*ఐక్య కార్యాచరణతో ఉపద్రవాన్ని ఎదుర్కొందాం*.
ఇప్పుడు మనం కార్పొరేట్ మతతత్త్వ
నియంతృత్వ పాలనలో వుంటున్నాం.
ఎస్టి, ఎస్సి, బిసి, ముస్లిం- క్రైస్తవ మైనారిటీలతోపాటు శ్రామికులు,
సామాన్య ప్రజలు, మహిళలు దీనికి బాధితులు. రకరకాల వివక్షలకు గురవుతున్న మనమంతా ఏకంకానిదే నియంతల్ని ఎదుర్కోలేం. వివక్షా అణిచివేతల్ని
తిప్పికొట్టలేం.
కార్పొరేట్లకు ఆకలి ఎక్కువ. ఈ భూమి మొత్తం
వాళ్ళకు కావాలి. సముద్రాలన్నీ కావాలి. ఆకాశమంతా కావాలి. అవి కూడ సరిపోవడంలేదు.
ఆదివాసుల్ని తొలగించి అడవుల్ని వాళ్ళకు ఇచ్చేయాలి. మత్స్యకారుల్ని తొలగించి
తీరప్రాంతాల్ని వాళ్ళకు ఇచ్చేయాలి. నాలుగు కార్ఖానాలు పెట్టుకుని ముస్లింలు పొట్ట
పోసుకుంటుంటే ఆ బజార్లను బుల్డోజర్లతో కూల్చి కార్పొరేట్లకు అప్పచెప్పాలి. కార్మికులకు
హక్కులుండరాదు. సంక్షేపథకాలను ఎత్తేయాలి. ఆ మిగులునంతా అస్మదీయ కార్పొరేట్లకు
అప్పచెప్పాలి.
ఇలా చేయడానికి ఇప్పుడు వాళ్ళకు రాజ్యాంగ
పీఠికలోని సామరస్యం, సామ్యవాదం అడ్డొచ్చాయి. వాటిని తొలగించడానికి పూనుకున్నారు.
మనం జాగ్రత్తగా గమనిస్తే రాజ్యాంగ మూల ఆదర్శాలయిన స్వేఛ్ఛా, సమానత్వం, సోదరభావాల
నుండే సామరస్యం సామ్యవాదం పుట్టాయి అని సులువుగా అర్ధం అవుతుంది. సామరస్యం సామ్యవాదాలను
తొలగించడం అంటే వాళ్ళు స్వేఛ్ఛా, సమానత్వం, సోదరభావాలను సహితం తొలగించడానికి
సిధ్ధం అయ్యారని అర్ధం చేసుకోవాలి. అంటే, మొత్తం రాజ్యాంగాన్ని పీక నులిపి
చంపేయ్యడానికి కుట్ర జరుగుతోందని గమనించకపోతే మన మెదళ్ళు పనిచేయడం లేదని అర్ధం.
లౌకికవాదాన్ని తీసేస్తే మైనారిటీలు
రెండవశ్రేణి పౌరులుగా మారిపోతారు. మతస్వేఛ్ఛ రద్దవుతుంది. సోదరభావం రద్దయి
మెజారిటీ మతాధికారం పెచ్చరిల్లుతుంది. సామ్యవాదాన్ని రద్దుచేస్తే కార్మికుల
హక్కులు రద్దవుతాయి. పేద ధనిక అంతరం మరింతగా పెరిగిపోతుంది. సంక్షేమ పథకాలు, ఉద్దీపన చర్యలు రద్దయిపోతాయి.
అంటే దేశంలోని అణగారిన సమూహాలన్నీ తీవ్ర వివక్ష, అణిచివేతలకు గురవుతాయి. వీళ్ళందరూ
ఏకం అయితేనే రాబోతున్న ఉపద్రవాన్ని నివారించగలుగుతారు.
అయితే, ఇందులో ఒక పెద్ద చిక్కువుంది.
కొందరు ఆలోచనాపరులు నమ్ముతున్నట్టో, ఆశించుతున్నట్టో బలహీనవర్గ సమూహాలు కింది
స్థాయిలో సమైక్యంగా ఏమీలేవు. వాళ్ళ మధ్య సాంస్కృతిక, సాంఘీక, ధార్మిక, రాజకీయ,
తాత్విక అంశాల్లో అనేక విబేధాలున్నాయి. పైగా,
విభిన్న రంగాల్లో ఎవరి లక్ష్యాలు వారికున్నాయి. కొన్ని సందర్భాలలో అవి పరస్పర
విరుధ్ధంగానూ వుంటాయి. వాటిన్నింటినీ ఇప్పటికిప్పుడు పరిష్కరించుకోవడం సాధ్యంఅయ్యే
పనికాదు. విబేధాలను పక్కన పెట్టి ఇప్పటి ఉమ్మడి ఉపద్రవాన్ని ఎదుర్కోవడానికి ఐక్యకార్యాచరణను
(జాయింట్ యాక్షన్) రూపొందించుకుని కలిసి పనిచేయడం ఒక్కటే తక్షణ పరిష్కారం.
కలిసి పనిచేయడం అంటే, వివిధ సమూహాల మధ్య
సారూప్యం వున్నవాటిని మాత్రమే ఆచరణకు స్వీకరించాలి. సామరస్యంగా మార్చగలవాటిని
మార్చుకునేందుకు ప్రయత్నించాలి. తీవ్ర విబేధాలున్న అంశాలను పక్కన పెట్టాలి. ఈ మూడు
నియమాలను పాటిస్తేనే విభిన్న సమూహాల మధ్య ఐక్యత సాధ్యం అవుతుంది. ఇప్పుడు
చెయ్యాల్సింది అదే.
డానీ
*ముస్లిం
ఆలోచనాపరుల వేదిక MTF*
*Civil Society -
పౌరసమాజం*
No comments:
Post a Comment