*MTF Whats App గ్రూపు పేరు గురించి వివరణ*
Author, Journalist, Documentary Filmmaker, Political Commentator, Literary Critic, Humourist, and Social Worker
Monday, 17 April 2023
*MTF Whats App గ్రూపు పేరు గురించి వివరణ*
*ముస్లిం ఆలోచనాపరుల
వేదిక Whats App Group* పేరును మారిస్తే బాగుంటుందని కొందరు మిత్రులు
సూచిస్తున్నారు.
ఈ గ్రూపులో
ముస్లిమేతర ఆలోచనాపరులు కూడ వుండడంవల్ల అందరికీ ప్రాతినిధ్యం వహించేలా పేరు వుండాలని
వారంటున్నారు. ‘సామరస్య జనవేదిక’ అనే కొత్త పేరును కొందరు సూచించారు. వాళ్ళ సూచనలోని సెంటిమెంట్ నాకు
అర్ధం అయింది. అందులో ఒక సమంజసమైన హేతువు వుంది.
మన సమాజంలో ప్రతి
అంశానికీ అందుకు భిన్నమైన, కొన్ని సందర్భాలలో అందుకు పూర్తి విరుధ్ధమైన నేరేటివ్స్
కూడ వుంటాయి.
ప్రతి రోజూ నాకు
కనీసం వందకు పైగా గ్రూపుల నుండి Whats App
మెసేజులు వస్తుంటాయి. వాటిల్లో ఓ నాలుగయిదింటికి ముస్లిం సంబంధిత పేర్లు వుంటాయి.
ముగిలినవన్నీ కమ్యూనిస్టు, అంబేడ్కరిస్టు, ఫూలేయిస్టు, లేకుంటే అమరుల పేర్లతో వుంటాయి.
ఇటీవల అన్ని రాజకీయ పార్టిలేగాక, ఆయా పార్టీల నాయకులు, వాళ్ళ అభిమానులు సహితం
వాట్స్ యాప్ గ్రూపులు నడుపుతున్నారు. ఈ గ్రూపులన్నింటిలోనూ ముస్లిమేతరులున్నట్టే ముస్లింలు
కూడ వుంటారు. అయినప్పటికీ ముస్లీమ్లు సామాజిక ఉద్యమాల్లో పాల్గొనరు అనే నేరేటివ్
బలంగా ప్రచారంలో కొనసాగుతూవుంది.
ఖిలాఫత్ ఉద్యమంతో
ప్రభావితమైన యువ ముస్లింలే భారత దేశంలో తొలి కమ్యూనిస్టు పార్టి (ఇండియన్
కమ్యూనిస్టు పార్టి)ని స్థాపించారనీ, కోరమండల్, మలబారు తీరాల్లో మొదలైన మోప్లా
ముస్లిం కౌలురైతుల తిరుగుబాటు తరువాతి కాలంలో కమ్యూనిస్టు పార్టీగా మారిందని
తెలిసినవాళ్లు ఎందరూ? అభ్యుదయ రచయితల ఉద్యమాన్ని మొదలెట్టింది ముస్లింలని ఎంతమందికి
తెలుసూ? ఆ ఉద్యమంపేరే Anjuman Tarraqi Pasand Mussanafin-e-Hind. తెలంగాణ
సాయుధరైతాంగ పోరాటానికి మేధో సరస్సుగా పనిచేసిన ‘కామ్రేడ్స్ అసోసియేషన్’లో
దేవులపల్లి వేంకటేశ్వరరావు, రాజ్ బహద్దూర్ గౌర్ వంటి ఇద్దరు ముగ్గురుతప్ప మిగిలిన
వారందరూ ముస్లింలే. జాతియోద్యమంలో స్వాతంత్ర్య సాధనకు నిర్ణయాత్మక ఘట్టమైన క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో
జాతీయ కాంగ్రెస అధ్యక్షుడు మౌలానా అబుల్
కలాం ఆజాద్ అని ఎవరయినా గుర్తు పెట్టుకున్నారా? అంతేందుకు, ముస్లింలకు విద్యా
ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ కోరుతూ 2001లో ఆంధ్రప్రదేశ్ లో ఒక ముస్లిం ఉద్యమం
సాగిందని, దాని ప్రభావంతోనే వైయస్ రాజశేఖర రెడ్డి బిసి-ఇ కేటగిరిలో ముస్లింలకు
విద్యా, ఉద్యోగ రంగాల్లో 5 శాతం కోటా వాగ్దానం
చేసినట్టు ఎవరికయినా గుర్తుందా?
నేను
వ్యక్తిగతంగా 1977 నుండి సామాజిక జీవితంలో
వున్నాను. కొన్ని ఎస్టి, ఎస్సి, బిసి ఉద్యమాలకు, ప్రపంచ బ్యాంకు వ్యతిరేక ఆందోళకు నేరుగా
నాయకత్వం వహించాను. చాలామంది నన్ను కారంచేడు ఉద్యమ నాయక బృందంలో ఒకడిగా వున్నాను అనుకుంటుంటారు. ప్రభుత్వం ఉదారంగా వున్నప్పుడు ఆ ఉద్యమానికి
అరడజనుకు పైగా నాయకులున్నారు. నిర్బంధం
మొదలుకాగానే భయపడి వాళ్ళంతా శిబిరం వదిలి వెళ్ళిపోయారు. ముఖ్యంగా 1985 సెప్టెంబరు
11 నుండి ఆక్టోబరు మొదటి వారంలో ప్రభుత్వం పునరావాస ప్యాకేజీని ప్రకటించే వరకు కారంచెడు ఉద్యమానాకి
కేంద్ర కార్యాలయమైన చీరాల విజయనగర్ శిబిరానికి నేను ఏకైక నాయకునిగా వున్నాను.
ఇవేమీ
నా గొప్ప కోసం ఇప్పుడు రాయడంలేదు. ముస్లిం రిజర్వేషన్ ఉద్యమంలో భాగంగా విజయవాడలో
జరిగిన భారీ బహిరంగ సభకు ఫూలే-
అంబేడ్కరిస్టు మేధావి ఒకర్ని ముఖ్యఅతిధిగా ఆహ్వానించాము. “హిందూ అగ్రవర్ణాలు శూద్రుల్ని వెలివేశారు,
దళితుల్ని ముట్టుకోరాదన్నారు. ముస్లింలు వచ్చి మమ్మల్ని ఆలింగనం చేసుకున్నారు. అందుకే
మావాళ్లు ఇస్లాం మతాన్ని స్వీకరించారు. ఈనాటి భారత ముస్లింలలో అత్యధికులు పూర్వ-
ఎస్టి, ఎస్సి బిసిలు. సాంఘీక వివక్షను అనుభవిస్తున్న కారంణంగా వాళ్ళందరికీ రిజర్వేషన్లు కల్పించాలి ”
అంటూ ఆవేశంగా ప్రసంగించారు.
గుజరాత్
లో నరేంద్ర మోదీజీ ముఖ్యమంత్రి అయ్యాక ఆ మేధావి తన దృక్పథాన్ని మార్చుకున్నారు.
బిసి అభిమానంతో సందర్భం వచ్చినప్పుడెల్లా తన మేధోశక్తిని మోదీజీ కోసం
వెచ్చిస్తున్నారు. అది వారి ఇష్టం. అయితే వారు అంతటితో ఆగలేదు; తన కలాన్ని ముస్లిం
వ్యతిరేకతను, ఇస్లాంఫోబియాను పెంచడానికి ఉపయోగిస్తున్నారు. గుజరాత్ మారణకాండలో
బిసిలు పాల్గోవడాన్ని సమర్ధిస్తూ వారు ఆ రోజుల్లోనే ఒక చిత్రమైన వాదన చేశారు. తమను
దగ్గరికి తీసుకోలేదనే కసితో బిసిలు ముస్లింల మీద దాడి చేశారని సిధ్ధాంతీకరించారు. (ద హిందూ
దినపత్రిక మార్చి 27, 2002). ముస్లింలు ధార్మిక అంశాలకే పరిమిత మవుతారు, సామాజిక
అంశాలను పట్టించుకోరు అనే ఆరోపణను ఇటీవల వారు గట్టిగానే ప్రచారంలో
పెడుతున్నారు. ఇలాంటి దుష్ప్రచారాలకు ఒక ప్రాక్టికల్ సమాధానం చెప్పాల్సిన అవసరం ముందుకు
వచ్చింది.
ఎస్సీ
సంఘాలు ప్రతి సంవత్సరం కారంచెడు, చుండూరు హాత్యాకాండ దినాలు జరుపుతుంటారు. గతాన్ని
తలచుకుని భవిష్యత్తు కార్యక్రమాలు రూపొందించుకుంటుంటారు. హషీంపుర, మలియాన, గుజరాత్
మారణ హోమాన్ని గుర్తుచేసుకుని భవిష్యత్తును నిర్ణయించుకోవడానికి ముస్లింలకు కొన్ని
కొత్త వేదికలు కావాలి.
ముస్లింలు అడ్మిన్
గా ఒక అభ్యుదయ గ్రూపు వుండాల్సిన అవసరం అలా
ముందుకొచ్చింది. ఇతరులు అడ్మిన్ లుగా వున్న గ్రూపుల్లో ముస్లింలు వుంటున్నట్టు
ముస్లింలు అడ్మిన్లుగావున్న గ్రూపుల్లోనూ ఇతరులు వుంటారు. వుంటున్నారు కూడ. ఇదే
సామరస్యం. ఇచ్చి పుచ్చుకోవడం. *ముస్లింల అభ్యుదయ ఆలోచనలు ముస్లింల పేరుతోనే
ప్రజల్లోనికి వెళ్ళాలి*.
జవహర్ లాల్ నెహ్రు
యూనివర్శిటి 1981 సెప్టెంబరు ఆఖరు వారంలో చైనా
సుప్రసిధ్ధ రచయిత లూసన్ (Lu Xun) శత జయంతోత్సవాలను రెండు రోజుల పాటు నిర్వహించింది. దానికి నన్నూ ఒక వక్తగా పిలిచారు.
సాధారణంగా మనం ఏదైనా సభలకు వక్తగా వెళ్ళినపుడు మనకు తెలిసిన నాలుగు అంశాలు
మాట్లాడేస్తుంటాము. లేదా play to the gallery వంటి సమ్మొహ విద్యలు ప్రదర్శిస్తుంటాము. అది యూనివర్శిటీ కనుక పూటకు
మూడు అంశాలు చొప్పున రెండు రోజులకు 12 అంశాలనూ వర్గీకరించి ఎవరు ఏ అంశం మీద ఎంత
సేపు మాట్లాడాలో వగయిరా నిర్దిష్టమైన వివరాలతో క్యూ షీట్ పంపించారు. నేను
ఉపన్యాసాన్ని పాయింట్ల వారీగా రాసుకుని వెళ్ళి సమయపాలన పాటించి అకడమిక్ గా
మాట్లాడింది అదే మొదటి సారి. అప్పటి నుండి అదే క్రమశిక్షణను పాటిస్తున్నాను. ఏ
అంశం మీద మాట్లాడాలీ? ఏ కోణాన్ని స్పృజించాలి? దానికి ప్రాసంగికత ఏమిటీ? ఎంత సేపు మాట్లాడాలీ? అనే వివరాలు లేకుండా నేను
సభల్లో మాట్లాడను. ఒక వేళ సమయం తక్కువగా వుంటే ఆ మూడు నాలుగు అంశాల సబ్
హెడ్డింగ్స్ వివరించి ముగించేస్తాను.
అలాంటి
అకడమిక్ క్రమశిక్షణ మన గ్రూపు సభ్యుల్లో కొందరికి వుంటుంది. కొందరికి వుండదు. కొందరు
ఇతర అంశాల్లో నిపుణులైనప్పటికీ గ్రూపు లక్ష్యాల మీద వాళ్ళకు ఆసక్తి వుండకపోవచ్చు,
టాస్క్ గా ఇచ్చిన టాపిక్ మీద వాళ్ళకు అవగాహన లేకపోవచ్చు. కొందరు సందర్భం ఏదైనాసరే
తమకు తెలిసిన ‘ఆవు వ్యాసం’ రాసేస్తుంటారు. కొందరు తమ రచనల ప్రమోషన్ కోసం అన్ని గ్రూపుల్ని
వాడుకుంటుంటారు. కొందరు మనం అనుకుంటున్నట్టు అసలు ఆలోచనాపరులే కాకపోవచ్చు. కొందరు
తమకు ఇష్టమైనవన్నీ పోస్టుల్లో పెడుతుంటారు.
పెళ్ళిరోజు ఫొటోలు, పుట్టిన రోజు ఫంక్షన్ ఫొటోలు. ఇంట్లో ఆ రోజు వండిన కూర
ఫొటో లు కూడ పెడుతుంటారు. వాటిని డిలీట్ చేస్తే కొందరికి ఆగ్రహం కలుగుతుంది;
వుంచితే మరి కొందరికి చిరాకు కలుగుతుంది. ఈ రెండు కారణాలవల్లనూ కొందరు గ్రూపు నుండి తప్పుకుంటుంటారు. కొందరు
తమ సూచనలకు ఆమోదం రాకపోయినా అలుగుతారు.
చర్చకు
పెట్టిన అంశం మీద చాలా తక్కువ మంది మాత్రమే మాట్లాడుతారు. మాట్లాడలేనివాళ్లు మౌనంగా
చూస్తుంటాడు. అసలు ఇది తమ క్రీడా మైదానం కాదని
అర్ధమైనవాళ్ళు స్వఛ్ఛందంగా వెళ్లిపోతారు. ఇది అన్ని గ్రూపుల్లోనూ విజయవాడ
ట్రాఫిక్ లా కొనసాగుతూనే వుంటుంది. వడబోత కార్యక్రమం పూర్తికావడానికి కొంత సమయం పడుతుంది.
ఈలోగా సోర్స్ సమూహం నిరాశ చెంది టాస్క్ ను
మరచి గ్రూపును మూసెయ్యరాదు.
వరద
వచ్చినపుడు ముందు చెత్త వస్తుంది. వరద పెరిగినపుడు చెత్త వుండమన్నా వుండదు;
కొట్టుకుని పోతుంది. గోదావరి గట్టున పుట్టాను. ఇది నాకు ప్రకృతి జ్ఞానం నుండి సహజంగా
అబ్బిన సామాజిక జ్ఞానం.
ఎప్పటికప్పుడు
ప్రకటించిన టాస్క్ మీద సభ్యులు మాట్లాడగలిగితే మేధోమధనం జరుగుతుంది. లేకపోతే
సీరియస్ నెస్ పోయి గ్రూపు చప్పబడిపోతుంది.
అయినా, ఐదేళ్ళుగా
నిరాఘాటంగా కొనసాగుతూ మేధోరంగంలో తన ఉనికిని చాటుకుంటున్న సంస్థకు పేరు మార్చాల్సిన
పనేమున్నదీ? MTF కు మొదటి నుండి FaceBook page, Messenger Group మాత్రమేగాక Whats
App Group కూడ వున్నాయి. నేను దీనిని ఇటీవల ముస్లిమేతరులకు కూడ Extend చేశాను. అదొక్కటే
మార్పు.
*గ్రూపు పేరుమారదు; అదే వుంటుంది*.
డానీ, కన్వీనర్ MTF
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment