Sunday, 9 March 2025

Fascism, Nazism and Hindutva - CPI - M

 Fascism, Nazism and Hindutva - CPI-M

 

ఆంధ్రజ్యోతి ఎడిట్ పేజీలో ప్రచురణకు పరిశీలించ గలరు. 

స్వల్ప మార్పులు చేశాను. ఈ వెర్షన్ ను ప్రచురణకు పరిశీలించగలరు.

 

*ఫాసిజం – నాజీజం – హిందూత్వ*

*కార్పొరేట్ మతతత్త్వ నియంతృత్వం*

 

డానీ

సమాజ విశ్లేషకులు, 9010757776




 


 

కమ్యూనిస్టు పార్టి ఆఫ్ ఇండియా  (మార్క్సిస్టు) 24వ మహాసభల తీర్మానం ముసాయిదా కేంద్ర ప్రభుత్వాన్ని “నయా- ఫాసిస్టు స్వభావాన్ని వ్యక్తం చేస్తున్నది” అని పేర్కొంది. దానితో, మేధోరంగంలో ఫాసిజం, నయా-ఫాసిజం,  నాజిజంల మీద  ఒక  కొత్త చర్చ మొదలయింది. నేరుగా ‘ఫాసిస్టు’ అనకుండా ‘కొత్త ఫాసిస్టు స్వభావం’ అనడాన్ని జాతీయ కాంగ్రెస్ తో పాటు సిపిఐ సహితం సిపిఎం ముసాయిదాను తప్పుపడుతున్నాయి.

 

          ఇతరులు ఛాందసం అనుకున్నాసరే భూస్వామ్య సమాజానికి తనకంటూ కొన్ని విలువలు వుంటాయి. పెట్టుబడీదారీ వ్యవస్థకు లాభాలే ముఖ్యం. అదే దాని సంస్కృతి; అదే దాని విలువ. లాభం వస్తుంది అనుకుంటే తమను ఉరివేసే తాళ్ళను సహితం పెట్టుబడీదారులు అమ్మకానికి పెట్టగలరు. నిరంతరం ఉత్పత్తి పెరుగుతుండాలి, పెరిగిన ఉత్పత్తిని అమ్మడానికి నిరంతరం మార్కెట్ విస్తరిస్తుండాలి. విస్తరించిన మార్కెట్ డిమాండును అందుకోవడానికి మళ్ళీ ఉత్పత్తిని పెంచుకుంటూ పోవాలి. ఇది ఒక విధంగా పులి మీద స్వారీ లాంటిది. ఎక్కడా ఆగడానికి వీల్లేదు. ఆగితే అక్కడే ఖేల్ ఖతం.

 

          గతంలో సెల్ ఫోన్ల మార్కెట్ ను ఏలిన నోకియా, బ్లాక్ బెర్రి, మోటరోలా బ్రాండ్లు ఇప్పుడు ఎక్కడా? పోంటియాక్ కార్లు ఎక్కడా? యాహూ సెర్చ్ ఇంజిన్ ఎక్కడా? కింగ్ ఫిషర్ ఏయిర్ లైన్స్, కొడాక్ కెమేరాలు, సోనీ వాక్ మెన్లు ఇప్పుడు వెతికినా కనిపించవు.  పరుగు ఆపేస్తే మహామహా బ్రాండ్లు కూడ అలా అంతమైపోతాయి.

 

తమ ప్రాచూర్యం, బ్రాండ్ ఇమేజ్ పెరిగి మార్కెట్ విస్తరిస్తుందనుకుంటే పెట్టుబడీదారులు ఏమైనా చేయగలరు. ఏ వేషం అయినా వేయగలరు.  ఒక దశలో అత్యంత ఆధునికులుగా, హేతువాదులుగా మతరహితులుగా దర్శనమిస్తారు. ఇంకో దశలో జనాన్ని పెద్ద సంఖ్యలో కదిలించడానికి మతం పనికివస్తుంది అనుకుంటే వాళ్ళే సమాజంలో ఛాందసాన్ని  మూఢనమ్మకాలను పెంచిపోషించడం మొదలెడతారు.

 

          ఈ మార్కెట్ లక్షణాలు తెలియని చాలా మంది భూస్వామ్యంకన్నా పెట్టుబడీదారులు మెరుగయినవారు అనుకుంటుంటారు. అది తప్పు అని తెలియడానికి కొంచెం సమయం పడుతుంది. ఇప్పుడు భారీ పెట్టుబడీదారులు (వీరినే మనం మెగాకార్పొరేట్లు అంటున్నాం) తమ లాభాల కోసం ప్రజల్లో మతతత్త్వాన్ని రెచ్చగొడుతున్నారు. వాళ్ళ ఓట్లను ఆకర్షించి తద్వార తమ అనుకూలుర్ని ఎన్నికల్లో గెలిపించుకుని  అధికార పీఠం మీద కూర్చొబెట్టి వారి ద్వార తమ ప్రయోజనాలను నెరవేర్చుకుంటున్నారు.

 

          ఇక్కడ మనకు కనిపించేది ఒకటి; జరిగేది మరొకటి. ఎన్నికల ద్వార పరిపాలనాధికారాన్ని చేపట్టినవాళ్ళు  కార్పొరేట్ల సంపదను పెంచుతున్నట్టు మనకు కనిపిస్తుంటుంది. నిజానికి తమ సంపదను పెంచుకోవడానికి కార్పొరేట్లే తమ అనుకూలుర్ని పరిపాలన పీఠం మీద కూర్చో బెట్టుకుంటారన్న సత్యం సులువుగా కనిపించదు. మన వర్తమాన వ్యవస్థను సాంకేతికంగా  కార్పొరేట్ మతతత్త్వ నియంతృత్వం (Corporate Communal Dictatorship - CCD) అనాలి. అప్పుడుగానీ తత్త్వం బోధపడదు.  

 

          కార్పొరేట్ మతతత్త్వ నియంతృత్వం అనే మాట నిస్సందేహంగా  క్లిష్టమైనది. తెలుగువాళ్లకెందుకో కొత్త పదాల మీద ఒకరకం అసమ్మతి  వుంటుంది. ఆక్స్ ఫర్డ్ తదితర ఇంగ్లీషు నిఘంటువుల్లో ఏడాదికి వెయ్యి నుండి రెండు వేల కొత్త పదాలను చేరుస్తుంటారు. మనకు ఆ సాంప్రదాయం లేదు. తమిళులకు అలాంటి సాంప్రదాయం వుంది. అలాంటి ఏర్పాటు మనకు ప్రభుత్వ పరంగానూలేదు; స్వఛ్ఛందంగానూ లేదు. పాత పదాలు కొత్త అర్ధాలను ఇవ్వవు. కొత్త పదాల్ని మనం ఒక పట్టాన అంగీకరించము. అంచేత మనకు కొత్త జ్ఞాన సూక్ష్మాలు  ఒక పట్టాన అబ్బవు.  

 

కథలు కవితల్లో అందరికీ తెలిసిన పదాల్నే వాడవచ్చు. సామాన్య ప్రజలతో వ్యవహారిక భాషలో మాట్లాడవచ్చు. కొత్త విషయాలు వివరించాల్సిన సిధ్ధాంత వ్యాసాల్లో, సెమినార్ ప్రసంగాల్లో అలా సాధ్యం కాదు.  కొవిడ్ మహమ్మారీ విజృంభించినపుడు కనీసం వంద కొత్త పదాలు  మన జీవితాల్లోనికి వచ్చేశాయి. తెలుసుకుని వాడక తప్పలేదుగా. సామాజిక విషయాల్లోనూ కొత్త పదాల వాడకం అలవర్చుకోక తప్పదు. లేకపోతే మన మాటల్లో రాతల్లో  తెలుగు పదాలు తగ్గిపోయి ఇంగ్లీషు పదాలు పెరిగిపోతాయి.  

 

          ఇప్పటి కేంద్ర ప్రభుత్వం, దాని పాలనా తీరుని మెచ్చుకునేవారు వున్నట్లే నచ్చని వారూ వుంటారు. నచ్చనివారు దీన్ని ఫాసిస్టు అంటున్నారు. ఆ మాటను కాంగ్రెస్సూ అంటున్నది; కమ్యూనిస్టులు అంటున్నారు.

 

ఫాసిజం ఇటాలియన్ పదం. అది ముస్సోలిని నియంతృత్వాన్ని  విమర్శించడానికి ఇటలీ కమ్యూనిస్టులు  పెట్టిన పేరు అని చాలామంది అనుకుంటారు. నిజం అదికాదు. ముస్సోలిని సగర్వంగా తనకుతానుగా పెట్టుకున్న పేరు అది. ‘ఫాసియో’ అంటే ఇటలీ భాషలో కట్టెల మోపు అని అర్ధం. ఆ తరువాత జర్మనీలో హిట్లర్ నియంతగా మారాడు. తన పాలనకు నాజీ అని పేరుపెట్టాడు. నాజీ అంటే జర్మనీ భాషలో ‘జాతీయ సోషలిజం’ అని అర్ధం. బిజెపి కూడ తొలి రోజుల్లో జాతిపిత గాంధేయ సోషలిజం అనేది.

 

ఫాసిజం, నాజిజం రెండూ నియతృత్వ పాలనలే. అయినప్పటికీ రెండింటి మధ్య చాలా తేడాలున్నాయి. ఆరెస్సెస్ వ్యవస్థాపకులైన కేబి హెడ్గేవార్ మీద ఫాసిస్టు ముస్సోలినీ ప్రభావం వుండింది. రెండవ సర్ సంగ్ ఛాలక్ అయిన ఎంఎస్ గోల్వార్కర్ నాజీ హిట్లర్ ను ఎక్కువగా అభిమానించేవారు. ‘ఆర్యజాతి ఔన్నత్యం’, ‘మతమైనారిటీ సమూహాల నరమేధం’  వగయిరాలు వారికి తెగనచ్చాయి. స్వఛ్ఛ జాతీయవాదాన్ని ప్రతిపాదిస్తూ 1939లో వారు రాసిన ‘We, or Our Nationhood Defined’ పుస్తకం 1935లో జర్మనీలో హిట్లర్ తెచ్చిన నూరెంబర్గ్ చట్టాల నుండి ప్రత్యక్షంగా ఉత్తేజాన్ని పొందినదే. ఇటలీ ఫాసిజంలో మైనారిటీ మత సమూహాలను అణిచివేయాలనే అంశం లేదు; కనీసం మొదట్లో లేదు.  జర్మనీ నాజిజంలో యూదు నరమేధం పెద్ద ఎత్తున వుంది. అది గురూజీకి నచ్చింది. హిట్లర్ కాన్సెంట్రేషన్ క్యాంపులు పెట్టాడు; మన దేశంలో డిటెన్షన్ సెంటర్స్ పెట్టారు. ఈ నేపథ్యంలో ఇప్పటి ఇండియా ప్రభుత్వ స్వభావానికి ఫాసిజంకన్నా నాజిజమే ఎక్కువగా సరిపోతుంది.

 

ఇటలీలో ముస్సోలిని ఫాసిజం అన్నట్టు, జర్మనీలో హిట్లర్ నాజిజం అన్నట్టు, మనదేశంలోనూ సంఘపరివారం ‘హిందూత్వ’ అనే పేరును ఇష్టంగా పెట్టుకుంది. చాలా మందికి మతానికీ, మతతత్త్వానికీ తేడా తెలియనట్లే హిందుకూ హిందూత్వకు తేడా తెలీదు. మతం అంటే దేవుని మీద విశ్వాసం. మతతత్త్వం అంటే ఇతర మతస్తుల మీద అసహనం. మతం వ్యక్తిగతం; మతతత్త్వం రాజకీయార్ధిక వ్య్వహారం. 

 

అతివాద హిందూ ప్రతినిధి అయిన దామోదర్ సావర్కర్ ఇటలీ ఫాసిజం నుండి ఉత్తేజాన్ని పొంది 1922లో  ఘనంగా  ‘హిందూత్వ’ అనే సిధ్ధాంతాన్ని ప్రతిపాదించారు. హిందూత్వ అన్నప్పుడు తమని నిందిస్తున్నారని  సాధారణ హిందువులు అపోహపడుతుంటారు. అది తమ  ఓటు బ్యాంకుకు లోటు తెస్తుందని రాజకీయ పార్టీలు జంకుతుంటాయి. మెజారిటీ మతతత్త్వ నియంతృత్వాన్ని సంభోదించడానికి కొందరు ‘బ్రాహ్మణీయ’ ‘కాషాయ’ అనే పదాలను వాడుతున్నారు. బ్రాహ్మణులు, కాషాయాంబరధారులు అందర్నీ నియంతల భక్తుల జాబితాలో   వేసేస్తే మేలుకన్నా కీడే ఎక్కువగా జరుగుతుంది.

 

ఇండియా కమ్యూనిస్టు పార్టీల్లో మొదటి నుండీ ఒక ఇబ్బంది వుంది. మత వ్యవస్థలోనూ పీడిత మతసమూహాలు పీడక మతసమూహాలు  వుంటాయని అవి గుర్తించలేదు. గుర్తిస్తే పీడితుల పక్షాన వుంటామని అవి ప్రకటించాల్సివుంటుంది. అలా ప్రకటిస్తే పీడక సమూహం తమను వదిలి వెళ్ళిపోతుందని వాళ్ళ భయం. మతవ్యవస్థలో పీడితులపక్షం వహించలేవు; పీడకులపక్షం వహిస్తామని చెప్పుకోలేవు. ఇలాంటి ఇరకాటం నుండి బయటపడడానికి మతంలో వర్గమే లేదని చాలాకాలం  బుకాయించాయి. మతం ఒక్కటే కాదు, కులం, తెగ, భాష, ప్రాంతం, వర్ణం, లింగం అన్నింటిలోనూ వర్గం వుంటుంది. వర్గం సర్వాంతర్యామి. ప్రతిదేశంలోనూ పాలకమతం వున్నట్టే పాలితమతం కూడ వుంటుంది.

 

నిజ జీవిత ఉత్పత్తి, పునరుత్పత్తులే చరిత్ర గమనాన్ని నిర్ణయించే అంశం  అనేది మార్క్సిస్టుల అవగాహన. దీనినే పునాది అంటారు. దీనితో పాటు ఉపరితలం కూడ వుంటుంది. రెండూ విడిగా వుండవు. పునాది ఉపరితలాల్లో ప్రధానమైది నిస్సందేహంగా పునాదే. దాని అర్ధం ఉపరితలానికి తావులేదని కాదు. రెండూ ఒక అన్యోన్య సంబంధంలో వుంటూ,  ఒకదాన్నిమరొకటి నిరంతరం ప్రభావితం చేస్తుంటాయి. సాంకేతిక భాషలో చెప్పాలంటే, పునాదీ ఉపరితలం నిరంతరం గతితార్కిక సంబంధంలో వుంటాయి.

 

గడిచిన ఏడేళ్ళలో కేంద్ర ప్రభుత్వం మీద సిపిఎం అంచనా మారుతూ వచ్చింది. 2018 ఏప్రిల్ 18-22 తేదీల్లో హైదరాబాద్ లో జరిగిన సిపిఐ-ఎం 22వ మహాసభల్లో "నిరంకుశ, హిందూత్వ సాగిస్తున్న మతతత్త్వ దాడులు ముందుకు తోసుకుని వస్తున్న ఫాసిస్టు ధోరణులను ప్రదర్శిస్తున్నాయి" అని తీర్మానించారు. 2022 ఏప్రిల్ 6-10 తేదీల్లో కన్నూర్ లో జరిగిన సిపిఐ-ఎం 23వ మహాసభల్లో " ఆర్ ఎస్ ఎస్ ఫాసిస్టిక్  ఎజెండాను మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్నది"అని పేర్కొన్నారు.

 

2025 ఏప్రిల్ 2-6 తేదీల్లో మధురైలో జరుగనున్న సిపిఐ-ఎం 24వ మహాసభల ముసాయిదా తీర్మానంలో కేంద్ర ప్రభుత్వం మీద విమర్శ తీవ్రతను పెంచారు. "మితవాద హిందూత్వ ఎజెండాను ముందుకు తీసుకుని పోవడానికీ, ప్రతిపక్షాలనూ, ప్రజాస్వామ్యాన్నీ అణగదొక్కడానికీ అనుసరిస్తున్న నియంతృత్వ పధ్ధతులు నయా- ఫాసిస్టు స్వభావాన్ని వ్యక్తం చేస్తున్నాయి" అని పేర్కొన్నారు. డొంక తిరుగుడు లేకుండా స్పష్టంగా ‘ఫాసిస్టు’ అనవచ్చుగా అని కాంగ్రెస్ సిపిఐ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి.

 

1970ల నాటి ఎమర్జెన్సీ కాలంలో  ఆనాటి ప్రతిపక్ష నాయకులందరూ అప్పటి ప్రధాని ఇందిరా గాంధీని ‘హిట్లర్’ అని నేరుగా  విమర్శించేవారు. జయప్రకాశ్ నారాయణ, అటల్ బిహారీ వాజ్ పాయి, జార్జ్ ఫెర్నాండెస్, మురార్జీ దేశాయి, ఎల్ కే అద్వానీ, నానీ ఫాల్కీవాల తదితరులు ఆమెను అలా విమర్శించినవారి జాబితాలో వున్నారు.  

 

ఇప్పటి కేంద్ర ప్రభుత్వం ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ నాటికన్నా మెరుగ్గా వుందా? ఘోరంగా వుందా? అనేది కీలక ప్రశ్న. ఇదే ఇప్పుడు చర్చనీయాంశం. రాబోయే మహాసభల్లో సిపిఐ-ఎం నాయకత్వం దానికి వివరంగా సమాధానం చెప్పవచ్చు.

 

09-మార్చ్ 2025

No comments:

Post a Comment