For publication in Andhrajyothi
Shall we turn man into machine?
మానవుడ్ని యంత్రుడిగా మార్చేద్దామా?
జనవరి 9న రెండు
వార్తలు చాలామంది దృష్టిని ఆకర్షించాయి. వీటిల్లో
మొదటిది, కుత్రిమ మేధ (ఏఐ) తదితర ఆధునిక సాంకేతిక ఆవిష్కరణలవల్ల దాదాపు 93
మిలియన్ల మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోతారు అనేది. ప్రపంచ ఆర్ధిక వేదిక (WEF)
‘ఉద్యోగుల భవిష్యత్తు’ పేరిట విడుదల చేసిన నివేదికలో ఈ హెచ్చరికను చేసింది.
రెండోది; లార్సన్ అండ్ టూబ్రో (ఎల్ అండ్ టీ) చైర్మన్ ఎస్ ఎన్ సుబ్రహ్మణ్యన్ 90 గంటల
పనివారాన్ని అమలు చేయాలని ప్రతిపాదించారు అనేది.
సుబ్రమణ్యన్ ఒక
ఆంతరంగిక సమావేశంలో యధాలాపంగా అన్న మాటల్ని పట్టించుకోవాల్సిన పనిలేదని ఆ సంస్థ
ప్రతినిధులు అంటున్నారు. సుబ్రమణ్యన్
మాట్లాడింది ఒక విధానానికి
సంబంధించిన అంశం కనుక ఎక్కడన్నారూ? అనేదానికన్నా ఏమన్నారూ? అనేదే ప్రధానం. సుబ్రమణ్యన్ ప్రతిపాదన ప్రకారం వారానికి 7
పనిదినాలయితే రోజుకు 13 గంటలు పనిచేయాలి. 6 పనిదినాలయితే రోజుకు 15 గంటలు
పనిచేయాలి. 5 పనిదినాలయితే రోజుకు 18 గంటలు పనిచేయాలి. గతంలో ఇన్ఫోసిస్ అధినేత నారాయణ మూర్తి కూడ 70
గంటల పనివారాన్ని ప్రతిపాదించారు. వారి ఉద్దేశ్యం కూడ సిబ్బందితో రోజుకు 14 గంటలు పని చేయించాలనే.
కార్మిక సంఘాలు, సామ్యవాదులు మాత్రమేగాక మానవతావాదులు, సామాన్యులు సహితం ఇలాంటి
ప్రతిపాదనల్ని సహజంగానే తీవ్రంగా వ్యతిరేకిస్తారు.
నిజానికి ఈ రెండు
వార్తలు పరస్పర విరుధ్ధంగా వున్నాయి. మొదటివార్త ఇప్పుడున్న ఉద్యోగాలే ఊడిపోతాయి
అంటుంటే, రెండో వార్త శ్రామికుల చేత మరిన్ని అదనపు గంటలు పనిచేయించాలంటున్నది.
ప్రత్యర్ధుల నోరు
మూయించడానికి మన ఏలినవారు ఇటివలి కాలంలో దేశభక్తిని తిరుగులేని ఆయుధంగా వాడుతున్నారు.
ఇథనాల్ ఫ్యాక్టరీలు విడుదల చేసే కాలుష్యానికి వ్యతిరేకంగా స్థానికులు ఆందోళన చేస్తుంటే,
వాళ్ళ నోర్లు మూయించడానికి కూడ దేశభక్తిని ముందుకు తెస్తున్నారు. శిలాజ ఇంధనం అయిన
ముడి చమురును దిగుమతి చేసుకోవడానికి భారీగా విదేశి మారక ద్యవ్యాన్ని చెల్లించి, దేశం అప్పుల పాలవుతున్నదనీ, ఇథనాల్ వంటి
జీవఇంధనాలను ఇక్కడే తయారు చేస్తే దేశం మీద విదేశీ రుణభారం తగ్గుతుందనేది ఆ వాదన
సారాంశం. పని గంటల విషయంలోనూ వారు ఇదే వాదన చేస్తున్నారు. “ఇండియా చైనాను
అధిగమించాలంటే భారత ఉద్యోగులు - శ్రామికులు అధికంగా శ్రమించాలి”. “భారతదేశ
భవిష్యత్తు ఇప్పుడు శ్రామికుల చేతుల్లోనే వుంది” వంటి మాటలూ ఈ సందర్భంగా వినిపిస్తున్నాయి.
భారత భూమి, ఆకాశం,
సముద్రాలు, అడవులు, కొండలు, గనులతోపాటు దేశ శ్రామికుల్ని కూడ ప్రభుత్వం మెగా కార్పొరేట్లకు అప్పచెపుతోంది. శ్రామికులు
మారు మాట్లాడకుండ దేశభక్తి పారవశ్యంతో రోజుకు 24 గంటలు పని చేస్తే భారతదేశం చైనాను
ఏమిటీ ఏకంగా అమెరికాను సహితం అధిగమించేస్తుంది అనేది ఏలినవారు చెప్పదలచుకున్న
సిధ్ధాంతం. అనేక సత్యాలు సాధారణ కళ్ళకు
కనిపించవు. సత్యశోధన కోసం మనం కూడ అదనపు సమయం శ్రమించాలి.
16వ శతాబ్దంలో, ఆధునిక యంత్రాల మీద ఉత్పతి విధానం మొదలయినప్పుడే మనిషి ఒక రోజులో ఎంత సమయం శ్రమించాలి అనే చర్చ కూడ మొదలయింది. ఇందులో తాత్త్విక, ధార్మిక, సాంస్కృతిక దృక్పథాలు వున్నాయి. శ్రమించడం దైవారాధనకు మరో రూపం. సాతాను ప్రభావంలో వున్నవాళ్ళు శ్రమించరు – వంటి భావనని జాన్ కాల్విన్ వంటివాళ్ళు ముందుకు తెచ్చారు. అంతకు ముందే సెయింట్ బెనెడిక్ట్ రులే వంటివారు ప్రార్ధన- శ్రమ- విశ్రాంతుల మధ్య సమయ విభజన చేయడానికి ప్రయత్నించారు. ఇస్లాం ప్రబోధించే ఉపవాసాల్లోనూ ఎప్పుడు లేవాలి, ఎప్పుడు పడుకోవాలి అనే అంశాలతో పాటు మనిషి తన జీవితాన్ని, ఆర్ధిక సామాజిక కర్తవ్యాలనీ సూర్యోదయ సూర్యాస్తమాలతో అనుసంధానం చేయాలనే సూచనలు వుంటాయి.
18వ శతాబ్దపు బెంజామిన్ ఫ్రాంక్లిన్ Early to bed and early to rise అంటూ మనందరం తరచూ వినే నీతిని చెపుతూ త్వరగా పడుకొని త్వరగా లేచే మనిషిని ఆరోగ్యం, ధనం, జ్ఞానం వరిస్తాయి అని ఆశపెట్టాడు. ‘మోనాలిస’ చిత్రకారుడిగా మనకు తెలిసిన లియోనార్డో డా విన్చీ మనిషి ప్రశాంతంగా నిద్రపోవాల్సిన అవసరాన్ని నొక్కి చెపుతూ ఒక మెలిక పెట్టాడు. బాగా పనిచేసిన రోజున గాఢ నిద్ర వస్తుందన్నాడు. ఆ తరువాత ఆడమ్ స్మిత్, మాక్స్ వేబర్ వంటి ఆధునిక ఆర్ధశాస్త్ర, సమాజశాస్త్ర ఆదిపురుషులు వచ్చారు. సమయం అంటే డబ్బు అనే మాట అప్పుడే పుట్టింది. అయితే, వీళ్ళందరూ తమకు తెలిసో తెలియకో పెట్టుబడీదారులు, ఫ్యాక్టరీ యజమానులకు అనుకూలమైన వాదనలు చేశారు.
దానికి విరుధ్ధమైన వాదనలు కూడ అప్పట్లోనే వచ్చాయి. మనందరం ఏ తొమ్మితో తరగతిలోనో న్యూటన్ చలన సూత్రాలను చదివి వుంటాము. అందులో బాగా గుర్తుండిపోయేది; ప్రతి చర్యకు తత్సమానమైన తద్వెతిరేకమైన ప్రతిచర్య వుంటుంది అనేది. మనం తరచూ అక్కడితో ఆగిపోతాము. ఆ ప్రతిచర్య కూడ ఒక చర్య అయినప్పుడు దానికీ ఒక ప్రతిచర్య వుంటుందని గుర్తించం. ఇలాంటి చర్య ప్రతిచర్యల నిరంతర కొనసాగింపే గతితర్కం.
ఇక్కడ మనం
జీవశాస్త్రాన్ని కొంచెం తడమాలి. ఆహారం, నిద్ర, మైధూనాలు జీవులకు శరీర ధర్మాలు. ఈ
మూడు ధర్మాలను మనిషి కూడ పాటిస్తాడుగానీ అవి మాత్రమే అతనికి సరిపోవు. మనిషి
జంతువుల్లా గుంపుగా బతకడు; సామాజిక సంబంధాల్లో బతుకుతుంటాడు. అంచేత అదనంగా సామాజిక ధర్మాన్నికూడా అతను పాటించాలి. అన్నట్టు, సంభోగం శరీర ధర్మం మాత్రమేకాదు; అదొక
సామాజిక సంబంధం కూడ. సామాజిక సంబంధాలు చాలా
విస్తృతమైనవి ఎంతో వైవిధ్యపూరిత మైనవి.
బానిస ప్రభువులు
కూడ బానిసల సంభోగ అవసరాన్ని
గుర్తించినట్టు మనకు తెలుస్తోంది. బానిసలు సంభోగంలో పాల్గొనడానికి వీలుగా
రాత్రుళ్ళు స్త్రీ బానిసల్ని ఏర్పాటు చేసేవారట. దీనివల్ల ఇద్దరికీ లాభం. భానిసలకు సంభోగ
భాగస్వాములు దొరుకుతారు; బానిస యజమానులకు అవసరమైన భవిష్యత్తు బానిసలు
పుట్టుకొస్తారు.
-దీన్ని తెలుసుకోవడానికి బానిస
యుగాల వరకు వెళ్ళనవసరం లేదు. వ్యవసాయ రంగంలో ట్రాక్టర్లు, టిల్లర్లు వగయిరా
యంత్రాలు రాకముందు మనుషులే వ్యవసాయ పనులన్నీ చేసేవారు. 1970-80ల వరకు కృష్ణా
గోదావరి మండలాల రైతులు తెలంగాణలోని నల్గొండ జిల్లా నుండి జోడీలుగా కూలీలను
తీసుకుని వచ్చేవారు. జోడీ అంటే ఒక
పురుషుడు, ఒక స్త్రీ. వాళ్ళిద్దరు భార్యాభర్తలు కావల్సిన అవసరంలేదు; సంభోగ
అవసరాలను తీర్చేలా వుంటే చాలు. వ్యవసాయ పనుల సమయంలో వాళ్ళిద్దరు – ఇప్పటి ఆధునిక భాషలో
– సహజీవనం చేస్తారు. ఆ ఏర్పాటు లేకుంటే వలస కూలీలు పనిని మధ్యలో ఎగ్గొట్టి సంభోగం
కోసం పెళ్ళాం దగ్గరికో, మొగుడి దగ్గరికో పారిపోతారు. – (మేటర్ ఎక్కువయితే ఈ పేరాను
తొలగించవచ్చు)
ఆహార సేకరణ కాలంలో మనిషి
కూడ దాదాపు జంతువుల్లానే జీవించాడు. అయితే, ఆహారోత్పత్తి కాలంలో మనిషి పరికరాలు, యంత్రాలను
సృష్టించి వాటిని విస్తృతంగా వాడడం మొదలు పెట్టాక సమయ పాలన అతన్ని జంతు ప్రపంచం
నుండి పూర్తిగా విడగొట్టేసింది. ఆహారం నిద్రా మైధునాలనే శరీధార్మాలు, మతం,
వాణిజ్యం వంటి సాంస్కృతిక, సామాజిక ధర్మాలతోపాటు శ్రమకు ఎంత సమయాన్ని కేటాయించాలనే
అంశం చర్చకు వచ్చింది.
రోజుకు 24 గంటలు
అనుకుంటే దాన్ని మూడు బాగాలు చేసి శ్రమ, సమాజం, విశ్రాంతులకు సమానంగా కేటాయించాలనే
అభిప్రాయం క్రమంగా బలపడింది. ఒక్కోదానికి చెరో 8 గంటలు అన్నమాట. 19వ శతాబ్ద ఆరంభ కాలపు సమాజశాస్త్రవేత్త రాబర్ట్
ఒవెన్ ఈ సమాన సమయ విభజనను సిధ్ధాంతీకరించాడు అంటారు. ఇందులో సమాజం అనే మాటకు చాలా
అర్ధాలున్నాయి. తల్లిదండ్రులు, భార్యాపిల్లలు, బంధువులు, మిత్రులు, కళా సాహిత్య అభిరుచులు, రాజకీయ
ఆసక్తులు, ప్రేమ, ద్వేషం వగయిరాలు అన్నీ
ఇందులో వుంటాయి. అవన్నీ వున్నప్పుడే మనిషి సంఘజీవి అవుతాడు. లేకుంటే, అడవిలోని జంతువుల్లొ
మరో జంతువులా ఏ జింబోనో, మోగ్లీనో అవుతాడు.
ఎనిమిది గంటల పని
దినాన్ని ఫ్యాక్టరీ యజమానులు ఒప్పుకోలేదు. . 16 గంటల పనిదినం అమలు
కావల్సిందేనని పట్టుబట్టారు. 1886లో అమెరిక అంతటా 8 గంటల పనిదినం డిమాండు చాలా
బలంగా ముందుకు వచ్చింది. ఆ ఏడాది మే ఒకటిన ఆల్బర్ట్ పార్సన్స్, ఆగస్టు స్పయీస్ (The Knights of Labor) తదితరుల నాయకత్వంలో చికాగో నగరంలో ఆరంభమయిన
సాధారణ సమ్మెను రక్తపాతంతో ముంచెత్తినప్పటికీ అది విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఆ
మే డే విజయాలను బలహీనపరిచి 8 గంటల పనిదినాన్ని 18 గంటలకు పెంచే చర్యలు మొదలయ్యాయి.
కార్మికుల సౌకర్యాల విషయంలో
చైనాతో మనం ఏ విధంగానూ పోల్చుకోలేము. పని స్థలానికి సమీపంలోనే అక్కడి ప్రభుత్వం
కార్మికులకు నివాసాన్ని ఏర్పాటు చేస్తున్నది. దానివల్ల మూడు లాభాలుంటాయి. కార్మికుల ప్రయాణ సమయం, వాహనాల ఇంధన వ్యయం, వాతావరణ
కాలుష్యం తగ్గుతాయి.
భారత దేశంలో ఇప్పటి
వరకు అలాంటి ఏర్పాటు లేదు. నగరాల్లో పనికోసం ప్రతి రోజూ వంద కిలోమీటర్లు ప్రయాణం చేసే
శ్రామికులు మనకు తారస పడుతుంటారు. వాళ్ళకు కార్యాలయంలో 8 గంటల పనిదినం ఎలాగూ
తప్పదు. అది తగ్గదు. రద్దీ ట్రాఫిక్ లో ప్రయాణ సమయం రానూపోనూ సులువుగా 6-7 గంటలు
వుంటుంది. దానికోసం వాళ్ళు సామాజిక జీవితాన్నయినా కోల్పోవాలి, లేదా విశ్రాంతి
సమయాన్ని అయినా కోల్పోవాలి. వెరసి, మానవుడు యంత్రుడుగా మారిపోవాలి. ఇవి ఆ
శ్రామికుల జీవితాల్లో మునుపెన్నడూ ఊహించని అనేక కొత్త సంక్షోభాలను సృష్టిస్తాయి. శ్రామికుడిని
యంత్రుడిగా మార్చే కపటం ప్రస్తుతం చాలా వ్యూహాత్మకంగా
అమలవుతోంది.
సుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి భాస్కర రావు 1947లో
రాసిన ‘మాభూమి’ నాటకంలో, ఓ వెట్టి కూలీ ఉదయం
నెలల పసిబిడ్డ అయిన తన కొడుకు
నిద్రలేవడానికి ముందే పనికి పోతుంటాడు. రాత్రి ఆ పిల్లవాడు నిద్రపోయాక
ఇంటికి చేరుతుంటాడు. నెలల తరబడి మెలుకవగా వుండగా తన కొడుకును చూడలేదని వాపోతాడు. వర్తమాన ఉద్యోగ సమూహాలు వెట్టి
కూలీ కన్నా దారుణమైన పరిస్థితిని ఎదుర్కోబోతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు దీనికి మినహాయింపు
కావచ్చు. ఆ యంత్రాంగం పనిచేయడం మానేసింది కనుక.
కుత్రిమ మేధ (ఏఐ)
వచ్చాక లెఖ్ఖ ప్రకారం మనిషికి పనిభారం బాగా తగ్గిపోవాలి. విడ్డూరం కాకపోతే ఈ పని
గంటలు పెంచడం ఏమిటీ? కుత్రిమ మేధను ఒక కొత్త బూచీగా చూపించి ఉద్యోగ- శ్రామిక
వర్గాలను మరింతగా లొంగదీసుకోవడానికి మెగా కార్పొరేట్లు కుట్రలు పన్నుతున్నారా? అనే
సందేహం ఎవరికయినా రావాలి. అలాంటి సందేహం రాకపోతే మన మెదళ్ళు పనిచేయడం మానేశాయి
అనుకోవాల్సి వుంటుంది.
డానీ
సమాజ విశ్లేషకులు
No comments:
Post a Comment