Monday 4 August 2014

రైతు (రుణ) మాఫీ!

రైతు (రుణ) మాఫీ!

వర్తమానం: డానీ
అప్పట్లో చంద్రబాబు స్పీడ్‌ను చూసి చాలా మంది కంగారు పడేవారు. ఇప్పుడూ ఆయన్ని చూసి జనం కంగారు పడుతున్నారు. అయితే, అది వారి స్పీడ్ ను చూసికాదు; వారి వాయిదాల తీరును చూసి. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే క్షణంలోనే చంద్రబాబు అనేక సమస్యల్ని పరిష్కరిస్తూ తొలి సంతకాలు చేస్తారని చాలా మంది భావించారు. చంద్రబాబు కూడా ఎన్నికల ప్రచార ఘట్టంలో అలాంటి హామీలే ఇస్తూ వచ్చారు. కానీ అలా జరగలేదు. కొత్త ముఖ్యమంత్రి రికార్డు స్థాయిలో గంటకు ఒక నిర్ణయం చొప్పున తీసుకుంటున్నారని యనమల రామకృష్ణుడు ఘనంగా చెపుతున్నారు. అయితే,  గడిచిన నెల రోజుల్లో కొత్త ప్రభుత్వం తీసుకున్న ఆ నిర్ణయాలు ఏమిటో మాత్రం వారు చెప్పలేక పోతున్నారు. నెలకు 720 గంటలని ఆర్థిక మంత్రికి తెలియని విషయం కాదు. 
మిగిలిన విషయాలెలా వున్నా రాష్ట్ర ప్రజల దృష్టి ఇప్పుడు రైతుల రుణమాఫీ, రాజధాని నగరం అనే రెండు అంశాల మీద కేంద్రీకృతమై వున్నదని చంద్రబాబుతోసహా అందరికీ తెలుసు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నప్పుడే రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ ఆరంభమయిపోయింది. సాగునీటి పారుదలతోపాటూ, రైతుల రుణమాఫీ అంశాన్ని తక్షణం పరిష్కరించాల్సిన ఒత్తిడి కొత్త ప్రభుత్వంపై పెరిగింది. కృష్ణాడెల్టాకు దాదాపు 180 శతకోటి ఘనపు అడుగుల సాగునీటి పారుదల అవసరం కాగా కృష్ణా వాటర్ బోర్డు నుండి ఇప్పటికి రెండు విడతలుగా పొందింది తాగునీటి కోసం 6 టీయంసీలే. 
ఎన్నికలకు ముందు తెలుగు తమ్ముళ్ళు గ్రామాల్లో తిరిగి రుణాలు చెల్లించ వద్దనీ, తాము అధికారంలోనికి రాగానే రుణాలన్నీ మాఫీ చేసేస్తామని రైతాంగంలో ప్రచారం చేశారు. ఇప్పుడు పాత రుణాలు మాఫీ కాక, కొత్త రుణాలు రాక రాష్ట్రంలో మొత్తం వ్యవసాయమే సంక్షోభంలో పడిపోయింది. రైతు రుణ మాఫీ విధివిధానాలు రూపొందించడానికి చంద్రబాబు వేసిన కోటయ్య కమిటి కోటప్ప కొండకు వెళ్ళిపోయినట్టుంది!. ఏదైనా విషయాన్ని నిరవధికంగా వాయిదా వేయడాన్ని ఇప్పుడు చాలా మంది వ్యంగ్యంగా “కోటప్ప కమిటి వేస్తా” నంటున్నారు. అంతగా అప్రతిష్టను మూట కట్టుకుంది ఆ కమిటి. 
రుణమాఫీ వ్యవహారం రిజర్వు బ్యాంకు అనుమతి, అంగీకారాలతో ఏడేళ్ళు సాగించాల్సిన సంక్లిష్టమైన సుదీర్ఘ ప్రక్రియ అని ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం గుర్తు చేస్తున్నది. అపార రాజకీయ అనుభవశాలి అయిన చంద్రబాబుగారికి ఆ సంక్లిష్టమైన సుదీర్ఘ ప్రక్రియ గురించి ముందుగానే తెలిసివుండాలి. ఆ అడ్డంకుల్ని అధిగమించడానికి వారు చేస్తున్న ప్రయత్నాల గురించైనా ఈపాటికే ప్రజలకు చెప్పి వుండాల్సింది. ఇకముందయినా ఎప్పటికప్పుడు తాజా పరిణామాల్ని పారదర్శకంగా ప్రకటిస్తూ వుండాలి. లేకపోతే తొలి అడుగులోనే మాట తప్పారు అనే అపవాదును వారు మూటగట్టుకోవాల్సిన పరిస్థితి రావచ్చు.   
సియంవోలోగానీ, సియం క్యాంపు కార్యాలయంలోగానీ జరుగుతున్న కార్యకలాపాలను గమనిస్తే చంద్రబాబు ప్రభుత్వం రాజధాని నగర నిర్మాణం విషయంలో చాలా ఆతృత చూపుతున్నట్టు కనిపిస్తున్నది. రాజధాని నగరాన్ని ఎక్కడ నిర్మిస్తున్నారో ప్రకటించడానికి వారికి కొన్ని రాజకీయ ఇబ్బందులు వున్నట్టున్నాయి. అయితే, స్థల నిర్ధారణ జరక్కపోయినా నిర్మాణ ప్రక్రియను మాత్రం వారు చకచకా సాగిస్తున్నారు. ఈ పాటికే వారు సింగపూర్ నగరంలోని విఖ్యాత నిర్మాణ సంస్థలతో సంప్రదింపులు మొదలెట్టారు. సింగపూర్ విదేశాంగ మంత్రితో మంతనాలు జరిపారు. “ముందు మీ అవసరాలు చెప్పండి. దాన్నిబట్టి మా ప్రతిపాదనలు సమర్పిస్తాము” అని వారన్నట్టు సమాచారం. ఎక్కడ నిర్మించాలో తెలీకుండా పది సింగపూర్లు నిర్మిస్తాననడం సాహసం అనిపించుకోదు; దుస్సాహసం అని కూడా అనిపించుకోదు; గాల్లో మేడలు కట్టడం అనిపించుకుంటుంది.  
నిర్మాణరంగంలో తన సామర్ధ్యాన్ని చంద్రబాబు తరచూ గుర్తు చేస్తుంటారు. మాధాపూర్ హైటెక్ సిటీ, గచీబౌలీ స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఫ్లై ఓవర్లతోపాటూ శంషాబాద్ ఎయిర్ పోర్టు, మెట్రో రైలు తదితర నిర్మాణాలని వారు ఇలాంటి సందర్భాల్లో ప్రస్తావిస్తుంటారు. అది గత కాలపు వ్యవహారం కావచ్చు. ఇప్పుడు వారు చేపట్టిన కొత్త పునర్ నిర్మాణ పథకం సియం క్యాంపు ఆఫీసుగా మారిన లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ఆధునికీకరణ. చంద్రబాబు పర్యవేక్షణ స్తోమత బలహీనపడిందో, వారికి ఆ ఆసక్తి తగ్గిందోగానీ, రాకరాక వచ్చిన స్వల్ప వర్షాలకే లేక్ వ్యూ గెస్ట్ హౌస్ పైకప్పు కొంత భాగం కూలిపోయింది. 
ప్రభుత్వోద్యోగుల పదవీ విరమణ వయస్సును అరవై యేళ్ళకు పెంచడం చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న చారిత్రక నిర్ణయం అని టిడిపి ప్రముఖులు గొ్ప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ  పెరుగుతున్నప్పుడు పదవీ విరమణ వయస్సును పెంచడం నిస్సందేహంగా అవసరమైన చర్యే. కానీ కొత్త ప్రభుత్వానికి ప్రభుత్వోద్యోగుల సంక్షేమమే ప్రాణప్రదమైన తొలి చర్య కానక్కరలేదు. అలా కావడం సమంజసమూ కాదు. 
ఎన్జీవోలు వృత్తిరీత్యానేకాక ప్రవృత్తిరీత్యా కూడా పాలక యంత్రాంగంలో భాగం. సహజంగానే ప్రజలకు ప్రభుత్వోద్యోగుల వ్యవస్థ మీద ఒక రకం నిరసన వుంటుంది. అందులో అసమంజసమైనది కూడా ఏమీలేదు. మంచివాళ్ళు, నిజాయితీపరులు, పాపభీతి వున్నవాళ్ళు ప్రతి వ్యవస్థలోనూ వుంటారు. అలాంటి నాలుగైదు శాతాన్ని మినహాయిస్తే, లంచం తీసుకోకుండా ప్రజాసేవ చేసే ప్రభుత్వ ఉద్యోగులు మనకు ఎక్కడా కనిపించరు. పరిపాలన సాగించడానికి ప్రభుత్యోగుల వ్యవస్థ ’ఒక అవసరమైన దెయ్యం’ అనేవారూ లేకపోలేదు. దెయ్యం వ్యయం మన ఆదాయాన్ని కూడా మించిపోవడం దేన్ని సూచిస్తుంది? 
ప్రభుత్వ ఆదాయంలో సింహభాగం ఉద్యోగుల జీత భత్యాలకే పోతున్నదని యన్టీ రామారావు కాలం నుండి ఇప్పటి వరకు అసంతృప్తిని ప్రకటించని వాళ్ళులేరు. అవసరం కదా అని ఇంటిని మించిన తాళం కప్పను కొనడం సమర్ధ చర్య అనిపించుకోదు. అసలు ఇల్లే లేకుండా తాళం కప్పను కొనడం ఏ ధోరణికి సంకేతం? 
ఆంధ్రప్రదేశ్ విభజన, సమైక్యరాష్ట్ర ఉద్యమాల ద్వారా అందరికన్నా ముందుగా లబ్ది పొందిన సమూహం ప్రభుత్యోద్యోగులు. కిరణ్ కుమార్ ప్రభుత్వంలో వారు భారీ రాయితీలు సాధించుకుని పండుగలు జరుపుకున్నారు. ఇప్పుడు చంద్రబాబును సన్మానం చేయడానికి ఉవ్విళ్ళూరుతున్నదీ వాళ్ళే! 
సమాజంలో అత్యధికులయిన సామాన్య ప్రజల ఆదాయ స్తోమతను పెంచాల్సిన ప్రభుత్వాలు, పెంచుతామన్న హామీతో అధికారాన్ని చేపట్టిన నాయకులు ఇప్పుడు పోలీసులు, ప్రభుత్యోగులకు వరాలు కురిపించడం దేనికి సంకేతం? పోలీసులు, ప్రభుత్వోద్యోగులూ ప్రజల్లో భాగమే అని తెలుగు దేశం మేధావులు అనవచ్చు. ప్రజలు మాత్రం గతంలో అలా ఎన్నడూ అనుకోలేదు. భవిష్యత్తులో అలా ఎన్నటికీ అనుకోరు.
1970వ దశకంలో ఇందిరా గాంధీ “గరీబీ హఠావో” పథకాన్ని ప్రవేశపెట్టినపుడు విపక్షాలు దాన్ని “గరీబ్ కో హఠావో” అని విమర్శించేవారు. చంద్రబాబు అప్రమత్తంగా వ్యవహరించకపోతే వారి రైతు రుణ మాఫీ పథకం రైతు మాఫీ పథకంగా ప్రాచుర్యాన్ని పొందినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు.

(రచయిత సీనియర్ పాత్రికేయులు, సమాజ విశ్లేషకులు)
హైదరాబాద్
10 జులై 2014

No comments:

Post a Comment