Do Muslims really not care about society?
ముస్లింలు నిజంగానే
సమాజాన్ని పట్టించుకోలేదా?
డానీ
సమాజ విశ్లేషకులు
ముస్లింలు సమాజాన్ని పట్టించుకోరు అనే మాటను మనం తరచూ వింటుంటాం. వాళ్ళకు అల్లాతప్ప లోకం అక్కరలేదు అని కూడ చాలామంది అంటుంటారు. ముస్లింలు మార్పుకు, ఆధునికతకు వ్యతిరేకులు అనే నింద ఇందులో దాగి వుంటుంది. కొందరు తెలియక అమాయికంగా అలా అంటే అదో ఇది. మరికొందరు ఉద్దేశ్యపూర్వకంగానే ఇలాంటి మాటల్ని ప్రచారంలో పెడుతుంటారు. దీనినే ఇస్లామో ఫోబియా అంటున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో ముస్లిం వ్యతిరేక ప్రచారం మోతాదు పెంచింది. దీనికోసం ఓ భారీ సిబ్బంది
రాత్రీపగలు కరసేవ చేస్తున్నది.
వ్యాపార-వాణిజ్య లాభాలతో సంతృప్తి చెందక భారత ఉపఖండాన్ని పాలించాలని వచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యాలను 1757లో ప్లాసీ వద్ద ఎదుర్కొన్నవాడు నవాబు సిరాజ్ ఉద్దౌలా. అప్పటికి అతని వయస్సు నిండా పాతికేళ్ళు కూడా కావు. అతన్ని అతి క్రూరంగా చంపిన తరువాతే భారత గడ్డ మీద ఈస్ట్ ఇండియా కంపెనీ వలస పాలన ఆరంభం అయింది.
ఇది జరిగిన వందేళ్ల తరువాత 1857 మధ్యలో సిపాయిల తిరుగుబాటు అనే భారత ప్రధమ స్వాతంత్ర్య పోరాటం సాగింది. ప్రాదేశిక జాతీయవాదం (Territorial
nationalism) ఆదర్శాన్ని తొలిసారిగా ముందుకు తెచ్చిన పోరాటం అది. దాని
ఆరంభ నాయకుడు మౌల్వీ
అహమదుల్లా షా. తిరుగుబాటుకు గౌరవ జాతీయ నాయకుడు ఎలాగూ వృధ్ధ చక్రవర్తి బహద్దూర్ షా జాఫర్.
ప్రాదేశిక జాతీయవాదం అంటే మరేమీకాదు; బ్రిటీష్ వలస పాలకుల్ని
తరిమేశాక మిగిలినవాళ్ళందరూ భారత గడ్డ మీద కలిసిమెలసి
జీవించాలనేది ఈ ఆదర్శం. ఇదే రాజ్యాంగ రచన నాటికి సర్వ సామరస్య సోదరభావంగా మారింది.
ఉత్తరాదిన మొదలైన భారత ప్రధమ స్వాతంత్ర్య పోరాట ప్రభావం దక్షణాదికి కూడ విస్తరించింది. నిజాం ప్రిన్సిలీ స్టేట్లో, తిరుగుబాటుదార్లు హైదరాబాద్ లోని నిజాం ప్యాలెస్ మీదికి కాకుండా నిజాం మీద పెత్తనం
చేస్తున్న రెసిడెంట్
మేజర్ కట్ బెర్ట్ డేవిడ్సన్ కోఠీ రెసిడెన్సీ మీదికి దండెత్తారు. దీనికి నాయకత్వం వహించిన తుర్రేబాజ్ (తురుం) ఖాన్, మౌల్వీ అల్లావుద్దీన్ ల సామాజికవర్గాలు ఏమిటో విడిగా చెప్పాల్సిన పనిలేదు.
తొంభై ఏళ్ళ తరువాత నిజాం సంస్థానంలోని తెలంగాణ ప్రాంతంలో రైతాంగ సాయుధ పోరాటం మొదలైంది.
దాని నాయకులు నల్గొండ జిల్లాలో ఎర్రపహడ్ దొర జెన్నారెడ్డి ప్రతాప రెడ్డి, వరంగల్లు జిల్లాలో విసునూరు దొర రాపాక రాంచంద్రారెడ్డిల
మీద పోరాటం చేశారు. వారికి రాజధాని నగరంలోని నిజాం మీర్ ఉస్మాన్ ఆలీ ఖాన్ గురించిగానీ,
బ్రిటీష్ రెసిడెంట్ సర్ ఆర్ధర్ కన్నింఘామ్ లోథియన్ గురించిగానీ అంతగా తెలీదు. అసలా పోరాటంలో నిజాం ప్రస్తావన కూడా చివరి రోజుల్లో - అంటే 1947 ఆగస్టులో బ్రిటీష్ పాలన ముగిశాక – మాత్రమే వచ్చింది. వాళ్ళకన్నా పది దశాబ్దాల ముందు పోరాడిన తురుం ఖాన్, మౌల్వీ అల్లావుద్దీన్ లు ఈస్ట్ ఇండియా కంపెనీ రెసిడెంట్ ను లక్ష్యంగా పెట్టుకున్నారు.
1857 తిరుగుబాటు ముందుకు తెచ్చిన ప్రాదేశిక జాతీయవాదమే జాతియోద్యమానికి ప్రేరణగా మారింది. భగత్ సింగ్, ఉధామ్ సింగ్ వంటి విప్లవవాదులు, మహాత్మా గాంధీ వంటి అహింసావాదులు ప్రాదేశిక జాతీయవాదాన్ని ఆదర్శంగా తీసుకున్నారు. భావి భారత ప్రజల నుదిటి రాతను రాసిన రాజ్యాంగ సభ సభ్యుల్లో - అందరిదీ కాకున్నా - అత్యధికులదీ ఇదే ఆదర్శం. దేశానికి ఇంతటి ప్రభావశీల సామాజిక సిధ్ధాంతాన్ని అందించిన వారెవరూ?
అనే అంశం
మీద ఎవరూ పెద్దగా దృష్టి పెట్టలేదు.
1885లో ఏర్పడ్డ భారత జాతీయ కాంగ్రెస్ కు బదురుద్దీన్ తాయబ్జీ, రహీమతుల్లా మొహమూద్ వ్యవస్థాపక సభ్యులు. తరువాతి కాలంలో వాళ్ళు ఆ పార్టీకి జాతీయ అధ్యక్షులుగానూ పనిచేశారు. భారత సామాజిక రాజకీయ రంగాల్లో ఎంతో ప్రాముఖ్యాన్ని సంతరించుకున్న సుల్తాన్ మొహమ్మద్ షా (ఆగా ఖాన్ – 3) సహితం బాల్యం నుండి కాంగ్రెస్ పెరుగుదలకు తోడ్పడినవారే.
1920 అక్టోబరు నెలలో తాష్కెంట్ లో ఏర్పడిన భారత జాతీయ కమ్యూనిస్టు పార్టికి మొహమ్మద్ షఫీక్ సిద్దీఖి వ్యవస్థాపక కార్యదర్శి; ముహమ్మద్ ఆలీ వ్యవస్థాపక సభ్యులు. వాళ్ళిద్దరూ పాన్ – ఇస్లామిక్ ఖిలాఫత్ ఉద్యమ నాయకులు. 1925లో కాన్పూరులో పుట్టిన
భారత కమ్యూనిస్టు పార్టి వ్యవస్థాపక సభ ఆహ్వాన సంఘానికి మౌలానా హస్రత్ మోహానీ అధ్యక్షునిగా
వున్నారు. ముజఫర్
అహ్మాద్, ఎస్ డి హసన్, ఆజాద్ సోమానీలు తదితరులు సిపిఐ వ్యవస్థాపక కేంద్ర సభ్యులు.
దాదాపు ఆ కాలంలోనే, ఉవ్వెత్తున సాగిన సాయుధ విప్లవపోరులో అష్ఫఖుల్లా ఖాన్, గదర్ పార్టీలో మౌలానా బర్కతుల్లా భోపాలీ, సుభాష్ చంద్రబోస్ నిర్మించిన ఇండియన్ నేషనల్ ఆర్మీలో కెప్టెన్ అబ్బాస్ ఆలీ వంటివారు మనకు కనిపిస్తారు.
1935-36 ప్రాంతాల్లో ఏర్పడిన అభ్యుదయ రచయితల ఉద్యమం వ్యవస్థాపకులు డజన్ మందిలో ఎనమండుగురు ముస్లింలు, నలుగురు ముస్లిమేతరులు. ఆ సంస్థకు తొలి అధ్యక్షులుగా వుండిన మున్షీ ప్రేమ్ చంద్ అప్పటి డిమాండును బట్టి ఉర్దూలో రచనా వ్యాసాంగాన్ని సాగించేవారు. అప్పట్లో పుస్తకాలు చదివే భారతీయుల్లో ముస్లింలే ఎక్కువమంది అనే వాస్తవాన్ని మరచిపోరాదు. పాలకులు ఒక కుట్ర పథకం ప్రకారం ఉర్దూను పక్కన పెట్టి ఇతర భాషల్ని ప్రోత్సహించడం మొదలుపెట్టాక ముస్లింలు కుత్రిమంగా నయా నిరక్షరాశ్యులు అయిపోయారు.
బ్రిటీష్ వలస పాలనలో పోరాడో, లాబీయింగ్ చేసో రాజకీయ ఉద్దీపన పథకాలని అందుకున్న తొలి సామాజికవర్గం ముస్లింలు. తమ శాసనకర్తల్ని తామే ఎన్నుకునేలా
ముస్లింల కోసం ప్రత్యేక నియోజకవర్గాలు (separate electorates) ఏర్పాటు చేయాలనే డిమాండును
ముస్లిం లీగ్ ముందుకు తెచ్చింది. 1909 నాటి మోర్లే-మింటో సంస్కరణలు,
తద్వార వచ్చిన ‘ద ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ -1909 ముస్లిం లీగ్ డిమాండును
ఆమోదించింది. 1916లో ముస్లిం లీగ్ తో చేసుకున్న లక్నో ఒప్పందంలో జాతీయ కాంగ్రెస్ కూడ ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాల
ఏర్పాటును సమర్ధించింది.
శిక్కు, క్రైస్తవ, ఆంగ్లో ఇండియన్స్, యూరోపియన్స్ సామాజికవర్గాలు సహితం ముస్లింల నుండి ప్రేరణ పొంది తమకూ ప్రత్యేక నియోజకవర్గాల్ని ఏర్పాటు
చేయాలని కోరారు. 1919
నాటి మోంటేగు-చెమ్స్ ఫర్డ్ సంస్కరణలతో ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ -1919 ద్వార ఆ నాలుగు సామాజికవర్గాలకు ఈ సౌకర్యం హామీగా మారింది. అప్పటి దేశ జనాభాలో ముస్లింలు 25 శాతం వుండగా శాసన సభల్లో 33 శాతం స్థానాలు కేటాయించారు. అంటే
దామాషాకన్నా
33 శాతం ఎక్కువ!.
అణగారిన వర్గాలకు కూడ ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు
చేయాలనే డిమాండ్
ను 1930లో బీఆర్ అంబేడ్కర్ ముందుకు తెచ్చారు. 1931 చివర్లో జరిగిన రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ అంశం మీద చాలా వాడివేడి చర్చలు జరిగాయి. తనను
హిందూ సమాజపు ప్రతినిధిగా ప్రకటించుకున్న గాంధీజీ
- అణగారిన వర్గాలు హిందూసమాజంలో అంతర్భాగం కనుక వాళ్ళకు ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించరాదని తీవ్ర
అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకవేళ, అణగారినవర్గాలకు
ప్రత్యేక
నియోజకవర్గాలు ఏర్పాటు చేస్తే, అవి హిందూ సమాజాన్ని శాశ్వతంగా విభజిస్తాయని గట్టిగా ఆందోళన వ్యక్తం చేశారు. అణగారిన వర్గాలు హిందూసమాజంలో అంతర్భాగం కానేకాదనీ, వాళ్ళు భారత జాతీయ జీవనంలో ఒక ప్రత్యేక సంస్కృతి సాంప్రదాయాలు కలిగిన సమూహం కనుక వాళ్ళను విడిగా పరిగణించి ప్రత్యేక
నియోజకవర్గాలు ఏర్పాటు చేయాలనేది అంబేడ్కర్ వాదన. బ్రిటీష్ ఇండియాలోని
ప్రతి ప్రత్యేక సమూహానికీ ప్రత్యేక నియోజకవర్గాలతో పాటు పూర్తిస్థాయి రాజకీయ భద్రతలు కల్పించాలని ముస్లిం లీగ్ నాయకులైన ముహమ్మద్ ఆలీ జిన్నా, ఆగా ఖాన్-3 తదితరులు కోరారు. అలా వాళ్ళు, రౌండ్ టేబుల్ సమావేశంలో శిక్కు, క్రైస్తవ సమూహాలతోపాటు అణగారినవర్గాలకు పూర్తి అనుకూలంగా వ్యవహరించారు.
ముస్లిం క్రైస్తవ, శిక్కు, అణగారినవర్గాలు ఏకం కావడంతో గాంధీజీవాదం వీగిపోయింది. ముస్లిం లీగ్, అంబేడ్కర్ ల సంయుక్త వాదం బలాన్ని సాధించింది. అప్పటి బ్రిటీష్ ప్రధాని రామ్సే మెక్ డోనాల్డ్ అణగారినవర్గాలకు ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయిస్తూ 1932 ఆగస్టు 16న కమ్యూనల్ అవార్డును ప్రకటించాడు. చరిత్రలో బహుజన ఐక్యతకు ఇది తొలి విజయం!
అణగారినవర్గాలకు కమ్యూనల్ అవార్డు ఇవ్వడాన్ని
వ్యతిరేకిస్తూ గాంధీజీ ఆమరణ నిరాహార దీక్షకు పూనుకోవడంతో అంబేడ్కర్ వారితో పూనా ఒప్పందం చేసుకున్నారు. అలా, అణగారినవర్గాలకు 71 ప్రత్యేక నియోజకవర్గాలు రద్దు అయ్యాయి, 148 రిజర్వుడు నియోజకవర్గాలు వచ్చాయి. వీటి లాభనష్టాల మీద ఇప్పటికీ భిన్నమైన చర్చలు సాగుతూనే వున్నాయి.
కేబినెట్ మిశన్ ప్లాన్ – 1946 ప్రకారం రాజ్యాంగ సభను ఏర్పాటు చేస్తున్నపుడు ఒక విశేషం జరిగింది. ప్రాంతీయ శాసనసభల నుండి పరోక్ష ఎన్నికల ద్వార (ఇప్పటి రాజ్యసభ సభ్యుల్లా) రాజ్యాంగసభ సభ్యులు ఎన్నిక కావాలి. షెడ్యూల్ కాస్ట్స్ ఫెడరేషన్ సభ్యుడిగా అంబేడ్కర్ 1946 జులైలో బాంబే ప్రెసిడెన్సీ నుండి పోటీ చేశారు. కాంగ్రెస్, కమ్యూనిస్టుల మద్దతున్న మరో షెడ్యూల్డ్ కాస్ట్ సభ్యుడు ఎన్ ఎస్. కజ్రోల్కర్ చేతుల్లో ఓడిపోయారు. రాజ్యాంగసభలో తాను వుండితీరాలని ఎన్నో ఆశలు పెట్టుకున్న అంబేడ్కర్ కు నిరాశే ఎదురయింది. ఆ సమయంలో ముస్లిం లీగ్ ముందుకు వచ్చి పక్షం రోజుల్లోనే తమకు బలం వున్న తూర్పు బెంగాల్ అసెంబ్లీ నుండి అంబేడ్కర్ ను గెలిపించి రాజ్యాంగ సభకు పంపించింది. ఇందులో ముస్లిం లీగ్ స్వార్ధం కూడ వుండొచ్చు. అణగారిన కులాల పక్షపాతి అయిన అంబేడ్కర్ రాజ్యాంగ సభలో వుంటే ముస్లిం మైనారిటీల రాజకీయ, సామాజిక భద్రతల కోసం కృషిచేస్తారని జిన్నా తదితరులు ఆశించి వుండవచ్చు. కానీ, అలా జరగలేదు. కొత్త రాజ్యాంగం వచ్చాక భారత ముస్లింలకు గతంలో వుండిన ప్రత్యేక
నియోజకవర్గాలు మిగలలేదు; కొత్త రిజర్వుడు స్థానాలూ రాలేదు. ఇతర ఉద్దీపన చర్యలూ దక్కలేదు. తూర్పు బెంగాల్ లో తాను గెలిచిన స్థానాన్ని అంబేడ్కర్ కోసం రాజీనామా చేసి తప్పుకున్న
ముస్లిం లీగ్ నాయకుడు జోగిందర్ నాథ్ మండల్. ఆయన తరువాతి కాలంలో పాకిస్తాన్ తొలి న్యాయ, కార్మిక
శాఖల మంత్రిగా పనిచేశారు.
తాము పరాజితులమని భారత ముస్లిం సమాజానికి 1857
పోరాటం తరువాత స్పష్టంగానే అర్ధం అయింది. బ్రిటీష్ పాలకులు ముస్లీంల్ను నమ్మేవారుకాదు. వాళ్ళను అనుమానిస్తూనే
వుండేవారు. స్వాతంత్ర్యానంతరం కూడ పరిస్థితి మారలేదు. మీ దేవుడ్ని మీరు కొలుచుకోవచ్చు, నమాజులు చేసుకోవచ్చు తప్ప ప్రభుత్వం నుండి ప్రోత్సాహకాలు, ఉద్దీపన చర్యలు మాత్రం ఆశించవద్దనే
సంకేతాలనే అన్ని ప్రభుత్వాలు అన్ని పార్టీలు ఇస్తూవచ్చాయి.
ఈమాటల్ని కాంగ్రెస్ పైకి చెప్పేదికాదు;
సంఘపరివారం పైకి చెప్పేది. అంతే తేడ.
తెలంగాణ రైతాంగ పోరాటానికి కామ్రేడ్స్ అసోసియేషన్ ఒక మేధో సరోవరంగా పనిచేసింది. రాజ్ బహద్దూర్ గౌర్ వంటి ఇద్దరు ముగ్గురు తప్ప ఆ సంస్థలోని వాళ్ళందరూ ముస్లింలే. తెలంగాణ పోరాటంలో మొదటి అమరుడు బందగి; చివరి అమరుడు షోయబుల్లా ఖాన్. ఇది చరిత్రేకదా? 1977 ప్రాంతంలో నక్సలైట్ ఉద్యమంలో కొండపల్లి సీతారామయ్యకన్నా ఎస్ ఏ రవూఫ్ కేడర్ కు చాలా ఆకర్షణ గల నాయకుడు.
మరోవైపు, కమ్యూనిస్టు పార్టీల తీరు ముస్లింలకు మరీ ఇబ్బందిగా మారింది. మార్క్స్ నుండి మతం మత్తుమందు అనే మాటనే తీసుకున్నారుగానీ
వర్గ సమాజంలో మత ఆవశ్యకతను గురించి ఆయన అన్న మాటల్ని పట్టించుకోలేదు. కమ్యూనిస్టు పార్టీల
నాయకులు నాస్తికత్వానికి
ఎక్కువ మార్క్సిజానికి
తక్కువగా వ్యవహరించడం
మొదలెట్టారు. భారత కమ్యూనిస్టు పార్టీని ముస్లిం హజ్రత్ లు, మౌల్వీలు మొదలెట్టారన్న వాస్తవాన్ని సహితం వాళ్ళు మరచిపోయారు. బయట చెప్పుల స్టాండ్ దగ్గర మతాన్ని వదిలిపెట్టి
పార్టీ ఆఫీసుల్లోనికి
రావాలని ఆదేశించడం
మొదలెట్టారు. బయట సంఘపరివారం ముస్లీంలను
అంతర్గత ముప్పుగా ఎలాగూ ప్రకటించేసింది. ఇటు, కమ్యూనిస్టు పార్టీలు మతాన్ని వదులుకోమంటుంటే
ముస్లింలు ఏం చేయాలీ? ముస్లిం ఉనికిని కూడ మిగలనివ్వరా? కమ్యూనిస్టు
నాయకులు చనిపోతే ఖననం చేస్తారా? దహనం చేస్తారా? ఒకవైపు, పార్టీ ఆఫీసులకు ముస్లింలుగా రావద్దు అంటూనే మరోవైపు ముస్లింలు సామాజిక
ఉద్యమాల్లోనికి రారు అని నిందించడం ఎంతవరకు సమంజసం. వేడి పాలతో మూతి కాల్చుకున్నవారు మజ్జిగను కూడ ఊదిఊది తాగుతారు. కపట రాజకీయ రంగం ముస్లింలను అలా భయపెట్టేసింది.
నిరంకుశ పోకడలు పోయే ప్రభుత్వాన్ని ఫాసిస్టు అంటాం. ఫాసిజం అప్రతిహత శక్తి ఏమీ కాదు దానిని ఓడించవచ్చు అని ప్రపంచానికి తొలిసారి చాటి
చెప్పింది ఎవరూ? ఇటలీ మొస్సోలినీ ఫాసిజానికి మొదటి దెబ్బ కొట్టింది
ఉత్తర ఆఫ్రీకాలోని
లిబియాలో 1942లో జరిగిన ఎల్ ఆలమెయిన్ యుధ్ధంలో కాదా? వాళ్ళు గెడ్డాలు, టోపీలు పెట్టుకునే ఫాసిస్టు సైన్యాలను ఎదుర్కోన్నారు.
వాళ్ళ ప్రేరణతోనే
రెండవ ప్రపంచ యుధ్ధంలో మిత్రపక్షాలు
ధైర్యాన్ని నింపుకునాయి.
కార్పొరేట్ మతతత్వ నిరంకుశత్వాన్ని (Corporate Communal Dictatorship)ను దేశ రాజధాని నగరంలో దిగ్బంధం చేయవచ్చని
ఎవరు నేర్పారూ? ఒంటినిండా బుర్ఖాలు కప్పుకున్న ముస్లిం మహిళలు కాదా? వాళ్ళు చూపిన దారిలోనే ఢిల్లీ మహానగరంలో రైతుల ఆందోళన సాగింది.
శ్రీలంక, బంగ్లాదేశ్,
నేపాల్, ప్రాన్స్, లఢాఖ్ లో అకస్మిక నిరసనలు చెలరేగాక వీటి మీద ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి పెరిగింది. వీటిని అరబ్ తరహా అకస్మిక నిరసనలు (Arab style
spring protests) అంటారు. వీటి పుట్టినిల్లు కూడ ఒక చిన్న ముస్లిం దేశం. ఉత్తర ఆఫ్రికాలోని
టునీసియాలో 2010 డిసెంబరు 11న పోలీసుల హింసను భరించలేక ఒక హాకర్ నడిరోడ్డు మీద తనకు తాను నిప్పంటించుకున్నాడు.
అంతే, టునీషియా యువతరం రోడ్ల మీదకు వచ్చి ఆ దేశాధినేత గద్దె దిగే పారిపోయే వరకు దాదాపు నెలరోజులు నిరసనలు సాగించింది. మనమేమీ చేయలేం గానీ జెన్
– జీ అనగా కొత్తతరం రావలసిందే అనే మాట ఇప్పుడు చాలా చోట్ల వినిపిస్తోంది.
మార్క్సిస్టులు, అంబేడ్కరిస్టులు ఏకం కావాలనే కోరిక రెండు
మూడు దశాబ్దాలుగా వినిపిస్తోంది. దీనినే
లాల్ నీల్ మైత్రి అంటున్నారు. నేటి కార్పొరేట్ మతతత్వ నిరంకుశత్వానికి
ప్రధాన బాధితులు ముస్లింలు, ఆదివాసులు కదా? మరి వాళ్ళను కలుపుకోరా? ముస్లింలు,
ఆదివాసుల సంయుక్త రంగు ఆకుపచ్చ. దీనినే హర్యాలి అంటారు. హర్యాలి అంటే తమకు తెలీదని
కొందరు అంటున్నారు. నిజంగానే తెలియకపోతే ఎవరయిన్క తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. తెలుసుకోవాల్సిన
పని లేదు అనుకుంటేనే సమస్య.
కమరా అంటే ఉర్దూలో గది. ఈ పదం లాటిన్ లో కూడ వుంది. ఇందులో నుండే కెమేర అనే పదం పుట్టింది. రహాస్య
సమావేశాల్ని ‘ఇన్ కెమెరా మీటింగ్’ అనడం మనకు తెలుసు. ఒకే గదిలో సన్నిహితంగా
నివసించేవారిని స్పానిష్ లో కమరాడ అంటారు. అది ఫ్రెంచ్ లో కమరాడే అయ్యింది. తరువాత
ఇంగ్లీష్ లో కామ్రేడ్ అయ్యింది.
కమ్యూనిస్టుల సంస్కృతి పెరిగాక ఉద్యమ సహచరుల్ని కామ్రేడ్స్ అనే సాంప్రదాయం
మొదలయ్యింది. అలాగే అనేక భాషల నుండి లాల్ సలామ్, ఇంక్విలాబ్, జిందాబాద్ వంటి పదాలు
వచ్చాయి. ఆ క్రమంలోనే హర్యాలి వచ్చింది అనుకోవాలి.
హర్యాలీకి తెలుగులో కూడ పునాదులున్నాయి. ఆకులు పచ్చగా ఉండేందుకు
దోహదపడే పదార్ధం క్లోరోఫిల్. దానిని తెలుగులో
పత్రహరితం అంటారు. గ్రీన్ రివల్యూషన్ ను తెలుగులో హరిత విప్లవం అంటాము. ఆ హరితమే
హర్యాలి. ఇది ముస్లింలు, ఆదివాసుల ఉమ్మడి రంగు.
రంగుల గురించి తెలిసినవాళ్ళకు ఒక జ్ఞానం వుంటుంది.
లోకంలోని రంగులన్నింటికీ మూలం ఎరుపు, ఆకుపచ్చ, నీలం. వీటిని ఇంగ్లీషులో ఆర్-జి-బి
(RGB) అంటారు. ఈ మూడు రంగులతో కోటాను కోట్ల షేడ్లు సృష్టించవచ్చు. భారత సామాజిక
రంగంలోనూ ఎరుపు, ఆకుపచ్చ, నీలం కలిస్తే అద్భుతాలు జరుగుతాయి.
డానీ
సమాజ విశ్లేషకులు
ముస్లిం ఆలోచనాపరుల
వేదిక (MTF)
10-10-2025
No comments:
Post a Comment