భద్రలోకం, అభద్రలోకం - కమ్యూనిస్టుపార్టీలు
విప్లవోద్యమ నాయకత్వం తన ఆలోచనా శక్తి మేరకు ఒక కార్యక్రమాన్ని రూపొందించుకుంటుంది. సోషలిజం తెస్తానని భారత కమ్యూనిస్టు పార్టీల నాయకత్వం వందేళ్ళుగా చెపుతోంది. నూతన ప్రజాస్వామిక విప్లవం తెస్తామని ఎంఎల్ పార్టీలు 50 యేళ్ళుగా చెపుతున్నాయి. పీపుల్స్ వార్ ప్రకటించుకున్న నూతన ప్రజాస్వామిక విప్లవం చైనాలో వందేళ్ళ క్రితం నాటిది. ఒకరు కార్మికుల విముక్తి అంటున్నారు. ఇంకొకరు రైతు-కూలీల విముక్తి అంటున్నారు. వందేళ్ళలో ఐదు తరాలు సాగిపోయాయిగానీ సోషలిస్టు విప్లవంగానీ, నూతన ప్రజాస్వామిక విప్లవం గానీ పూర్తికాలేదు. ఇది కఛ్ఛితంగా కమ్యూనిస్టు పార్టీల నాయకత్వాల చేతగానితనం.
దేశంలో ఫ్యాక్టరీ కార్మికులు, రైతుకూలీలు మాత్రమే అణగారిన సమూహాలు కావు. తమ సంగతి ఏమిటని మిగిలిన అణగారిన సమూహాలు ముందుగా కమ్యూనిస్టు పార్టీల నాయకత్వాలనే అడిగాయి. మన కమ్యూనిస్టు పార్టీల నాయకత్వం లెనిన్, మావో, హోచిమిన్ లు కారు. వాళ్ళు తమ దేశాల్లో 5, 10 సంవత్సరాల్లో సాధించిన విజయాలను వీళ్ళు వందేళ్ళలోనూ సాధించలేకపోయారు.
అణగారిన సమూహాల సమస్యలకు ఇప్పటి కమ్యూనిస్టు పార్టీల నాయకుల దగ్గర సమాధానాలు లేవు. పైగా తమ సంగతి ఏమిటని అడిగిన వారి మీద మార్క్సిజాన్ని బలహీనపరచడానికి అస్తిత్వవాదాన్ని ముందుకు తెస్తున్నారని నిందలేశారు. తమ విముక్తి మార్గం కమ్యూనిస్టు పార్టీల నాయకత్వం దగ్గర లేదని తేలిపోయిన తరువాత మాత్రమే అస్తిత్వ సమూహాలు కమ్యూనిస్టు పార్టీల్ని వదిలివేశాయి. వాళ్ళు వదిలివేసింది కమ్యూనిస్టు పార్టీలనేగానీ మార్క్సిజాన్ని కాదు. నిజానికి ఈనాటి కమ్యూనిస్టు పార్టీల నాయకత్వం మార్క్సిజాన్ని అధ్యయనం చేయడం మానేసి చాలాకాలం అయింది.
కమ్యూనిస్టు పార్టీలు నిజంగానే అస్తిత్వవాదాన్ని నిరాకరిస్తాయా? అంటే అదీ కాదు. తమకు నచ్చినపుడు బేషరతుగానే తెలంగాణ వంటి అస్తిత్వ ఉద్యమాలను సమర్ధిస్తాయి.
తెలంగాణ ఉద్యమాన్ని సమర్ధించకూడదని నేను ఎన్నడూ అనలేదు. షరతులతో కూడిన సమర్ధన వుండాలన్నాను. పెద్ద మనుషుల ఒప్పందం ఒకటి కుదుర్చుకోవాలన్నాను. కానీ, అలా చేయలేదు. ఈనాటి తెలంగాణ పరిస్థితిని సామాన్యులు ఊహించలేకపోవచ్చు. మావోయిస్టు పార్టి సహితం ఊహించలేకపోవడం చారిత్రక నేరం.
సమాజంతో ఘర్షణ పడాల్సిన అవసరం లేనివాళ్ళు అంటే భద్రలోకం, , సమాజంతో ఘర్షణ
పడాల్సిన అవసరం వున్నవాళ్ళు అంటే అభద్రలోకం ఇద్దరూ విప్లవోద్యమాల లోనికి వస్తారు.
సమాజంతో ఘర్షణ పడాల్సిన అవసరం లేనివాళ్ళు బయటికి పోతే యధాస్థితిలో సులువుగా సర్దుకుపోతారు.
విప్లవకారులుగానూ, యధాస్థితివాదులుగానూ
ద్విపాత్రాభినయం చేసే వెసులుబాటు
భద్రలోకానికి ఎప్పుడూ వుంటుంది. సమాజంతో ఘర్షణ పడాల్సిన అవసరం వున్నవాళ్ళు విప్లవోద్యమాల
నుండి బయటికి పోయినా యధాస్థితితో సర్దుకుపోలేరు. వాళ్ళ జీవితాల్లో సహజంగానే సమాజంతో వుండే ఘర్షణ కొనసాగుతుంది.
No comments:
Post a Comment