Friday, 17 January 2025

 మార్క్సిస్టు-లెనినిస్టు రాజకీయాల్లో నా తొలి గురువు




*మార్క్సిస్టు-లెనినిస్టు రాజకీయాల్లో నా తొలి గురువు*

మార్క్సిస్టు-లెనినిస్టు రాజకీయాల్లో నా తొలి గురువు వాసిరెడ్డి వెంకట కృష్ణారావుగారు. వివి కృష్ణారావుగా వారు సుపరిచితులు. ఇండియన్ పీపుల్స్ ఫ్రంట్, సమతా పార్టిలకు జాతీయ అధ్యక్షులుగా పనిచేశారు.

1978లో మా తొలి పరిచయం. వారి గురించి విని నేనే వెతుక్కుంటూ వెళ్ళాను. విజయవాడ మొగల్రాజపురం సున్నపుభట్టీలు సెంటరు సమీపంలోని  నవోదయా కాలనీలో వుండేవారు. 1950లలో కొండపల్లి సీతారాయయ్య, కేజి సత్యమూర్తి కూడ అక్కడే వుండేవారు. అప్పటి నుండి మూడు తరాలుగా కృష్ణారావు కుటుంబంతో మా అనుబంధం నిరాఘాటంగా కొనసాగుతోంది.

ఎప్పుడు తిరగబడాలి? ఎప్పుడు మౌనంగా వుండాలి? అనే రెండు వ్యవహార శైలుల్ని నేను వారిదగ్గరనే నేర్చుకున్నాను. ఉద్యమాల్లో శరీరాన్ని వాడే సందర్భాలుంటాయి; మెదడును వాడే  సందర్భాలుంటాయి.  Body and brain. మనం రెండింటికీ సిధ్ధంగా వుండాలి. సందర్భాన్నిబట్టి వాటిని ఎంచుకోవాలి. ఆ ఇంగితాన్ని వారే నాకు బోధించారు. ఒక సందర్భంలో కొండపల్లి సీతారామయ్య వెంట (రక్షకుడుగా) నన్ను పంపించింది వారే.

వారి జీవితం చాలా విస్తారమైనది; వైవిధ్య పూరితమైనది. భావితరాలు తెలుసుకోవాల్సిన అనేక సంఘటనలు వారి జీవితంలో వున్నాయి. బిసెంట్ రోడ్డులో ఐదుగురు ఒకచోట గుమికూడివుండే చాలు ఆయన అక్కడ నిలబడి  నక్సలైట్ ప్రచారం మొదలెట్టేవారు. పోల్ పాట్ (Pol Pot) గురించి మాట్లాడేవారు. వినే వాళ్ళలో ఒక్కరికీ పోల్ పాట్ పేరుకాదు కదా కాంబోడియా / కంపూచియా దేశం పేరు కూడ తెలీదు.  క్రైస్తవ ఫాదర్ల మత ప్రచారాన్ని మించిపోయేది కృష్ణారావు విప్లవ ప్రచారం.

 

కోర్టు హాలులోనికి చొరబడి “డౌన్ విత్ ద బూర్జువా కోర్ట్స్” అనగలిగే ధైర్యం ఇప్పుడు ఎవ్వరికయినా వుందా?   మా గురువుకు వుండేది. జడ్జీలు బిత్తరపోయేవారు.

 

నన్ను జర్నలిస్టుగా మార్చింది కూడా వారే.  కృష్ణారావుగారి నాయకత్వంలో మేము ‘తూర్పుగాలి’ ‘నడుస్తున చరిత్ర’ మాసపత్రికల్ని నడిపేవాళ్ళం. హంగేరికి చెందిన తత్వవేత్త György Lukács (మేము జార్జి లూకాస్ అనేవాళ్ళం) అభిమానులు కొందరు లండన్ కేంద్రంగా Western Marxist Center ఒకదాన్ని నడిపేవారు. వాళ్ళు అప్పట్లోనే సోవియట్ రష్యాను సామ్రాజ్యవాద దేశం అని విమర్శించేవారు.  వాళ్ళు ప్రచురించే ‘బ్రాడ్ షీట్’ వారపత్రిక కాపీ మాకు వచ్చేది. దాన్ని మేము విజయవాడలో  జిరాక్స్ కాపీలు తీయించి చందాదారులకు పంపిణి చేసేవాళ్ళం. అందులోని కొన్ని స్టోరీస్ ను అనువాదం చేసి ‘తూర్పుగాలి’ ‘నడుస్తున చరిత్ర’లో ప్రచురించేవాళ్ళం.

కృష్ణారావు కొన్నాళ్ళుగా వృధ్ధాప్యానికి సంబంధించిన ఆరోగ్య  సమస్యల్ని ఎదొర్కొంటున్నారు. ఈరోజు వారి ఇంటికి వెళ్ళి కలిశాను. గంటకు పైగా  మాట్లాడుకున్నాము. అనేక వర్తమాన అంశాల మీద వారు ఇప్పటికీ ఒక స్పష్టమైన వైఖరితో వున్నారు. వారి జ్ఞాపకశక్తి నాకన్నా బాగుంది. నేను మరచిపోయిన అనేక సంఘటనల్ని గుర్తు చేశారు.  ఆ కొద్ది సమయంలోనే గ్రామం నుండి అమెరిక వరకు వయా పుతిన్ చాలా విషయాలు మాట్లాడారు.

గతంలో ఒక ఆర్టికల్ రాస్తూ ఆయన్ని ‘గ్లోబల్ గ్రామీణుడు’ అన్నాను. ఇప్పటికీ వారు అలానే వున్నారు.  

కమ్యూనిస్టులు ముందు దేశభక్తులు; ఆ తరువాత  అంతర్జాతీయవాదులు. అయినప్పటికీ, భారత కమ్యూనిస్టు నాయకులకు లెనిన్, మావో, హోచిమిన్ లా  దేశభక్తులనే ఇమేజ్ రాలేదు. ఇండియాలో కమ్యూనిస్టులకు  కమ్యూనిస్టులే శత్రువులు అని రాత్రి వారు కొంచెం ఆవేదనగా అన్నారు.

18-01-2025

No comments:

Post a Comment