Wednesday, 23 October 2019

One step backward for a great victory


One step backward for a great victory
గొప్ప విజయం కోసం ఒక అడుగు వెనక్కి
22 అక్టోబరు 2019

            బాబ్రీ మసీదు స్థలాన్ని ముస్లిం సమాజం సుప్రీం కోర్టు సమక్షంలో కొన్ని షరతులతో  హిందూ సమాజానికి అధికారికంగా ఇచ్చివేయాలనే నా సూచన మిత్రులు చాలామందికి నచ్చలేదు.  వాళ్ళు నా సూచనలోని దీర్ఘకాలిక ప్రయోజనాన్ని వీక్షించకుండ తాత్కాలిక నష్టాన్ని మాత్రమే చూస్తున్నారు. 

            బాబ్రీ మసీదు సమస్య మొదట్లో ఒక గల్లీ వ్యవహారం. ఇప్పుడది దేశ సాంస్కృతిక వ్యవహారం. సంఘీయులు ఆర్టికల్ 370 రద్దు, రామమందిరం నిర్మాణం, ఉమ్మడి పౌరస్మృతి రూపకల్పన తమ లక్ష్యమని 1989లోనే ప్రకటించారు. వాటిల్లో మొదటిది నెరవేర్చుకున్నారు. రెండోది నెరవేర్చుకోవడం దాదాపుగా ఖాయం అయిపోయింది. మూడోదాన్ని  నెరవేర్చుకోవడానికి రంగం సిధ్ధం అయింది. రక్షణాత్మక స్థితిలో వున్న ముస్లిం సమాజం చేయగల గొప్ప పనేమిటీ అనేది ఇప్పుడు ప్రాణప్రద అంశం. 

            లాహోర్ లోని షహీద్ గంజ్  గురుద్వారను శిక్కులకు  అప్పగించడమేగాక ఆ కట్టడంలోని మసీదు చిహ్నాలను తొలగించడానికి కూడ పాకిస్తాన్ లో మెజార్టీగా వున్న ముస్లిం సమాజం ఉదారంగా వ్యహరించింది. ముహమ్మద్ ఆలీ జిన్నా సహితం ఈ ప్రతిపాదనకు అంగీకారాన్ని వ్యక్తం చేశాడు. అలాంటి పరిస్థితి వర్తమాన భారత సమాజంలో లేదు.

            రాజ్యాంగాన్నీ, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనీ,  హిందూత్వ శక్తులకు గుణపాఠం నేర్పాలనీ చాలా మంది జెనరిక్ మాటాలు మాట్లాడుతున్నారు. కొందరయితే ఉద్యమాలు, విప్లవాలు అంటున్నారు. దానికి తగ్గ వాతావరణం లేకపోవడమేకాదు; ఈ సలహాలు ఇచ్చేవారు సహితం తాము చెప్పే సూచనల్ని పాటించడానికి సిధ్ధంగానూ లేరు. ప్రస్తుతం అసలు ఎవరి దగ్గరా కార్యక్రమం లేదు.

            దేశంలో వాతావరణం ఎలా వుందంటే మతం వేరు మతతత్వం వేరు అనే అవగాహన చాలా మందికి లేదు. హిందూత్వవాదుల్ని విమర్శిస్తుంటే సాధారణ హిందువులు సహితం నొచ్చుకుంటున్నారు. సాధారణ హిందువుల్ని నొప్పించి ముస్లింలు సాధించగలిగేదీ ఏమీవుండదు. వినాశనాన్ని కోరి తెచ్చుకోవడంతప్ప.

            ముస్లిం సమాజం ఆవేశంతో రగిలిపోయే  సందర్భంకాదు ఇది. దౌత్య నీతిని ప్రదర్శించాల్సిన సమయం ఇది. నిజానికి ఆవేశంతో రగిలిపోయేవారు ఫేస్ బుక్ ను వదిలి బయటికి రావడంలేదు. తాను సన్నధ్ధంకాకుండా ప్రగల్భాలతో ప్రత్యర్ధిని రెచ్చగొట్టేవారు మూర్ఖులు. అలాంటి ప్రమాదం కూడ ఒకటి భారత ముస్లిం సమాజానికి లోపలి నుండి పొంచి వుంది.

శాంతి ఒప్పందమే ఒక మహత్తర విజయం

బాబ్రీ మసీదు వివాదం సమసిపోయినంత మాత్రాన భారత ముస్లింల సమస్యలు పరిష్కారం అయిపోవు. పరిష్కారం కావల్సిన సమస్యలు అనేకం వున్నాయి. భవిష్యత్తులో అనేక కొత్త సమస్యలు సహితం పుట్టుకు వస్తాయి. ముస్లింలకు ఇప్పుడు కావలసింది ఒక నైతిక విజయం. అన్ని విధాలా దుష్ప్రచారానికి గురయిన ముస్లిం సమాజం ఎక్కడో ఒకచోట టర్న్ ఎరౌండ్ అవ్వాలి. దక్షణాయనం ముగిసి ఉత్తరాయనం మొదలు కావాలి. చరిత్ర సవాలు విసిరినపుడు ముస్లింలు గొప్ప ఉదారంగా వ్యవహరిస్తారనే గట్టి సంకేతం బయటికి వెళ్ళాలి.

            బాబ్రీ మసీదు మొత్తం రెండున్నర ఎకరాల స్థలాన్ని హిందూ సమాజానికే ఇచ్చేయాలనే ప్రతిపాదన కొత్తదేమీకాదు. ప్రవక్త ముహమ్మద్ (PBUH) గారి ఆచరణ నుండే ఈ ఆలోచన వచ్చింది. చారిత్రక హుదైబియా శాంతి ఒప్పందంలోని అన్ని అంశాలూ మక్కా ఖురైషీలకు అనుకూలంగా వుండినాయి. ఇస్లాం ఉద్యమకారులకు సానుకూలంగా వున్న అంశాలు దాదాపు శూన్యం. చివరకు ముహమ్మద్ (PBUH) గారిని ఆ ఒప్పందంలో ఏమని సంభోదించాలి అన్న విషయంలోనూ పేచీలొచ్చాయి. వారిని ప్రవక్త అని పిలవడానికి మక్కా ఖురైషీలు ఒప్పుకోలేదు. అయినప్పటికీ ఆ ఒప్పందాన్ని సంతోషంగా అంగీకరించి ఎంతో ముందు చూపును ప్రదర్శించారు ప్రవక్త ముహమ్మద్.  

            ఆ చారిత్రక సందర్భంలో ముస్లిం సమూహాన్ని మక్కా ఖురైషీలు గుర్తించి వారితో ఒక ఒప్పందాన్ని చేసుకోవడమే ఒక విజయం. హిందూ ముస్లీం సమాజాలమధ్య ఒక ఒప్పందం జరగడమే ఇప్పుడు ఒక మహత్తర అంశం. ఎన్నింటిని వదులుకున్నా శాంతి ఒప్పందమే ఒక విజయం.  ఇప్పుడు ముస్లిం సమాజానికి కావలసింది అలాంటి దృక్పథం.

            హిందూ సమాజం శ్రీరాముని పేరిట కట్టుకునే కొత్త మందిరానికి పక్కలోనో, దగ్గరలోనో బాబ్రీ మసీదు నిర్మించాలనే ప్రతిపాదన కూడ సరైనది కాదు.  అయోధ్య  పట్టణంలోనే హిందూ సమాజం సహకారంతోనే మరో మసీదు నిర్మించుకోవచ్చు.

ఇప్పటి సామాజిక వాతావరణం చాలా విషాదకరంగా వుంది. పౌర ఉద్యమాలు, న్యాయపోరాటాల పాత నిర్వచనాలు మారిపోయాయి. వాటి మీద ప్రజల స్పందనల తీరూ మారిపోయింది. కేంద్ర ప్రభుత్వ అత్యాచారాల్ని ఎవరయినా ఖండిస్తుంటే సాధారణ హిందూ సమాజానికి కోపం వస్తోంది. ముస్లింలు రాజకీయ యుధ్ధం చేయడానికి ముందు సాధారణ హిందూ సమాజపు సానుకూలతను పొందాల్సిన అవసరం ఒకటుంది.

Anil మా చిన్నోడు అనిల్ అఖ్తర్ ఖాన్ చౌదరి


మా చిన్నోడు అనిల్ అఖ్తర్ ఖాన్ చౌదరి

          మా అమ్మానాన్నలు భిన్న పార్శ్వాలు. మా నాన్న emotional; మా అమ్మ organizer. ఆ రెండు లక్షణాలు రెండు పార్శ్వాలుగా నాలో వున్నాయంటారు సన్నిహితులు.  నాలోని emotional పార్శ్వానికి వారసుడు మా పెద్దాడు అరుణ్ ఇక్బాల్ ఖాన్ చౌదరి. వాడు artist and technician.  నాలోని organizer పార్శ్వానికి వారసుడు మా చిన్నోడు అనిల్ అఖ్తర్ ఖాన్ చౌదరి. వాడు గొప్ప crisis manager.   సన్నిహితుల్లో ఎవరికి ఎంతపెద్ద సమస్య వచ్చి పడినా చిటికెల్లో పరిష్కారం చూపించే స్తోమత అనిల్ ది.

          కులనిర్మూలన ఒక ఆదర్శంగా వున్నప్పుడు పిల్ల పేర్ల చివర్ల కులాలను ఎందుకు పెట్టారు అని మమ్మల్ని కొందరు అడుగుతుంటారు. మావి భిన్నమతాలు కులాల కలయిక అని చాటి చెప్పడానికే ఆపని చేశాము. అదో ఆదర్శం.

          నేను వేసుకోవాల్సిన డ్రెస్సు, షూస్,  పెట్టుకోవాల్సిన కళ్ళజోడు, వాచీలు చివరకు తాగాల్సిన మద్యం బ్రాండ్లు కూడ మా అనిలే నిర్ణయిస్తుంటాడు. “Poor man’s luxuries drink Mansion House and rich man’s impoverish drink Johnny Walker Red label. And you are still dwelling between them” అంటాడు. కుటుంబ వ్యవహారాల్లో నాకో సలహాదారుడు అవసరమైనపుడు అనిల్ నే సంప్రదిస్తాను.  నాకు సలహా ఇవ్వగల సమర్ధుడు వాడు.

           ఈ మధ్య వాడొక మాట అన్నాడు. “నాన్నా! మమ్మల్ని పెంచడానికీ, చదివించడానికీ, జీవితంలో స్థిరపడేలా చేయడానికీ నువ్వు అనేక త్యాగాలు చేసివుంటావు. ఏదైనా టూరిస్ట్ స్పాట్‍ కు వెళ్ళాలనుకుని వెళ్ళివుండవు. ఏదైనా పెద్ద బ్రాండు మందు తాగాలనుకుని తాగివుండవు. ఎవరైన గర్ల్ ఫ్రెండ్ తో డేటింగుకు వెళ్ళాలనుకుని వెళ్ళి వుండవు. ఇప్పుడు మనకు వెసులుబాటు వుంది. వాటినన్నింటినీ నెరవేర్చేసుకో. నేను స్పాన్సర్ చేస్తాను” అన్నాడు. వాడు నాకు నచ్చాడు.

          పెద్దయ్యాక ఇన్ని పెద్ద మాటలు చెపుతాడని వాడు పుట్టినపుడు తెలీదు. ఇప్పుడు ఇన్ని పెద్ద మాటలు చెపుతుంటే వాడు పుట్టినందుకు ఆనందంగా వుంది.

Happy Birthday Anil !.

\\



అనిల్ నా నమ్మకం!
పిల్లల్ని తల్లిదండ్రులు ప్రేమగా పెంచడం, తల్లిదండ్రుల్ని పిల్లలు గొప్పగా చూసుకోవడం కొత్త విషయం ఏమీకాదు. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అన్నంత తధ్ధర్మ క్రియ. కానీ, ఇప్పటి లోకం అలా లేదు. పిల్లల్ని ప్రేమగా పెంచని తల్లిదండ్రులూ, తల్లిదండ్రుల్నిపట్టించుకోని పిల్లలూ కొందరు వుంటున్న కాలం కనుక ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సివస్తున్నది.
ఏప్రిల్ 25న విజయవాడలో అజితకు కోవిడ్ లక్షణాలు కనిపించాయి. మందులు మొదలెట్టాము. మొదటిసారి టెస్టులో నెగటివ్ రావడంతో సంధిగ్ధంలో పడ్డాము. ఏప్రిల్ 27న రెండో టెస్టులో పాజిటివ్ అని తేలింది. ఆరోజు పరిస్థితి సీరియస్ గా మారింది. మా రెండో అబ్బాయి అనిల్ అఖ్తర్ ఖాన్ చౌదరి ఫొన్ చేశాడు. వాడికి విజయవాడ వైద్యం మీద నమ్మకం లేదు. అమ్మను తక్షణం హైదరాబాద్ కు షిప్ట్ చేయమన్నాడు.
హైదరాబాద్ కార్పోరేట్ హాస్పిటల్స్ లో మహామహులకే బెడ్లు దొరకడంలేదు. హైదరాబాద్ వెళ్ళడానికి విజయవాడలో అంబులెన్సులు దొరకడంలేదు. అన్నీ వాడే చూసుకున్నాడు. రూపాయి పెట్టాల్సిన చోట మూడు రూపాయలు ఖర్చు పెట్టాడు. అర్ధరాత్రి దాటిన తరువాత హైదరాబాద్ హాస్పిటల్ కు చేరాము. అప్పటికే వాడు హాస్పిటల్ లో స్పెషల్ రూం బుక్ చేసి వుంచాడు. నాకు పార్క్ హోటల్ లో వారం రోజులు రూమ్ బుక్ చేశాడు. నీకు అసలే సివోపిడి నీకు వచ్చిందంటే అమ్మకన్నా డేంజరు అవుతుంది అని హెచ్చరించాడు. కోవిడ్ రిస్క్ వున్నాసరే తను అజితకు అటెండెంట్ గా వున్నాడు.
అజిత డిస్ చార్జి అయ్యే నాటికి నాకు పాజిటివ్ అని తేలింది. ఇంకో మూడు రోజుల తరువాత నాకు మరీ సీరియస్ అయ్యింది. పట్టుబట్టి మళ్ళీ స్పెషల్ రూమ్ సాధించాడు. అప్పటి పరిస్థితిలో అది సాధారణ విషయం ఏమీ కాదు.
నేను ఒక మెడికల్ మెరాకిల్ గా కోవిడ్ నుండి బయట పడి ఏప్రిల్ 15న డిస్చార్జీ అయ్యాను. మా ఇద్దరికీ హాస్పిటల్ బిల్లే 9 లక్షల వరకు అయ్యింది. అంబులెన్స్ , హొటలు, హాస్టలు, ఇతరాలు ఇంకో రెండు వరకు అయ్యాయి. పోస్ట్ కోవిడ్ మందులు మరో లక్షకన్నా పైమాటే. “ఒక్క పైసా కూడా నీ అకౌంట్ నుండి ఖర్చుపెట్టకు. ఈ డ్యూటీ నాది” అని వాడు ముందే చెప్పాడు.
అజిత కుగ్రామం నుండి వచ్చింది. నేను పట్టణం నుండి వచ్చాను. మా ఇద్దరికీ భావోద్వేగాలు ఎక్కువే. మా పిల్లలు విజయవాడలో పుట్టారు. హైదరాబాద్ లో వెస్ట్రన్ లైఫ్ స్టైల్ పూర్తిగా అలవరచుకున్నారు. యూరోప్ అమెరికాల్లో ఒక కాలు, ఇండియాలో ఇంకో కాలు పెట్టి బతుకుతుంటారు. వెస్ట్రన్ వాళ్ళకు భావోద్వేగాలు తక్కువగా వుంటాయనే అభిప్రాయం చాలా మందికి వుంటుంది. పైగా కరోనా కాలంలో మనుషుల్ని చూసి మనుషులు భయపడుతున్న సన్నివేశాల గురించి చాలా కథలు విన్నాము. నా అభిప్రాయం తప్పని వాడు నిరూపించాడు. డబ్బు పరంగానే కాక ఆరోగ్యపరంగానూ చాలా పెద్ద రిస్క్ తీసుకున్నాడు. థ్యాంక్స్ చెప్పబోతే వారించాడు. పిల్లలకు తల్లిదండ్రులు థ్యాంక్స్ చెప్పరు అన్నాడు.
చాలా చిత్రమైన మనస్తత్వం వాడిది. అలెన్ సోలీ డ్రెస్సులు, నైకీ షూల స్థాయి నుండి ఇంకా ఎదుగు. మార్ఫియస్ అనేది కామన్ మ్యాన్స్ లగ్జోరియస్ డ్రింక్, రెడ్ లేబుల్ అనేది రిచ్ మెన్స్ ఎకానమీ డ్రింక్. నువ్వు ఆ లెవల్స్ దాటు. మా కోసం అప్పట్లో చాలా త్యాగాలు చేసుంటావు. ఇప్పుడు వాటినన్నింటినీ తీర్చేసుకో. నేను స్పాన్సర్ చేస్తా. ఇటీజ్ మై ప్లజర్ అంటాడు.
రాత్రి సరిగ్గా 12 గంటలకు ఫోన్ చేశాడు. “మై మదర్ ఈజ్ మై స్ట్రెంగ్త్ (Strength) అండ్ మై ఫాదర్ ఈజ్ మై డిజైర్” అన్నాడు. అది వాడి బర్త్ డే మెసేజ్. సంతోషం వేసింది. వాడు నా నమ్మకం. ఆ విషయాన్ని వాడు ఇప్పటికే చాలాసార్లు నిరూపించాడు. కుటుంబంలో నేను నిలబడి చెయ్యాల్సిన అనేక పనుల్ని తనే చేసేసాడు.
అనిల్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు

“ఖుష్‌ బూ గుజరాత్‌ కీ”


“ఖుష్‌ బూ గుజరాత్‌ కీ”

ఏ రంగంలో అయినాసరే  సూపర్ స్టార్ గా వెలిగినవాళ్ళు కొన్ని అన్యాయాలు, అక్రమాలు, తొలినాటి సన్నిహితులపట్ల విశ్వాసఘాతుకాలు, కొత్త ప్రభువులపట్ల విధేయతలు కొనసాగిస్తారు. అవన్నీ అమితాభ్ బచ్చన్ కూడ కొనసాగించాడు. వాటన్నింటిని professional obligations గా భావించి మన్నించేయవచ్చు. కానీ గుజరాత్ నరమేధం తరువాత నెత్తురోడిన శవాల కమురు వాసన దేశమంతా వ్యాపించి వున్నపుడు “ఖుష్‌ బూ గుజరాత్‌ కీ” అంటూ వాణిజ్య ప్రచారం సాగించిన  అమితాభ్ ను క్షమించడం చాలా కష్టం. 

          చాలామంది గమనించలేదుగానీ మోదీ, అంబానీ, అమితాభ్ త్రయం రాజకీయ ఆర్థిక సాంస్కృతిక రంగాల్లో ఒక అవగాహనతో కొనసాగారు. కొనసాగుతున్నారు.

రాయాల్సిన సమయంలో ఖదీర్ బాబు మాత్రమే రాయగలిగిన పోస్ట్ ఇది.  అమితాభ్ కోసం రాళ్ళెత్తిన ముస్లిం కూలీల్లో నర్గిస్ కూడా వుంది.

Thursday, 10 October 2019

జ్ఞాన సిధ్ధాంతపు ఆచరణ


 జ్ఞాన సిధ్ధాంతపు ఆచరణ

            ఈ ప్రపంచం మనం తెలుసుకోలేనిది ఏమీ కాదు. మనం దీన్ని తెలుసుకోగలం. మార్చగలం కూడ. అయితే చారిత్రక, సామాజిక పరిమితులవల్ల మన జ్ఞానానికి పరిమితులుంటాయి. మన పరిమితుల్ని మనం గమనించడం ముఖ్యం. మన ముందు ఒక తక్షణ సమస్య వున్నప్పుడు దానికి పరిష్కారం ఏమిటీ? ఆ పరిష్కారానికి ఎవరెవరి సిధ్ధాంతాలు దోహదపడుతాయి? దానికి కార్యాచరణ ఏమిటీ? ఆ కార్యరంగంలో మన కన్నా ముందు ఎవరయినా కృషి చేశారా? వాళ్లు  ఏం చేశారూ? ఏం చేస్తున్నారూ? ఆ దిశగా వాళ్ళు సాధించిన విజయాలు ఏమిటీ? వాళ్ల అనుభవం మనకు ఏ మేరకు పని వస్తుందీ? అవి సరిపోకపోయినా పనికిరాకపోయినా మనం ప్రతిపాదించాల్సిన కొత్త విషయాలేమీటీ? దాని కోసం ఆచరించాల్సిన కొత్త మార్గాలేమిటీ? అని మాత్రమే మనం ఆలోచించాలి. ఆ క్రమంలో నిన్నటి వరకు మనం అభిమానించిన తాత్విక గురువుల్ని సహితం విమర్శనాత్మకంగా పునర్ ముల్యాంకనం చేయడానికి కూడ వెనుకాడకూడదు. వాళ్ళను తక్కువగా చూడాల్సిన పనిలేదు. ఒక చారిత్రక దశలో గొప్పగా వెలిగిన సిధ్ధాంతాలు మరో చారిత్రక దశలో మసక బారవచ్చు. లేదా కొత్త పదునును సంతరించుకోనూ వచ్చు.  ఇది మన జ్ఞాన సిధ్ధాంతపు ఆచరణగా వుండాలి.  ప్రతి విషయంలోనూ పాత narratives మారుతూ వుండాలి.

Wednesday, 9 October 2019

RTC Strike in Telangana

RTC Strike in Telangana 
తెలంగాణలో ఆర్టీసి సమ్మె

TSRTC నష్టాలకు కారణం యాజమాన్యం; ED లు.
కార్మికులు పోరాటం వాళ్ల మీద చేయాలి.

ఆక్యుపేషన్ రేషియో 73 శాతానికి పెరిగినా TSRTC నష్టాల్లో వుందంటే దానికి కారణం ఎవరూ? యాజమాన్యం.

కార్మిక సంఘాలు చెపుతున్నట్టు డీయిల్ ఆదా, టైర్ల జీవితం,  ఆక్యుపేషన్ రేషియో పెరిగిన మాట నిజమే అయితే నష్టాలు ఎలా వస్తున్నాయీ?

వివిధ బలహీనవర్గాలకు ఇచ్చే రాయితీల బకాయిల్ని రాష్ట్ర ప్రభుత్వం TSRTC కి తక్షణం చెల్లించాలి.

ఆర్టీసి సమ్మె వంకతో తమ జీతభత్యాలను మళ్ళీ పెంచుకోవడానికి ప్రభుత్వోద్యోగులు పావులు కదుపుతున్నారు. ఇది ప్రజా వ్యతిరేకం.

TSRTC  సమ్మెను అవకాశంగా మార్చుకుని తెలంగాణలో కేసిఆర్ వ్యతిరేక రాజకీయ ఉద్యమాన్ని నిర్మించాలని కేంద్రంలోని అధికార పార్టి ఆశిస్తోంది.

మావోయిస్టు పార్టి  TSRTC సమ్మెను బలపరచడం ఇంకొక చారిత్రక తప్పిదం.

(స్నేహ టీవీలో పబ్లిక్ డిబేట్ లో వెలిబుచ్చిన అభిప్రాయాలు)

రచన : 9 అక్టోబరు 2019

 ట్రేడ్ యూనియన్లకు నేను వ్యతిరేకిని. వాళ్లు బ్యూరాక్రసీలో భాగం. ఈ విషయాన్ని నేను

గతంలో చాలాసార్లు  చాలా స్పష్టంగా చెప్పి వున్నాను. మరొక్కసారి చెపుతున్నాను. సమాజంలో

కూలీలు దీనికి వంద రెట్లు కష్టాల్లో  వున్నారు. వాళ్ల గురించి ఈ  యూనియన్లు  సమ్మేలు

చేయవెందుకూ?  RTC EDలు  ఒక్కొక్కరి జీతం నెలకు లక్షన్నర రూపాయలు పైమాటే.

సమాజంలో నిరుద్యోగం పెరిగిపోతున్నదని ఒకవైపు గగ్గోలు పెడుతూ ప్రభుత్వోద్యోగుల పదవి

విరమణ వయస్సు పెంచమనడం  ఏ లాజిక్కూ?

ట్రేడ్ అంటే వాణిజ్యం
ట్రేడ్ యూనియన్ అంటే వాణిజ్య కూటమి

వృత్తి సంఘం  అనే అర్థం వుందనీ తెలుసు. రా వి  శాస్త్రీ గారు ఆల్రెడీ వాడారు.

 ఈ ట్రేడ్ యూనియన్లు సంఘటిత రంగంలోనే పనిచేస్తాయి. అసంఘటిత రంగాన్ని గాలికి

వదిలేస్తాయి. కమ్యూనిస్టు పార్టీలకు సంఘటిత రంగంలోనే  ఆదాయం వుంది. పోలీసుల

జీతాలను కూడ పెంచేది ఈ ట్రేడ్ యూనియన్లే.

ప్రజలకు బిపిఎల్ ద్వార లాభం జరుగుతున్నదని మీరు భావిస్తే వాళ్ళ ఆదాయం మేరకే

జీతాలు తీసుకుని  తెల్ల కార్డూ మీద వాళ్లు పొందే బెనిఫిట్స్ అన్నీ పొందండి.

ప్రభుత్వం పన్నుల ద్వార వసూలు చేసేదానిలో అత్యధిక భాగం ఉద్యోగుల జీత భత్యాలకు

పోతుందని గుర్తు పెట్టుకుంటే మంచిది.

ప్రభుత్వం పన్నులు వసూలు చేయడం దేనికీ? ఉద్యోగవర్గాన్ని పోషించడం దేనికీ?

సామాన్య ప్రజల మీద సానుభూతి వున్న ప్రభుత్వ ఉద్యోగులు 10 శాతం అయినా వుంటారా?

సామాన్యులు ఎప్పుడయినా ఏ ప్రభుత్వ కార్యాలయానికైనా వెళ్ళి లంచం ఇవ్వకుండా పని చేయించుకో గలిగారా?

నేను కావాలనే మీ లాంటి వాళ్లు చదవాలనే ఇలాంటి పోస్టులు పెడతాను. ప్రభుత్వ యంత్రాంగాన్ని సమర్ధించడంతప్ప ఇప్పటి ట్రేడ్ యూనియన్లు చేసేదేమిటీ?

గారూ ! ప్రభుత్వోద్యోగులు సహితం ప్రభుత్వయంత్రాంగంలో భాగమే అని కూడా కార్ల్ మార్క్సే చెప్పాడు. బ్యూరాక్రసీని అనేక తిట్లు తిట్టాడు


ఆర్టిసి సమ్మె గురితప్పింది

నేను ముందుగానే కొన్ని విషయాలు చెప్పాను.

మొదటిది; వివిధ బలహీనవర్గాలకు ఇచ్చే రాయితీల బకాయిల్ని TSRTC కి తక్షణం చెల్లించాలని రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశాను.

రెండోది; ఆర్టీసి కార్మికులు తమ యాజమాన్యానికి వ్యతిరేకంగా  పోరాడాలి అని సూచించాను.  అపార మౌళిక సదుపాయాలున్నా సంస్థ నష్టాల్లో వుందంటే  వాళ్ళే కారకులు.  

మూడోది; నేను చాలా కాలంగా చెపుతున్నదే; ప్రభుత్వోద్యోగుల జీత భత్యాలను పెంచడానికి నేను స్పష్టంగా వ్యతిరేకం. వాళ్ళకు పెరగాల్సిన దానికన్నా చాలా పెరగడమేగాక స్వభావరీత్యావాళ్ళు  సాధారణ ప్రజలకు వ్యతిరేకులు. ఇంటర్మీడియట్ బోర్డు ఆఫీసులో కుక్కను దులిపితే నాలుగు కోట్ల రూపాయలు రలుతున్న రోజులివి.

నాలుగోది; ప్రభుత్వాలు పన్నుల రూపంలో  ప్రజల ముక్కు పిండి వసూలు చేస్తున్నదంతా ఉద్యోగుల జీత భత్యాలకే వెచ్చించడం తప్పు.

ఐదవది; సమాజంలో అనేక సమూహాలు కోట్ల మంది ఇంతకన్నా దయనీయ స్థితిలో బతుకుతున్నారు. వాళ్ల గురించి ఈ స్థాయిలో ట్రేడ్ యూనియన్లు ఎందుకు పనిచేయడం లేదూ?

ఆరవది;  అధిక ఆదాయం వున్న వారి ఆదాయన్నే నిత్యం పెంచేందుకు ప్రయత్నించడం అదేమి సామ్యవాదం. ఇతర సమూహాల ఆదాయాలను పెంచడం కోసం ఇంతటి అంకిత భావంతో కమ్యూనిస్టులు సంఘాలు ఎప్పుడయినా పనిచేస్తున్నాయా?

ప్రజాసంఘాలు ఇప్పుడు ఆర్టీసి అనగానే బయటికి రావడం బూటకం కాదా? రెండేళ్ల క్రితం బీఫ్ అమ్మకాలు వివాదంగా మారడంతో  కొన్ని వేల మంది  భయపడి ఆ వృత్తి నుండి తొలగిపోయి రోడ్డున పడ్డారు. నగదు రహిత విధానాన్ని ప్రవేశపెట్టినపుడు హాకర్లు రోడ్డున పడ్డారు. ఈ ట్రేడ్ యూనియన్లు వాళ్లను ఈ స్థాయిలో  పట్టించుకున్నాయా?  ఇలాంటి డిస్ ప్లేస్ మెంట్లు ఇటీవల కొన్ని వందలు బహుశ వేలు   జరిగాయి. అప్పుడు ఎన్నడూ  లేని స్పందన ఇప్పుడు దేనికీ? ఇది సంఘటిత రంగం అనేకదా? ఇందులో నాయకుల స్వార్థం వుంది.


కింది వాళ్ళ బతుకు తెరువు సమస్యను  పరిష్కరించకుండ  పై వాళ్ళ ఆదాయాన్ని పెంచడం కోసం కృషిచేయడం సామాజిక నేరం.  జాతియోద్యమ కాలంలో అంబేడ్కర్ కూడా ఇదే విధానాన్ని అనుసరించాడు.  తమ తప్పుల్ని కాపాడుకోవడానికి మార్క్స్ నో మరొకర్నో కోట్ చేయడం ఇంకా అపచారం. తప్పును ఎత్తిచూపితే కేసిఆర్ తో అక్రమ సంబంధాన్ని అంటగట్టడం ఇంకా నీచం.  రాష్ట్ర కమ్యూనిస్టు అగ్రనేత  కేసిఆర్ కు ఎన్నికల్లో మద్దతు ప్రకటించి ఇంకా వారం రోజులు కాలేదు. వారికి చూపండి మార్క్స్ కోట్స్.  ఆర్టీసి సమ్మె  బిజేపికి కలిసి వచ్చిన అదృష్టంగా మారుతోందని గమనించకపోతే ఇక ఈ రాష్ట్రంలో ఆలోచనాపరులు దేనికీ?  

సంఘటిత రంగ ఉద్యోగుల్ని  సమర్థించే వాదనలే ఇవి. ఇందులో నాకేమీ కొత్త దనం అనిపించడంలేదు. 

నేను అసంఘటిత రంగ శ్రామికుల పక్షపాతిని.  


సంఘటిత రంగాన్ని ప్రమోట్ చేస్తూ జీవనోపాధి వెతుక్కునే జీవులు చాలా మంది వుంటారు.  వాళ్లతో నాకు పనిలేదు. 


ట్రేడ్ యూనియన్లు  అసంఘటిత రంగాన్ని వదిలేసి దశాబ్దాలు గడిచిపోయాయి.  కమ్యూనిస్టు 

సంఘాలతోసహా  ఇతర ట్రేడ్ యూనియన్లు అన్నీ  సంఘటిత రంగాన్ని ఆదాయ వనరుగా 

మార్చుకున్నాయి. ఇన్ని సార్లు సంఘటిత రంగంలో జీతాలు భత్యాలు పెంచుకున్నారుగా,  

అసంఘటిత రంగంలో గడిచిన ఐదేళ్లలో మీరు సాధించిన అలాంటి  విజయాలను చెప్పండి.  

సంఘటిత రంగానికీ అసంఘటిత రంగానికీ దూరం ఎంతగా పెరిగిపోయిందంటే మొదటిది 

రెండోదాన్ని 'నిమ్నకులం' అన్నట్టు చాలా చిన్న చూపు చూస్తుంది. అది నాకు  సమ్మతము 

కాదు.  

గడిచిన 30 యేళ్లలో ట్రేడ్ యూనియన్లు అసంఘటిత రంగంలో ఎంత కూలీ పెంచారూ? 

సంఘటిత రంగంలో  ఎంత జీతం పెంచారూ?  ఒక టేబుల్ పెట్టండి. దాని మీద  ఒక 

తులనాత్మక చర్చ చేద్దాము. అప్పుడు ఎవరు కళ్ళు తెరచి చూస్తున్నారో ఎవరు కళ్ళు 

మూసుకున్నారో   అర్థం అవుతుంది.  

అసంఘటిత రంగంలో  నెలకు పాతిక వేల రూపాయలు ముఫ్ఫయి వేల రూపాయలు  

డిమాండ్లు  చేయడం వరకూ సరే.  సంఘటిత రంగంలో అంకితభావంతో పనిచేసి డిమాండ్లను 

సాధించుకున్నట్టు అసంఘటిత రంగంలో నిజాయితీగా సాధించారా? 

ప్రగతి భవన్ వెళ్ళాల్సింది కమ్యూనిస్టు పార్టి సెక్రటరీ. నాకేం పనీ. 

పది శాతం వున్నారు అంటారు. నాకూ అభ్యంతరం లేదు. 


ఇంతటి లంచగొండుల జీతాలు పెంచమని ఉద్యోగ  సంఘాలు ఎందుకు పోరాటాలు  చేస్తుంటాయీ?  ఆర్టీసి సమ్మెకు మద్దతు పలకడానికి నిన్న అనేక సంఘాల వాళ్ళు వచ్చారు. ఆ పనిని వాళ్ళు అసంఘటిత కార్మికుల కోసం చేస్తారా? ఇదంతా ఒక కూటమి.  

.

The death of Fascism and Nazism in Italy and Germany


ఫాసిజానికి కుక్కచావు

డానీ

 

1.        తాను సర్వశక్తివంతురాలని (omnipotent), తనను ఎవరూ ఎదిరించలేరని (invincible) చెప్పుకుంటూ  ఫాసిజం విర్రవీగుతుంది. ఫాసిజం అజేయశక్తి ఏమీకాదు. ఫాసిజాన్ని ఓడించడం కష్టసాధ్యమేగాని అసాధ్యం ఏమీకాదు.

 

2.        పోరాడేశక్తులు, పోరాడే వాతావరణం, పోరాడే సంస్థ లేకుండా పోరాటాల్లో విజయం సాధ్యంకాదు. ఇవి మూడు వున్నప్పుడు ఎంతటి ఫాసిస్టు శక్తులనైనా ఓడించవచ్చు.

 

3.        అడాల్ఫ్ హిట్లర్ కళ్ళెప్పుడూ సోవియట్ రష్యా మీదనే వుండేవి. జర్మనీకి ఆహార సమస్య వచ్చినపుడెల్లా తాను తూర్పు దిక్కుకు చూస్తాననీ, అక్కడ తనకు రష్యా కనిపిస్తుందనీ, రష్యాను ఆక్రమించుకుంటే అక్కడి యూదు రైతులు జర్మనీ కోసం ఆహారాన్ని పండించి పంపిస్తారని హిట్లర్ ‘నా పోరాటం’ (Mein Kampf 1925) పుస్తకంలో రాసుకున్నాడు.

 

4.        రష్యాను ఆక్రమించడానికి వీలుగానే జర్మనీకి తూర్పున వున్న పోలెండును ముందుగా ఆక్రమించాడు. ఆ రోజుల్లో పోలెండుకు తూర్పున  సోవియట్ రష్యా వుండేది. ఇప్పుడు ఆ ప్రాంతంలో యుక్రైన్, బైలారస్, లిథుయానియా దేశాలు ఏర్పడ్డాయి.

 

5.        బెనిటో ముస్సోలిని కళ్ళు ఎప్పుడూ ఇటలీకి దక్షణ దిక్కున వున్న ఆఫ్రికా ఖండం మీద వుండేవి. ఆఫ్రికాను ఖాళీ చేయించేసి అక్కడ ఒక కోటి మంది ఇటలీ ప్రజలకు నివాసం కల్పిస్తే, ఇటలీలో జనసాంద్రత తగ్గి ఛాతీ నిండా గాలిపీల్చుకోవచ్చు అనేవాడు ముస్సోలిని.

 

6.        జర్మన్ సైన్యాలు 1941 జూన్ నెలలో రష్యాలోనికి ప్రవేశించి చాలా దూరం వరకు చొచ్చుకుని పోయాయి. చరిత్రలో ఇది అతిపెద్ద సైనిక చర్య. దీనికి అలనాటి ‘పవిత్ర రోమన్’ చక్రవర్తి ఫ్రెడెరిక్ బార్బరొస్సా  పేరు పెట్టాడు హిట్లర్.

 

7.        1942 జులైలో ముస్సోలిని సేన ఉత్తర ఆఫ్రికా దేశాలైన ఈజిప్టు, లిబియా, టునీషియా, అల్జీరియాలపై విరుచుకు పడింది. సూయజ్ కెనాల్ ను స్వాధీనం చేసుకుని ప్రపంచ రవాణా రంగాన్ని శాసించాలనేది దాని లక్ష్యం.

 

8.        ఈజిప్టు, లిబియాల్లో ముస్లింలు అత్యధికులు. ఆ రెండు దేశాలు ఫాసిజాన్ని వీరోచితంగా ఎదుర్కొన్నాయి. అంత వరకు ఓటమి అనేదే తెలియకుండ అప్రతిహతంగా సాగిపోతున్న అక్షరాజ్యాలకు 1942 నవంబరులో ఈజిప్ట్ లోని ఎల్ ఆలమీన్ (El Alamein) నగరం వద్ద తొలి ఓటమి ఎదురైంది. ఇది పాసిజం అంతానికి ఆరంభం.

 

9.        ఆ తరువాత అక్షరాజ్యాలకు ఒక్క విజయం కూడ దక్కలేదు. పరాజయాలను తట్టుకోలేక  ఇద్దరు నియంతలు ముస్సోలినీ, హిట్లర్  తీవ్ర అసహనానికి గురయ్యారు. 

 

10.   రెండవ ప్రపంచ యుధ్ధం జరుగుతుండగానే ఇటలీలో బెనిటో ముస్సోలిని మీద ప్రజలకు నమ్మకం తగ్గిపోయి వ్యతిరేకత పెరిగింది. 1943 జులై నెలలో ప్రధాన మంత్రి పదవిని కోల్పోయాడు. 1945 ఏప్రిల్ నెలలో డ్యూస్ ఆఫ్ ఇటలియన్ సోషల్ రిపబ్లిక్ పదవిని కోల్పోయాడు.

 

11.   ఇటలీలో ముస్సోలిని ప్రాణాల్ని కాపాడుకోవడమే కష్టమయిపోయింది. దొరికితే ఇటాలియన్ ప్రజలే అతన్ని  చంపేసే పరిస్థితి నెలకొంది.  తనతో సహజీవనం చేస్తున్న క్లారా పెటస్సీ తో కలిసి స్విడ్జర్  ల్యాండ్‍ వెళ్ళి అక్కడి నుండి  విమానంలో స్పెయిన్ కు పారిపోయేప్రయత్నం చేశాడు. అప్పటి స్పెయిన్ ను ఇంకో నియంత జనరల్ ఫ్రాన్సిస్కో ఫ్రాంకో రాజ్యం చేస్తున్నాడు.

 

12.   స్పెయిన్ కు పారిపోతున్న ముస్సోలినీ, క్లారా పెటస్సీని ఇటలీ - స్విడ్జర్  ల్యాండ్‍ సరిహద్దుల్లో 1945 ఏప్రిల్ 27న కమ్యూనిస్టు మిలీషియా పట్టుకుంది.

 

13.   అంతకు ముందు కమ్యూనిస్టు కార్యకర్తలు ఎవరైనా దొరికితే ముస్సోలిని సృష్టించిన అల్లరిమూకలు ‘బ్లాక్ షర్ట్స్’ వాళ్ళను రివాల్వర్లతో కాల్చి చంపి చాకులతో తోలు వలిచి గ్యాస్ స్టేషన్లలో కొక్కేలకు వేలాడదీసే వారు.

 

14.   అందుకు ప్రతీకారంగా అన్నట్టు కమ్యూనిస్టు కార్యకర్తలు కూడ ముస్సోలినీ, క్లారా పెటస్సీ లను 1945 ఏప్రిల్ 28న రివాల్వర్లతో కాల్చి చంపి చాకులతో తోలు వలిచి గ్యాస్ స్టేషన్ లో కొక్కేలకు వేలాడదీశారు. “ఫాసిజానికి కుక్కచావు” అని నినాదాలు చేశారు.

 

15.   అప్పుడు జర్మనీలో హిట్లర్ పరిస్థితి కూడ బాగోలేదు. ప్రజలు ఏక్షణమైనా తిరగబడడానికి సిధ్ధంగా వున్నారు. ప్రజా తిరుగుబాటుకు భయపడిన హిట్లర్ రాజభవనం రీచ్ స్టాగ్ ను వదిలేశాడు.  బెర్లిన్ నగర శివార్లలో ఒక బంకర్ లో భయంభయంగా బతుకుతున్నాడు.

 

16.   హిట్లర్ వయస్సు అప్పుడు 56 సంవత్సరాలు. అప్పటి వరకు హిట్లర్ పెళ్ళి చేసుకోలేదు. కానీ ఇవా బ్రౌన్ అనే మహిళతో సహజీవనం చేస్తుండేవాడు. అప్పుడయినా తనను పెళ్ళి చేసుకోమని ఇవా బ్రౌన్ కోరింది.

 

17.   ముస్సోలినీ హత్య వార్త అప్పటికి హిట్లర్ కు చేరలేదు. ముస్సోలినిని ఖతం చేసిన రోజే అర్థరాత్రి దాటిన తరువాత అంటే 1945 ఏప్రిల్ 29 తెల్లవారుజామున హిట్లర్ తన బంకరులో ఇవా బ్రౌన్ ను పెళ్ళి చేసుకున్నాడు.కొత్త దంపతులు ఒకటిన్నర రాత్రి గడిపారు.

 

18.   ఏప్రిల్ 30 ఉదయం హిట్లర్ కు ముస్సోలిని మరణ వార్త తెలిసింది. తమకు చావు దగ్గరపడిందని హిట్లర్ దంపతులకు స్పష్టంగా అర్ధం అయిపోయింది. ఆ రోజు సాయంత్రం ఇవా బ్రౌన్ సైనేడ్ తాగేసింది. హిట్లర్ తన రివాల్వర్ తో కణితిలో కాల్చుకున్నాడు.

 

19.   ఆ మరునాడు అంటే 1945 మే 1న అంటే మేడే నాడు ఎర్రసైన్యం బెర్లిన్ మహానగరం లోనికి ప్రవేశించింది. స్వల్ప ప్రతిఘటన తరువాత మే 8న మూడో రీచ్ బేషరతుగా లొంగుబాటును ప్రకటించింది. దీనినే యూరోప్ లో విజయ దినం (VE Day) అంటారు.

 

20.   అక్షరాజ్యాల్లో మూడవ ప్రధాన భాగస్వామి జపాన్ ఆసియా ఖండంలో మరికొంత కాలం యుధ్ధాన్ని కొనసాగించింది.

 

21.   అమెరిక 1945 ఆగస్టు 6, 9 తేదీల్లో జపాన్ నగరాలైన హీరోషీమా, నాగసాకీలపై అణుబాంబులు వేసింది. 1945 ఆగస్టు 15న జపాన్ లొంగుబాటును ప్రకటించింది. దీనినే జపాన్ పై విజయదినం (VJ Day) అంటారు.

 

22.   అలా ఫాసిజం కుక్క చావుతో రెండవ ప్రపంచ యుధ్ధం ముగిసింది.

 

23.   సాధారణంగా కమ్యూనిస్టు ఎర్రసైన్యమే ఫాసిజం- నాజీజాలను ఓడించింది అనే ఒక సాధారణ అభిప్రాయం చాలా మందిలో వుంటుంది. ఇటాలియన్ ఫాసిజాన్ని ముందుగా ఓడించింది ముస్లిం దేశాలు. ఎర్రసైన్యం జర్మనీలో ప్రవేశించడానికి రెండున్నరేళ్ళు ముందే ఈజిప్టులో ఇటలీ ఓడిపోయింది.

 

(నేను రాసిన జూలియస్ ఫ్యూజిక్ 1981/ 2013 నుండి)

 

రచన  : 9 అక్టోబరు  2019

సవరణ : 2 మే 2023

 

Monday, 7 October 2019

Fascism in rural areas


Fascism in rural areas
గ్రామీణ ప్రాంతాల్లో ఫాసిజం

          వ్యవసాయిక ఉత్పత్తికీ పారిశ్రామిక ఉత్పత్తికీ ఒక ప్రధాన తేడా వుంది. సాలీన 40 వేల టన్నుల వ్యవస్థాపక ఉత్పత్తి స్తోమత కలిగిన సిమెంటు ఫ్యాక్టరీ ప్రతిరోజూ 100 – 110 టన్నుల సిమెంటును ఉత్పత్తి చేసి మార్కెట్లో విడుదల చేసేస్తూ వుంటుంది. అందువల్ల దాని గిరాకి దాదాపు నిలకడగా వుంటుంది. వ్యవసాయం అలాకాదు. మొత్తం ఏడాది పంట ఒక వారం పదిహేను రోజుల తేడాలో మార్కెట్ కు వచ్చేస్తుంది. దానితో, సరఫరా ఎక్కువయిపోయి గిరాకీ తగ్గిపోతుంది. మరోవైపు, వ్యాపారులు కుమ్మక్కయి ధరల్ని మరింతగా పడగొట్టేస్తారు. ధర తక్కువగా వున్నప్పుడు గిడ్డంగుల్లో నిల్వ చేసి, ధర పెరిగిన తరువాత అమ్ముకునే సౌకర్యం ఒకటి వుంటుందిగానీ దానిని పెద్ద భూస్వాములుతప్ప సామాన్య రైతులు వినియోగించుకోలేరు. దానికి మూడు కారణాలు; తగినన్ని గిడ్దంగులు లేకపోవడం, వున్న గిడ్దంగుల మీద వ్యాపారులకే ఆధిపత్యం వుండడం, పంటను వెంటనే అమ్మి తీర్చాల్సిన అప్పుల వత్తిడిలో రైతు వుండడం.

          తనను మిల్లర్లు వ్యాపారులు కుమ్మక్కయి మోసం చేస్తున్నారని తెలిసినా రైతు వాళ్ళ ను ఏమీ చేయలేడు. విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, సాగునీరు సకాలంలో అందించని ప్రభుత్వాన్నీ అతను ఏమీ అనలేడు. రాష్ట్రంలో ఏ పంటను ఎంత విస్తీర్ణంలో వేయాలో ముందుగా ఒక ప్రణాళిక రచించి ప్రకటించని ప్రభుత్వ యంత్రాంగాన్నీ అతను ఎదుర్కోలేడు. అలాంటి నిస్సహాయ స్థితిలో అతని కోపమంతా వ్యవసాయ కూలీల మీదికి పోతుంది. వాళ్ళ మూలంగానే తనకు ఉత్పత్తి ఖర్చు పెరిగిపోతున్నదని భావిస్తాడు.  ఆ కోపం అక్కడితో ఆగదు. వ్యవసాయ కూలీల కుల మతాల మీదికి పోతుంది. వ్యవసాయదారులు సాధారణంగా పైవర్ణాలు, వ్యవసాయ కులాలకు చెందినవారై వుంటారు. వ్యవసాయ కూలీలు సాధారణంగా ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ వర్గాలకు చెందినవాళ్లయి వుంటారు.  వ్యవసాయ కూలీల్ని  కట్టు బానిసలుగా మార్చేస్తేగానీ వ్యవసాయమూ, గ్రామాలు పూర్వ వైభవాన్ని పొందలేవని వ్యవసాయదారుడు భావిస్తాడు. ఎస్టీ ఎస్సీ అట్రాసిటీస్ కేసుల సంఖ్య పెరుగుతూవుండడం వాళ్ళకు గాయం మీద కారం చల్లినట్టు వుంటుంది. స్వేఛ్ఛా సమానత్వం సోదరత్వం వంటి భావాలు దేశాన్ని పాడు చేసేశాయని రైతులు అనుకుంటారు. రాజ్యాంగం మీద, పార్లమెంటరీ వ్యవస్థ మీద, బలహీనవర్గాల రక్షణ చట్టాల మీద  వాళ్ళకు చాలా కోపం వస్తుంది. 

సరిగ్గా ఇలాంటి వాతావరణంలో గ్రామీణ ప్రాంతాల్లో కులమతవర్గ నియంతృత్వం జీవం పోసుకుంటుంది.


Saturday, 5 October 2019

Journalists must have guts

Journalists must have guts
జర్మలిస్టులకు ఆ మాత్రం పొగరు వుండాలి.
నిస్సహాయుల కోసం నిలబడాలనే నిబధ్ధత వుండాలి.

            కమ్మర్షియల్ సెక్స్ వర్కర్లు నిస్సహాయులు, నిర్బలురు, బతకడానికి మరో ఆలంబన లేక శరీరాన్ని అమ్మకానికి పెట్టిన వాళ్ళు. వాళ్ళ దయనీయ స్థితి మీద జాలిపడాలి.  వాళ్ళ మీద ఎవరయినా దౌర్జన్యం చేసినట్టు నా దృష్టికి వస్తే చాలా బాధ వేసేది. ఎదురు పడితే పళ్ళు ఊడగొట్టాలన్నంత  కోపమూ వచ్చేది.

            విజయవాడకు ఒక గొప్పతనం వుంది. ముదిగొండ పద్మ అనే ఒక కమ్మర్షియల్ సెక్స్ వర్కర్ ను  కేఎస్ వ్యాస్ కాలంలో (1987 లో కావచ్చు) ఓ పోలీసు స్టేషన్ లో శిరోముండనం చేశారు. దానితో ఆగ్రహించిన విజయవాడ పౌరులు రోడ్ల మీదకు వచ్చి పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. ఇప్పటి తరం మొద్దుబారిపోయింది. సామాన్య స్త్రీల మీద అత్యాచారం, అంతకన్నా ఘోరం జరుగుతున్నా స్పందించడంలేదు.

            నేను పాత్రికేయుడ్ని అయిన తరువాత సంచలనం రేపిన అలాంటి కేసు వేల్పూరు కల్పన ది. నిందితులు విజయవాడ నగరంలో చాలా పెద్ద వారు. Conquerors of the Golden city. అలాంటప్పుడే రిపోర్టింగ్ లో కిక్ వస్తుంది.  నాది క్రైమ్ బీట్ కానప్పటికీ అప్పటి ఆంధ్రభూమి ఎడిషన్ ఇన్ చార్జి తాడి ప్రకాష్ ఆ కేసును నాకు అప్పగించారు. కేసును తప్పుతోవ పట్టించిన డాక్టరుతో పాటు నిందితులు అందరూ అరెస్టు అయ్యేవరకు  కథనాల పరంపర సాగించాను.

            అందులో ఇప్పటికీ నాకే ఆశ్చర్యం కలిగించే విషయం విజయవాడ పోలీస్ కమీషనర్ మీద నేను చేసిన వ్యాఖ్యలు.  

            ‘కల్పన ఎలాగూ చచ్చిపోయింది. ఆమె మరణ రహాస్యం మాత్రం బతికే వుంది. దాన్ని చంపే ప్రయత్నం జరుగుతోందనే పత్రికల ఆందోళన. కల్పన మరణం మిస్టరీ కాదు. ఆ రహాస్యం శేషగిరికి తెల్సు, డాక్టర్ జయప్రకాష్ కు తెల్సు. పోలీస్ కమీషనర్ భాస్కర రెడ్డికి తెల్సు. మనిషి చచ్చిపోయినా నిజం చచ్చిపోకూడదు. కల్పన – ఏ కుట్రా జరక్కుండా – తీసుకున్న విషం వల్లనే చనిపోతే ఆ వాస్తవమే కావాలి. కొందరు ఆస్తిపరుల నోట్ల కట్టల కింద మట్టుబెడితే ఆ చేదు నిజమే కావాలి. మనిషి ప్రాణం తీయడానికి వెనుకాడని క్రూరులు నవ్వుతూ మన మధ్య తిరక్కూడదు.   మరో కల్పనను కాంథారీ హొటల్ మెట్లెక్కించకూడదు”. – ఇదీ లీడ్. (బాక్స్ ఐటమ్ లో వుంది. ఎన్ లార్జ్ చేసి చదవండి)

            “కల్పనను ఎవరు చంపారో నాకు తెలుసని మీరు ఎలా రాస్తారూ?”  అని   పోలీస్ కమీషనర్ భాస్కర రెడ్డి అడిగారు. “మిగిలిన రిపోర్టర్లను పిలిచి మీకు తెలియదని ఒక ప్రకటన చేయండి. మీకు ఎలా తెలుసో రేపటి ఎపిసోడ్ లో వివరిస్తాను” అన్నాను. వారు ఆ తరువాత మాట్లాడలేదు. పోలీస్ కమీషనర్ ఆఫీసులో కమీషనర్ తో అలా మాట్లాడడం అంత సులువైన వ్యవహారం కాదు.

            నేను AP Timesలో వుండగా ఏలూరులో ఒక సంఘటన జరిగింది. పవర్ పేట రైల్వేస్టేషన్ దగ్గర పూలు అమ్ముకునే మహిళల్ని ఓ రాత్రి ఎక్సైజ్ పోలీసులు ఎత్తుకుపోయి అత్యాచారం చేశారు.

            “What if they were sex workers? Police were not empowered to rape them. The Excise Superintendent’s vehicle was not intended to kidnap the hapless women. The Assistant Commissioner’s office compound is not supposed to be used as a hideout for gang rapes. But all this took place in Eluru, the head quarters of West Godavari district, on the moonlit night of April 25” అని మొదలెట్టాను.  

            అప్పట్లో పశ్చిమ గోదావరి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఒక ముస్లిం. పేరు గుర్తులేదు. “నిజంగా నాకు ఈ విషయాలు తెలియవు” అన్నారు వారు. “మీ ఆధీనంలో వున్న ఆఫీసు కాంపౌండ్ లోనే జరిగిందని నాకు స్పష్టంగా తెలుసు” అన్నాను. అప్పుడు ఏపి టైమ్స్ ఎడిటర్ సామ్ రాజప్ప, బ్యూరో చీఫ్ నిమ్మకాయల శ్రీరంగనాథ్.

            పూర్తి స్థాయి ఎవిడెన్స్ నా దగ్గర వున్నప్పుడే వున్నతాధికారిని కలిసే వాడిని. “స్టోరీ ఆపమని మాత్రం అడగొద్దు. స్టోరీ ఆగదు. మీరు ఇచ్చుకునే వివరణ ఏదైనా వుంటే చెప్పండి. అది కూడా కలిపి  ప్రచురిస్తాను. అదొక్కటే మీకు వున్న ఆప్షన్” అనేవాడిని.  

            మన వెనుక మన సంస్థ నైతిక మద్దతు వుందనే ధీమా బలంగా వున్నప్పుడే జర్నలిస్టులకు ఇలాంటివి రాయడం సాధ్యం. రాయడం నా గొప్పకావచ్చుగానీ దాన్ని ప్రచురించడం ఎడిటర్ల గొప్పతనం. తాడి ప్రకాష్, సామ్ రాజప్ప, నిమ్మకాయల శ్రీరంగనాథ్ లకు మరొక్క సారి ధన్యవాదాలు. మరో ఎడిటర్లు దానికి సాహసించరు. అందరికీ పోలీసులంటే భయం. జర్మలిస్టులకు ఆ మాత్రం పొగరు వుండాలి.


            జర్నలిజం విలువలు పెరగడమైనా పతనం కావడమైనా ప్రధానంగా మేనేజ్ మెంట్ అనుసరించే విధానాల మీదనే ఆధారపడి వుంటాయి. మేనేజ్ మెంట్‍ ప్రోత్సహిస్తే జర్నలిస్టులు దూకుడుగా పోతారు. మేనేజ్ మెంటు వంగి వుండమంటే జర్నలిస్టులు నేల మీద పాకుతారు. పోలీసు డిపార్టుమెంటులో  హోంగార్డ్స్ వ్యవస్థ లాగ జర్నలిజంలో స్ట్రీంగర్స్ వ్యవస్థ వచ్చాక అనేక అవలక్షణాలు వచ్చాయి. స్ట్రీంగర్లకు కష్టం ఎక్కువ ఆదాయం తక్కువ. కొన్ని మీడియా సంస్థలు స్ట్రీంగర్లకు లైన్ అకౌంట్ ఇవ్వడం కూడ మానేశాయి. పైగా, మండలాల వారీగా కమ్మర్షియల్ యాడ్స్ తెమ్మని వత్తిడి తేవడం మొదలెట్టాయి. దానితో స్ట్రింగర్లు  స్థానిక రాజకీయ నాయకులకు పర్సనల్ అసిస్టెంట్లుగా, కాంట్రాక్టర్లకు మీడియా మేనేజర్లుగా  మారిపోయారు. ఓ పది పన్నేండేళ్ళుగా అయితే, మేనేజ్ మెంటే రాజకీయ పార్టీలకు మీడియా హౌస్ ను బాహాటంగా లీజూకు ఇచ్చేస్తున్నారు. “కవర్ ఇస్తేనే కవరేజి” అనేది ఒకప్పుడు కింది స్థాయిలో వుండేది. ఇప్పుడు అది మేనేజ్ మెంట్ స్థాయిలోనే అధికార విధానంగా మారిపోయింది.  ‘మీడియా పార్ట్ నర్స’ అనేది ఇప్పుడు కొత్త నినాదం.  

రచన :  6 అక్టోబరు 2019
ప్రచురణ :

Equality theory and the theory of Manu


Equality theory and the theory of Manu  
సమతా సిధ్ధాంతం -  మనుధర్మం
డానీ
            మన దేశ రాజకీయాల్లో ఓ పదేళ్ళుగా మనుస్మృతి ప్రస్తావన తరచుగా  వస్తూ వుంది. ‘స్వేఛ్ఛా, సమానత్వం, సౌభ్రాతృత్వం’ లను ప్రవచించే ప్రస్తుత రాజ్యాంగాన్ని తొలగించి మనుస్మృతిని భారత రాజ్యాంగంగా ప్రకటించాలనే కోరిక కొందరిలో బలంగా వ్యక్తం అవుతూనేవుంది. సంఘపరివారం పెద్దలు మాత్రమేగాక  ప్రభుత్వంలో రాజ్యాంగ పదవుల్లో వున్నవారు సహితం ఒక క్రమపధ్ధతిలో ఇలాంటి ఆకాంక్షల్ని బయట పెడుతున్నారు.

            అలాగే, దీనికి భిన్నమైన వాదాలు సహితం అనేకం ముందుకు వస్తున్నాయి. మనుస్మృతి అనేది ఎప్పుడో మధ్యయుగాల్లో అమలు అయిందంటే నమ్మవచ్చుగానీ, దళితులు రాష్ట్రపతులుగానూ, శూద్రులు ప్రధాన మంత్రులుగానూ పరిపాలన సాగిస్తున్న ఈ కాలంలోనూ అది  అమలవుతున్నదని చెప్పగలమా? అనేవారున్నారు. దేశంలో ‘అమ్మవొడి’ వంటి పథకాలతో దాదాపుగా అందరికీ నిర్బంధ విద్య కొనసాగుతున్నప్పుడు శూద్రులు చదువుకోవడానికి వీల్లేదన్న మనువు ఆదేశం చెల్లుబాటులో వుందనవచ్చునా? అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.

            మనుస్మృతి ఆదేశాలవల్ల సమాజంలో స్త్రీలు, శూద్రుల మీద శతాబ్దాల తరబడి  కొనసాగిన అణిచివేతను దాచి పెట్టడానికి ఇంకొందరు గట్టి కసరత్తులు చేశారు. మనువు కొనసాగించిన కఠిన వైఖరిని మృదువుగా మార్చడానికి  పాత శ్లోకాలకు విరుధ్ధమైన కొత్త శ్లోకాలను ప్రక్షిప్తాలుగా చొప్పించారు. మనువు చెప్పిందేమిటో చొప్పించిందేమిటో తెలీక కొత్త గందరగోళం తలెత్తింది. మనుస్మృతి ఎన్నడూ ఏ రాజ్యంలోనూ అధికారిక స్మృతిగా లేదని మరికొందరు  వాదిస్తున్నారు. అయితే,  మౌర్య సామ్రాజ్య పతనం తరువాత మూడవ శతాబ్దంలో ఏర్పడిన గుప్త సామ్రాజ్యంలోనూ, మహారాష్ట్ర ప్రాంతంలో 17-18 శతాబ్దాల్లో కొనసాగిన  పీష్వాల సామ్రాజ్యంలోనూ మనుస్మృతి  ప్రాబల్యం కొనసాగిందని ఇంకొందరు చరిత్రకారులు గుర్తు చేస్తున్నారు.

            భారత దేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఆరంభమయిన కొత్తలోనే అంటే 1772 ప్రాంతంలోనే అప్పటి గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్ వివాహము, విడాకులు, సంతానం, సంపద, వారసత్వం, ధార్మిక సంస్థల నిర్వహణ తదితర వ్యవహారాల విధివిధానాల కోసం పౌరస్మృతుల్ని నిర్ధారించాలని భావించాడు. హిందూ, ముస్లిం ప్రతినిధులులు గవర్నర్ జనరల్ ను కలిసి మనుస్మృతి, షరియత్ లను తమ తమ పౌరస్మృతులుగా  ప్రకటించారు. బ్రిటీష్ వలస పాలనా కాలంలో ఆ రెండు గ్రంధాలే ప్రామాణిక పౌరస్మృతులుగా కొనసాగాయి. ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనా సౌలభ్యం కోసం బ్రిటీష్ అధికారి  సర్ విలియమ్ జోన్స్ మనుస్మృతిని ఇంగ్లీషు లోనికి అనువదించి 1794లో ప్రచురించాడు. అయితే ఏ కాలంలో అయినాసరే రాజ్యాంగం, చట్టాలు సంపూర్ణంగా అమలుకావు. వర్తమాన భారతదేశంలో రాజ్యాంగ విలువలు స్పూర్తి సంపూర్ణంగా అమలు అవుతున్నాయని చెప్పలేముకదా! అలాగే స్మృతికీ ఆచరణకు మధ్య  మినహాయింపులు వుల్లంఘనలు ఏ కాలంలో అయినా వుంటాయి.  

            మనుధర్మశాస్త్రంలో 12 అధ్యాయాలున్నాయి. ఒక్కో అధ్యాయంలో సగటున రెండు వందల చొప్పున మొత్తం రెండున్నర వేలకు పైగా శ్లోకాలున్నాయి. ఒక ఆదర్శసమాజానికి అవసరమైన విధివిధానాలను మనుధర్మశాస్త్రం వివరిస్తుందని దీని సమర్ధకులు అంటారు.  బిఆర్ అంబేడ్కర్ అభిప్రాయం అందుకు విరుధ్ధంగా వుండేది. అంతేకాదు; బౌధ్ధమత విలువల్ని సమూలంగా అణిచివేయడం కోసమే మనుధర్మశాస్త్ర రచన సాగిందనే అభిప్రాయాన్ని కూడా అంబేడ్కర్ వ్యక్తం చేశారు.

            ‘స్వేఛ్ఛా, సమానత్వం, సోదరభావం’ (Liberty, Equality and Fraternity) అనే ఆదర్శాలను 18వ శతాబ్దపు  ఫ్రెంచ్ విప్లవ సిధ్ధాంతకర్తలైన వాల్టైర్, రూస్సోల నుండి బిఆర్ అంబేడ్కర్ స్వీకరించి భారత రాజ్యాంగంలో పొందుపరిచారనే అభిప్రాయం ఇప్పటికీ  చాలామందిలో వుంది.  కానీ, ఈ మూడు ఆదర్శాలను తాను బుధ్ధుని నుండి స్వీకరించినట్లు అంబేడ్కర్ స్వయంగా చెప్పుకున్నారు. 

            ఎవరు ఎన్ని రకాల అభిప్రాయాలను చెప్పినప్పటికీ, బ్రాహ్మణ, క్షత్రీయ, వైశ్య వర్ణాలను పాలకవర్గంగానూ, శూద్రుల్ని శామికవర్గంగానూ స్థిరీకరించడానికి మనుధర్మ  గ్రంధ రచన సాగిందని అనిపిస్తుంది. ఇక్కడ ఇంకో విశేషం కూడా వుంది. తన  ఆదర్శ సమాజంలో శూద్రులకు ప్రవేశం కల్పించిన మనువు పంచముల్నీ, ఆదివాసుల్ని లోపలికి కూడా రానివ్వలేదు. వాళ్ళను ‘అన్యులు’గా పరిగణించి బయటే వుంచాడు. ఈ “మనము” “అన్యులు” అనే సామాజిక విభజనే ఇటలీ, జర్మనీల్లో ఫాసిజం నాజిజాలకు మూల సిధ్ధాంతంగా మారాయి. 

            “సమాజం సక్రమంగా కొనసాగాలంటే ఎవరి పని వారు చేయాలి. కుక్క పని కుక్కలు చేయాలి. గాడిద పని గాడిదలు చేయాలి”. “మనువు వర్ణాలకు శ్రమ విభజన చేశాడు. ఆ తరువాత కులాలకు శ్రమ విభజన జరిగింది” “మనుధర్మం వర్ణ సమాజం కోసమే రాసింది కనుక కుల సమాజంలో దానికి ప్రాసంగికత లేదు” అనే వారున్నారు.   నిజానికి వర్ణ సంకరం ద్వార కులాలు ఏర్పడతాయని మనువే సూత్రీకరించాడు. తన కాలంలోనే 30, నలభై కులాలను గుర్తించాడు. మనువు మార్కు శ్రమ విభజనని అంబేడ్కర్ తీవ్రంగా వ్యతిరేకించాడు. “కులవ్యవస్థ శ్రమ విభజన మాత్రమేకాదు; అది శ్రామికుల విభజన కూడ” అన్నాడు.        

            వర్ణం కూడ విశ్వవిద్యాలయాలు ప్రదానం చేసే డిగ్రీలువంటివనీ వాదించేవారు కొందరు వున్నారు. అలాంటివారిలో ఎంవిఆర్ శాస్త్రి ఒకరు. మనుషులందరూ శూద్రులుగానే  పుట్టి ఉపనయనం చేసుకుని  విద్యాసంస్కారంవల్ల ద్విజులుగానూ, వేదాధ్యయనంవల్ల విప్రులుగానూ, బ్రహ్మజ్ఞానాన్ని సాధించడంవల్ల  బ్రాహ్మణులుగానూ ఆవిర్భవిస్తారని చెప్పే ఒక శ్లోకం మను ధర్మశాస్త్రంలో వుందని వాళ్ళు అంటుంటారు. ఇలాంటివారి వాదన ప్రకారం ఎవరయినాసరే  గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే వైశ్యుడు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే క్షత్రీయుడు, డాక్టరేట్ పూర్తి చేస్తే విప్రుడు, పోస్ట్ డాక్టరేట్ పూర్తి చేస్తే బ్రాహ్మణుడు అవుతారు. అయితే, సామాజిక ఆచరణ అలా లేదు. మన దేశంలో శిశువు  పుట్టగానే ప్రసూతి కేంద్రం దస్తరంలోనే కులాన్ని నమోదు చేస్తారనే వాస్తవాన్ని వీరు నిరాకరిస్తారు.    

            పుట్టుక రీత్య మనుషులందరూ సమానులే; జీవితకాలంలో వ్యక్తిగత ఆసక్తి, కృషి, నైపుణ్య సాధన, సత్ప్రవర్తనల వల్ల  వాళ్ళలో వైవిధ్యం, బహుళత్వం ఏర్పడుతుంది అనంటే  మనువాదం ఒప్పుకోదు. సాధన ద్వార శూద్రులు ఎంతటి నైపుణ్యాన్ని సాధించినా సరే దాన్ని మనువాదం గుర్తించదు; పైగా శూద్రునికి శిక్షణ ఇవ్వడం మీదనే నిషేధాన్ని విధిస్తుంది.  జర్మన్ తత్వవేత్త ఫ్రైడ్రిక్ విల్ హెల్మ్ నీషే కు మనువాదం, చండాల (Tschandala) సిధ్ధాంతం, సూపర్ మేన్ ఆవిర్భావం అన్నీ గొప్పగా నచ్చాయి. అయితే నీషే సూపర్ మేన్ మనువు సూపర్ మేన్ ఒకటి కాదు. పుట్టుకరీత్య కాకుండ సత్ప్రవర్తన (virtue) రీత్య సూపర్ మేన్ ఆవిర్భవిస్తాడని నీషే భావించాడు.

            ఇంత కష్టపడి మనువు శ్రమవిభజన, శ్రామికుల విభజన ఎందుకు చేసినట్టూ? ఇంతటి కసరత్తు చేసి అతను సాధించదలచినది ఏమిటీ?  సామర్థ్యం వున్నప్పటికీ శూద్రుడు సంపదను సమకూర్చుకోకూడదు. సంపదను సమకూర్చుకున్నశూద్రుడు బ్రాహ్మణునికి శోకాన్ని కలిగిస్తాడు” అంటుంది మనుధర్మశాస్త్రం. (అధ్యాయం 10  శ్లోకం 129). మనుధర్మశాస్త్రం రూపంలో సాంస్కృతికం; సారంలో ఆర్థికం. దానికి కొనసాగింపుగా విస్తరించిన  కులవ్యవస్థ కూడ సాంస్కృతిక వ్యవహారంగా కనిపించే పచ్చి ఆర్థిక కార్యకలాపం. ముస్లింలు, క్రైస్తవులు, బౌధ్ధులు తాము ఒక ప్రత్యేక మత సమూహమనీ హిందువులకు భిన్నమనీ భావిస్తూ వుండవచ్చు. కానీ, కులవ్యవస్థ వాళ్ళనూ ఒక కులంగానే పరిగణిస్తుంది. 

            ఆధునిక కులవ్యవస్థలో మరీ అట్టడుగున వున్న ముస్లిం, క్రైస్తవ సమూహాలకు  కేవలం వేధింపులు మాత్రమే  వుండవచ్చు. గానీ, మిగిలిన అంతస్తుల్లో వున్నవారందరికీ వేధింపులే గాకుండ ఇతరుల్ని వేధించే సౌకర్యం సౌఖ్యం కూడ వుంటాయి. బాల్యంలో వేధింపులకు గురయినవారు పెద్దయ్యాక హింసా ప్రవృత్తిని సామాజిక ధర్మంగా భావిస్తారనేది మనస్తత్వ శాస్త్రంలో ఒక ప్రాథమిక సూత్రం. ఇది కుల వ్యవస్థకు యథాతథంగా సరిపోతుంది. ఒక సామాజికవర్గానికి చెందినవాళ్ళు తమకన్నా పైనున్న సామాజికవర్గాల నుండి అణిచివేతల్ని అనుభవిస్తూ వుంటారు. ఆ వేదనతో తమ కింద వున్న సామాజికవర్గాలను అణిచివేయడం, వేధించడం తమ హక్కుగానూ సామాజిక ధర్మంగానూ భావిస్తూ వుంటారు. అలా కులవ్యవస్థలో అణిచివేత ధర్మం సర్వత్రా నిరంతరాయంగా కొనసాగుతూ వుంటుంది.     

(రచయిత సీనియర్ జర్నలిస్టు, సమాజ విశ్లేషకులు, ముస్లిం ఆలోచనాపరుల వేదిక కన్వీనర్) 

మొబైల్ : 9010757776 

రచన : 26 సెప్టెంబరు 2019
ప్రచురణ : మన తెలంగాణ, 6 అక్టోబరు 2019