చాలా వాటికి క్షమించాలి డానీని!!
Author, Journalist, Documentary Filmmaker, Political Commentator, Literary Critic, Humourist, and Social Worker
Sunday, 30 March 2025
You have to excuse Danny for Many things - చాలా వాటికి క్షమించాలి డానీని!!
ఏదైనా
చదువుతున్నప్పుడు, స్టడీ చేస్తున్నపుడు,
రాస్తున్నపుడు నేను ఈ లోకంలో వుండను. శరీరం మాత్రమే ఇక్కడ కనిపిస్తుంటుంది.
మెదడు ఇంకెక్కడో వుంటుంది. ‘బాడి ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్’ అంటారే ఇది అంతకు మించింది. ఆ సమయంలో నాకు ఏదీ
కనిపించదు; ఏదీ వినిపించదు. చివరికి సెల్ ఫోన్ రింగ్ టోన్ కూడ వినిపించదు. ఒక వేళ
వినిపించినా ఎత్తను. వేరే లోకం నుండి హఠాత్తుగా తిరిగి రావడం కుదరదు. పాస్ పోర్టు,
వీసా సమస్యలు వుంటాయి.
“స్టౌవ్
మీద కూర మాడుతోంది గ్యాస్ ఆపెయ్యి” అని మా ఆవిడ అరిచి గీపెట్టినా నాకు వినిపించదుగాక
వినిపించదు. ఆ తరువాత “నీకు చెవుడా?” అంటుంది.
అదీ వినిపించదు. ఒకవేళ అప్పటికి ఈలోకం లోనికి తిరిగి వచ్చేసివుంటే మాత్రం
వినిపిస్తుంది. అప్పుడు మౌనంగా వుండిపోతాను. కమ్యూనిస్టు పార్టిల్లోనేకాదు; కాపురాల్లోనూ
వ్యూహాలు ఎత్తుగడలు వుంటాయి. ఇంట్లో మౌనంగా వుండడం తెలిసినవాడే ఈరోజుల్లో కాపురం
చేయగలడు అని ఎవరు చెప్పారో గుర్తులేదుగానీ దాన్ని నెమ్మదిగా ప్రాక్టీస్
చేస్తున్నాను.
నేను
చాలా సెలెక్టివ్ గా మాత్రమే పుస్తకాలు చదువుతాను. కనిపించిన పుస్తకాలన్నింటినీ తిరగేసేంతటి
చదువరినికాను. అప్పటికి నాకు అవసరమైనవి అనుకున్నవి మాత్రమే చదువుతుంటాను. నా
షెడ్యూల్ లో లేనివి చదవడం చాలా కష్టం. పుస్తకాలు బాగోలేవని కానేకాదు; అప్పటికి
చదవాల్సినవి క్యూలో చాలా వుంటాయి.
మరీ
ఆబ్లిగేషన్ అయితే తప్ప పుస్తకావిష్కరణ సభల్లో వక్తగా వుండడం నాకు ఇష్టం వుండదు. ముందుమాటలు
రాయడమూ చాలా కష్టం. ఆ పుస్తకాన్ని నిర్ణిత సమయంలోగా చదవాల్సి వస్తుంది. దాని కోసం
అనేక పనుల్ని పక్కన పెట్టాల్సి వస్తుంది. అదీగాక అందులో ఏదైనా లోటు వుందని
చెప్పినా, అతిశయోక్తులతో పొగడకపోయినా రచయితలు అలుగుతారు. ఇదో కొత్త సమస్య.
నా
ఆర్టికల్స్ అచ్చయిన రోజున చాలా కాల్స్ వస్తుంటాయి. కొందరు మెసేజులు పెడుతుంటారు. కొందరు
విమర్శిస్తారు. కొందరు మెచ్చుకుంటారు. మెచ్చుకోళ్ళు, విమర్శలు రెండూ నాకు చాలా
ఇష్టం. ఆ తరువాత ఏం రాయాలో నాకు అర్ధం అవుతుంటుంది.
ఇంకొందరు
నేనేదో గొప్పవాడిని అనుకుని తమ వ్యక్తిగత సమస్యలు కూడ చెపుతుంటారు. కష్టాల్లోవున్న
సమూహాలకు సంఘీభావం తెలపడం నా బాధ్యత అనుకుంటాను. వాళ్ళను ఆ కష్టాలనుండి తప్పించే
స్తోమత నాకులేదు.
ఈమధ్య
చాలా మంది వాట్సప్ లో ఫోన్లు చేస్తున్నారు. రకరకాల గ్రూపుల్లో రోజుకు వందకు పైగా
మెసేజులు వస్తుంటాయి. వాటిల్లో ఆ మిస్సిడ్ కాల్స్ ను, జూమ్ మీటింగ్ సమాచారాలను
చూడడం చాలాసార్లు కుదరదు. అందుకు అందరూ నన్ను క్షమించాలి.
మీటింగులకు
వక్తలుగా వెళ్ళడం కూడ ఒక సమస్యే. నేను వస్తే బాగుంటుందని నిర్వాహకులు భావిస్తారు.
ముందు డేట్ల సమస్య వుంటుంది. వాళ్లు అనుకున్న రోజు మనకు ఖాళీ వుండాలి. ఈనెల 23
ఆదివారం ఉదయం విజయవాడలో మార్క్సిస్టుల కేవి రమణారెడ్డి మీటింగు వుండింది. దానికి
నేను తప్పక వెళ్ళాలి. సాయంత్రం గుంటూరులో ఓ కొత్త అంబేడ్కరిస్టు సంఘం ఆరంభం.
అక్కడికీ పిలిచారు. ఆరోజు మధ్యాహ్నం
మామూలు ఎండగాలేదు. లైవ్ లో మెసేజ్ ఇస్తానని గుంటూరు వారిని కోరాను. వాళ్ళు
ఒప్పుకున్నారు. అలా గత ఆదివారం గడిచిపోయింది.
సభల్లో టాపిక్కు అనేది చాలా కీలకమైన అంశం. కొందరు
వక్తగా పిలుస్తారుగానీ టాపిక్ స్పెసిఫిక్ గా చెప్పరు. మనం వేదిక ఎక్కాక మైకు
ముందుకు వెళ్ళేటప్పుడు టాపిక్ అనుకోవాలి. కొందరు వాళ్ళేదో కొత్త టాపిక్ చెప్పి
“అది మీకు కొట్టిన పిండేనండి” అంటారు. ఒకే టాపిక్కును మళ్ళీమళ్ళీ మాట్లాడడం అంత
బావుండదు. కొత్త అంశాలు కొన్నయినా జోడించాలి. దానికి తప్పక కొత్త అధ్యయనం కావాలి.
నాతోపాటు
వేదికను ఎవరు పంచుకుంటున్నారు అనే విషయం మీద
నాకు ఎప్పుడూ ఎలాంటి పట్టింపులూ లేవు. కొందరికి ఈ విషయంలో చాలా పట్టింపులు
వుంటాయి. నాకు బాగా సీనియర్ అయినా ఓకే; బాగా జూనియర్ అయినా ఓకే. కెప్టెన్ ఏ ఆర్డర్ లో పంపినా మన బ్యాటింగ్ మనం కఛ్ఛితంగా
చేయాలి. అదొక్కటే రూలు.
ఎంత
సమయం మాట్లాడాలి? ఏఏ అంశాల మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి? వినేవారు ఎవరూ? వంటి
అంశాలను మాత్రం నేను ముందుగా తెలుసుకుంటాను. వినేవాళ్ళు విద్యాధికులయితే కొంచెం
ఇంటెలెక్యూవల్ స్టఫ్ జోడిస్తాము. వినేవాళ్ళు సామాన్య కర్షక-శ్రామికులు అయితే కొంచెం
భావోద్వేగ అంశాలను జోడిస్తాము. ఒకే
సమావేశంలో ఈ రెండు సమూహాలు వుంటే మాత్రం
నాకు చాలా పెద్ద పరీక్ష పెట్టినట్టే.
ప్రసంగానికి
ప్రయాణ ఖర్చులు కూడ ఇటీవల చాలా ముఖ్యమైన కాంపోనెంట్ గా మారింది. కొందరు ప్రయాణ
ఖర్చులు ఇస్తున్నారు. కొందరు ఇవ్వడంలేదు. 1970లలో రైళ్ళల్లో టికెట్టు
లేకుండానే ప్రయాణం చేసేవాళ్లం. అరుగుల
మీదో, రోడ్ల పక్కన చెట్లకిందో, గొడ్ల సావిట్లోనో పడుకునేవాళ్ళం. ఆరుబయట ఇసుకలోనో,
ఒక్కోసారి కోళ్ళ ఫారంలోనో పడుకున్న సందర్భాలున్నాయి. నాకు ఉబ్బసం వుంది. తరువాత అది ఎంత బాధపెట్టేదో
చెప్పలేను.
ఇప్పుడు
కాలం మారిపోయింది. మరోవైపు, ఆరోగ్య నిబంధనలు వచ్చాయి. వాటిని కఛ్ఛితంగా పాటించాల్సి
వస్తున్నది.
విజయవాడ
నుండి ఉత్తరం, దక్షణం, పడమర ఏ దిక్కున
పోవాలన్నా వోల్వో ఏసి బస్సు చార్జీలు వెయ్యి నుండి 12 వందల రూపాయలు వరకు వున్నాయి.
రానూ పోనూ 2500. క్యాబ్ తదితర ప్రయాణ ఖర్చులు ఇంకో 500 రూపాయలు. ఇదిగాక హొటల్
వసతి, భోజన ఖర్చుల కోసం నిర్వాహకులకు సులువుగా 1500 - 2000 రూపాయలు అవుతాయి.
నాలుగున్నర వేల రూపాయల నుండి 5 వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఎవరికైనాసరే అది
కఛ్ఛితంగా పెద్ద భారమే.
అలాగే
వక్త కూడ కొన్ని భారాలుంటాయి. ఒక
ప్రసంగానికి ప్రయాణ సమయం రానూపోనూ రెండు రోజులు. అధ్యయనం కోసం కనీసం ఓ మూడు రోజులు
కేటాయించాలి. వెరసి ఐదు రోజుల వ్యవహారం.
ఇంత
ఖర్చు, ఇంత సమయం వున్నాయి కనుక ప్రసంగాలను నేను కొంచెం సీరియస్ వ్యవహారంగా భావిస్తాను.
ప్రసంగానికి సిధ్ధంకావడానికి కనీసం 15 రోజుల వ్యవధి వుండాలంటాను. ముందు ప్రసంగం రాసుకుని సమయాన్ని సరిచేస్తాను.
ప్రసంగ పాఠాన్ని నిర్వాహకులకు రెండు మూడు రోజుల ముందే పంపిస్తాను. తప్పులు, తొలగింపులు,
తగిలింపులు వాళ్ళు సూచిస్తారు. ఆ తరువాత ఫైనల్ కాపీ తయారవుతుంది. ప్రసంగించడానికి ఒక
అరగంట ముందు దాన్ని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తాను.
చేతికి
మైకు ఇచ్చారు గనుక నోటికి వచ్చింది మాట్లాడేయడం అనేది నాకు నచ్చదు. ఇంత వ్యవహారం
కుదరదు అనుకున్నప్పుడు డేట్లు కుదరవు అని ఒక అబధ్ధం చెప్పి తప్పించుకోక తప్పదు.
అంచేత చాలా వాటికి క్షమించాలి డానీని.
నన్ను
పిలిచినప్పుడు నా ప్రసంగానికి ఇంత సమయం ఇవ్వాలని ఎవర్నీ ఇప్పటి వరకు అడగలేదు. గంట
క్లాస్ చెప్పాలన్నాఓకే. కేవలం రెండు నిముషాల సందేశం ఇవ్వాలన్నా ఓకే.
సాహిత్య
సభలు హైదరాబాద్ లో అరగంట ఆలస్యంగా మొదలవుతాయి. విజయవాడ, విశాఖపట్నంలో గంట ఆలస్యంగా
మొదలవుతాయి. గుంటూరులో గంటన్నర ఆలస్యంగా మొదలవుతాయి. ఫలితంగా అధ్యక్షులవారికి కార్యక్రమాన్ని కుదించక తపదు. కానీ, 30 నిముషాల
ప్రసంగానికి సిధ్ధమయి వెళ్ళీన వక్త దాన్ని హఠాత్తుగా 10 నిముషాలకు కుదించుకోవడం
అంత సులువైన వ్యవహారంకాదు. సినిమాలకు స్క్రీన్
ప్లే వున్నట్టు ఉపన్యాసానికి కూడ ఒక ఆర్డర్ వుంటుంది. అది పాడైపోతే ఉపన్యాసం రక్తికట్టదు.
ఎంతైనా ఉపన్యాసం కూడ ఒక కళేకదా!
నేను
వక్తను కాకపోయినా నాకు నచ్చినవారు ప్రసంగించే మీటింగులకు వెళుతుంటాను. ఇటీవల అక్కడా
కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. సభికుల్లో నన్ను చూసి సభాధ్యక్షులు వేదిక మీదికి
పిలుస్తున్నారు. హఠాత్తుగా ప్రసంగించేయగల సమర్ధుడ్నికాను నేను. పైగా షెడ్యూలులో
లేకుండా వేదికనెక్కి ప్రసంగిస్తే, నేను తీసుకున్న సమయం ఇంకో వక్త ఎవరికో కోత
పడుతుంది. అది చాలా బాధ.
కొన్ని
ఎమర్జెన్సీ వ్యవహారాలుంటాయి. శ్రీశ్రీ విశ్వేశ్వర రావు, సామాజిక పరివర్తనా కేంద్రం
దుర్గం సుబ్బారావు నా పబ్లిషర్లు. వాళ్ళు ఎప్పుడు పిలిచినా నిబంధనల్ని సడలించి
వెళ్ళక తప్పదు. ఇందులో విశ్వేశ్వర రావు మార్క్సిస్టు, దుర్గం సుబ్బారావు ఫూలే- అంబేడ్కరిస్టు. ఈ రెండు
శిబిరాల్లోనూ నేను ఒకేలా వుండగలను.
ఇది
1982 నాటి ఫొటో. విజయవాడ ప్రెస్ క్లబ్ లో చలసాని ప్రసాద్ తో నేను. ఆ రోజుల్లో మీటింగుల్ని
మేము 30-40 రూపాయల్లో జరిపేసేవాళ్ళం.
ఫొటో
కర్టెసీ – vmrg Suresh
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment