Saturday, 25 October 2025

It is impossible to change a society that is Unknown!

 It is impossible to change a society that is Unknown!

అర్ధంకాని సమాజాన్ని మార్చడం అసాధ్యం!




 


*అర్ధం కాని ఈ సమాజాన్ని ఎలా మారుస్తారూ?*

 

ఈరోజు (25-10-2025 శనివారం) ఆమ్ధ్రజ్యోతి దినపత్రిక నా వ్యాసాన్ని ప్రచురించింది.

పత్రిక యాజమాన్యానికీ, సంపాదకులకు, ఎడిట్ పేజీ బాధ్యులకు

ధన్యవాదాలు.

స్థలాభావంవల్ల కొంత భాగాన్ని వాళ్ళు కత్తిరిస్తారు. అలాగే శీర్షికను మార్చే హక్కు కూడ పత్రికల వారిదే. పత్రికల్లో ఇది సహజం.

 

పూర్తిపాఠాన్ని ఇక్కడ ఇస్తున్నాను. ఆసక్తిగలవారు చదివి కామెంట్ చేస్తే ఆనందిస్తాను.

 

డానీ

సమాజ విశ్లేషకులు

 

 

డానీ

సమాజ విశ్లేషకులు 

 

          సమాజం నిరంతరం మారుతూ ఎప్పటికప్పుడు ఒక కొత్త దశలోనికి ప్రవేశిస్తుంటుంది. కొన్ని దశలు ప్రపంచంలో ఎక్కడో ఒకచోట గతంలో  కొనసాగినట్టుగా అనిపిస్తుంటాయి. అలాంటి సందర్భాల్లో చరిత్ర పునరావృతం  అవుతున్నట్టు అనిపిస్తుంది. కానీ, చరిత్ర ఎన్నడూ పునరావృతం కాదు. కాకపొతే కొన్ని పోలికలు వుండొచ్చు. లేదా దశ స్థాయి  మారవచ్చు. ప్రతి దశనూ ప్రతి స్థాయినీ కొత్తగా నిర్వచించాల్సిందే. ఇది కాలపు ఆలోచనాపరుల బాధ్యత.

 

          రాజ్యాంగం ప్రకారం మనది  ‘సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్రం’. ఒక ఆదర్శాన్ని ప్రకటించుకోవడం వేరు. ఆదర్శాన్ని ఆచరించడం వేరు. రాజ్యాంగాల్లో ప్రకటించుకున్నట్టుగా సమాజమూ వుండదు ప్రభుత్వమూ పనిచేయదు. రాజ్యాంగ పరిధిలోనే భారతదేశంహిందూ మతరాజ్యంగా మారిపోయిందని సుబ్రమణియన్ స్వామి వంటివాళ్ళు ఐదేళ్ళ క్రితమే ప్రకటించారు. ఒక ప్రజాస్వామిక  రాజ్యాంగం అమల్లో వుండగా దేశంలో మతరాజ్యం ఏర్పడడం రాజకీయ ధార్మిక రంగాల్లో  వైచిత్రి కావచ్చుగానీసామాజిక రంగంలో అది చాలా పెద్ద సంక్షోభాన్ని రేపుతుంది.

 

          భారత సమాజాన్ని అంచనా వేయడంలో కమ్యూనిస్టు పార్టీల్లో కూడ విపరీతమైన వైరుధ్యం కనిపిస్తుంది. సమాజాన్ని అర్ధం చేసుకున్న దాన్నిబట్టే ఆయా పార్టీల దీర్ఘకాలిక కార్యక్రమాల రూపకల్పన జరుగుతుంది.

 

          మనది అర్ధ భూస్వామ్య-అర్ధ వలస సమాజమని మార్క్సిస్టు-లెనినిస్టు పార్టీలన్నీ భావిస్తుంటాయి. ఇది 1935-40 మధ్య ప్రాంతంలో చైనా సమాజం గురించి  మావో చేసిన విశ్లేషణ. దాన్నుండి ఆయననూతన ప్రజాస్వామిక విప్లవంఅనే కార్యక్రమాన్ని రూపొందించాడు. చైనాలో సామ్రాజ్యవాద వ్యతిరేక జాతీయ బూర్జువావర్గం కూడ కమ్యూనిస్టుల  విప్లవంతో కలిసి వచ్చింది. ఇండియాలో అలాంటి పరిస్థితి లేకపోయినా, స్థల కాలాలు మారిపోయినా మావోయిస్టులతోసహా మార్క్సిస్టులెనినిస్టు పార్టీలన్నీనూతన ప్రజాస్వామిక విప్లవంను పట్టుకుని వేలాడుతున్నాయిమనదేశ ఆర్ధిక వ్యవస్థ వ్యవసాయ ప్రధానంగా వున్నప్పుడు కార్యక్రమం సరైనదనే అభిప్రాయం కొనసాగింది. ప్రధాన స్రవంతి కమ్యూనిస్టు పార్టీలు  పెట్టుబడీదారీ వ్యవస్థ ప్రాధాన్యాన్ని గుర్తించి, జనతా ప్రజాస్వామిక విప్లవం, ప్రజా ప్రజాస్వామిక విప్లవం వంటి కార్యక్రమాలను లక్ష్యంగా పెట్టుకున్నాయి. నలభై యాభై యేళ్ళ కింద రూపొందించుకున్న కార్యక్రమాలనే ఇప్పటికీ కొనసాగిస్తున్నాయి.

 

          1990లలో మన దేశంలోనేకాక ప్రపంచ వ్యాప్తంగా   సామాజిక ఆర్ధిక వ్యవస్థల పునాది మారిపోయింది. తూర్పు యూరప్ లోని సోషలిస్టు ప్రభుత్వాలు  పతనం కావడమేగాక  సోషలిస్టు రష్యా సహితం విఛ్ఛిన్నం అయిపోయింది. కమ్యూనిజానికి ఆమోదాంశం ఇరుకున పడిపోయింది. మరోవైపు, గాట్ కారణంగా ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పడి సరళీకృత ఆర్ధిక విధానాలు వచ్చాయి. డిజిటల్ టెక్నాలజీతో సాంప్రదాయ ఉత్పత్తి విధానమే మారిపోయింది. వీటికితోడు మనదేశంలో మతతత్వ రాజకీయాలు విజృంభించాయి. కొత్త గణాంకాల ప్రకారం మనదేశ జిడిపిలో వ్యవసాయం, ఆక్వా, అటవీ సంపదల వాటా 16.3 శాతం. పారిశ్రామిక రంగం వాటా 29 శాతం. కొత్తగా ప్రవేశించిన సర్వీస్ సెక్టార్ వాటా 54.55 శాతం. అయినప్పటికీ ఎవరయినా ఇప్పటికీ వ్యవసాయిక విప్లవం, నూతన ప్రజాస్వామిక విప్లవం  అంటే మాత్రం వాళ్ళ మెదళ్ళను పురాతత్వశాలల్లో జాగ్రత్తగా భద్రపరచాల్సివుంటుంది

 

          సమాజంలో అయినా ఉత్పత్తిశక్తులు, ఉత్పత్తి సంబంధాలతో కూడిన ఉత్పత్తి విధానం రాజకీయాలతో సహా ఇతర సామాజిక సాంస్కృతిక  రంగాలన్నింటినీ ప్రభావితం చేస్తుంటుంది. సూత్రాన్ని 21 శతాబ్దపు డిజిటల్ సమాజానికి అన్వయించే పని ఎవరూ చేయలేదు.

 

          ఆధిపత్య సమూహాల దగ్గర రాజకీయ అధికారంతోసహా  వనరులన్నీ సమృధ్ధిగా వుంటాయి. అంచేత వాళ్ళు కొత్త సమాజాన్ని విశ్లేషించుకున్నా, విశ్లేషించుకోకపోయినా వాళ్ళకు వచ్చే ఇబ్బంది ఏమీలేదు. కానీ, వర్తమాన సమాజంవల్ల ఇబ్బందులు, వివక్ష, అణిచివేతలకు గురయ్యేవాళ్ళు దాన్ని మార్చాలనుకుంటే మాత్రం  కొత్త పరిణామాలను నిశితంగా విశ్లేషించుకోకతప్పదు.

 

          రోగ నిర్ధారణ సరిగ్గా జరగకుండా రోగాన్ని నయం చేయడం ఎంతటి వైద్యుడికైనా ఎన్నటికీ సాధ్యంకాదు. అలాగే, సమాజాన్ని వాస్తవికంగా అర్ధం చేసుకోకుండా దాన్ని మార్చే కార్యక్రమాన్ని ఎవ్వరూ రూపొందించలేరు. విప్లవ కార్యక్రమాన్ని రూపొందించడమే సజావుగా సాగనప్పుడు దాన్ని విజయవంతం చేయడం అసాధ్యం అవుతుంది. ప్రస్తుతం బస్తర్ లో మావోయిస్టు పార్టి ఉనికి సంక్షోభంలో పడిపోవడం దీనికి సరికొత్త హెచ్చరిక

 

          మరోవైపు, దేశాన్ని ఫాసిజమో, నాజిజమో పాలిస్తున్నదనే అభిప్రాయాన్ని కొందరు తరచూ వ్యక్తం చేస్తున్నారు. పాలకుల్లో లక్షణాలు కనిపిస్తున్నమాట నిజమేగానీ వందేళ్ళ నాటి ఇటలీ, జర్మనీ రాజకీయ సామాజికార్ధిక పరిస్థితులు ఇప్పటి మన సామాజిక వాస్తవం ఒకటి కానేకాదు. ఇప్పుడు మనం చూస్తున్నది కార్పొరేట్ మతతత్త్వ నియంతృత్వం. (Corporate Communal Dictatorship -CCD). కార్పొరేట్ పెట్టుబడిదారీ విధానం, హిందూత్వ ఆధిపత్యంరాజ్య అణచివేతల క్రూర సమ్మిశ్రిత వ్యవస్థ ఇది. ఆర్ధికరంగంలో సహజవనరులు, కుత్రిమ వనరులు, శాస్త్రవిజ్ఞానం మొత్తం క్రమంగా కార్పొరేట్ల ఆధీనంలోనికి వెళ్ళిపోతుంటాయిసాంస్కృతిక రంగంలో మెజారిటీ మతం ఇతర మతాలను క్రూరంగా అణిచివేస్తుంటుంది. సామాన్య ప్రజలు తిరగబడకుండా రాజ్యం అణిచివేస్తుంటుంది. మూడు రకాల అణిచివేతల బాధితులు ఏకం కావాలని కొందరు సమజసంగానే  అంటుంటారుగానీ అది అంత సులువుకాదు.

 

          సన్నివేశం చాలా సంక్లిష్టంగా తయారవుతుందిమెజారిటీ మతం ఇతర మతాల్లోనూ విభజన తీసుకుని వస్తుంది. తనకు అనువైన జైన, బౌధ్ధ మతాలను కలుపుకుంటుంది. కులాల కుమ్ములాటలో నిత్యం మునిగితేలే హిందూ సమూహాలను ఐక్యం చేయడానికి దానికున్న ఏకైక మార్గం   ఇస్లాం, క్రైస్తవ మతాలను దేశ భద్రతకు ముప్పుగా ప్రచారం చేస్తుండడం.

 

"హిందూ సమాజం అంటూ ప్రత్యేకంగా ఏదీ ఉనికిలో వుండదు. అది కేవలం కులాల సమాహారం. ప్రతి కులం తన ఉనికి గురించి తపనతో ఉంటుంది. దాని మనుగడే దాని ఉనికికి మూలం, అదే దాని ముగింపుకూ మూలం. కులాలు ఎన్నడూ ఒక సమాఖ్యగా కూడ ఏర్పడవు”.

 

కాబట్టి, హిందూ సమాజాన్ని కులాల సముదాయం అనడం కూడ సరికాదు. తమ కోసం, తమ స్వార్థపర లక్ష్యాల కోసం ఒకరితో మరొకరు పోరాడుకుంటుండే సమూహాలు అవి. హిందూ-ముస్లిం అల్లర్లు జరిగినప్పుడు మాత్రమే హిందూ కులాల మధ్య ఒక అనుబంధం ఏర్పడుతుంది. అది కూడ తాత్కాలికం మాత్రమే. ఇతర సందర్భాల్లో ఒక కులం మరో కులంతో తనకో అనుబంధం ఉందని కనీసంగానయినా భావించదుఅని బిఆర్  అంబేడ్కర్ అన్న మాటలు ఇప్పటికీ వర్తిస్తాయి.

 

అంబేడ్కర్ మాటల్ని తిరగేసి చూస్తే, ఎన్నికల్లో హిందూ ఓటు బ్యాంకును కొల్లగొట్టాలంటే నిరంతరం ముస్లిం భూతాన్ని చూపుతుండాలి అనే అర్ధం వస్తుంది. దీనినే ఇస్లామో ఫోబియా అంటున్నారు. అలా చేస్తే, హిందూ సమాజం మొత్తం కాకున్నా వాళ్ళలో 36-38 శాతం ఓట్లు వేసినా అప్రతిహత శక్తి అని  చెప్పుకునే అవకాశం మన పార్లమెంటరీ ఎన్నికల వ్యవస్థలో వుంది.

 

          సమాజం నిలువు దొంతరలుగానేగాక, సమాంతరంగానూ సమూహాలు సమూహాలుగా విడిపోయి వుంటుంది. నిలువు దొంతరల్ని విశ్లేషించినంత సులువుకాదు సమాంతర సమూహాల మధ్యనున్న వైరుధ్యాలను పరిష్కరించడం. నిలువు దొంతరలు కళ్ళకు కనిపిస్తుంటాయి. సమాంతర సమూహాలను విడగొట్టి చూడడం కష్టసాధ్యం

 

          సమాజం మారాలనో సమాజాన్ని మార్చాలనో చాలా మంది అంటుంటారు. అలాంటివాళ్ళు అన్నింటికన్నా ముందు సమాజ వాస్తవికతను గుర్తించాలి. దానికి  బాధితుల జాబితా సిధ్ధం చేయాలి. సాధారణ బాధితులు మొదలు ప్రధాన బాధితుల వరకు ఒక గ్రేడింగ్ ను కూర్చాలి. ఇప్పటి సమాజాన్ని ఎలాంటి సమాజంగా మార్చాలని ఆశిస్తున్నామో? ఎలాంటి సమాజాన్ని నిర్మించగలమో? నిర్ధారించుకోవాలి. అప్పుడు దిశగా ప్రయాణించడానికి ఒక రోడ్ మ్యాప్   ను రూపొందించుకోవచ్చు. అయితే, ఇది అంత సులువయిన ప్రక్రియ కాదు. చాలా సంక్లిష్ట ప్రక్రియ. తరచూ మన గతమే మనల్ని కట్టి పడేస్తుంది.

 

          వర్తమాన భారత మేధోరంగాన్ని మూడు దృక్పథాలు నడుపుతున్నాయి. ఎంఎస్ గోల్వార్కర్, కార్ల్ మార్క్స్, బిఆర్  అంబేడ్కర్. గోల్వార్కర్ ఆలోచనా విధానానికి వ్యతిరేకంగా మార్క్స్, అంబేడ్కర్ ఆలోచనా స్రవంతుల్ని ఏకం చేయాలి అని చాలామంది అనవచ్చు. దీనినే లాల్ - నీల్ మైత్రి అంటున్నారు కొందరులోతుగా చీలిపోయిన సమాజంలో  ఇది అంత సులువైన వ్యవహారం కాదు.   ఇప్పటి ఇండియా కార్పొరేట్ మతతత్త్వ నియంతృత్వానికి ప్రధాన బాధితులు ముస్లింలు, ఆదివాసులు. ఉద్యమంలోనూ, తరువాత మనం కోరుకుంటున్న సమాజంలోనూ రెండు సమూహాల స్థానాన్ని నిర్ణయించకపోతే బండి ఒక్క అడుగు కూడ ముందుకు నడవదు. ఆలస్యం జరిగేకొద్దీకార్పొరేట్ పెట్టుబడిదారీ విధానం, హిందూత్వ ఆధిపత్యం, రాజ్య అణచివేత మూడూ మరింతగా పెరుగుతుంటాయి.

రచన : 03-10-2025

ప్రచురణ  : 25-12-2025, ఆంధ్రజ్యోతి దినపత్రిక

https://www.andhrajyothy.com/2025/editorial/how-can-we-change-this-misunderstood-society-1459551.html

 

https://epaper.andhrajyothy.com/article/Hyderabad_Main_II?OrgId=251027ef3019&eid=224&imageview=1&device=desktop

 

 

No comments:

Post a Comment