వాణిజ్యరంగంలో ముస్లింలు ఎలా వ్యవహరించాలీ?
డానీ
కన్వీనర్, ముస్లిం ఆలోచనాపరుల వేదిక (MTF)
How Should Muslims Deal with Economic Front?
Companionship 2nd Anniversary Speech
11 October 2022
Intro
Respected
President Shabeer Saheb and the dignitaries on the dais and in the conference
hall, I am very much happy to be amongst you this evening.
I
am thankful to the organizers for making me a companion to your organization
Companionship.
మిత్రులారా! నా ప్రసంగాన్ని ఇంగ్లీషులో కొనసాగిస్తే మీలో కొందరికి
అర్ధం కాని పరిస్థితి కనపడుతోంది. నేను ఉర్దూలో ప్రసంగిస్తే మీలో చాలా మందిని ఇబ్బంది
పెట్టినవాడిని అవుతాను. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన నా ఉర్దూ యాస కొంచెం ముతగ్గా
వుంటుంది. అందువల్ల ఎక్కువ మందికి అనువుగా
వుండేలా తెలుగులో మాట్లాడడానికి మీ అనుమతిని కోరుతున్నాను.
Speech
Talking Points
1.
ఓ జర్నలిస్టుగా నేను గతంలో చాలాసార్లు లయన్స్
క్లబ్, రోటరీ క్లబ్ కార్యక్రమాల్లో పాల్గొన్నాను. వాటికి కొనసాగింపుగా వైశ్య సామాజికవర్గంవాళ్ళు
కొన్నేళ్ల క్రితం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ (VCI)ను నెలకొల్పారు. 2018లో జరిగిన VCI ఇంటర్నేషనల్ వార్షికోత్సవాల ఈవింట్ మేనేజ్మెంట్
లో నేను చాలా క్రియాశీలంగా పాల్గొన్నాను.
2.
Federation of Indian Chambers of Commerce
& Industry (FICCI) తరహాలో దళిత కులాలకు చెందిన వాణిజ్య పారిశ్రామికవేత్తలు
డిక్కీ (DICCI) అనే సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. డిక్కీ సంస్థ హైదరాబాద్ లో నిర్వహించిన
ఓ రెండు కార్యక్రమాలకు నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు.
3.
ఆ సందర్భాల్లో ముస్లిం వాణిజ్య, పారిశ్రామికవేత్తలు కూడ ఇలాంటి
ఒక సంస్థను ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని ముస్లిం థింకర్స్ ఫోరం (MTF) కన్వీనర్ గా
నాకు అనిపించింది. దానికోసం కొందరు సన్నిహితులతో కలిసి మాట్లాడాలి అనుకుంటున్న సమయంలో
కంపానియన్ షిప్ వార్షికోత్సవాల్లో ముఖ్యఅతిధిగా పాల్గొనమని నాకు ఆహ్వానం వచ్చింది.
4.
కాలం కలిసిరావడం అంటే ఇదే. అందుకుగానూ కంపానియన్
షిప్ అధ్యక్షులు షాబీర్ సాహెబ్ గారికీ, కార్యదర్శి సిరాజ్ సాహెబ్ గారికి మరీమరీ కృతజ్ఞతలు.
5.
నలుగురు ముస్లింలను ఒక వేదిక మీద కూర్చోబెట్టడం
ఎంత కష్టమో నాకు తెలుసు. అదొక Herculean Task! అలాంటి టాక్స్ ను పూర్తి చేసిన షాబీర్
సాహెబ్ గారికీ, సిరాజ్ సాహెబ్ గారికి ప్రత్యేక అభినందనలు.
6.
మిత్రులారా! వాణిజ్యంలో మొదటి షరతు ఏమంటే అందుబాటులోవున్న
అవకాశాల్ని మీరు ఎంత గొప్పగా ఎంత సంపూర్ణంగా వాడుకోగలరూ
అనేది. దీనినే Optimum Utility అంటారు.
7.
Optimum
Utility అంటే ఇక్కడే ఒక ఉదాహరణ చెపుతాను. ఇంతకు ముందు మనకు ఒక ఆడియో విజువల్ (AV) ప్రెజెంటేషన్
ఇచ్చారు. మానిటర్ స్క్రీన్ 60 అంగుళాలుంది; దాని మీద వీడియో 6 అంగుళాలుంది. వున్న అవకాశాల్లో
90 శాతం వృధా చేసేశారు. ఇది వీడియో తీసే సమయంలో మొబైల్ ఫోన్ ను నిలువుగా పట్టుకోవడంవల్ల
వచ్చిన చేటు. వాళ్ళే కాదు ఇప్పుడు ఈ హాల్లోనూ కొందరు నా ప్రసంగాన్ని మొబైల్ ఫోన్ లను
నిలువుగా పట్టి రికార్డు చేస్తున్నారు. ఇది
ఘోరమైన వృధా.
8.
మీరు ఏ రంగలో అయినాసరే గెలవాలంటే అందుబాటులోవున్న
వనరుల్ని పూర్తిగా సమర్ధంగా వాడుకోవాలి. అలాకాక వృధాచేస్తే మీరు ఓడిపోవడం ఖాయం.
You are deemed to lose!.
9.
ప్రతీ వ్యాపారానికీ, ప్రతీ వృత్తికి, ప్రతీ
పనికి కొన్ని ప్రాధమిక సూత్రాలు వుంటాయి. బేసిక్స్ అంటాము. ప్రతి ఒక్కరికీ తమ రంగానికి
సంబంధించిన బేసిక్స్ తెలిసి తీరాలి. చివరకు వంట చేయడానికి కూడ బేసిక్స్ వుంటాయి. వాటిని
పాటించకపోతే వంట చెడిపోతుంది. వ్యాపారం నష్టపోతుంది.
10.
మీ సభ్యులకు వాళ్ళవాళ్ళ వృత్తులకు సంబంధించిన
బేసిక్స్ ను నేర్పించడానికి ఒక చిన్న శిక్షణ కేంద్రాన్ని నిర్వహించండి. క్వాలిటీ సెంటర్,
Application Lifecycle
Management (ALM) అంటారు వీటిని.
11.
వర్తమాన భారతదేశ వాణిజ్యరంగంలో గుజరాత్ ఆధిపత్యం
చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. ఇటీవల విజయవాడలో
జైన సంఘం ప్రతినిధులు నగర పాలక సంస్థ వున్నతాధికారుల్ని కలిసి ఒన్ టౌన్ పేరును జైన్
టౌన్ గా మార్చమని కోరారని విన్నాను. దానికోసం భారీ విరాళాన్ని కూడ వాళ్ళు ఆఫర్ చేశారట.
12.
నేను విజయవాడలో మార్వాడీ ఖండేల్ వాళ్ళ దగ్గర
రెండేళ్లు పూర్తికాలం పనిచేశాను. గుజరాతీయులకు వాణిజ్య వ్యాపార నియమాలు, డబ్బు చలనం
తాలూకు బేసిక్స్ చాలా బాగా తెలుసు. వాళ్లు టెన్త్ క్లాస్ పాసయ్యేనాటికే అకౌంటెన్సీ
బుక్ కీపింగ్ నేర్చేసుకుంటారు.
13. క్రెడిట్
ను ఎడమ వైపు ఎందుకు రాయాలో, డెబిట్ ను కుడివైపు ఎందుకు రాయాలో తెలియని వ్యాపారుల్ని నేను చూశాను. డే బుక్కు, లెడ్జర్,
ట్రయల్ బ్యాలెన్స్, ట్రేడింగ్ అకౌంట్, లాస్ అంట్ ప్రాఫిట్ అకౌంట్, జిఎస్టీ మంత్లి రిటర్న్స్ పంపడం, మూలధనం, రుణాలు,
వాటి మీద వడ్డి, యంత్రపరికరాలు, ఫర్నిచర్, ఇంటీరియర్స్ మీద తరుగుదల బ్యాలెన్స్ షీట్
వగయిరాల గురించి మనలో చాలామందికి లోతుగా తెలీదు.
14. పాతకాలంలో
లాగ సరుకును పదిరూపాయలకు కొన్నాం; ఇరవై రూపాయలకు అమ్మాం.; పది రూపాయలు జేబులో వేసుకున్నాం
అనుకుంటే ఇప్పుడు చెల్లదు. అదొక ప్రాధమిక స్థాయి మాత్రమే.
15. వ్యాపారం
వాణిజ్యాలు ప్రత్యేక శాస్త్రాలు. వ్యాపార వాణిజ్యరంగాల్లో వున్నవారు నియత విద్యగా అయినా,
అనియత విద్యగా అయినా వాటిని అధ్యయనం చేసితీరాలి. గుజరాతీయులు అనియత విద్య (informal
education)గా ఈ రెండు శాస్త్రాల్ని విస్తారంగా అధ్యయనం చేస్తుంటారు. మన రాష్ట్రంలో
వైశ్య సమూహాల్లో కూడ ఈ సాంప్రదాయం కొనసాగుతోంది. వాళ్లను చూసి మనం కొన్ని మెళుకువలు, కిటుకులు నేర్చుకోవాలి.
16. అసలు మనం
చేస్తున్న వ్యాపారం వుంటుందా? ఊడుతుందా? దాని భవిష్యత్తు ఏమిటీ? విస్తృతి ఎంత? వంటి సమస్తం మనకు తెలిసి వుండాలి.
17. వాణిజ్యాభివృధ్ధికి ఎప్పటికప్పుడు ఎస్-డబ్ల్యూ- ఓ-
టి (SWOT) విశ్లేషణ చాలా ముఖ్యం. వాణిజ్యరంగంలో వున్నారు కనుక మీలో చాలామందికి ‘స్వాట్’
రిపోర్టు గురించి తెలిసే వుంటుంది. తెలియని వాళ్ళ కోసం నేను దాన్ని కొంచెం వివరిస్తాను.
18. ఎస్ -
అంటే స్ట్రెంగ్త్. బలం. డబ్ల్యూ - అంటే వీక్
నెస్; బలహీనతలు. మన వ్యాపారంలో మన బలం ఏమిటీ మన బలహీనతలు ఏమిటీ అనేవి మనకు చాలా క్షుణంగా
తెలిసి వుండాలి. బలహీనతల్ని అధిగమించాలి; బలాన్ని పుంజుకోవాలి.
19. ఓ – అంటే
ఆపర్చ్యూనిటీస్; అవకాశాలు. టి- అంటే థ్రెట్స్; ముప్పు. వ్యాపార విస్తరణకు కొత్త అవకాశాలు
ఎక్కడ వున్నాయని నిరంతరం అన్వేషిస్తుండాలి. ఆక్రమంలో ముంచుకు వచ్చే ముప్పుల గురించి
కూడ నివారణోపాయాల్ని కనుగొంటూ వుండాలి.
20. ఒకప్పుడు
ఇండియా మార్కెట్ ను ఏలిన అనేక బ్రాండ్స్ హఠాత్తుగా మాయమైపోవడం మనకు తెలుసు. 1980లలో
ఒక కొత్త బజాజ్ స్కూటర్ కొనాలంటే బుకింగ్ చేసుకున్న తరువాత నాలుగైదు సంవత్సరాలు ఆగాల్సి
వచ్చేది. రెండు మూడేళ్ళు వాడిన పాత స్కూటర్లను కొత్త రేట్లకు అమ్మేవారు. “ఆమ్ కా ఆమ్
– గుట్లీ కా దామ్” అనేది ఆ కంపెనీ క్యాప్షన్ గా వుండేది. అలాంటిది మన రోడ్ల మీద హఠాత్తుగా బజాజ్ స్కూటర్లు కనిపించకుండాపోయాయి.
వాటికి పోటీ వచ్చేసింది. ముందు కెనటిక్ హోండా, ఆ తరువాత హోండా యాక్టీవా వచ్చి బజాజ్
ను స్కూటర్ల మార్కెట్ నుండి తరిమేశాయి.
21. అలాగే
అప్పెరల్ రంగంలో టిటికే వారి ‘ట్యాంటెక్స్’ ఇన్నర్ వేర్ కొంతకాలం మార్కెట్ లీడర్ గా
వున్నాయి. అవీ హఠాత్తుగా అదృశ్యమైపోయాయి. ఇప్పుడు జాకీ బ్రాండ్ హవా నడుస్తున్నది.
22. జీవపరిణామ
సిధ్ధాంతంలో ఛార్లెస్ డార్విన్ ఏమన్నాడో తెలుసుగా! “Survival
of the biggest” అనలేదు; “Survival of the fittest” అన్నాడు. మీరు ఈ నియమాన్ని అనుక్షణం గుర్తు పెట్టుకోండి. మార్కెట్
పరిణామాలకు ఫిట్ అయ్యే అనువుగా వుండే విధంగా మీ ఉత్పత్తుల డిజైన్లను,
మీరు అందించే సేవల్నీ మారుస్తూ వుండండి.
23. మారిన పరిస్థితులకు మనం అనువుగా మారాలి. Adaption అంటారు.
Adaptability ఒక్కటే జీవికను కాపాడుకునే సూత్రం.
24. వాణిజ్య
రంగంలోని పోటీదారుల నుండే కాకుండా రాజకీయ రంగంలోని వ్యతిరేకుల నుండి కూడ ముస్లింలకు
ముప్పు వుంటున్నది. ఇది కొత్త ట్రెండ్.
25. బెంగళూరులో
పూల వ్యాపారం అనాదిగా ముస్లింల చేతుల్లో వుంది. వాళ్ళ వ్యాపారం మూడుపువ్వులు ఆరు కాయలుగా సాగేది.
ముస్లింలు అంటే గిట్టని కొందరు రాజకీయ నాయకులు
ఇటీవల ముస్లింల దుకాణాల్లో పూలు కొనవద్దని హిందూ సమూహాలకు ఓ పిలుపు నిచ్చారు. అంతే
కొన్ని వారాలపాటు పూల దుకాణాలు మూతపడ్డాయి. ముస్లిం వ్యాపారులు రోడ్డున పడ్డారు. ఈ
ముప్పును వాళ్లు ఊహించలేదు. స్వాట్ లో టీ – ని మరచిపోయారు.
26. అదృష్టావశాత్తు
ఆ వివాదం ఇంకో విధంగా పరిష్కారం అయింది. కర్ణాటకలో పూల తోటల యజమానులు హిందువులు. దుకాణదారుడు కొనకపోతే వాళ్ళు పూలు ఎవరికి అమ్ముకోవాలీ?
అంచేత వాళ్ళు ముస్లిం వ్యాపారులకు మద్దతుగా ఆందోళనకు దిగారు.
27. కశ్మీర్
లోయలో ఈ ఏడాది ఆపిల్ పండ్లు కోతకు వచ్చినప్పుడు హైవేల మీద రాకపోకల్ని ఆపేశారు. రవాణ
స్థంభించిపోవడంతో వేల ట్రక్కుల ఆపిల్ పండ్లు కుళ్ళిపోయాయి. ఆపిల్ రైతుల్లో అత్యధికులు
ముస్లింలు అమి ఇక్కడ మనం గమనించాలి.
28. మీ వ్యాపారం
బాగా నడుస్తున్నా అనుకోని ముప్పులు వస్తాయి అనడానికి ఈ రెండు ఉదాహరణలు ఇచ్చాను.
29. ముస్లిం దుకాణాల్లో పర్చేజింగ్ చేయవద్దు అంటూ ఢిల్లీ బిజెపి పర్వేష్ సాహిబ్ సింగ్ వంటివారు బహిరంగ సభల్లో బాహాటంగా పిలుపులు ఇస్తున్నారు. ఆ ప్రభావం విజయవాడకు కూడ చేరింది. ఈ అంశం మీ దృష్టికి కూడ వచ్చి వుంటుందనుకుంటున్నాను.
30. భవిష్యత్తులో, ముస్లింలకు అమ్మకండి అని కొన్ని
సంఘాలు పిలుపులు ఇచ్చినా ఆశ్చర్య పడనక్కరలేదు. అలాంటి సవాళ్ళకు మీ దగ్గర వాణిజ్యపరమైన సమాధానం వుండాలి.
దానికి సిధ్ధంకండి.
31. మిత్రులారా!
భూమి మీద ముస్లింలకు ఒక కఛ్ఛితమైన విధానం వుండాలి. ఒక శతాబ్దం క్రితం మన దేశంలో ముస్లింలకు
తమ జనాభాకు తగ్గట్టుగా భూమి వుండేది. అది వ్యవసాయ భూమి కావచ్చు లేదా ఇళ్ళ స్థలాలు కావచ్చు.
కానీ ఈరోజు ముస్లిం జనాభాలో 5 శాతానికి కూడా భూమిలేదు. ఇది చాలా పెద్ద ప్రమాద సూచిక.
32. ముస్లింల
భూమి విధానం గురించి నా అనుభవంలో నుండి ఒక
సంఘటన చెపుతాను. ఓ పాతికేళ్ళ క్రితం నేను హైదరాబాద్ పాతబస్తీలో ఓ బతికి చెడిన ఓ ముస్లిం
ఇంటికి ఓ విందుకు వెళ్ళాను. అతను తనకుతాను నిజాం నవాబు కుటుంబానికి చెందిన వాడిగా గొప్పగా
చెప్పుకున్నాడు. ఆరోజుల్లో తన కుటుంబానికి ఎంత భూమి వుందో తనకే తెలియదట. గ్రామాల నుండి
ఎవరయినా ఓ కిలో ‘ఘీ షక్కర్’ (నెయ్యి, బెల్లం)
తీసుకుని ఇస్తే సంతోషపడి ఓ రెండు ఎకరాలు రాసి
ఇచ్చేవాడట. ఓ రోజు నిజాం సంస్థానం అంతరించిపోయింది. తన భూమి దానంగా పొందినవారు ధనికులయ్యారు.
తను బికారి అయ్యాడట. ఇదెలా జరిగిందంటే, తను అందరి పేరున పత్రాలు రాశాడుగానీ తన పేరున
తాను ఏ పత్రమూ రాసుకోలేదట. పత్రాలువున్న భూముల్ని కొత్త ప్రభుత్వం క్రమబధ్ధం
చేసిందట.
33. మనది కాని
కాలం ఇది. ఇప్పటికే చాలా చోట్ల ముస్లింలకు ఇళ్ళు అద్దెకు ఇవ్వడంలేదు. అద్దెకు వున్నవాళ్లని
క్రమంగా ఖాళీ చేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
34. స్వంత
భూమి లేనివారికి ఇక్కడ నివశించే వీలులేదు అనే క్రూరమైన నిబంధనలు వచ్చినా ఆశ్చర్యపడనక్కరలేదు.
35. కంపానియన్
షిప్ ఈ విషయంలో జాగ్రత్తలు వహించి భూమి విధానం మీద ముస్లిం సమాజంలో ఒక స్పృహను కల్పించాలని కోరుతున్నాను.
36. సేవారంగంలో ముస్లింలకున్న నైపుణ్యం అందరి మన్ననల్ని అందుకుంది. మెకానిక్ అంటే ముస్లిం
గుర్తుకు వస్తాడు. మొదటితరం యంత్రపరికరాలనేగాక, రెండవతరం, మూడవతరం యంత్రపరికరాలను సహితం
రిపేరు చేసే సామర్ధ్యం ముస్లిం మెకానిక్కులకు వుంది.
37. ఎలక్ట్రానిక్స్
రంగంలో ఒక మల్టీనేషనల్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ఎలక్ట్రానిక్ ఇంజినీర్లతో
ఐదేసి పదేసి ఏళ్ళు కష్టపడి రూపొందించిన కంప్యూటర్ ను పదోతరగతి కూడ పాస్ కాని ఓ ముస్లిం
బాగుచేస్తుండడాన్ని మనం తరచూ చూస్తుంటాం. హార్డ్ వేర్ సాంకేతిక రంగంలో ముస్లింల సామర్ధ్యం
అలాంటిది మరి.
38. సేవారంగంలో
కొంతకాలంగా మన సామర్ధ్యానికి ఒక ముప్పు వచ్చింది. వాచీ రిపేర్లు, గొడుగుల రిపేర్లు,
తాళాల రిపేర్లు వంటి వృత్తులు అంతరించి పోతున్నాయి. పాత పార్ట్స్ ను లేతు మిషన్ల మీద
రిపేరు చేసి కొత్త జీవాన్నిపోసే అవసరం లేకుండా పోతోంది. యూజ్ అండ్ థ్రో విధానం వచ్చేస్తున్నది.
దానితో, రిపేరర్, మెకానిక్ ల ప్రాధాన్యం తగ్గిపోతున్నది. మనం ఇప్పుడు ప్రత్యామ్నాయాలను
అన్వేషించాలి.
39. ఇప్పుడు
లోకల్ వ్యాపారానికి ఇంకో ముంపు వచ్చింది. దేశ
వాణిజ్య, పారిశ్రామిక రంగాల్ని ఏలుతున్న మెగా కార్పొరేట్లు లోకల్ కంపెనీలను మింగేస్తున్నాయి.
దీనినే Merger and Acquisition Strategy అంటున్నారు.
40. ఈ ఏడాది
విజయవాడ జరిగిన ఒక ఉదాహరణనే మీకు చెపుతాను. ఆంధ్రా తెలంగాణ రాష్ట్రాల్లో దాదాపు 25-30
మాల్స్ గల ఓ టెక్స్ టైల్స్ రిటైల్ ఔట్ లెట్స్ ఫ్రాంఛైజీవుంది. దాన్ని రిలయన్స్ సంస్థ
ఒక ఫ్యాన్సీ ప్రైజ్ ను ఆఫర్ చేసి కలుపుకుంది.
41. ఆ ఫ్యాన్సీ
ప్రైస్ ఒక సర్ ప్రైజ్ కూడ. దాని మీద కొన్నాళ్ళు వాణిజ్యరంగంలో పెద్ద చర్చ జరిగింది. అంత ఆకర్షణీయమైన ధర చెల్లించడానికి రిలయన్స్ సంస్థ కు
రెండు కారణాలున్నాయి. మొదటిది; రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సాలీన ఆదాయం 6 బిలియన్
డాలర్లు. రోజుకు దాదాపు 1200 కోట్ల రూపాయలు. వాళ్లు బేరసారాల్లో గంటలు కూడ వృధా చేయరు.
“మూ బోలీ దామ్” పడేస్తారు. రెండవది, రెండు రాష్ట్రాల్లో కొత్తగా 25 అవుట్ లెట్స్ ను
నిర్మించడానికి, వృత్తి నైపుణ్యంగల స్టాఫ్ ను రిక్రూట్ చేయడానికి, కొత్త బ్రాండ్ ను
ప్రమోట్ చేయడానికి కనీసం రెండు మూడేళ్ళు పడుతుంది. దానికన్నా నడుస్తున్న సంస్ద్థను
అదిరిపోయే ఫ్యాన్సీ ధర చెల్లించి తక్షణం కలుపుకోవడమే వారికి లాభం.
42. వ్యాపార
వాణిజ్యాల్లో సంవత్సరాలు, నెలలు మాత్రమేకాదు నిముషాలు సెకన్లు కూడ కౌంట్ అవుతాయి.
43. మధ్యయుగాల
రాజులు అనుసరించిన యుధ్ధ వ్యూహాలను ఇప్పుడు మెగా కార్పొరేట్లు అనుసరిస్తున్నాయి. క్రీస్తు పూర్వం నాలుగవ శతాబ్దపు అలెగ్జాండర్
వీరికి
ఇప్పుడు గొప్ప ఆదర్శంగా మారాడు.
44. మసిడోనియా రాజు హత్యకు గురికావడంలో
యువరాజు అలెగ్జాండర్ 21వ ఏట రాజయ్యాడు. పాత సైన్యాన్ని ప్రక్షాళన చేయడంలో, కొత్త సైన్యాన్ని
సమకూర్చుకోవడంలో, రాజ్యాలను కబళించడంలో, యుధ్ధ వ్యూహాల్లో గొప్ప నైపుణ్యాన్ని ప్రదర్శించాడు.
లొంగిపోయిన రాజుల్ని తన ప్రతినిధులుగా నియమించేవాడు. తిరస్కరించిన వారిని అంతం చేసేవాడు.
చాలా తక్కువ రోజుల్లో ప్రపంచ విజేత అయ్యాడు. అలెగ్జాండర్ -ద –గ్రేట్ గా చరిత్రలో నిలబడ్డాడు.
45. ఈ ఉపన్యాసం కోసం నేను బ్రియాన్ ట్రేసీ (Brian Tracy) పుస్తకం ‘బిజినెస్ స్ట్రాటెజీస్’
(Business Strategy) ఓ సారి తిరగేశాను. మొదటి ఛాప్టర్ మొత్తం అలెగ్జాండర్ రూపొందించిన
యుధ్ధ వ్యూహాల మీదే వుంది.
46. కష్టకాలం నుండి గట్టెక్కడానికి శిక్కు సామాజికవర్గం నుండి మనం ఒక ప్రేరణను పొందవచ్చు.
47. 1984 అక్టోబరు చివర్లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీని ఆమె బాడీగార్డ్స్ అయిన
ఇద్దరు శిక్కు యువకులు హత్యచేశారు. దానికి
ప్రతీకారంగా అంటూ మూకోన్మాదులు, అల్లరి మూకలు ఢిల్లీలో శిక్కుల మీద ఊచకోత సాగించారు. రాజధాని నగరంలోనే 3 వేల మంది శిక్కులు
చనిపోయారు. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఇంకో వెయ్యి మంది చనిపోయారు.
48. ఈ నరమేధం
తరువాత ఢిల్లీ శిక్కు పెద్దలు సమావేశమై ఒక భవిష్యత్ కార్యాచరణను రూపొందించారు. కాంగ్రెస్
లోని మతతత్త్వవాదులు కొందరు ఈ నరమేధానికి జనాన్ని ఉసిగొల్పారన్నది అందరికీ తెలిసిన
విషయమే. గానీ, ఈ జనం ఎందుకు అంతగా రెచ్చిపోయి కసితో కక్షతో తమ మీద దాడి చేశారో వారికి
అర్ధం కాలేదు. జనానికి తమ మీద ఒక అసహనం, అసూయ, అక్కసు వంటివి వున్నట్టు వాళ్లు గుర్తించారు.
ముందు ఈ సామాజిక వాతావరణాన్ని మార్చి, ఢిల్లీ పౌరుల ప్రేమాభిమానాలను తిరిగి పొందే మార్గాలను వాళ్లు అన్వేషించారు.
49. ఢిల్లీ
శిక్కులు ఏ రంగంలోవున్నా తమ కష్టమర్లకు గొప్ప క్వాలిటీ సేవలు ఇవ్వాలని ఆ సమావేశంలో
తీర్మానించుకున్నారు.
50. అప్పట్లో
ఢిల్లీలో ఆటోరిక్షాల వాళ్లు ప్రయాణికుల్ని అనేక రకాలుగా మోసం చేసేవారు. ముందు అది ఆగిపోయింది.
శిక్కుల ఆటో ఎక్కితే చార్జి తక్కువ, సరిగ్గా గమ్యానికి చేరుస్తారనే మాట వచ్చేసింది.
సరుకులూ అంతే. శిక్కుల దుకాణాల్లో తక్కువ ధరకు నాణ్యమైన సరుకు దొరుకుతుందనే నమ్మకం
కలిగింది. అలా ఓ ఐదారు నెలల్లోనే శిక్కులు ఢిల్లీ నగరంలో తమ పూర్వ వైభవాన్ని పుంజుకున్నారు.
51. ఆరోజు
ఢిల్లీ శిక్కులు ఎదుర్కొన్నంతటి సవాళ్ళు ఈనాటి ముస్లింలకు లేకపోవచ్చు. గానీ, మన చుట్టూ
ఒక అసహన వాతావరణం ఏర్పడుతున్నదని మాత్రం గమనించాలి.
52. ‘నాణ్యమైన
సేవ’ అనేది మన వాణిజ్య కార్యకలాపాల్లో తొలి
ప్రమాణం కావాలి.
53. ఇప్పుడు
నేను మన అంతర్గత సమస్యల గురించి మాట్లాడుతాను. “ముస్లింలు పీతలబుట్ట లాంటివాళ్లు; ఒకడు
ఎదుగుతూ వుంటే మరొకడు వాడి కాళ్ళు పట్టుకుని లాగుతుంటాడు” అనే మాటను మనం తరచూ వింటుంటాం. ఇందులో నిజం లేకపోలేదు.
54. అయితే
ఇది ముస్లిం సమాజపు ప్రత్యేక సమస్య ఏమీకాదు. ప్రపంచంలో పతన దిశగా సాగుతున్న సమూహాలన్నీ
అంతర్గత కుమ్ములాటల్లో కూరుకుంటుంటాయి. అభివృధ్ధి దిశగా సాగే సమూహాలన్నీ సమిష్టిగా
వ్యవహరిస్తుంటాయి. అంతర్గత కుమ్ములాటలనేవి ఏ సామాజికవర్గానికి అయినా పతన దశ లక్షణమే.
55. పతన దిశగా
ప్రయాణిద్దామా? లేక వికాశం దిశగా ప్రయాణిద్దామా? ఈ విషయం మీద మనం ఒక గట్టి నిర్ణయం
తీసుకోవాలి. మనం నిలదొక్కుకుని వికాసాన్ని సాధించాలంటే మాత్రం మనలో ఐక్యత చాలా ముఖ్యం.
56. ప్రపంచ
చరిత్రలో ఇస్లాంకు కూడ ఒక స్వర్ణయుగం అధ్యాయం వుంది. ఎనిమిదవ శతాబ్దం నుండి 15వ శతాబ్దం
వరకు ఇది గొప్పగా వెలిగింది. ప్రపంచ స్థాయి శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు, ఆలోచనాపరులు,
కవులు, కళాకారులు, వాణిజ్యవేత్తలతో ముస్లిం సమాజం విలసిల్లిన కాలం అది.
57. ఇవ్వాళ ప్రపంచ వ్యాప్తంగా వాడుతున్న అంకెలు అరేబియన్ వే.
మహత్తరమైన ‘సున్నా’ భారత దేశంలో పుట్టింది. ఆ తరువాత గణితాన్ని అల్ ఖ్వారిజ్మి వంటి
అరేబియన్ శాస్త్రజ్ఞులు గొప్పగా అభివృధ్ధి చేశారు.
58. ముస్లిం
పౌరస్మృతి నుండి అకౌంటెన్సీ పుట్టింది. చనిపోయిన వారి ఆస్తిని వారసులు ఏఏ నిష్పత్తిలో
పంచుకోవాలనేది ముస్లిం సమాజంలో చాలా క్లిష్టమైన
వ్యవహారం. ఈ సమస్యను పరిష్కరించడానికి మూ-హసాబా రూపుదిద్దుకుంది. మనం సాధారణంగా హిసాబ్
కితాబ్ అంటుంటాం. అదే ఆధునిక అకౌంటెన్సీకి మూలం.
59. అల్ జీబ్ర అనేదే అరబిక్ పదం. ‘చితికిపోయిన ముక్కల్ని కూర్చడం’ అని దానికి మూల
అర్ధం. స్క్వేర్ రూట్లు, క్యూబ్ రూట్లు కూడ ఆ కాలంలోనే అభివృధ్ధి చెందాయి.
60. ఇప్పుడు
నేను వ్యాపారానికి సంబంధించిన కొన్ని సాంప్రదాయాల్ల్ని గుర్తు చేస్తాను. సరుకును కొన్న
ఖరీదుకు రెట్టింపు చేసి అమ్మకపు ధర నిర్ణయిస్తే, అమ్మకాల మీద 50 శాతం స్థూల లాభం వస్తుందని
దాదాపు అందరికీ తెలుసు. సేల్స్ ప్రమోషన్ కోసం 10-15 శాతం డిస్కౌంట్ ఇస్తే స్థూల లాభం
శాతం సుమారుగా 33 శాతం వుంటుంది. స్థూల లాభం వేరు; నికర లాభం వేరు అని మీకు తెలుసు.
అయినా, ఇవన్నీ పాత లెఖ్ఖలు. ప్రాధమిక గణాంకాలు.
61. ఆధునిక
వాణిజ్యంలో లాభం శాతం అనేది ఎన్నడూ కీలకం కాదు. టర్నోవర్ చాలా ముఖ్యం. లాభం శాతాన్ని
బాగా తగ్గించి, టర్నోవర్ ను భారీగా పెంచగలిగితే మొత్తమ్మీద భారీ నికర లాభాలు వస్తాయి
అనేది ఆధునిక వ్యాపార సూత్రం.
62. సిబ్బందికి
జీతాలు తక్కువ ఇచ్చి, ఎక్కువ గంటలు పనిచేయుంచుకుంటే ఖర్చు ఆదా అవ్వడమేకాకుండ ఉత్పత్తి
కూడ పెరుగుతుందని గత కాలపు మొరటు పెట్టుబడీదారులు భావించేవారు. ఇప్పుడు ట్రెండ్ మారింది.
కార్యాలయాల్ని అందంగా తీర్చిదిద్ది, సిబ్బందికి పనిగంటలు తగ్గించి, ఎక్కువ జీతాలు చెల్లించి, వీకెండ్ సెలవులు ఇచ్చి, ఏడాదికి ఓ వారం అన్ని ఖర్చులు
భరించి టూర్లకు పంపిస్తే ఔట్ పుట్ క్వాలిటీ,
క్వాంటమ్ రెండూ బాగుంటాయని మార్కెట్ వ్యూహకర్తలు
సూచిస్తున్నారు.
63. బిఎస్
ఎన్ ఎల్ భారీగా చార్జీలు వసూలు చేసి భారీగా నష్టాల్లో కూరుకుపోవడాన్నీ, జియో ఉచితంగా సేవలు అందించి భారీగా లాభల్ని సాధించడాన్ని
మనం చూశాం. వాణిజ్యానికి ఇప్పుడు ఈ కిటుకులు కావాలి. ఇలాంటి నైపుణ్యం కావాలి.
64. ఇక్కడ
ముస్లిం సమాజానికి సంబంధించిన రెండు సున్నితమైన అంశాలను నేను ప్రస్తావించాలనుకుంటున్నాను.
కొంచెం సహనంతో ఆలకిస్తారని నమ్ముతున్నాను.
65. మొదటిది; బ్యాంకింగ్, ఫైనాన్సింగ్ లేకుండ భారీ వ్యాపారం,
వాణిజ్యం సాగదు. ప్రపంచ ఆర్ధిక వ్యవస్థను ప్రపంచ బ్యాంకు శాసిస్తుంది. వడ్డీ విధానం
మీద మనకున్న వ్యతిరేకత మనల్ని బ్యాంకింగ్ వ్యవస్థకు
దూరం చేస్తున్నది. ధార్మిక ఆదేశాల కారణంగా ముస్లింలు వడ్డీ కోసం రుణాలు ఇవ్వకపోవచ్చు.
కానీ, బ్యాంకుల నుండి వడ్డీకి రుణాలు తీసుకోకుండ
పెద్ద వ్యాపారం ఆరంభమేకాదు.
66. రెండోది;
వాణిజ్యరంగంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో, ఈరోజు సింహభాగం లిక్కర్ ది. ముస్లిం సమాజానికి దాని మీద కూడ వ్యతిరేకత
వుంది.
67. వడ్డీ
లేకుండా రుణాలిచ్చే ఇస్లామిక్ బ్యాంక్, బైతుల్ మాల్ గురించి నాకు తెలుసు. అది ఒక ఆదర్శమేతప్ప
వర్తమాన ప్రపంచంలో ఆచరణ సాధ్యం కాని విధానం.
68. హాకర్స్ వంటి కొందరు చిరు వ్యాపారులకు ఇస్లామిక్ బ్యాంక్ ల ద్వార కొంత మేలు జరుగుతున్నమాట వాస్తవం. అయితే, దాని పరిధీ పరిమితి చాలా స్వల్పం. ఆ బ్యాంకుల్లో కూడ ఆఫీసు అద్దెలు, కరెంటు, సిబ్బంది జీతాలు, స్టేషనరీ, బకాయిల వసూలు యంత్రాంగం వగయిరా ఖర్చుల్ని పూడ్చుకోవడానికి ఒక శాతం అయినా సర్వీసు చార్జీల రూపంలో వసూలు చేయక తప్పదు.
69. రెండు
తెలుగు రాష్ట్రాల వార్షిక బడ్జెట్ దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు. ఈ రెండు రాష్ట్రాల
ఆర్ధిక కార్యకలాపాల్లో ఓ పాతిక కోట్ల రూపాయల మూలధనంతో ఏర్పడిన ఇస్లామిక్ బ్యాంక్ ప్రభావం
ఎంత? 0.00005 శాతం!
70. ఆర్ధికరంగంలో
సాంప్రదాయికంగా మనం పెట్టుకున్న ఆంక్షలు మనల్ని ఆర్ధికరంగం నుండి వెలివేతకు గురిచేస్తున్నాయి.
దీన్ని పెద్దలు గమనించాలి; పట్టించుకోవాలి; పరిష్కరించాలి.
71. మధ్య ఆసియా
దేశాల ఆర్ధిక దృక్పధంలో ఇటీవల చాలా మార్పులు వస్తున్నాయి. ఈ మార్పుల్ని మనం ముఖ్యంగా
దుబాయిలో చూడవచ్చు. న్యూ ఎడిషన్ యాపిల్ ఫోన్ ఇండియాలో కన్నా దుబాయ్ లో 30 వేల రూపాయలు
తక్కువ. హైదరాబాద్ నుండి ఫ్లయిట్లో వెళ్ళి కొనుక్కొని వస్తున్నారు జనం. అక్కడ ఆ వ్యాపారం
చేస్తున్నదీ ముస్లింలే. వాళ్ళ నుండి మనం చాలా నేర్చుకోవాలి.
72. కష్టమర్లకు
మీరెవరూ అన్నది అంత ముఖ్యం కాదు; మీరు ఎంత నాణ్యమైన సేవలు అందిస్తారన్నది మాత్రమే ముఖ్యం.
73. మార్కెట్
నియమాలను అధ్యయనం చేసి పాటించకపోతే మీరు ఓడిపోతారు. మార్కెట్ నియమాల మీద పట్టు సాధించి
పాటిస్తే మీరే విజేతలు. మీరు విజేతలుగా మారాలని
ఆశిస్తాను.
74. మార్కెట్
లో ఎప్పుడయినా విజయ సూత్రం ఒక్కటే; “నాణ్యమైన సేవ”!
75. ధన్యవాదాలు.
విజయవాడ
11 అక్టోబరు 2022
No comments:
Post a Comment