*స్టాలిన్ - భారతీయ ప్రతినిధుల సమావేశం 1951 ఫిబ్రవరి 9*
*స్టాలిన్ - భారతీయ ప్రతినిధుల సమావేశం 1951 ఫిబ్రవరి 9*
స్వాతంత్ర్యానంతర దేశ పరిస్థితిని అంచనా వేయడానికి 1948 మార్చి 26-31
తేదీల్లో కలకత్తాలో ఆరు రోజులపాటు భారత కమ్యూనిస్టు పార్టి జాతీయ మహాసభలు జరిగాయి.
అప్పట్లో పిసి జోషి పార్టి ప్రధాన కార్యదర్శిగా వున్నారు. 1947 ఆగస్టు 15న దేశంలో అధికార మార్పిడి
మాత్రమే జరిగిందని, స్వాతంత్ర్యం రాలేదనీ మహాసభ అంచనా వేసింది. కొత్త ప్రధాన
కార్యదర్శిగా ఎన్నికైన బిటి రణదీవె దేశంలో వీలున్న చోట్ల సాయుధపోరాటం చేయాలని
పిలుపిచ్చారు. అప్పటికే 1946 జులై 4 నుండి నిజాం సంస్థానం లోని తెలంగాణా
జిల్లాల్లో, బెంగాల్ లోని తెభాగా ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టి నాయకత్వాన సాయుధ పోరాటాలు సాగుతున్నాయి.
పాత్రికేయుడు షోయబుల్లా ఖాన్ దారుణ హత్య (1948 ఆగస్టు 22) తరువాత నిజాం నవాబు
మీర్ ఉస్మాన్ ఆలీ ఖాన్ ను గద్దె దించి, అతని సంస్థానాన్ని భారత్ లో విలీనం చేయాలని
నెహ్రూ-పటేల్ ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ
సమయంలో పాకిస్తాన్ లో ముహమ్మద్ ఆలీ జిన్నా అనారోగ్యంతో మృత్యుముఖంలో
పోరాడుతున్నారు. జిన్నా 1948 సెప్టెంబరు 11న చనిపోయారు. 12న ఖననం జరిగింది. 13న
ఆపరేషన్ పోలో అనే పోలీస్ యాక్షన్ పేరుతో నైజాం మీద సైనిక దాడి ఆరంభమయింది. సెప్టెంబరు 18న నిజాం లొంగుబాటును ప్రకటించాడు.
ఇక్కడో విచిత్రం జరిగింది. నెహ్రు సైనికులు, యుధ్ధ వాహనాలకు తెలంగాణ ప్రజలు
పూలమాలలేసి స్వాగతం పలికారు. ఈ పరిణామాల్ని చూసి కమ్యూనిస్టు నేతలు హతాశులయ్యారు. బిటి
రణదీవె సాయుధపోరాట పంథాను చేపట్టిన ఏడు
నెలల్లోనే తెలంగాణలో ఆ పార్టి నాయకులు సాయుధ పోరాటాన్ని విరమించారు. ఈ నిర్ణయంతో కొందరు
ఏకీభవించలేదు. వాళ్ళు 1950 వరకు
పోరాటాన్ని కొనసాగించారు.
నిజాం లొంగుబాటు తరువాత కూడ నెహ్రూ సైన్యం ఆగలేదు. వరంగల్, నల్గొండ
జిల్లాల్లో కమ్యూనిస్టు దళాలను కూడ ఏరి వేసింది.
1950 జులైలో ఢిల్లీలో నేషనల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. సాయుధ పోరాటానికి పిలుపిచ్చిన బిటి రణదివెను
దోషిగా పేర్కొని తీవ్రంగా విమర్శించింది. ఆయన మీద ‘వామపక్ష దుందుడుకువాది’ (Left Adventurist)గా ముద్ర వేసి ప్రధాన కార్యదర్శి పదవి నుండేగాక ఏకంగా పార్టి
ప్రాధమిక సభ్యత్వం నుండి కూడ తొలగించింది. ఆ సభల్లోనే సిపిఐ 5వ ప్రధాన
కార్యదర్శిగా చండ్ర రాజేశ్వర రావు ఎన్నికయ్యారు.
ఒకవైపు స్వాతంత్ర్యం రాలేదనే అంచనా, మరోవైపు సాయుధ పోరాటంలో భారీ నష్టాలను చవిచూసిన
అనుభవంతో భారత కమ్యూనిస్టు పార్టికి భవిష్యత్తు అర్ధం కాలేదు. దిక్కుతోచని
స్థితిలో దారి చూపించమని అడగడానికి నలుగురు సభ్యులతో కూడిన ఒక ప్రతినిధి బృందం అప్పటి
సోవియట్ రష్యా అధినేత, అంతర్జాతీయ కమ్యూనిస్టు విప్లవ నాయకుడు అయిన స్టాలిన్
దగ్గరకు వెళ్ళారు. అప్పటి సిపిఐ ప్రధాన
కార్యదర్శి చండ్ర రాజేశ్వరరావుతోపాటు ఏకే ఘోష్, ఎస్ ఏ డాంగే, మాకినేని బసవపున్నయ్య
ఈ బృందంలో వున్నారు. 1951 ఫిబ్రవరి 9న వీళ్ళు
స్టాలిన్ ను కలిశారు. మూడు గంటలకు పైగా ఆ సమావేశం కొనసాగింది.
ఆ సమావేశంలో స్టాలిన్ వీరికి ఎలాంటి కర్తవ్యబోధ చేశారో? దాన్ని ఆ నలుగురు
ఎలా అర్ధం చేసుకున్నారో వారికి తప్ప మరొకరికి తెలీదు.
భారత ప్రతినిధి బృందం స్టాలిన్ ను కలిసి వచ్చాక ఉమ్మడి కమ్యూనిస్టు పార్టి 1951
అక్టోబరు 9 నుండి 15 వరకు ఏడు రోజులపాటు కలకత్తాలో జాతీయ కౌన్సిల్ సమావేశం
నిర్వహించింది. ఇందులో విధానపరంగా కొత్త
నిర్ణయం తీసుకున్నారు. ప్రజా ఉద్యమాలను కొనసాగిస్తూనే పార్లమెంటరీ ఎన్నికల్లో
పాల్గొనాలనేది ఆ నిర్ణయం. ఈ సదస్సులో కొత్త ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయిన అజయ్
ఘోష్ ఈ విధాన రూపకల్పనలో ప్రధాన పాత్ర వహించారు. స్టాలిన్ సూచనల మేరకే సిపిఐ సాయుధపోరాట పంథాను వదిలి
పార్లమెంటరీ పంథాను స్వీకరించిందని విస్తృతంగా ప్రచారం జరిగింది.
భారత కమ్యూనిస్టు పార్టి ఘనంగా 66వ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న
రోజే 1991 డిసెంబరు 26న సోవియట్ రష్యా పతనమై, రష్యన్ ఫెడరేషన్ ఏర్పడింది. అంతవరకు ‘క్లాసిఫైడ్
డాక్యుమెంట్స్’ గా రహాస్యంగా వుండిపోయిన స్టాలిన్ –సిపిఐ ప్రతినిధుల సమావేశం
సంభాషణ మొత్తం వెలుగులోనికి వచ్చింది.
ఆ వివరాలు కింది లింకులో వున్నాయి. ఇంగ్లీషులో చదవ గలిగినవారు ఇప్పుడే చదువుకో వచ్చు.
ఇంగ్లీషు రానివారి
సౌకర్యం కోసం రెండు రోజుల్లో తెలుగు అనువాదం చేసి పోస్టు పెట్టేందుకు ప్రయత్నం చేస్తాను.
No comments:
Post a Comment