అన్యవర్గ భావజాలం
Author, Journalist, Documentary Filmmaker, Political Commentator, Literary Critic, Humourist, and Social Worker
Wednesday, 12 March 2025
అన్యవర్గ భావజాలం !!!
మనల్ని ప్రేమించేవారు, మనం ప్రేమించేవాళ్ళు కలిసి బతకడంకన్నా ఈ భూమ్మీద స్వర్గం అంటూ ఏమీ వుండదు. ఆ స్వర్గంలో నేను మూడేళ్ళు వున్నాను. అప్పట్లో విప్లవోద్యమం మీద చాలా నమ్మకం వుండేది. కామ్రేడ్ల మధ్య ఆత్మీయత చాలా గొప్ప స్థాయిలో వుండేది. ఎలాంటి రిస్కుకు అయినా సిధ్ధపడేవాడిని. అక్షరాల నుండి ఆయుధాల వరకు ఏ రంగంలో టాస్క్ ఇచ్చినా పూర్తి చేసేవాడిని. పెర్ఫెక్షనిస్టు అనే పేరుండేది.
నేను కృష్ణాజిల్లా రాడికల్ యూత్
లీగ్ కు అధ్యక్షుడిగా వుండేవాడిని. తరువాతి కాలం ఇండియన్ ఎక్స్ ప్రెస్ జర్నలిస్టు
అయిన చంద్రశేఖర్ ఉపాధ్యక్షుడు. పాల ఫ్యాక్టరి లింగం నాగేశ్వరరావు కార్యదర్శి. మా
మధ్య ఆత్మీయ సంబంధాలు చాలా బాగుండేవి. రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ కు మెంటార్ గా
వుండేవాడిని. ఆంధ్రప్రదేశ్ ష్ పౌర హక్కుల
సంఘానికి కూడ కృష్ణాజిల్లాలో తొలి కన్వీనర్ ని నేనే. విరసంలో చేరాక కృష్ణా
వుభయగోదావరి జిల్లాల కన్వీనర్ గా వున్నాను.
బయటికి చెప్పరు, చెప్పుకోలేరుగానీ
విప్లవోద్యమాల్లో కార్యకర్తలకు ఆలోచనాపరులకు మధ్య ఒక వైరుధ్యం వుంటుంది.
కార్యకర్తలుగా వున్నవారూ సర్వంతామే చేస్తున్నామనో, మోస్తున్నామనో భావంతో వుంటారు.
ఆలోచనాపరులు కేవలం ఉపన్యాసాలకు పరిమితం అవుతారని వాళ్ళకు కొంచెం చులకన భావం
వుంటుంది. నా కేసు అలాకాదు. నేను ముందు కార్యకర్తని. హోల్ టైమర్ గా వున్నాను.
కృష్ణా జిల్లా పార్టి బాధ్యతలు నిర్వర్తించాను. విరసంలోనూ చురుగ్గా వున్నాను.
విరసంలో చేరడంవల్ల రెండు
రంగాల్లో పనిచేస్తున్నందుకు నా విలువ రెట్టింపుకావాలి. కానీ అలా జరగలేదు; విలువ
తగ్గింది. పుస్తకాలు పాత సందేహాలకు
సమాధానం చెపుతాయి. కొత్త సందేహాలను రేకెత్తిస్తాయి. అదే వాటి పని. చదవడంవల్ల కొత్త
సందేహాలు వచ్చేవి. పార్టి రాష్ట్ర నాయకులు చాలా ఓపిగ్గా మా సందేహాలను తీర్చేవారు.
చాలా సంయమనం పాటించేవారు. అందరి మధ్య గొప్ప సమన్వయం కూడ వుండేది.
సివోసి నుండి పీపుల్స్ వార్
గా మారేక పార్టి బాగా విస్తరించింది. నక్సలైట్ పార్టీల్లో అన్నింటికన్నా పెద్దది చురుకైనది
అనిపించుకుంది. రైతాంగ పోరాటాలు మొదలు, కళాసాహిత్య రంగాలు, పౌరహక్కుల ఉద్యమం
అన్నింట్లోనూ దానిదే అగ్రస్థానం.
ఈ పెరుగుదల పార్టీ నాయకుల్లో
కొంచెం బ్యూరోక్రసిని పెంచింది. గతంలో రెండు నెలలకు ఒకసారి కలిసే అగ్రనాయకులు జిల్లా
పర్యటనలు మానుకున్నారు. రీజినల్ కమిటీ నాయకుల ప్రాధాన్యం పెరిగింది. రీజినల్ కమిటీ కార్యదర్శులు విధేయులకు ఎక్కువ
ప్రాధాన్యం ఇచ్చి మిగిలిన ఉద్యమ అభిమానుల్ని దూరంగా పెట్టడం మొదలుపెట్టారు. ఆలోచనాపరులు
వాళ్లకు ఎలాగూ ఒక ఇబ్బంది వుంటుంది. పార్టి ముఖ్యులు కనిపించినప్పుడెల్లా
ఆలోచనాపరులు “చైనాను ఇంకా విప్లవకేంద్రం ఎందుకు అంటున్నాము?” వంటి ఇబ్బందికర
ప్రశ్నలు వేస్తారు. దానికి వారు సంతృప్తికర సమాధానం చెప్పలేరు. “పార్టి లైన్”
అంటారు. ఆ మాట అంటే అందరూ నోరు మూసుకోవాల్సిందే. ఆలోచనాపరుల నుండి ఎదురయ్యే
ఇబ్బందులకు వాళ్ళొక పరిష్కారాన్ని కనుగొన్నారు. “అసలు ఆలోచనాపరులు
విప్లవకారులుకాదు; వాళ్లది పెట్టీ బూర్జువా మనస్తత్వం” అనే మాటను ప్రచారంలో
పెట్టారు. ఇది సమస్యను పరిష్కరించకపోగా కార్యకర్తలకూ ఆలోచనాపరులకు మధ్య ఒక వైరుధ్యాన్ని
పెంచింది.
1981లోనూ చైనాను విప్లవ
కేంద్రం అనడం నాకు మింగుడు పడలేదు. అలాగే సిటీ బస్సుల్ని జాతీయం చేయమని కోరడమూ
నాకు నచ్చలేదు. అప్పట్లో గుంటూరులో ప్రైటు సిటీ బస్సుల ప్రమాదాలు కొన్ని జరిగాయి.
దానికి వేరే పరిష్కారాలు ఆలోచించాలిగానీ, జాతియీకరణ పరిష్కారం కాదు అనేది నా భావన.
నాకున్న ఆలోచనలు వేరు. ప్రైవేటు బస్సుల వల్ల చిన్న వ్యాపారులు, వృత్తిపనివారలు, నైపుణ్యం
లేని పనివాళ్ళు బతుకుతుంటారు. అసంఘటిత కార్మికరంగం విస్తాపనకు గురవుతుంది. – అనేది
నా వాదన. సోషలిస్టు విప్లవాన్ని పూర్తి చేయకుండా కొన్ని రవాణా సంస్థను జాతీయం
చేస్తే అది కార్పొరేషన్ అయిపోతుందనేది నా వాదన. నా సందేహం తప్పుకావచ్చు. కానీ,
వాళ్ళు నన్ను అవిశ్వాసుల ఖాతాలో వేశారు.
మతానికి విప్లవోద్యమానికీ నమ్మకం
విషయంలో తేడాలేదు. విప్లవోద్యమంలోనూ ఒక దేవుడు వుంటాడు. అతన్ని మనం హేతువుతో,
తర్కంతో చూడకూడదు. అతనే సర్వస్వం అని నమ్మాలి. నమ్మకపోతే మతంలో అన్యులు అంటారు; విప్లవోద్యమంలో
అన్యవర్గ భావజాలం అంటారు. ఇది నన్ను అసంతృప్తికి
గురిచేసింది.
విప్లవోద్యమంలో మెజారిటీ మైనారిటీ
నిర్ణయాలను చాలా విచిత్రమైన పధ్ధతుల్లో అమలు
చేస్తుంటారు. నన్ను విరసం సభ్యుడు అనుకుంటే, నా మీద ఏవైనా విమర్శలుంటే విరంసం
జిల్లా యూనిట్ లోనో సర్వసభ్య సమావేశంలోనూ చర్చించి నిర్ణయం తీసుకోవాలి. అలా జరగదు.
నన్ను రాడికల్ యూత్ లీగ్ జిల్లా అధ్యక్షుడు అనుకుంటే జిల్లా సమావేశంలో చర్చించి నిర్ణయం
తీసుకోవాలి. అలానూ జరగదు.
1980 మే 1న వరంగల్లులో రాడికల్
యూత్ లీగ్ మహాసభలు జరిగాయి. క్లృష్ణాజిల్లా నుండి 20 మంది ప్రతినిధులు
అనుకుంటున్నారు. అందులో నాపేరు లేదని నాకెవరో చెప్పారు. “ఎందుకనీ?” అని అడిగాను. “మీరు
పార్టి లైన్ కు భిన్నంగా మాట్లాడుతున్నారట” అన్నాడు ఆ చెప్పిన వాడు. “ఆ విషయాన్ని
నాతో చర్చించాలిగా” అన్నాను. నేను, వాళ్లు
అనే చీలిక వచ్చేసింది. వాళ్లు కూడా ప్రజాస్వామ్యాన్ని పాటించారు. పార్టి అభిమాని
విరసం సభ్యుడు అయిన ఒక కామ్రేడ్ ఇంట్లో సమావేశానికి రమ్మన్నారు.
ఏప్రిల్ 29 బుధవారం ఉదయం అనుకున్న
ఇంటికి అనుకున్న సమయానికి ముగ్గురు వచ్చారు. అప్పటికి అక్కడ ఆ ఇంటి యజమాని, నేనూ
వున్నాము. మొత్తం అయిదుగురం. సమావేశం మొదలు పెట్టారు. అదేమి సమావేశమో నాకు అర్ధం
కాలేదు. వరంగల్లు వెళ్ళాలని నాకు చాలా బలంగా వుంది. అంచేత ఆ సమావేశం ప్రమాణాలకు
అనుకూలంగా లేదని నేను పేచీ పెట్టుకోలేదు. ఒక గంట నామీద విమర్శలు నా వివరణలతో
గడిచింది. నేను ఒకటి కాదు పది మెట్లు దిగి మాట్లాడాను. వచ్చిన వారెవ్వరూ నా సమాధానాలతో
సంతృప్తి చెందలేదు. “మనాసా వాచా కర్మణ” గా లేదన్నారు. నన్ను వరంగల్లుకు ఎంపిక
చేయాలా? అక్కర లేదా? అనే అంశం మీద ‘ప్రజాస్వామికంగా’ ఓటింగుకు పోదాము అన్నారు. వచ్చిన
ముగ్గురు నన్ను నిరాకరించారు. ఆ యింటి యజమాని నన్ను సమర్ధించాడు. 2:3 ఓట్లతో
వాళ్లకు మెజారిటీ వచ్చింది.
ఆ ముగ్గురూ అంతకు ముందురోజు వరకు
నాకు ఆత్మీయులే. ఒక్కసారిగా నేను పరాయివాడినయిపోయాను. పూర్తిగా ఒంటరి వాడినయిపోయాను.
ఏం తోచక విజయవాడ వీధుల్లో ఓ రెండు గంటలు తిరిగాను. సాయంత్రానికి చుట్టుగుంట
సెంటరులో కాగితాల రాజేశ్వరవు ప్రింటింగ్ ప్రెస్సు దగ్గరికి చేరాను. నా జూలియస్ ఫ్యూజిక్
పుస్తకం కవర్ పేజీతోసహా బైండింగ్ వర్కు పూర్తయింది. అక్కడ నా పుస్తకం పబ్లిషర్ ‘శ్రీశ్రీ’ విశ్వేశ్వరరావు వున్నాడు. మే 1న
వరంగల్లు ఎలాగూ వెళ్లడం లేదు. ఆరోజు ఏదో ఒకటి విజయవాడలో చేయాలనిపించింది. రెండు
రోజులే సమయమున్నాసరే మే 1న ఆవిషరణ సభ పెట్టేద్దాము అన్నాను. విశ్వేశ్వరవుకూ బోలెడు
మేడే సెంటిమెంట్ వుంది. తనూ సరే అన్నాడు.
జీవితంలో బోలెడు నాటకీయత వుంటుంది.
ఏప్రిల్ 30 గురువారం ఉదయం నా ‘పాత కామ్రేడ్స్’ వరంగల్లు వెళ్ళిపోయారు. నేను గతంలో
పని చేసిన ఆర్ ఆర్ ఇండస్ట్రీస్ ట్రక్కుల బాడీబిల్డింగ్ కార్ఖానాకు వెళ్ళాను. పాత
ఓనరు సాంబశివరావుగారితో కాస్సేపు మాట్లాడి బయటికి వచ్చి బెంజ్ సర్కిల్ బస్
స్టాపులో నిలబడ్డాను. అటుగా స్కూటర్ మీద వెళుతున్న మైత్రేయగారు నన్ను
చూసి ఆగారు. ఆయన పెట్రోలు టాంకరు ఓనరు. ఆర్ ఆర్ ఇండస్ట్రీకి రెగ్యులర్ కష్టమర్.
అస్సాంలో అల్లర్ల మూలంగా పెట్రోలు డీజిల్ సరఫరా ఆగిపోయింది. ఆయన రవాణా వ్యాపారం ఢీలా
పడింది. నా ఉద్యోగం కూడ అలానే పోయింది.
మైత్రేయగారు బ్రాహ్మలు. నాతో చాలా
చనువుగా వుండేవారు. “ఏం చేస్తున్నావూ?’ అని అడిగారు. ”ఏమీలేదు. ఖాళీ సార్!” అన్నాను.
“నా ఫ్రెండుకు ఫైనాన్స్ కంపెనీ వుంది. అక్కడ పనిచేస్తావా?” అని అడిగాడు. ఎక్కడయినా
ఒకే అన్నాను. ఆటోనగర్ సెకండ్ క్రాస్ లో ఓ అడ్రస్సు చెప్పారు. “నా పేరు చెప్పు.
ఇప్పుడు వెళ్ళినా ఉద్యోగం ఇస్తారు.” అన్నారు. అక్కడికి వెళ్ళాను. ఆ కంపెనీ గారపాటి
పాండుగారిది. ఇంకో విషయం ఏమంటే ఆ కంపెనీలో మైత్రేయగారు పార్ట్ నర్. తన దగ్గర పనిచేయమని
అడగలేక తన ఫ్రెండ్ పేరు చెప్పారాయన.
పాండుగారికి నేను
నచ్చాను. అయితే అక్కడ గుమాస్తా పని నాకు
సూట్ కాదని అనుకున్నారాయన. “నువ్వు చదువుకున్నోడివి. చూడ్డానికి డైనమిక్ గా
వున్నావు. మానాన్నకు నీ లాంటి మెరికల్లాంటి వాళ్ళు కావాలి. అక్కడికి వెళ్ళు”
అన్నారాయన.
పాండుగారే వాళ్ల నాన్న
గారపాటి వెంకయ్య గారికి ఫోన్ చేసి చెప్పారు. నన్ను అక్కడికి పంపారు. గారపాటి
వెంకయ్య గారికి ఆటోమోబైల్స్ లో అరడజనుకు పైగా షాపులు, ఏజెన్సీలు వున్నాయి. కాటన్,
టొబాకో కంపెనీలూ వున్నాయి. వారు 1950లలో ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో పనిచేశారు.
వారికి నేను నచ్చాను. వారి కంపెనీల్లో ఉమా ఆటో ఏజెన్సీ ఒకటి నన్ను అక్కడికి
పంపించారు.
అదేరోజు నేను గవర్నర్
పేట ప్రకాశం రోడ్డులోని ఉమా ఆటో ఏజెన్సీస్ కి వెళ్ళాను. అక్కడ ప్రసాద్, సుధాకర్,
కాంతారావు గార్లు పార్ట్నర్లు. ఉమా ఆటో ఏజెన్సీస్ ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాలకు
స్టీల్ బర్డ్ /ఇండస్ట్రీస్/ ఇంటర్నేషల్ కు డిస్ట్రిబ్యూటర్లు. రాయలసీమ, దక్షణ
కోస్తా, తెలంగాణ ప్రాంతానికి వాళ్లకు సేల్స రిప్రజెంటేటివ్ కావాలి. కాంతారావుగారు
నాకు ఒక రాత పరీక్ష నిర్వహించారు. పాసయ్యాను. చిన్న ఇంటర్వ్యూ జరిపారు. స్టీల్ బర్డ్ డీజిల్,
ఆయిల్ ఫిల్టర్లు, హెల్మెట్లు తయారు చేస్తుంది. వాటి గురించి తెలీదుగానీ మేనేజ్
చేసేయగలను అన్నాను. శిక్షలేకుండానే లైన్ మీదికి పోవాలన్నారు. నేను రెడీ అన్నాను.
మే 4 సోమవారం నుండి పనిలో చేరమన్నారు.
మేదే రోజు జూలియస్ ఫ్యూజిక్
పుస్తకావిష్కరణ బందరు రోడ్డు రాఘవయ్య పార్కు సమీపంలోని ఠాగూర్ లైబ్రరీలో జరిగింది.
పి. రామకృష్ణారెడ్డి ఆవిష్కరించి ప్రసంగించారు.
మే మూడున వరంగల్ నుండి
మిత్రులు తిరిగివచ్చారు. ఆరోజు నాకు వ్యతిరేకంగా ఓటు వేసిన వాళ్లలో ఒకరు నా చేతులు పట్టుకుని తనవల్ల
తప్పు అయిపోయిందని బాధపడ్డాడు. అప్పటికే సమయం మించిపోయిందన్నాను.
ఆరెస్సు నాయకుడు
విజయకుమార్ వరంగల్లు నుండి జాండీస్ తో తిరిగొచ్చాడు. తనను నక్కలరోడ్డులో
ఆసుపత్రిలో చూపించి, నేను మే 4న కొత్త ఉద్యోగంలో చేరాను.
12 మార్చి 2025
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment