Tuesday, 14 January 2025

Happy Birthday Agitha

 అజితకు పుట్టిన రోజు శుభాకాంక్షలు !



 

అజితకు పుట్టిన రోజు శుభాకాంక్షలు !

 

ఇప్పటి కులమత సమీకరణల లోతైన విభజన  వాతావరణంలో మాది పెద్దలు నిర్ణయించిన పెళ్ళి అంటే చాలామందికి నమ్మశక్యంగా వుండకపోవచ్చు. కానీ, నలభై రెండేళ్ళ క్రితం సామాజిక వాతావరణం చాలా గొప్పగా వుండేది.

 

మరీ వారం రోజుల్లోనో నెల రోజుల్లోనో కాకపోయినా ఓ ఏడాది రెండేళ్ళలో దేశంలో విప్లవం వచ్చేస్తుందని గట్టిగా నమ్మేవాళ్ళ సంఖ్య ఎక్కువగా వుండేది.

 

పీపుల్స్ వార్ పార్టీకి కృష్ణాజిల్లాలో పూర్తి స్థాయి  కమిటీ  ఎప్పుడూ లేదు. అడహాక్ కమిటీలే  ఉండేవి. ఆ కమిటీ బాధ్యులుగావున్న వివి కృష్ణారావుగారు ఇండియన్ పీపుల్స్ ఫ్రంట్ కు వెళ్లిపోయారు. అంత వరకు రాడికల్ యూత్ లీగ్ జిల్లా అధ్యక్షునిగావున్న నేను జిల్లా పార్టీకి  అడహాక్ బాధ్యునిగా మారాను.

అప్పట్లో జిల్లా రైతు - కూలి సంఘం  కార్యదర్శిగా ఏలూరి భీమయ్య వుండేవారు. రైతుల సమస్యలు చెప్పుకోవడానికి వారు తరచూ నా దగ్గరికి వస్తుండేవారు.  మనిషి చాలా నిరాడంబరంగా ఉండేవారు. నేను కుర్చీలో కూర్చొని టేబుల్ మీద  రాసుకుంటుంటే నా గదిలోనికి వచ్చి  నేల  మీద  కూర్చునే వారు.

వారిది శివాపురం. తెలంగాణ ఆంధ్ర  సరిహద్దుల్లో మధిరకు దగ్గరగా  కృష్ణాజిల్లాలోవున్న కుగ్రామం అది. మధిర పట్టణాన్ని ఆనుకుని ప్రవహించే వైరా  వాగు మీద అప్పటికి వంతెన  లేదు. ఆ గ్రామానికి రైలు బస్సు సాకర్యం  ఇప్పటికీ లేదు. తెలంగాణ పోలీసుల నుండి తప్పించుకోవాల్సి వచ్చినపుడు నక్సల్ నేతలు వ్యూహాత్మాకంగా శివపురంలో షెల్టర్ తీసుకునేవారు. 1940ల నాటి తెలంగాణ రైతాంగా పోరాట  కాలం  నుండి కొండపల్లి  సీతారామయ్యకు  ఆ గ్రామంలో అభిమానులు  ఎక్కువ. జిల్లాలో పీపుల్స్ వార్ కార్యకర్తలు ఎవరు  అరెస్టు అయినా శివపురం  వాళ్ళే తమ భూమి పత్రాలు జామీనుగా కోర్టులో సమర్పించి బెయిల్ తెచ్చేవారు.

1982 వేసవిలో ఏలూరులో ఆర్ వైఎల్ రాష్ట్ర మహాసభలు జరిగాయి. దానికి రెండు రోజులు ముందు శివపురంలో జిల్లా మహాసభలు జరిగాయి. అక్కడ  మొదటిసారి భీమయ్య కూతురు అజితను  చూసాను. మొదటి చూపులోనే ఆమెవి కళగల కళ్ళు అనిపించాయి.

ఏలూరు వెళ్ళే సభ్యులమంతా మరునాడు తెల్లారు జామున శివాపురం నుండి మధిర రైల్వేస్టేషన్ కు బయలు దేరాము.  తెలియని దారి, చీకట్లో నడక. కొన్ని చోట్ల కుక్కల గుంపు దాడి. నాకు తెలుగుతోపాటు కొంచెం ఇంగ్లీషు, కొద్దిగా  హింది, కొద్దిగా ఉర్దూ, అరబ్బీలు వచ్చు. కానీ కుక్కల భాష రాదు. వాటిని చూస్తే భయం కూడ. అజిత చేతిలో ఓ పొడుగాటి కర్ర తీసుకుని మా బృందానికి ముందు నడుస్తూ కుక్కల్ని తరుముతుండేది. కక్కలంటే ఆమెకు భయం లేకపోవడం కొంచెం ఆర్చర్యంగా అనిపించింది.

తరువాత  కొంతకాలనికి,  తన  కుమార్తెను పార్టీలో ఇవ్వాలని భావిస్తున్నట్టు భీమయ్య  చెప్పగా కొండపల్లి సీతారామయ్యగారు నా పేరు సూచించారట. పార్టీ రీజినల్ కమిటీ కార్యదర్శి ఈ విషయాన్ని నాకు చెప్పారు. ముందు  తనతో  నేరుగా మాట్లాడి తన  అభిప్రాయం తెలుసుకోవాలి  అన్నాను. పార్టీ ఆర్ సి మాకు విజయవాడలో పెళ్లి చూపులు ఏర్పాటు చేసింది. నవ్వు అజిత సిగ్నేచర్.

          “నువ్వు నాకు నచ్చావు. అయితే, నాకు ఉద్యోగం లేదు; నిలకడగా ఉద్యోగం చేసే  ఆసక్తి లేదు. ఆస్తిలేదు.  ఉద్యమాలంటూ ఊర్లు పట్టుకుని తిరుగుతాను. నానుండి ఎలాంటి ఆదాయాన్ని ఆశించకు. పిల్లలు పుడితే వాళ్ళ పెంపకం చదువు వగయిరా భారం కూడ  నీదే. అన్నింటికన్నా ముఖ్యమైనది  నాకు ఇంతకు  ముందే పెళ్లి అయింది. అది మతాంతర వివాహం. మా పెళ్లి ఆమె పెద్దలకు  నచ్చలేదు. పెళ్లయిన  నెల రోజులకే  ఆమె బలవన్మరణం పాలయింది. ఇక నీ ఇష్టం” అన్నాను.

తను  నాషరతులు అన్నింటికీ ఒప్పుకుంది. విప్లవ భావుకతను ఆమెకు ఆ స్థాయిలో నింపేశారు వాళ్ళ నాన్న. కొండపల్లి సీతారామయ్య నిప్పుల్లో దుకమన్నా  దూకడానికి భీమయ్య సిద్ధం. వాళ్ళ నాన్న గాడిదను (పోలిక బాగోలేదుకదూ?)  చేసుకోమన్నా చేసుకోవడానికి  అజిత  సిద్ధం. అలా ఉండేది  కమిట్ మెంట్.

మనమంతా  కలిసి  పోరాడితే మరీ నెల  రోజుల్లో కాకపోయినా రెండు మూడు నెలల్లో అయినా విప్లవం  విజయవంతం అవుతుందనే అపార నమ్మకం వుండడంతో సాహసాలు, దుస్సాహసాలు కూడా చేసేసే వాళ్ళం. కమ్యూనిస్టు పార్టీలు రాజకీయరంగంలో అనుకున్న విజయాలను సాధించడంలో విఫలం అయ్యాయి. అయితే, సామాజిక వాతావరణంలో అప్పటికే గొప్ప మార్పులు రావడానికి అవి చాలా దోహదపడ్డాయి. 

వాళ్ళు నా మతం ఏమిటని అడుగలేదు, నేను వాళ్ళ కులం ఏమిటని అడగలేదు. ఇంకో రెండు రోజుల్లో పెళ్లి ఉందనగా భీమయ్యగారు  కమ్మ సామాజిక వర్గానికి చెందినవారనీ అయన  14   ఎకరాల మధ్యతరగతి రైతు అనీ అజిత  ఆయనకు ఏకైక  సంతానం అనీ అర్ధం  అయింది.

భీమాయ్యగారే  ఇష్టంగా పెళ్లి చేయడంతో ఆయన  బంధువులు ఎక్కువ మంది మా పెళ్ళికి హాజరయ్యారు. నన్ను గౌరవప్రదంగా తమ  సమూహంలో  కలుపుకున్నారు. మాది ఎక్స్ టెండెడ్ ఫ్యామిలీ గా మారిపోయింది. ఏలూరివారు చెరుకూరివారు కొమ్మినేనివారు, లగడపాటివారు అలా చాలా పెద్దది అజిత బలగం.

నాకు అప్పటికే రచయితగా కొంత పేరు వుంది. పబ్లిక్‍ స్పీకర్ గా వున్నాను. పీపుల్స్ వార్ కోస్తాజిల్లాల యూనిట్లలో బయట వున్నవారికేగాక లోపల వున్నవారికీ తత్త్వశాస్త్రం పాఠాలు చెపుతున్నాను. ఢిల్లీ జేఎన్ యూలో ఓ ఉపన్యాసం కూడ ఇచ్చివచ్చాను. అజిత నాకన్నా పదేళ్ళకు పైగా చిన్నది. ఇవన్నీ కలిపి అజితకన్నా నేను గొప్పవాడిననే భావనలో వుండేవాడిని. మా ఇల్లు పూరిపాక. ఆదాయం తక్కువ. కుటుంబంలో నామీద ఆధారపడినవారు ఎక్కువ. నిరంతరం ఆర్ధిక ఇబ్బందులు వుండేవి.  అజిత వీటన్నింటినీ తట్టుకుని నిలబడింది. ఇంకొకరయితే ఎన్నడో వదిలి పారిపోయి వుండేవారు.

కోవిడ్ సెకండ్ వేవ్ లో తల్లిదండ్రులకు సోకితే పిల్లలు, పిల్లలకు సోకితే తల్లిదండ్రులు వదిలి పారిపోయారు. మహమ్మారి మా ఇంట్లోనూ వచ్చింది. ముందు అజితకు సోకింది. నా కొడుకులు ఇద్దరికీ నాకన్నా అజిత అవసరం ఎక్కువ. కుటుంబంలో నేను చేయలేని పనుల్ని తను చేయగలదు. తనను తీసుకుని హైదరాబాద్ వెళ్ళిపోయాను. ఆమె డిశ్చార్జ్ అయ్యే సమయానికి నాకు సోకింది. నా పరిస్థితి తనకన్నా విషమించింది. చనిపోతానని డాక్టర్లు ప్రకటించేశారు. దానికి అజిత ఒప్పుకోలేదు. నన్ను బతికించేసింది. అదో మెరకిల్.

తను చాలా మొండిది. పల్లెటూరి పిల్ల ఇమేజ్ నుండి తప్పించుకోవడానికి కంప్యూటర్ టెక్నాలజీలో నైపుణ్యాన్ని సాధించింది. మా పెద్దోడు ప్రస్తుతం VFX సూపర్ వైజర్ కావడానికి పునాది వేసింది తనే.

నేను మనసు కుదిరినప్పుడు ఉద్యోగాలు చేశాను. చికాకు కలిగినప్పుడు ఉద్యోగాలు మానేశాను. ఎప్పుడూ తను ఆర్ధిక లోటు గురించి మాట్లాడలేదు. “మై హూ నా!” అనేది.

వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం  2004లో పీపుల్స్ వార్ / మావోయిస్టు పార్టి, జనశక్తి  ప్రతినిధుల్ని చర్చలకు పిలిచింది. ఆ చర్చల్లో పాల్గొనడానికి వచ్చిన ఆంధ్రా ఒరిస్సా బార్డర్ కమిటి బాధ్యుడు సుధాకర్ ను అతని కార్యక్షేత్రంలోవదలాల్సి వచ్చింది. నేనూ తనూ వెళ్ళాం. అక్కడ పార్టి ఐటి వింగ్ లో కంప్యూటర్ మెళుకువలు నేర్పాలని  అజితను కోరారు. తను అక్కడ ఓ వారం రోజులు వుండిపోయింది.

ఆమెది ఒక్కటే కోరిక నేను ఏదో ఒక విధంగా కమ్యూనిస్టుగా కొనసాగుతూ వుండాలి. “పార్టి విధానాలు నచ్చకపోతే విమర్శించు; అది తప్పుకాదు. కానీ, కమ్యూనిజమే తప్పు అంటే మనం కలిసి వుండాల్సిన పనిలేదు” అని హెచ్చరిస్తుంటుంది.

ఈమధ్య ఆదివాసీ జాతీయ మహాసభల్ని ఢిల్లీలో నిర్వహించాలనుకున్నారు. అక్కడ పోలీసు పర్మిషన్ రాకపోవడంతో దాన్ని విజయవాడకు మార్చారు. సభ ప్రారంభం కావడానికి కేవలం రెండు గంటల ముందు నాకు ఫోన్ చేసి ప్రారంభోపన్యాసం చేయాలని కోరారు. ఇప్పుడా చెప్పేది? అని నాకు కొంచెం చికాకు వచ్చింది. ఎప్పుడూ చెప్పినాసరే నువ్వు వెళ్ళవలసిందే అని తనే నన్ను సిధ్ధం చేసి సభలకు తీసుకుని వెళ్ళింది.

తను జనవరి 15న పుట్టింది. సోషల్ యాక్టివిస్టుగా వుండడం మూలంగా సంక్రాంతి సెలవుల్లో ప్రతి సంవత్సరం ఎక్కడో ఒక మీటింగు వుండేది. అలా తన బర్త్ డేలు అనేకం వాటికి నేను ఇంట్లో వుండకుండా పోయాను.

మా మధ్య తగవులు రావడానికి బలమైన పునాదులు అనేకం వున్నాయి. ఇద్దరికీ ఆత్మాభిమానమేకాదు ఇగో కూడ కొంచెం ఎక్కువ. ఒక లెఖ్ఖ ప్రకారం మేమిద్దరం ఇప్పటికి వెయ్యినొక్కసారి విడిపోవాలి. అలా జరగకపోవడానికి కారణం అజితకు నేను సర్వస్వం. అజితంటే నాకు చాలా ఇష్టం. 

కోపం వచ్చినప్పుడు ఆమె నన్ను చాలా అనేస్తుంది. నేనూ చాలా అనేస్తాను. వాటినన్నింటినీ ఓ వారం తరువాత రికార్డుల నుండి తొలగిస్తుంటాము. ఎవరు ఎవరికి రుణపడివున్నారని బ్యాలెన్స్ షీటు వేసుకుంటే నేనే అజితకు రుణపడివుంటాను. ఆ విషయం నాకు స్పష్టంగా తెలుసు.

సామాజిక జీవితంలో నేను చేసిన రిస్కులకు నాకు పేరొచ్చింది. తను అంతకన్నా రిస్కులు చేసింది. తనకు రావల్సినంత పేరు రాలేదు. ఆ పాపం నాదే అనుకుంటాను.

హ్యాప్పీ బర్త్ డే అజిత.  

జనవరి 15, 2025

No comments:

Post a Comment