Saturday, 8 April 2023

ముందు కాకులు అంతరించిపోకుండా చూడండి!

ముందు కాకులు అంతరించిపోకుండా చూడండి!

‘బలగం’ గురించి మరికొంత

 

బలగం సినిమా గురించి ఇప్పటికే చాలామంది చాలా రాశారు. సినిమాను రెండుసార్లు చూశాక నాకు కూడ  కొన్ని అంశాలు రాయాలనిపించింది.

 

భావోద్వేగాల ఉన్నతీకరణే కవిత్వం అంటారు. ఈ సూత్రం ఇతర సాహిత్య ప్రక్రియలకూ వర్తిస్తుంది; సినిమాకూ వర్తిస్తుంది.

 

బలగం సినిమాలో భావోద్వేగాల చిత్రీకరణ చాలా గొప్పగా వుంది. పాత్రల రూపకల్పన బాగుంది. దర్శకుడు, కథానాయకుడు, కథానాయకి మాత్రమే కొంచెం ‘నటించారు’. మిగిలిన నటులందరూ నిజజీవిత పాత్రలుగా కనిపించారు.

 

“వీడికి దినం చేయ”, “వీడికి పిండంపెట్ట”, “వీడి పిండాన్ని కాకులు ముట్టుద్దు” వంటి తిట్లు  తెలంగాణలోనేగాక  కొంచెం భిన్నమైన యాసలో ఆంధ్రా ప్రాంతంలోనూ వినిపిస్తుంటాయి.

 

తెలంగాణ ప్రాంతానికి చెందిన నటుడు – రచయిత – దర్శక - నిర్మాత ఎం ప్రభాకర రెడ్డి 1972లో ‘పండంటి కాపురం’ అనే సినిమా మొదలెట్టారు. ఆ సినిమా బడ్జెట్ పెరిగిపోవడంతో మధ్యలో ‘సూపర్ స్టార్’ కృష్ణను పార్టనర్ గా చేసుకున్నారు.  ఈప్రాజెక్టులో  చేరవచ్చా? లేదా? అని ఎన్టీఆర్ ను సలహా కోరారట కృష్ణ.  “బ్రదర్! ఇది మేము తీసిన ‘వుమ్మడి కుటుంబం’ కథే. ఇలాంటి కథలు ఎప్పుడయినా నడుస్తాయి. మీరు ధైర్యంగా పెట్టుబడి పెట్టండి అన్నారట ఎన్టీఆర్.  ఆయన చెప్పినట్టే ‘పండంటి కాపురం’ చాలా పెద్ద హిట్ అయ్యింది. అలాంటి ఇంకో ఉమ్మడి కుటుంబం కథతో  రూపొందిన ‘బలగం’ సహజంగానే అన్ని ప్రాంతాల్లో  హిట్ అయ్యింది.  ఇది యూనివర్శల్ సబ్జెక్ట్.  ఈ సినిమా  తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించిందీ, తెలంగాణ గ్రామాలు గొప్పవి తెలంగాణలో మానవ సంబంధాలు ఉన్నతమైనవి అని ఒక ప్రాంతానికి పరిమితం చేయాల్సిన పనిలేదు. కుటుంబ పెద్ద చనిపోయినపుడు ఆంధ్రాప్రాంతంలోను ఇలాంటి సన్నివేశాలే కనిపిస్తుంటాయి; ముఖ్యంగా కోస్తా జిల్లాల పశ్చిమ మెట్ట ప్రాంతాల్లో. చివరి ఘడియల్లో చేప తినాలని తపించినవారు చాలా మంది వుంటారు. వాళ్ళ పెద్ద కర్మ రోజు ప్రత్యేకంగా చేప పులుసు వండి వడ్డిస్తారు. 

 

 

“పురాణాలు మానవజాతి బాల్యం” అన్నాడు కార్ల్ మార్క్స్‍ ఒక సందర్భంలో. అలాగే గ్రామాలు పట్టణీకరణకు బాల్యం వంటివి. మన జీవిత దశలన్నింటిలోనూ బాల్యం గొప్పది. కానీ, మనం మళ్ళీ పిల్లమైపోయి వర్షపు నీటిలో కాగితపు పడవలు వదలలేం. “ఓ కాగజ్ కి కష్టి - ఓ బారిష్ కా పానీ” జగ్జీత్ సింగ్ గజల్ విన్నప్పుడు మళ్ళీ బాల్యం లోనికి వెళ్ళిపోవాలని గట్టిగానే అనిపిస్తుంది.  అది అసాధ్యం అని మనకూ తెలుసు. అయినా బాల్యం గుర్తుకొచ్చినపుడు  ఒక భావోద్వేగం మనల్ని కమ్ముకుంటుంది.

 

పల్లెల నుండి పట్టణాలకు, అక్కడి నుండి నగరాలకు, మహానగరాలకు, అంతర్జాతీయ నగరాలకు మనుషుల వలస సాగుతూ వుంటుంది. horizontal mobility and vertical mobility. మహానగరాల్లో స్థిరపడి ఎంత సంపాదించినా మనిషి వ్యక్తిగా (man and the individual) మారే క్రమంలో  అంతరంగంలో ఒక శూన్యత ఏర్పడుతుంది. వెనక్కి పోవాలనిపిస్తుంది. పోలేరు.

 

మహాభారతంలో “ఈ లోకంలో ఆశ్చర్యకరమైనది ఏదీ?” అని యక్షుడు అడిగినప్పుడు “ప్రాణులు ప్రతిరోజూ మరణిస్తూ ఉండడాన్ని చూస్తున్నా మనిషి తానే శాశ్వతంగా భూమి మీద ఉండి పోతాననుకోవడం” అంటాడు ధర్మరాజు.  స్మశాన వైరాగ్యం అంటూ ఒకటుంటుంది. ఆ క్షణంలో అన్నీ వదిలేసుకోవాలనిపిస్తుంది. అదీ క్షణికమే. తరువాత అంతా మామూలే.

 

ఉమ్మడి కుటుంబాలు విఛ్ఛిన్నం అయిపోవడాన్నీ, నూక్లియస్ కుటుంబాలు, సింగిల్ కుటుంబాలు ఎర్పడాన్ని మానవ తప్పిదంగా మనలో చాలామంది తరచూ అపోహపడుతుంటాము. ఒకప్పుడు భారత స్థూల జాతీయ ఉత్పత్తిలో సింహ భాగం గ్రామాలదే; వ్యవసాయ రంగానిదే. అప్పుడు ఉమ్మడి కుటుంబాలకు మించిన పెద్ద కుటుంబాలుండేవి.  తాత ముత్తాతలే కాదు ఆ పైన తరం కూడ ఒకే చోట నివశించేది. ఇప్పటి భారత స్థూల జాతీయ ఉత్పత్తిలో వ్యవసాయం వాటా 14-15 శాతం. గ్రామీణ జనాభా 40-45 శాతం.  అక్కడ బతకడం కష్టం. మెరుగయిన జీవితం కోసం గ్రామాలను వదిలి వలసలు పోవడం అనివార్యం.

 

గ్రామాల్లో చాలా స్పష్టంగా కనిపించే కుల వివక్షను బలగం సినిమా తప్పించింది. కులవివక్ష విషయంలో పట్టణాలే చాలా మెరుగు. గ్రామాల్లో కులం ప్రభావం  ఎక్కువగా వుంటే పట్టణాల్లో ఆర్ధిక ప్రభావం ఎక్కువగా వుంటుంది. ఆర్ధిక కారణాలవల్లనేగాక కులవివక్ష కారణంగానూ అనేకమంది గ్రామాలను వదిలేస్తారు.  

 

పిండాన్ని కాకులు ముట్టకపోవడం అనే అంశం చుట్టూ బలగం కథను అల్లారు. సాంద్రవ్యవసాయ పధ్ధతులు, రసాయినిక ఎరువులు, పురుగుమందుల వినియోగం పెరిగాక మన పరిసరాల్లో కాకులు, పిచ్చుకలు వుంటున్నాయా? రసాయన ఎరువులతో  ఏపుగా పెరిగిన వరి చేలను సినిమా మొదట్లో గొప్పగా చూపించారు. ఆ వాతావరణంలో  కాకులు, పిచ్చుకలు బతకలేవు. కాకులే అంతరించిపోతున్నప్పుడు పిండం ఎవరికి పెట్టాలీ? ఇది అసలు కత.

 

విజయవాడ

9 ఏప్రిల్  2023

No comments:

Post a Comment