Who are the friends who support the communists?
*కమ్యూనిస్టులను గట్టెక్కించే స్నేహితులెవరు?*
*డానీ*
శతవార్షికోత్సవాలు జరుపుకుంటున్న భారత కమ్యూనిస్టు పార్టీలు ప్రజల్లో మళ్ళీ ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని నింపగలవా? అనే ప్రశ్న ఇప్పుడు బలంగా వినిపిస్తున్నది.
మన దేశంలో కమ్యూనిస్టు పార్టిలు వంద చీలికలు కావచ్చుగానీ అవి సాధించిన విజయాలు కూడ అంతకు మించి వున్నాయి. భారత రాజ్యాంగ రచనలోనే కమ్యూనిస్టుల ప్రభావం కనిపిస్తుంది. రాజ్యాంగ రచన సాగుతున్న కాలంలో కమ్యూనిస్టు పార్టి దేశంలో రెండు చోట్ల రైతాంగ సాయుధ పోరాటాలకు నాయకత్వం వహిస్తున్నది. చైనాలో అప్పుడే సాయుధపోరాటం విజయవంతమై పీపుల్స్ రిపబ్లిక్ ఏర్పడింది. రెండవ ప్రపంచ యుధ్ధంలో నాజీ హిట్లర్ ను ఓడించడంతో ప్రపంచ వ్యాప్తంగా రష్యా పేరు ఒక వెలుగు వెలుగుతోంది. అలాంటి సాయుధ పోరాటాలను నివారించే ఒక రక్షణాత్మక విధానంగా కూడ రాజ్యాంగ రచన సాగింది.
రాజ్యాంగం అమల్లోనికి వచ్చిన తరువాత, సామాన్య ప్రజల హితం కోసం రూపుదిద్దుకున్న అనేక చట్టాలు కమ్యూనిస్టుల ప్రభావంతో వచ్చినవే. జమిందారీవ్యవస్థ రద్దు, భూపరిమితి చట్టాలు, పారిశ్రామిక వివాదాల చట్టం, కనీస వేతనాల చట్టం, వెట్టి చాకిరీ వ్యవస్థ రద్దు, అటవీ భూములపై ఆదివాసులకు హక్కులు మొదలైనవన్నీ కమ్యూనిస్టు – నక్సలైట్ ఉద్యమాల ప్రభావంతో వచ్చినవే.
ఇందిరా గాంధీ గరిబి హటావో, ఎన్ టి రామారావు కిలో రెండు రూపాయల బియ్యం, జనతా వస్త్రాలు, పేదలకు ఉచిత ఇళ్ళు వగయిరా పథకాలు కూడ కమ్యూనిస్టు అభిమానుల్ని తమ వైపుకు లాక్కోవడానికి ప్రవేశపెట్టిన పథకాలే.
కమ్యూనిస్టు పార్టి, సంఘపరివారం ఒకేసారి పుట్టాయి. అన్ని రకాల వనరులు, వంద అనుబంధ సంస్థలు వున్నప్పటికీ సంఘపరివారం సంపూర్ణ అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి దాదాపు తొంభయి యేళ్లు పట్టింది. దానికి కారణం కమ్యూనిస్టు పార్టిలు అనుసరించిన మతసామరస్య భావజాలమే!.
అయితే, కమ్యూనిస్టు పార్టీల నాయకులకు కూడ స్థలకాల పరిమితులు వున్నాయి. తొలితరం కమ్యూనిస్టు నాయకులు గ్రామాల్లో భూమి సంబంధిత సామాజికవర్గాల నుండి వచ్చినవారు. వ్యవసాయం, నీటిపారుదలల గురించీ గొప్ప పరిజ్ఞానం వున్నవారు. వ్యవసాయ కూలీల మీద గొప్ప సానుభూతి వున్నవారు. అప్పటి పరిస్థితుల్లో వ్యవసాయ కూలీల విముక్తే దేశవిముక్తి అని గట్టిగా నమ్మినవారు. ఆ దృక్పథంతోనే ‘ఆంధ్రా థీసిస్’, ‘వ్యవసాయిక విప్లవం’ వంటి కార్యక్రమాలు పుట్టాయి. జాతీయ స్థూల ఉత్పత్తిలో వ్యవసాయరంగానికి సింహవాటా వున్న కాలం అది. అందువల్ల కమ్యూనిస్టు పార్టిలు అప్పట్లో వెలుగులో కొనసాగాయి. ఒక మహా యంత్రవిప్లవం ఒకటి వస్తుందనిగానీ, ఉత్పత్తి సంబంధాల సమీకరణలు సమూలంగా మారిపోతాయనిగానీ వాళ్ళు ఊహించలేదు. అది వారి కాల పరిమితి.
1990వ దశకంలో ప్రపంచ వ్యాప్తంగా కమ్యూనిజానికి ఆమోదాంశం సంక్షోభంలో పడింది. ప్రపంచ విప్లవ కేంద్రంగా చాలాకాలం ఒక వెలుగు వెలిగిన రష్యా సోషలిస్టు దేశంగా పతనమైంది. చైనా సోషలిజం మీద కూడ అనుమానాలు తలెట్టాయి. సరిగ్గా ఈ సమయంలోనే కమ్యూనిజం మీద అంతిమపోరుకు ప్రపంచ బ్యాంకు సిధ్ధమైంది. ప్రపంచ వాణిజ్య సంస్థ ఆవిర్భవించింది. సరళీకృత ఆర్ధిక విధానం వ్యాపించింది. కొత్త సాంకేతిక అభివృధ్ధిగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విజృంభించింది. జాతీయ స్థూల ఉత్పత్తిలో వ్యవసాయం వాటా 15 శాతానికి పడిపోయింది, పారిశ్రామిక ఉత్పత్తి వాటా కూడా ఆ స్థాయికే పరిమితం అయ్యింది. సేవారంగం అనూహ్యంగా పెరిగి దాదాపు 70 శాతానికి చేరుకుంది. వర్గ స్పృహ వెనుకంజ వేసి ఉనికివాదం పెరిగింది.
ఇండియాలో చేపట్టాల్సిన విప్లవ కార్యక్రమం ఏమిటో తోచక నలుగురు సభ్యులతో కూడిన ఒక బృందం 1951 ఫిబ్రవరిలో స్టాలిన్ దగ్గరకు వెళ్ళింది. “ముందు మీదేశాన్ని, మీ సమాజాన్నీ క్షుణ్ణంగా అధ్యయనం చేసి, దానికి అనువైన ఒక విప్లవ కార్యక్రమాన్ని రూపొందించుకోండి” అన్నాట్ట స్టాలిన్.
భారత కుల మత తెగ రంగాల్లో తీవ్రంగా కొనసాగుతున్న సంఘర్షణ కూడ వర్గపోరాటమేనని కమ్యూనిస్టు నాయకులకు అర్ధంకాలేదు. ఫలితంగా, ఎస్టి, ఎస్సి, బిసి, మైనారిటీలు, మహిళలు తదితర ఉనికివాద సమూహాలు చాలావరకు కమ్యూనిస్టు పార్టీలకు దూరం అయ్యాయి.
చైనాలో 1940 ప్రాంతంలో మావో చెప్పిన నూతన ప్రజాస్వామిక విప్లవమే ఇప్పటికీ మనదేశంలో అనేక కమ్యూనిస్టు పార్టీల కార్యక్రమంగా వుందంటే దిగ్భ్రాంతి కలుగుతుంది. చైనా నూతన ప్రజాస్వామిక విప్లవంలో సామ్రాజ్యవాద వ్యతిరేకత అనే కోణం కూడ వుంది. ఇక్కడ అదిలేదు.
సరయిన సమయం కోసం ఎదురు చూస్తున్న సంఘపరివార శక్తులు కమ్యూనిస్టు పార్టీల బలహీన సమయంలో - ఆ 1990లలోనే - విజృభించారు. రాజకీయరంగంలో కమ్యూనిస్టుల వెనుకంజతో ఏర్పడిన శూన్యాన్ని వాళ్లు ఆక్రమించుకున్నారు. వాళ్ళు భౌగోళికంగానూ, భౌధ్ధికంగానూ వ్యాపించారు.
సంఘపరివారం నాయకత్వంలోని ఎన్ డిఏ ప్రభుత్వాన్ని 2004 ఎన్నికల్లో ఓడించిన ప్రజలు కమ్యూనిస్టుల మీద తమ నమ్మకాన్ని మరోసారి వ్యక్తం చేశారు. ఆ ఎన్నికల్లో వామపక్షాలకు 60 సీట్లు వచ్చాయి. రష్యా పతనం తరువాత ఇదొక అద్భుతం అనే చెప్పాలి. కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి ‘రైట్ ఆఫ్ ద సెంటర్’ కు వ్యతిరేకంగా ‘లెఫ్ట్ ఆఫ్ ద సెంటర్’గా యూపిఏ-1 ప్రభుత్వాన్ని ఎర్పాటు చేశాయి. దేశంలో ఆర్ధిక సంస్కరణల రూపశిల్పి అయిన మన్మోహన్ సింగ్ ప్రధాని అయ్యారు. అయినప్పటికీ యూపిఏ-1 ప్రభుత్వం వామపక్షాల ప్రభావంతో ప్రజలకు అనేక మేళ్లు తలపెట్టింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అలా రూపొందిందే.
అయుతే, అమెరికాతో పౌర అణు ఒప్పందాన్ని వ్యతిరేకించిన వామపక్షాలు జులై 9, 2008న యూపిఏ- 1 నుండి బయటికి వచ్చాయి. పార్లమెంటరీ ప్రజాస్వామంలో ప్రజలు ఇచ్చిన ఒక సువర్ణ అవకాశాన్ని వామపక్షాలు చేజేతులా పాడుచేసుకున్నాయి. ఇదో మహాతప్పిదం. వామపక్షాలు వదిలి వెళ్ళిపోయాక అధికారాన్ని నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టి రకరకాలవాళ్ళతో చేతులు కలిపి భ్రష్టుపట్టింది. ఇవన్నీ సంఘపరివారం సంపూర్ణ అధికారాన్ని చేపట్టడానికి దోహదం చేశాయి. ప్రజలకు కమ్యూనిస్టుల చర్యలు నచ్చలేదు. 2014 ఎన్నికల్లో కమ్యూనిస్టుల్ని ప్రజలు కఠినంగా శిక్షించారు.
భారత కమ్యూనిస్టు ఉద్యమంలో మొదటి నుండీ రెండు పంథాల మధ్య ఒక చర్చ సాగుతూనే వుంది. ఇందులో మొదటిది; సాయుధపోరాటం ద్వార అధికారాన్నీ చేజిక్కించుకోవడం. రెండోది; పార్లమెంటరీ ప్రజాస్వామ్య ఎన్నికల ద్వార అధికారాన్ని చేపట్టడం. ఇప్పటికీ ఒకటి రెండు కమ్యూనిస్టు పార్టీలు మొదటి పంథాలోనూ మిగిలిన కమ్యూనిస్టు పార్టీలు రెండో పంథాలోనూ కొనసాగుతున్నాయి. ఈ రెండు పంథాలూ ఇప్పుడు ఉనికిని కోల్పోయే ప్రమాదంలో పడ్డాయి.
2026 కల్లా కమ్యూనిస్టు తీవ్రవాదులులేని (నక్సలైట్ ముక్త్) దేశాన్ని నిర్మిస్తామని దేశహోంమంత్రి ప్రతినబూనారు. మరోవైపు, 2024 లోక్ సభ ఎన్నికల్లో వామపక్షాలకు పడిన ఓట్లు 3 శాతం కూడలేవు. మొత్తం 543 సీట్లలో మూడు కమ్యూనిస్టు పార్టీలకు కలిపి 6 సీట్లుమాత్రమే వచ్చాయి. రెండు పంథాల్లోనూ కమ్యూనిస్టు పార్టీలకు కూడ ఇది సంక్షోభ సమయం.
స్నేహహస్తాన్ని అందించే మిత్రులుంటే కష్టాలు సంక్షోభాలను అధిగమించడం పెద్ద కష్టం ఏమీకాదు. ఇప్పుడు కమ్యూనిస్టుల మిత్రులు ఎవరూ? అన్నది ప్రధాన ప్రశ్న.
దేశంలో అనేకానేక ప్రజాసమూహాలు కష్టాల్లో వున్నాయి. వాటిల్లో ఆదివాసులు, ముస్లింలు అత్యధిక అణిచివేతను అనుభవిస్తున్నాయని ఇప్పటికే చాలామంది నిర్ధారించారు. ఆరెస్సెస్ సిధ్ధాంతవేత్త గురూజీ ఎంఎస్ గోల్వాల్కర్ 1968లో ప్రచురించిన ‘బంచ్ ఆఫ్ థాట్స్’ గ్రంధంలో ‘హిందూరాష్ట్ర’కు ముస్లింలు, కమ్యూనిస్టులు, క్రైస్తవులు అంతర్గత శత్రువులని ప్రకటించారు. 2014లో ఢిల్లీ జరిగిన వరల్డ్ హిందూ కాంగ్రెస్ మార్క్సిజం, మెకాలేయిజం, మిశనరీస్, మెటీరియలిజం, ముస్లిం ఎక్స్ట్రీమిజంలను 5 హానులుగా (malicious-5) ప్రకటించింది. ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారులైన అజిత్ దోవాల్ 2014 ఫిబ్రవరిలో తంజావూర్ లోని శాస్త్ర డీమ్డ్ యూనివర్శిటీలో ఓ స్మారక ప్రసంగం చేస్తూ “నాలుగు యుధ్ధరంగాలు’ అనే సిధ్ధాంతాన్ని ప్రతిపాదించారు. సరిహద్దుల్లో శత్రుదేశాలతో, దేశంలో ఉగ్రవాదులు, తీవ్రవాదులతో పోరాడడమే గాకుండా దేశ శ్రేయస్సు కోసం పౌరసమాజం మీద కూడ యుధ్ధం చేయాల్సివుంటుంది అని వారు సిధ్ధాంతీకరించారు. ఈ మాటను వారు 2021లో హైదరాబాద్ లో జరిగిన ఐపిఎస్ అధికారుల పాసింగ్ అవుట్ వేడుకల్లోనూ పునరుద్ఘాటించారు.
ఒక చారిత్రక సందర్భంలో కమ్యునిస్టుల నుండి దూరం జరిగిన ఫూలే-అంబేడ్కరిస్టుల్లో ఇప్పుడు ఒక స్పష్టమైన చీలిక కనిపిస్తున్నది. ఒక సమూహం బిజెపితో కలిసి నడుస్తున్నది. అది నచ్చని సమూహం కూడ ఒకటున్నది. అది కమ్యూనిస్టులు తమకు – బిజెపికన్నా- మెరుగయిన మిత్రులు అనుకుంటున్నది.
వీటన్నింటినీ క్రోడీకరించుకుంటే కమ్యూనిస్టు పార్టీలతో కలిసి పనిచేయడానికి ఒక మహాసముద్రం సిధ్ధంగా వుందని అర్ధం అవుతుంది. ఆ దిశగా అడుగులు వేస్తే మరోసారి ఉజ్వల చరిత్రను సృష్టించడం కమ్యూనిస్టులకు అసాధ్యమేమీ కాదు.
రచన ః విజయవాడ 24-02-2025
ప్రచురణ ః ఆంధ్రజ్యోతి 04-మార్చి – 2025
800 Words
https://www.andhrajyothy.com/2025/editorial/who-are-the-friends-who-support-the-communists-1377537.html