Monday, 4 August 2014

అలీ నవాజ్‌ జంగ్‌-కేయల్ రావు-పోలవరం

అలీ నవాజ్‌ జంగ్‌-కేయల్ రావు-పోలవరం

వర్తమానం: డానీ
నీటిపారుదల ఇంజినీర్లు అనగానే ముందుగా గుర్తుకు వచ్చే పేరు సర్ ఆర్థర్ కాటన్. 19వ శతాబ్దం మధ్యలో గోదావరి, కృష్ణా నదుల మీద  ఆనకట్టలు కట్టి కాలువ వ్యవసాయ యుగాన్ని ఆరంభించిన ‘నీటిదేవుడు’ ఆయన. ఆ రంగంలో మరో విఖ్యాత ఇంజనీరు ”ద క్యుసెక్స్ క్యాండిడేట్’ కేఎల్‌ రావు. విజయవాడ ప్రజలు 1967లో కేఎల్‌ రావును లోక్ సభకు ఏకగ్రీవంగా ఎన్నుకుని తమ అభిమానాన్ని చాటుకున్నారు.
నిజాం సంస్థానంలో నీటిపారుదల ఇంజినీరు అనగానే సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య అందరికీ గుర్తుకు వస్తారు. అయితే, సర్ యంవీ సమకాలికులు, ప్రతిష్ఠాత్మక  నిజాంసాగర్‌, వైరా, పాలేరు, పోచంపాడు, నందికొండ, భీమ, పెన్‌గంగ, ఇచ్చంపల్లి, లోయర్‌ మానేరు తదితర ప్రాజెక్టుల రూపశిల్పి అలీ నవాజ్‌ జంగ్‌ బహదూర్‌ (మీర్‌ అహ్మద్‌ అలీ) పేరు చాలా మందికి తెలీదు. విద్య, వైద్యంతో పాటూ హైదరాబాద్ సాంస్కృతిక సుగంధాలని వెదజల్లుతున్న ఉస్మానియా యూనివర్సిటీ, ఆర్ట్స్‌ కాలేజీ భవనం, ఉస్మానియా జనరల్‌ ఆస్పత్రి భవనం తదితరాలు భవననిర్మాణ రంగంలో మీర్‌ అహ్మద్‌ అలీ  ప్రతిభకు సజీవ సాక్ష్యాలు.
మీర్‌ అహ్మద్‌ అలీ, కేయల్ రావు ఇద్దరూ జులై నెలలోనే పుట్టడం యాదృచ్ఛికమేగానీ, ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో వాళ్ళ జయంత్యోత్సవాలు రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. భారతదేశం అంతటా సర్ యంవీ పుట్టిన రోజైన సెప్టెంబరు 15న  ఇంజినీర్స్ డే నిర్వహిస్తారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో అలీ నవాజ్‌ జంగ్‌ బహదూర్‌ పుట్టిన రోజైన  జులై 11ను ముఖ్యమంత్రి కేసిఆర్  ఇంజినీర్స్ డే గా ప్రకటించారు. దానికి పోటీగా అన్నట్టు విభజిత ఆంధ్రప్రదేశ్‌లో  కేఎల్ రావు పుట్టిన రోజైన జులై 15న ఇంజినీర్స్ డే జరపనున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. మీర్‌ అహ్మద్‌ అలీ, కేయల్ రావు ఇద్దరికీ బహుశ  ఇది మరణానంతర (posthumously) అవార్డు కావచ్చు.
అలీ నవాజ్‌ జంగ్‌ బహదూర్‌ జయంత్సోత్సవాలని ఎర్రమంజిల్‌లోని జలసౌధలో నిర్వహించగా, కేఎల్ రావు జయంత్యోత్సవాన్ని అమీర్‌పేటలోని కమ్మసంఘంలో జరిపారు.  ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుండి ఆంధ్ర ప్రాంతం విడిపోతున్నపుడు ప్రధాన వివాదం మద్రాసు రాజధాని, తిరుపతి దేవస్థానం చుట్టూ తిరిగాయి. మద్రాసును తమిళులకు వుంచి,  ఆంధ్రాను శాంతింప చేయడానికి తిరుపతిని ఇచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలోనూ పంపకాల్లో  హైదరాబాద్ రాజధాని, పోలవరం ప్రాజెక్టు, భద్రాచలం  రామాలయం చర్చనీయాంశంగా  మారాయి. చెరొకటి ఇచ్చే ఉద్దేశంతో హైదరాబాద్‌ను,  శ్రీ భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానాన్ని తెలంగాణకు వుంచి,  సీమాంధ్రకు మేలు చేసే పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. ఇప్పుడు పోలవరం అంటే  అనేకానేక వివాదాలకు కేంద్ర బిందువు. ఇది కేవలం తెలంగాణ-ఆంధ్రా సరిహద్దు వివాదమో, కేసిఆర్ – చంద్రబాబుల రాజకీయ వివాదమో మాత్రమేకాదు, విభజిత ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇది మన్యం-మైదాన వివాదం, ఆదివాసీలు- నాగరీకుల వివాదం, రాయలసీమ-తీరాంధ్ర వివాదం, అన్నింటికీ మించి ఇది సాంకేతిక వివాదం.
1956 లో విశాల ఆంధ్రప్రదేశ్ ఏర్పడడానికి ముందు, ఆంధ్ర రాష్ట్రంలోవున్న భద్రాచలం డివిజన్ ప్రాంతాన్ని తిరిగి విభజిత ఆంధ్రప్రదేశ్‌లో కలపడం, ఆయకట్టు, ప్రాజెక్టు, ముంపుప్రాంతం ఒకే రాష్ట్రంలో వుండడం వంటివి సమంజసమైన పరిష్కారాలుగా కనిపించవచ్చుగానీ, ఇందులోనూ అనేక కొత్త సమస్యలున్నాయి. ఈ పరిష్కారం  ఆదివాసుల మేలు కోసమా? వాళ్లను ముంచడం కోసమా? అన్నది కీలకాంశం. ప్రాజెక్టులవల్ల సమాజానికి మేలు జరుగుతుందని గతంలోలా అమూర్తంగా అనుకునే కాలం కాదిది. ఏ సామాజికవర్గానికి మేలు? అనే ప్రశ్న అనుక్షణం మనల్ని వెంటాడుతున్న రోజులివి. సరిగ్గా ఈ కారణవల్లనే కేఎల్ రావు మీద తీరాంధ్రలో కనిపించే అభిమానం  తెలంగాణ లోనేకాదు, రాయలసీమలో కూడా వుండకపోవచ్చు.  ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు దాన్నే నిర్ధారిస్తున్నాయి.
కేయల్ రావు వంటివారి సాంకేతిక పరిజ్ఞానంవల్ల తీరాంధ్రలో అయినా  ’అందరికీ”  మేలు జరిగిందా? అంటే ”కొందరికే’ అనే సమాధానమే వస్తుంది. దీన్ని అర్ధం చేసుకోవడానికి పెద్ద పరిశోధనలు కూడా అక్కరలేదు. సహజంగా భూమివున్నవాళ్ళే సాగునీటిని వాడుకోగలరు. ఆ ప్రాంతంలో, భూమిలేనివాళ్ళు  మాత్రమేకాక, కొద్దిపాటి భూములుండి సాగునీటి సౌకర్యం అందనివాళ్ళు సహితం క్రమంగా సాగునీటి సౌకర్యం వున్నవాళ్ల భూముల్లోనో, ఫ్యాక్టరీల్లోనో, వాణిజ్యసంస్థల్లోనో కూలీలుగానో, ఉద్యోగులుగానో మారాల్సివుంటుంది. దళితుల మీద దాడులు సాగునీటి సౌకర్యం లేని ప్రాంతాల్లోకన్నా సాగునీటి సౌకర్యం ఎక్కువగావున్న కారంచేడు, చుండూరు, వేంపెంట లాంటి చోట్ల మరింత కిరాతకంగా జరిగాయని మరచిపోవడం న్యాయంకాదు. ధవళేశ్వరం, బెజవాడ ఆనకట్టలు కేవలం నీటికి అడ్డుకట్టలు మాత్రమేకాదు, మెట్ట-డెల్టాల మధ్య సామాజిక, ఆర్ధిక, ప్రాంతీయ విభజన రేఖలు కూడా. మనలో చాలామందికి ఇప్పటికీ మింగుడుపడకపోవచ్చుగానీ, సాంకేతిక పరిజ్ఞానానికి కులం, మతం, ప్రాంతం, దేశం అన్నీ వుంటాయి. యూదుల మీద హిట్లర్ ఊచకోత సాగిస్తున్న కాలంలో విఖ్యాత శాస్త్రవేత్త  అల్బర్ట్  ఐన్ స్టీన్ తాను యూదుడు కాకుండా వుంటే, తన భౌతికశాస్త్ర సమీకరణల (e=mc2) ఆధారంగా, అణుబాంబును తయారు చేయాల్సిందిగా అప్పటి అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్‌వెల్ట్‌ను కోరివుండేవాడా? అస్థిత్వాల ఘర్షణ యుగంలో సమాధానాలు వెతకాల్సింది ఇలాంటి ప్రశ్నలకి.  సాంకేతిక పరిజ్ఞానం అనేది ఆకాశం నుండి ఊడిపడదు. ఎవరో ఒకరు కనిపెట్టకుండా, ఎవరో ఒకరు వాడకుండా, అసలు ఎవరో ఒకరికి అవసరం లేకుండా,  సాంకేతిక పరిజ్ఞానం అనుభవంలోనికి రాదు. దాన్ని కనిపెట్టేవాడూ, ఉపయోగించేవాడూ మనిషే కనుక. మనిషులకుండే అస్థిత్వాలన్నీ సాంకేతిక పరిజ్ఞానానికీ వుంటాయి. అంటే, సాంకేతిక పరిజ్ఞానం అస్థిత్వంలోనికి వచ్చే సమయానికే దాన్ని కనిపెట్టినవాళ్ళ, దానివల్ల ప్రయోజనం పొందేవాళ్ళ అస్థిత్వాలన్నీ అందులో ఇమిడి వుంటాయి. పోలవరం ప్రాజెక్టును కేవలం సాంకేతిక అంశంగా మాత్రమే చూస్తే అది మనకు ఎన్నటికీ అర్ధంకాదు. సామాజిక అంశంగా, మరీ నిర్దిష్టంగా,  మన్యానికీ, మైదానానికి మధ్య సరిహద్దు గోడగా దాన్ని చూడగలిగినపుడే అది మనకు ఎంతో కొంత అర్ధం అవుతుంది.  
పోలవరం ఈరోజు మన ముందు అనేక ప్రశ్నల్ని సంధిస్తోంది. అన్యాక్రాంతం కావడానికి వీల్లేని ఆదివాసీల భూమిని ప్రాజెక్టు వంకతోమాత్రం ఎలా కబ్జా చేస్తారూ? ఏజెన్సీ ప్రాంతంలో ఎకరం ఆక్రమిస్తే నేరం అయినప్పుడు లక్ష ఎకరాలు కబ్జాచేస్తే అభివృధ్ధిగా  మారిపోతుందా?  ఎప్పుడూ మైదానం కోసమే అడవి త్యాగం చేయాలా? అడవి కోసం మైదానం ఒక్క త్యాగం కూడా చేయదా? ఆదివాసుల మీద ప్రేముంటే వాళ్లను అడవిలోనే అభివృధ్ధి చేయాలిగానీ వాళ్లను అడవినుండి దూరం చేయడం దేనికీ? గోదావరి నీటిని విషతుల్యంగా మార్చేస్తున్న కార్పొరేట్ సంస్థల్ని పల్లెత్తు మాట అనలేని డెల్టావాసులకు ఆదివాసుల్ని నిర్వాసితుల్ని చేసే హక్కు ఎవరిచ్చారూ? పోలవరం సాధన యాత్రలు సాగాల్సింది  అడవిలో లేదా రాయలసీమలో.  గోదావరి డెల్టాలో సాగుతున్నాయంటే దాని అర్ధం ఏమిటీ?  వీటన్నింటికీ ఇప్పుడు సమాధానాలు కావాలి. అలాంటి సందర్భాల్లో  అల్లూరి మనకు స్పూర్తి కావాలి.
 మైదానం మన్యం పక్షాన నిలబడాలి.  
(రచయిత సీనియర్ పాత్రికేయులు, సమాజ విశ్లేషకులు )
మొబైల్‌ _  9010757776
హైదరాబాద్‌, 18 జులై  2014 

No comments:

Post a Comment