Sunday, 28 April 2013

My Mother

My Mother
అమ్మీ

మా అమ్మీ వృధ్ధురాలైపోయిందనే విషయాన్ని రోజే గమనించాను.
పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు నన్ను శాసిస్తున్న ఏకైక వ్యక్తి మా అమ్మి.
మా అబ్బా నన్నెప్పుడూ శాసించలేదు. పైగా మా అమ్మీ నన్ను కొడుతుంటే, మూలన నిలబడి బాధపడేవారు.
మేమిద్దరం చాలాసార్లు ఘర్షణ పడ్డాం. వాదించుకున్నాం. ప్రతిసారీ చివరకు ఆమెదే పైచేయి. ఓటమిని సహించడం ఆమెకు ఎప్పుడూ  నచ్చదు.
నేను తప్పు చేసినప్పుడెల్లాచిన్నప్పుడూ కొట్టింది. పెద్దయ్యాక కొట్టిందిపెళ్ళయ్యాకా కొట్టిందినా పిల్లల ముందూ కొట్టింది.
మా నాన్న రంగు, మా అమ్మీ రంగు నా తమ్ముడూ, చెల్లెలుకు వచ్చాయిగానీ నాకు రాలేదు. నేను మా అమ్మీకి స్వంత కొడుకును కానేమో అనే అనుమానం చిన్నప్పుడు నాకు చాలా సార్లు వచ్చేది. ఇల్లు వదిలి పారిపోదామని కూడా కొన్నిసార్లు అనిపించింది. మాట అన్నప్పుడు మా అమ్మీ నన్ను ఇంకా కొట్టేది. ఒకసారి నా కణితి మీద బెల్టు దెబ్బను చూసిన మా ఫ్యామిలీ డాక్టరు మా అమ్మిని పిలిచి మందలించాడు. పెద్ద కొడుక్కి కుటుంబ భారాన్ని మోయాలనే బాధ్యత తెలియకపోతే ఎలా? అని అడిగింది డాక్టర్ని.
స్వతహాగా వస్తాద్ అయిన మా అబ్బా ప్రమాదావశాత్తు  మంచాన పడడంతో, కుటుంబ భారాన్ని మోసే సామర్ధ్యాన్ని నాకు కల్పించడానికి మా అమ్మీ నాకు అంతగా కఠిన శిక్షణ ఇచ్చిందని తెలియడానికి నాకు చాలా వయసే అవసరమయింది.
మా అమ్మ ఒడిలో పడుకుంటే చాలా ధైర్యంగా వుండేది. చిన్నప్పుడు, పెద్దయ్యాకేకాక, భవిష్యత్తు గురించి బెంగ వచ్చిన ప్రతి సందర్భంలోనూ నాకు అమ్మ ఒడి చాలా  ధైర్యాన్ని ఇచ్చేది. నాకు తెగింపు ఎక్కువని చాలామంది అంటుంటారు. దానికి కారణం మా అమ్మీయే.
మరుక్షణం ఎలా బతకాలో తెలియని రోజుల్ని మేము అనుభవించాము. దిక్కులేని బతుకు బతకడంకన్నా, నన్ను చంపి, నాతోపాటూ తనూ చనిపోవాలని  కూడా ఒక సందర్భంలో మా అమ్మ అనుకుంది. ఎందుకో అలా జరగలేదు.

మా అమ్మి ప్రస్తావన వచ్చినప్పుడెలా నాకు రెండు విషయాలు గుర్తుకు వస్తాయి. ”ఈరోజు మనం నిస్సహాయులుగా వున్నాం. కానీ, మనకూ మంచి రోజులు వస్తాయి. నిశ్శహాయుల్ని అల్లా తప్పక ఆదుకుంటాడు. మనం అప్పటి వరకు బతికుండాలిఅనేది. "మనం ఎప్పుడూ ఒకరి చెప్పులు నాకుతూ కుక్కల్లా బతక్కూడదు. పులిలా బతకాలి" అనేది.

మా అబ్బాకు నేను మంచి రోజుల్ని పూర్తిగా చూపెట్టలేక పోయాను. నాకు మంచి రోజులు వస్తున్న దశలో ఆయన చనిపోయారు. కానీ, మా అమ్మీకు నేను ఆమె కోరుకున్న మంచి రోజుల్ని చూపించాను.
కానీ, అమ్మీ రోజు సాయంత్రం హఠాత్తుగా నాతో వాదన చేయడం మానేసీ, నా పని అయిపోయిందిరా యజ్దానీ అనేసింది.
నా యాభై యేళ్ల ఆత్మ స్థైర్యం నీరుగారిపోయింది


మా అమ్మీ పత్యం
మా అమ్మికి ఇప్పుడు  83  సంవత్సరాలు. ఆహార నియమాలను తను చాలా కఠినంగా పాటిస్తుంది. వాటిల్లో కొన్ని నాకు అంత హేతుబద్దంగా కనిపించవు. అయినా ఆమె వాటిని చాలా  నిష్ఠగా  ఆచరిస్తుంది.
శీతాకాలంలో ఒక నెల రోజులపాటు పిట్టు తింటుంది. పచ్చి గంగరావి (పాడ్సీ పీపల్) ఆకు పొడి, బియ్యపురవ్వ, బెల్లం తురుము కలిపి ఆవిరి మీద కుడుములుగా చేస్తారు. తరువాత వాటిని పిసికి నెయ్యి కలుపుకుని తింటారు. పిట్టు హల్వాలా చాలా రుచిగా వుంటుంది. పిల్లలు ఎగబడి తింటారు. అయితే, పిట్టు పత్యం చేసేవాళ్ళు నెల రోజులు మరో ఆహారం ముట్టుకోరు.
నెల తరువాత భోజనం చేయవచ్చు. మాంసాహారంలో ఎండి మాంసం (కబాబ్), శాఖాహారంలో బీరకాయ మాత్రమే తింటారు. అన్నంగానీ పరోటాగానీ  తినవచ్చు. ఏదైనా నెయ్యి మాత్రమే వాడలి. ఇలా ఇంకోనెల గడపాలి. మూడో నెలలో పండ్లు పలహారాలు మొదలెట్టవచ్చు. పాలు తాగవచ్చు. కానీ పెరుగు నిషేధం. పులుపు పూర్తిగా నిషేధం.
నాలుగో నెలలో సాధారణ భోజనం మొదలుపెట్టవచ్చు.
సాధారణ రోజుల్లో మా అమ్మీ నెలకు పావుకిలో బాదం, పావుకిలో జీడిపప్పు, అరకిలో కిస్మిస్, అరకిలో ఎండు ఖర్జూరాలు, అరకిలో తేనే తింటుంది.
తనకు బీపీ, సుగర్, అల్సర్ లేవు. మాసం ముడుసులు నమిలేంత గట్టిగా పళ్ళున్నాయి. పైగా, ముడుసులు లేని మాంసం తను తినదు కూడా.  
ఆవిర్లు చిమ్ముతున్న భోజనం పెడితేనే తింటుంది. వండిన పావుగంట తరువాత వడ్డించినా చద్దిది అని పక్కకు గెంటేస్తుంది. ఫ్రిడ్జ్ లో పెట్టిన వంటకాలు శవంతో సమానం అంటుంది. హాట్ ప్యాక్ లో పెట్టినా తినదు. మధ్యాహ్నం తనకోసం ప్రత్యేకంగా ఇంటికి వచ్చి అన్నం వండి వడ్డించాలి. ఇందులో ఒక బోనస్ ఏమంటే తన కూర మాత్రం తనే వండుకుంటుంది.  

No comments:

Post a Comment