Sunday, 9 March 2025

నన్ను నేను సరిదిద్దుకునే ప్రయత్నం ఇది.

 నన్ను నేను సరిదిద్దుకునే ప్రయత్నం ఇది.




 

ఫాసిజం, నయా-ఫాసిజం మీద నేను ఓ వారం  రోజులుగా పెడుతున్న పోస్టుల మీద ఆశించిన చర్చ జరగలేదు. ఎక్కువమంది నన్ను అపార్ధం చేసుకున్నారు. ఇది నిజానికి  నన్ను నేను సరిదిద్దుకునేందుకు మొదలెట్టిన చర్చ. 

 

          పెట్టుబడీదారీ వ్యవస్థకు లాభాలే ముఖ్యం; లాభమే దాని లక్ష్యం; అదే దాని సంస్కృతి. మిగిలినవన్నీ అనవసరం. లాభం వస్తుంది అనుకుంటే వాళ్ళను ఉరివేసే తాళ్ళను సహితం పెట్టుబడీదారులు అమ్మకానికి పెట్టగలరు. తమ గౌరవ ప్రతిష్టలు, సామాజిక పెట్టుబడి పెరుగుతుందనుకుంటే పెట్టుబడీదారులు అత్యంత ఆధునికులుగా, హేతువాదులుగా దర్శనమిస్తారు. జనాన్ని పెద్ద సంఖ్యలో కదిలించడానికి మతం పనికి వస్తుంది అనుకుంటే సమాజంలో ఛాందసాన్ని  పెంచిపోషిస్తారు.

 

          మనం తెలియక తరచూ భూస్వామ్యంకన్నా పెట్టుబడీదారులు ఆధునికులు మెరుగయినవారు అనుకుంటుంటాం. అది తప్పు అని తెలియడానికి కొంచెం సమయం పడుతుంది. ఇప్పుడు భారీ పెట్టుబడీదారులు (వీరినే మనం కార్పొరేట్లు అంటున్నాం) తమ లాభాల కోసం ప్రజల్లో మతతత్త్వాన్ని రెచ్చగొడుతునారు. దాని ద్వార తమ అనుకూలుర్ని ఎన్నికల్లొ గెలిపించుకుని  అధికార పీఠం మీద కూర్చొబెట్టి వారి ద్వార తమ ప్రయోజనాలను నెరవేర్చుకుంటున్నారు.

 

          ఇక్కడా ఒక కనికట్టు జరుగుతుంటుంది. పరిపాలనాధికారాన్ని చేపట్టినవాళ్ళు  కార్పొరేట్ల సంపదను పెంచుతున్నట్టు మనకు కనిపిస్తుంటుంది. నిజానికి తమ సంపదను పెంచుకోవడానికే కార్పొరేట్లు తమ అనుకూలుర్ని పరిపాలన పీఠం మీద కూర్చోబెట్టుకుంటారన్న సత్యాన్ని అంత తేలిగ్గా అర్ధంకాదు.  సారాంశంలో మన వర్తమాన వ్యవస్థను సాంకేతికంగా  కార్పొరేట్ మతతత్త్వ నియంతృత్వం (Corporate Communal Dictatorship - CCD) అనాలి.

 

          కార్పొరేట్ మతతత్త్వ నియంతృత్వం అనే మాట నిస్సందేహంగా  క్లిష్టమైనది. తెలుగువాళ్ల కేందుకో అర్ధవంతమైన పదాల మీద ఒకరకం నిరసన వుంటోంది. Oxford English Dictionary (OED), Merriam-Websterలో, ఏడాదికి వెయ్యి నుండి రెండు వేల కొత్త పదాలను ఇంగ్లీషులో చేడుస్తుంటారు. మనకు ఆ సాంప్రదాయం లేదు. తమిళులకు అలాంటి సాంప్రదాయం వుందని ఇటీవల తెలిసింది. పాత పదం కొత్త అర్ధాన్ని ఇవ్వదు; కొత్త పదాన్ని అంగీకరించము. ఇదేలా కుదురుతుందీ? కథలు కవితల్లో తెలిసిన పదాలే వాడవచ్చు. సిధ్ధాంత వ్యాసాల్లో అదెలా సాధ్యం.

 

          1980లలో కోస్తాజిలాల్లో పీపుల్స్ వార్ ప్రాబల్యంలో సాగుతున్న ఉద్యమాల్లో పాల్గొంటున్నవారికి తత్త్వశాస్త్రంలో ప్రాధమిక పాఠాలు చెప్పాల్సిన అవసరం వచ్చింది. అప్పట్లోనేను కాలేజీలు, యూనివర్శిటీల్లో ఉపసాలిస్తున్నాను. ఇంగ్లీషు, హిందీ, ఉర్దూలతో బండిలాగించేస్తున్నాను. నన్ను ఒక్కసారిగా ఆ ఏజెన్సీ ప్రాంతానికి పంపించారు. పరిమాణాత్మక మార్పు, గుణాత్మక మార్పు గురించి వాళ్ళకెలా  వివరించేది? చాలా పెద్ద సవాలు.  కొండపల్లి సీతారామయ్య నిరక్షరాశ్యులతో సహితం ఉత్తేజాన్ని ఇచ్చేలా మాట్లాడేవారు. కొంచెం ఆయన్ని అనుసరించి, కొంచెం అక్కడి జనం నుండి కొత్తగా నేర్చుకుని ఆ ఏజెన్సీలో ఫిలాసఫి పాఠాలు చెప్పడం అలవాటు చేసుకున్నాను. నా పాఠాల క్యాసెట్లు విని కొండపల్లి సహితం మెచ్చుకున్నారు. అది అప్పటి సందర్భం.

 

          కొంత కాలం నెల్లూరుజిల్లా యానాదుల సంఘాల్లో పనిచేశాను. అప్పుడూ భాష మార్చుకున్నాను. ఇప్పుడు రాస్తున్న వ్యాసాలు, చేస్తున్న ఉపన్యాసాలు ఏజెన్సీ ఏరియా వారి కోసం కాదు. ఏజెన్సీలో ఎంప్రికల్ స్థాయిలో మాట్లాడుతాము. వ్యాసాల్లో, సెమినార్లలో ఆబ్ స్ట్రాక్ట్ స్థాయిలో ప్రసంగిస్తాము. కాన్సెప్చ్యూవల్ పదాలు వాడుతాము.

 

          కొత్త పదాన్ని వాడగానే ఎందుకో కమ్యూనిస్టుల నుండే ముందు నిరసన వస్తోంది. వాళ్ళు కొత్తపదాల్ని వాడదలచడంలేదా?  లేక వాళ్ళకు నిజంగానే అర్ధం కావడంలేదా? ఎదో ఒక విధంగా కించపరచాలనుకుంటున్నారా? సామాన్య ప్రజలతో మాట్లాడే సమయంలో ఏలాగూ భాషను సరళీకృతం చేస్తాము. నా గోదావరి తెలుగు యాస వేగం చూడాలంటే నా కథలు చదవవచ్చు. మేధోచర్చలో వాడుక భాష యాస దేనికీ?

 

          ఇప్పుడు చర్చనీయాంశానికి వస్తాను. ఇప్పటి కేంద్ర ప్రభుత్వాన్ని దాని పాలనా తీరునీ ఏ పేరుతో పిలవాలీ? అనేది ఒక చర్చ. సాధారణంగా దీన్ని ఫాసిస్టు అంటున్నారు. ఆ మాట కాంగ్రెస్సూ అంటున్నది కమ్యూనిస్టులు అంటున్నారు. గతంలో నేనూ అన్నాను. 2019లో ప్రచురించిన పుస్తకానికీ నేను ‘ నయా ఫాసిజం – నయా మనుస్మృతి’ అనే శీర్షిక పెట్టాను.  కానీ, ఇప్పుడు నా అభిప్రాయం మారింది.

 

ఫాసిజం ఇటాలియన్ పదం. అది ఇటలీ కమ్యూనిస్టులు ముస్సోలినిని విమర్శించడానికి  నెగటివ్ అర్ధంలో పెట్టిన పదం కాదు. ముస్సోలిని సగర్వంగా తనకుతాను పెట్టుకున్న పదం. ఆ తరువాత జర్మనీలో హిట్లర్ నియంతగా మారాడు. తన పాలనకు నాజీ అని పెరుపెట్టాడు. నాజీ అంటే జర్మనీ భాషలో ‘జాతీయ సోషలిజం’ అని అర్ధం. ఇద్దరూ నియంతలే. అయినప్పటికీ ఇదరి మధ్య తేడాలున్నాయి.

 

ఆరెస్సెస్ మొదటి నుండీ ముస్సోలిని ఫాసిజంకన్నా కన్నా హిట్లర్ నాజిజంను ఎక్కువగా అనుసరించింది. ఆర్యజాతి ఔన్నత్యం, యూదుల్ని అణిచివేయడం వగయిరాలన్నీ హిట్లర్ నుండి దిగుమతి చేసుకున్నవే. స్వఛ్ఛ జాతీయవాదాన్ని ప్రతిపాదిస్తూ 1939లో ఆరెస్సెస్ సర్సంఘ్ ఛాలక్ ఏంఎస్ గోల్వార్కర్ రాసిన ‘We, or Our Nationhood Defined’ పుస్తకం 1935లో జర్మనీలో హిట్ల ర్ తెచ్చిన నూరెంబర్గ్ చట్టాల నుండి ప్రత్యక్షంగా ఉత్తేజాన్ని పొందినదే. ఫాసిజంలో మైనారిటీ మతాన్ని అణిచివేయాలనే అంశం లేదు. నాజిజంలో వుంది. యూదుల్ని ఊచకోత కోశారు.

 

ఈ కారణాల రీత్యా ఫాసిజంకన్నా నాజిజమే భారతదేశ ప్రభుత్వ స్వభావానికి ఎక్కువగా సరిపోతుంది.

 

ఇటలీలో ముస్సోలిని ఫాసిజం అన్నట్టు, జర్మనీలో హిట్లర్ నాజిజం అన్నట్టు, మనదేశంలోనూ  సంఘపరివారం ‘హిందూత్వ’ అనే పేరు పెట్టింది. చాలా మందికి మతానికీ, మతతత్త్వానికీ తేడా తెలియనట్లే హిందుకూ హిందూత్వకు తేడా తెలీదు. హిందూ ప్రతినిధి అయిన దామోదర్ సావర్కర్  గొప్పగా హిందూత్వ అని పేరుపెట్టిన్నట్టూ తెలీదు. హిందూత్వ అనగానే తమని నిందిస్తున్నారని  సాధారణ హిందువులు అనుకుంటే విప్లవానికి మొదటికే ముప్పు వస్తుంది. ఏవో కొన్ని చిన్న చిన్న సమూహాలు (పీర్ గ్రూపులు) ఆశించినంత మాత్రాన  విప్లవాలు జరగవు. అత్యధిక ప్రజల్ని సమీకరించపోతే ఏ దేశంలోనూ విప్లవాలు విజయవంతం కావు.

 

నేను  ఏ రాజకీయ పార్టీలోనూ లేను. నన్ను ఆకర్షిస్తున్న రాజకీయ పార్టి కూడ సమీపంలో కనిపించడంలేదు. నేను చిన్న యార్డ్ స్టిక్ దగ్గర పెట్టుకున్నాను. ఏ పార్టి, ఏ సంఘం, ఏ ఉత్సవం, ఏ సభ అయినా ఆదివాసీ, ముస్లిం సమూహాల మీద సానుకూలంగా వున్నారా? లేదా? అనేదే ఆ కొలమానం.

 

కమ్యూనిస్టు పార్టీల్లో మొదటి నుండీ ఒక ఇబ్బంది వుంది. మత వ్యవస్థలోనూ పీడితులు పీడకులు వుంటారని అవి గుర్తించలేవు. గుర్తిస్తే పీడితుల పక్షాన వుంటామని ప్రకటించాల్సివుంటుంది. అలా ప్రకటిస్తే పీడక సమూహం తమను వదిలి వేస్తుందని వాళ్ళ భయం. అవి చాలా ఇరకాటంలో వున్నాయి. పీడితుల పక్షం వహించలేవు; పీడకుల పక్షం వహిస్తామని చెప్పుకోలేవు. మతంలో వర్గం లేదని తప్పుకోజూస్తాయి. మతం ఒక్కటే కాదు, కులం, తెగ, భాష, ప్రాంతం, వర్ణం, లింగం అన్నింటిలోనూ వర్గం వుంటుంది. వర్గం సర్వాంతర్యామి.

 

పునాది ఉపరితలాల్లో ప్రధానమైది నిస్సందేహంగా పునాదే. దాని అర్ధం ఉపరితలానికి తావులేదని కాదు. పునాదీ ఉపరితలం నిరంతరం గతితార్కిక సంబంధంలో వుంటాయి. రెండూ ఒక అన్యోన్య సంబంధంలో వుంటూ,  ఒకదాన్నిమరొకటి నిరంతరం ప్రభావితం చేసుకుంటుంటాయి.

 

ఇక వర్తమానానికి వస్తే,

 

2018 ఏప్రిల్ 18-22 తేదీల్లో హైదరాబాద్ లో జరిగిన సిపిఐ-ఎం 22వ మహాసభల్లో కేంద్ర ప్రభుత్వాన్ని "the authoritarian Hindutva assaults exhibited "growing fascist tendencies."అని పేర్కొంది.

 

2022 ఏప్రిల్ 6-10 తేదీల్లో కన్నూర్ లో జరిగిన సిపిఐ-ఎం 23వ మహాసభల్లో కేంద్ర ప్రభుత్వాన్ని "the Modi government was implementing the fascist agenda of the RSS” అని పేర్కొంది.

 

2025 ఏప్రిల్ 2-6 తేదీల్లో మధురైలో జరుగనున్న సిపిఐ-ఎం 24వ మహాసభల ముసాయిదా తీర్మానంలో కేంద్ర ప్రభుత్వాన్ని "The neo-fascist traits on display reflect the push to impose a reactionary Hindutva agenda and the authoritarian excesses aimed at suppressing opposition and democracy."  అని పేర్కొంది.

 

1970లలో ఆనాటి ప్రతిపక్ష నాయకులందరూ అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని హిట్లర్ అని విమర్శించారు. జయప్రకాశ్ నారాయణ, అటల్ బిహారీ వాజ్ పాయి, జార్జ్ ఫెర్నాండెస్, మురార్జీ దేశాయి, రామ్ మనోహర్ లోహియా, ఎల్ కే అద్వానీ, నానీ ఫాల్కీవాల తదితరులు ఆమెను బహిరంగంగానే హిట్లర్ అన్నారు.  

 

ఇప్పటి కేంద్ర ప్రభుత్వం ఇందిరా గాంధీకన్నా మెరుగ్గా వుందా? ఘోరంగా వుందా? అనేది కీలక ప్రశ్న. ఇదే ఇప్పుడు చర్చనీయాంశం. దానికి రాబోయే మహాసభల్లో సిపిఐ-ఎం నాయకత్వం సమాధానం చెప్పవచ్చు.

 

నా పుస్తకం కాపీలు అయిపోయాయి. రీ-ప్రింట్  వేయాలనుకుంటే నేను దాని శీర్షికను ‘నయా నాజీజం – నయా మనుస్మృతి’ అని మార్చుతాను. కాలంతోపాటు అలోచనల్లో మార్పులు సహజం.

 

09-మార్చ్ 2025

No comments:

Post a Comment