Friday 21 April 2023

I was the Bodygaurd to Konadapalli Seetharamayya

 కొండపల్లి సీతారామయ్యకు బాడీగార్డ్ గా వున్నాను 



విప్లవ రాజకీయాల్లో నాకు ఇష్టమైన నాయకుడు కొండపల్లి సీతారాయయ్య. 

ఉద్యమంలో గొప్ప ధైర్యసాహసాలు ప్రదర్శించారు. అనేక త్యాగాలు చేశారు. విప్లవ సిధ్ధాంత స్థాయిని పెంచారు. ఆ తరపు విద్యార్ధి, నిరుద్యోగ యువతకు గొప్ప ఉత్తేజాన్నిచ్చారు.   కవులు కళాకారులు మేధావుల్ని గొప్పగా ఆకట్టుకున్నారు. 

ఆయన చదువుకున్నవాళ్లతో ఒకలా మాట్లాడేవారు. నిరక్షరాశ్యులతో ఇంకోలా మాట్లాడేవారు. ఇద్దర్నీ అపారంగా ఆకట్టుకునేవారు.  పార్టి డాక్యుమెంట్లే కాకుండ కృష్ణ, విశ్వేశ్వరయ్య, శ్యామ్  తదితర పేర్లతో సిధ్ధాంత వ్యాసాలు రాసేవారు.  

ఆయన పొలిటికల్ క్లాసు వినడం ఒక గొప్ప అనుభవం. ఎంత సంక్లిష్టమైన  రాజకీయ అంశాన్ని అయినా సరే చందమామ కథలా చాలా తేలిక పదాలతో చాలా అందంగా చెప్పేవారు. మంచి హాస్య ప్రియుడు. చాలా సౌమ్యులు చిన్న స్థాయి కార్యకర్తను కూడ మీరు అనేవారు. 

విప్లవ పార్టీకి సిధ్ధాంత బలం వుండాలి, ఆయుధ పరిజ్ఞానం వుండాలి. ఆర్ధిక అండను ఏర్పాటు చేసుకోవాలి. కొత్త తరాన్ని నిరంతరం సమీకరిస్తూవుండాలి. రహాస్య పనివిధానాన్ని రూపొందిస్తూ వుండాలి. టెక్ జాగ్రత్తలు పాటిస్తూ వుండాలి. న్యాయనిపుణుల సహకారాన్ని తీసుకుంటూ వుండాలి. ఇతర రాష్ట్రాల విప్లవ నాయకులతో నిరంతరం అనుబంధాన్ని కొనసాగిస్తూ వుండాలి. ఈ రంగాలన్నింటిలోనూ కేఎస్ నిపుణుడు. అన్ని రంగాల్లో సెలబ్రెటీలుగా వుంటున్న వారు ఆయనకు వీరాభిమానులుగా వుండేవారు. ఆయన కాల్చే చార్మినార్ సిగరెట్టు ప్యాకెట్టు గుల్ల మీద చీటీ రాసి పంపితే విజయవాడ డిస్ట్రిబ్యూటర్లు సినిమాలు విడుదల చేసేవారు. 

తెలంగాణ సాయుధపొరాటంలో కమ్యూనిస్టు పార్టికి  నాయకత్వం వహించినవారు భూస్వామ్యవర్గానికి చెందిన వారనీ, వాళ్ళకు కమ్యూనిజం ఒక సరదాయేగానీ ప్రాణరక్షణ మందు కాదు అనేవారు కొండపల్లి. అందుకే కీలక సమయంలో కమ్యూనిస్టు పార్టి సాయుధపోరాట విరమణ ప్రకటన చేసిందనేవారు. ఆ సందర్భంగా ఒక జానపద కథ చెప్పేవారు. 

చైనా యువరాజుకు డ్రాగాన్ చూడాలనే ఒక కోరిక వుండేదట. డ్రాగాన్ నిజ జీవికాదు. ఒక జానపద పక్షి. మొసలిలా, కొండచిలువలా వుంటుంది. నోట్లో నుండి మంటలు చిమ్ముతుంటుంది. ఓ రాత్రిపూట  డ్రాగాన్ రాజకోటకు వచ్చి అక్కడున్న భటునితో  "మీ యువరాజు నన్ను చూడాలని ఉబలాటపడుతున్నాడు. అతని కోరిక తీరుద్దామని స్వయంగా నేనే వచ్చాను. పోయి మీ యువరాజుకు చెప్పు" అందిట. భటుడు వెళ్ళి యువరాజుని నిద్రలేపి "మీ కోసం డ్రాగాన్ వచ్చింది యువరాజా! కోటగుమ్మంలో వుంది " అన్నాడట. డ్రాగాన్ వచ్చిందన్న మాట వినగానే యువరాజు భయపడి గుండె ఆగి చనిపోయాట్ట.  తెలంగాణ పోరాటానికి నాయకత్వం వహించినవారు ఏదో కమ్యూనిజం అంటే సరదాపడ్డారు గానీ, నిజంగా కమ్యూనిజం వచ్చేస్తున్నదని తెలియగానే వాళ్ళ గుండె ఆగిపోయింది. అని కథను ముగించేవారు. 

పామరులతో మాట్లాడే సమయంలో జానపద కథలు చెప్పేసాంప్రదాయం విప్లవోద్యమంలో అనాదిగా వుంది. భగత్ సింగ్ కూడ జానపదకథలు చెప్పేవాడు. మావో సరేసరి. రైతులతో మాట్లాడే సమయంలో 'చందమామ' కథలతోనే రాజకీయాలు చెప్పేవాడు. 

దీన్ని నా మరో గురువు  త్రిపురనేని మధుసూదనరావు కొంచెం మోడిఫై చేశారు. బహిరంగ సభల్లో జనాన్ని ఉత్తేజపరచాలి. పొలిటికల్ క్లాసుల్లో స్టూడెంట్స్ ను చైతన్యపరచాలి అనేవారు. 

ఒక దశలో నేను గోదావరి జిల్లాల ఏజెన్సీ గ్రామాల్లో కొన్ని రోజుల తరబడి తత్వశాస్త్రం పాఠాలు చెప్పాల్సివచ్చింది. వాళ్ళల్లో అత్యధికులు నిరక్షరాశ్యులు. నా వేషభాషల్లో ఇంగ్లీషు ప్రభావం ఎక్కువగా వుండేది. వాళ్ళకు మామూలుగా  పాఠం  చెప్పడమే కష్టం. ఏకంగా తత్వశాస్త్రం చెప్పడం అంటే మరీ పెద్ద సవాలు. తరుణోపాయంగా కేఎస్ ను అనుకరించడానికి ప్రయత్నించాను. వారికీ ఆ విషయం తెలుసు. నేను చెప్పిన పాఠాల్ని టేపులో రికార్డ్  చేయించి తెప్పించుకుని విన్నారట. కొంచెం మెచ్చుకుని కొన్ని సూచనలు మార్పులు  కూడ నాకు కొరియర్ చేత పంపించారు.  

భారత సమాజంలో కుల విశ్లేషణకు చాలా దగ్గరగా వెళ్ళిన ఎంఎల్ నాయకుడు కొండపల్లి. వ్యవసాయిన విప్లవం పుస్తకంలో  కులమే వర్గం అనలేదు గానీ దాదాపుగా అన్నంత పనిచేశాడు.

"ఎస్సి గద్దర్ ను మహాకళాకారుడ్ని చేశాము. బిసి అల్లం రాజయ్యను మహారచయితను చేశాము. ముస్లిం డానీ చేత తత్త్వశాస్త్రం పాఠాలు చెప్పిస్తున్నాము. ఇది సామాజిక రంగంలో మన కాంట్రిబ్యూషన్" అన్నారట ఒక సందర్భంలో. 

స్విడిష్ రచయిత Jan Myrdal ఇండియాకు వచ్చి కొండపల్లి సీతారామయ్యను కలిసినపుడు కొరియర్ గా, బాడీగార్డ్ గా నేనే వున్నాను. నాకు కలిసి వచ్చిన అదృష్టాల్లో అదొకటి. ఇద్దరం రిక్షాల్లో, బస్సుల్లో ప్రయాణించేవాళ్లం. ఆయన  తల మీద ఒక వెల వుండేది. భయం తెలీని మనిషి.  

తన కూతుర్ని పార్టీలో ఇవ్వాలని ఏలూరి భీమయ్య అన్నప్పుడు  మీ కృష్ణాజిల్లాలో డానీ వున్నాడుగా అని సూచించింది ఆయనే. నా ఉద్యమ జీవితంలోనే  కాక నా దాంపత్యజీవితంలోనూ వారి పాత్ర వుంది. 

నివాళులు అర్పించే సమయంలో వాళ్ల పరిమితుల్ని కూడ చెప్పుకోవాలి. 

1920-30 ప్రాంతంలో మావో చైనాలో రూపొందించిన  నూతన ప్రజాస్వామిక విప్లవ మార్గంలోనే నడవాలని భారత ఎంఎల్ పార్టీలన్నీ భావించాయి. కేసె్ కూడ భావించారు. ఇందులో రెండు తప్పులున్నాయి. మొదటిది; మనకు మావో  ఛైర్మన్  అయ్యాడు. రెండోది; మనం మన సమాజాన్ని విశ్లేషించి మనదైన విప్లవ పంథాను రూపొందించుకునే అవకాశాన్ని కోల్పోయాము. . 

"దున్నేవానికే భూమి నినాదంతో సాగే వ్యవసాయిక విప్లవం ఇరుసుగా గల నూతన ప్రజాస్వామిక  విప్లవం"  మన లక్ష్యం అనేవారు. ఈ నినాదానికి ఇప్పుడు ప్రాసంగికత వుందనుకోను. ఇప్పుడూ అదే నినాదం ఇస్తున్నారో మార్చుకున్నారో నాకు తెలీదు. 

కేఎస్ ను ఒకసారి ఉమ్మడి కమ్యూనిస్టు పార్టి, ఇంకోసారి సిపిఐ ఎంఎల్ పీపుల్స్ వార్ పార్టి బహిష్కరించాయి. 

తెలంగాణ సాయుధపోరాట విరమణ అనేది ఇప్పటికీ విశ్లేషించుకోవాల్సిన అవసరం వుంది. అప్పుడు రంగంలో ఐదారు జట్లు వున్నాయి. అందులో కమ్యూనిస్టు పార్టి ఒకటి మాత్రమే.  కాంగ్రెస్ కు ఒక నేరేటివ్ వుంది. ఆర్యసమాజ్ కు ఒక నేరేటివ్ వుంది. నిజాం ఎస్టేట్ లో విద్యావంతులైన ఉదారవాదులకు మరో నేరేటివ్ వుంది. నిజానికి వాళ్లందరికన్నా నిజాంలో కమ్యూనిస్టుల ప్రాబల్యమే తక్కువ. పోరాటం నల్గొండ, వరంగల్ జిల్లాలు దాటలేదు. మనం మొత్తం  వ్యవహారాన్ని. కమ్యూనిస్టు పార్టి దృష్టి నుండే చూసున్నాం.

మరో అంశం ఏమంటే మనం ఆర్ధిక వ్యవస్థను రాజకీయాలు ప్రమోట్ చేస్తాయి (Crony Capitalism) అనే భావంతో వుంటాం. నిజానికి ఆర్ధిక వ్యవస్థే రాజకీయాలను నియంత్రిస్తుంది (Crony Legislature) అని గుర్తించం. నిజాం-తెలంగాణ రాజకీయాలను ఏ ఆర్ధిక పరిణామాలు నియంత్రించాయని ప్రశ్నించుకుంటే మనమ గతంలో ఎన్నడూ ఊహించని అనేక వాస్తవాలు బయట పడతాయి. 

20 ఏప్రిల్ 2023

No comments:

Post a Comment