Saturday, 15 August 2026

Communal Hormony is the need of the hour.

మతసామరస్యం — నేటి నినాదం

ఏ.ఎం. ఖాన్ యజ్దానీ — డానీ

సామాజిక విశ్లేషకుడు | సీనియర్ జర్నలిస్టు




 

దాదాపు ఐదు దశాబ్దాలుగా భారత సమాజాన్ని, రాజకీయాలను, ప్రజా జీవితాన్ని గమనిస్తూ, విశ్లేషిస్తూ, జర్నలిజంలో నా వంతు పాత్ర పోషిస్తున్నాను. వీలు కుదిరినప్పుడల్లా సోషల్ యాక్టివిస్టుగా కూడా పనిచేస్తున్నాను.

 

ఆగస్టు 15, త్రివర్ణ పతాకం, భారత రాజ్యాంగం — ఇవి మూడూ  భారత గడ్డపై పుట్టి, పెరిగిన ప్రతి ఒక్కరికీ అత్యంత గౌరవనీయమైనవి. త్రివర్ణ పతాకం గురించి ఈ మధ్యకాలంలో కొత్త కొత్త అర్థాలు చెబుతున్నారు. కానీ అది భారతదేశపు బహుళత్వానికి, సాంస్కృతిక సమైక్యతకు, ప్రజల ఆకాంక్షలకు ప్రతీక. కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో పాటు అశోకచక్రం మన జాతీయ పతాకానికి మత సామరస్య విలువల్ని అద్దుతాయి.

 

ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, మత సామరస్యం — ఇవి నా ఆలోచనా విధానానికి ప్రాథమిక విలువలు.

 

భారత స్వాతంత్ర్యానికి 79 సంవత్సరాలు పూర్తయి, 80వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంలో, నా జర్నలిజం, నా సామాజిక ఆలోచన, నా రాజకీయ వైఖరికి సంబంధించిన కొన్ని విషయాలను  మిత్రులు, అభిమానులతో పంచుకోవాలనుకుంటున్నాను.

 

నా మొదటి నమ్మకం — మత సామరస్యం. భారతదేశం అనేక మతాలు, భాషలు, కులాలు, ప్రాంతాలు, సంస్కృతులతో కూడిన దేశం ఈ వైవిధ్యమే భారతదేశానికి బలం అని నమ్ముతాను. అన్ని మతాల మధ్య సామరస్యాన్ని, పరస్పర గౌరవాన్ని, సోదరభావాన్ని పెంపొందించడం మనందరికీ  ముఖ్యమైన సామాజిక బాధ్యత. ప్రస్తుత పరిస్థితుల్లో హిందూ–ముస్లిం సామరస్యం మరెంతో అవసరం.

 

గతంలో సమాజ విశ్లేషకులు ప్రధానంగా కుల వైరుధ్యాలను పరిశీలించేవారు. ఆ తరువాత ధనిక –పేద వర్గాల మధ్య వైరుధ్యాలను విశ్లేషించే సంప్రదాయం బలపడింది. అవి వేర్వేరు చారిత్రక దశలు. కానీ ఈ రోజు పరిస్థితి మరింత సంక్లిష్టంగా ఉంది. రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక రంగాలపై మతం ప్రభావం విస్తరిస్తోంది. అందుకే నేటి సమాజ విశ్లేషకులు మత వైరుధ్యాలను ముందుగా పరిశీలించాల్సిన అవసరం ఏర్పడింది.  

 

ఏ మతాన్నీ మరో మతానికి వ్యతిరేకంగా రాజకీయ ఆయుధంగా ఉపయోగించకూడదు అనేది నా ప్రగాఢ నమ్మకం. మతం పేరుతో ప్రజల్లో భయం, ద్వేషం, అనుమానం, శత్రుత్వాలను సృష్టించడం భారతదేశ ప్రయోజనాలకు విరుద్ధం. మతం మనుషులను విభజించడానికి కాకుండా  మనుషుల్ని కలపడానికి వారధిగా ఉండాలి.

 

మతాల మధ్య ఐక్యతకు సంబంధించిన అంశాలూ ఉంటాయి; ఘర్షణకు దారితీసే అంశాలూ ఉంటాయి. తీవ్ర ఘర్షణకు దారితీసే అంశాలను పూర్తిగా పక్కన పెట్టాలి. తక్కువ ఘర్షణగల అంశాలను సంస్కరించుకోవాలి. ఐక్యతకు దోహదపడే అంశాలను గుర్తించి, వాటిని మరింత పెంపొందించుకోవాలి. ఇదొక్కటే మత సామరస్యానికి ఆచరణాత్మక మార్గం.

 

మతాన్ని అడ్డుపెట్టుకుని ప్రజల్ని విభజించే రాజకీయాలను తీవ్రంగా వ్యతిరేకించాలి. ప్రత్యేకంగా RSS, VHP, బజరంగ్‌దళ్ వంటి సంస్థల విభజనాత్మక, విద్వేషపూరిత రాజకీయ విధానాలను నేను తీవ్రంగా వ్యతిరేకిస్తాను.

 

ఆ సంస్థల భావజాలానికి రాజకీయ ప్రతినిధిగా వుంటున్న BJP అనుసరించే విధానాలు, భారత రాజ్యాంగం, సామాజిక న్యాయం, మత సామరస్యం, మైనారిటీల హక్కులకు విరుద్ధంగా ఉంటున్నాయన్నది నా అవగాహన. వాటిని బాహాటంగా విమర్శిస్తాను. విమర్శించాలి కూడ.

 

అదే విధంగా నరేంద్ర మోదీ, అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ వంటి BJP నాయకుల విధానాలను, నిర్ణయాలను కూడా నేను విమర్శనాత్మకంగా పరిశీలిస్తాను.

 

నా విమర్శ వారి వ్యక్తిగత మత విశ్వాసాలపై కాదు. వారి రాజకీయ ఆలోచనలు, సామాజిక విధానాలు, ప్రభుత్వ నిర్ణయాలు, ప్రజా జీవితంపై వాటి ప్రభావం — ఇవే వారిపై నా విమర్శకు ప్రధాన కారణాలు.

 

అదే సమయంలో, పైకి కనిపించే రాజకీయ–సాంస్కృతిక దృశ్యం వెనుక ఉన్న ఆర్థిక ప్రయోజనాలను కూడా పరిశీలించాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. ప్రభుత్వానికి సన్నిహితంగా ఉండే కొన్ని కార్పొరేట్ వర్గాల ప్రయోజనాలు కూడా ఈ విద్వేష  రాజకీయ–సాంస్కృతిక పరిణామాల వెనుక పనిచేస్తున్నాయి. రాజకీయ అధికారాన్ని, ఆర్థిక అధికారాన్ని, భావజాల ఆధిపత్యాన్ని విడివిడిగా చూడలేం.

 

నా ఆలోచనా ప్రపంచం

నా సామాజిక, రాజకీయ ఆలోచనలపై కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్, వి.ఐ. లెనిన్, ఆంటోనియో గ్రాంసీల  ప్రభావం వుంది. ముఖ్యంగా, వర్గం, అధికారం, అణచివేత, దోపిడీ, భావజాలం, ఆర్థిక వ్యవస్థ–రాజకీయ వ్యవస్థల మధ్య సంబంధం వంటి అంశాలను అర్థం చేసుకోవడంలో మార్క్స్, ఎంగెల్స్, లెనిన్ ల ఆలోచనలు మనకు ఉపయోగపడతాయి. అలాగే, అధికారం కేవలం ప్రభుత్వ వ్యవస్థల్లోనే కాకుండా ప్రజల ఆలోచనల్లో, సామాజిక విలువల్లో, చివరకు ‘సాధారణ జ్ఞానం’గా ఎలా మారుతుందో అర్థం చేసుకోవడంలో గ్రాంసీ ఆలోచనలు ఎంతో ఉపయోగపడతాయి.

 

అయితే,  వీరెవరినీ నేను గుడ్డిగా అనుసరించను. ఏ సిద్ధాంతాన్నైనా సరే భారతదేశ వాస్తవ పరిస్థితులకు అన్వయించి, విమర్శనాత్మకంగా పరిశీలించాలి. సమాజం అనుక్షణం మారుతూ ఉంటుంది. ఇది తిరుగులేని సత్యం. అందుకే సమాజాన్ని అర్థం చేసుకోవడానికి మనం ఉపయోగించే పనిముట్లు కూడా నిరంతరం మారుతూ ఉండాలి.

 

Objective Conditions ను అర్థం చేసుకోలేనివారు ఎంతటి Subjective Efforts పెట్టినా ఆశించిన ఫలితాలు ఎప్పటికీ రావు.

నేను ప్రతిక్షణం ఒక సామ్యవాద సమాజం కోసం కలలు కంటూ ఉంటాను. తెలిసో తెలియకో ఆ కలలను చిదిమేసే వారిని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తాను.

 

కాంగ్రెస్‌పై నా వైఖరి

నా రాజకీయ వైఖరిలో మరో విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం వుంది. నేను భారత జాతీయ కాంగ్రెస్‌కు సిద్ధాంతపరమైన మద్దతుదారుడిని ఏమీ కాదు. అయితే రాజకీయాలు కేవలం సిద్ధాంతాలతోనే నడవవు. కొన్ని సందర్భాల్లో రాజకీయ వ్యూహం కూడా అవసరం. ప్రత్యేకించి RSS–BJP ఆధిపత్య భావజాలాన్ని ఎదుర్కోవాల్సిన ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి వ్యూహాలు మరీ అవసరం. RSS సిద్ధాంతాన్ని వ్యతిరేకించే, BJP రాజకీయాలను ప్రతిఘటించే వ్యక్తి, పార్టీ, సంస్థ, కూటమి ఏదైనా సరే  అవసరమైనప్పుడు వాటికి  వ్యూహాత్మకంగా మద్దతు ఇవ్వడానికి సిద్ధం. ఈ  విషయంలో నా వైఖరి చాలా స్పష్టం.

 

ప్రస్తుతం అధికారంలో ఉన్న NDA కూటమిని ఎదుర్కోవడానికి మరో బలమైన రాజకీయ కూటమి అవసరం. ప్రస్తుత విపక్షాల్లో కాంగ్రెస్ పార్టీనే అత్యంత బలమైన రాజకీయ శక్తి అని కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. కాంగ్రెస్, రాహుల్ గాంధీ లేకుండా NDAను ఓడించే స్థాయిలో ఒక బలమైన ప్రత్యామ్నాయ కూటమిని నిర్మించడం చాలా కష్టం అని నేను భావిస్తున్నాను. అందుకే ప్రస్తుత చారిత్రక సందర్భంలో రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం వ్యూహాత్మకంగా అనివార్యమనిపిస్తోంది. అంత మాత్రాన నేను కాంగ్రెస్‌కు శాశ్వత రాజకీయ విధేయుడిని అవుతానని కాదు. రాజకీయ వాస్తవాలు మారితే నా వైఖరి కూడా మారవచ్చు. వ్యూహాత్మక మద్దతు వేరు — సిద్ధాంతపరమైన మద్దతు వేరు.

 

నా జర్నలిజం

నేను జర్నలిస్టును. ఏ రాజకీయ పార్టీకి ప్రతినిధిని కాదు.

ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా ప్రధాన స్రవంతి మీడియాలో స్వతంత్ర జర్నలిజానికి స్థలం క్రమంగా తగ్గిపోతోంది. స్వతంత్ర మీడియా సంస్థలు లేకపోలేదు. కానీ అవి ప్రస్తుతం ప్రధాన స్రవంతిని అధిగమించే స్థాయిలో లేవు. ఇలాంటి పరిస్థితుల్లో స్వతంత్ర జర్నలిజం అవసరం మరింత పెరుగుతుంది.

 

నేను ఏ పార్టీకి, ఏ రాజకీయ శక్తికి మద్దతు ఇచ్చినా, అవసరమైనప్పుడు ఆ పార్టీని కూడా ప్రశ్నించే, విమర్శించే హక్కును నేను ఎప్పటికీ వదులుకోను.

 

నా జర్నలిజానికి నేను పెట్టుకున్న మార్గదర్శక సూత్రం: “News is sacred, views are free.” “వార్త పవిత్రమైనది — అభిప్రాయాలు స్వేచ్ఛాయుతమైనవి.” వాస్తవం వాస్తవంగానే ఉండాలి. అభిప్రాయాన్ని అభిప్రాయంగానే చెప్పాలి. వార్తను, వ్యాఖ్యానాన్ని కలిపివేసి ప్రజలను తప్పుదోవ పట్టించకూడదు. అధికారంలో ఎవరున్నా, అధికారాన్ని ప్రశ్నించడం జర్నలిస్టు బాధ్యత. ఏ సంస్థనైనా, ఏ నాయకుడినైనా విమర్శించేటప్పుడు వాస్తవాలు, ఆధారాలు, చరిత్ర, తర్కం ఆధారంగా మాట్లాడటం జర్నలిస్టుగా నా బాధ్యత. అదే నా నిబద్ధత.

 

నా చివరి మాట

నా రాజకీయ, సామాజిక ఆలోచనలకు ప్రాథమిక ఆధారం ఒక్కటే. భారతదేశం ప్రతి భారతీయుడిదీ. మతం, కులం, భాష, ప్రాంతం, లింగం లేదా సామాజిక నేపథ్యం ఏదైనా — ప్రతి పౌరుడికీ సమాన గౌరవం, సమాన హక్కులు, సమాన పౌరసత్వం ఉండాలి.

హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, నాస్తికులు — ఏ మతానికి చెందిన వారైనా, ఏ విశ్వాసాన్ని కలిగి ఉన్నా — అందరూ సమాన గౌరవంతో, స్వేచ్ఛతో జీవించగల భారతదేశాన్ని మనం నిర్మించాలి.

మత ద్వేషాన్ని, మెజారిటీ ఆధిపత్యాన్ని, సామాజిక విభజన రాజకీయాలను నేను వ్యతిరేకిస్తాను.

వాస్తవాలు మారితే నా రాజకీయ అంచనాలు కూడా మారవచ్చు. ఒక సందర్భంలో ఒక రాజకీయ శక్తికి వ్యూహాత్మకంగా మద్దతు ఇవ్వవచ్చు. మరో సందర్భంలో అదే శక్తిని విమర్శించనూవచ్చు. ఎందుకంటే —

 ఏ రాజకీయ పార్టీకీ సభ్యుడ్ని కాదు. విధేయుడిని అస్సలు కాదు. నా విధేయత భారత రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి, సామాజిక న్యాయానికి, మత సామరస్యానికి, భారత ప్రజలకు. అంతే!

 

(స్వతంత్ర భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా — ఇది నా ప్రకటన).


No comments:

Post a Comment