Wednesday, 5 April 2023

కన్నీరు ఆనందాన్నిస్తుంది ఖదీర్ బాబు కథ 'దాహ గీతి'

 కన్నీరు ఆనందాన్నిస్తుంది 

ఖదీర్ బాబు కథ 'దాహ గీతి' 


ఖదీర్ బాబు కథ  వస్తున్నదంటే  అంచనాలు భారీగా  పెరిగిపోతాయి. ఖదీర్  కథ కూడ మన  అంచనాలకు  మించి  వుంటుంది. నేరుగా ఫేస్ బుక్ లో పెట్టినా దాని క్రేజ్ తగ్గదు. 


మనకు తెలిసిన పాత్రలే; మనకు తెలిసిన సంఘటనలే; మనకు తెలిసిన చరిత్రే.  అయినప్పటికీ  ఎదో మ్యాజిక్. భారీ  భూతాన్ని మాంత్రికుడు చిన్న సీసాలో బంధించిన  అనుభూతి. 12 నిముషాల పఠనం 12 నెలలు వెంటాడుతుంది. 


కథ చదివాక  ఏం చెప్పాలో ఏం రాయాలో  అర్ధం కాదు. ఒక అద్భుతాన్ని చూసినపుడు అలా జరుగుతుంది. మాటల్లేక కళ్లు అప్పచెప్పి అలా వుండిపోతాం. ఒక సువాసన మనల్ని కమ్ముకుంటుంది. చందనం వాసన. "నైర్మల్యానికి ఉండేవాసన" అది. కళా ప్రకృతి ఏకమైపోయినపుడు ఇలా జరుగుతుందట. ఖదీర్  చెప్పాడు. నమ్మాలి! 


కళాకారులు రెండు రకాలు. శ్రోతలు, ప్రేక్షకులు, పాఠకుల్ని రంజింపచేసేవారు (playing to the gallery)   కొందరు;  శ్రోతలు, ప్రేక్షకులు, పాఠకుల్ని కళ కేంద్రకం వైపుకు నడిపించేవారు ఇంకొందరు. కళారంగంలో  ఇదొక వర్గపోరాటం. ఆ ఇరువర్గాలు దంపతులైతే 'దాహగీతి' పుడుతుంది. 


చరిత్రను పాఠంగా చదవడంవేరు. విశ్లేషణాత్మక వ్యాసంగా చదవడంవేరు. descriptive historyగా చదవడం వేరు. 


చారిత్రక రచన శైలుల్లో వర్ణనాత్మక చరిత్ర ఒకటి.  గతంలో జరిగిన సంఘటనలు, వ్యక్తులు, ప్రదేశాలను స్పష్టంగా,  ఆకర్షణీయంగా అది చిత్రిస్తుంది. వ్యాసాల్లో, పరిశోధనా పత్రాల్లో కనిపించని భావోద్వేగాలను ఒడిసి పట్టుకుంటుంది. అప్పటి దృశ్యాలనేగాక ఆ శబ్దాలు, వాసనలు, గాలీ, నీరు, కన్నీరు మొత్తాన్నీ మన ముందు పెడుతుంది. మనమూ కన్నీరు మున్నీరుగా ఏడ్చేస్తాం.  ఆ కన్నీరు మనమూ మనుషులమే అని గుర్తు చేసినపుడు పాఠకులకు గొప్ప ఆనందం కలుగుతుంది. కన్నీరు ఆనందాన్నివ్వడమేంటీ? అని అడగవద్దు. అదలాగే జరుగుతుంది. 


కన్నీరు "ఆత్మను తేలిక పరిచే లవణజలం". 


"ఇటువంటి సందర్భంలో ఓదార్పుకోసం పురుషుడు పరస్త్రీ భుజాన్ని కోరుతాడు" 


"ప్రేక్షకులది సూక్ష్మదృష్టి; కళను గుర్తించడంలో వారు నిర్దాక్షిణ్యంగా వుంటారు" 


వంటి  గొప్ప వాక్యాల్ని  ఖదీర్ ఇందులో పొందుపరిచాడు. 


కథ ఉత్తమ పురుష (స్త్రీ) ఏకవచనంలో సాగుతుంది. అయితే ఆమె ఎవరో, ఆ పడింట్ ఎవరో, ఆ ఉస్తాద్ ఎవరో  పాఠకులు గుర్తుపడతారుగానీ కథకుడు చెప్పడు. అప్పుడు వాళ్ల కొడుకు పేరు కూడ చెప్పి వుండాల్సింది కాదు.  


అన్నపూర్ణాదేవి (రోషన్ ఆరా ఖాన్)  2018 అక్టోబరు 13న చనిపోయారు. 

ఆ సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్. ఈ వాస్తవాలు ఖదీర్ బాబుకు తెలియనివికావు. ఎందుకు పేర్లు మార్చాడో తెలీదు. 


- డానీ 

5 ఏప్రిల్ 2023


No comments:

Post a Comment