Saturday, 27 April 2013

My Wife


Wife
(27 April 2013)

నా పరాజయాల్లో, పరాభవాల్లో
అనుక్షణం ఆమె నా పక్కనే ఉంది
నా ఆనందాల్లో, విజయోత్సాహాల్లో
నా పక్కన వుండే యోగ్యత ఆమెకే వుంది

నా భార్యను ద్వేషించడానికి నాకు నూరు కారణాలున్నాయి
నా భార్యను ప్రేమించడానికి నాకు నూటొక్క కారణాలున్నాయి

ముఫ్ఫయి యేళ్ళుగా మా మధ్య ఎడతెగని ఒక అపార్ధం కొనసాగుతోంది
తను నాకు సంరక్షురాలు అనుకుంటుంది, నేను తనకు సంరక్షకుడ్ని అనుకుంటాను



 love marriage కాదు  arranged marriage
మా ఇద్దరి ఫోటో చూసి చాలామంది ఫేస్ బుక్ ఫ్రెండ్స్ మాది ప్రేమ వివాహమా? అని అడుగుతున్నారు. కొందరు మా ఆవిడ బొట్టు గురించి కూడా అడుగుతున్నారు. మాది ప్రేమ వివాహంకాదు. కులాంతర, మతాంతర వివాహమేగానీ, అది పెద్దలు కుదిర్చిన పెళ్ళే. సరిగ్గా చెప్పాలంటే పార్టీ పెళ్ళి. నేను సున్నీ ముస్లిం పఠాన్, ఆమె హిందూ కమ్మ. అయితే మా పెళ్ళికి అవి ప్రాతిపదికలు కావు. సామ్యవాదం ఒక్కటే ప్రాతిపదిక.  
అప్పట్లో కమ్యూనిస్టు పార్టీల్లో ఒక సాంప్రదాయం వుండేది. తమ పిల్లల్ని పార్టీలో ఇవ్వాలనుకున్నవాళ్ళు ఆ విషయాన్ని పార్టీ నాయకత్వానికి తెలిపేవాళ్ళు. పార్టీలో ఎవరో ఒకరు ’పెళ్ళిళ్ల పేరయ్య’గా మారి సంబంధాలు కుదిర్చేవారు. అలా కుదిరిందే మా పెళ్ళి.
మా పెళ్ళి ప్రతిపాదన కొండపల్లి సీతారామయ్య స్థాయిలోనే మొదలయ్యింది. నిమ్మలూరి భాస్కరరావు (అజ్ఞాత సూర్యుడు) ’పెళ్ళిళ్ల పేరయ్య’గా వ్యవహరించారు. ఆయనే మాకు పెళ్ళిచూపులు కూడా ఏర్పాటు చేశారు. పెళ్ళి నిర్ణయం తీసుకోవడానికి మా ఆవిడ కొంత సమయం తీసుకుందిగానీ, తన కూతుర్ని నాకు ఇవ్వాలని మా మావయ్య యేలూరి భీమయ్యగారు చాలా ఆసక్తి చూపించారు. అది వారి గొప్పతనం. 

  1983  ఏప్రిల్  27 న విజయవాడ ప్రెస్ క్లబ్ లో జరిగిన మా పెళ్ళికి చలసాని ప్రసాద్ పురోహితుడు. అప్పటి నిరాడంబర సాంప్రదాయం ప్రకారం నేను పెళ్ళికి కొత్త బట్టలు కూడా కుట్టించుకోలేదు. ఫోటోలు కూడా తీయించుకోలేదు. పెళ్లయిన ఏడాదిన్నర తరువాత మేమిద్దరం తొలిఫోటో తీయుంచుకున్నాము. అదే ఇది. 


No comments:

Post a Comment