Impartial Judgement
నిష్పక్ష తీర్పు
- డానీ
కలియుగం కనుక ధర్మం ఒంటికాలి మీద సడుస్తోందట. ఈ మధ్య హైదరాబాద్లో రోడ్దుదాటుతుంటే ఓ కారుగుద్ది, ఆ ఒంటికాలు కూడా కుంటిదైపోయిందని చూసినవాళ్ళు చెపుతున్నారు. అయినా ధర్మం గురించి మహానగరాల్లో మాట్లాడుకోవడం సమంజసం కాదుకనుక మనం ఇతర విషయాల వైపు మళ్ళితే బాగుంటుంది.
ఆ మధ్య, ఆకలితో నకనకలాడిపోతున్న కుర్రాడొకడు ఆమీర్ పేట సెంటర్లో రోడ్దుపక్క పునుగులు తిని, డబ్బులు ఇవ్వకుండా పారిపొయాడు. సైబరాబాద్ ఒబేసిటీ రన్ లో పాల్గొని వస్తున్న మెరికల్లాంటి కార్పోరేట్ కాలేజీ కుర్రాళ్ళు ఓ నలుగురు అప్పుడే అక్కడికి చేరారు. వాళ్ళు, బహు సాహసోపేతంగా పరుగులు తీసి, ఆ పునుగుల దొంగను పట్టుకుని, నాలుగు తన్ని, ఈడ్చుకువచ్చి, పునుగుల బండివాడికి అప్పచెప్పారు.
అక్కడే ఓ విచిత్రం జరిగింది. పునుగుల బండివాడు ఆ పునుగుల దొంగను కసితీరా తంతాడనీ, ఆ తరువాత, తనివితీరా తిడతాడనీ, అందరూ అనుకున్నారు. కానీ, అతనా పని చెయ్యలేదు. పైగా, ఆ పునుగుల దొంగకు ఇంకో రెండు ప్లేట్లు పునుగులు ఇచ్చి, ఆకలితీరా తినమన్నాడు. ఐదేళ్ల క్రితం తను కూడా ఆకలితోనే మెదక్ జిల్లా నుండి ఇక్కడికి వచ్చి, అలా ఆమిర్ పేటలో స్థిరపడ్డానన్నాడు. పునుగుల దొంగ ఒప్పుకుంటే తన దగ్గర వంట అసిస్టెంటు అనబడే, ప్లేట్లు కడిగే ఉద్యోగం ఇస్తానన్నాడు. ఈ ప్రతిపాదన పునుగుల దొంగకు కూడా నచ్చింది. వెంటనే కొలువులో చేరిపోయాడు. వాళ్ళిద్దరూ ఆ గొడవని అలా శాంతియుతంగా పరిష్కారం చేసుకున్నారు.
స్కాములు, స్వాములూ, సానులు తప్ప మరోవార్త కవర్ చేయడానికి ఈమధ్య అంతగా అవకాశం దొరకని మీడియావాళ్ళు మొత్తం కట్టకట్టుకుని ఈ పునుగుల దొంగ మీద పడ్డారు. పునుగుల బండివాడి ఔదార్యాన్ని వంద కెమేరాలతో, రెండు వందల విశ్లేషణలతో ప్రసారం చేశారు
ఉదయం సెషన్ కూ మధ్యాహ్నం సెషన్ కూ మధ్య లంచ్ సమయంలో పేషీ టివీలో ’హల్లో డాక్టర్’ ప్రోగ్రాం చూస్తున్న హైకోర్టు న్యాయమూర్తులవారు ఒకరి దృష్టి ఆ బ్రేకింగ్ న్యూస్ మీద పడింది. పునుగుల దొంగ కథనం విని వారు వెంటనే స్పందించారు.
ధర్మం హైదరాబాద్ రోడ్ల మీద ఒంటికాలితో కుంటుతూ నడుస్తోందిగానీ, హైకోర్టు ఆవరణలో అది నాలుగు కాళ్లతో సంచరిస్తోంది. ధర్మాన్ని ఎవరు ఉల్లంఘించినా సరే వారికి శిక్షపడాల్సిందేనని భావించిన సదరు న్యాయమూర్తులంవారు, దొంగతనం చేసినందుకు పునుగుల దొంగ మీదా, ఒక దొంగకు ఆశ్రయం కల్పించినందుకు పునుగుల బండివాడి మీదా సూమోటోగా కేసులు నమోదు చేయాలని ఆమీర్ పేట పోలీసు స్టేషనుకు తాఖీదు పంపించారు
అలా మొదలైన ఆ కేసు చాలా వేగంగా ముందుకు కదిలి, హైకోర్టు ఫుల్ బెంచి ధర్మాసనం ముందు తీర్పు వరకు వచ్చేసింది. తీర్పు చెప్పే ముందు, ధర్మాసనంలోని న్యాయమూర్తులందరూ పునీతులవ్వాలనిన్నూ, ఆత్మప్రక్షాళన చేసుకోవాలనిన్నూ, నిష్పక్షపాతంగా తీర్పు చెప్పాలనిన్నూ ప్రధాన న్యాయమూర్తి ఆదేశించారు.
"ఈ యొక్క పునుగుల వ్యాపారంలో మీలో ఎవరికైనా, ఏ విధమైన ఆసక్తిగానీ వుందా?" అని ప్రధాన న్యాయమూర్తి అడిగారు.
"లేదు"
అని ధర్మాసనంలోని న్యాయమూర్తులందరూ ముక్తకంఠంతో చెప్పారు.
"మీలో ఎవరైనాగానీ, ప్రైమరీ మార్కెట్లోగానీ, సెకండరీ మార్కెట్లోగానీ, ఈ యొక్క పునుగుల బండిలో షేర్లు కొన్నారా?"
"లేదు. లేదు"
"ఈ పునుగుల బండివాడితోగానీ, ఆ పునుగుల దొంగతోగానీ, మీకెవరికైనా బంధుత్వాలుగానీ, స్నేహాలుగానీ, రాగద్వేషాలుగానీ వున్నాయా?"
"లేదు. లేదు. లేదు".
"మీలో ఎవరైనా ఎప్పుడయినా అటుగా వెళుతూ, ఆ ఆమీర్ పేట సెంటర్లో ఈ యొక్క పునుగుల బండి దగ్గర ఆగి, ఏవైనా తినడంగానీ, తాగడంగానీ చేశారా?"
"లేదు. లేదు. లేదు. లేదు".
ధర్మాసనంలోని న్యాయమూర్తుల సమాధానాలతో సంతృప్తి చెందిన ప్రధాన న్యాయమూర్తులవారు, వాళ్లను ఇక తీర్పు చెప్పాల్సిందిగా కోరారు.
అప్పుడు ఆ న్యాయమూర్తులందరూ ముక్తకంఠంతో పునుగుల బండివాడికీ, పునుగుల దొంగకూ చెరో ఆరేళ్ళ కఠినకారాగార శిక్షను విధించారు.
ఆ తరువాత, హైకోర్టు ఆవరణలో ధర్మం దర్జాగా వెయ్యి కాళ్లతో సంచరించడం మొదలెట్టింది.
(కక్షిదారులతో భావబంధాలున్న న్యాయమూర్తులు కేసుల్ని విచారించడం సమంజసం కాదన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మదన్ లోకూర్ గారికి అభినందనలతో)
హైదరాబాద్
11 - 12 - 2011
.
gud oneeee chala bavundi
ReplyDeleteమీ పొస్ట్ చూసి నాకో జరిగిన సంఘటనగుర్తుకొస్తుంది.ఓ గ్రామ ప్రాంతం నుంచి వచ్చినకుర్రవాడొకడు ముంబైలొ బండీపై కూరగాయలు అమ్ముకుంటుంటాడు.ఓ రోజు వాడికి వంద రూపాయల కాగితమున్న ఓ పర్సు దొరుకుతుంది. ఇంతలో అత్యుత్సాహవంతుదైన ఓ కానిస్టేబుల్ వచ్చి ఆ కుర్రవాణ్ణి అరెస్ట్ చేసి తీసుకెళ్ళి రిమాండ్ చేస్తారు. ఇక ఆ కేసు సంవత్సరం దాటినా వాయిదాలపై వాయిదాలు పదుటూనే ఉంటుంది,ఈలోగా నిందిటుడి తండ్రి కూడా చనిపోతాడు. ఒకటిన్నర సంవత్సరం తర్వాత కేసు లిస్టైన రోజు నిందితుణ్ణి కోర్టుకు తీసుకురాగా,అతణ్ణి రిమాండ్ చేసిన రోజు చూసిన ఓ అమ్మాయి వకీలు అతణ్ణి చూసి కేసు ఇంకా ముగియలేడని తెలుసుకుని, వెంటనే వకాల్తా పుచ్చుకుని జడ్జి గార్ని అదుగుతుంది అయ్యా! ఆ డొంగిలించబడిన నోటు నిందితుది దగ్గర దొరికిన నొటు ఒకటే అని ప్రాసికుషన్ వారేమైనా ఆధారాలు చూపించారా? లేదే. ఒకవేళ నేరం నిరూపించబడినా శిక్షా శ్మ్రుతి ప్రకారం శిక్ష ఒకటి లేదా రెందు నెలల కంటే ఎక్క్వ ఉండదు కదా, మరి నిందితుడు ఒకటిన్నర ఏళ్ళుగా రిమాండులొ ఉండడం ఎంతవరకు సమంజసం అని వాదిస్తుంది.ఆరొపి అయిన కుర్రవాడుమాత్రం. అయ్యా నేను నేరం ఒప్పుకుంటున్నను నాకేదొ శిక్ష వేసి వదిలెయ్యడి అని వేడుకుంటాడు. నేరానికి సరిపడ శిక్ష కంటే ఎక్కువ కాలం రిమాండులొ ఉన్నడని న్యాయమూర్తులవారు నిందితుణ్ణి వదిలేస్తారు. విచారణ/పరిశోధన్ పేరుతొ రిమాండ్ లో మగ్గుతున్న వాళ్ళు ఎందరో ఉన్నారు.ఇక విషయానికొస్తే ధర్మం ఎన్ని పాదాల మీద నడుస్తోందో గాలి బెయిల్ కేసులో తేటతెల్లమయ్యింది.
ReplyDeleteMeraj Fathima garoo! oka kathaku kavalasina dinusulu indulo pushklamgaa unnayi. kathagaa malacandi.
ReplyDelete