Sunday, 28 April 2013

Notes on Jagan Reddy's article on Sky Baba's 'Adhoore'


Notes On
స్కైబాబాఅధూరేపై సామిడి జగన్ రెడ్డి వ్యాసం


సామిడి జగన్ రెడ్డి వ్యాసం (తెలుగు కథపై సరికొత్త దస్తూరి, వివిధ, ఆంధ్రజ్యోతి, ఏప్రిల్  2013) లో, ముస్లిం సాహిత్యంలో ప్రాంతీయ విబేధాల ప్రస్తావన తెచ్చారు కనుక అభిప్రాయ బేధాలు ఎలాగూ వుంటాయి. వాటి విషయం విడిగా చర్చించాలనుకున్నా, వారి వ్యాసంలో వాస్తవ దోషాలు అనేకం వున్నాయి.

వ్యాసం మొదటి వాక్యంలోనే వారు ఎన్టీ‌ఆర్ పాలన, జగిత్యాల జైత్రయాత్రల ప్రస్తావన తెచ్చారు. జగిత్యాల జైత్రయాత్ర  1978  సెప్టెంబరు  న జరిగింది. ఎన్టీరామారావు  1983 జనవరి  9న ప్రమాణ స్వీకారం చేశారు. రెండు సంఘటనల మధ్య నాలుగున్నరేళ్ళ వ్యవధి వుంది. జగిత్యాల జైత్యయాత్ర మర్రి చెన్నారెడ్డి హయాంలో జరిగింది. ఆ తరువాత ఎన్టీరామారావు ’బహిరంగ విషాదం’గా పేర్కొన్న ఇంద్రవెల్లి కాల్పులు, 1981  ఏప్రిల్  20  న, జరిగాయి. అప్పుడు ముఖ్యమంత్రి టంగుటూరు అంజయ్య. ఇవన్నీ, ఇంటర్నెట్లో మౌసు క్లిక్కు దూరంలో అందుబాటులోవున్న విషయాలు. జగన్ రెడ్డిగారు మౌసును క్లిక్కుమనిపించలేదు.  తెలంగాణకు చెందిన మర్రి చెన్నా రెడ్డి, టంగుటూరి అంజయ్యలను  తప్పించి, ఆ తరువాత వచ్చిన ఆంధ్రా ప్రాంతపు ఎన్టీ‌ఆర్ మెడకు అతి తెలివిగా, ఈ పాపాలను  చుట్టేశారు. చరిత్రపై సామూహిక అత్యాచారం  జరపడం అంటే ఇదేనేమో!

తెలంగాణ కేంద్రంగా ముస్లిం సాహిత్య ఉద్యమం తలెత్తింది అంటూ సామిడి జగన్ రెడ్డి ఒక చారిత్రక  ప్రకటన చేశారు. దాన్ని నిరూపించే ప్రయత్నం  వారేమీ చేయలేదు. ఏ కాలంలో వచ్చిన ఏ సాహిత్య ప్రక్రియల ఆధారంగా వారు ఆ ప్రకటన చేశారో కూడా చెప్పలేదు.


సీమాంధ్రులు తమ మీద ఆధిపత్యాన్ని సాగిస్తున్నారనీ, తమ సంస్కృతిని చిన్న చూపు చూస్తున్నారని తెలంగాణ నాయకులు తరచుగా ఆరోపిస్తుంటారు. ముస్లింల విషయంలో ఇది అందుకు విరుధ్ధంగా వుంటుంది. నిజాం సంస్థానానికి చెందిన ముస్లింలు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ముస్లింలను చాలా చిన్నచూపు చూస్తూస్తుంటారు. సీమాంధ్రులు మాట్లాడే మొరటు  ఉర్దూ మీద, వాళ్ళ సాంస్కృతిక వ్యవహారాల మీద  నిజాం సంస్థానంలో అనేక జోకులు ప్రచారంలో వున్నాయి. తెలంగాణ ఉద్యమ అగ్రనేత కేసి‌ఆర్ సీమాంధ్రుల బిర్యాని గేదె పేడలా వుంటుందనడం దీనికి కోనసాగింపే. సీమాంధ్రుల వంటకాల్లో ఉలవచారు తనకు ఇష్టమని కేసి‌ఆర్ పేర్కోనడం ఇక్కడ విశేషం. సీమాంధ్ర ప్రాంతంలో  ఉలవచారు ముస్లింల వంటకంకాదు; ముస్లిమేతరుల వంటకం.

ఆవు చేల్లో మేస్తే దూడ గట్టుమీద మేయదుగా! కెసి‌ఆర్ ఇచ్చిన ప్రేరణతో తెలంగాణ ముస్లిం రచయితలూ సీమాంధ్ర ముస్లింల మీద సాంస్కృతిక దాడి సాగించారు. సీమాంధ్ర ముస్లీంలు తెలంగాణ ముస్లింలలా షేర్వాణి తోడుక్కోరనీ, గళ్ల లుంగీలు కట్టుకుని మసీదులకు వెళుతారనీ, బిర్యానీ వండుకోరనీ, పలావు వండుకుంటారనీ, అందులో సాంబారు వంటి ఒక పప్పు వంటకం చేసుకుంటారని వెటకారాలు పోయారు. షేర్వాణీ, బిర్యానీల ఆధారంగా రాష్ట్ర విభజన జరగాలని సైధ్ధాంతిక వ్యాసాలు రాశారు.  సైధ్ధాంతిక వ్యాసాలు రాశారు.

ఇంతకీ తెలంగాణ, సీమాంధ్ర ముస్లీంలలో పీడితులు ఎవరూ? పీడకులు ఎవరూ? దీనికి సమాధానం ఇవ్వకుండా ఎవరైనా ఇక ముందు ఈ అంశంపై వ్యాసాలు రాస్తే, వాళ్ళ చిత్తశుధ్ధిని శంకించాల్సి వుంటుంది. 

సామిడి జగన్ రెడ్డి మొత్తం వ్యాసంలో అధూరె లోని ఒక్క కథ పేరుగానీ, స్కైబాబా కథనశైలి గురించి ఒక్క వాక్యంగానీ, కథలకు ప్రాణప్రదమైన నాటకీయ నిర్మాణం గురించిన వివరణగానీ ఎక్కడా కనిపించదు. ఆమేరకు ఆయన స్కైబాబాకు ప్రాధమికంగా అన్యాయం చేశారు ఆ పుస్తకాన్ని అడ్డుపెట్టుకుని తనకు కిట్టనివాళ్ల మీద వెర్రిదాడి చేసి, వాళ్లను స్కైబాబాకు కొత్త ప్రత్యర్ధులుగా మార్చాడు. ఆమేరకు స్కైబాబాకు మరో అన్యాయం చేశారు.


స్కైబాబా కథలు అన్నీ కాకపోయినా  కొన్ని నేను చదివాను. సున్నితమైన అంశాల్ని, సుతారంగా రాయడంలో స్కైబాబాకు ప్రత్యేక ప్రతిభవుంది. ఆ పరంపరలో ఆయన రచనలు సాగిస్తే మరిన్ని విజయాలు తన ఖాతాలో వేసుకోగలడు.  అయితే, ఆ కథల్ని ముస్లింవాద కథలనో, తెలంగాణవాద కథలనో, రచయితో, సమీక్షకులో అనుకోవడంపట్ల నాకు సూత్రప్రాయంగా కొన్ని అభ్యంతరాలున్నాయి.

చాలామంది రచయితలు, విమర్శకులు తరచూ కథాంశానికీ, కథావస్తువుకూ, పాత్రలకు, ప్రాంతాలకు మధ్య గందరగోళానికి గురవుతుంటారు. ఒక రచనలోని, పాత్రలన్నీ హిందువులైనంత మాత్రాన దాన్నీ హిందూవాద (హిందూత్వ) సాహిత్యం అననట్టే, పాత్రలన్నీ ముస్లింలైనంత మాత్రాన దాన్ని ముస్లింవాద సాహిత్యం అనలేం. అలాగేపాత్రలన్నీ తెలంగాణవాళ్ళే అయినంత మాత్రాన దాన్ని తెలంగాణవాద సాహిత్యం అనలేం.  ‘వాదసాహిత్యం అంటే నిస్సందేహంగా పక్షపాత సాహిత్యమే. రచయిత ఒక సామాజికవర్గం పక్షాన నిలబడి, ఆ వర్గంపై ఇతరవర్గాలు సాగిస్తున్న పీడన, అణిచివేతల్ని ఖండిస్తాడు. వీలైతే విముక్తి మార్గాన్ని కూడా సూచిస్తాడు.  

వాద సాహిత్యం అన్నప్పుడు దానికి కొన్ని ప్రాధమిక షరతులు వుంటాయి.  ముస్లింవాద సాహిత్యం అన్నప్పుడు,  ముస్లింల మీద ముస్లిమేతరులు సాగిస్తున్న అణిచివేత కథావస్తువుగా ఉండితీరాలి. ఇది ప్రాధమిక షరతు. ముస్లింల మీద అణిచివేతను సాగించేవాళ్ళు సహజంగానే పెత్తందారీ కులాలవాళ్ళు అయ్యుంటారు. తెలంగాణవాద సాహిత్యం అన్నప్పుడు తెలంగాణ ప్రజల మీద తెలంగానేతరులు సాగిస్తున్న అణిచివేత కథావస్తువై వుండాలి. ఇది తెలంగాణవాద రచయితలకు ప్రాధమిక షరతు. స్కైబాబా వరకు ద్వితీయ షరతు, ఆయన ప్రాధమికంగా ముస్లింవాద రచయిత కనుక. అధూరె లోని కథల్లో రచయిత ఈ రెండు షరతుల్ని  పాటించాడో లేదో ముందు తేల్చి, దాన్నిబట్టి స్కైబాబాను ముస్లిం రచయితగానో, తెలంగాణ రచయితగానో నిర్ధారిస్తే బాగుండేది. అంతటి, శాస్త్రీయ వివేచన సామిడి జగన్ రెడ్డికి లేదు.

నిజాం సంస్థానానికి చెందిన ముస్లిం మేధావులు ముందు తమ ప్రాంత ప్రజలకు, ఆ తరువాత ఇతర ప్రపంచానికీ కొన్ని చారిత్రక వాస్తవాలని చెప్పాల్సివుంది. నిజాం సంస్థానంలో ముస్లింల మీద అణిచివేత ఎప్పుడు మొదలయిందీ? హిందూత్వ శక్తులతో కలిసి నిజాం వ్యతిరేక పోరాటం చేసిన ముస్లింలకు దక్కిందేమిటీ? సైనిక చర్య (పోలీస్ యాక్షన్) సమయంలో ముస్లింల పరిస్థితి ఏమిటీ? రాయలసీమ, కోస్తా ఆంధ్రా ప్రాంతపు ముస్లింల స్థితి గతుల్ని మీరు ఎలా అంచనా వేస్తున్నారూ? రెండు ప్రాంతాల పాలకవర్గాలు ఆధిపత్యం కోసం తలపడుతున్నప్పుడు రెండు ప్రాంతాల ప్రజలు ఏకమై అంతర్యుధ్ధాన్ని సాగించే అవకాశాన్ని మీరెప్పుడయినా పరిశీలించారా? తెలంగాణ ఉద్యమ నాయకులు భూలోక స్వర్గంగా పేర్కొనే హైదరాబాద్ స్టేట్లో  ముస్లింల పరిస్థితి ఏమిటీ? అప్పటి వరకు హైదరాబాద్ స్టేట్ లోని ముస్లింలపై అణిచివేతను ఎవరు సాగించారు? తెలంగాణ పెత్తందారీ కులాలావాళ్ళేనా? ఇప్పుడా పీడకులు మనసు మార్చుకుని దోపిడీని వదులుకున్నారా? తెలంగాణ ముస్లింలు తమ శత్రువుపై పొరాడాలా? తమ శత్రువు (యొక్క) శత్రువుపై పోరాడాలా?

April 2, 2013






No comments:

Post a Comment