ప్రవాస ప్రభుత్వం
డానీ
చరిత్ర పునరావృతమౌతుంది; మొదటిసారి విషాదంగానూ, రెండోసారి ప్రహసనంగానూ
అన్నాడు కార్ల్ మార్క్స్. ఆంధ్రప్రదేశ్ ప్రవాస ప్రభుత్వ ప్రహసనం కార్ల్
మార్క్స్ మాటల్ని పదేపదే గుర్తు చేస్తోంది.
సరిగ్గా నూరేళ్ళ క్రితం, 1915లో కాబూల్ పర్వతసాణువుల్లో భారత ప్రవాస
ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్ళు నడిచింది. వలస పాలనకు వ్యతిరేకంగా దేవ్ బందీ
ముస్లింలు కొందరు చొరవతో దీన్ని నెలకొల్పారు. మౌలానా బర్కతుల్లా
ప్రధానిగానూ, మహేంద్ర ప్రతాప్ అధ్యక్షునిగానూ, చంపాకరన్ పిళ్ళె విదేశాంగ మంత్రిగా,
మౌలానా బషీర్ యుధ్ధమంత్రిగానూ ఇందులో వున్నారు. మొదట్లో పరోక్షంగా మద్దతు
ఇచ్చిన ఆఫ్ఘన్ ఆమిర్ తరువాత బ్రిటీష్ వత్తిడికి లొంగి భారత ప్రవాస ప్రభుత్వానికి
మద్దతు ఉపసంహరించుకున్నాడు. అప్పుడు వలసపాలన వుందిగాబట్టి
ప్రవాస ప్రభుత్వం అనివార్యం, వీరోచితం కూడా. ఇప్పుడూ ఆంధ్రప్రదేశ్ లో ఒకరకం ప్రవాస ప్రభుత్వం
నడుస్తోంది. ఇది వీరోచితమూకాదు, అనివార్యమూకాదు. కేవలం ప్రహసనం.
రాష్ట్ర విభజన అంశం ముందుకు వచ్చినపుడు ఏ కారణం వల్లనోగానీ అనేక ప్రధాన
విషయాలకన్నా హైదరాబాద్ అంశం కీలకంగా మారింది. ఎవరు ఎప్పుడు ఎవరి బుర్రలో ఈ మాట
పెట్టారోగానీ, చివరి దశ వరకూ “యూటీ, ఐటీ” చుట్టూనే చర్చంతా సాగింది.
అవి రెండూ సీమాంధ్రుల అదుపులోవుంటే, మిగిలినవి అసలు సమస్యే కాదనే ప్రచారం
వుధృతంగా సాగింది. ఇప్పుడు వాటికన్నా ప్రాణప్రదమైన సమస్యలు అనేకం ముందుకు వచ్చాయి.
ఇంకా వస్తూనే వున్నాయి. మొత్తం రాష్ట్రాన్ని ఏలగలిగే సామర్ధ్యం తమకే వుందని తరచుగా
చెప్పుకునే రాయలసీమ - తీరాంధ్ర నాయకులకు ఈ
ప్రమాదాల గురించి బొత్తిగా తెలీదు అనైనా అనుకోవాలి. లేకపోతే వాళ్లకు ఒక రహాస్య
ఎజెండా వుందని అయినా అనుకోవాలి.
సీమాంధ్ర రాజకీయనాయకుల్లోని మూర్ఖులు సమైక్యవాదాన్ని సృష్టించారు. లేకపోతే రాష్ట్ర విభజన విధివిధానాలపై త్రైపాక్షిక చర్చలకు, 2009 నుండి 2014 వరకు
దాదాపు నాలుగేళ్ళ సుదీర్ఘ వ్యవధి వుండేది. ఇంతటి విలువైన సమయాన్ని,
అవకాశాన్నీ దుర్వినియోగం చేసిన పాపం ప్రధానంగా లగడపాటి రాజగోపాల్ దే అనిపిస్తుంది. ప్రధానంగాఅన్నప్పుడూ ఆ పాపం ఆయన ఒక్కడిది మాత్రమే అనికాదు.సీమాంధ్ర రాజకీయనాయకులు అందరూ మూర్ఖులు అనీఅర్ధంకాదు. అయితే, సమైక్యాంధ్రా అంటే బొత్తిగా తెలియనివాళ్లకు ఆ చైతన్యాన్ని కలిగించింది తానే అని రాజగోపాల్ స్వయంగాచాలాసార్లు
చెప్పుకున్నారు. మరోవైపు, "విభజనకు షరతులు ఇలా వుండాలి. ఇవన్నీ
అంగీకరించి, సాకారం చేశాకే విడిపోదాం. కాదంటే కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల
మీద తీవ్రంగా ఉద్యమం చేస్తాం" అనే ప్రతిపాదనతో 2009 డిసెంబరులోనే
కొందరు ముందుకు వచ్చారు. సమైక్యవాదుల ముసుగులో అప్పట్లో వీరంగం
సృష్టిస్తున్నవాళ్ళు ఇలాంటి చర్చలకు అవకాశం ఇవ్వలేదు.
రాష్ట్ర విభజన జరిగాక,
సీమాంధ్రలో అందరూ సొనియా గాంధీ, రాహుల్ గాంధీ, జైరాం రమేష్, దిగ్విజయ్ సింగ్
లను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతూ వుండవచ్చుగానీ, వాళ్ళు చేసిన మేలు కూడా చాలా
వుంది. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లులో అన్ని అంశాల్ని వాళ్లకు
వాళ్ళుగానే పెట్టారు. ఎల్. కే. అడవాణీ అన్నట్టు ఆ బిల్లు అనేక అవకతవకల
పుట్ట కావచ్చు. అయినప్పటికీ, సీమాంధ్ర నుండి ఎవరూ కోరకుండానే ఆ బిల్లు తయారయిందని
గమనించాలి. బిల్లులో ఫలానా అంశం వుండాలని కోరడం అంటేనే ఆంధ్రుల విభజనను
అంగీకరించినట్టే అన్నంత అతివాదాన్ని అప్పట్లో సీమాంధ్ర నాయకత్వం ప్రదర్శించింది.
ఇక ముందు సీమాంధ్రులు కేంద్ర ప్రభుత్వాన్ని ఏది కోరాలన్నాదానికి
చట్టబద్ద ప్రాతిపదిక ఆ బిల్లే. మరోమార్గంలేదు. సీమాంధ్ర నాయకత్వం చేసిన
తప్పిదాల్ని ఇప్పుడు కేసిఆర్ తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. విభజనకు అంగీకరిస్తే
చాలు సీమంధ్రుల డిమాండ్లన్నీ ఒప్పుకుంటాం అనే విధంగా అప్పట్లో తెలంగాణ నాయకులు
అనేవారు. ఇప్పుడు బంతి వాళ్ల కోర్టులో వుంది. పునర్ వ్యవస్థీకరణ బిల్లులో వున్న
అంశాలను సహితం నిరాకరించే విధానాన్ని కేసిఆర్ అవలంబిస్తున్నారు. బీసీ
విద్యార్ధుల ఫీజు రీ ఎంబర్సుమెంటు వివాదం దీనికి తాజా ఉదాహరణ.
హైదరాబాద్ యూటీ చేస్తే
సీమాంధ్ర ప్రజలకు ఒనగూడే ప్రయోజనం ఏమిటో, ఇప్పటి వరకు ఎవరూ చెప్పలేదు.
హైదరాబాద్ యూటి కాకపోయినా ఉమ్మడి రాజధాని అయింది. ఇది వరమో శాపమో తెలియని
పరిస్థితి. పరిపాలనలో అపార అనుభవంవున్న చంద్రబాబుకు జరగబోయే పరిణామాలన్నీ ముందే
తెలుసు. వుమ్మడి రాజధాని కావడంవల్ల ప్రయోజనమూ లేదని తెలుసు. కొత్త రాజధాని నగర
నిర్మాణానికి ఐదు లక్షల కోట్ల రూపాయల వ్యయం అవుతుందని వారొకసారి నిజం చెప్పి నాలుక
కరుచుకున్నారు. ఆ తరువాత వారు ఎన్నికల ప్రచారం మొదలెట్టేశారు. ఎన్నికల
ప్రచారంలో గొప్ప వెసులుబాటు వుంటుంది. ఏది చెపితే ఓట్ల వర్షం
కురుస్తుందన్నదే ముఖ్యంతప్ప. ఆ చెప్పేది నిజం కావల్సిన పనిలేదు. ఇలాంటి
నియమనిబంధనలు లేకపోవడంవల్ల ఎన్నికల ప్రచారం అనేది అబధ్ధాల పోటీగా మారిపోతోంది.
ప్రజల దగ్గర చంద్రబాబు
దాచిన నిజాలు ఇప్పుడు క్రమంగా వారి మెడకే చుట్టు కుంటున్నాయి. అందులో రాజధాని అంశం
కాగా, రైతుల రుణమాఫీ అంశం మరొకటి. రాజధాని విషయంలో చంద్రబాబు దాదాపు వారానికో
వెర్షను చెపుతున్నారు. ఒక వెర్షన్ కూ మరో వెర్షన్ కూ పోలిక పొంతన వుండడం లేదు.
ముందు మంగళగిరి అన్నారు. వారంలో మూడు రోజులు మంగళగిరి, రెండ రోజులు హైదరాబాద్,
ఇంకో రోజు ఢిల్లీలో విడిది అన్నారు. ప్రభుత్వోద్యోగుల్నిపిలిచి తక్షణం
హైదరాబాద్ ను వదిలి వెళ్ళిపోదాం అన్నారు. చెట్ల కింద పనిచేద్దాం అన్నారు.
ఉద్యోగులు కూడా సరే అన్నారు. అంత వరకు బాగానే వుంది. ఏ వూర్లో ఏ చెట్ల కింద
పనిచేయాలి అనే ప్రశ్న వచ్చినపుడు ముఖ్యమంత్రి గొంతులో పచ్చి వెలక్కాయ పడింది.
ఆంధ్రప్రదేశ్ కు కొత్త రాజధాని నగరం ఏదో చెప్పాల్సిన ఇబ్బందిలో వారు
పడిపోయారు. రాయలసీమ, విశాఖపట్నంల నుండి రాజధాని కోరిక ముందుకు రావడంతో వారు
మౌనమే మేలు అనుకుంటున్నారు.
దానితో చెట్ల కింద సియం
కార్యాలయం పథకం ఆగిపోయి, కోట్ల రూపాయలతో హైదరాబాద్ లో సియం క్యాంపు
కార్యాలయం ఆధునికీకరణ పథకం మొదలయ్యింది. ఇప్పుడు చంద్రబాబు స్థాయికి
తగ్గట్టు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో సియం ఛాంబరును ఆధునీకరిస్తున్నారు.
దానికి మరికొన్ని కోట్లు, మరికొన్ని నెలలు పట్టవచ్చు. ఫలితంగా జరిగింది ఏమంటే,
కొత్త రాజధాని నిర్మాణం చేపట్టడం కాదుదుకదా, ఎక్కడ నిర్మించాలనే విషయమే వివాదంగా
మారిపోయింది. ముఖ్యమంత్రి దీన్ని పదమూడు జిల్లాలకు పదమూడు కళ్ల సిధ్ధాంతంగా
మార్చుకున్నా ఆశ్చర్యం ఏమీలేదు. పోలవరం కూడా కొత్త జిల్లా అయితే పధ్నాలుగు
కళ్ళ సిధ్ధాంతంగావచ్చు.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో
రాజధానిలేదు. మూడు వందల కిలో మీటర్లు ప్రయాణం చేసి హైదరాబాద్ చేరుకున్నా
అక్కడా ముఖ్యమంత్రి ఛాంబరు లేదు. వెరసి ప్రభుత్వమే లేదన్న భావన సీమాంధ్రలో
కొనసాగుతోంది. అయితే వాళ్లకు ఇదేమీ కొత్త అనుభవం కాదు. కిరణ్ కుమార్ రెడ్డి
హయాంలోనే ప్రభుత్వం తన అస్థిత్వాన్ని కోల్పోయింది. చంద్రబాబు హయాంలో ఆ సాంప్రదాయం
కొనసాగుతోంది.
(రచయిత సీనియర్
పాత్రికేయులు, సమాజ విశ్లేషకులు)
హైదరాబాద్
3 ఆగస్టు 2014
No comments:
Post a Comment