తెలుగు సినిమాల్లో
కథా దారిద్యం
ఉషా యస్ డానీ
తెలుగు సినిమాల మార్కెట్టు విస్తృతి, సాంకేతిక విలువలు పెరిగినట్టుగా కథా విలువలు పెరగలేదు. దానికి కారణం సినిమాలు తీసేవాళ్ళేననేది ఒక నింద అయితే, సినిమాలు చూసే ప్రేక్షకులేననేది మరో నింద. ఇలాంటి పరస్పర విరుధ్ధ నిందల మధ్య “ఒక హీరో, ఇద్దరు హీరోయిన్లు, ముగ్గురు కమేడియన్లు, నాలుగు ఫైట్లు, ఐదు ఫారిన్ లొకేషన్స్, ఆరు డ్యూయట్లు” అనేది తెలుగు సినిమా ఫార్మూలాగా స్థిరపడిపోయింది. “చూస్తున్నారు గాబట్టి తీస్తున్నాం” అని నిర్మాతలు తప్పించుకుంటుంటే “తీస్తున్నారు గాబట్టి చూస్తున్నాం” అని ప్రేక్షకులు సర్దుకుంటున్నారు. సత్యం బహుశ ఈ రెండింటి మధ్య వుండవచ్చు.
“చూస్తున్నారు గాబట్టి తీస్తున్నాం” అనడంలోనే ప్రేక్షకులు చూసిన సినిమానే మళ్ళీ మళ్ళీ తీస్తున్నారనే అర్ధం వుంది. ఒక పోలీసు కథ హిట్టు కాగానే, టాలివుడ్ లో ప్రతి హీరో ఖాకీ డ్రెస్సు వేసేస్తాడు! రెండు కుటుంబాలను కలిపే కథ ఒకటి హిట్టు కాగానే ఆ మూసలో పది సినిమాలు వచ్చేస్తాయి. ఇందులో మరీ దారుణం ఏమంటే అదే హీరోతో అదే కథ కొత్త సినిమాగా వచ్చేస్తోంది. ఆగర్భ శత్రువులైన రెండు కుటుంబాల మధ్య ప్రేమను నాటే కథలు షేక్స్ పియర్ రోమియో జూలియట్ కాలం నుండే వున్నాయి. ప్రస్తుతం టాలివుడ్ ఫార్మూలా ఈ మూసనే నమ్ముకుంది. ఫలితంగా ఒక హిట్టు పది ఫట్టులు వస్తున్నాయి. బృందావనం సినిమా నాలుగు డబ్బులు చేసుకుందని అదే యన్టీఆర్ తో రభస సినిమా తీస్తే ఏమవుతుందో్ ఇటీవల మనం చూశాం.
జీవితం (సమాజం) నుండి స్పూర్తి పొందాల్సిన కథను హిట్టయిన సినిమా నుండి స్పూర్తి పొందడానికి ప్రయత్నించడంలోనే మొదటి తప్పు వుంది. కొన్నేళ్ళ క్రితం ఒక సినిమాలో ఫస్ట్ హాఫ్ ను బ్రహ్మానందం మీద, సెకండ్ హాఫ్ ను యంఎస్ నారాయణ మీద నడిపి, హీరోను అనుసంధానకర్తగానూ, ఇద్దరు అమ్మాయిలతో డ్యూయట్లు పాడేవాడిగానూ మార్చారు. ఆ సినిమా పెద్ద హిట్టు అయింది. అంతే. ”బ్రహ్మానందం, యంఎస్ నారాయణ మరియూ ఒక హీరో’ అనే ఫార్మూలాలో పది సినిమాలు తయారయ్యాయి. బ్రహ్మానందం, ఆలీ, యంఎస్ నారాయణలలో ఎవరో ఒకరు లేకుండా సినిమా తీసే దమ్ము ఇప్పుడు టాలివుడ్ లో ఎంతమందికుందీ? మనం గమనించడం లేదుగానీ మన సినిమాలన్నీ’మల్టీస్టారర్” లే. వాటిల్లో కమేడీయన్లే అసలు హీరోలు.
సినిమా మాత్రమేకాదు, మొత్తం కళాసాహిత్యాల తక్షణ ప్రయోజనమే అలరించడం. వినోదం అంటే నవ్వించడం మాత్రమేకాదు; ఏడిపించడం కూడా!. ప్రేక్షకుల కన్నీళ్ళను ధియేటర్లలో జలపాతాల్లా ప్రవహింపచేసిన సినిమాలుlu సహితం sahitaMగొప్ప విజయాల్ని సాధించిన సందర్భాలు మనకున్నాయి. శ్రీరంజనీ, సావిత్రీ కాలం నుండి మాధవి నటించిన మాతృదేవోభవ వరకు ఇలాంటి ఉదాహరణలు అనేకం కనిపిస్తాయి. ఇప్పుడు వినోదం అంటే హాస్యమే అనే పాక్షిక, సంకుచిత అర్ధం స్థిరపడిపోయింది. అది వెకిలి హాస్యమైతే మరీ మంచిది అనుకుంటున్నారు సినీనిర్మాతలు.
టెలివిజన్ రంగంలో ప్రొడ్యూసర్ అంటే సృష్టికర్త అని అర్ధం. సినిమారంగంలో ప్రొడ్యూసర్ అంటే ఫైనాన్షియర్ అని అర్ధం. పూర్వపు రోజుల్లో విఖ్యాత దర్శకులు కేవీ రెడ్డి ఫైనాన్షియర్ ను ప్రొడ్యూసర్ అనవద్దని వాదించేవారట. వారి దృష్టిలో ప్రొడ్యూసర్ అంటే డైరెక్టరే. ప్రొడ్యూసర్ ఫైనాన్షియర్ అయినపుడు, అతను సురక్షిత మదుపు (సేఫ్ ఇన్వెస్ట్ మెంట్) గురించి ఆలోచిస్తాడు. ఆ క్రమంలో సకల కళల్ని డబ్బుతో కొలుస్తాడు. ఆ మేరకు అవి జీవాన్ని కోల్పోతాయి. జీవాన్ని కోల్పోయినదేదీ ఉద్వేగాన్ని సృజించదు. ఉద్వేగాన్ని సృజించే లక్షణం లేనిది కళకాదు.
అసలు ఏ ఉద్వేగమూ లేకుండా ఏ సినిమా అయినా ఎలా విజయవంతం అవుతుందీ? అనేది విలువైన సందేహమే. సినిమాను ఎంతో కొందమంది ప్రేక్షకులు చూడాలంటే అందులో ఏవో కొన్ని ఉద్వేగాలు ఏదో ఒక స్థాయిలో వుండి తీరాలి. ప్రస్తుతం టాలివుడ్ రెండు రకాల ఉద్వేగాల్ని నమ్ముకుని బండి నడిపేస్తోంది. ఇందులో మొదటిది హీరో ఇమేజి. రెండోది హాస్యనటులు. మొదట హాస్య నటులు, తరువాత హీరో అనుకున్నా తప్పుకాదు.
ఫైనాన్షియర్లు ఫలానా హీరో హీరోయిన్లతో సినిమా తీస్తున్నామని గొప్పగా ప్రకటిస్తారేతప్ప, ఫలానా కథను సినిమా తీస్తున్నామని ప్రకటించరు. చాలా అరుదుగా మాత్రమే హీరో, కథ రెండూ నప్పవచ్చు. అప్పుడు ఒక హిట్టు రావచ్చు. మిగిలినవన్నీ పరాజయం పాలయ్యేవే. ఫైనాన్షియర్లు అనుసరిస్తున్న సురక్షిత పెట్టుబడి విధానం ఏమేరకు సురక్షితమో నిజానికి ఎవ్వరూ చెప్పలేరు. చావు దెబ్బలు తింటున్నా తెలుగు సినిమారంగం మాత్రం పట్టు విడువక ఫైనాన్షియర్ల దృక్పథంలోనే నడుస్తున్నది.
తమ అభిమాన హీరోను తెర మీద చూడగానే ప్రేక్షకులు ఉద్వేగానికి గురవుతారు. హీరో హాస్యనటుల్ని ఆట పట్టించడం కూడా వాళ్ళకు చాలా వినోదాన్నిస్తుంది. ఇదే ఒక హీనమైన వినోదమైతే, హాస్యనటుల్ని తరచూ కొట్టడమే అభిమానులకు మరింత వినోదం అని నమ్మే దర్శకులు ఇప్పుడు ఎక్కువైపోయారు. హీరో చేతిలో ప్రతి సీన్లో దెబ్బలు తినేందుకే ప్రముఖ హాస్యనటులకు భారీ గౌరవవేతనం ఇస్తున్నారన్నా అతిశయోక్తికాదు. ఇలా సినిమా వ్యాపార వ్యూహం అంతా, మొత్తం ప్రేక్షకుల్ని అలరించేదిగా కాకుండా, కేవలం అభిమానుల్ని అలరించేదిగా కుచించుకుపోయింది.“చూస్తున్నారుగాబట్టి తీస్తున్నాం” అని నిర్మాతలు అంటున్నది ఈ అభిమానుల్ని దృష్టిలోపెట్టుకునే. దానితో ప్రేక్షకులు అంటే హీరో అభిమానులు అనే సంకుచిత అర్ధం స్థిరపడిపోయింది.
హీరోల అభిమానులుకాని తటస్థ ప్రేక్షకులూ వుంటారు. నిజానికీ వాళ్ళూ పెద్ద సంఖ్యలోనే వుంటారు. వాళ్లను అలరించే సినిమాలు క్రమంగా తగ్గిపోయాయి. దానితో, వాళ్ళూ క్రమంగా థియేటర్లకు వెళ్ళి సినిమాలు చూడడం తగ్గించేస్తున్నారు. ఎప్పుడయినా వాళ్లను ఆకర్షించే సినిమా ఏదైనా వచ్చినపుడో, కుటుంబ సభ్యులతో విహారానికి వెళ్ళాల్సిన సందర్భాల్లోనో మాత్రమే తటస్థ ప్రేక్షకులు థియేటర్లలో సినిమాలు చూస్తున్నారు. లేకపోతే, ఆర్నెల్ల తరువాత టీవీల్లో వచ్చే ఉచిత ప్రసారాల్ని ఇంట్లో కూర్చుని చూస్తున్నారు.
ఇళ్ళలో టివీలకు పరిమితమయ్యే తటస్థ ప్రేక్షకుల్ని సినిమా మార్కెట్ పరిథిలోనికి తీసుకు రావడానికి నిర్మాతలు ఇప్పుడు అనేక కొత్త వ్యూహాలు రచిస్తున్నారు. దృశ్య స్థాయినీ పెంచడం, సామాన్య జనం చూడాలని ఆశించే పర్యాటక ప్రాంతాల్లో షూటింగ్ జరపడం దగ్గర నుండి ఇంట్లో టీవీల్లో చూసే సినిమాలకూ ధర వసూలు చేసే వరకు అనేక వ్యూహాలు వున్నాయి.
పర్యాటక ప్రాంతాల్ని చూడలేనివాళ్ళు వెండితెర మీద వీటిని చూసి ఆనందిస్తారు. నాలుగు దశాబ్దాల క్రితం సినిమా పాటల్ని ఊటీ, బృందావనాల్లో తీసేవారు. హిమాలయాల్లో తీయడం దీనికి కొనసాగింపు. ఆ తరువాత సింగపూర్, మలేషియా వెళ్ళడం సాధారణ విషయంగా మారింది. ఇప్పుడు వెనిస్, ఇస్తాంబుల్ వంటి నగరాలకు వెళుతున్నారు. అక్కడి దృశ్యాల్ని సాధారణ ఇళ్లలో వుండే చిన్న టీవీల్లో చూసి ఆస్వాదించడం కష్టం. పెద్ద దృశ్యాల్ని థియేటర్లలోని పెద్ద తెరమీద చూడాల్సిందే. ఐమాక్స్ లో చూస్తే వాటిని ఇంకా గొప్పగా ఆస్వాదించవచ్చు. ఈ కారణాలతో టీవీ-సినిమా ప్రేక్షకుల్ని, తటస్థ ప్రేక్షకుల్ని మళ్ళీ థియేటరు -సినిమా ప్రేక్షకులుగా మార్చవచ్చు అనేది నిర్మాతల వ్యూహం.
అయితే, ప్రపంచ వింతలు, పర్యాటక ప్రదేశాలు అన్నింటినీ సినిమాల్లో చూపెట్టేశాక ఏం చేయాలీ అనేదీ ఒక ప్రశ్నే. కొత్త టెక్నిక్ ను ప్రవేశ పెట్టడం ద్వార పాత ప్రేక్షకుల్ని మళ్ళీ థియేటర్లకు రప్పించే పని అవతార్ లాంటి సినిమా చేసింది. అవతార్ సినిమాలో అద్భుతం అనిపించే సాంకేతిక విలువలు వున్నప్పటికీ అంతకు మించి వర్తమాన ప్రపంచ మార్కెట్ ను ప్రతిబింబించే సరికొత్త కథాబలం వుందన్నది మరచిపోరాదు. టెక్నిక్ ను మాత్రమే నమ్ముకుని కథను నిర్లక్ష్యం చేస్తే రజినీ కాంత్, దీపికా పదుకునే నటించిన సినిమా కూడా బాక్సాఫీసు ముందు బోల్తా పడుతుందని కొచ్చడయాన్ సినిమా నిర్మాతల చెంప మీద కొట్టి మరీ చెప్పింది.
అమెరికా, కెనడా రచయితలు అడపాదడపా విశాఖపట్నం వచ్చి దండకారణ్యం జీవితాన్ని అధ్యయనం చేసి వెళుతుంటే, మన సినిమా రచయితలు ఒక హిట్టు సినిమాని పదిసార్లు చూసి అందులో నుండి వంద మూస సినిమాలు సృష్టించే పనిలో మునిగితేలుతున్నారు. నిజానికి మంచి కథల కోసం ఎక్కడికో వెళ్ళాల్సిన పనిలేదు. సమాజమే కథల గని. రోజూవారీ జీవితంలోని చిన్నచిన్న సంఘటనల్నిగొప్ప గొప్ప సినిమా కథలుగా మలచవచ్చు. అనుమానం వున్నవాళ్ళు ఇరానియన్, లాటిన్ అమెరికన్ సినిమాలు చూడవచ్చు.
ఖమ్మం జిల్లా సరిహద్దుకు ఆవల జనతన సర్కార్ ’పాలన” వుందని, ఆ వాస్తవాన్ని సెల్యులాయిడ్ మీద అద్భుతమైన కావ్యంగా మలచవచ్చని మన నిర్మాతల్లో ఒక్కరికయినా ఆలోచన వస్తుందా? అదే సమాచారం మెక్సికన్ - స్పానిష్ దర్శకుడు గుల్లేర్మో డెల్ తోరో కు తెలిసివుంటే ఈపాటికి పాన్స్ లాబిరింత్ (2006) వంటి మరో మాహాకావ్యాన్ని సెల్యులాయిద్ మీద ఆవిష్కరించి వుండేవాడు.
ఇరాన్ దర్శకులయితే మరీనూ. ఆరేళ్ల పాప వంద రూపాయల నోటు పట్టుకెళ్ళి గాజు కుండీలో గోల్డ్ ఫిష్ చేపను కొనుక్కుని రావడం ఒక సినిమా కథ అవుతుందని మనం ఊహించగలమా? (ద వైట్ బెలూన్ – 1995). స్కూలు బూట్లు ఒక జత పోతే మిగిలిన ఒక జత బూట్లను అన్నాచెల్లెలు వంతులవారీగా వాడుకోవాల్సిరావడాన్ని ఒక సినిమాగా తీయవచ్చా? అంటే తీయవచ్చు అంటాడు మాజిద్ మాజిదీ. అదే చిల్డ్రన్ ఆఫ్ హెవెన్ (1997). ఒకాయనకు చనిపోవాలనిపించింది. తనే సమాధి తవ్వుకుని అందులో పడుకున్నాడు. ఈలోపులో గాలివాన వచ్చి ఒక చెర్రీ పండు అతని నోటిలో పడింది. దాని రుచి చూశాక అతనికి జీవితం మీద మళ్ళీ కోరిక పెరిగింది. (టేస్ట్ ఆఫ్ ఛెర్రి – 1997). ఇదీ ఒక ఇరానియన్ సినిమా కథే. ఇలా ప్రతి అంశాన్నీ సినిమాగా మలిచేయగల మాంత్రికులు ఇరాన్ దర్శకులు.
ఇలాంటి ఆఫ్ బీట్ కథల్ని మన ప్రేక్షకులు చూడరండీ అని చాలా మంది పెదవి విరుస్తుంటారు. వారు ఏ రకం ప్రేక్షకుల్ని ఉద్దేశించి ఆ మాట అంటున్నారు అనేది అసలు ప్రశ్న. ఏదో ఒక హీరోకు అభిమానులుగా వున్నవారు మాత్రమే ప్రేక్షకులా? తటస్థంగా వుండేవాళ్ళు ప్రేక్షకులుకారా? వంటి ప్రశ్నలూ ముందుకువస్తాయి. స్లమ్ డాగ్ మిలీనియర్ వంటి ఆఫ్ బీట్ సినిమాను ప్రపంచమంతా పడిపడి చూశారన్నది మనం మరిచిపోతున్నాం. ఎవరయినా ఒక మంచి సినిమా తీస్తేతటస్థ ప్రేక్షకులు మాత్రమేకాకా, కొందరు హీరోలకు అభిమానులుగా ముద్రపడినవాళ్ళు కూడా దాన్ని చూస్తారని చాలాసార్లు రుజువయ్యింది. గతంలో యన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు అభిమానుల మధ్య భీకర పోటి సాగుతున్న సమయంలో నాగేశ్వరరావు ప్రేమనగర్ సినిమా వచ్చింది. యన్టీఆర్ అభిమానులు సహితం ఆ సినిమాను గొప్పగా ఆస్వాదించారు. అలా ఏఎన్నార్ అభిమానులు యన్టీ రామారావు సినిమాలను ఆస్వాదించిన సంఘటనలూ మరెన్నో వున్నాయి.
తెలుగు సినిమాలు ఐదు వందల కోట్లు, హిందీ సినిమాలు వెయ్యి కోట్ల రూపాయలు వసూలు చేసే రోజులు ఎంతో దూరంలో లేవని సినీ పండితులు వేస్తున్న అంచనాలు నిజమే కావచ్చు. కానీ, సమాజం నిరంతరం సృష్టించే కొత్త కథల మీద దృష్టి పెట్టకుండా వసూళ్ల మీద మాత్రమే దృష్టి నిలిపినంతకాలం వర్తమాన తెలుగు సినిమాల్లో కథా దారిద్ర్యం, మృతసంస్కృతి కొనసాగుటూనే వుంటుంది. !
(రచయిత సీనియర్ పాత్రికేయుడు, సమాజ విశ్లేషకుడు)
సెల్ ఫోన్ : 76749 99089
9 September 2014