Decreases of fertility is a crisis!
సంతానోత్పత్తి తగ్గితే సంక్షోభమే!
ఈరోజు ఆంధ్రజ్యోతిలో నా వ్యాసం
డానీ
సమాజ విశ్లేషకులు
సంతానం లేకపోతే వంశం అంతరించిపోతుందని గతంలో కొందరు ఆందోళన చెందేవారు. సంతానోత్పత్తి ఆగిపోతే దేశాలే అంతరించిపోతాయనే ఆందోళన ఇటీవల వినిపిస్తోంది. సంతానంలేమి వ్యక్తిగత సమస్యకాదు; ఒక సాంప్రదాయం ఆగిపోతుంది. తరతరాల కృషి ముగుస్తుంది
సంతానోత్పత్తిలేమితో
అంతరించిపోయే ముప్పును ఎదుర్కొంటున్న దేశాల్లో
దక్షణ కొరియా ముందు పీఠిన వుంది. ఆ తరువాత
తైవాన్, జపాన్, ఇటలీ, స్పేయిన్ దేశాలున్నాయి. ప్రపంచంలో మరెన్నో దేశలకూ ఇలాంటి ముప్పు
పొంచి వుందని జనాభా శాస్త్రవేత్తలు (demographers)
గణాంకాలు తీసి హెచ్చరిస్తున్నారు.
జనాభా పెరుగుదల మీద మనలో అనేక తప్పుడు అభిప్రాయాలు కొనసాగుతునాయి. వీటికి పునాది థామస్ రాబర్ట్ మాల్థూస్ 1798లో ‘జనాభా సూత్రం’ అనే శీర్షికతో రాసిన ఒక వ్యాసం. (An Essay on the Principle of Population). మాల్థూస్ ను బ్రిటీష్ జనాభాశాస్త్రవేత్తగా, ఆర్ధికవేత్తగా పేర్కొంటుంటారుగానీ ఆయన ప్రధానంగా మతగురువు. కొన్ని లక్షల మంది చనిపొయే విపత్తులు ఎందుకు సంభవిస్తున్నాయని అడిగే సందేహపరులను ధార్మికంగా సమాధానపరచడానికి ఆయనొక సిధ్ధాంతాన్ని కనిపెట్టారు.
ఆహారోత్పత్తి నిదానంగానూ, జనాభా వేగంగానూ పెరుగుతాయనేది ఆ సిధ్ధాంత సారం. Population grows geometrically while food production increases arithmetically- అని అర్ధశాస్త్రం విద్యార్ధులు తొలిపాఠాల్లోనే చదివి వుంటారు.
భూమికి వున్న ఆహారోత్పత్తి సామర్ధ్యంకన్నా మనుషుల సంతానోత్పత్తి సామర్ధ్యం పెరిగిపోయినపుడు ఏర్పడే ‘అదనపు జనాభా’ను తొలగించడానికి విపత్తులు సంభవిస్తాయి అన్నాడాయన. దీనినే మాల్థుస్ మహావిపత్తు (Malthusian catastrophe) సిధ్ధాంతం అంటారు.
మాల్థుస్ ఈ సూత్రీకరణ చేసే నాటికే ఇగ్లండ్ లో పారిశ్రామిక విప్లవం పుంజుకుంటోంది. ఆ పరిణామాల్ని ఆయన పట్టించుకోలేదు. కమ్యూనిస్టు సిధ్ధాంతకర్తలయిన కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఏంగిల్స్ మాత్రమేగాక, పెట్టుబడీదారీ వ్యవస్థను సమర్ధించిన ఉపయోగితావాదులు, ఫలితవాదులు (consequentialists) అయిన జాన్ స్టూవర్ట్ మిల్, విలియం గాడ్విన్ వంటివారు సహితం మాల్థుస్ సిధ్ధాంతాన్ని గట్టిగానే విమర్శించారు.
కొన్ని వాస్తవాలను గమనించి మాల్థస్ ఒక తర్కాన్ని రూపొందించాడు. గానీ, అవి సంపూర్ణ వాస్తవాలు కావని కొందరు తప్పుపట్టారు. మనిషికి జ్ఞానం విజ్ఞానం రెండూ వుంటాయి. జ్ఞానంతో
సంతానోత్పత్తిని అదుపు చేసుకోగలడు; విజ్ఞానంతో ఆహారోత్పత్తిని పెంచగలడు అన్నవారూ
వున్నారు. అవసరం ఆవిష్కరణకు తల్లి వంటిదికనుక ఆహార అవసరాల్ని కొత్త ఆవిష్కరణలతో
మనిషి అధిగమిస్తాడని ఆశాభావాన్ని వ్యక్తం చేసినవారున్నారు. మానవజాతికివున్న
ఉత్పాదకశక్తి అపారమైనది. అవసరాన్నిబట్టి అది విజృంభిస్తుందన్నాడు ఏంగిల్స్. సమస్య,
ఆహారోత్పత్తి జరక్కపోవడంకాదు; ఉత్పత్తి అయిన ఆహారాన్ని సమంగా పంపిణీచేయకపోవడం
అన్నాడు మార్క్స్. ఆయన అంతటితో ఆగలేదు. సంపద ఒకచోట పోగుపడడానికి మిగులు జనాభా ఒక అవసరమైన
ఉత్పత్తి అవుతుందన్నాడు.
కరువు, క్షామం, తుఫానులు, వరదలు, మహమ్మారులు వంటి విపత్తులు, యుధ్ధాల ద్వార సహజంగానే జనాభా నియంత్రణ జరుగుతుందని మాల్థుస్ భావించాడు. రెండవ ప్రపంచ యుధ్ధం తరువాత నవ - మాల్థూసియన్లు వచ్చారు. వాళ్ళు కుత్రిమ కుటుంబ నియంత్రణ (contraceptive) పధ్ధతుల్ని రూపొందించారు.
మనిషి తినడానికి ఒక పొట్ట మాత్రమే పెట్టుకుని పుట్టడు; ఉత్పత్తి చేయడానికి రెండు చేతులతోనూ పుడతాడు అనే ఇంగితం మనలో చాలా మందికి వుండదు. మనిషి సామర్ధ్యాన్ని తక్కువ చేయడం హీనమైన పాపం!. ఈ భూమ్మీద స్వర్గం అంటూ వుంటే అది భారత ఉపఖండమే. రాత్రీ పగలు సమానం, వర్ష, శీతల, వేసవి కాలాలు సమానం, సుడులు తిరిగే నదులు, అన్ని రకాల శీతోష్ణస్థితులు గల భౌగోళీక ప్రాంతాలు మనకు ప్రకృతి ఇచ్చిన వరం.
145 కోట్ల జనాభా అనేది ప్రపంచంలోనే అతి పెద్దది కావచ్చుగాక, మనందరికీ మూడు పూట్లా తిండి పెట్టగల సామర్ధ్యమున్న భూమి మనది. మనదేశంలో నిర్వహణ లోపం కారణంగా ఉత్పత్తి అయిన ఆహారధాన్యాల్లో 25 నుండి 30 శాతం వృధా అయిపోతున్నాయి. పండ్లు, కూరగాయలు, ఆకుకూరల ఉత్పత్తిలో 50 శాతం కుళ్ళీపోతోంది. మన దేశం నుండి ఆహారధాన్యాలు ఎన్ని లక్షల టన్నులు అక్రమంగా రవాణా అవుతున్నాయో ఇటీవల కొన్ని కేసులు బయటపడి కళ్ళు తెరిపించాయి. కాకినాడ యాంకరేజ్ పోర్టు నుండి ఆఫ్రికాకు బియ్యాన్ని దొంగరవాణ చేస్తున్న ఓడను అడ్డుకోవడం వాటిల్లో ఒకటి మాత్రమే. ఇంతటి అదనపు ఆహారోత్పత్తి వున్నప్పటికీ ప్రపంచంలో పౌష్టిక ఆహార లోపంతో బాధపడుతున్న ప్రజలు భారతదేశంలో ఎక్కువగా వున్నారని అంతర్జాతీయ నివేదికలు చెపుతున్నాయంటే లోపం ఎవరిదీ? పంటలదా? పంపిణిలదా?
నిల్వ వుంచడానికి తగిన గిడ్దంగులు లేక దేశమంతటా ఆహారధాన్యాలు ముక్కిపోతున్నాయని 2010లో అనేక వార్తలు వచ్చాయి. వాటి మీద స్పందించిన సుప్రీం కోర్టు ఆ ఏడాది ఆగస్టు 12న ఆ ఆహార ధాన్యాలను అవసరమైన వారికి ఉచితంగా పంచాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఆగస్టు 19న కోర్టు మందు హాజరైన అప్పటి వ్యవసాయ శాఖామంత్రి శరద్ పవార్, ప్రభుత్వం అనేక పథకాల ద్వార పేదలకు సబ్సిడి ధరకు ఆహారధాన్యాలను పంపిణి చేస్తున్నదని విన్నవించుకున్నారు. దానితో సంతృప్తి చెందని కోర్టు ఆగస్టు 12 నాటి ఆదేశాలను పాటించి తీరాలని స్పష్టం చేసింది.
జనాభానును నియంత్రించాలని ఐక్యరాజ్యసమితి 1968 మే 13 నాటి టెహ్రాన్ ప్రకటనలో తొలిసారిగా పేర్కొంది. అంతకు 16 ఏళ్ల ముందే 1952లో భారత ప్రభుత్వం కుటుంబ నియంత్రణ పథకాన్ని రూపొందించింది.
ఏ కొత్త పథకానికి అయినాసరే మతంరంగు పులిమేయడానికి కొందరు సిధ్ధంగా వుంటారు. వాళ్ళు మనదేశానికి ప్రత్యేకం కావచ్చు. “మనం ఇద్దరం; మనకు ఇద్దరు” అనే నినాదాన్ని వాళ్ళు “హమ్ పాంచ్, హమారే పచ్చీస్”గా మార్చి ముస్లిం విద్వేషాన్ని ప్రచారం చేశారు. మాల్థుస్ మాటల్ని దేశంలో హిందూజనాభా నిదానంగానూ, ముస్లింజనాభా వేగంగానూ పెరుగుతున్నాయన్నట్లు మార్చారు. సమీప భవిష్యత్తులో భారతదేశం ముస్లిందేశంగా మారిపోతుందని భయపెట్టారు. ఈ పని చేసింది చిన్నాచితక వాళ్ళు కాదు. సాక్షాత్తు దేశాధినేతలు అయినవారే ఈ రకం ప్రచారానికి సారధ్యం వహించారు.
ప్రపంచ గణాంకాల ప్రకారం జనాభాలో సగటున 2 శాతం మంది ప్రతిఏటా చనిపోతారు. ఆ లోటును భర్తీ చేయడానికి కనీసం 2.1 శాతం పిల్లలు ప్రతి ఏటా పుట్టాలి. అలా జరక్కపోతే ఏ దేశంలో అయినా సరే అనేక అనర్ధాలు జరిగిపోతాయి. ఉత్పత్తి విరమణ చేసిన వృధ్ధుల శాతం పెరిగిపోతుంది; ఉత్పత్తి చేయడానికి రంగప్రవేశం చేయాల్సిన కొత్త తరం పుటుక తగ్గిపోతుంది.
దేశజనాభా పెరుగులను స్త్రీల స్థూల సంతానోత్పత్తి సామర్ధ్యం (Total Fertility Rate – TFR)తో అంచనా వేస్తారు. స్త్రీలు జీవితకాలంలో సగటున ఎంతమందికి జన్మనిస్తున్నారు అనేది కొలమానం. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (NFHS) ఈ నివేదికల్ని రూపొందిస్తుంటుంది. ఈ సంస్థ 2019-21లలో నిర్వహించిన సర్వేల్లో భారత సగటు టిఎఫ్ ఆర్ 2 అని తేల్చింది. అంటే కనీస స్థాయికన్నా తక్కువగా వుందని అర్ధం. ఇందులో హిందూ స్త్రీల టిఎఫ్ ఆర్ 1.94 వుండగా ముస్లిం స్త్రీల సామర్ధ్యం 2.36 వుందని తేల్చారు. క్రైస్తవ, బౌద్ధ, జైన స్త్రీల టిఎఫ్ ఆర్ వరుసగా 1.88, 1.61, 1.39 వుందట.
ఆర్ధిక స్తోమతకు సంతానోత్పత్తికి విలోమ నిష్పత్తి వుంటుందని గణాంకాలు చెపుతున్నాయి. సాధారణంగా మధ్యతరగతి ఆపైన వుండే ఆర్ధిక సమూహాలు ఒక ప్రణాళికబధ్ధ కుటుంబాలను రూపొందించుకుంటాయి. పేదవర్గాలకు అలాంటి ఆలోచనలు వుండవు. ఆ సమూహాల్లో సంతానోత్పత్తి అధికంగా వుంటుంది. ప్రపంచంలో అత్యంత పేదదేశం అయిన సోమాలియలో టిఎఫ్ ఆర్ 6.12. ఇది ప్రపంచంలోనే అత్యధికం. విచిత్రం ఏమంటే ముస్లిం ఛాందస దేశాలనిపించే ఇరాన్, సౌదీ ఆరేబియాల్లో టిఎఫ్ ఆర్ 2, 2.31 మాత్రమేవుంది.
కొత్త తరాలు పుడుతుంటే సగటు వయస్సు (mean age) తక్కువగా వుంటుంది. అలాంటి దేశాల్లో కార్మిక శక్తి పెరిగి అవి లాభపడతాయి. అదేవిధంగా, కొత్త తరాలు పుట్టకపోతే సగటు వయస్సు ఎక్కువగా వుంటుంది. అలాంటి దేశాల్లో ఆధారపడే సమూహాలు పెరిగి అవి ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటాయి. ఇందులో మొదటి దానికి ఇండియా, రెండోదానికి జపాన్ వర్తమాన ఉదాహరణలు.
లాభాల వేటలోపడిన పెట్టుబడీదారులు నిరంతరం అధికోత్పత్తిని చేసే యంత్రాలను ప్రవేశపెడుతుంటారు. ఆ కొత్త యంత్రాలు తమను సృష్టించిన కార్మికుల్నే స్థానభ్రంశానికి గురిచేస్తాయి. అప్పటి వరకు ఉపాధిగలవారు మరునాడు నిరుద్యోగులుగా మారిపోతారు. ఈ పాపం పెట్టుబడీదారుల అత్యాశది. కానీ వాళ్ళు దాన్ని ఒప్పుకోరు. జనాభా పెరిగిపోతున్నదని రోడ్డెక్కి గావుకేకలు పెడుతారు. బయట నిరుద్యోగుల సంఖ్య ఎంత ఎక్కువగా వుంటే అంత చవకగా వాళ్ళకు శ్రామికులు రిజర్వు సైన్యంగా అందుబాటులో వుంటారు. ఇదొక పెద్ద వలయం. పేదరికాన్ని సృష్టించేవారే పేదల్ని విమర్శిస్తుంటారు.
దేశంలో ముస్లిం పురుషులు చెరో పాతిక మంది పిల్లల్ని కంటున్నారనడం ఒక అభూత కల్పన. టిఎఫ్ ఆర్ లో 1.94 – 2.36ల మధ్య వున్న ఆ కొద్దిపాటి ఆధిక్యత కూడ భారత ముస్లిం సమాజపు పేదరికాన్ని సూచిస్తోంది.
టిఎఫ్ ఆర్ తేడాలు ప్రాంతీయ విబేధాలను కూడ సృష్టిస్తాయి. దక్షణాదివారు కుటుంబనియంత్రణను పాటించినట్టు ఉత్తరాదివారు పాటించలేదు. దక్షణాదికి చెందిన తమిళనాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో టిఎఫ్ ఆర్ 1.7 గానూ, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో 1.8 గానూ వుంది. మరోవైపు, ఉత్తరాదికి చెందిన బీహార్ లో 2.9గానూ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో వరుసగా 2.4, 2.3, 2.2గానూ వుంది. దీనిర్ధం ఏమంటే, దక్షణాది జనాభా నిదానంగా పెరుగుతుంటే, ఉత్తరాది జనాభా వేగంగా పెరుగుతోంది. ఇప్పటికీ లోక్ సభలో ఉత్తరాది ప్రాతినిధ్యం ఎక్కువగా వుంది. రేపు నియోజనవర్గాల పునర్ వ్య్వస్థీకరణ (delimitation) జరిగితే ఉత్తరాది రాష్ట్రాల్లో మరిన్ని ఎక్కువ లోక్ సభ నియోజకవర్గాలు ఏర్పడతాయి. అప్పుడు దక్షణాది ఓటర్ల మనోభావాలకు పార్లమెంటరీ ఎన్నికల్లో ప్రాధాన్యం వుండదు.
కుటుంబ నియంత్రణను చైనా చాలాకాలం బలవంతంగా అమలుచేసింది. 2022లో టిఎఫ్ ఆర్ 1.18కు పడిపోవడంతో చైనా పాలకులు బెంబెలెత్తిపోయారు. ఇప్పుడు ఎక్కువమంది పిల్లల్ని కనండి అని బతిమాలుతున్నారు. ప్రత్యేక రైళ్ళు ఏర్పాటు చేసి యువతీ యువకుల్ని ప్రేమ యాత్రలకు (Love-Pursuit Train) పంపుతున్నారు. ఆ పరిస్థితి రాకముందే మనం కళ్ళు తెరవాలి.
రచన 20-01-2025
ప్రచురణ : 28-01-2025 ఆంధ్రజ్యోతి
https://www.andhrajyothy.com/2025/editorial/political-divides-with-population-growth-1364421.html
https://epaper.andhrajyothy.com/NTR_VIJAYAWADA_MAIN?eid=182&edate=28/01/2025&pgid=977182&device=desktop&view=3
No comments:
Post a Comment