Transparency
ప్రభుత్వం పారదర్శకంగా వుండాల్సిన పనిలేదా?
డానీ
సమాజ విశ్లేషకులు
కొంతకాలంగా మనదేశంలో ప్రజాస్వామ్యానికీ
, పాలక స్వామ్యానికీ తేడాలేకుండా పోయింది. ప్రభుత్వం ప్రజలకు బాధ్యతగా వ్యవహరించాలనేదే
ప్రజాస్వామ్యంలో మొట్టమొదటి విలువ. దాన్ని తలకిందులు చేస్తూ ప్రజలు ప్రభుత్వానికి బాధ్యతగా
వుండాలని దబాయిస్తున్నారు. చాలామంది ఇది నిజమేనేమో అనుకుంటున్నారు. ఒళ్ళో మీడియా (దీనినే హిందీలో గోదీ మీడియా అంటున్నారు) రేయింక్బవళ్ళు
ఈ తప్పుడు విలువనే ప్రచారం చేస్తున్నది.
రాజధాని నగరం జంతర్ మంతర్ దగ్గర
తమకు జరిగిన అన్యాయానికి న్యాయం చేకూర్చాలని విద్యార్ధిలోకం నిరసనలకు దిగింది. నీట్
పేపర్లు లీక్ కావడం, పరీక్షలు రద్దు కావడం వారి ఆక్రోశానికి ప్రధాన కారణం. వారిలో నష్టపోయిన
బాధవుంది. దెబ్బతిన్న గాయం వుంది. ప్రభుత్వ
అసమర్ధత మీద అసహనం వుంది. ముందే కొందరు విద్యార్ధులు చనిపోయారు. అడగడానికి వచ్చిన వారిలోనూ
కొందర్ని పోలీసులు పొట్టనపెట్టుకున్నారు. క్రూరంగా లాఠీచార్జి చేశారు. దాన్ని లాఠీ
చార్జి అని సరళంగా అనడమూ తప్పే. లాఠీల్లో ఇనుప మేకులు దించి వాటితో విద్యార్ధుల మీద
డాడి చేశారు. తుపాకులతో పిల్లెట్లు పేల్చారు. విద్యార్ధినులతో వ్యవహరించిన తీరైతే సభ్యసమాజం
తలలు వంచుకోవాల్సిందే. ఒక్క మాటలో జలియన్ వాలా బాగ్ నరమేధాన్ని గుర్తు చేశారు. బ్రిటీష్
వలస పాలకులు కూడా జలియన్ వాలా బాగ్ కాల్పులకు ఆదేశాలిచ్చిన డయ్యర్ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. ఈ కేసును
విచారించడానికి ఏర్పడిన లార్డ్ హంటర్ కమీషన్ డయ్యర్ చర్యల్ని మాహాపరాధంగా పేర్కొంది.
డయ్యర్ బ్రిగేడ్ కమాండర్ పదవి నుండితప్పించారు. జీతం తగ్గించారు. అతన్ని ఒక విధంగా
పదవీ విరమణ చేయించారు.
వలస పాలనలోనే అన్ని రకాల క్రమశిక్షణ
చర్యలు తీసుకుంటే స్వతంత్ర ప్రజాస్వామ్య భారత దేశంలో విద్యార్ధుల మీద అంతటి క్రౌర్యాన్ని ప్రదర్శించిన
ఢిల్లీ పోలీసుల మీద ఎంతటి తీవ్ర చర్యలు తీసుకోవాలీ? వీడియోలకు దొరికిపోయిన ఒకరిద్దర్ని
సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంటే సరిపోతుందా? ఢిల్లీ రాజధాని పోలీసులు నేరుగా కేంద్ర
హోంశాఖ ఆధీనంలో పని చేస్తారు. నీట్ ప్రశ్నాపత్డాల లీకేజికి నైతిక బాధ్యులు ధర్మేంద్ర
ప్రధాన్ అయితే, ఢిల్లీ పోలీసుల దౌర్జన్యాలకు నైతిక బాధ్యత దేశ హోంమంత్రి అమిత్ షాదే
అవుతుంది. ఆ విషయం అమిత్ షాకు తెలుసు. ప్రధాని నరేంద్ర మోదీజీకీ తెలుసు. వాళ్లు పార్లమెంటు
సమావేశాలకు రావడం మానేశారు. పార్లమెంటు భవనానికి
వస్తున్నారు, తమ ఛాంబర్లలో వుంటున్నారు. కానీ, సభలకు రావడంలేదు. దేశ రాజకీయాల్లో అరవీర
భయంకరుడు అని పేరుగాంచిన అమిత్ షా ఇప్పుడు భయపడుతున్నారు. ఇన్నాళ్ళూ అందర్నీ భయపెట్టిన
అమిత్ షా ఇప్పుడు తానే భయం రుచి చూస్తున్నారు.
ఇక్కడే ఒక కీలకమైన ప్రశ్న ముందుకు వస్తున్నది. సమావేశాల్లో ప్రతి రోజూ ప్రతి నిముషం సభలో ప్రధాని,
హోంమంత్రి వుండితీరాలనే నియమం ఏమీలేదు. ప్రతి ప్రశ్నకూ వాళ్ళే సమాధానం ఇవ్వాలనే నియమమూ
లేదు. అవన్నీ నిజమే. ఢిల్లీ పోలీసుల రాక్షస ప్రవర్తనకు హోం మంత్రికాకుండా ఇంకెవరు సమాధానం
చెప్పాలీ?
తమ వైఫల్యాలు బయటపడ్డప్పుడు మౌనంగా
వుండిపోవడం మోదీజీగారి నైజం. మణిపూర్ మండిపోతున్నపుడు వారు మాట్లాడలేదు. మహిళా రెజ్లర్లు
తమమీద లైంగిక దాడి జరిగిందని నిరసనలకు దిగినప్పుడూ వారు మాట్లాడలేదు. ఇలా అనేక సందర్భలున్నాయి.
నిజానికి నీట్ పేపర్ల లీక్ మీద కూడ వారు మాట్లాడలేదు. దాన్ని తట్టుకోలేక కొందరు విద్యార్ధులు
ఆత్మహత్యలు చేసుకున్నప్పుడూ వారు మాట్లాడలేదు.
చాలా సీరియస్ విషయాలను అర్ధరాత్రి
రీల్స్ చేసి పెట్టడం మోదీజీకి చిత్రమైన అలవాటు.
ఆ రీల్స్ లో వారు జంతర్ మంతర్ లో విద్యార్ధులు దారి తప్పారని చెప్పి బాధపడ్డారు. వారిలో
కొందరు బూతులు వాడారనీ ఆవేదన చెందారు. పెద్ద మనసు చేసుకుని వాళ్లను క్షమించేస్తున్నట్టు
ప్రకటించారు. ఆ రీల్స్ ఒక్కొక్కరికి ఒక్కోవిధంగా అర్ధం అయింది. చనిపోయిన పిల్లల తల్లిదండ్రులకు
ప్రధాని తమ పిల్లల్ని క్షమించడం ఏమిటో అర్ధం కాలేదు. బూతుల వ్యవహారమూ అంతే. నిరసన ప్రదర్శనల్లో
ఎంత కోపం వచ్చినా బూతులు వాడడం మంచిది కాదు. కానీ ఆ పిల్లలు ఆ బూతుల్ని అధికార పార్టీ
పెద్దల నుండే నేర్చుకున్నారంటే అతిశయోక్తికాదు. “కాంగ్రెస్ కి విధవా”, “పచాస్ కరోడ్ కి గర్ల్ ఫ్రెండ్”, “విపక్షాల మేజువాణి”
వంటి పదాలను వారే జాతిజనుల చెవుల్లో ఊదారు.
పౌరుడు
పారదర్శకంగా ఉండాలి… ప్రభుత్వం ఎందుకు కాదు? ప్రజాస్వామ్యంలో
మనిషి డేటాగా మారుతున్నప్పుడు,
అధికారానికి కూడా పారదర్శకత అవసరం కాదా? ఒకప్పుడు ప్రభుత్వం పౌరుడి ఇంటి తలుపు తట్టి అడిగేది—
“మీ పేరు ఏమిటి?”
“కుటుంబంలో ఎంతమంది?”
“ఏం పని చేస్తున్నారు?”
“ఎంత ఆదాయం?”
ఇప్పుడు ప్రభుత్వం అడగకుండానే మన గురించి ఎన్నో విషయాలు తెలుసుకునే స్థితికి వచ్చింది.
మన
పేరు, మన చిరునామా., మన మొబైల్ నంబర్., మన బ్యాంక్ ఖాతా , మన బయోమెట్రిక్ గుర్తింపు, మనకు అందుతున్న ప్రభుత్వ
పథకాలు, మన ప్రయాణాలు, మన డిజిటల్ లావాదేవీలు అన్నీ ప్రభుత్వానికి తెలుసు. కానీ, ప్రభుత్వ యంత్రాంగంలో
ఏం జరుగుతున్నదో ప్రభుత్వానికి తెలీదు. ప్రశ్నాపత్రాల
లీకులు జరిగినప్పుడేకాదు, జరిగిందని అందరికి తెలిశాక కూడ ప్రభుత్వానికి దానితో ఎలా
డీల్ చేయాలో కూడ తెలీదు. ఇదొక విచిత్ర స్థితి.
డిజిటల్ యుగంలో పౌరుడు కేవలం ఒక మనిషి కాదు. ఒక డేటా పాయింట్ కూడా. ఇది ఆధునిక పరిపాలనకు అవసరమైన పరిణామమే కావచ్చు. .
ప్రభుత్వం ప్రజల అవసరాలను తెలుసుకోవాలంటే
డేటా కావాలి. సంక్షేమ పథకాలు సరిగ్గా చేరాలంటే సమాచారం కావాలి. జనగణన, ఆరోగ్యం, విద్య, ఉపాధి, పేదరికం—ఏ విధానాన్ని రూపొందించాలన్నా
నమ్మదగిన గణాంకాలు అవసరం.
కానీ
ఇక్కడ ఒక ప్రశ్న మొదలవుతుంది. ప్రభుత్వానికి పౌరుడి గురించి ఇంత సమాచారం అవసరమైతే; పౌరుడికి
ప్రభుత్వం గురించి ఎంత సమాచారం ఉండాలి? ఇదే ఈ కాలపు అసలు ప్రజాస్వామ్య ప్రశ్న.
ఎప్పుడువరు ఎవరితో ఏం మాట్లాడుతున్నారో
కూడా ప్రభుత్వానికి తెలిసిపోతుంది. పౌరుడు ఇప్పుడు
open book. మరి ప్రభుత్వం ఎందుకు
రహాస్య పుస్తకంగా వుంటోంది ?
పౌరుడిని ప్రభుత్వం పారదర్శకంగా ఉండమంటుంది. నీ ఆదాయం చెప్పు. నీ ఆస్తి చెప్పు. నీ చిరునామా చెప్పు. నీ గుర్తింపు నిరూపించు. నీ కుటుంబ వివరాలు ఇవ్వు. నీ బ్యాంక్ ఖాతా ఇవ్వు. అవసరమైతే నీ సామాజిక, ఆర్థిక స్థితి కూడా చెప్పు. పౌరుడు అన్నీ చెబుతాడు. కానీ ఒకరోజు అదే పౌరుడు ప్రభుత్వాన్ని అడుగుతాడు: “నా డేటా ఎక్కడుంది?” “ఎవరు చూస్తున్నారు?”“ఎందుకు చూస్తున్నారు?” “ఎంతకాలం ఉంచుతారు?” “ఎవరితో పంచుకుంటారు?” “తప్పు సమాచారం ఉంటే దాన్ని ఎలా సరిచేసుకోవాలి?” ఇక్కడ సమాధానం స్పష్టంగా, సులభంగా, పౌరుడికి అర్థమయ్యే భాషలో ఉండాలి.
ఎందుకంటే Privacy అంటే
దొంగచాటు వ్య్వహారంకాదు. Privacy
అంటే వ్యక్తిగత స్వేచ్ఛ. రాజ్యాంగంలో పొందుపరచిన ప్రజాస్వామిక హక్కు. తప్పు చేయని మనిషికి కూడా గోప్యత అవసరమే. మొబైల్ ఫోన్ ఆఫ్ చేస్తే మనం నిజంగా offline అవుతామా? ఇక్కడే డిజిటల్ యుగం మనకు మరో విచిత్రమైన ప్రశ్నను ఎదురుపెడుతోంది. మనం ప్రైవసీ కోసం మొబైల్ ఫోన్ను switch off చేస్తాం. అంటే అది పూర్తిగా చనిపోయిందని అనుకుంటాం. అది నిజం కాదు. ఫోన్ ను స్విచ్ ఆఫ్ చేశాక కూడ తెలుసుకోవాలనుకున్న
వారికి మన గురించి అన్నీ తెలిసే అవకాశాలు వున్నాయి.
“బిగ్ బ్రదర్ ఈజ్ వాచింగ్” అన్నాడు జార్జ్ ఆర్వెల్. నిజానికి 1950ల ఆరంభం నాటికి
ప్రపంచంలో సమాచార విప్లవం సంభవించలేదు. ఇప్పుడు అన్నీ సాధ్యమే. సమాచారం ప్రజల నుండి
ప్రభుత్వానికి వెళుతున్నదిగానీ, ప్రభుత్వం నుండి ప్రజలకు రావడంలేదు. అధికారంలోవున్న
ఎన్డీ కూటమికి నాయకత్వం వహిస్తున్న బిజెపి బ్యాంకు నిల్వ పది వేల కోట్ల రూపాయలని విపక్షాలు
ఆరోపిస్తున్న కాలం ఇది. బీఫ్ ఎగుమతిదారుల నుండి బిజెపి భారీగా పార్టీ ఫండ్ అందుకుందని చట్టసభల్లోనే విమర్శలు వస్తున్నాయి.
మన
మొబైల్ ఫోన్ ఎప్పుడు నిజంగా మనది కాదు. అది మన మీద ప్రభుత్వం నియమించిన వేగులు కూడా కావచ్చు.
కానీ, ప్రజలు ప్రభుత్వ విధానాలనూ నిర్ణయాలను తెలుసుకోవడం ఎలా? ప్రధాని ఎవరి లబ్దికోసం
ఏ దేశానికి వెళుతున్నారూ ప్రజలు తెలుసుకునే హక్కు వుందా? లేదా? ఎలా తెలుసుకోవాలీ? ఆ
సౌకర్యం వుందా? లేకపోతే దాన్ని ఎలా పొందాలీ?
ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకుంటున్నారా?
ప్రజలు తమను ఎన్నుకునేలా చేసే టెక్నాలజీని ప్రభుత్వం సమకూర్చుకుందా? ఈ ఒన్ వే ట్రాఫిక్కును
టూ-వే గా మార్చే మార్గాలేమిటీ? ప్రజాస్వామ్యం అంటే రెండు వైపులా నడిచే సమాచార
మార్గం. పౌరుడి నుంచి ప్రభుత్వానికి సమాచారం వెళ్లాలి. ప్రభుత్వం నుంచి పౌరుడికి జవాబు రావాలి. అప్పుడే ప్రజాస్వామ్యం
బతికినట్టవుతుంది.
11-08-2026

No comments:
Post a Comment