I do not have a road map for the
liberation of oppressed groups
అణగారిన సమూహాల విముక్తికి
రోడ్ మ్యాప్ నా దగ్గర లేదు
డానీ
నేను
ఇంతవరకు ఏ ప్రభుత్వం నుండి కూడ ఒక చిన్న లబ్దిని కూడ పొందలేదు. కొంత కాలం నేను విజయవాడ
అక్రిడిటెడ్ జర్నలిస్టుల అసోసియేషన్ కు ప్రెసిడెంట్ గా వున్నాను. సాధారణంగా జర్నలిస్టులకు
ప్రభుత్వం ఇళ్ళ స్థలాలు ఇస్తుంది. నేను ఇప్పటి వరకు అది కూడ పొందలేదు. విజయవాడలో నాకున్న ఇంటి స్థలం కమ్యూనిస్టు పార్టి
మా నాన్నకు ఇచ్చింది. వారసత్వంగా అది నాకు వచ్చింది. ఇది 1980 నాటి సంగతి. నేను జర్నలిస్టు
కాకముందు పరిణామం. నేను 1986 తరువాత వర్కింగ్ జర్నలిస్టు వృత్తిని స్వీకరించాను.
ముఖ్యమంత్రుల్లో
నేను వైయస్ రాజశేఖర రెడ్డి గారికి కొంచెం దగ్గరగా వున్నాను. వారి కాలంలోనూ నేను ఎలాంటి
‘మేళ్ళు’ పొందలేదు.
సన్మానాలకు
నేను దూరం. ప్రభుత్వ సన్మానాలకు పూర్తిగా వ్యతిరేకం.
సృజనాత్మక
మార్క్సిజం అంటే నాకు ఇష్టం. అంబేడ్కర్, ఫూలే, సయ్యద్ అహ్మద్ ఖాన్ రచనలంటే ఆసక్తి. కమ్యూనిస్టు పార్టీల్లో పీపుల్స్
వార్ అంటే ఇష్టం వుండేది. ఇప్పుడు ఆ పార్టీయే లేదు. ఆదర్శంగా పనిచేస్తున్న కమ్యూనిస్టు
పార్టి ఇప్పుడు భారతదేశంలో ఒక్కటీ లేదని నా అభిప్రాయం. అలాగే ఆదర్శవంతమైన అంబేడ్కరైట్
పార్టీ కూడా ఇప్పుడు ఏదీ లేదు. పార్లమెంటరీ రాజకీయాల్లో జాతీయ కాంగ్రెస్ పార్టి అంటే ఒకప్పుడు
కొంత ఆసక్తి వుండేది. ఇప్పుడు అదీ పోయింది.
ST,
SC, BC, Minorites, workers తదితర అణగారిన సమూహాలంటే నాకు చాలా ఆసక్తి. వాళ్ళకు ఇబ్బంది
కలిగినపుడు వెళ్ళి పలకరించి పరామర్శించి వస్తుంటాను. ఏదైనా వేదికల మీద మాట్లాడే అవకాశం దొరికితే వాళ్ళ బాధల గురించి ప్రస్తావిస్తాను.
వీలైతే వాళ్ళకు సహాయపడండని భావసారూప్యం కలవారిని ప్రాధేయపడతాను. అంతేతప్ప, వాళ్ళకు
నేను విముక్తి ప్రదాతని అనుకోను. అంతటి శక్తి నాకు లేదు. నిజానికి అణగారిన సమూహాల విముక్తికి
రోడ్ మ్యాప్ కూడ ఇప్పటికిప్పుడు నా దగ్గర లేదు. ఇతరులు ఎవరి దగ్గరైనా వున్నట్టు కూడ నాకు సమాచారం లేదు.
రాజకీయ
నాయకుల విధానాలు నచ్చినపుడు మెచ్చుకుంటాను. నచ్చనపుడు విమర్శిస్తాను. మెచ్చుకున్నా,
విమర్శించినా పదాలు నమలను. సూటిగా, గట్టిగా చెపుతాను. జగన్ అయినా, చంద్రబాబు అయినా,
పవన్ కళ్యాణ్ అయినా, నరేంద్ర మోదీ అయినా, రాహుల్ గాంధీ అయినా, మరొకరయినా
ఇదే నా పాలసి.
కొందరు
వ్యూవర్స్ నేను జగన్ ను విమర్శించిన రోజు చంద్రబాబు
మనిషని ముద్ర వేస్తారు. నేను చంద్రబాబును విమర్శించిన రోజు జగన్ మనిషని ముద్ర వేస్తారు.
“మావాళ్ళను పొగడండి; లేకుంటే మిమ్మల్ని ఎదుటివాళ్ళకు తొత్తులని ప్రచారం చేస్తాము” అనేది
ఇప్పటి సోషల్ మీడియా ట్రోలింగ్ సంస్కృతి. ట్రోలర్స్ కు మానవ విలువలు వుండవు గాబట్టి నేను వారిని పట్టించుకోను.
కొందరికి
టాపిక్ మీద మాట్లాడడం చేతకాదు. మాట్లాడేంత అధ్యయనంగానీ, దాన్ని వ్యక్తం చేసేంత అభ్యాసంగానీ
వాళ్లకు వుండవు. మదర్ బోర్డు, ప్రాసెసర్, ర్యామ్ చాలా చిన్నవి. కానీ, తమ నాయకుడ్ని విమర్శించి నందుకు మాత్రం వారికి
ఉక్రోషంగా వుంటుంది. ఆ బలహీనతను కప్పిపుచ్చుకోవడానికి వాళ్లు నా మీద నైతిక దాడులు జరుపుతుంటారు.
భగవంతుడు వాళ్ళను మెదడు లేకుండ సృష్టించాడు. అలాంటి అంగవైకల్యం గలవారిని చూసి మనం తప్పక
జాలి పడాలి. అది మానవ ధర్మం. నేను అలాంటి సందర్భాల్లో మానవధర్మాన్ని తప్పక పాటిస్తుంటాను.
మెదడు వుండదు కనుక నేను జాలి చూపించిన సంగతి కూడ వాళ్ళకు అర్థం కాదు. అయ్యో పాపం అనిపిస్తుంది!.
హైదరాబాద్
6 ఆగస్టు 2020
No comments:
Post a Comment