కమ్యూనిజం వేరు; కమ్యూనిస్టు పార్టీలు వేరు
డానీ
పీకాక్ క్లాసిక్స్ సంపాదకుడు ఎ. గాంధి వ్యాసం ‘సిపిఐ : తల ఎత్తుకుని నడుస్తుందా?’ (ఆంధ్రజ్యోతి ఎడిట్ పేజీ 15 ఏప్రిల్ 2023) మీద స్థూలంగా ఏకాభిప్రాయం వుంది. అయితే భారత కమ్యూనిస్టు పార్టిలు చేసిన మరికొన్ని ప్రధానమైన తప్పుల్ని పేర్కొనడం ఈ వ్యాసం మరిచింది. వాటిల్లో కొన్నింటిని అయినా ఈ సందర్భంగా పేర్కోవాల్సిన అవసరం వుంది.
చర్చలోనికి వెళ్ళడానికి ముందు ఒక అంశాన్ని స్పష్టం చేయాలి. కమ్యూనిజం వేరు; కమ్యూనిస్టు పార్టీలు వేరు. ప్రపంచంలో ఎక్కడయినా సరే అణగారిన సమూహాలు తమ కష్టాలనుండి విముక్తి చెందడానికి సమానత్వాన్ని కోరుకుంటాయి. వాళ్ళకు కార్ల్ మార్క్స్ తెలియకపోవచ్చు, కమ్యూనిస్టు ప్రణాళిక తెలియకపోవచ్చు. స్వభావసిధ్ధంగానే వాళ్లు సమానత్వాన్ని అభిమానిస్తారు. వాళ్ళను ‘ఆర్గానిక్ కమ్యూనిస్టులు’ అనాలి. కమ్యూనిస్టు పార్టి అనేది ఒక వ్యవస్థ. ఆ పార్టీల నాయకులు ఆర్గానిక్ కమ్యూనిస్టులు అంతటి సాత్వికులు కాదు.
బ్రిటీష్ ఇండియాలో కమ్యూనిస్టు పార్టి 1920లో ‘ఇండియన్ కమ్యూనిస్టు పార్టిగా’ తాష్కెంట్ లో పుట్టింది. ఖిలాఫత్ ఉద్యమం నుండి ఉత్తేజితులైన కొందరు ముస్లిం యువకులు దీని స్థాపనకు చొరవ తీసుకున్నారు. 1925 డిసెంబరు 26న కాన్పూరు సభలో దీనిని ‘కమ్యూనిస్టు పార్టి ఆఫ్ ఇండియా’ (సిపిఐ)గా మార్చారు. ఒక అంతర్జాతీయ సంస్థకు దేశీయ శాఖగా వుండడం గొప్ప ఆదర్శం అనుకుని వుండవచ్చుగానీ ఇదొక పెద్ద జాతీయ తప్పిదం. ఒక వైపు, భారత కమ్యూనిస్టు పార్టీల నాయకుల్ని అంతర్జాతీయ కమ్యూనిస్టు నాయకులు నియంత్రించడానికీ, మరోవైపు, సృజనాత్మకత లోపించిన భారత కమ్యూనిస్టు పార్టీల నాయకులు కీలక సందర్భాల్లో అంతర్జాతీయ నాయకులు ఇచ్చే ‘రోడ్ మ్యాప్’ల మీద ఆధారపడడానికీ ఈ పేరు తోడ్పడింది.
కొంతకాలం రష్యామార్గం, కొంతకాలం చైనా మార్గం అంటూ ఒక శతాబ్దం గడిపేశారే తప్ప భారత మార్గం ఒకదాన్ని రూపొందించాలనే స్వతంత్ర ఆలోచనే భారత కమ్యూనిస్టు పార్టీల నాయకులకు ఇప్పటి వరకు రాలేదు. అంతర్జాతీయ నాయకులు సహితం సిపిఐ నాయకుల డొల్లతనాన్ని తమకు అనుకూలంగా బాగా వాడుకున్నారు. జాతియోద్యమంలో స్వాతంత్ర్య సిధ్ధికి నిర్ణయాత్మక ఘట్టంగా మారిన క్విట్ ఇండియా ఉద్యమంలో సిపిఐ పాల్గొనకుండ రజనీ ఫామే దత్ లాంటి బ్రిటీష్ కమ్యూనిస్టు నాయకులు తప్పుదోవ పట్టించారు. రెండవ ప్రపంచ యుధ్ధంలో రష్యాకు బ్రిటన్ మిత్రపక్షంగా మారినందున ఇండియాలో కమ్యూనిస్టు పార్టిలు బ్రిటీష్ వ్యతిరేక పోరాటం చేయడం తప్పు అన్నారు.
చైనాలో ఇలాంటి సందర్భాలొచ్చినపుడు మావో ఇలా చేయలేదు. మనకు క్విట్ ఇండియా ఉద్యమం సాగుతున్న కాలంలోనే చైనాలో జపాన్ యుధ్ధం (1937-1945) సాగింది. ఆ సమయంలో మావో నాయకత్వంలోని చైనా కమ్యూనిస్టు పార్టి అక్కడి సన్ యాట్ సేన్ జాతీయ ప్రభుత్వంతో కలిసి జపాన్ మీద పోరాడింది. అక్కడ మావో అలా జాతీయ నాయకుడనిపించుకున్నాడు; ఇక్కడ మనోళ్ళు జాతి వ్యతిరేకులని విమర్శలు ఎదుర్కొన్నారు.
ఇంతాచేసి అటు స్టాలిన్ గానీ, ఇటు మావోగానీ భారత కమ్యూనిస్టు నాయకుల్ని పెద్దగా గౌరవించింది ఏమీలేదు. స్టాలిన్ సిపిఐ ప్రతినిధి బృందంతో కాస్సేపయినా కూర్చొని మాట్లాడాడుగాని సిపిఐ ఎంఎల్ (నక్సలైట్ల) ప్రతినిధి బృందాన్ని మావో కనీసం కలవనైనా కలవలేదు.
భారత శాసనవ్యవస్థ ఒక ప్రజాస్వామిక రాజ్యాంగాన్ని రూపకల్పన చేస్తున్న కాలంలో, 1948 ఫిబ్రవరి-మార్చిలో కలకత్తాలో జరిగిన కమ్యూనిస్టు పార్టి రెండవ కాంగ్రెస్ లో బిటీ రణదివే అట్టహాసంగా ‘సాయుధపోరాట’ పిలుపునిచ్చారు. క్విట్ ఇండియా ఉద్యమంలో కోల్పోయిన పరువును తిరిగిపొందడానికి కావచ్చు, లేదా చైనా నుండి అందుకున్న కొత్త ఉత్తేజంతో కావచ్చు సిపిఐ ఇలాంటి ఒక తీవ్రమైన నిర్ణయం తీసుకుంది.
నిజానికి అప్పుటికి ఏడాదిన్నర ముందు నుండే నిజాం సంస్థానంలోని తెలంగాణ ప్రాంతానికి చెందిన రెండు జిల్లాల్లో సిపిఐ రాష్ట్ర సమితి సాయుధపోరాటాన్ని సాగిస్తోంది. విచిత్రంగా, సిపిఐ జాతీయ సమితి సాయుధపోరాట పిలుపు ఇచ్చిన ఏడు నెలల్లోపే తెలంగాణ రాష్ట్ర సమితి పోరాట విరమణ ప్రకటన చేసింది. ఎవరి లక్ష్యాలు నెరవేరినట్టు తెలంగాణ రాష్ట్ర సమితి భావించిందీ? అనేది ఇప్పటికీ పరిశీలనాంశమే.
నిజాం సంస్థానాన్ని ఇండియన్ యూనియన్ లో విలీనం చేయడం ఇటు భారత అటు నిజాం సంస్థానాల్లోని పెట్టుబడీదారీ – భూస్వామ్యవర్గాల అవసరం. దాని కోసం వాళ్ళు పది మార్గాల్లో పది పార్టీలు పది సంస్థల ద్వార ప్రయత్నించారు; వారు ఎంచుకున్న వారిలో కాంగ్రెస్ పార్టి, ఆర్యసమాజం, బ్రహ్మసమాజం వగయిరాలున్నాయి. ఆ జాబితాలో కమ్యూనిస్టు పార్టి కూడ ఒకటి. తమ కార్యకలాపాలు నల్గొండ, వరంగల్ (అప్పటికి ఖమ్మం జిల్లా లేదు) జిల్లాల్లోని కొన్ని తాలూకాల్లో కొనసాగాయని సిపిఐ చెప్పుకోవచ్చు. నిజాం మెడలు వంచి ఇండియన్ యూనియన్ లో చేర్చింది తామే అన్నట్టుగా ప్రచారం చేసుకోవడం మాత్రం అతిశయోక్తి.
నిజాం విలీనంతో భారత -నిజాం పెట్టుబడీదారీ – భూస్వామ్యవర్గాల ఆర్ధిక అవసరం తీరింది. ఆర్యసమాజ్ ఆశయం నెరవేరింది. కాంగ్రెస్ రాజకీయ లక్ష్యం పూర్తయింది. కమ్యూనిస్టులు ప్రచారం చేసిన ‘తెలంగాణలో రైతుకూలీ రాజ్యం’ మాత్రం రాలేదు. ఎవరిది విజయం? ఎవరిది పరాజయం? ఆర్యసమాజ్ సాంస్కృతిక లక్ష్యానికీ, కాంగ్రెస్ రాజకీయ లక్ష్యానికి, భారత -నిజాం పెట్టుబడీదారీ – భూస్వామ్యవర్గాల ఆర్ధిక పథకాలకు కమ్యూనిస్టు పార్టి పరోక్షంగా ఆమోదాంశాన్ని కలగజేసిందంటే ఎవరికీ అభ్యంతరం వుండాల్సిన పనిలేదు.
మనశాసనకర్తలు భూస్వాములు పెట్టుబడీదారుల్ని ప్రోత్సహిస్తుంటారని (Crony Capitalism) మనం సాధారణంగా అనుకుంటూ వుంటాము. అది తప్పు. భూస్వాములు-పెట్టుబడీదారులే శాసన వ్యవస్థను ఏర్పాటు చేస్తారనే ( crony legislature) వాస్తవం ఇటీవల మరీ నగ్నంగా బయటపడిపోయింది. 1952 నాటి తొలి సార్వత్రిక ఎన్నికల్లో నల్లగొండ నుంచి పోటీచేసిన రావి నారాయణ రెడ్డికి జవహర్ లాల్ నెహ్రూకన్నా అధిక ఓట్లు పడ్డాయని కమ్యూనిస్టు పార్టీలు ఇప్పటికి గొప్పగా చెప్పుకుంటుంటాయి. సకాలంలో పోరాట విరమణ చేసి, తమ ఆర్ధిక ప్రయోజనాలను నెరవేర్చి పెట్టినందుకు భూస్వాములు-పెట్టుబడీదారులు సిపిఐకి ఇచ్చిన బహుమానం అది అంటే చాలా మందికి మింగుడు పడదు.
బ్రిటీష్ ఇండియాలో దాదాపు 560 ప్రిన్స్లి స్టేట్స్ వుండగా నిజాం సంస్థానంలో మాత్రమే ఎందుకు కమ్యూనిస్టు పార్టి సాయుధ పోరాటం చేసిందీ? అన్నది ఎవరికయినా రావలసిన ప్రశ్న. ఆ సంస్థానాలకన్నా నిజాం పరిపాలన క్రూరమైనది అనవచ్చు. అది ఒక తార్కిక సమర్ధన కావచ్చుగానీ వాస్తవం కాదు. విద్యా, వైద్య-ఆరోగ్య, నీటిపారుదలా, రైల్వే, విద్యుత్తు తదితర రంగాలన్నింటిలోనూ నిజాం మిగిలిన సంస్థానాలన్నింటికన్నా చాలా ముందున్నది. త్రివాన్కూర్ సంస్థానంలోని పున్నప్రా, వాయలార్ గ్రామాల్లో 1946లో ఒక పోరాటం సాగిందిగానీ దాన్ని నిజాం సంస్థానంలో సాగిన పోరాటంతో పోల్చలేము. కమ్యూనిస్టు పార్టి నిజాం సంస్థానంలో మాత్రమే తెగబడి సాయుధ పోరాటం చేయడానికి ఇంకా బయటపడని ఏంకేదో కారణం వుండాలి!
దాదాపు వంద సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో కేవలం ఒక్క సంవత్సరం మాత్రమే భారత కమ్యూనిస్టు పార్టీ సాగించిన సాయుధ పోరాటం కేవలం నిజాంను గద్దెదించడం కోసమేనా? ‘ముస్లిం’ నిజాం సంస్థానాన్ని ’హిందూ’ ఇండియన్ యూనియన్ లో విలీనం చేయాలనే ’హిందూత్వ’ కార్యక్రమానికి ఆర్యసమాజ్ సూత్రధారిగావుంటే కమ్యూనిస్టు పార్టీ పాత్రధారిగా వుండిందా? కమ్యూనిస్టు పార్టీలోని అతివాదులు నిజాం మీద సాయుధ పోరాటం చేయాలన్నారు. నిజాం గద్దె దిగగానే మితవాదులు సాయుధ పోరాట విరమణ చేయమన్నారు. ఇద్దరూ ఒకే మతవాదాన్ని చెరోవైపు నుండి కొనసాగించారా?
తెలంగాణలో కమ్యూనిస్టుపార్టి సాయుధపోరాట విరమణ చేయడాన్ని ఆనాటి కామ్రేడ్స్ అసోసియేషన్ ప్రముఖులు మఖ్ధూం మోహియుద్దీన్, దేవులపల్లి వేంకటేశ్వరావు (డివి) తీవ్రంగా వ్యతిరేకించారు. వాళ్ళూ మరికొందరు కలిసి 1951 వరకు ఆ పోరాటాన్ని సాగించారు. తెలంగాణ ప్రజల సాయుధపోరాట చరిత్ర (1946-1951) శీర్షికతో డివి రెండు భాగాల గ్రంధం రాశారు. ఆ గ్రంధం 1988 జులై నాటి తొలి ముద్రణ మొదటి భాగం 590-91వ పేజీల్లో చాలా ఆసక్తికర పరిశీలనలు వున్నాయి.
నిజాం ఫ్యూడజలిజాన్ని వ్యతిరేకించడంలో మతం ప్రభావం బాగా పనిచేసిందని వారు చాలా స్పష్టంగా వివరించారు. “ఫ్యూడల్ వ్యతిరేకతకన్నా ముస్లిం వ్యతిరేకతే (కమ్యూనిస్టు) పార్టీ నాయకత్వంలో ప్రధానంగా పనిచేసింది. హిందూ భూస్వాములు సహజంగా నిజాంకు వ్యతిరేకంగా వుంటారు కనుక వారి భూముల్ని (పేదలకు) పంచకుడదని వారు (కమ్యూనిస్టు పార్టీ నాయకులు) వాదించారు”. తెలంగాణలో “విప్లవోద్యమం ముందుకు వచ్చిందంటే ఇక్కడి పార్టి దీని కొరకు చేసిన కృషి ఫలితమే. తక్కినచోట్ల (హిందువులు అధినేతలుగావున్న సంస్థానాల్లో) ముందుకు పోలేదంటే అక్కడి పార్టి దాని కోసం కృషి చేయకపోవడమే కారణం. వాస్తవ పరిస్థితి అనుకూలంగా లేక కృషి చేయలేదా? అనుకూలంగా వుండి కూడ కృషి చేయలేదా? అంటే ఉండి కూడ కృషి చేయలేదనే చెప్పవలసి వుంటుంది”. వంటి చేదు నిజాలు ఈ పుస్తకంలో వున్నాయి.
ముస్లింలు అనేకాదు; భారత కమ్యూనిస్టు పార్టీల నాయకులకు ఏ అస్తిత్వ సమూహాలూ నచ్చవు. ఒక ‘అమూర్త’ శ్రామిక వర్గం గురించి మాత్రం వాళ్ళు తరచూ మాట్లాడుతుంటారు. ‘అమూర్తం’ కనుక ఆ శ్రామిక వర్గం ఎప్పటికీ ఎవరికీ కనిపించదు. సమాజంలో శ్రామికవర్గం కూడ ఏదో ఒక అస్తిత్వంలో వుండితీరుతుందంటే వాళ్ళు ఒప్పుకోరు. “మనుషుల సామాజిక అస్థిత్వమే వాళ్ళ చైతన్యాన్ని నిర్ణయిస్తుంది” అన్న మార్క్స్ మాటలు కమ్యూనిస్టు పార్టీల నాయకులకు కూడ వర్తిస్తాయి.
అధికారంలో లేనపుడు కమ్యూనిస్టుపార్టీలు శ్రామిక అనుకుల విధానాలను వల్లెవేస్తుంటాయి. 1990వ దశకంలో వచ్చిన నూతన ఆర్ధిక విధానాన్ని తీవ్రంగా విమర్శిస్తుంటాయి. శాసన సభలో ప్రవేశించడానికి నూతన ఆర్ధిక విధానాన్ని సమర్ధించే రాజకీయ పార్టీలతో ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంటాయి. ఇది అక్కడితో ఆగదు. అధికారంలోనికి వచ్చాక నూతన ఆర్ధిక విధానాలనే కమ్యూనిస్టు పార్టీలు అమలు చేస్తాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని ఆహ్వానిస్తాయి. ఇవన్నీ బహిరంగం అయిపోయాక కార్మికవర్గంతో సహా సకల అస్తిత్వ సమూహాలు కమ్యూనిస్టు పార్టీలను వదిలేస్తున్నాయి; వదిలేశాయి. వీటి ఫలితాలను ఇప్పుడు మనం పార్లమెంటరీ రాజకీయ రంగంలో చూస్తున్నాము.
రాజకీయ రంగం వేరు; మేధోరంగంవేరు. భారత మేధోరంగంలో కమ్యూనిజం ప్రభావం ఇప్పటికీ చాలా బలంగా కొనసాగుతోంది. రాజకీయ, ఆర్ధిక, సాంఘీక, సాహిత్య విమర్శను కమ్యూనిస్టు అభిమానులు గొప్పగా అభివృధ్ధి చేశారు. ఎస్టి, ఎస్సీలు, బిసిలు, మైనారిటీలు, మహిళలు తమ హక్కుల గురించి మాట్లాడే చొరవను కమ్యూనిస్టు పార్టీలే ఇచ్చాయి. ఈ సంస్థల తొలి నాయకులందరూ పూర్వాశ్రమంలో కమ్యూనిస్టులే. ఇప్పటికీ వాళ్ళ వాదనల్లో మార్క్సియన్ మెధడాలజీ యే బలంగా కనిపిస్తుంది.
దేశానికి ఫాసిస్టు ప్రమాదం ముంచుకొస్తున్నదని అణగారిన సమూహాలు భయపడుతున్న సందర్భంలో కమ్యూనిస్టు పార్టీలు బలహీన పడడం ఆందోళనకర అంశమే. అయితే, ఆర్గానిక్ కమ్యూనిస్టులు సమీప భవిష్యత్తులో ఏకమై చారిత్రక అవసరంగా ఒక కొత్త కమ్యూనిస్టు పార్టిని ఏర్పరచుకోవచ్చు. ఎందుకంటే, ఇటీవలి కాలంలో మరొక్కసారి ప్రజల్లో కమ్యూనిజం మీద అభిమానం పెరుగుతున్నట్టు స్పష్టమైన సూచనలు కనిపిస్తున్నాయి. వాళ్ల సమస్యల్లా అన్యవర్గ ధోరణులున్న కమ్యూనిస్టు పార్టీల నాయకులతోనే!
(రచయిత సీనియర్ పాత్రికేయులు, సమాజ విశ్లేషకులు మొబైల్ : 9010757776)
ప్రచురణ : ఆంధ్రజ్యోతి ఏడిట్ పేజీ 26 ఏప్రిల్ 2023
https://www.andhrajyothy.com/2023/editorial/communism-is-different-communist-parties-are-different-1056725.html