శ్రీరామనవమి - పనస తొనలు
1961లో నేను నర్సాపురం టేలర్ హైస్కూలు బ్రాంచిలో ఐదవ తరగతి చదువుతున్నాను.
ఆరోజుతో వేసవి సెలవులు ఇచ్చేసేవారు కనుక విద్యార్ధులకు శ్రీరామనవమి అంటే చాలా ఇష్టం.
శ్రీరామనవమి రోజు ఉదయంతో మా సంవత్సరిక పరీక్షలు ముగిసేవి. స్కూల్లో వీడ్కోలు వేడుకలు,
శ్రీరామనవమి ఉత్సవం కలిపే జరుపుకునేవాళ్ళం. కొంతమంది అమ్మాయిలు ఇళ్ళ నుండి వడపప్పు
తెచ్చేవాళ్ళు. స్కూల్లో మేమే బెల్లం కొట్టి, మిరియాలు పొడిచేసి, పానకం చేసేవాళ్ళం.
మధుమాసంలోనే పనసపండ్లు వస్తాయి. మా క్లాస్ టీచరుకు నామీద సదభిప్రాయం వుండేది. నన్ను
స్టోరు రూములోనికి తీసుకెళ్ళి, ఓ పెద్ద పనసపండు, చిన్న గిన్నెలో మంచినూనె, ఓ కత్తి,
ఓ ఇత్తడి పళ్ళెం ఇచ్చింది. "ఒరే ఖానూ! ఆ పనస పండును జాగ్రత్తగా ఒలిచి తొనల్ని
ఆ పళ్ళెంలో వేయి" అని చెప్పి, గదికి గొళ్ళెం వేసి వెళ్ళిపోయింది.
అరచేతులకు నూనె రాసుకుని, కత్తికి నూనెపూసి, అంతపెద్ద పనసపండును కోయడం నాకు కుదరలేదు.
కత్తి నా అదుపులో వుండేదికాదు. నూనె జిడ్డుకు జారిపోయేది. దాదాపు సగం పనస తొనలు తెగిపోయాయి.
నిండుగావున్న పనస తొనల్ని పళ్ళెంలో వేశాను. తెగిపొయిన తొనల్ని చూస్తే టీచర్ తిడుతుందని
భయం వేసింది. వాటిని ఏం చేయాలో నాకు తెలియలేదు. కొన్ని నేను తినేశాను. స్టోర్ రూం కిటికీ
దగ్గరికి వచ్చి అడిగిన సహాధ్యాయులందరికీ తెగిన పనస తొనల్ని పంచేశాను.
టీచర్ వచ్చి పళ్ళెంలో తోనల్ని చూసి ఆశ్చర్యపోయింది. "ఇన్నేనా?" అని అడిగింది.
నేను మాట్లాడకుండా వుండిపొయాను.
బ్రాంచి స్కూల్లో నాకు అదే చివరి రోజు. మా టీచర్ కు నా మీద సదభిప్రాయం ఆరోజుతో
పొయిందేమో, నాకు తెలీదు.
ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజూ మా టీచర్ నాకు గుర్తుకు వస్తుంది!
సారీ టీచర్!!
No comments:
Post a Comment