Unity of Oppressed groups and integration of the liberation theories
అణగారిన సమూహాల ఐక్యత;
విముక్తి సిధ్ధాంతాల సమన్వయం
డానీ
(Statutory Warning : ఈ వ్యాసాన్ని పిల్లలకు దూరంగా వుంచండి. పిల్లలు జడుసుకునే ప్రమాదం వుంది.)
సమాజంలో ఆర్థిక అణిచివేతను నిర్మూలించి ఒక సమసమాజాన్ని నిర్మించడానికి పుట్టిన సిధ్ధాంతం మార్క్సిజం. సమాజంలో కుల అణిచివేతను నిర్మూలించి ఒక సమసమాజాన్ని నిర్మించడానికి పుట్టిన సిధ్ధాంతం అంబేడ్కరిజం. సమసమాజ నిర్మాణమే రెండు సిధ్ధాంతాల లక్ష్యమూ గమ్యమూ కనుక వాటి మధ్య అతి సహజంగానే ఒక తాత్విక ఐక్యత వుంది. తాత్విక ఐక్యత సామాజిక ఐక్యతకు దారితీస్తుంది. అలాగే, సామాజిక ఐక్యత కూడ తాత్విక ఐక్యతకు దారి తీస్తుంది. విశ్వంలో ఏదైనా అలాగే మాత్రమే కాక తద్విరుధ్ధంగానూ జరుగుతుంది అనేది గతితార్కిక చారిత్రక భౌతికవాద కీలక సూత్రం. కార్ల్ మార్క్స్ అయితే అనేక సందర్భాలో ‘vice versa’ అనేవాడు. పునాది ఉపరితలాన్ని ప్రభావితం చేస్తుందనేది ఒక సూత్రీకరణ అయితే, తద్విరుధ్ధంగా ఉపరితలం కూడ పునాదిని ప్రభావితం చేస్తుంది. గతితర్కం అంటేనే పరస్పర ప్రతిచర్య.
సమాజం
è సాహిత్యం
è సమాజం
సామాజిక
ఐక్యతè తాత్విక
ఐక్యతè సామాజిక
ఐక్యత
ఇలా
వుంటాయి గతితార్కిక చారిత్రక భౌతికవాద సూత్రీకరణలు.
సత్యం వ్యాసంలో కాన్షీరామ్ ప్రస్తావన అనేకసార్లు వుంది గనుక మాన్యవార్ రాజకీయాల్ని కొంచెం వివరంగా విశ్లేషించాల్సి వచ్చింది. ఇటీవలి కాలం వరకూ మహా అంబేడ్కరిస్టులుగా పోజులు కొట్టిన లోక్ జనశక్తి నాయకులు రామ్ విలాస్ పాశ్వాన్, రిపబ్లికన్ పార్టి ఆఫ్ ఇండియా (ఎ) నాయకుడు రాందాస్ అథవాలే, All India Confederation of SC/ST Organizations నాయకుడు ఉదిత్ రాజ్ తదితరులు సంఘపరివారానికి, మనువాద పార్టీలకు అందించిన, అందిస్తున్న కరసేవల గురించి అందరికీ క్షుణ్ణంగా తెలుసు కనుక వాటిని ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదనిపించింది.
ఎస్సీల ఓట్ల కోసం కమ్యూనిస్టు పార్టీలు అంబేడ్కర్ ను దగ్గరకు తీసుకునే కపట ప్రయత్నం చేస్తున్నాయనేది సత్యం వ్యాసంలో ప్రధాన అరోపణ. సామాజిక, రాజకీయ రంగాల్లో ఈ సత్యానికి తెలియాల్సిన మొదటి సత్యం ఏమంటే అంబేడ్కర్ ను ఈరోజు మరింత దగ్గరకు తీసుకుంటున్నది మనువాదులే అని. రెండవ సత్యం ఏమంటే, అంబేడ్కర్ ఫొటో పెట్టుకునే రాజ్యాంగంలోని ప్రజాస్వామిక, లౌకిక స్వభావాన్ని తొలగించే ప్రయత్నాలను సాగిస్తున్నది కూడ మనువాదులే అని. మూడవ సత్యం ఏమంటే, బిఎస్పీ ఎన్నికల గుర్తు ఏనుగు ఉత్తర ప్రదేశ్ లో ‘గణేశు’నిగా మారి చాలా కాలం అయిందనీ. నాలుగవ సత్యం ఏమంటే, ఉత్తర ప్రదేశ్ లో బ్రాహ్మణ ఓటర్లను ఆకర్షించడానికి శ్రీరాముని విగ్రహంకన్నా ఎత్తైన పరశురాముని విగ్రహాన్ని నిర్మించడానికి భాయి ములాయం సింగ్, బహెన్ మాయావతి పోటీలు పడుతున్నారు అని. ఐదవ సత్యం ఏమంటే, ఉత్తరప్రదేశ్ లో దళిత బ్రాహ్మణ ‘భాయిచార’ (సోదరభావం) కోసం బహెన్ జీ రేయింబవళ్ళు కృషిచేస్తున్నారని. ఇదంతా ‘కల్తీలేని’ అంబేడ్కరిజం అని వారంటే మనం చేయగలిగింది ఏమీలేదు. ఆరవ సత్యం ఏమంటే, పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ – అంబేడ్కర్ విరచిత ‘భారత లౌకిక రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమం’లో కమ్యూనిస్టులు చాలా క్రియాశీలంగా పాల్గొన్నారు అని.
బహుజనులందరూ కమ్యూనిస్టు పార్టీల్లో చేరి మోసపోయారనడం ఒక అవాస్తవ ప్రకటన. దేశ జనాభాలో 85 శాతంగా వున్న బహుజనులందరూ కాకపోయినా అందులో మూడో వంతు అంటే 30 శాతం మంది గట్టిగా మద్దతు ఇచ్చినా కమ్యూనిస్టు పార్టీలు ఏనాడో కేంద్రంలో అధికార పార్టీలుగా మారి వుండేవి. 1952 లోక్ సభ ఎన్నికల్లో నెహ్రు నాయకత్వంలోని కాంగ్రెస్ కు 4 కోట్ల 77 లక్షల ఓట్లు వచ్చాయి. ఏకే గోపాలన్ నాయకత్వంలోని ఉమ్మడి కమ్యూనిస్టు పార్టికి 34 లక్షల 84 వేల ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ కు 45 శాతం. కమ్యూనిస్టు పార్టికి 3.29శాతం ఓట్లు వచ్చాయి. ఈ 3.29 శాతం ఓట్లలో బహుజనుల ఓట్లు ఎన్ని? సత్యం చెప్పిన ‘మనువాద కులాల’ ఓట్లు ఎన్నీ? ఇఎంఎస్ నంబూద్రిపాద్ ను 1957లో ముఖ్యమంత్రిని చేసిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టికి వచ్చిన ఓట్లు 35.28 శాతం మాత్రమే.
అమిత్ షా మాటల్లో ‘మూడవ పానిపట్టు (మత)యుధ్ధం’గా
సాగిన 2019 సాధారణ ఎన్నికల్లో బిఎస్పీకి పడిన ఓట్లు 3.68 శాతం, సిపిఐ (ఎం)కు పడిన ఓట్లు
1.75 శాతం. సిపిఐకి పడిన ఓట్లు 0.58 శాతం. వుభయ కమ్యూనిస్టులకు పడిన 2.33 శాతం ఓట్లలో
యజమాని కులాల ఓట్లు ఎన్నీ? బహుజనుల ఓట్లు ఎన్నీ?
మూడు పార్టీలకు కలిపి మొత్తంగా పడిన 6 శాతం ఓట్లు పోగా మిగిలిన 79 శాతం బహుజనుల
ఓట్లు ఎక్కడికి పోయినట్టూ? ఏదైనా చెప్పేటప్పుడు ఒకసారి గణాంకాలు చూసుకుని మాట్లాడాలి.
సత్యం చెప్పినవన్నీ సత్యాలు కాదు.
కమ్యూనిస్టు పార్టీల్లో ఎస్టీ, ఎస్సీ, బిసిలు ఎక్కువ మందే వున్నారుకానీ; ఎస్టీ, ఎస్సీ, బిసిల్లో అత్యధికులు కమ్యూనిస్టు పార్టీల్లో లేరు. పోనీ వాళ్ళు బహుజన పార్టీల్లో వున్నారా? అంటే అదీ లేదు. ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశం పార్టి ఆవిర్భవించాక బిసిలు అటువైపు మళ్ళారు. ఎస్సీల్లోని ఒక పాయ కాంగ్రెస్ లో వుంటే ఇంకో పాయ టిడిపికి మద్దతుగా వుండేది. అచ్చంగా ఎస్సీల కోసమే పుట్టిన రిపబ్లికన్ పార్టి కాంగ్రెస్ కు తోకలా వుండేదంటే కొందరు మిత్రులకు అభ్యంతరాలు వుండవచ్చు. రిపబ్లికన్ పార్టి నాయకులు కన్నమరాజ కాంగ్రెస్ నాయకులు జి వెంకటస్వామికి ఒళ్ళో పిల్లాడిలా వుండేవారంటే ఎవరికీ అభ్యంతరం వుండాల్సిన పనిలేదు. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినంత వరకు, ఆర్పీఐ, బిఎస్పీ, బిఆర్పి, మహాజన ఫ్రంట్ వగయిరా బహుజన పార్టీలన్నింటికి కలిపి ఏ ఎన్నికల్లోనూ 2, 3 శాతానికి మించి ఓట్లు పడలేదు. మొత్తం ఓటర్లలో 85 శాతంగా వున్న బహుజనుల్లో ఓ 3 శాతం బహుజన పార్టీలకు, ఇంకో 2 శాతం కమ్యూనిస్టు పార్టీలకు ఓట్లు వేస్తున్నారు. మిగిలిన 80 శాతం బహుజనులు (వీళ్లు మొత్తం బహుజనుల్లో 94 శాతం) కమ్యూనిస్టేతర, బహుజనేతర మనువాద పార్టీలకు మద్దతు ఇస్తున్నారు. ఇది ఇప్పటివరకు కొనసాగుతున్న బహుజన ఓటింగ్ సరళి. ఇదీ అసలు విషాదం. ముందుగా పట్టించుకోవాల్సిన విషయం ఇది.
మనువాద పార్టీల్లో ఎస్టీ, ఎస్సీ, బిసిల స్థితిగతులు అనే అంశాన్ని సత్యం చాలా కన్వీనియంట్ గా దాట వేశారు. ఇది మేధో దివాళా కోరుతనం. బహుజన సమాజంలో 94 శాతం ఓట్లు మనువాద పార్టీలకు పడుతున్నా సత్యానికి అభ్యంతరం లేదు. ఈ అంశానికి సంబంధించి వారి మొత్తం వ్యాసంలో ఒక్క వాక్యం కూడ లేదు. కానీ, ఓ 2 శాతం ఓట్లు కమ్యూనిస్టులకు పడడం మీదనే వారికి తీవ్ర అభ్యంతరాలున్నాయి. ఇదీ ఈ అంబేడ్కరిస్టు ఆలోచనాపరుని సామాజిక చైతన్యం.
కమ్యూనిస్టు ఉద్యమాల్లో చనిపోయినవారిలో అన్ని కులాలకు అన్ని తెగలకు, అన్ని మతాలకు చెందినవారు వున్నారు. కమ్యూనిస్టు ఉద్యమాల్లో ఎస్టీలు, ఎస్సీలు, బీసిలు మాత్రమే చనిపోయారనడం చరిత్రను అడ్దగోలుగా వక్రీకరించడమే అవుతుంది. ఈ సందర్భంగా Ammar Ali Jan రచన ‘Study in the Formation of Communist Thought in India’ను సత్యం ఉటంకించారు. ఈ పుస్తకంలో పాక్షిక సామాజిక వాస్తవాలు మాత్రమే వున్నాయి.
ఉద్యమాలలో పాల్గొని త్యాగాలు చేసిన సామాజికవర్గాలకు తరువాతి కాలంలో ఒక సామాజిక పెట్టుబడి (social capital) ఏర్పడుతుంది. అలాంటి సామాజిక పెట్టుబడి బ్రాహ్మణ, క్షత్రీయ, వైశ్య, కమ్మ, రెడ్డి, వెలమ, కాపు సామాజికవర్గాలకు మాత్రమే దక్కిందనే అభిప్రాయం కొందరిలో వుంది. నిజానికి ఉద్యమాలలో పాల్గొని త్యాగాలు చేసిన శ్రామిక కులాలకు కూడ సోషల్ కేపిటల్ ఏర్పడుతుంది. అలా సోషల్ కేపిటల్ దక్కడం వల్లనే కమ్యూనిస్టు శిబిరాల నుండి బయటికి వచ్చినవారే తరువాతి కాలంలో ఉనికివాద సిధ్ధాంతకర్తలు, నాయకులు కాగలిగారు. తరువాతి కాలంలో ప్రధాన స్రవంతీ రాజకీయ పార్టీల్లో చేరడానికి వాళ్ళకు గతకాలపు ‘కమ్యూనిస్టు శిక్షణ’ ఒక అర్హతగా మారింది. కాంగ్రెస్, బిజేపి శిబిరాల నుండి శ్రామిక కులాల్లో ఉనికివాద సిధ్ధాంతకర్తలు ఎందుకు రాలేదు? అనేది సత్యాన్వేషకులు అడగాల్సిన మొదటి ప్రశ్న.
ఎస్సీ, బీసీ సమూహాలను దృష్టిలో పెట్టుకుని సత్యం కులం అనేది ప్రధాన సమస్య అంటున్నారు. ఇటీవలి కాలంలో బిసీలు క్రమంగా అంబేడ్కరిజానికి దూరం అవుతూ మనువాద పార్టీలకు వేగంగా దగ్గరవుతున్న విషయాన్ని వారు గమనించే వుంటారు. ఎస్సీల తక్షణ సమస్య అస్పృశ్యత, మూకోన్మాద దాడులు (untouchability and lynching). అంబేడ్కరిస్టులు మార్క్సిస్టులు మాత్రమే కాదు ప్రజాస్వామికవాదులు ఎవరయినా ముందు ఆ దురాచారాన్ని, ఆ దాడుల్ని గట్టిగా వ్యతిరేకించాలి.
మరోవైపు, దేశ జనాభాలో ఎస్సీలతో సమానంగా వున్న ముస్లింలకు కులం అనేది ప్రధాన సమస్యకాదు; వాళ్ళ సమస్య మతం, మూకోన్మాదం. ఈ రెండింటినీ సత్యం పరిగణన లోనికి తీసుకోలేదు. ఎస్టీలకు కూడ కులం మతం రెండూ సమస్యలు కావు; వాళ్ల సమస్య తెగ. మహిళలకు కులం, మతం, తెగ కూడ సమస్యలు కావు. వాళ్ళ సమస్య లింగం (జెండర్). ఎస్సీల కుల సమస్య పరిష్కారంకాగానే మైనారిటీల మతసమస్య, ఎస్టీల తెగ సమస్య, మహిళల లింగ సమస్యలు పరిష్కారం అయిపోతాయి అని ‘మొరటు కమ్యూనిస్టు’ల తరహాలో సత్యం కూడ ప్రకటనలు చేయరని నమ్ముతున్నాను.
సత్యం ప్రతిపాదించిన నాలుగు అంచెల సామాజిక విప్లవంలో “బుద్ధుని శాంతియుత మార్గంలో” చేరాలనే ముందస్తు షరతు ఒకటి వుంది. చనిపోవడానికి ఏడు వారాల ముందు 1956 అక్టోబరు 14న బాబాసాహెబ్ అంబేడ్కర్ బౌధ్ధమతాన్ని స్వీకరించారు. మాన్యవార్ కాన్షీరామ్ కూడ 2006 అక్టోబరు 14న బౌధ్ధమతాన్ని స్వీకరించాలని భావించారు. అయితే అంతకు ముందే వారు చనిపోయారు. కేంద్రంలో బిఎస్పీ అధికారానికి వచ్చాక తాను బౌధ్ధమతాన్ని స్వీకరిస్తానని బహెన్ మాయావతి ప్రకటించియున్నారు. ఉదిత్ రాజ్ అయితే బౌధ్ధాన్ని కూడ తీసుకెళ్ళి మనువాదంతో రాజకీయ హానీమూన్ సాగించారు. ఇప్పుడయితే వారు కాంగ్రెస్ లో వున్నారు. అది వేరే కథ.
శ్రీలంక, మయన్మార్ లలో అతి క్రూర నిరంకుశ పాలనను చూశాక కూడ బహుజనులు బౌధ్ధాన్ని స్వీకరించాలని బామ్సెఫ్ నేత షరతు విధించడం ఆశ్చర్యకరం. ఇలాంటి మత మార్పిడి ప్రతిపాదనని ముస్లిం, క్రైస్తవ, శిక్కు మతమైనారిటి సామాజికవర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తాయి. ఇప్పటి బిసి సామాజికవర్గాలు సహితం బౌధ్ధాన్నీ ఆమోదిస్తాయని భావించడం కష్టం. అంచేత, సత్యం ప్రతిపాదించిన నాలుగు అంచెల సామాజిక విప్లవం మొదటి మెట్టు దగ్గరే ఆగిపోయింది. బుధ్ధుని ప్రస్తావనను పక్కన పెట్టి ‘పార్లమెంటరి ప్రజాస్వామ్య పంథా’లో అని ఆ వాక్యాన్ని మారిస్తే బామ్సెఫ్ ప్రతిపాదనను పరిశీలనకు స్వీకరించవచ్చు.
సాంప్రదాయ అంబేడ్కరిస్టులు, మార్క్సిస్టులు ఓ డెభ్భయి ఏళ్ళుగా కులం, వర్గం గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. కొట్లాడుకుంటున్నారు. ఆ పంచాయితి ఇంకా తేలలేదు. ఈ డెభ్భయి యేళ్ళ కాలంలో అణిచివేతకు గురయ్యే అనేక సమూహాలు వెలుగులోనికి వచ్చాయి. Class, Caste, Religion, Tribe, Race, Gender, Colour, Disability, Physical Appreance, Sexuality etc etc వంటి ఎన్నో రకాల అణిచివేతలకు వ్యతిరేకంగా ఈ రోజు ఆందోళనలు జరుగుతున్నాయి. వాటిని ఎవరు పట్టించుకోవాలీ?
సమాజంలో
అనేక సమూహాలు, సామాజికవర్గాల మీద అనేక రూపాల్లో దోపిడీ అణిచివేతలు కొనసాగుతున్నాయని
ముందు మనం గమనించాలి. దోపిడీ అణిచివేతకు గురయ్యే ప్రతి సమూహానికీ తమ విముక్తికి సంబంధించిన
ఒక ప్రత్యేక సిధ్ధాంతం వుంటుందని కూడ మనం గుర్తించాలి. ఇది Intersectionality. ఇలాంటి
చైతన్యం ఈరోజు మనకు చాలా అవసరం. ముందు అణగారిన సమూహాలన్నీ ఏకం కావాలి. అణిచివేతకు గురవుతుండడమే
వాళ్ళ మధ్య ఐక్యతకు పునాది. ఆ సామాన్యాశంతోనే
వారు ఏకం అవుతారు. వుమ్మడి ప్రయోజనాల కోసం వివిధ శక్తుల మధ్య ఐక్యసంఘటన
ఏర్పడడం తొలి అడుగు. ఆ తరువాత అణగారిన సమూహాల విముక్తి సిధ్ధాంతాల మధ్య
ఒక సమన్వయం, సంయమనం ఏర్పడాలి. అణగారిన సమూహాల మధ్య ఐక్యత, వాటి సిధ్ధాంతాల మధ్య సమన్వయం
ఒక క్రమంలో ఏర్పడుతాయని ఇప్పటి పరిస్థితిలో ఊహించడం కూడ కష్టమే కావచ్చు. మనం ఇప్పుడు
ఊహించలేని అనేక గుణాత్మక పరిణామాలు చారిత్రక అవసరాల రీత్యా జరుగుతాయి. “మార్క్స్ ను అంబేడ్కర్ తో కల్తీ కానివ్వం”,
“అంబేడ్కర్ ను మార్క్స్ తో కల్తీ కానివ్వం” వంటి ఛాందస వాదనలు భేషజాలు ఆరోజు దూది పింజాల్లా
గాలికి కొట్టుకుపోతాయి. ఆ తరువాత సమైక్య విముక్తి పోరాటం ఆరంభం అవడం కూడా
ఒక చారిత్రక అవసరమే. అది పార్లమెంటరి ప్రజాస్వామ్య పంథాలోనే సాగుతుందని ఆశిధ్ధాం. ఆ
మార్గంలో సకాలంలో ఆశించిన ఫలితాలు రాకపోతే ఇతర మార్గాల్ని పరిశీలించే ఆప్షన్ ఎలాగూ
వుంటుంది.
25
ఆగస్టు 2020
No comments:
Post a Comment