఉన్నత న్యాయస్థానం 1972లో ముల్కీ నిబంధనల్ని సమర్ధించడంతో ఆంధ్రా విశ్వవిద్యాలయం విద్యార్ధులు ఆందోళనకు దిగారు. మరోవైపు, భూసంస్కరణల చట్టం తేవడానికి  పీవీ ప్రభుత్వం చేసిన ప్రయత్నాల మీద ఆంధ్రా (ఇప్పటి సీమాంధ్ర) ప్రాంతంలో తీవ్ర  నిరసన చెలరేగింది. రెండూ కలిసి, సీమాంధ్ర అంతటా ఉద్యమ జ్వాలలు రగులుకున్నాయి. తమదైన స్వంత రాష్ట్ర ఏర్పాటు కోసం ఆంధ్రుల భావోద్వేగాలు రెండవసారి చెలరేగిన కాలం అది.  అంతకు ముందు 1950వ దశకం ఆరంభంలో ప్రత్యేక రాష్ట్రం కోసం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో సాగిన ఉద్యమం ఎలాగూ వుంది.

భావోద్వేగాలను పట్టుకోవడంలో లచ్చనగారిది ప్రత్యేక శైలి. నాయకుడు, ఉపన్యాసకుడు ఏకమైపోయిన అదుదైన సందర్భం అది. జై ఆంధ్ర ఉద్యమానికి అసలు సిసలు సూత్రధారి మాత్రం కాకాని వెంకటరత్నం. ఉద్యమం వుధృతంగా సాగుతున్నప్పుడు, పోలీసు కాల్పుల్లో ఎనిమిది మంది చనిపోయారు. ఆ వార్త విన్న  కాకాని గుండె‌ ఆగి చనిపోయారు. అప్పుడాయన వ్యవసాయ, ఆరోగ్య శాఖల మంత్రిగా వున్నారు. కాకాని అంత్యక్రియలకు ఉయ్యూరు వెళ్లడానికి అప్పటి ముఖ్యమంత్రి పివీ నరసింహారావు సాహసించలేకపోయారు. పరకాల శేషావతారం, పాలడుగు వెంకటరావు తదితరులు పీవీకి తోడుగా సమైక్యవాదులుగా వున్నప్పటికీ, జైఆంధ్రా ఉద్యమానికి మద్దతుగా తొమ్మిది మంది మంత్రులు రాజీనామా చేయడంతో రాజకీయ సంక్షోభం నెలకొంది.  ముఖ్యమంత్రి ఒక మంత్రి అంత్యక్రియలకు కూడా వెళ్లలేని పరిస్థితి వుందంటే ప్రభుత్వాన్ని రద్దు చేయక తప్పదని అప్పటి రాష్ట్రపతి వివి గిరి భావించారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రాష్ట్రపతి పాలన సాగిన  తొలి సందర్భం అది.

       జైఆంధ్రా ఉద్యమంలో కొంతకాలం చురుగ్గా పనిచేసిన ఆంధ్రా నిరుద్యోగుల సంఘానికి ఈ వ్యాసకర్త కార్యదర్శి. దానికి అధ్యక్షుడు అమ్మనమంచి కృష్ణశాస్త్రి.

ఇక వర్తమానానికి వస్తే, 2009 ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత సాక్షాత్తు తెలంగాణ భవన్ లోనే కేసిఆర్ అనేక విమర్శల్ని ఎదుర్కొన్నారు. అనేక పరాభవాల్ని చవిచూశారు. దాదాపు ఆరు నెలల అవమాన పర్వం తరువాత ఆయన చేపట్టిన నిరాహారదీక్ష పరిస్థితుల్ని తలకిందులుచేసి, టీఆర్‌ఎస్ ను మళ్ళీ వెలుగులోనికి తెచ్చింది.  యూపియే ప్రభుత్వ హోం  మంత్రి చిదంబరం ఆ ఏడాది డిసెంబరు  రాత్రి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఆరంభిస్తున్నామని  ప్రకటించడంతో ఆంధ్రప్రదేశ్ విభజన పర్వం మొదలైంది.

                          చిదంబరం ప్రకటనపై రాయలసీమ - తీరాంధ్ర ప్రాంతం నుండి స్పందించిన తొలి రాజకీయ ప్రముఖుడు వసంత నాగేశ్వరరావు. అప్పట్లో ఆబ్కాబ్ ఛైర్మన్‌గావున్న ఆయన ఆ మరునాడు ఉదయమే తన పదవికి రాజీనామా చేసి, మళ్ళీ "జైఆంధ్ర" ఉద్యమాన్ని మొదలెడతానని ప్రకటించారు. ఆ వెంటనే చేగోండి హరిరామ జోగయ్య (హరిబాబు) కూడా "జైఆంధ్ర" అన్నారు.

        జై ఆంధ్ర ఉద్యమంతో వున్నఅనుబంధం రీత్యా వసంత నాగేశ్వరరావు ప్రకటన వెలువడిన సాయంత్రమే మాదాపూర్ లోని ఇంటిలో ఆయన్ని కలిశాను. విభజన ప్రక్రియ విధివిధానాలు ఎలా వుండాలి?  తెలంగాణ ఇచ్చేసిన తరువాత రాయలసీమ, తీరాంధ్ర ప్రజల హక్కులకు రక్షణ ఏమిటీ? అనేవి ఆ రోజు మమ్మల్ని వెంటాడిన ప్రశ్నలు. సీమాంధ్రుల హక్కుల సాధన కోసం విజయవాడ వెళ్ళి మళ్ళీ జైఆంధ్ర ఉద్యమాన్ని మొదలెడదామనుకున్నాము. ఆ రోజు రాత్రే బయలుదేరి విజయవాడ వెళ్ళాము.

                         విజయవాడ చేరుకున్న తరువాత సన్నివేశం మారింది. విజయవాడ కాంగ్రెస్ ఎంపి లగడపాటి రాజగోపాల్ రాజీనామా చేశారని ఢిల్లీ నుండి  వార్త వచ్చింది. ఆయన కూడా "జై ఆంధ్రా" అంటారనే వుద్దేశ్యంతో నేను మొగల్రాజపురంలోని రాజగోపాల్ క్యాంపు ఆఫీసుకు వెళ్ళాను. అప్పటికి ఆయన ఢిల్లీ నుండి విజయవాడకు చేరుకోలేదు. ఎంపీ క్యాంపు ఆఫీసులో అప్పటి కార్యదర్శి రామచంద్రరావు (నాని) అంతకు మునుపు ఆంధ్రజ్యోతిలో నాకు సహోద్యోగి.  రాజగోపాల్ ది జైఆంధ్రబాటకాదనీసమైక్యాంధ్ర బాట అని నానీ చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయా. "వాళ్ళే విడిపోదాం అంటున్నప్పుడు మనమూ విడిపోతాం అనడంవల్ల వచ్చే ప్రయోజనం ఏమిటీ? మనం సమైక్యంగా వుంటామన్నప్పుడేకదా మన డిమాండ్లు నెరవేరేవీ" అని రాజగోపాల్ ఆలోచిస్తున్నట్టు నానీ అన్నాడు.

                          తెలంగాణ వుద్యమంలో ప్రస్తుత దశ   కాళోజీ నాయకత్వాన 1997 డిసెంబరులో జరిగిన వరంగల్ ప్రకటన తో మొదలైనప్పటికీ అప్పటి వరకు "సమైక్యాంధ్ర" అనేమాట ఎక్కడా ఎవరినోటా రాలేదు. ఎవరూ వినలేదు. అలాంటి అవగాహన కూడా ఎవరికీ వున్నట్టు కనిపించలేదు. రాష్ట్ర విభజన ప్రకటన వచ్చాక రాయలసీమ, తీరాంధ్ర హక్కుల సాధన, పరిరక్షణల కోసం ఒక ఉద్యమం ఆరంభం కావలసిన చారిత్రక సందర్భంలో, సమైక్యాంధ్ర నినాదాన్ని ముందుకు తేవడం అంటే సమస్యను పక్కదారిపట్టించడంతప్ప మరేమీకాదు.


                          రాజకీయ సంఘటన కుదరకపోయినా ఆలోచనాపరులైన పాత్రికేయుల సంఘటన అయినా  కుదురుతుందనే అభిప్రాయంతో  విజయవాడ ప్రెస్ క్లబ్ కు వెళ్ళాను. పాతమిత్రులు చావ రవి, అన్నవరపు బ్రహ్మయ్య కలిశారు. నేనూ బ్రహ్మయ్య వెంటనే పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటుచేసి, రాయలసీమ -తీరాంధ్ర  హక్కుల పరిరక్షణ గురించి మాట్లాడాము. ఆ హక్కుల సాధన కోసం ఆంధ్రా జర్నలిస్టుల ఫోరం ఒకదాన్ని ఏర్పాటు చేద్దామనుకున్నాము. దానితో కొంచెం అగ్గిరాజుకున్నట్టు కనిపించింది. అదేరోజు రాత్రి ఏబిఏన్- ఆంధ్రజ్యోతి టీవీ న్యూస్ ఛానల్ మా ఇద్దరితో ఓ  ప్రత్యక్ష చర్చా కార్యక్రమం కూడా నిర్వహించింది.

                          ఒక వారం తరువాత మళ్ళీ విజయవాడ వెళ్ళే సమయానికి సన్నివేశం తలకిందులుగా దర్శనమిచ్చింది. కొందరు సీమాంధ్ర ప్రజాప్రతినిధులు హైదరాబాద్లో తమ ఆర్ధిక ప్రయోజనాలని కాపాడుకోవడానికీ, తమ రాజకీయ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికీ ఒక ప్రణాళిక ప్రకారం సమైక్యాంధ్ర పేరిట ప్రజల్లో బలంగా భావోద్వేగాలని రెచ్చగొట్టారు.  నకిలీ రాజీనామాలు, నిరాహారదీక్షలు చేసి, రాష్ట్ర విభజనను అడ్డుకోగలమని  వీళ్ళు ప్రజల్ని నమ్మజూపారు.  దానితో సీమాంధ్ర హక్కుల సాధన, పరిరక్షణ కర్తవ్యం మరుగున పడిపోయింది. సీమాంధ్రులకు సమైక్యాంధ్రపై అవగాహన లేనప్పుడు తాను నిరాహారదీక్ష చేసి,  అవగాహన కల్పించి నట్టు తరువాతి కాలంలో లగడపాటి రాజగోపాల్ ఘనంగా చెప్పుకున్నారు.   


                          తక్షణం కాకపోయినా సమీప భవిష్యత్తులోనయినా  అంధ్రప్రదేశ్ విభజన తప్పదన్న వాదనను  అంగీకరించడానికి కూడా ఎవరూ సిధ్ధంగాలేరు. ఆంధ్ర జర్నలిస్టుల ఫోరం ఏర్పాటుకు కూడా మద్దతు దొరకలేదు. అంతకు ముందు సానుకూలంగా కనిపించిన అన్నవరపు బ్రహ్మయ్య కూడా నాతో కొనసాగలేనని స్పష్టంచేసి సమైక్యాంధ్ర శిబిరంలో చేరిపోయాడు.

                          ఈ పరిణామాలు వసంత నాగేశ్వరరావు, కత్తి పద్మారావు తదితర జైఆంధ్రావాదుల్ని నిరుత్సాహ పరిచాయి. విజయవాడలో సీనియర్ న్యాయవాది కర్ణాటి రామ్మోహనరావు వంటివారు జైఆంధ్ర ఉద్యమానికి ప్రాణం పోయాలని చేసిన కొన్ని ప్రయత్నాలు కూడా బెడిసికొట్టాయి. వాళ్ళు ముందుకు తెచ్చిన ఆచరణాత్మక ప్రతిపాదనల్ని ఎవరూ పట్టించుకోలేదు. వాళ్ల ఉపన్యాసాల్ని అడ్డుకున్నారు. సభలపై దాడులు చేశారు. అయినప్పటికీ, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో దళిత, బహుజన నాయకులు ఉపస్రవంతి రాజకీయాలని ఏదో ఒకస్థాయిలో కొనసాగించారు. వాళ్ల కార్యక్రమాల్ని ప్రధాన స్రవంతి రాజకీయాలు  అణిచివేశాయి. మీడియా అస్సలు పట్టించుకోలేదు.

                          రాయలసీమ-కోస్తాంధ్రాలో తటస్థులు ఇంకో వాదనను మందుకు తెచారు. మొదట్లో, ఒక ఎత్తుగడగారాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా మొదలయ్యే జనసమీకరణ క్రమంగా రాయలసీమ-తీరాంధ్ర హక్కుల సాధన ఉద్యమంగా మారుతుందనేది వారి వాదన సారాంశం. గతంలోనూ అనేక ఉద్యమాలు ఎవోకొన్ని తక్షణ ప్రేరణలతో మొదలయ్యి, వుధృతం అయ్యేకొద్దీభిన్నరూపం తీసుకున్న సందర్భాలున్నాయి. రాయలసీమ- కోస్తాంధ్రా ఉద్యమంలోనూ అలాంటి మలుపు సంభవించవచ్చని కొందరు భావించారు. .  కానీ, ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు తాత్కాలిక ఎత్తుగడను శాశ్వితఎత్తుగడగా మార్చారు. కేంద్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేవరకు  రాయలసీమ- కోస్తాంధ్రా పునర్నిర్మాణం అనేది ఎజెండా లోనికి రాకుండా చేశారు. సచివాలయంలో అధికారులందరూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విభజన ప్రక్రియకు అవసరమైన కసరత్తులు చేస్తున్న సమయంలోనే శాసనసభలో ముఖ్యమంత్రి విభజన బిల్లును తిరస్కరించడం ఒక విచిత్రం.  విభజన చట్టాన్ని సుప్రీంకోర్టులో  అడ్డుకుని రాష్ట్రాన్ని మళ్ళీ సమైక్యంగా వుంచుతామని శపథాలు చేయడం దీనికి పరాకాష్ట.

       విభజన అనివార్యం అనుకున్నప్పుడు దానికి ఎలాంటి నష్టపరిహారం ఇస్తున్నారో సోనియా, రాహుల్, మన్మోహన్ సింగ్ లు బిల్లు పెట్టడానికన్నా ముందే సీమాంధ్రులకు వివరించి, ఒప్పించి ఉండాల్సింది. వాళ్ళు ఆ పని చేయలేదు. నాలుగేళ్లపాటు సీమాంధ్రలో కాలు పెట్టే సాహసం కూడా వాళ్ళు చేయలేకపోయారు.

దాదాపు పదేళ్ళు నాన్చి నాన్చి రోజుకో తప్పుడు సంకేతాలనిచ్చిన కాంగ్రెస్ అధిష్టానం  చివరి క్షణంలో ఆంధ్రప్రదేశ్ ను  అడ్డగోలుగా విభజించిన తీరు మాత్రం సీమాంధ్రులకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. కాంగ్రెస్ తోపాటూ, విభజన విషయంలో చివరి వరకూ తమను తప్పుదోవపట్టించిన జై సమైక్యాంధ్ర పార్టీని సహితం మట్టి కరిపించి  సీమాంధ్రులు తమ  రాజకీయ విజ్ఞతకు చాటుకున్నారు. మొత్తం 175 నియోజకవర్గాల్లో ఆ రెండు పార్టీలకూ ఒక్కటంటే ఒక్కస్థానం కూడా ఇవ్వలేదంటే వాటి మీద సీమాంధ్రుల ఆగ్రహం ఏస్థాయిలో వుందో అర్ధం చేసుకోవచ్చు.

(రచయిత సీనియర్ పాత్రికేయులు, సామాజిక విశ్లేషకులు)
హైదరాబాద్
22 మే  2014

ప్రచురణ : ఆదివారం ఆంధ్రజ్యోతి, 1 జూన్ 2014


(స్థలాభావం వల్ల ఈ వ్యాసంలోని కొన్ని భాగాల్ని మాత్రమే ప్రచురించారు. అది కుడా సీమాంధ్ర ఎడిషన్లో మాత్రమే)

No comments:

Post a Comment