Movies
and Epics
*సినిమాలతోనే ఇతిహాసాలు తెలిశాయి!*
మనం అక్షరాలు నేర్వక ముందే ఇంట్లో అమ్మమ్మలో నాయనమ్మలో సాయంకాలాలు
పురాణగాధలు చెప్పేవారు. అది ఆరంభం. ఆ
తరువాత సినిమాలవల్ల ఇతిహాసాలు తెలిసేవి. ఆపైన ఆసక్తి కొద్దీ ఆ పుస్తకాలు చదివి లోతైన
అంశాలు తెలుసుకునేవాళ్ళం.
ఇప్పటి చిన్న కుటుంబాల్లో అమ్మమ్మలు వుండడంలేదు. పౌరాణిక సినిమాలూ
రావడం లేదు. పౌరాణికం అనిపించే సినిమాలు కొన్ని గ్రాఫిక్స్ లో వస్తున్నాయిగానీ
వాటిలో మునుపటి జీవం వుండడం లేదు.
మా అమ్మమ్మ ఫాతిమున్ వల్ల ఇస్లామిక్ ఇతిహాసాల మీద, సినిమాలవల్ల హిందూ ఇతిహాసాల మీద ఆసక్తి కలిగింది.
క్రైస్తవుల ఇతిహాసాల గురించి కూడ, చదివిన దానికన్నా సినిమాల ద్వార తెలుసుకున్నది ఎక్కువ.
సినిమాలు, టివీలు, స్మార్ట్ ఫోన్ల ద్వార ఇతిహాసాల జ్ఞానం పొందే అవకాశం తెలుగు ముస్లిం సమాజానికి దాదాపుగా లేదనే చెప్పాలి. విగ్రాహారాధనకు
ఇస్లాం వ్యతిరేకం. దాన్ని కొందరు ఛాందసులు ఫొటోలు,
సినిమాలకు కూడ వర్తించారు. దానివల్ల ఇస్లాం
జ్ఞాన వ్యాప్తిలో ముస్లిం సమాజానికి తీవ్ర నష్టం జరిగింది.
ఆంథోని క్విన్ తో 1981లో ‘లయన్ ఆఫ్ ద డిసర్ట్’ (తెలుగులో ‘ఓమర్ ముఖ్తార్’గా మార్చారు) సినిమా తీసిన దర్శకుడు ముస్తఫా అక్కడ్ ప్రవక్త ముహమ్మద్ జీవిత గాధ ఆధారంగా 1976లో ‘ద మెసేజ్’ అనే సినిమా తీశాడు. దాన్ని బహిష్కరించమని చాందసపు ముస్లిం సంఘాలు ఆందోళన చేశాయి. ఇండియాలో ఆ సినిమాను ప్రభుత్వం బహిష్కరించింది. చివరకు 2005లో అమ్మాన్ లో జరిగిన బాంబు పేలుళ్ళలో ముస్తఫా తన కూమార్తెతో సహా చనిపోయాడు. ముస్తఫా
అక్కడ్ ను చంపడానికే ఆ బాంబుపేలుళ్ళు జరిగాయనే అనుమానాలు వున్నాయి.
నరసాపురం మిషన్ హైస్కూలు రోజుల్లో మా తెలుగు మాస్టారు విద్వాన్ పేరి రామారావుగారు (మాస్టారు! నమస్కారం) క్లాస్
రూములో పద్యాలు చాలా గొప్పగా పాడేవారు. చందస్సు, సంధులు, సమాసాలు, అలంకారాలు, యతి ప్రాసలు తెలుసుకుని పద్యాలు రాయాలన్నంత కసి వచ్చేసేది.
1965 సంక్రాంతికి (అప్పుడు నాకు 13 సంవత్సరాలు; తొమ్మిదో తరగతి చదువుతున్నాను) ‘పాండవ వనవాసం’ సినిమా రిలీజయ్యింది. భీమవరం
వెళ్ళిచూశాను. ఈ సినిమా గురించి చెప్పాల్సినవి చాలా వున్నాయి. వాటిని అలా వుంచినా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మాయాజూదం - ద్రౌపది వస్త్రాపహరణం సన్నివేశం. ఇందులో ఎన్ టి రామారావు, ఎస్వీ రంగారావు, సావిత్రి తెరమీద కనిపించే హీరోలయితే తెరవెనుక హీరోలు గాయక-సంగీత
దర్శకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు, దర్శకుడు కమలాకర కామేశ్వరరావు, సంభాషణల రచయిత
సముద్రాల రాఘవాచార్య. అయితే, “బానిసలు బానిసలకింత అహంభావమా” అనే డైలాగు
ఒరిజినల్ స్క్రిప్టులో లేకపోయినా మహానటుడు ఎస్వీవీఆర్ స్పాంటేనీయస్ గా అలా అనేశారట.
మెథడ్ ఆర్టిస్టులయిన ఎస్వీఆర్, ఎన్టీఆర్ పాత్రల్లో తీవ్రంగా
లీనమైపోయేవారు. అయితే, ఇద్దరిదీ భిన్నమైన శైలులు. ఎస్వీఆర్ పాత్రకు గంభీరతను
సమకూరిస్తే, ఎన్టీఆర్ గంభీరతతోపాటు ఒక శౌందర్యాన్ని కూడా అద్దేవారు. భీముని అహర్యం
అంతకు ముందు సినిమాల్లో వేరు; పాండవ వనవాసంలో వేరు.
ఆంధ్ర మహాభారతం
రాసిన కవిత్రయంలో అరణ్యపర్వాన్ని చాలా వరకు నన్నయ్యే రాశాడు. ఈ
సినిమాలో ప్రేక్షకుల్ని ఉర్రూత లూగించిన ఆ రెండు పద్యాలు నన్నయ్యవే. భీముడు
“చండ గదాభిఘాత” అంటున్నప్పుడు
మాకు భయం వేసేది. అప్పటి ఎన్టీఆర్ ఎక్స్ ప్రేషన్ ను క్యాచ్ చేసిన
కెమెరామ్యాన్ కు ఓ దండం పెట్టవచ్చు.
1.
ధారుణి రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణజూచి రం
భోరుని జోరు దేశమున నుండగ బిల్చిన యఈ ద్దురాత్ము దు
ర్వార మదీయ బాహు పరివర్తిత చండ గదాభిఘాత భ
గ్నోరుతరోరు జేయుదు సుయోధను ఉగ్ర రణాంతరంబునన్
భూమి మీద అధికారం వుందనే రాచరికపు గర్వంతో, మహిళ అయిన ద్రౌపదిని తన తొడ మీద కూర్చోమని పిలిచిన దురాత్ముడైన సుయోధనుడ్ని భయంకరమైన యుధ్ధంలో నా చేతులతో గదను ఎత్తి పిడుగులు కురిపించి అతని తొడల్ని నుజ్జు నుజ్జు చేస్తాను.
2.
కురువృద్ధుల్ గురువృద్ధ బాంధవులనేకుల్ చూచుచుండన్ మదో
ద్ధురుడై ద్రౌపదినిట్లు చేసిన ఖలున్ దుశ్శాసనున్ లోకభీ
కర లీలన్ వధియించి తద్విపుల వక్షశ్శైల రక్తౌఘ ని
ర్ఝర ముర్వీపతి చూచుచుండ అని నాస్వాదింతు నుగ్రాకృతిన్
కురువంశ వృద్ధులు, గురువులు, పెద్దలు అనేకులు చూస్తుండగా మదంతో నిరంకుశుడై ద్రౌపదిని ఘోరంగా అవమానించిన క్రూర దుశ్శాసనుడి
పర్వతంవంటి ఛాతిని పగులగొట్టి సెలయేరులా ప్రవహించే వాడి రక్తాన్ని లోకం భయపడేలా తాగుతాను.
అప్పటి ప్రేక్షకుల్లో ఇప్పుడునంత అక్షరాశ్యత లేదు. పైగా నన్నయ్య భాషను
తెలుగు అనలేము. అది తెలుగు ‘డుమువులు’ చేర్చిన సంస్కృత పదాలు మాత్రమే. సంస్కృత సమాసాలతో నిండిపోయిన
ఆ పద్యాలు బాగా చదువుకున్న వారికితప్ప సాధారణ చదువున్నవారికి కూడ అర్థం కావు. కానీ,
ఆనాటి నేల క్లాసు ప్రేక్షకులు ఆ పద్యాలు వచ్చినపుడు ఈలలు వేసేవారు. హాలు
దద్దరిల్లిపోయేది. ఈ పారడాక్సీ ఏమిటో అర్ధం కాదు. నటుల హావాభావాలవల్ల వాళ్ళకు అర్ధం
కమ్యూనికేట్ అయిపోయెదేమో!
సంక్రాంతి సందర్భంగా నోస్టాల్జియా కొద్దీ పాండవ వనవాసం పద్యాలు ఇంకోసారి విన్నాను;
చూశాను. అనేక కొత్త అంశాలు స్పురించాయి. ఎందుకోగానీ అంత గొప్ప సినిమా యూట్యూబ్ లో ఎక్కడా
కనిపించలేదు.
దురోధనుడ్ని సుయోధనుడు అనడం ద్రవిడ సాంప్రదాయం వల్ల వచ్చిందనే
అభిప్రాయం ఒకటి నాకు వుండేది. నన్నయ్య పద్యంలోనే సుయోధనుడని వుందని చూసి కొంచెం
ఆశ్చర్యపోయాను. ద్రౌపదికి కృష్ణ (కోమలి కృష్ణజూచి) అనే ఇంకో
పేరుందనే సంగతి గుర్తుకు వచ్చింది.
ఇంకో ఆశ్చర్యం ఏమంటే మనదేశంలో 1967లో నక్సల్బరి ఉద్యమం మొదలయింది.
వర్గశత్రువు రక్తంలో వేలు పెట్టినవాడే విప్లకారుడు వంటి ప్రమాణాలు అప్పుడు ముందుకు
వచ్చాయి. “కసితో స్వార్థం శిరస్సును గండ్రగొడ్డలితో నరకగల్గిన వాడే నేటి హీరో” అన్నాడు
శివసాగర్. ఈ రెండు పద్యాల్లోనూ అలాంటి భావావేశమే వుంది.
https://www.youtube.com/watch?v=wvimylJGaM0