Friday, 28 August 2020

Movements Are The Birthplace Of Great Ideas

 Movements Are The Birthplace Of Great Ideas

గొప్ప ఆలోచనల పుట్టినిళ్ళు ఉద్యమాలు

 

          నా పుట్టిన రోజు సందర్భంగా ఎంతో అభిమానం, ప్రేమ, ఆత్మీయత, వాత్సల్యాలతో శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ వినయపూర్వక కృతజ్ఞతలు. నిరంతరం మీ ప్రేమాభిమానాలను పొందడానికి మరింతగా కృషి చేస్తాను. 

 

          వ్యాపారమో, ఉద్యోగమో  బుధ్ధిగా చేసుకుంటూ పెళ్ళాం బిడ్డల్ని పోషించుకుంటూ నాలుగు రాళ్లు వెనకేసుకుని ప్రశాంతంగా విశ్రాంత జీవితాన్ని గడిపే అవకాశాలు నాకు చాలా వచ్చాయి. టోల్ స్టాయ్ ‘అక్కాచెల్లెళ్ళు’ (?) కథలో చెప్పినట్టు రొటీన్ జీవితం నాకు ఏమాత్రం  నచ్చలేదు. కొంచెం భిన్నంగా జీవించడం కోసం కొంత రిస్క్ తీసుకోవాలనుకున్నాను. అలాంటి నిర్ణయం వల్ల నా కుటుంబ సభ్యులకు చాలా ఇబ్బందులు కలిగాయి. తల్లిదండ్రుల రుణం తీర్చగలిగేది కాదన్నట్టు నా భార్య అజిత రుణం కూడ  తీర్చ గలిగిందికాదు. సారీ అజిత!

 

          అందరికీ వున్నట్టే బాల్యంలో నాకూ కొన్ని కలలు వుండేవి. అప్పటి కలలు ఊహలకు కూడ అందనంత గొప్ప జీవితం నాకు లభించింది. కొండపల్లి సీతారామయ్య, కేజి సత్యమూర్తి వంటి యుగపురుషుల్ని కళ్ళతో చూసే అవకాశం కలగడమే మహా భాగ్యం. వాళ్లు గొప్పగా వెలుగులోవున్న రోజుల్లో  నేను వాళ్లిద్దరికీ చాలా దగ్గరగా వున్నాను. వాళ్ళను ప్రేమించాను. వాళ్ళ ప్రేమను పొందాను. కొన్ని సందర్భాల్లో అంతే గట్టిగా వాళ్ళతో తగవుపడ్డాను. భాగవతం ఆరంభంలో నన్ను అభిమానించినా, నాతో విభేదించినా మోక్షం దక్కుతుంది అనే అర్థం వచ్చేలా ఒక మాట వుంటుంది.   నాకు ఆ రెండు రకాల మోక్షాలూ దక్కాయి.

 

          నా ముందు తరానికి చెందిన వివి కృష్ణారావు, ఐవి సాంబశివరావు, శ్రీశ్రీ,, కేవి రమణారెడ్డి, చలసాని ప్రసాద్, వరవరరావు, త్రిపురనేని మధుసూదనరావు, రావి శాస్త్రి, కాళిపట్నం రామారావు, గద్దర్, వంగపండు, అరుణోదయ రామారావు, దేవీప్రియ, బి నర్సింగరావు, వోల్గా, ఆర్ ఎస్ రావు, ఎంటీ ఖాన్, వైకే, బొజ్జా తారకం, చెరబండరాజు, నగ్నముని, జ్వాలాముఖి, మహీధర రామ్మోహన రావు, ‘మాభూమి’ సుంకర సత్యనారాయణ, ‘చెట్టు’ ఇస్మాయిల్, ‘ఖాళీ సీసాల’ ఇస్మాయిల్, ఎం జి రామారావు, ధవళ సత్యం, భూమన్ తదితరులతోనూ -

­

నా సమకాలికులైన టి. వెంకట చెలం (సుధాకర్), సివి సుబ్బారావు, బి పరంజ్యోతి, బాలగోపాల్, కత్తి పద్మారావు, తాడి మోహన్, ఆర్టిస్ట్ టీవీ, బిఎస్ రాములు, ఉసా, ఎం ఎఫ్ గోపీనాధ్, అబ్దుల్ నూర్ బాషా, కే శ్రీనివాస్, ఖాదర్ మొహియుద్దీన్, కేఎన్ వై పతంజలి, అల్లం రాజయ్య, అల్లం నారాయణ, గడియారం శీవత్స, కే విజయకుమార్, పిజే వర్ధనరావు, బూర్గుల ప్రదీప్, జయధీర్ తిరుమలరావు, ముంతా పవన్, సతీష్ చందర్, ‘శ్రీశ్రీ’ విశ్వేశ్వరరావు, వేమన వసంత లక్ష్మి, హరగోపాల్, దాసరి శిరీష తదితరులతోనూ –

 

 నా తరువాతి తరానికి చెందిన త్రిపురనేని శ్రీనివాస్, కలేకూరి ప్రసాద్, మారోజు వీరన్న, రావులపాటి సీతారామ్, ప్రసేన్, అఫ్సర్, గోసాల ఆశీర్వాదం, గుంటూరు లక్ష్మీ నరసయ్య, ఎన్ వేణుగోపాల్, సౌదా, అరుణ, దగ్గుమాటి పద్మాకర్, సుజాత సూరేపల్లి, ఖదీర్ బాబు, వేంపల్లె షరీఫ్, నశీర్ అహ్మద్, ఇక్బాల్ చంద్, షాజహానా, ఖాజా, స్కైబాబ, యాకూబ్, మోహన్ రామ్మూర్తి, జిఎస్ రామ్మోహన్, జిలుకర శ్రీనివాస్, నూకతోటి రవికుమార్, గుర్రం సీతారాములు, చల్లపల్లి స్వరూపరాణి, దుర్గం సుబ్బారావు, పసునూరి రవీందర్, బి చంద్రశేఖర్, దార గోపి, సిహెచ్ సుబ్బరాజు, జహా ఆర, ఆర్ భరద్వాజ తదితరులతోనూ - 

 

జర్నలిజంలో ఏబికే ప్రసాద్, నండూరి రామ్మోహనరావు, కే రామచంద్రమూర్తి, సి రాఘవాచారి, పొత్తూరి వేంకటేశ్వర రావు లతోనూ –

 

రకరకాల సందర్భాల్లో రకరకాల స్థాయిల్లో కలిసి పనిచేసే అవకాశం నాకు దక్కింది. నా ప్రభావం వాళ్ళ మీద ఎంత వుందోగానీ, వాళ్లందరి  ప్రభావం నా మీద ఏదో ఒక స్థాయిలో వుంది.

 

          నల్లమలలో యానాదుల దగ్గరి నుండి సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రుల వరకు, వలస కార్మికుల నుండి కార్పొరేట్ల వరకు, నక్సలైట్ల నుండి పోలీసు ఉన్నతాధికారుల వరకు, బైండ్ల కులస్తుల నుండి బ్రాహ్మణుల  వరకు, హిందూ మతాధికారుల నుండి ముస్లిం, క్రైస్తవ, శిక్కు, జైన మతాధికారుల వరకు, మార్ క్సిస్టుల నుండి అంబేడ్కరిస్టుల వరకు, కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు’ పంజాబ్ నుండి అస్సాం వరకు అందరితో సన్నిహితంగా మెలిగే అవకాశాలు నాకు దక్కాయి. ఇంతటి వైవిధ్యం కొన్నిసార్లు అపార్థానికి కూడ గురయ్యింది. 

 

          వ్యక్తిగత రాగద్వేషాల్ని నేను ఎన్నడూ  మేధో సంచయనం (intellectual articulation) లోనికి రానివ్వలేదు. ఒక తప్పుడు అభిప్రాయాన్ని నా సన్నిహితులు వ్యక్తం చేసినా గట్టిగా విమర్శించాను, ఒక మంచి అభిప్రాయాన్ని నా వ్యతిరేకులు వ్యక్తం చేసినా గొప్పగా మెచ్చుకున్నాను. గొప్ప అభిప్రాయం ఎక్కడ వ్యక్తం అయినా దాన్ని గుర్తించాలి స్వీకరించాలి.

 

          మేధస్సు అనేది ఎన్నడూ వ్యక్తిగత వ్యవహారం కాదు. మేధో సంచయనం ఒక టీమ్ వర్క్. మన కాలంలో గొప్పవాళ్ళుంటే మనమూ గొప్పవాళ్లం అవుతాము. గొప్ప ఆలోచనలు అంటే మరేమీ కాదు; మనుషులు  మరింత మానవీయంగా బతికే సమాజాన్ని నిర్మించే కృషి మాత్రమే. ప్రపంచ వ్యాప్తంగా గొప్ప ఆలోచనలన్నీ ఉద్యమాలు ఉధృతంగా వున్నప్పుడే పుట్టాయి. ఉద్యమాలు లేనపుడు చెత్త ఆలోచనలు పుడతాయి. మనిషి వ్యక్తిగా మారిపోతాడు. మానవజాతికి ఇంతకన్నా హననం మరేదీ వుండదు. ఇప్పుడయినా గొప్ప ఆలోచనలు  పుట్టాలంటే గొప్ప ఉద్యమాలు కొనసాగుతుండాలి. ఉద్యమాలులేని ఆలోచనలు సోషల్ మీడియాలో క్రమంగా ట్రోల్ గా మారి అంతరించిపోతాయి.  

 

          ఉద్యమాల్లో పాల్గొనడాన్ని చాలా మంది త్యాగం అనుకుంటారు. నేను స్వార్ధం అనుకుంటాను. ఉద్యమాల్లో నేను నా స్వార్ధం కోసం పాల్గొన్నాను.   నా ఆలోచనల్ని మెరుగుపరుచుకుంటూ వుంచడమే నా  స్వార్ధం. ప్రతి ఉద్యమం సమాజపు ఒక కొత్త పార్శ్వాన్ని ఆవిష్కరిస్తుంది. ఉద్యమాలు లేకుంటే ఆ పార్శ్వాలు ఎన్నటికీ అర్ధం కావు.

 

          స్విడిష్ రచయిత జాన్ మీర్డాల్ కొండపల్లి సీతారామయ్యను కలుసుకోవడానికి విజయవాడకు వచ్చిన రోజుల్లో నేను కేఎస్ కు సహాయకునిగా వున్నాను. ఆయన నేను కృష్ణాజిల్లాలో జంటగా తిరిగాము. నన్ను అప్పుడు ఒక విధంగా కేఎస్ కు బాడీగార్డ్ అనుకోవచ్చు. ఇది నాకు ఇప్పటికీ గర్వకారణమైన సంఘటన. కారంచేడు ఉద్యమంలో పాల్గొనడం, 1997 నాటి వరంగల్ డిక్లరేషన్ కు ఆహ్వానసంఘం సభ్యుడిగా వుండడం, బలహీనవర్గాల సమాఖ్య అధ్యక్షునిగా వుండగా బి పరంజ్యోతి, గోసాల ఆశీర్వాదంలతో కలిసి 2000లో నెల్లూరులో యానాది సంఘాల సమాఖ్యను నెలకొల్పడం నాకు గొప్ప సంతృప్తినిచ్చిన సంఘటనలు. పంజాబ్, ఢిల్లీలతో అనుబంధం వున్నప్పటికీ 1984 ఢిల్లీ అల్లర్ల కాలంలోనూ, చుండూరు ఉద్యమ కాలంలోనూ తగిన సమయాన్ని కేటాయించలేకపోవడం అసంతృప్తిగా వుంది.

 

          ఒక ఉద్యమ నాయకునిగా కొండపల్లి సీతారామయ్య అంటే చాలా అభిమానం. త్రిపురనేని మధుసూదనరావు, ఆర్ ఎస్‍ రావుల శిష్యరికంలో నేను చాలా లాభపడ్డాను. ఆ ముగ్గురూ నాకు ప్రత్యక్ష గురువులు. కూర్చోబెట్టి పాఠాలు చెప్పినవారు. కవిగా శివసాగర్ అంటే చాలా ఇష్టం. మనకాలపు ఆలోచనాపరునిగా బాలగోపాల్ అంటే ఇష్టం. నేను వారంతటి పవిత్రమైన నిష్ట కలిగిన (puritan) వ్యక్తిని కానప్పటికీ వ్యక్తిగత జీవనానికి సంబంధించి వరవరరావు నాకు ఆదర్శం.

 

పుట్టిన రోజు మీ అందరి అభినందనలు చాలా ఆనందాన్ని ఇచ్చాయి.  మరొక్క సారి అందరికీ పేరుపేరున ధన్యవాదాలు.

 

సదా మీ అభిమానాన్ని కోరుకునే

మీ

డానీ

 

27 ఆగస్టు 2020

Monday, 24 August 2020

Unity of Oppressed groups and integration of the liberation theories

 Unity of Oppressed groups and integration of the liberation theories

అణగారిన సమూహాల ఐక్యత;

విముక్తి సిధ్ధాంతాల సమన్వయం

డానీ        

(Statutory Warning : ఈ వ్యాసాన్ని పిల్లలకు దూరంగా వుంచండి. పిల్లలు జడుసుకునే ప్రమాదం వుంది.)     

         సమాజంలో  ఆర్థిక అణిచివేతను నిర్మూలించి ఒక సమసమాజాన్ని నిర్మించడానికి పుట్టిన సిధ్ధాంతం మార్క్సిజం. సమాజంలో  కుల అణిచివేతను నిర్మూలించి ఒక సమసమాజాన్ని నిర్మించడానికి పుట్టిన సిధ్ధాంతం అంబేడ్కరిజం. సమసమాజ నిర్మాణమే రెండు సిధ్ధాంతాల లక్ష్యమూ గమ్యమూ కనుక వాటి మధ్య అతి సహజంగానే ఒక తాత్విక ఐక్యత వుంది. తాత్విక ఐక్యత సామాజిక ఐక్యతకు దారితీస్తుంది. అలాగే,  సామాజిక ఐక్యత కూడ తాత్విక ఐక్యతకు దారి తీస్తుంది. విశ్వంలో ఏదైనా అలాగే మాత్రమే  కాక  తద్విరుధ్ధంగానూ జరుగుతుంది అనేది గతితార్కిక చారిత్రక భౌతికవాద కీలక సూత్రం. కార్ల్ మార్క్స్ అయితే అనేక సందర్భాలో ‘vice versa’ అనేవాడు. పునాది ఉపరితలాన్ని ప్రభావితం చేస్తుందనేది ఒక సూత్రీకరణ అయితే, తద్విరుధ్ధంగా ఉపరితలం కూడ పునాదిని ప్రభావితం చేస్తుంది. గతితర్కం అంటేనే పరస్పర ప్రతిచర్య.

 పునాది è ఉపరితలంè పునాది

సమాజం è సాహిత్యం è సమాజం

సామాజిక ఐక్యతè తాత్విక ఐక్యతè సామాజిక ఐక్యత

ఇలా వుంటాయి గతితార్కిక చారిత్రక భౌతికవాద సూత్రీకరణలు.

           సమాజంలోని అణగారిన సమూహాల మధ్య కూడ  వైరుధ్యాలుంటాయి. అవి తమ మధ్యన గల వైరుధ్యాలను క్రమంగా పక్కన పెట్టి అణిచివేత ప్రాతిపదికగా ఏకం అవుతుంటాయి. బాధ, వేదన వాళ్లను ఏకం చేస్తుంది. అయితే ప్రతి సమూహానికీ ఒక ప్రత్యేక విముక్తి సిధ్ధాంతం వుంటుంది. బౌధ్ధిక రంగంలో ఆ సిధ్ధాంతాల మధ్య ఒక  ఘర్షణ కొనసాగుతూ వుంటుంది. అణగారిన సమూహాల ఆలోచనాపరులు చేయాల్సిన మొదటి పని ఏమంటే ఆ సిధ్ధాంతాల మధ్యన ఒక సమన్వయాన్ని సాధించడం. అయితే, ఏ కాలంలో అయినా ఏ సమాజంలో అయినా సమన్వయం సహించని ఆలోచనాపరులు కూడ వుంటారు. వాళ్లు మిత్రవైరుధ్యాలని  భూతద్దంలో పెట్టి శతృవైరుధ్యాలుగా చిత్రిస్తుంటారు. దాని ఫలితంగా శతృవైరుధ్యాలు మిత్రవైరుధ్యాలుగా  పరిణమిస్తాయి.

           సమాజంలో ఆర్థిక యజమానులు, ఆర్థిక శ్రామికులు వున్నట్టే, సాంస్కృతిక యజమానులు,  సాంస్కృతిక శ్రామికులు కూడ వుంటారు. ఆర్థిక యజమానులు, సాంస్కృతిక యజమానుల మధ్య ఎలాగూ ఒక ఐక్యత వుంటుంది. దాన్ని ఎదుర్కోవడానికి ఆర్థిక శ్రామికులు, సాంస్కృతిక శ్రామికులు ఏకం అవ్వాల్సి వుంటుంది. అలాంటి ఐక్యతకు అడ్డుపడితే సాంస్కృతిక శ్రామికులు వెళ్ళి సాంస్కృతిక యజమానులు, ఆర్థిక యజమానుల పంచన చేరుతారు.  సామాన్య భాషలో చెప్పాలంటే కార్పొరేట్లకు, యజమాని కులాలకు మధ్య ఎలాగూ ఐక్యత వుంటుంది. వాళ్లకు వ్యతిరేకంగా శ్రామికులు, ఎస్సీ, బిసి తదితర శ్రామిక కులాలు ఏకం కావల్సి వుంటుంది. వాళ్ళు ఏకం కాకుండా అడ్డుపడితే ఎస్సీ, బిసి తదితర శ్రామిక కులాలు వెళ్ళి మనువాదులతో, కార్పొరేట్లతో కలుస్తాయి. వర్తమాన భారత సమాజంలో ఈ పరిణామాలు చాలా వేగంగా సాగుతున్నాయి.   

           బహుజన రచయితల వేదిక (బరవే), బామ్సేఫ్ ల నాయకులు సత్యం కొల్లాబత్తుల ‘బాబాసాహెబ్ అంబేద్కర్ - మార్క్స్ వాద మిత్రుడేకాని భారతదేశ మార్క్సిస్టుల మిత్రుడుకాదు’ అనే శీర్షికతో ఇటీవల ఒక వ్యాసం రాశారు.  రాసింది బరవే, బామ్సేఫ్ ల నాయకులు కనుక  వ్యాసాన్ని చాలా శ్రధ్ధగా చదివాను. ప్రతిపాదించిన  ప్రతి అంశాన్నీ సహృదయంతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను.

           బహుజన కులాలకూ మనువాద కులాలకు మధ్యగల వైరుధ్యమే భారత సమాజంలో ప్రధాన వైరుధ్యం” అని సత్యం చేసిన  సూత్రీకరణ  గొప్ప ఆసక్తిని కలిగించింది. “(1.) బుద్ధుని శాంతియుత మార్గంలో (2.) ఓటు ద్వారా రాజ్యాధికారాన్ని సాధించి (3) మనువాద కుల ఆధిపత్యాన్ని కూలదోసి (4) సమ సమాజాన్ని ఏర్పాటు చెయ్యాలి”  అని  వారు అందులో  ఒక కార్యక్రమాన్ని ప్రతిపాదించారు.

           అనేకమంది అంబేడ్కరిస్టులు చాలా కాలంగా తమ కార్యక్రమం (program) కులనిర్మూలన అని అంటున్నారు. మార్క్సిస్టులకు ‘కమ్యూనిస్టు ప్రణాళిక’ ప్రామాణికం అయినట్టు అంబేడ్కరిస్టులకు ‘కులనిర్మూలన’ పుస్తకం ప్రామాణికం అని కత్తి పద్మారావు వంటివాళ్ళు చెప్పి వున్నారు. అయితే, అంబేడ్కరిస్టులకు నాలుగు దశల కార్యక్రమం వుందని ఇంతకు ముందు ఎవరూ ఇంత స్పష్టంగా చెప్పలేదనుకుంటాను. ఆ పని సత్యం చేశారు.  Satyam deserves appreciation.

           సామాజిక రాజకీయ సిధ్ధాంతాల్ని ఎప్పుడయినా రెండు స్థాయిల్లో విశ్లేషణ చేయాలి.  మొదటిది, సామాజిక స్థాయి. రెండోది, ఆ సిధ్ధాంతాన్ని ఆశ్రయించిన రాజకీయ పార్టీలు ఆచరించిన వ్యూహాలు ఎత్తుగడలు. ఈ అంశం సత్యం వ్యాసంలో కలగాపులగంగా వుంది.

           ఎంఎల్ పార్టీలతోసహా భారత కమ్యూనిస్టు పార్టీలన్నీ అనేక చారిత్రక మలుపుల్లో అనేక తప్పులు చేసి ప్రజల మద్దతును చాలా వరకు కోల్పోయాయి. దేశ రాజకీయాల్లో వాటి ప్రభావం బాగా  తగ్గింది. భారత దేశంలో  అంబేడ్కరిస్టు పార్టీలు, అంబేడ్కరిస్టు నాయకులు సహితం తక్కువ తప్పులు చేయలేదు. కమ్యూనిస్టు పార్టీలు చేసిన తప్పుల్ని మాత్రమే ప్రస్తావించిన సత్యం అంబేడ్కరిస్టు పార్టీలు, అంబేడ్కరిస్టు నాయకులు చేసిన తప్పుల్ని విశాల హృదయంతో మన్నించేశారు; లేదా కష్టపడి కప్పిపెట్టారు.

           ఏడాది క్రితం జరిగిన ఎన్నికల్లో కొన్ని అంబేడ్కరిస్టు పార్టీలు / అంబేడ్కరిస్టు నాయకులు సత్యం చెప్పే ‘మనువాద’ పార్టీలతో జతకట్టాయి. ఏపీలో కూడ పవన్ కళ్యాణ్ జనసేనతో  అంబేడ్కరిస్టు బిఎస్పీ జతకట్టిందనే వాస్తవాన్ని సత్యం ఎలా  మరిచిపోయారో అర్థం కాదు. జనసేన అంతకు ముందూ మనువాద పార్టీలతోనే పొత్తులో వుంది. ఆ తరువాతా మనువాద పార్టీలతోనే పొత్తులో వుంది. ఏపిలో వుభయ కమ్యూనిస్టు పార్టీలు కూడ ఇదే తప్పు చేశాయి.  వర్తమాన పరిణామాలనే గుర్తించలేని వారికి సుదీర్ఘ చారిత్రక పరిణామాల్ని విశ్లేషించగల సామర్థ్యం వుంటుందని  అనుకోవడం కష్టం. 

           ఈ వ్యాసంలో ఇంకా అనేకానేక superficial formulations వున్నాయి. సామాజిక సైధ్ధాంతిక విశ్లేషణ చేసే ఆసక్తికన్నా గట్టున కూర్చుని ఆట చూసేవారిని అలరించే (addressing the gallery) ఆసక్తి ఈ వ్యాసంలో ఎక్కువగా కనిపించింది. ఇలాంటి ధోరణి తెలుగు సినిమాల ఆడియో రిలీజ్ ఫంక్షన్లలో బాగుంటాయి. సత్యం వ్యాసంలోని అన్ని అంశాల్ని కాకపోయినా కొన్ని కీలక అంశాలను అయినా పరిశీలించాల్సి వుంది.

           మాగ్నా కార్టా మీద సంతకం చేశాక 13వ శతాబ్దంలో బ్రిటన్ లో పార్లమెంటరీ వ్యవస్థ నెలకొంది. Declaration of 1789 నుండే ఫ్రాన్స్ లో పార్లమెంటరీ వ్యవస్థ ఏర్పడింది. 1857 తరువాత బ్రిటీష్ పార్లమెంటు నేరుగా భారత కాలనీని పాలించడం మొదలెట్టింది. అంటే మనం ఆనాడే   పార్లమెంటు వ్యవస్థలో అంతర్భాగం అయ్యాము. 1892లో దాదాభాయి నౌరోజి భారతదేశం నుండి బ్రిటీష్ పార్లమెంటుకు ఎన్నికయ్యారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ – 1935 ప్రకారం 1936 చివర్లో భారత గడ్డ మీద ప్రావిన్షియల్ ఎన్నికలు జరిగాయి. ప్రావిన్షియల్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి.

           ఈ సందర్భంగా ఆలోచనాపరులు గుర్తు పెట్టుకోవాల్సింది ఏమంటే  శ్రామికవర్గం విప్లవం ద్వార సోషలిస్టు సమాజాన్ని సృష్టిస్తుంది అనే ఒక సరికొత్త సామాజిక విముక్తి సూత్రాన్ని కార్ల్ మార్క్స్ 1847లో ఆవిష్కరించాడు (invention). బహుజనులు రాజ్యాధికారాన్ని చేపట్టడానికి బాబాసాహెబ్   అంబేడ్కర్ పార్లమెంటరీ పంథాను ఎంచుకున్నారు (selection). ఆవిష్కరించడం, కనుగొనడం (discovery), ఎంచుకోవడం అనేవి స్థాయీ బేధంగల మూడు వేరువేరు చర్యలు. అప్పటికి కొనసాగుతున్న పార్లమెంటరీ పంథాను తిరస్కరించి విప్లవ పంథాను కార్ల్ మార్క్స్ ప్రవేశపెట్టాడు. బాబాసాహెబ్ కొత్తగా కనిపెట్టిన పంథా అంటూ ఏమీలేదు. మార్క్స్ సూచించిన విప్లవ పంథాను తిరస్కరించి బ్రిటీష్ వలస పాలకులు ప్రవేశపెట్టిన పార్లమెంటరీ ప్రజాస్వామ్య సాంప్రదాయానికే కట్టుబడాలని అంబేడ్కర్  సూచించారు.  కుల మత తెగ లింగ వివక్ష లేకుండ  యుక్తవయస్సు వచ్చిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడం (Universal suffrage, universal franchise) భారత రాజ్యాంగపు గొప్ప ప్రజాస్వామిక ఆదర్శాల్లో ఒకటి. భారత లౌకిక రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం నేటి తక్షణ కర్తవ్యం.  

           బ్రిటన్ లో 1893 నుండి Independent Labour Party వుంది. అది అక్కడి Labour Partyకి చంకలో పిల్లగా వుండేది. 1975లో అది తల్లి సంస్థ  అయిన Labour Partyలో విలీనం అయిపోయింది. బ్రిటన్ నుండి భారత రాజకీయాల్లోనికి కాంగ్రెస్ దిగుమతి అయినట్టే Independent Labour Partyని  అంబేడ్కర్ 1936లో ఇక్కడికి దిగుమతి చేసుకున్నారు. 1942లో దాన్ని రద్దు చేసి Scheduled Castes Federationను ఆరంభించారు. అదే 1956లో రిపబ్లికన్ పార్టిగా రూపాంతరం చెందింది. అంబేడ్కర్ రాజకీయ కార్యకలాపాలకు సంబంధించిన ఈ మూడు దశల్లోనూ శ్రామికులు, ఎస్సీలు అనే భావన వుంది. అయితే,  ‘బహుజనులు’ అనే కాన్సెప్ట్ వాటిల్లో అప్పటికి లేదనిపిస్తోంది. బహుజనులు అనే కాన్సెప్ట్ ను 1970లలో  ‘బామ్ సెఫ్’ ద్వార, 1980లలో ‘బిఎస్పి’ ద్వార  కాన్షీరామ్ ముందుకు తెచ్చారు. అయితే, ఈ బహుజన కాన్సెప్ట్ ను తన ఆచరణ ద్వార దెబ్బకొట్టింది కూడ కాన్షీరామే కావడం విచిత్రం!

           ఉత్తరప్రదేశ్ లో 1990ల ఆరంభంలో బిసిల రాజకీయ వేదిక అయిన ఎస్పీ, ఎస్సీల రాజకీయ వేదిక అయిన బిఎస్పిల మధ్య ఒక పొత్తు ఏర్పడింది. ఇది అచ్చమైన బహుజన రాజకీయ పొత్తు. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ వంటి ఇతర రాష్ట్రాలలోనూ ఈ పొత్తుకు సానుకూల ప్రభావం కనిపించింది. (1994లో ‘ఇప్పుడు వీస్తున్న గాలి కాన్షీరామ్’ శీర్షికతో ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో నేను కవర్ పేజి వ్యాసం రాశాను).  అయితే ఆ పొత్తు ఆ ఉత్సాహం ఓ రెండేళ్ళలో ఆవిరైపోయింది. 

           ఉత్తరప్రదేశ్ లో 1996 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో కళ్యాణ్ సింగ్ నాయకత్వంలోని బిజెపికి 174 సీట్లు వచ్చాయి. ములాయం సింగ్ నాయకత్వంలోని ఎస్పీకి 110 సీట్లు వచ్చాయి, మాయావతి (కాన్షీరామ్ ) నాయకత్వంలోని బిఎస్పీకి 67 సీట్లు వచ్చాయి. హంగ్ రావడంతో ప్రభుత్వ ఏర్పాటులో ఐదు నెలల పాటు ప్రతిష్టంభన ఏర్పడింది. బిసి ములాయం సింగ్ కు ఎస్సీ మాయావతి మద్దతివ్వాలా? లేక ఎస్సీ మాయావతికి  బిసి ములాయం సింగ్ మద్దతివ్వాలా? అనే చర్చ సుదీర్ఘ కాలం దేశమంతటా  సాగింది. చివరకు బిజేపి మద్దతుతో మాయావతి ముఖ్యమంత్రి అయ్యారు. మరోమాటల్లో చెప్పాలంటే అంబేడ్కరిస్టులు మనువాదులతో నేరుగా ‘ఎన్నికల అనంతర పొత్తు’ కుదుర్చుకున్నారు. “ఇది అవకాశవాదంకాదు; ఎస్సీలకు  వేల సంవత్సరాల తరువాత దక్కిన అవకాశం” అని ఆరోజు మాన్యవార్ కాన్షీరామ్ ఒక చారిత్రాత్మక ప్రకటన చేశారు. 

           ఆ ప్రకటన ప్రభావంతో మైనారిటీలు, బిసిలు అతి సహజంగానే బిఎస్పీకి దూరం కావడం మొదలెట్టేరు. బిఎస్పీలో చేరి మనువాదుల్ని పరోక్షంగా సమర్ధించడం కన్నా, నేరుగా బిజేపిలో చేరి కీలక పదవుల్ని చేజిక్కించుకోవచ్చనే ఆలోచనలు బిసిల్లో మొదలయ్యాయి. ఆ క్రమంలోనే బిసి సామాజికవర్గానికి చెందిన నరేంద్ర మోదీజీ బిజేపి పక్షాన గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తరువాత భారత ప్రధాని అయ్యారు.  గుజరాత్ మారణ హోమంలో ఎస్సీలు, బిసీలు నిర్వర్తించిన కరసేవ గురించి తెలియనివారు ఇప్పుడు ఎవ్వరూ వుండరు. నరేంద్ర మోదీజీ పిఎంఓ ప్రస్తానానికి బీజాలు ఉత్తర ప్రదేశ్ లో బిఎస్పీ, బిజేపిల మధ్య  1996 ఎన్నికల అనంతరం ఏర్పడిన పొత్తులో వున్నాయి అనంటే అతిశయోక్తికాదు. ఎస్సిల్ని కాన్షీరామ్ మనువాదులకు దగ్గర చేస్తే, మనువాదులకు దగ్గరయ్యే మార్గాల్ని బిసిలు వెతుక్కున్నారు. బిసిలు లేని లోటును తీర్చుకోవడానికి ఇప్పుడు మాయావతి బ్రాహ్మణ సామాజికవర్గాన్ని దగ్గరకు తీసుకునే ప్రయత్నాలు మొదలెట్టారు. ప్రతీ చర్యకూ తద్విరుధ్ధమైన సమానమైన ప్రతి చర్య వుంటుందనే భౌతిక శాస్త్ర సూత్రం సమాజానికీ వర్తిస్తుంది; రాజకీయాలకూ వర్తిస్తుంది.      

          సత్యం వ్యాసంలో కాన్షీరామ్ ప్రస్తావన అనేకసార్లు వుంది గనుక మాన్యవార్ రాజకీయాల్ని కొంచెం వివరంగా  విశ్లేషించాల్సి వచ్చింది. ఇటీవలి కాలం వరకూ మహా అంబేడ్కరిస్టులుగా పోజులు కొట్టిన లోక్ జనశక్తి నాయకులు రామ్ విలాస్ పాశ్వాన్, రిపబ్లికన్ పార్టి ఆఫ్ ఇండియా (ఎ) నాయకుడు రాందాస్ అథవాలే, All India Confederation of SC/ST Organizations నాయకుడు ఉదిత్ రాజ్ తదితరులు సంఘపరివారానికి, మనువాద పార్టీలకు అందించిన, అందిస్తున్న కరసేవల గురించి అందరికీ క్షుణ్ణంగా తెలుసు కనుక వాటిని ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదనిపించింది. 

          ఎస్సీల ఓట్ల కోసం కమ్యూనిస్టు పార్టీలు అంబేడ్కర్ ను దగ్గరకు తీసుకునే కపట ప్రయత్నం చేస్తున్నాయనేది సత్యం వ్యాసంలో ప్రధాన అరోపణ. సామాజిక, రాజకీయ రంగాల్లో  ఈ సత్యానికి తెలియాల్సిన మొదటి సత్యం  ఏమంటే అంబేడ్కర్ ను ఈరోజు మరింత దగ్గరకు తీసుకుంటున్నది మనువాదులే అని. రెండవ సత్యం ఏమంటే, అంబేడ్కర్ ఫొటో పెట్టుకునే రాజ్యాంగంలోని ప్రజాస్వామిక, లౌకిక స్వభావాన్ని తొలగించే ప్రయత్నాలను సాగిస్తున్నది కూడ మనువాదులే అని. మూడవ సత్యం ఏమంటే, బిఎస్పీ ఎన్నికల గుర్తు ఏనుగు ఉత్తర ప్రదేశ్ లో ‘గణేశు’నిగా మారి చాలా కాలం అయిందనీ.  నాలుగవ సత్యం ఏమంటే, ఉత్తర ప్రదేశ్ లో బ్రాహ్మణ ఓటర్లను ఆకర్షించడానికి శ్రీరాముని విగ్రహంకన్నా ఎత్తైన పరశురాముని విగ్రహాన్ని నిర్మించడానికి భాయి ములాయం సింగ్, బహెన్ మాయావతి పోటీలు పడుతున్నారు అని. ఐదవ సత్యం ఏమంటే, ఉత్తరప్రదేశ్ లో దళిత బ్రాహ్మణ ‘భాయిచార’ (సోదరభావం) కోసం బహెన్ జీ రేయింబవళ్ళు కృషిచేస్తున్నారని. ఇదంతా ‘కల్తీలేని’ అంబేడ్కరిజం అని వారంటే మనం చేయగలిగింది ఏమీలేదు. ఆరవ సత్యం ఏమంటే, పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ – అంబేడ్కర్ విరచిత ‘భారత లౌకిక రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమం’లో కమ్యూనిస్టులు చాలా క్రియాశీలంగా పాల్గొన్నారు అని. 

          బహుజనులందరూ కమ్యూనిస్టు పార్టీల్లో చేరి మోసపోయారనడం ఒక అవాస్తవ ప్రకటన.  దేశ జనాభాలో 85 శాతంగా వున్న బహుజనులందరూ కాకపోయినా అందులో మూడో వంతు అంటే 30 శాతం మంది గట్టిగా  మద్దతు ఇచ్చినా కమ్యూనిస్టు పార్టీలు ఏనాడో కేంద్రంలో అధికార పార్టీలుగా మారి వుండేవి. 1952 లోక్ సభ ఎన్నికల్లో నెహ్రు నాయకత్వంలోని కాంగ్రెస్ కు 4 కోట్ల 77 లక్షల ఓట్లు వచ్చాయి. ఏకే గోపాలన్ నాయకత్వంలోని ఉమ్మడి కమ్యూనిస్టు పార్టికి 34 లక్షల 84 వేల ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ కు 45 శాతం. కమ్యూనిస్టు పార్టికి 3.29శాతం ఓట్లు వచ్చాయి. ఈ 3.29 శాతం ఓట్లలో బహుజనుల ఓట్లు ఎన్ని? సత్యం చెప్పిన ‘మనువాద కులాల’ ఓట్లు ఎన్నీ?  ఇఎంఎస్ నంబూద్రిపాద్ ను 1957లో ముఖ్యమంత్రిని చేసిన  కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో  కమ్యూనిస్టు పార్టికి వచ్చిన ఓట్లు 35.28 శాతం మాత్రమే. 

          అమిత్ షా మాటల్లో ‘మూడవ పానిపట్టు (మత)యుధ్ధం’గా సాగిన 2019 సాధారణ ఎన్నికల్లో బిఎస్పీకి పడిన ఓట్లు 3.68 శాతం, సిపిఐ (ఎం)కు పడిన ఓట్లు 1.75 శాతం. సిపిఐకి పడిన ఓట్లు 0.58 శాతం. వుభయ కమ్యూనిస్టులకు పడిన 2.33 శాతం ఓట్లలో యజమాని కులాల ఓట్లు ఎన్నీ? బహుజనుల ఓట్లు ఎన్నీ?   మూడు పార్టీలకు కలిపి మొత్తంగా పడిన 6 శాతం ఓట్లు పోగా మిగిలిన 79 శాతం బహుజనుల ఓట్లు ఎక్కడికి పోయినట్టూ? ఏదైనా చెప్పేటప్పుడు ఒకసారి గణాంకాలు చూసుకుని మాట్లాడాలి. సత్యం చెప్పినవన్నీ సత్యాలు కాదు.

          కమ్యూనిస్టు పార్టీల్లో ఎస్టీ, ఎస్సీ, బిసిలు ఎక్కువ మందే వున్నారుకానీ; ఎస్టీ, ఎస్సీ, బిసిల్లో అత్యధికులు కమ్యూనిస్టు పార్టీల్లో లేరు. పోనీ వాళ్ళు  బహుజన పార్టీల్లో వున్నారా? అంటే అదీ లేదు. ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశం పార్టి  ఆవిర్భవించాక బిసిలు అటువైపు మళ్ళారు. ఎస్సీల్లోని ఒక పాయ కాంగ్రెస్ లో వుంటే ఇంకో పాయ టిడిపికి మద్దతుగా వుండేది. అచ్చంగా ఎస్సీల కోసమే పుట్టిన రిపబ్లికన్ పార్టి కాంగ్రెస్ కు తోకలా వుండేదంటే కొందరు మిత్రులకు అభ్యంతరాలు వుండవచ్చు. రిపబ్లికన్ పార్టి నాయకులు కన్నమరాజ కాంగ్రెస్ నాయకులు జి వెంకటస్వామికి ఒళ్ళో పిల్లాడిలా వుండేవారంటే ఎవరికీ అభ్యంతరం వుండాల్సిన పనిలేదు. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినంత వరకు,  ఆర్పీఐ, బిఎస్పీ, బిఆర్పి, మహాజన ఫ్రంట్ వగయిరా బహుజన పార్టీలన్నింటికి కలిపి ఏ ఎన్నికల్లోనూ 2, 3 శాతానికి మించి ఓట్లు పడలేదు. మొత్తం ఓటర్లలో 85 శాతంగా వున్న బహుజనుల్లో ఓ 3 శాతం బహుజన పార్టీలకు, ఇంకో 2 శాతం కమ్యూనిస్టు పార్టీలకు ఓట్లు వేస్తున్నారు. మిగిలిన 80 శాతం బహుజనులు (వీళ్లు మొత్తం బహుజనుల్లో 94 శాతం) కమ్యూనిస్టేతర, బహుజనేతర మనువాద పార్టీలకు మద్దతు ఇస్తున్నారు. ఇది ఇప్పటివరకు కొనసాగుతున్న బహుజన ఓటింగ్ సరళి.  ఇదీ అసలు విషాదం. ముందుగా పట్టించుకోవాల్సిన విషయం ఇది.           

          మనువాద పార్టీల్లో ఎస్టీ, ఎస్సీ, బిసిల స్థితిగతులు అనే అంశాన్ని సత్యం చాలా కన్వీనియంట్ గా దాట వేశారు. ఇది మేధో దివాళా కోరుతనం. బహుజన సమాజంలో  94 శాతం ఓట్లు మనువాద పార్టీలకు పడుతున్నా సత్యానికి అభ్యంతరం లేదు. ఈ అంశానికి సంబంధించి వారి మొత్తం వ్యాసంలో ఒక్క వాక్యం కూడ లేదు.  కానీ, ఓ 2 శాతం ఓట్లు కమ్యూనిస్టులకు పడడం మీదనే వారికి తీవ్ర అభ్యంతరాలున్నాయి. ఇదీ ఈ అంబేడ్కరిస్టు ఆలోచనాపరుని సామాజిక చైతన్యం.   

          కమ్యూనిస్టు ఉద్యమాల్లో చనిపోయినవారిలో అన్ని కులాలకు అన్ని తెగలకు, అన్ని మతాలకు చెందినవారు వున్నారు. కమ్యూనిస్టు ఉద్యమాల్లో ఎస్టీలు, ఎస్సీలు, బీసిలు మాత్రమే చనిపోయారనడం చరిత్రను అడ్దగోలుగా వక్రీకరించడమే అవుతుంది.  ఈ సందర్భంగా Ammar Ali Jan రచన ‘Study in the Formation of Communist Thought in India’ను సత్యం ఉటంకించారు. ఈ పుస్తకంలో పాక్షిక సామాజిక వాస్తవాలు మాత్రమే వున్నాయి. 

          ఉద్యమాలలో పాల్గొని త్యాగాలు చేసిన సామాజికవర్గాలకు తరువాతి కాలంలో ఒక సామాజిక పెట్టుబడి (social capital) ఏర్పడుతుంది. అలాంటి సామాజిక పెట్టుబడి బ్రాహ్మణ, క్షత్రీయ, వైశ్య, కమ్మ, రెడ్డి, వెలమ, కాపు సామాజికవర్గాలకు మాత్రమే దక్కిందనే అభిప్రాయం కొందరిలో వుంది. నిజానికి ఉద్యమాలలో పాల్గొని త్యాగాలు చేసిన శ్రామిక కులాలకు కూడ సోషల్ కేపిటల్  ఏర్పడుతుంది. అలా సోషల్ కేపిటల్ దక్కడం వల్లనే కమ్యూనిస్టు శిబిరాల నుండి బయటికి వచ్చినవారే తరువాతి కాలంలో ఉనికివాద సిధ్ధాంతకర్తలు, నాయకులు కాగలిగారు. తరువాతి కాలంలో ప్రధాన స్రవంతీ రాజకీయ పార్టీల్లో చేరడానికి వాళ్ళకు గతకాలపు ‘కమ్యూనిస్టు శిక్షణ’ ఒక అర్హతగా మారింది. కాంగ్రెస్, బిజేపి శిబిరాల నుండి శ్రామిక కులాల్లో ఉనికివాద సిధ్ధాంతకర్తలు ఎందుకు రాలేదు? అనేది సత్యాన్వేషకులు అడగాల్సిన మొదటి  ప్రశ్న. 

          ఎస్సీ, బీసీ  సమూహాలను దృష్టిలో పెట్టుకుని సత్యం కులం అనేది ప్రధాన సమస్య అంటున్నారు. ఇటీవలి కాలంలో బిసీలు క్రమంగా అంబేడ్కరిజానికి దూరం అవుతూ మనువాద పార్టీలకు వేగంగా దగ్గరవుతున్న విషయాన్ని వారు గమనించే వుంటారు.  ఎస్సీల తక్షణ సమస్య అస్పృశ్యత, మూకోన్మాద దాడులు (untouchability and lynching). అంబేడ్కరిస్టులు మార్క్సిస్టులు మాత్రమే కాదు ప్రజాస్వామికవాదులు ఎవరయినా ముందు ఆ దురాచారాన్ని, ఆ దాడుల్ని గట్టిగా వ్యతిరేకించాలి. 

           మరోవైపు, దేశ జనాభాలో ఎస్సీలతో సమానంగా వున్న ముస్లింలకు కులం అనేది ప్రధాన  సమస్యకాదు; వాళ్ళ సమస్య మతం, మూకోన్మాదం. ఈ రెండింటినీ సత్యం  పరిగణన లోనికి తీసుకోలేదు. ఎస్టీలకు కూడ కులం మతం రెండూ సమస్యలు కావు; వాళ్ల సమస్య తెగ. మహిళలకు కులం, మతం, తెగ కూడ సమస్యలు కావు. వాళ్ళ సమస్య లింగం (జెండర్). ఎస్సీల కుల సమస్య పరిష్కారంకాగానే మైనారిటీల మతసమస్య, ఎస్టీల తెగ సమస్య, మహిళల లింగ సమస్యలు పరిష్కారం అయిపోతాయి అని ‘మొరటు కమ్యూనిస్టు’ల తరహాలో సత్యం కూడ ప్రకటనలు చేయరని నమ్ముతున్నాను. 

          సత్యం ప్రతిపాదించిన నాలుగు అంచెల సామాజిక విప్లవంలో “బుద్ధుని శాంతియుత మార్గంలో” చేరాలనే ముందస్తు షరతు ఒకటి వుంది. చనిపోవడానికి ఏడు వారాల ముందు 1956 అక్టోబరు 14న  బాబాసాహెబ్ అంబేడ్కర్ బౌధ్ధమతాన్ని స్వీకరించారు. మాన్యవార్ కాన్షీరామ్ కూడ 2006 అక్టోబరు 14న బౌధ్ధమతాన్ని స్వీకరించాలని భావించారు. అయితే అంతకు ముందే వారు చనిపోయారు. కేంద్రంలో బిఎస్పీ అధికారానికి వచ్చాక తాను బౌధ్ధమతాన్ని స్వీకరిస్తానని బహెన్ మాయావతి ప్రకటించియున్నారు. ఉదిత్ రాజ్ అయితే బౌధ్ధాన్ని కూడ తీసుకెళ్ళి మనువాదంతో రాజకీయ హానీమూన్ సాగించారు. ఇప్పుడయితే వారు కాంగ్రెస్ లో వున్నారు. అది వేరే కథ. 

          శ్రీలంక, మయన్మార్ లలో అతి క్రూర నిరంకుశ పాలనను చూశాక కూడ బహుజనులు బౌధ్ధాన్ని స్వీకరించాలని బామ్సెఫ్ నేత షరతు విధించడం ఆశ్చర్యకరం. ఇలాంటి మత మార్పిడి ప్రతిపాదనని ముస్లిం, క్రైస్తవ, శిక్కు మతమైనారిటి సామాజికవర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తాయి. ఇప్పటి బిసి సామాజికవర్గాలు సహితం బౌధ్ధాన్నీ ఆమోదిస్తాయని భావించడం కష్టం. అంచేత, సత్యం ప్రతిపాదించిన నాలుగు అంచెల సామాజిక విప్లవం మొదటి మెట్టు దగ్గరే ఆగిపోయింది. బుధ్ధుని ప్రస్తావనను పక్కన పెట్టి ‘పార్లమెంటరి ప్రజాస్వామ్య పంథా’లో అని ఆ వాక్యాన్ని మారిస్తే బామ్సెఫ్ ప్రతిపాదనను పరిశీలనకు స్వీకరించవచ్చు. 

          సాంప్రదాయ అంబేడ్కరిస్టులు, మార్క్సిస్టులు ఓ డెభ్భయి ఏళ్ళుగా కులం, వర్గం గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. కొట్లాడుకుంటున్నారు. ఆ పంచాయితి ఇంకా తేలలేదు. ఈ డెభ్భయి యేళ్ళ కాలంలో అణిచివేతకు గురయ్యే అనేక సమూహాలు వెలుగులోనికి వచ్చాయి. Class, Caste, Religion, Tribe, Race, Gender, Colour, Disability, Physical Appreance, Sexuality etc etc వంటి ఎన్నో రకాల అణిచివేతలకు వ్యతిరేకంగా ఈ రోజు ఆందోళనలు జరుగుతున్నాయి. వాటిని ఎవరు పట్టించుకోవాలీ?           

        సమాజంలో అనేక సమూహాలు, సామాజికవర్గాల మీద అనేక రూపాల్లో దోపిడీ అణిచివేతలు కొనసాగుతున్నాయని ముందు మనం గమనించాలి. దోపిడీ అణిచివేతకు గురయ్యే ప్రతి సమూహానికీ తమ విముక్తికి సంబంధించిన ఒక ప్రత్యేక సిధ్ధాంతం వుంటుందని కూడ మనం గుర్తించాలి. ఇది Intersectionality. ఇలాంటి చైతన్యం ఈరోజు మనకు చాలా అవసరం. ముందు అణగారిన సమూహాలన్నీ ఏకం కావాలి. అణిచివేతకు గురవుతుండడమే వాళ్ళ మధ్య ఐక్యతకు పునాది.  ఆ సామాన్యాశంతోనే వారు ఏకం అవుతారు. వుమ్మడి ప్రయోజనాల కోసం వివిధ శక్తుల మధ్య ఐక్యసంఘటన ఏర్పడడం తొలి అడుగు. ఆ తరువాత అణగారిన సమూహాల విముక్తి సిధ్ధాంతాల మధ్య ఒక సమన్వయం, సంయమనం ఏర్పడాలి. అణగారిన సమూహాల మధ్య ఐక్యత, వాటి సిధ్ధాంతాల మధ్య సమన్వయం ఒక క్రమంలో ఏర్పడుతాయని ఇప్పటి పరిస్థితిలో ఊహించడం కూడ కష్టమే కావచ్చు. మనం ఇప్పుడు ఊహించలేని అనేక గుణాత్మక పరిణామాలు చారిత్రక అవసరాల రీత్యా  జరుగుతాయి. “మార్క్స్ ను అంబేడ్కర్ తో కల్తీ కానివ్వం”, “అంబేడ్కర్ ను మార్క్స్ తో కల్తీ కానివ్వం” వంటి ఛాందస వాదనలు భేషజాలు ఆరోజు దూది పింజాల్లా గాలికి కొట్టుకుపోతాయి.   ఆ తరువాత సమైక్య విముక్తి పోరాటం ఆరంభం అవడం కూడా ఒక చారిత్రక అవసరమే. అది పార్లమెంటరి ప్రజాస్వామ్య పంథాలోనే సాగుతుందని ఆశిధ్ధాం. ఆ మార్గంలో సకాలంలో ఆశించిన ఫలితాలు రాకపోతే ఇతర మార్గాల్ని పరిశీలించే ఆప్షన్ ఎలాగూ వుంటుంది.

           సిఏఏ, ఎన్పీఆర్, ఎన్నార్సీ, డిటెన్షన్ సెంటర్లను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా మొదలయిన – ‘భారత లౌకిక రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమం’ ఎస్టీ, ఎస్సీ, బిసి, మైనారిటీలు, మహిళలు, శ్రామికులు, ఇతర అణగారిన సమూహాలు, మతసామరస్యవాదులు, పౌర-మానవ హక్కుల కార్యకర్తలు, సామ్యవాదులు,  కమ్యూనిస్టులు, ఫూలేఇస్టులు ఇంకా ఇంకా అనేకులు ఐక్యమై పనిచేయడానికి ఒక గొప్ప అవకాశాన్ని మన ముందుకు తెచ్చింది. ఆరోజు భారత లౌకిక రాజ్యాంగ రచనకు అంబేడ్కర్ నాయకత్వం వహించారు. ఈరోజు భారత లౌకిక రాజ్యాంగ పరిరక్షణకు అంబేడ్కర్ సిధ్ధాంతం నాయకత్వం వహించాలి. భారత లౌకిక రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమానికి సర్వసేనాధిపతి బాబాసాహెబ్ అంబేడ్కర్.  

 హైదరాబాద్

25 ఆగస్టు 2020


Blood Group 'S' Positive

 బ్లడ్‍ గ్రూప్ ‘సేవ’ - పాజిటివ్ 

 

          రాజమండ్రిలో కులమతాలకు అతీతంగా కోవిడ్ మృతులకు అంత్యక్రియలు జరుపుతున్న ఒక బృందం గురించి ఇటీవల బిబిసి తెలుగు వెబ్ సైట్ లో ఒక కథనం  వచ్చింది. ఈ బృందం ఏకంగా కోవిడ్‍ క్వారంటైన్ ను నిర్వహిస్తున్నది. కరోన సోకినవారి ఇళ్ళకు ఆహారం, మందుల్ని పంపిణీ చేస్తున్నది. ఈ బృందానికి నాయకుడు ఆమిర్ పాషా.

 

          నరసాపురం పట్టణంలో కూడ ఇంకో బృదం కోవిడ్ మృతులకు ఇలాంటి సేవల్నే అందిస్తోంది. ఆ బృందానికి నాయకుడు ఫిరోజ్ ఖాన్. లాక్ అవుట్ కాలంలో ఫిరోజ్ ఖాన్ బృందం నరసాపురం పరిసరాల్లోని నిరుపేదలు, వలస కార్మికులకు ఓ నలభై రోజుల పాటు రోజుకు 4 వందల మందికి ఉచిత భోజనం పంపిణి  చేసింది.

 

          హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో  హీనా ఖాన్, సమీనా జంట నిరుపేదలు, వలస కార్మికులకు ఆహారం, మందులు ఉచితంగా పంపిణీ చేశారు. 

 

          ఇందులో ఆశ్చర్యమూ, ఆనందమూ కలిగించే విశేషం ఏమంటే, రాజమండ్రి ఆమీర్ పాషా నా మేనత్త ఆమిరున్నీసా మనవడు; మా దాయాది సోదరుడు పాషా కొడుకు. నరసాపురం ఫిరోజ్ ఖాన్ మా పెదనాన్న తురాబ్ అలీ ఖాన్ మనవడు; మా దాయాది సోదరుడు షానవాజ్ ఖాన్ కొడుకు. హైదరాబాద్ సమీన మా మేనత్త మునవ్వరి కుమార్తె. హీనా ఖాన్ మా బాబాయి గులాం మొహిద్దీన్ ఖాన్ సందాని కుమార్తె.

 

          మేమంతా గులాం గౌస్ ఖాన్, గులాం మొహిద్దీన్ ఖాన్ సోదరుల సంతతి. ఒకరికి తెలియకుండ మరొకరం అందరం సమాజ సేవలోనే వున్నామని తెలిసి చాలా ఆనందం వేసింది. మా బ్లడ్ గ్రూపు ‘ఎస్’. ఎస్ ఫర్ సేవ. ‘ఎస్’ ఫర్ సర్విస్.

Sunday, 16 August 2020

Four Tasks for the depressed Sections

అణగారిన సమూహాలకు నాలుగు లక్ష్యాలు 

1.     1. సమాఖ్య నిర్మాణం

సకల రకాల అణగారిన సమూహాలన్నింటినీ ఏకంచేయడం.

 2.   సిధ్ధాంత సమన్వయం

అణగారిన సమూహాల విమోచన సిధ్ధాంతాల మధ్య సమన్వయాన్ని సాధించడం.

 3.       రాజకీయాధికారం

పీడక సమూహాలను అదుపు చేయడానికి సకల రకాల అణగారిన సమూహాలన్నీ సమైక్యంగా  రాజకీయాధికారాన్ని చేపట్టడం.

 4.     సమసమాజ న్ర్మాణం

          కుల మత తెగ వర్గ లింగ తదితర సమూహాలన్నింటి మధ్య           రాజకీయార్థిక సామాజిక సమానత్వాన్ని ఆచరించే సమాజాన్ని           నిర్మించడం. 


Saturday, 8 August 2020

Thank God for not making me Marxist!

Thank God for not making me Marxist!

నన్ను  మార్క్సిస్టుని చేయనందుకు దేవునికి ధన్యవాదాలు!

-       డానీ 

          ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల బిల్లును వ్యతిరేకిస్తూ మార్క్సిస్టులు చేస్తున్న వాదనలు 1990ల నాటి పరిణామాల్ని గుర్తు చేస్తున్నాయి. 

          భారత లౌకిక రాజ్యాంగంలో ఎస్టీ ఎస్సీలకు ప్రభుత్వ రంగంలోని  విద్యా, ఉపాధి విభాగాల్లో శాశ్విత రిజర్వేషన్ కల్పించారు. శాసన నిర్మాణంలోని దిగువ సభల్లో ఓ పదేళ్ళ కాలానికి రిజర్వేషన్లు ఇవ్వాలనుకున్నారు. దాన్ని ప్రతి పదేళ్ళకు ఒకసారి పొడిగిస్తూ వస్తున్నారు. 

          బీఆర్ అంబేడ్కర్ స్థాపించిన రిపబ్లికన్ పార్టి 1956 నుండే వుందిగానీ అది ఇందిరా గాంధీ హయాంలో కాంగ్రెస్ కు తోక పార్టిలా మారిపోయింది.  దళితుల్లో పెద్ద భాగం కమ్యూనిస్టు పార్టీల్లో వుండేవారు. 1985 నాటి కారంచేడు ఉద్యమం ‘కులం – వర్గం’ అనే చర్చను ముందుకు తెచ్చింది.  కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో బిసిలకు రిజర్వేషన్లు కల్పించడానికి 1979లో మురార్జీ దేశాయి నాయకత్వంలోని జనతా ప్రభుత్వం నియమించిన మండల్ కమీషన్ తన రిపోర్టును 1983లో సమర్పించింది. 1989 ఆగస్టులో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న  విపి సింగ్  మండల్ కమీషన్ సిఫార్సుల్ని ఆమోదించారు. బిసి సామాజికవర్గాల్లో చిగురించిన కొత్త ఆశలు రెండేళ్ళలోనే చల్లారిపోయాయి. పివి నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా వున్న మన్మోహన్ సింగ్ 1991 జులై 24న నూతన ఆర్ధిక విధానం బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారు.  లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ (LPG) దీని లక్ష్యం. కార్పొరేట్లను ప్రోత్సహిస్తే ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందనేది నూతన ఆర్ధిక విధానం సిధ్ధాంతం. ఒకసారి ఆర్ధిక వ్యవస్థ పుంజుకుంటే ముందు పెట్టుబడీదారులు లబ్దిపొందుతారు. ఆ పిదప సామాన్యులకు కూడ ఎంతో కొంత మేలు జరుగుతుందని వారు ఇంకో సూత్రీకరణ చేశారు. దీనినే అర్థిక రంగంలో ఒలికిడి ప్రభావం (Trickle Down Effect) అంటున్నారు.  

          నూతన ఆర్ధిక విధానం తన సమర్ధనగా ఏమి చెప్పినప్పటికీ ఆచరణలో అది ప్రవేటు రంగాన్ని అతిగా ప్రోత్సహించి ప్రభుత్వ రంగాన్ని వేగంగా బలహీనపరుస్తూ వుంటుంది. ఆ మేరకు బలహీనవర్గాలకు  రిజర్వేషన్ల అవకాశాలు తగ్గిపోతుంటాయి.  ఈ పరిణామాల్ని వ్యతిరేకిస్తూ కొత్త తరం అంబేడరిస్టులు, ఫూలేయిస్టులు ముందుకు వచ్చారు. వాళ్లు “రిజర్వేషన్లు – సోషలిస్టు విప్లవం” అనే అంశాన్ని చర్చకు పెట్టారు. 

          నూతన ఆర్థిక విధానాన్ని కమ్యూనిస్టులు ఒకందుకు వ్యతిరేకిస్తుంటే, కొత్త తరం అంబేడరిస్టులు, ఫూలేయిస్టులు ఇంకోకందుకు వ్యతిరేకిస్తున్నారు. ఈ పరిణామాలు ఒక విధంగా కమ్యూనిస్టు పార్టీలకు కలిసి వచ్చిన అదృష్టము. హఠాత్తుగా ఒక యువ సైన్యం వారికి అందుబాటులోనికి వచ్చింది. వాళ్ళ మధ్య నిర్మాణపరంగా ఐక్యత ఏర్పడి వుంటే దేశంలో సామాజిక ఉద్యమం గమనం చాలా వేగాన్ని పుంజుకుని వుండేది. 

          కొత్తగా రంగప్రవేశం చేసిన అస్తిత్వవాదాలతో సమర్ధంగా వ్యవహరించడం నాటి కమ్యూనిస్టు పార్టీల నాయకులకు చేతకాలేదు. విప్లవకమ్యూనిస్టు పార్టీలు సహితం దీనికి మినహాయింపుకాదు. ‘కులం’ అజెండా లోనికి వస్తే తమ మౌలిక అజెండా అయిన ‘వర్గం’ వెనక్కిపోతుందని వాళ్లు భయపడ్డారు. “కోటా కాదు ఎర్రకోట కావాలి” అనే ఒక అతివాద నినాదాన్ని ముందుకు తెచ్చారు. తక్షణ సమస్య ఒకటి ముందుకొచ్చినపుడు దీర్ఘకాలిక సమస్యను అడ్డుపెట్టడం పలాయనవాదం. “రిజర్వేషన్ల వలన కుల అసమానతలు పోతాయని చెప్పటం ప్రజల్ని పక్కదారి పట్టించటమే” అనే ఇంకో గడుసు వాదనను ప్రవేశపెట్టారు. 

          ఈ వాదనకు రెండు పార్శ్వాలున్నాయి. రిజర్వేషన్లను  అతిగా నమ్ముకుంటే  వర్గ పోరాటం ద్వార  సామ్యవాద సమాజాన్ని నిర్మించే కర్తవ్యం నుండి దళితులు పక్కదారి పడతారు అనేది ఒక పార్శ్వం. ఇది నిజాయితీతో కూడిన పార్శ్వం.  రిజర్వేషన్ల అంశాన్ని అసలు చర్చకే రాకుండ నిరాకరించడం మరో పార్శ్వం. ఇది నిజాయితీ లేని పార్శ్వం.  ఆనాటి కమ్యూనిస్టు పెద్దలు చేసిన వాదనల్లో ఈ రెండు పార్శ్వాలూ వున్నాయి. నిజానికి “మాకు కోటా కావాలి. ఎర్రకోటా కావాలి” అని  పిలుపునిస్తే సమస్య పరిష్కారం అయిపోయేది. అలా జరగలేదు. దానితో ఎస్సీలు సమూహాలు సమూహాలుగా కమ్యూనిస్టు పార్టీల నుండి బయటికి పోయారు. పార్టీల కార్యాలయాలు క్రమంగా ఖాళీ అవ్వడం మొదలయ్యాక కమ్యూనిస్టు నాయకులు మేల్కొన్నారు.  సంక్షోభ నివారణ చర్యగా  కమ్యూనిస్టు పార్టీలు అన్నీ అనేక పేర్లతో ‘కుల నిర్మూలన సంఘాలు’ పెట్టాయి.  కానీ, అప్పటికే ఆలస్యం అయిపోయింది. “రిజర్వేషన్ల వలన కుల అసమానతలు పోతాయని చెప్పటం ప్రజల్ని పక్కదారి పట్టించటమే” అనే ప్రకటన కమ్యూనిస్టు పార్టీలకు ఆత్మహత్య సదృశ్యంగా మారింది.  ఆనాటి కమ్యూనిస్టు పార్టీల నేతలు ఇంత స్పష్టంగా మాట్లాడారా? అంటే అదీ లేదు. కాని వాళ్ళు వ్యక్తం చేసిన అభిప్రాయాల సారం మాత్రం ఇదే. 

          నిజానికి రిజర్వేషన్ల వలన కుల అసమానతలు అన్నీ పోతాయని అంబేడ్కర్ కూడ అనలేదు. రిజర్వేషన్లు అనేవి ఒక ఉద్దీపన చర్య మాత్రమే. దళితులు చేయాల్సింది రాజకీయ పోరాటమే. దళితులు రాజ్యాధికారం కోసం పోరాటం చేయాల్సిందే  అని అంబేడ్కర్ కూడా అన్నాడు. రాజకీయ రిజర్వేషన్లను పదేళ్ళకు పరిమితం చేయడం వెనుక అంబేడ్కర్ ఉద్దేశ్యం అదే. 

          ఇందులో విచిత్రం ఏమంటే అస్తిత్వవాదాల్ని కమ్యూనిస్టులకన్నా ద సోకాల్డ్ ప్రధాన స్రవంతీ రాజకీయ పార్టీలే ఆసక్తిగా పట్టించుకుంటున్నాయి. నరేంద్ర మోదీజీని చాయ్ వాలా (క్లాస్)గానూ, బిసి సామాజికవర్గానికి చెందిన అభ్యర్ధి ( క్యాస్ట్ ) గానూ ప్రచారం చేసి బిజెపి గొప్ప లబ్ది పొందింది. ఈ క్లాస్ అండ్ క్యాస్ట్ కాంబినేషన్ కమ్యూనిస్టులకు ఇంకా అబ్బలేదు.

           ఇప్పటి మూడు రాజధానుల కొత్త విధానంలోనూ కమ్యూనిస్టు పార్టీలు పాత తప్పులే చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ అంటే నాలుగు ప్రాంతాల సమాహారం. ఉత్తర ఆంధ్రా, మధ్య ఆంధ్రా, దక్షణ ఆంధ్రా, రాయలసీమ. ఇదొక భౌగోళిక సామాజిక వాస్తవం (Geographical Social Fact). 

           రాజధానిని ఎక్కడ నిర్మించినా మొదట ప్రయోజనం కలిగేది అక్కడి భూ యజమానుల (Land Owners)కు.  ఆ తరువాత ఆర్ధిక వ్యవస్థలో వొలికిడి ప్రభావం (Trickle Down Effect) వల్ల అక్కడి సామాన్యులకు కూడ ఎంతో కొంత పరోక్ష  మేలు జరుగుతుంది. అలాగే రాజధాని తమ ప్రాంతంలో వున్నదనుకోవడం స్థానికులకు  సగర్వంగా (pride)గానూ వుంటుంది. ఇది కూడ ఒక ఉద్దీపన చర్య (Affirmative action).

                     ఈ నేపథ్యంలో రాజధాని నిర్మాణంలో తమకూ వాటా కావాలనీ అన్ని ప్రాంతాలు అడుగుతాయి. అది వాళ్ళ  ప్రజాస్వామిక హక్కు. ఆ హక్కుల్ని ఎలా నెరవేర్చాలని అందరూ ఆలోచించాలి. సాధ్యాసాధ్యాలను గురించి ఆలోచించాలి. భావోద్వేగాలను పరికించాలి. సాంకేతికంగా ఆర్ధికంగా (Technical Feasibility and Economic Viability) సాధ్యం కాదనుకుంటే ఇతర ప్రాంతాల వారిని ఒప్పించాలి. పరిహారాలను ప్రకటించాలి. అమలు చేయాలి.

                     “మూడు ముక్కల రాజధాని వలన ప్రాంతాల అసమానతలు పోతాయని చెప్పటం ప్రజల్ని పక్కదారి పట్టించటమే” అని ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీల నాయకులు చెప్పడం ఒక విచిత్రం. 1990ల నుండి వీరు గుణపాఠాలు నేర్చుకోలేదు. అప్పుడు కులం గురించి మాట్లాడిన భాషనే ఇప్పుడు రాజధాని విషయంలోనూ వాడుతున్నారు.  రాజధానిని మూడు నగరాలకు పంచినంత మాత్రాన రాష్ట్రంలో  ప్రాంతాల మధ్య అసమానతలు అంతరించిపోతాయని ఎవ్వరూ అనడం లేదు. అదొక డెమోక్రాటిక్ డిమాండ్. ప్రాంతాల అసమానతల్ని పోగొట్టడానికి అది కూడ పనికి వస్తుంది.

           కమ్యూనిస్టు పార్టీల నాయకులు ఇటీవలి కాలంలో 13 జిల్లాల్లోనూ వేలాది కిలో మీటర్ల పాదయాత్రలు నిర్వహించారు. ప్రతి జిల్లాలో స్థానిక అభివృధ్ధికి అవసరమైన ప్రాజెక్టుల జాబితాను రూపొందించి పుస్తకాలుగా  ప్రచురించారు. ఇది మహత్తర విషయమం. అందుకు వారిని మెచ్చుకోవాలి. అమరావతి ఉద్యమం పకడ్బందీగా, నిరాఘాటంగా  200 వందల రోజులకు పైగా సాగుతోంది. కమ్యూనిస్టు పార్టీలు తమ పుస్తకాల్లో పేర్కొన వందలాది ప్రాజెక్టుల్లో ఏ ఒక్క దానికోసం అయినా అమరావతి అంతటి వుధృతితో పోరాటాన్ని సాగిస్తున్నారా? అంటే సమాధానం ‘బిగ్ నో’! దీని అర్థం ఏమిటీ? వారికి అమరావతి ప్రధానం. మిగతా ప్రాజెక్టులు అప్రధానం; లేదా లాంఛనం. ఇది మంచి సాంప్రదాయం కాదు.

           రాజు నివశించే నగరాన్ని రాజధాని అనే సాంప్రదాయం మధ్యయుగాల్లో వుండేది. ఆ కాలంలో శాసన, పాలన, న్యాయ వ్యవస్థలతోపాటు ధార్మిక వ్యవస్థకు కూడ అధిపతి రాజే కనుక అప్పుడు అన్ని వ్యవస్థలూ ఒక్కచోటే వుండేవి. ప్రభుత్వాన్ని మతం నుండి దూరం చేయడమేగాక ప్రభుత్వానికి సంబంధిన మూడు వ్యవస్థల్ని విడగొట్టి ప్రతిదానికీ  స్వతంత్ర ప్రతిపత్తి కల్పించడం ప్రజాస్వామిక విప్లవం తెచ్చిన కొత్త విలువ. పెట్టుబడీదారీ విప్లవం తరువాత  యూరప్ లో  రాజధాని  నిర్వచనమే మారిపోయింది. రాజధాని, కేపిటల్ సిటీ అనేవి సమానార్ధకాలు కావు. ఇదీ ఇప్పుడు చర్చించాల్సిన అంశం.

 

          టెలీ కాన్ఫరెన్సుల సాంప్రదాయం ఓ ఇరవై ఏళ్ళుగానే వుంది. వర్చ్యూవల్ సమావేశాలు నిర్వహించుకోవడానికి ఇటీవల జూమ్, గూగుల్ మీట్ తదితర సౌకర్యాలు వచ్చాయి. కరోనా లాక్ డౌన్ కాలంలో వర్క్ ఫ్రం హోం (WFH) అనివార్యం అయిపోయింది. ఈ రోజుల్లోనూ శాసన, పాలన, న్యాయ వ్యవస్థల అధిపతులు ఒకే నగరంలో వుండడం అనివార్యమా?  మనం ఎప్పటికీ అప్ డేట్ కామా?

           కమ్యూనిస్టులనే ఎందుకు తప్పుపట్టాలీ? అనేది ఒక కీలక ప్రశ్న. అమరావతి ఆందోళనకు ఇప్పుడు సైధ్ధాంతిక మద్దతునిస్తున్నది కమ్యూనిస్టు పార్టీలే. అమరావతి ఆందోళన మైనస్ కమ్యూనిస్టు పార్టీలు అది పక్కా టిడిపి ప్రాజెక్టు. టిడిపి అంటే నిన్నటి వరకు పాలకవర్గం. అంచేత, మూడు రాజధానుల బిల్లును సమర్ధించేవారిని పాలకవర్గ బంటులు అనే నైతిక హక్కు కమ్యూనిస్టు పార్టీలకు లేదు. పైగా, మధ్య ఆంధ్రా పక్షపాతులుగా మారిన కమ్యూనిస్టు పార్టీలు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల ప్రజా సమూహాల్లో  తమ ఉనికిని తామే రద్దు చేసుకుంటున్నారు; గతంలో దళిత సమూహాల్లో తమ ఉనికిని రద్దు చేసుకున్నట్టు.

           యధాస్థితిని సమర్ధించే వారు ఎన్నడూ కమ్యూనిస్టులు కాలేరు. “తత్వవేత్తలు ప్రపంచాన్ని రకరకాలుగా నిర్వచించారు; కానీ చేయాల్సిందల్లా దాన్ని మార్చడం” అని కార్ల్ మార్క్స్ చెప్పిన ప్రాధమిక సూత్రం కూడ వీరికి ఇప్పటికీ అర్ధం కాలేదు. మార్క్సిజం ఏం చెపుతున్నదన్నదే కమ్యూనిస్టులకు ప్రాతిపదిక కావాలి.  కమ్యూనిస్టు పార్టిల తీర్మానాలను సహితం మార్స్కిస్టులు విమర్శనాత్మకంగా చూడాలి. తనను సహితం మార్క్సిస్టు ప్రమాణాలతో చూడాలని కార్ల్ మార్క్స్‍ స్వయంగా అన్నాడు. 1870ల నాటి ఫ్రెంచ్ బండ మార్క్సిస్టుల్ని చూశాక కార్ల్ మార్క్స్ చెప్పిన మాటల్ని వర్తమానానికి అన్వయిద్దాం. “భగవంతుడా! (పాపము శమించుగాక కార్ల్ మార్క్స్ కూడా భగవంతుడ్ని తలుచుకున్నాడు) నన్ను  మార్క్సిస్టుని చేయనందుకు నీకు ధన్యవాదాలు” .

 (చర్చలో అభిప్రాయాలు ప్రధానం; వ్యక్తులుకాదు. ఉద్దేశ్య పూర్వకంగా వ్యక్తుల పేర్లను ఈ వ్యాసంలో పేర్కొనలేదు. కానీ, వారికి తెలుసు ఎవర్ని ఉద్దేశించి ఆ వాక్యాలు రాశానో.)

 (రచయిత సీనియర్ జర్నలిస్టు, సమాజ విశ్లేషకులు. మొబైల్ః 9010757776)

 హైదరాబాద్

8 ఆగస్టు 2020

Friday, 7 August 2020

Social Justice is the Buzz Word

 సామాజిక న్యాయం నేటి నినాదం


          1972 నాటి జైఆంధ్రా (ప్రత్యేక ఆంధ్రా) ఉద్యమంతో నేను రాజకీయాల్లో క్రియాశీలంగా మారాను. అప్పటి నుండి నా సిధ్ధాంతం సామాజిక న్యాయం (సోషల్ జస్టీస్).  ఇప్పుడు అధికార పార్టి మెప్పుకోసం నేను అధికార వికేంద్రీకరణ బిల్లును సమర్ధిస్తున్నాననే భావన కొందరిలో వ్యక్తం అవుతోంది. ఇందులో కొందరు నా సహాధ్యాయులున్నారు. సహోద్యోగులూ వున్నారు. మిత్రులూ వున్నారు. అందరి కోసం కాకున్నా నా సన్నిహితుల కోసం ఈ వివరణ ఇస్తున్నాను.

 

          నేను 1978లో COCలో చేరాను. ఆ సంస్థ 1980లో పీపుల్స్ వార్ గా మారింది. నేను చేరడానికి ముందే సివోసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కోరుతూ తీర్మానం చేసింది. నేను సివోసిలో చేరడం అంటే టెలంగాణ కు మద్దతు ఇచ్చినట్టే. ప్రత్యేక తెలంగాణ కోరుతూ కాళోజీ నారాయణరావు నాయకత్వాన  1998లో ‘వరంగల్ డిక్లరేషన్’ వచ్చింది. ఆ సభలోనే ప్రొఫెసర్ జయశంకర్ ను అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. ఆ సభ ఆహ్వాన సంఘానికి ప్రొఫెసర్ సాయిబాబ అధ్యక్షుడు. నేను ఆహ్వానసంఘ సభ్యుడ్ని. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు రూపకల్పన జరుగుతున్నప్పుడు ఆంధ్రా జర్నలిస్టుల ఫోరం నెలకొల్పి విభజనకు ఆంధ్ర ప్రాంత డిమాండ్లను ముందుకు తేవాలని కొంత ప్రయత్నం చేశాను. ‘సమైక్యవాదులు’ దాన్ని అస్సలు పడనివ్వలేదు.

 

          అంతకు ముందు 1986లో రాయలసీమలో జల ఉద్యమం ఆరంభం అయినపుడు కడప, అనంతపురంలలో దాని నాయకులతో చాలా సన్నిహితంగా వున్నాను. అప్పట్లోనే శ్రీభాగ్ ఒప్పందం ప్రాధాన్యాన్ని తెలుపుతూ వ్యాసాలు రాశాను. (ఈ ఫోటోలో పెట్టిన వ్యాసం 1986లో ఉదయం దినపత్రికలో రాసింది. ఇప్పటి ముఖ్యమంత్రికి అప్పుడు 14 ఏళ్లు కూడా వుండవు. 34 ఏళ్ళ తరువాత వారు ముఖ్యమంత్రి అవుతారనీ, పాలన వికేంద్రీకరణ చట్టం తెస్తారని  ముందుగానే తెలిసి వారికి మద్దతు ఇవ్వాలనే ‘కుట్ర’తో రాసిన వ్యాసం కాదిది)

 

          1996లో  రాయలసీమలో జలసాధన ఉద్యమం సాగినపుడూ ఆ నాయకులతో సన్నిహితంగా వున్నాను. అలాగే ఉత్తరాంధ్ర ఆలోచనాపరులతోనూ సన్నిహితంగా వున్నాను. నేను కన్వీనర్ గా వున్న పౌరసమాజం గుంటూరు, విజయవాడల్లో జరిపిన సదస్సుల్లోనూ అమరావతిని నిర్మిస్తున్న తీరు మీద అసంతృప్తిని బాహాటంగానే చెప్పాము. అది ప్రజల రాజధాని కాదనీ ఒక ‘గేటెట్ కమ్యూనిటీ’ అని  పేర్కొన్నాము.  

 

          ఒక రాష్ట్రంలో అనేక ప్రాంతాలువున్నప్పుడు కీలకమైన  ప్రాజెక్టులు నిర్మించే సమయంలో అన్ని ప్రాంతాల మనోభావాలను పరిగణనలోనికి తీసుకోవాలి. అలా చేయకపోతే అసంతృప్తి అసమ్మతిగా మారుతుంది. అసమ్మతి ప్రత్యేక రాష్ట్రం దిశగా అడుగులేస్తుంది. ఇది నా అవగాహన. మిత్రులకు భిన్నాభిప్రాయలుండవచ్చు. Let us agree to disagree.

 

కొత్త ప్రతిపాదనల్ని ప్రజాసంఘాలే ముందుకు తెస్తాయి

 

          (Raffi Syed ! నీ వివరణ చాలా బాగుంది.  I am really happy.)

 

          ఎప్పుడయినా కొత్త ప్రతిపాదనల్ని ప్రజాసంఘాలే ముందుకు తెస్తాయి. పాలక పార్టిలు వాటిని నిర్లక్ష్యం చేస్తాయి. అవహేళన కూడ చేస్తాయి. క్రమంగా ఈ డిమాండు చేసె ప్రజాసంఘాల సంఖ్య పెరుగుతుంది. అవన్నీ ఒక సమాఖ్యగానూ ఏర్పడతాయి. అప్పుడు ఒక రాజకీయ పార్టి ఆవిర్భవిస్తుంది. ఈ పరిణామాల్ని నేను తెలంగాణలో 1998 నుండి అతి దగ్గరగా గమనించాను.  చంద్రబాబు మంత్రి వర్గం నుండి తొలగించడంతో కేసిఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టారని చాలామంది అనుకుంటుంటారు. అది తప్పు.

 

          కేసిఆర్ రవాణాశాఖా మంత్రిగా వుండగానే సెంటర్ ఫర్ సబ్ ఆల్ ట్రన్ స్టడీస్ (CSS) అనే ఒక పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ వెనుకబాటుతనం మీద పరిశోధనలు చేయడం దాని పని. ఆ ఇన్ పుట్ లన్నీ తన చేతికి వచ్చాక కేసిఆర్ TRS ను నెలకొల్పారు. కృష్ణా గోదావరి నదుల కంటూర్స్ లెవల్స్ అన్నీ కేసిఆర్ కు బాగా తెలుసు. ఏ పాయింట్  దగ్గర ఎంత నీటి లభ్యత వుందో  కూడా తెలుసు. ఈ విషయాలను నేను చాలా దగ్గరగా హమనించాను. ఎందుకంటే CSS సంస్థకు నేను కొన్ని నెలలు ఆఫీస్ మేనేజర్ గా వున్నాను.

 

          ఇప్పుడు రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో విద్యావంతులు, ఆలోచనాపరుల వేదికలు కొత్త ప్రతిపాదనతో పనిచేస్తున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీల నేతలు కొందరు వాటికి రహాస్య మద్దతు తెలుపుతుంటారు. వాళ్లు బయట పడి రాజకీయ పార్టీని నెలకొల్పిన  కొత్త ఉద్యమంలో దశ మొదలవుతుంది. అప్పుడు బయటి వారు చేయడానికి ఏమీ వుండదు.  టీఆర్ ఎస్ కు వున్నది ఇద్దరు ఎంపీలే, మొత్తం తెలంగాణకు వున్నది 19 ఎంపీలే ఆంధ్రాప్రాంతానికున్న 25 మంది ఎంపీలతో పోలిస్తే వాళ్లు ‘అల్పసంఖ్యాకులు’ అని ఆంధ్రా నాయకులు గొప్పలకు పోయేవారు. చివర్రకు ఏమయిందో అందరికీ తెలుసు. తెలంగాణ ఇచ్చే నాటికి విజయశాంతి కూడ TRSలోలేరు. ఒక్క ఎంపి 41 ఎంపీలకన్నా బలవంతుడు అనిపించుకున్నాడు.

 

మా డానీ టీవీ ఛానల్ థీమ్ :

#FosterDiversityEquityAndInclusion

#JusticeLibertyEqualityAndFraternity


నేను ఇప్పుడు దానికి అనుగుణంగానే పని చేస్తున్నాను.

 #AmaravatiVisakhapatnamkurnool

#AndhraPradeshThreeCapitalCities

#Amaravati #Kurnaool #Visakhapatnam