Movements Are The Birthplace Of Great Ideas
గొప్ప ఆలోచనల పుట్టినిళ్ళు
ఉద్యమాలు
నా పుట్టిన రోజు సందర్భంగా ఎంతో అభిమానం,
ప్రేమ, ఆత్మీయత, వాత్సల్యాలతో శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ వినయపూర్వక కృతజ్ఞతలు.
నిరంతరం మీ ప్రేమాభిమానాలను పొందడానికి మరింతగా కృషి చేస్తాను.
వ్యాపారమో, ఉద్యోగమో బుధ్ధిగా చేసుకుంటూ పెళ్ళాం బిడ్డల్ని పోషించుకుంటూ
నాలుగు రాళ్లు వెనకేసుకుని ప్రశాంతంగా విశ్రాంత జీవితాన్ని గడిపే అవకాశాలు నాకు చాలా
వచ్చాయి. టోల్ స్టాయ్ ‘అక్కాచెల్లెళ్ళు’ (?) కథలో చెప్పినట్టు రొటీన్ జీవితం నాకు ఏమాత్రం
నచ్చలేదు. కొంచెం భిన్నంగా జీవించడం కోసం కొంత
రిస్క్ తీసుకోవాలనుకున్నాను. అలాంటి నిర్ణయం వల్ల నా కుటుంబ సభ్యులకు చాలా ఇబ్బందులు
కలిగాయి. తల్లిదండ్రుల రుణం తీర్చగలిగేది కాదన్నట్టు నా భార్య అజిత రుణం కూడ తీర్చ గలిగిందికాదు. సారీ అజిత!
అందరికీ వున్నట్టే బాల్యంలో నాకూ కొన్ని
కలలు వుండేవి. అప్పటి కలలు ఊహలకు కూడ అందనంత గొప్ప జీవితం నాకు లభించింది. కొండపల్లి
సీతారామయ్య, కేజి సత్యమూర్తి వంటి యుగపురుషుల్ని కళ్ళతో చూసే అవకాశం కలగడమే మహా భాగ్యం.
వాళ్లు గొప్పగా వెలుగులోవున్న రోజుల్లో నేను
వాళ్లిద్దరికీ చాలా దగ్గరగా వున్నాను. వాళ్ళను ప్రేమించాను. వాళ్ళ ప్రేమను పొందాను.
కొన్ని సందర్భాల్లో అంతే గట్టిగా వాళ్ళతో తగవుపడ్డాను. భాగవతం ఆరంభంలో నన్ను అభిమానించినా,
నాతో విభేదించినా మోక్షం దక్కుతుంది అనే అర్థం వచ్చేలా ఒక మాట వుంటుంది. నాకు ఆ
రెండు రకాల మోక్షాలూ దక్కాయి.
నా
ముందు తరానికి చెందిన వివి కృష్ణారావు, ఐవి సాంబశివరావు, శ్రీశ్రీ,, కేవి రమణారెడ్డి,
చలసాని ప్రసాద్, వరవరరావు, త్రిపురనేని మధుసూదనరావు, రావి శాస్త్రి, కాళిపట్నం రామారావు,
గద్దర్, వంగపండు, అరుణోదయ రామారావు, దేవీప్రియ, బి నర్సింగరావు, వోల్గా, ఆర్ ఎస్ రావు,
ఎంటీ ఖాన్, వైకే, బొజ్జా తారకం, చెరబండరాజు, నగ్నముని, జ్వాలాముఖి, మహీధర రామ్మోహన
రావు, ‘మాభూమి’ సుంకర సత్యనారాయణ, ‘చెట్టు’ ఇస్మాయిల్, ‘ఖాళీ
సీసాల’ ఇస్మాయిల్, ఎం జి రామారావు, ధవళ సత్యం, భూమన్ తదితరులతోనూ -
నా
సమకాలికులైన టి. వెంకట చెలం (సుధాకర్), సివి సుబ్బారావు, బి పరంజ్యోతి, బాలగోపాల్,
కత్తి పద్మారావు, తాడి మోహన్, ఆర్టిస్ట్ టీవీ, బిఎస్ రాములు, ఉసా, ఎం ఎఫ్ గోపీనాధ్,
అబ్దుల్ నూర్ బాషా, కే శ్రీనివాస్, ఖాదర్ మొహియుద్దీన్, కేఎన్ వై పతంజలి, అల్లం రాజయ్య,
అల్లం నారాయణ, గడియారం శీవత్స, కే విజయకుమార్, పిజే వర్ధనరావు, బూర్గుల ప్రదీప్, జయధీర్
తిరుమలరావు, ముంతా పవన్, సతీష్ చందర్, ‘శ్రీశ్రీ’ విశ్వేశ్వరరావు, వేమన వసంత లక్ష్మి,
హరగోపాల్, దాసరి శిరీష తదితరులతోనూ –
నా తరువాతి తరానికి చెందిన త్రిపురనేని శ్రీనివాస్,
కలేకూరి ప్రసాద్, మారోజు వీరన్న, రావులపాటి సీతారామ్, ప్రసేన్, అఫ్సర్, గోసాల ఆశీర్వాదం,
గుంటూరు లక్ష్మీ నరసయ్య, ఎన్ వేణుగోపాల్, సౌదా, అరుణ, దగ్గుమాటి పద్మాకర్, సుజాత సూరేపల్లి,
ఖదీర్ బాబు, వేంపల్లె షరీఫ్, నశీర్ అహ్మద్, ఇక్బాల్ చంద్, షాజహానా, ఖాజా, స్కైబాబ,
యాకూబ్, మోహన్ రామ్మూర్తి, జిఎస్ రామ్మోహన్, జిలుకర శ్రీనివాస్, నూకతోటి రవికుమార్,
గుర్రం సీతారాములు, చల్లపల్లి స్వరూపరాణి, దుర్గం సుబ్బారావు, పసునూరి రవీందర్, బి
చంద్రశేఖర్, దార గోపి, సిహెచ్ సుబ్బరాజు, జహా ఆర, ఆర్ భరద్వాజ తదితరులతోనూ -
జర్నలిజంలో
ఏబికే ప్రసాద్, నండూరి రామ్మోహనరావు, కే రామచంద్రమూర్తి, సి రాఘవాచారి, పొత్తూరి వేంకటేశ్వర
రావు లతోనూ –
రకరకాల
సందర్భాల్లో రకరకాల స్థాయిల్లో కలిసి పనిచేసే అవకాశం నాకు దక్కింది. నా ప్రభావం వాళ్ళ
మీద ఎంత వుందోగానీ, వాళ్లందరి ప్రభావం నా మీద
ఏదో ఒక స్థాయిలో వుంది.
నల్లమలలో యానాదుల దగ్గరి నుండి సెక్రటేరియట్
లో ముఖ్యమంత్రుల వరకు, వలస కార్మికుల నుండి కార్పొరేట్ల వరకు, నక్సలైట్ల నుండి పోలీసు
ఉన్నతాధికారుల వరకు, బైండ్ల కులస్తుల నుండి బ్రాహ్మణుల వరకు, హిందూ మతాధికారుల నుండి ముస్లిం, క్రైస్తవ,
శిక్కు, జైన మతాధికారుల వరకు, మార్ క్సిస్టుల నుండి అంబేడ్కరిస్టుల వరకు, కన్యాకుమారి
నుండి కశ్మీర్ వరకు’ పంజాబ్ నుండి అస్సాం వరకు అందరితో సన్నిహితంగా మెలిగే అవకాశాలు
నాకు దక్కాయి. ఇంతటి వైవిధ్యం కొన్నిసార్లు అపార్థానికి కూడ గురయ్యింది.
వ్యక్తిగత రాగద్వేషాల్ని నేను ఎన్నడూ మేధో సంచయనం (intellectual articulation) లోనికి
రానివ్వలేదు. ఒక తప్పుడు అభిప్రాయాన్ని నా సన్నిహితులు వ్యక్తం చేసినా గట్టిగా విమర్శించాను,
ఒక మంచి అభిప్రాయాన్ని నా వ్యతిరేకులు వ్యక్తం చేసినా గొప్పగా మెచ్చుకున్నాను. గొప్ప
అభిప్రాయం ఎక్కడ వ్యక్తం అయినా దాన్ని గుర్తించాలి స్వీకరించాలి.
మేధస్సు అనేది ఎన్నడూ వ్యక్తిగత వ్యవహారం
కాదు. మేధో సంచయనం ఒక టీమ్ వర్క్. మన కాలంలో గొప్పవాళ్ళుంటే మనమూ గొప్పవాళ్లం అవుతాము.
గొప్ప ఆలోచనలు అంటే మరేమీ కాదు; మనుషులు మరింత
మానవీయంగా బతికే సమాజాన్ని నిర్మించే కృషి మాత్రమే. ప్రపంచ వ్యాప్తంగా గొప్ప ఆలోచనలన్నీ
ఉద్యమాలు ఉధృతంగా వున్నప్పుడే పుట్టాయి. ఉద్యమాలు లేనపుడు చెత్త ఆలోచనలు పుడతాయి. మనిషి
వ్యక్తిగా మారిపోతాడు. మానవజాతికి ఇంతకన్నా హననం మరేదీ వుండదు. ఇప్పుడయినా గొప్ప ఆలోచనలు పుట్టాలంటే గొప్ప ఉద్యమాలు కొనసాగుతుండాలి. ఉద్యమాలులేని
ఆలోచనలు సోషల్ మీడియాలో క్రమంగా ట్రోల్ గా మారి అంతరించిపోతాయి.
ఉద్యమాల్లో పాల్గొనడాన్ని చాలా మంది త్యాగం
అనుకుంటారు. నేను స్వార్ధం అనుకుంటాను. ఉద్యమాల్లో నేను నా స్వార్ధం కోసం పాల్గొన్నాను.
నా
ఆలోచనల్ని మెరుగుపరుచుకుంటూ వుంచడమే నా స్వార్ధం.
ప్రతి ఉద్యమం సమాజపు ఒక కొత్త పార్శ్వాన్ని ఆవిష్కరిస్తుంది. ఉద్యమాలు లేకుంటే ఆ పార్శ్వాలు
ఎన్నటికీ అర్ధం కావు.
స్విడిష్ రచయిత జాన్ మీర్డాల్ కొండపల్లి
సీతారామయ్యను కలుసుకోవడానికి విజయవాడకు వచ్చిన రోజుల్లో నేను కేఎస్ కు సహాయకునిగా వున్నాను.
ఆయన నేను కృష్ణాజిల్లాలో జంటగా తిరిగాము. నన్ను అప్పుడు ఒక విధంగా కేఎస్ కు బాడీగార్డ్
అనుకోవచ్చు. ఇది నాకు ఇప్పటికీ గర్వకారణమైన సంఘటన. కారంచేడు ఉద్యమంలో పాల్గొనడం,
1997 నాటి వరంగల్ డిక్లరేషన్ కు ఆహ్వానసంఘం సభ్యుడిగా వుండడం, బలహీనవర్గాల సమాఖ్య అధ్యక్షునిగా
వుండగా బి పరంజ్యోతి, గోసాల ఆశీర్వాదంలతో కలిసి 2000లో నెల్లూరులో యానాది సంఘాల సమాఖ్యను
నెలకొల్పడం నాకు గొప్ప సంతృప్తినిచ్చిన సంఘటనలు. పంజాబ్, ఢిల్లీలతో అనుబంధం వున్నప్పటికీ
1984 ఢిల్లీ అల్లర్ల కాలంలోనూ, చుండూరు ఉద్యమ కాలంలోనూ తగిన సమయాన్ని కేటాయించలేకపోవడం
అసంతృప్తిగా వుంది.
ఒక ఉద్యమ నాయకునిగా కొండపల్లి సీతారామయ్య
అంటే చాలా అభిమానం. త్రిపురనేని మధుసూదనరావు, ఆర్ ఎస్ రావుల శిష్యరికంలో నేను చాలా
లాభపడ్డాను. ఆ ముగ్గురూ నాకు ప్రత్యక్ష గురువులు. కూర్చోబెట్టి పాఠాలు చెప్పినవారు.
కవిగా శివసాగర్ అంటే చాలా ఇష్టం. మనకాలపు ఆలోచనాపరునిగా బాలగోపాల్ అంటే ఇష్టం. నేను
వారంతటి పవిత్రమైన నిష్ట కలిగిన (puritan) వ్యక్తిని కానప్పటికీ వ్యక్తిగత జీవనానికి
సంబంధించి వరవరరావు నాకు ఆదర్శం.
పుట్టిన
రోజు మీ అందరి అభినందనలు చాలా ఆనందాన్ని ఇచ్చాయి.
మరొక్క సారి అందరికీ పేరుపేరున ధన్యవాదాలు.
సదా
మీ అభిమానాన్ని కోరుకునే
మీ
డానీ
27
ఆగస్టు 2020
No comments:
Post a Comment