*అలా 40 ఏళ్ళు గడిచిపోయాయి*
మనమంతా కలిసి పోరాడితే మరీ నెల రోజుల్లో కాకపోయినా రెండు మూడు నెలల్లో అయినా విప్లవం విజయవంతం అవుతుందనే నమ్మకంతో చెమాటోడ్చే వాళ్ళం.
సాహసాలు దుస్సాహసాలు చేసేవాళ్ళం.
ఇలాంటి అనుభవం నా దాంపత్య జీవితం లోనూ
వుంది. ప్రతి రోజు పూటకు ఒకసారి నేను అజిత దెబ్బలాడుకుంటాము. వారానికి ఒకసారి కాకపోయినా నెలకు
ఒకసారి అయినా విడిపోవాలనుకుంటాము. అలా అనుకుంటూనే 40 ఏళ్ళు గడిచిపోయాయి.
పీపుల్స్ వార్ పార్టీకి కృష్ణాజిల్లాలో పూర్తి స్థాయి కమిటీ ఎప్పుడూ
లేదు. అడహాక్ కమిటీలే ఉండేవి. ఆ కమిటీ బాధ్యులుగా
వున్న వివి కృష్ణారావు గారు ఇండియన్ పీపుల్స్
ఫ్రంట్ కు వెళ్లిపోయారు. అంత వరకు జిల్లా రాడికల్ యూత్ లీగ్ అధ్యక్షునిగావున్న నేను
జిల్లా పార్టీ అడహాక్ కార్యదర్శి గా మారాను.
రైతుల సమస్యలు చెప్పుకోవడానికి ఏలూరి భీమయ్య వస్తుండేవారు. అయన జిల్లా రైతు
కూలి సంఘం కార్యదర్శి. వారిది శివాపురం గ్రామం. మనిషి చాలా నిరాడంబరంగా ఉండేవారు. నేను టేబుల్ మీద రాసుకుంటుంటే నా గదిలోనికి వచ్చి నేల మీద కూర్చునే వారు.
ఒకసారి శివపురంలో జిల్లా రాజకీయ పాఠశాల, బహిరంగ సభ జరిగాయి.
అక్కడ మొదటిసారి భీమయ్య కుమార్తె అజితను చూసాను.
శివపురం తెలంగాణ ఆంధ్ర సరిహద్దుల్లో వున్న కుగ్రామం. మధిర దగ్గర ప్రవహించే వైరా వాగు మీద అప్పటికి వంతెన లేదు. ఆ గ్రామానికి రైలు బస్సు సాకర్యం ఇప్పటికీ లేదు. తెలంగాణ పోలీసుల నుండి తప్పించుకోవాల్సి
వచ్చినపుడు నక్సల్ నేతలు వ్యూహాత్మాకంగా శివపురంలో షెల్టర్ తీసుకునేవారు. తెలంగాణ రైతాంగా
పోరాట కాలం నుండి కొండపల్లి సీతారామయ్యకు
ఆ గ్రామంలో అభిమానులు ఎక్కువ. జిల్లాలో
పీపుల్స్ వార్ వాళ్ళు ఎవరు అరెస్టు అయినా శివపురం వాళ్ళే కోర్టులో జామిను ఇచ్చేవారు.
తరువాత కొంతకాలనికి తన కుమార్తెను
పార్టీలో ఇవ్వాలని భావిస్తున్నట్టు భీమయ్య
చెప్పగా కొండపల్లి సీతారామయ్యగారు నా పేరు సూచించారట. పార్టీ రీజినల్ కమిటీ
కార్యదర్శి ఈ విషయాన్ని నాకు చెప్పారు. ముందు
తనతో నేరుగా మాట్లాడి తన అభిప్రాయం తెలుసుకోవాలి అన్నాను. పార్టీ ఆర్ సి మాకు విజయవాడలో పెళ్లి చూపులు
ఏర్పాటు చేసింది.
“నువ్వు
నాకు నచ్చావు. అయితే, నాకు ఉద్యోగం లేదు; నిలకడగా ఉద్యోగం చేసే ఆసక్తి లేదు. ఆస్తిలేదు. ఉద్యమాలంటూ ఊర్లు పట్టుకుని తిరుగుతాను. నానుండి
ఎలాంటి ఆదాయాన్ని ఆశించకు. పిల్లలు పుడితే వాళ్ళ పెంపకం చదువు వగయిరా భారం కూడ నీదే. అన్నింటికన్నా ముఖ్యమైనది నాకు ఇంతకు
ముందే పెళ్లి అయింది. అది మతాంతర వివాహం. మా పెళ్లి ఆమె పెద్దలకు నచ్చలేదు. పెళ్లయిన నెల రోజులకే
ఆమె బలవన్మరణం పాలయింది. ఇక నీ ఇష్టం” అన్నాను.
తను నాషరతులు అన్నింటికీ ఒప్పుకుంది.
విప్లవ భావుకతను ఆమెకు ఆ స్థాయిలో నింపేశారు వాళ్ళ నాన్న. కొండపల్లి సీతారామయ్య నిప్పుల్లో
దుకమన్నా దూకడానికి భీమయ్య సిద్ధం. వాళ్ళ నాన్న
గాడిదను చేసుకోమన్నా చేసుకోవడానికి అజిత సిద్ధం.
అలా ఉండేది కమిట్ మెంట్.
పెళ్లి ఇంకో రెండు రోజులు ఉందనగా భీమయ్యగారు కమ్మ సామాజిక వర్గానికి చెందినవారనీ అయన 14 ఎకరాల
మధ్యతరగతి రైతు అనీ అజిత ఆయనకు ఏకైక సంతానం అనీ అర్ధం అయింది.
భీమాయ్యగారే ఇష్టంగా పెళ్లి చేయడంతో
ఆయన బంధువులు ఎక్కువ మంది మా పెళ్ళికి హాజరయ్యారు.
నన్ను గౌరవ ప్రదంగా తమ సమూహంలో కలుపుకున్నారు. మాది ఎక్స్ టెండెడ్ ఫ్యామిలీ గా
మారింది. ఏలూరివారు చెరుకూరివారు కొమ్మినేనివారు,
లగడపాటివారు అలా చాలా పెద్దది అజిత బలగం.
అసలు సమస్యలు పెళ్లి తరువాత మొదలయ్యాయి. నా ఆదాయం తక్కువ నామీద ఆధారపడినవాళ్ళు ఎక్కువ. మా ఇంటిలో అజితకు తాను అనుకున్నదానికన్నా ఎక్కువ కష్టాలు ఎదురయ్యాయి.
ఉద్యమాలు, ఇంటి మీద దాడులు, అరెస్టులు. కొన్ని సందర్భాల్లో పోలీసులు నన్ను ఎక్కడ
పెట్టారో కూడ తెలీని పరిస్థితి. పత్రికల్లో ‘డానీ ఎక్కడ?’ అనే వార్తలు. తను నిరంతరం
ఒక ఉత్కంఠ కు గురయ్యేది. ఉద్యమాల్లో వున్నప్పుడు తిండి దొరక్కపోవడమేకాదు కొన్ని సందర్భాల్లో
అపరిశుభ్ర వాతావరణాల్లో ఉండాల్సి వస్తుంది. దురదలు అలెర్జీలు వస్తాయి. వాటిని భరించాల్సింది ఆమెనే.
ఇదిగాక నేను వ్యక్తిగతంగా పెట్టిన ఇబ్బందులున్నాయి. నాకు భోజనం వడ్డించడం
అంత సులువుకాదు. ఏమాత్రం తేడా వచ్చినా చాలా చికాకు పెడతాను. పోపు మాడిండనో, పప్పు వండలేదనో తగవు పడతాను.
ఆమెకు వేపుళ్ళు రోటి పచ్చళ్ళు ఇష్టం. నాకు
అవి పడవు. సంసారంలో ఇవన్నీ తగవులే.
సమాజంలో అందరికి వున్నట్టే కవులు, రచయితలు, ఉద్యమకారులకు కూడ రోజుకు 24 గంటలే ఉంటాయి. చదవడానికో రాయడానికో ఉద్యమాల్లో తిరగడానికో
మీటింగుల్లో మాట్లాడడానికో వాళ్ళు వెచ్చించే
సమయం మొత్తం న్యాయంగా వాళ్ళ భార్యలకు చెందవలసినదే. ఇలా వాళ్ళ భార్యలు వ్యక్తిగత
జీవితాన్ని కొంత కోల్పోవలసివుంటుంది. ఇది గుర్తింపుపేని త్యాగం. వచ్చిన కీర్తి మొత్తం
భర్త ఖాతా లోనికి పడుతుంది గానీ భార్య ఖాతాలో పడదు. ఈ కారణంగాను
దాంపత్యంలో కొన్ని ఘర్షణ లు ఉంటాయి.
మా పెళ్ళి విజయవాడ ప్రెస్ క్లబ్ లో 27 ఏప్రిల్ 1983న జరిగింది. అప్పట్లో ఉద్యమకారులు
పెళ్ళికి ఫొటోలు తీసుకునే సాంప్రదాయం లేదు. ఒక ఏడాది తరువాత మేమిద్దరం తొలి ఫొటో తీసుకున్నాము.
మా పెళ్ళికి చలసాని ప్రసాద్ పురోహితుడు. చలసాని
పార్టీలో వంద పెళ్లిళ్లు చేశాడు. వారిలో
99 జంటలు విడిపోయాయి. “మీరిద్దరూ విడిపోతే
నాది ఒక రికార్డు అవుతుంది” అనేవాడు చలసాని. “ఆ 100 మందిలో 99 మంది పురుషులు
హిందువులు. వాళ్ళు విడిపోయినా వాళ్లను
ఎవ్వరూ ఏమి అనరు. నేను ఒక్కడ్ని విడాకులిస్తే మాత్రం మొత్తం ముస్లిం సమాజాన్ని బోను
ఎక్కిస్తారు” అనేవాడిని.
డబ్బు విషయంలో అజిత ఎన్నడూ నన్ను ఇబ్బంది పెట్టలేదు. ప్రయాణాలకు నేను
పెట్టే ఖర్చుల్ని ఎప్పుడూ అడగలేదు. 2008లో
ఓ రోజు ఫోన్ చేసి ఆఫీస్ వాతావరణం బాగోలేదు అన్నాను. తక్షణం రిజైన్ చేసి వచ్చేయి. నిన్ను గుర్తించని వాళ్ళదగ్గర పని చేయవల్సిన అవసరం లేదు అనేసింది.
ఇంట్లో అంత సపోర్ట్ దొరకడంతో నేను రిజైన్ చేసేసాను. తన మీద నమ్మకంతో మరి కొన్ని
సందర్భాల్లో కూడ ఉద్యోగాలు మానేశాను.
మేమిద్దరం చిన్న చిన్న విషయాల మీద పెద్ద పెద్దగా దెబ్బలాడుకుంటాం. అయితే, మతం
కులం ఎన్నడూ మా మధ్య వివాదంగా మారలేదు. మావాళ్లు తనను కలుపుకున్నారు. వాళ్ళవాళ్ళూ
నన్ను కలుపుకున్నారు. మా పిల్లల్ని హిందువులు అడిగారు; ముస్లింలు అడిగారు.
తన డిమాండ్ ఒక్కటే. నేను ఎప్పటికీ కమ్యూనిస్టు
గా ఉండాలి. పీపుల్స్ వార్ లోనే వుంటే మరీ మంచిది అనుకునేది. ఇప్పుడు ఆ పార్టియే లేదు.
2004 నవంబరులో వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం పీపుల్స్ వార్ ను శాంతి చర్చలకు
పిలిచింది. ఆ చర్చలకు వచ్చిన ముగ్గురు ప్రతినిధుల్లో సుధాకర్ కూడా వున్నాడు. సుధాకర్
పార్టీలో నాకు జూనియర్; అజితకు స్టూడెంట్స్ వింగ్ లో సీనియర్. సుధాకర్ అప్పట్లో ఆంధ్రా-ఒరిస్సా బార్డర్ (ఏవోబి) కమిటికి కార్యదర్శి.
తనను ఒరిస్సా బార్డర్ లో దించమని సుధాకర్ నన్ను
కోరాడు. అప్పుడు నేను పీపుల్స్ వార్ లోనూ లేను; విరసంలోనూ లేను. నేనూ అజిత తోడుగా వెళ్ళి
సుధాకర్ ను ఏవోబిలో దించివచ్చాము. నక్సల్స్
కు ఏ సహాయం చేసినా అది తన తండ్రికి అర్పిస్తున్న నివాళి అనుకుంటుంది. వాళ్ళూ అంతే;
తనను తమ మనిషి అనుకుంటారు.
“నేను డానీకి స్పాన్సర్ ని” అనుకుంటుంది అజిత. ఆ పొసేసివ్ నెస్ ఆ పొగరువల్ల
కొన్ని ఇబ్బందులున్నా అది ఆమెకు దక్కడం న్యాయం.
అజిత ఈజ్ గ్రేట్!
శివాపురం
27 ఏప్రిల్ 2023
No comments:
Post a Comment