*బహుజన ఐక్యత ప్రాణ రక్షణ మందు*
మాన్యవార్ కాన్షీరామ్ అమరుడు. అందుకే
ప్రతి కష్టకాలంలోనూ బలహీనవర్గాలు ఆయన్ని తలచుకుంటున్నాయి.
కాన్షీరామ్ తో నాకు చిన్న అనుబంధం వుంది.
నేను సామాజిక కార్యకర్తగా వుంటూనే వర్కింగ్ జర్నలిస్టుగా మారిన కొత్తలో ఆయన
విజయవాడ వచ్చారు. బహుశ అది 1989 మార్చి నెల కావచ్చు. అది ఆయనకు ఆంధ్రప్రదేశ్ లో
తొలి పర్యటన కావచ్చు.
విజయవాడ అంబేడ్కర్ భవన్ లో క్రియాశీల కార్యకర్తల
సమావేశం పెట్టారు. కొందరు మిత్రులు నన్నూ రమ్మంటే వెళ్ళాను. కాన్షీరామ్ కు ఒక అలవాటు వుండేది. తను
ప్రసంగించడానికి ముందు మీడియాను బయటికి పొమ్మనేవారు. తనకు మీడియా ప్రచారం
అక్కరలేదనేవారు. ఆరోజూ మీడియా ప్రతినిధుల్ని లేచి నిలబడమన్నారు. మిగిలిన మీడియా
మిత్రులతో నేనూ లేచి నిలబడ్డాను. ఆయన అందర్నీ “గెట్ ఆఫ్“ అన్నారు.
నేను ఒక విన్నపం చేశాను. “వృత్తిరీత్యా
జర్నలిస్టునే కానీ ప్రవృత్తిరీత్యా సామాజిక కార్యకర్తని. కారంచేడు ఉద్యమంతో ఒక
అనుబంధం కూడ వుంది” అన్నాను. ఈలోపు ఒకరిద్దరు అంబేడ్కరైట్ మిత్రులు ఆయన దగ్గరికి
వెళ్ళి నాగురించి మంచిగా చెప్పారు. అలా
నాకు ఆ సమావేశంలో వుండడానికి అనుమతి దొరికింది. అంతేకాక కాన్షీరామ్ నాతో ఓ ఐదారు
నిముషాలకుపైగా ఆసక్తిగా మాట్లాడారు.
దాన్నే ఒక ఇంటర్వ్యూగా రాశాను. ‘ఆంధ్రభూమి’ దినపత్రిక ప్రచురించింది. తరువాత ఆ
ఇంటర్వ్యూను ఆంధ్రప్రదేశ్ బహుజన సమాజ్ పార్టి ఒక చిన్న పుస్తకంగా వేసింది.
నాకు ఆరోజు కాన్షీరామ్ మాటల్లో బాగా నచ్చింది ఒకటుంది. “జిస్కే జిత్నీ భాగేదారీ, ఉస్కీ ఉత్నీ హిస్సేదారీ (‘జనాభాలో ఎవరు ఎంతో వారికి హక్కు అంత”). ఇది అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ గొప్ప సామాజిక సూత్రం.
జాతీయ
రాజకీయాల్లో ఇండియా కూటమి నాయకుడు రాహుల్ గాంధీ ప్రస్తుతం ఎక్కడికి వెళ్ళినా
కాన్షీరామ్ ముందుకు తెచ్చిన “జిస్కే జిత్నీ భాగేదారీ, ఉస్కీ ఉత్నీ హిస్సేదారీ’
నినాదాన్ని ఇస్తున్నారు. దీనివల్ల ఇతర సామాజికవర్గాలతోపాటు భారత ముస్లిం సామాజిక
వర్గానికి కూడ మేలు జరుగుతుంది. అందులో సందేహం లేదు. కానీ, ముస్లింలకు విద్యా,
ఉద్యోగ, రాజకీయ రంగాల్లో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇస్తాం అని రాహుల్
గాంధి స్పష్టంగా చెప్పడం లేదు. ఎన్డీయే కూటమి తనను ‘ముస్లిం సంతుష్టీకరణ’ ముద్ర
వేస్తుందని ఆయన జంకుతూ వుండవచ్చు.
నిన్న ఆల్
ఇండియా బహుజన సమాజ్ పార్టి విడుదల చేసిన పోస్టర్ లో ముస్లింలకు విద్యా, ఉద్యోగ,
రాజకీయ రంగాల్లో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలి అనే డిమాండ్ వుంది. ఇది
గొప్ప ముందంజ. ఇటీవల నేను సభల మీద మునుపటి ఆసక్తిని చూపడంలేదు. ఏఐ బిఎస్పి విడుదల
చేసిన పోస్టర్ చూసి కొత్త ఉత్తేజాన్ని
పొంది ఈ సభకు వచ్చాను.
ముస్లింలు
దళితుల ఐక్యత ఈరోజుది కాదు. దీనికి వందేళ్ళ చరిత్ర వుంది. ఈ ఐక్యతకు 1931 నాటి
రెండవ రౌండ్ టేబుల్ కాన్ఫెరెన్స్ వేదికగా నిలిచింది.
1909 నాటి
మోర్లే-మింటో సంస్కరణలు, ‘ద ఇండియన్
కౌన్సిల్స్ యాక్ట్ -1909’ ద్వారానూ, 1919 నాటి మోంటేగు-చెమ్స్ ఫర్డ్ సంస్కరణలు, ద
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ -1919 ద్వారానూ బ్రిటీష్ ఇండియాలోని ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాల (separate electorates) సౌకర్యం
వచ్చింది. అంటే, తమ శాసనకర్తల్ని తామే ఎన్నుకునే అవకాశం.
1916
నాటి లక్నో ఒప్పందంలో జాతీయ కాంగ్రెస్ కూడ ముస్లిం లీగ్ పొందిన ప్రత్యేక నియోజకవర్గాల సౌకర్యాన్ని
సమర్ధించింది. ముస్లింలకు నాటి జనాభా దామాషాకు మించి రాజకీయ ప్రాతినిధ్యం
దక్కింది.
ముస్లింలను చూసి శిక్కు, క్రైస్తవ, ఆంగ్లో ఇండియన్ సామాజికవర్గాలు సహితం ప్రత్యేక నియోజకవర్గాలను
సాధించుకున్నాయి. అణగారినవర్గాలకు కూడ ప్రత్యేక నియోజకవర్గాలను
ఏర్పాటు చేయాలని 1930లో బిఆర్ అంబేడ్కర్ కోరారు.
1931
చివర్లో జరిగిన రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ అంశం మీదనే
సుదీర్ఘ చర్చలు వాడివేడిగా జరిగాయి.
హిందూ సామాజికవర్గాల ప్రతినిధిగా ఆ సమావేశంలో పాల్గొంటున్నట్టు
ప్రకటించిన గాంధీజీ -
అణగారిన వర్గాలు, హిందూసమాజంలో అంతర్భాగం కనుక వాళ్ళకు ప్రత్యేక నియోజక వర్గాలు కేటాయించరాదనీ, ఒకవేళ అలా చేస్తే, అవి హిందూ సమాజాన్ని శాశ్వతంగా విభజిస్తాయంటూ గట్టిగా అభ్యంతరం వ్యక్తం చేశారు. అణగారినవర్గాలు హిందూసమాజంలో అంతర్భాగం కానేకాదనీ,
వాళ్ళు భారత జాతీయ జీవనంలో ఒక ప్రత్యేక సంస్కృతి సాంప్రదాయాలు కలిగిన సమూహం కనుక వాళ్ళను విడిగా చూడాలని అంబేడ్కర్ వాదించారు. భారత ఉపఖండంలోని ప్రతి సామాజికవర్గానికి ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేయడంతోపాటు రాజకీయరంగంలో పూర్తిస్థాయి భద్రతలు కల్పించాలని ముస్లిం లీగ్ నాయకులైన ముహమ్మద్ ఆలీ జిన్నా, ఆగా ఖాన్-3 తదితరులు గట్టిగా వాదించారు. అలా వాళ్ళు రౌండ్ టేబుల్ సమావేశంలో శిక్కు, క్రైస్తవ సమూహాలతోపాటు అణగారినవర్గాలకు పూర్తి అనుకూలంగా వ్యవహరించారు.
ముస్లిం క్రైస్తవ, శిక్కు, అణగారినవర్గాలు ఏకం కావడంతో గాంధీజీవాదం వీగిపోయింది. ముస్లిం లీగ్, అంబేడ్కర్ ల సంయుక్త వాదం బలాన్ని సాధించింది. అప్పటి బ్రిటీష్ ప్రధాని రామ్సే మెక్ డోనాల్డ్ అణగారినవర్గాలకు ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయిస్తూ 1932 ఆగస్టు 16న కమ్యూనల్ అవార్డును ప్రకటించాడు. భారతదేశంలో బహుజన ఐక్యతకు ఇది తొలి భారీ విజయం.
1984 అక్టోబరు-నవంబరు నెలల్లో ఢిల్లీ ఆ
పరిసర ప్రాంతాల్లోని శిక్కుల మీద దాడి
జరిగింది. ఆ తరువాత వాళ్ళు ముస్లింల మీద
దాడి చేస్తారనే ప్రమాద సంకేతాలు వెలువడ్డాయి. 1931 నాటి బలహీనవర్గాల ఐక్యతను
పునరుధ్ధరించాల్సిన చారిత్రక అవసరం ముందుకు వచ్చింది.
ఈలోగా, 1985 జులైలో కారంచేడులో షెడ్యూల్ కులాల మీద క్రూర దాడిజరిగింది. ఇతర ఇబ్బందుల
సంగతి ఎలావున్నా ఒక చారిత్రక బాధ్యత అనుకొని వెళ్ళి ఆ ఉద్యమంలో పాల్గొన్నాను.
నాయకత్వం కూడ వహించాను. ఇక్కడ ఒక విషయం చెప్పాల్సివుంది. కారంచేడు ఉద్యమానికి
అరడజను మంది తమతమ పధ్ధతుల్లో నాయకత్వం వహించారు. సెప్టెంబరు 10న రాస్తారోకోతో
ఉద్యమం మీద నిర్బంధం పెరిగింది. దానితో ఇతర నాయకులు చీరాల వదిలి వెళ్ళిపోయారు.
నేను మాత్రమే అక్కడ నిలబడ్డాను అని సగర్వంగా చెప్పగలను. అరెస్టు చేసి రిమాండ్ కు
పంపించారు. ఒక మంచి పునరావాస ప్యాకేజీ ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు వచ్చిన తరువాతే
చీరాలను వదిలాను.
ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయాన్ని చెప్పాలి.
నేను చీరాలలో వున్నంత కాలం ఇప్పటి ఏఐబిఎస్పీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆర్డినేటర్
బి. పరంజ్యోతి వాళ్ళ ఇల్లే నాకు ఆశ్రయంగా వుంది. మేమిద్దరం ఉద్యమ సహచరులం
మాత్రమేకాదు; ఆత్మీయ మిత్రులం కూడ.
ఇప్పుడు వర్తమానానికి వద్దాం. కార్పొరేట్
మతతత్వ నియంతృత్వ పాలనలో మనం వుంటున్నాం. ఎస్టి, ఎస్సి, బిసి, ముస్లిం- క్రైస్తవ
మైనారిటీలతోపాటు శ్రామికులు, సామాన్య ప్రజలు, మహిళలు దీనికి బాధితులు. రకరకాల
వివక్షలకు గురవుతున్న వీళ్ళందరూ ఏకంకానిదే కార్పొరేట్ మతతత్వ నియంతృత్వాన్ని ఎదుర్కోలేం.
కార్పొరేట్లకు ఆకలి ఎక్కువ. ఈ భూమి మొత్తం
వాళ్ళకు కావాలి. సముద్రాలన్నీ కావాలి. ఆకాశమంతా కావాలి. అవి కూడ సరిపోవడంలేదు.
ఆదివాసుల్ని తొలగించి అడవుల్ని వాళ్ళకు ఇచ్చేయాలి. మత్స్యకారుల్ని తొలగించి
తీరప్రాంతాల్ని వాళ్ళకు ఇచ్చేయాలి. నాలుగు కార్ఖానాలు పెట్టుకుని ముస్లింలు పొట్ట
పోసుకుంటుంటే ఆ బజార్లను బుల్డోజర్లతో కూల్చి కార్పొరేట్లకు అప్పచెప్పాలి.
ఇలా చేయడానికి ఇప్పుడు వాళ్ళకు రాజ్యాంగ
పీఠికలోని సామరస్యం, సామ్యవాదం అడ్డొచ్చాయి. వాటిని తొలగించడానికి పూనుకున్నారు. మనం
జాగ్రత్తగా గమనిస్తే రాజ్యాంగ మూల ఆదర్శాలయిన స్వేఛ్ఛా, సమానత్వం, సోదరభావాల నుండే
సామరస్యం సామ్యవాదం పుట్టాయి అని సులువుగా అర్ధం అవుతుంది. సామరస్యం సామ్యవాదం
తొలగించడం అంటే వాళ్ళు స్వేఛ్ఛా, సమానత్వం, సోదరభావాలను తొలగించడానికి సిధ్ధం
అయ్యారని అర్ధం చేసుకోవాలి. అంటే, మొత్తం రాజ్యాంగాన్ని పీక నులిపి చంపేయ్యడానికి
కుట్ర జరుగుతోందని గమనించకపోతే మన మెదళ్ళు పనిచేయడం లేదని అర్ధం.
దేశంలోని అణగారిన సమూహాలన్నీ ఏకంకావాలి.
ఎస్టి, ఎస్సి, బిసి, ముస్లిం, క్రైస్తవ, శిక్కు తదితర మైనారిటీలు, శ్రామికులు ఏకమై
ఒక ప్రభంజనాన్ని సృష్టించాలి. రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. ఇది ప్రళయ సమయం! బహుజన ఐక్యత
ఇప్పుడు ప్రాణ రక్షణ మందు!
డానీ
సమాజ విశ్లేషకులు
ముస్లిం ఆచనాపరుల
వేదిక (MTF)
(ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టి 2025 అక్టోబరు
9న విజయవాడలో రాజ్యాంగ పరిరక్షణ కోసం జరిపిన ధర్నాలో చేసిన ప్రసంగ పాఠం)
No comments:
Post a Comment