Sunday, 16 August 2026

A New Voice is Rising - Neha Bora

 

కొత్త గొంతు లేచింది




కొత్త గొంతు లేచింది

 

 

ఢిల్లీ జంతర్ మంతర్‌లో ఒక యువతి మైక్ పట్టుకుని మాట్లాడుతోంది.

మాటలు పెద్దగా లేవు.

మైక్ శబ్దం పెద్దగా లేదు.

వెనక వేల కోట్ల ప్రభుత్వ బడ్జెట్ లేదు.

భారీ పార్టీ యంత్రాంగం లేదు.

కానీ… ఆ కంఠంలో అధికార పీఠానికి తెగ ఇబ్బంది కలిగించేంత పదును ఉంది.

 

 

ఆమె పేరు — నేహా బోరా.

ఉత్తరాఖండ్ నుంచి వచ్చిన యువతి.

జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో PhD పరిశోధకురాలు.

థియేటర్ ఆర్టిస్ట్.

AISA జాతీయ అధ్యక్షురాలు.

ఇది సిపిఐ ఎంఎల్ లిబరేషన్ గ్రూపు అనుబంధ విద్యార్ధి  సంస్థ.

ఆ పార్టీ నాయకుడు దీపాంకర్ భట్టాచార్య.

 

NEET-UG పరీక్షా పేపర్ల లీకేజి దేశ విద్యార్ధి లోకాన్ని కుదిపేసింది.

విద్యా రంగంలో ప్రభుత్వ  జవాబుదారీతనం కోసం ఢిల్లీ జంతర్ మంతర్‌లో జరిగిన జూలై ఉద్యమంలో ఆమె 23 రోజుల నిరాహార దీక్ష చేసింది.

 

 

జులై మాసం అనేకమార్లు ప్రపంచానికి గొప్ప ఉత్తేజాన్ని ఇచ్చింది.

అమెరికా స్వాతంత్ర్యం

అల్లూరి పుట్టిన రోజు

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఆరంభ మయిన రోజు.

ఇంకా ఇంకా ఇంకా

ఇప్పుడు భారత గడ్డ మీద జెన్ జీ ఉద్యమం.

దశాబ్దంన్నర కాలంగా మనల్ని వణికిస్తున్న భయాన్ని కాలిగోటితో తన్నిన ఉద్యమం.

 

 

23 రోజులు!

అది కేవలం ఆకలి మీద పోరాటం కాదు.

అది ఒక ప్రశ్న.

“విద్యార్థి భవిష్యత్తు ఎవరి బాధ్యత?”

ఇదే ప్రశ్న మనం కూడా అడగాలి.

యువతరం భవిష్యత్తు ఎవరి బాధ్యత.

ఎందుకంటే పేపర్ లీక్ అనేది కేవలం ఒక పరీక్ష సమస్య కాదు.

ఒక యువకుడి సంవత్సరాల కష్టం ఒక్క రాత్రిలో వృథా అయితే…

అది విద్యా వ్యవస్థ వైఫల్యమా?

లేక పాలనా వ్యవస్థ వైఫల్యమా?

అదే మన Central Question.

 

 

నేహా బోరా ఒక వ్యక్తి మాత్రమేనా?

లేక కొత్తతరం వినిపిస్తున్న కొత్త రాజకీయ గొంతా?

మన రాజకీయ వ్యవస్థలో ఒక విచిత్రమైన అలవాటు ఉంది.

విద్యార్థి చదువుకుంటే — దేశ భవిష్యత్తు అంటారు.

విద్యార్థి ఉద్యోగం అడిగితే — యువశక్తి అంటారు.

కానీ అదే విద్యార్థి ఒక ప్రశ్న అడిగితే?

“ఎవరు పంపించారు?”

“ఎవరి కుట్ర?”

“ఎవరి ఏజెంట్?”

అంటూ ప్రశ్నించే గొంతు మీద నైతిక దాడి మొదలవుతుంది.

 

 

జంతర్ మంతర్ ఉద్యమంలో నేహా బోరాకూ ఆ పరిస్థితే ఎదురైంది.

ఆమెతో పాటు AISAకు చెందిన మరో ఇద్దరు విద్యార్థి నాయకులు 23 రోజుల నిరాహార దీక్ష చేశారు.

ఉద్యమం ఉధృతానికి తల వంచి అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు.

“తమ పోరాటాలను తామే నడిపించగల” అనుభవాన్ని, ఆత్మవిశ్వాసాన్నీ యువతరానికి ఈ ఉద్యమం ఇచ్చిందని నేహా ప్రకటించింది.

 

 

ఇక్కడే అసలు కథ మొదలవుతుంది.

ఒక మంత్రి రాజీనామా చేయడం విజయమా?

లేక వ్యవస్థ మారడం విజయమా?

నేహా చెప్పిన రాజకీయ సందేశం రెండో దానివైపు ఉంది.

అంటే — వ్యక్తిని మార్చడం కాదు.

వ్యవస్థను మార్చడం.

 

 

నేహా బోరా కథలో అత్యంత ముఖ్యమైన అధ్యాయం — ఆ 23 రోజుల నిరాహార దీక్ష.

జూన్‌లో ప్రారంభమైన జంతర్ మంతర్ ఉద్యమం మొదట NEET-UG పరీక్షా వ్యవస్థలోని అవకతవకలు, పేపర్ లీక్ ఆరోపణలు, జవాబుదారీతనం వంటి అంశాల చుట్టూ తిరిగింది.

సోనమ్ వాంగ్‌చుక్ కూడా నిరాహార దీక్ష చేపట్టడంతో

విద్యార్ధుల ఉద్యమానికి  ఉపాధ్యాయుల తోడు దొరికింది.

ఇది మామూలు పరిణామం కాదు.

గ్రేట్ లీప్.

ఇది గుర్తుంచుకోవాలి.

 

 

నిరాహార దీక్ష అనేది Instagram reel కాదు.

శరీరాన్ని రాజకీయ వాదనగా మార్చే అత్యంత కఠినమైన పద్ధతి.

మహాత్మా గాంధీ నుంచి ప్రపంచంలోని అనేక ప్రజా ఉద్యమాల వరకు — fasting ఒక fighting రాజకీయ తిరస్కార భాషగా పనిచేసింది.

సింహాసనం కదిలింది. కంపించింది. తల వంచింది.

 

 

ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఉంది.

జంతర్ మంతర్ ఉద్యమం కేవలం ఒక పరీక్షా సమస్య దగ్గర ఆగిపోలేదు.

ఉద్యోగాలు…

విద్య…

పరీక్షా వ్యవస్థ…

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ…

విద్యా విధానం…

యువత భవిష్యత్తు…

ఇవన్నీ ఒకదానితో ఒకటి కలవడం మొదలయ్యాయి.

నేహా బోరా చెప్పిన ఒక ముఖ్యమైన ఆలోచన —

ఇది కేవలం ఒక మంత్రిని రాజీనామా చేయించడానికి చేసిన ఉద్యమం కాదు; విద్యా వ్యవస్థలో structural accountability కావాలన్న డిమాండ్.

 

విద్యార్ధులు రాజకీయాలు చేయకూడదు.

ఎవడ్రా ఆ మాట అన్నదీ?

విద్యార్ధుల జీవితాలతో రాజకీయాలు చేయవచ్చా?

ఏది చర్య? ఏది ప్రతి చర్య?

ఇప్పుడు నేహా బోరా ఒక కొత్త రాజకీయ శైలిని కూడా చూపిస్తోంది.

పాతకాలపు ఉద్యమాలు అంటే

బ్యానర్, నినాదం, మైక్, ఊరేగింపు.

 

 

మరి ఇప్పుడు?

Reel ఉంది.

Meme ఉంది.

Dark humour ఉంది.

Social media ఉంది.

అభిజిత్ దీప్కే యువతరాన్ని ఉత్తేజ పరిచాడు. ఉర్రూత లూగించాడు.

వరద వచ్చి నపుడు నీటిని వడిసి పట్టుకోవాలి.

నిర్మాణంలో ఆరితేరిన నేహా ఆ పని చేసింది.

ఆ ఉద్యమానికి sharpest voice గా మారింది.

ఇది చిన్న విషయం కాదు.

ఎందుకంటే Gen Z రాజకీయాన్ని కేవలం బహిరంగసభల్లో చేయదు.

ఫోన్‌లో చేస్తుంది.

కెమెరా ముందు చేస్తుంది.

మీమ్‌లో చేస్తుంది.

అవసరమైతే పాటలో చేస్తుంది.

ఇక్కడ పాతతరం రాజకీయ నాయకులకు ఒక చిన్న షాక్ ఉంటుంది.

“మేము చెప్పినట్టు ఉద్యమించండి” అంటే కొత్త తరం వినదు.

“మా భాషలో, మా పద్ధతిలో, మా సమస్యల మీద మాట్లాడతాం.”

ఇది రాజకీయ పార్టీలకు మాత్రమే కాదు.

ప్రధాన స్రవంతి మీడియాకూ ఒక హెచ్చరిక.

యువతను కేవలం “ఆకతాయిలు”గా చూపిస్తే…

వాళ్లు మీ camera బయట తమ camera పెట్టుకుంటారు.

ఇప్పుడు అసలు సంఘర్షణ ఇక్కడే ఉంది.

 

 

ఒక వైపు రాజ్యానికి అపారమైన శక్తి వుంది.

పోలీసు వ్యవస్థ.

చట్టాలు.

పరిపాలనా యంత్రాంగం.

మీడియా ప్రభావం.

కొండొకచో న్యాయస్థానాలు, న్యాయమూర్తులు!!

 

 

మరోవైపు?

కొంతమంది విద్యార్థులు.

కొంతమంది కార్యకర్తలు.

కొంతమంది పౌరులు.

అయితే ప్రజాస్వామ్యపు అసలు అందం ఏమిటంటే…

అధికారం సమానంగా ఉండకపోవచ్చు ;

ప్రశ్నించే హక్కు సమానంగా ఉండాలి.

ఇది ప్రజాస్వామ్య రాజ్యాంగపు మూల సూత్రం.

 

 

నేహా బోరా, అభిజీత్ దీప్కే, సోనమ్ వాంగ్‌చుక్ వంటి వ్యక్తులు వేర్వేరు రాజకీయ, సామాజిక నేపథ్యాల నుంచి వచ్చినా, జంతర్ మంతర్‌లో ఒక common public space ఏర్పడింది.

 

 

నేహా బోరాను మనం అభిమానించవచ్చు.

ఆమె రాజకీయ సిద్ధాంతంతో విభేదించవచ్చు.

ఆమె AISA జాతీయ అధ్యక్షురాలు.

ఆమె వామపక్ష రాజకీయాల్ని ప్రాతినిధ్యం వహిస్తోంది.

అది ఒక political position.

దానిని అంగీకరించాలా? వద్దా?

అది ప్రతి పౌరుడి స్వేచ్ఛ.

కానీ ఒక విషయాన్ని మాత్రం తిరస్కరించలేం.

కొత్తతరం ప్రశ్నిస్తున్నది.

ఆ ప్రశ్నలను సమాధానాలతో ఎదుర్కోవాలి.

లేబుళ్లతో కాదు.

 

 

ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ప్రతిసారీ గెలుస్తుందనే నియమం లేదు.

తప్పులు చేసే ప్రభుత్వాలు

ప్రజల్ని పట్టించుకోని ప్రభుత్వాలు

ఒక ఎన్నికల్లో కాకపోయినా ఇంకో ఎన్నికల్లో అయినా ఓడిపోతాయి.  

అలాంటి  నమ్మకాన్ని మనలో కల్పించిన వారిలో నేహా ఒకరు.

కొంచెం చరిత్ర తెలిసిన వాళ్లకు

నేహా అలనాటి కేరళ కున్నిక్కల్ అజితను గుర్తు చేస్తున్నది.

 

 

నేహా విజయవాడ వస్తున్నది.

ఆగస్టు 18 మంగళవారం ఉదయం 11 గంటలకు

హనుమంతరాయ గ్రంధాలయం గాంధీనగర్.

 

 

ముందు విజయవాడ ఆలోచిస్తుంది ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ ఆలోచిస్తుంది అనుకునే రోజులు వుండేవి.

ఇప్పుడు విజయవాడ చివరగా కూడ ఆలోచించడంలేదు.

 

 

ఒక్కసారి నేహాను చూసి విజయవాడ గత వైభవాన్ని గుర్తు చేసుకుందాం.

వీలైతే దాన్ని పునరుధ్ధరించడానికి ప్రయత్నిద్దాం.

17 ఆగస్టు 2026


No comments:

Post a Comment