చంద్రవంక’ నవల
రచయిత : దుగ్గినపల్లి ఎజ్రాశాస్త్రి
1982-92 మధ్య కాలం
భారత దేశంలోనేగాక మొత్తం ప్రపంచంలో ఒక కల్లోల అధ్యాయం. ఆంధ్రప్రదేశ్ లో కారంచెడు, చుండూరు తదితర గ్రామాల్లో
ఎస్సీల మీద దాడులు జరిగిన కాలం. ముందు దళిత మహాసభ, ఆ పిదప మాదిగ దండోర ఏర్పడిన కాలం.
కాన్షీరామ్ బిఎస్పీ ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశించిన
కాలం కూడ ఇదే.
చంద్రవంక అనే ఒక కల్పిత పాత్ర ఈ ఉద్యమాలన్నింటి మధ్య ఒక నాయకిగా ఎదిగిన క్రమం ఈ
నవల.
అందరికీ తెలిసిన వాస్తవ
స్థలాలు, వాస్తవ సంఘటనలు, వాస్తవ వ్యక్తులే అయినప్పటికీ ఉర్లు, మనుషుల పేర్లను మార్చి
రాశారు. కారంచేడును ‘దారంచేడు’గానూ, చీరాలను ‘చీదరాల’గానూ, చుండూరును ‘తుండూరు’గానూ
మార్చారు. ఈక్రమంలో కత్తిపద్మారావు ‘పరశురాం’ అయ్యారు, బొజ్జా తారకం ‘తారకనాధ్’ అయ్యారు,
గద్దర్ ను ప్రజాయుధ్ధ ’నేత విఠల్ రావు’ గా మార్చారు.
ఇంత పెద్ద కాన్వాస్
ను 91 పేజీల్లో రాయాలనుకోవడం దుస్సాహసం. రచయిత అంతటి సాహసానికి పూనుకున్నాడు. తక్కువ
పేజీల్లో ఎక్కువ విషయాలు చెప్పాలనుకోవడంవల్ల ఓవర్ ప్యాక్డ్ అనే భావం కలిగింది. ఆ కాలం
గురించి తెలుసుకోవాలనుకునేవారు ఈ నవలను చదవవచ్చు.
పేరు మార్పుల్లో భాగంగా
డ్యానీ అనే ఒకే పేరుతో ఈ నవలలో రెండు పాత్రలున్నాయి.
అందులో ఒక పాత్ర జెఎన్ ఎం ప్రతినిధి (పేజీ 36), ఇంకో పాత్ర విద్యాసంస్థ నిర్వాహకుడు
నయీమ్ అనుచరుల్లో ఒకడు (పేజీ 44). కారంచెడు ఉద్యమంతో నాకు ఒక బలమైన అనుబంధం వుందిగానీ
ఈ నవలలోని డ్యానీ పాత్రలకూ నాకూ ఎలాంటి సంబంధంలేదు. నేనెన్నడూ జెఎన్ ఎం ప్రతినిధినీకాను,
విద్యా సంస్థ నిర్వాహకుల అనుచరుడ్నీకాదు.
ఇదొక బాధ్యతారాహిత్యం.
రచయిత తనకు తెలిసిన
సమాజం గురించీ, తెలిసిన విషయాల గురించి రాయాలి. తెలియని విషయాలను మరింత లోతుగా తెలుసుకుని
రాయాలి.
కారంచేడు ఉద్యమంలో
నా పాత్ర గురించి రాయాలని నేనేమీ ఏ రచయితనూ కోరను. ఒకవేళ నా గురించి రాయాల్సిన అవసరం
వస్తే, కొన్ని అంశాలను తప్పకుండా రాయాలి.
1985 జులై 25 నుండి
అక్టోబరు 6 వరకు నేను చీరాల విజయనగర్ శిబిరంలో వున్నాను. కారంచెడు బాధితుల సంఘీభావ
కమిటికి నాయకునిగావున్నాను. అది పీపుల్స్ వార్ కు చెందిన ప్రజాసంఘం. అది కారంచెడు ఉద్యమంలో
కత్తి పద్మారావుతో కలిసి పనిచేసింది. ఆగస్టు 15న గడియారం సెంటరులో భారీ బహిరంగ సభ నిర్వహించాను.
ఈ క్రమం మొత్తంలో బి పరంజ్యోతి అతని కుటుంబం నాకు పూర్తి స్థాయి షెల్టర్ ఇచ్చింది.
సెప్టెంబరు 10 నాటి రాస్తా రోకో కార్యక్రమానికి నాయకత్వం వహించాను. అప్పటికి సలగల రాజశేఖర్ ఉద్యమం నుండి బయటికి వెళ్ళిపోయారు.
రాస్తారోకో చేస్తున్న
వారిని అక్టోబరు రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. వారిని విడుదల చేయాలని కోరుతూ సెప్టెంబరు
11 మధ్యాహ్నం ఊరేగింపు నిర్వహించాము. ఆ ఊరేగింపులో కత్తి పద్మారావు కొంత దూరం వరకు
వచ్చి, ప్రదర్శకులందరి ముందు ఉద్యమ బాధ్యతల్ని
నాకు అప్పచెప్పి, గుంటూరు వెళ్ళిపోయారు. ఆ తరువాత వారు చీరాల రాలేదు.
సెప్టెంబరు 10 నుండి
ఉద్యమం మీద అణిచివేత ఆరంభం అయింది. సెప్టెంబరు
11 సాయంత్రం పోలీసు స్టేషన్ ముందు కారంచేడు బాధితుల మీద కర్కశంగా లాఠీ చార్జ్ జరిపారు.
అనేక మంది గాయపడ్డారు. నేను స్వయంగా కొందరు మహిళల్ని రిక్షాలో వేసుకుని ఆసుపత్రికి
తీసుకుని వెళ్ళాను. రాస్తారోకోలో అరెస్టయిన
వారిని సెప్టెంబరు 12 ఉదయం కోర్టులో ప్రవేశపెట్టారు.
కోర్టుల్ని బహిష్కరించి బాధితుల్ని బయటికి తీసుకుని వచ్చేశాను. బి పరంజ్యోతి ఇంట్లో
పడుకొనివున్న నన్ను సెప్టెంబరు 13 తెల్లవారు జామున అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో
పరంజ్యోతి, వాళ్ళ అన్నయ్య, కత్తి పద్మారావు అనుచరుడు జాన్ తదితరులు వున్నారు. మమ్మల్ని
15 రోజులు రిమాండ్ కు ఒంగోలు జైలుకు పంపించారు. అక్కడి నుండి కండీషన్ బెయిలు మీద విడుదలై
చీరాల వచ్చాక విజయనగర్ శిబిరానికి నేను ఒక్కడ్నే బాధ్యునిగా వున్నాను. ఈ దశ అక్టోబరు
6 వరకు నడిచింది. నేను చీరాల వదిలి వెళతాననే షరతు మీద మా కేసులోని మిగిలినవారి మీద
బెయిల్ కండీషన్లు ఎత్తివేస్తామని పోలీసు అధికారులు చెప్పిన తరువాత నేను విజయవాడ తిరుగు
ప్రయాణం అయ్యాను.
20 అక్టోబరు 2022
No comments:
Post a Comment