Saturday, 5 October 2019

Journalists must have guts

Journalists must have guts
జర్మలిస్టులకు ఆ మాత్రం పొగరు వుండాలి.
నిస్సహాయుల కోసం నిలబడాలనే నిబధ్ధత వుండాలి.

            కమ్మర్షియల్ సెక్స్ వర్కర్లు నిస్సహాయులు, నిర్బలురు, బతకడానికి మరో ఆలంబన లేక శరీరాన్ని అమ్మకానికి పెట్టిన వాళ్ళు. వాళ్ళ దయనీయ స్థితి మీద జాలిపడాలి.  వాళ్ళ మీద ఎవరయినా దౌర్జన్యం చేసినట్టు నా దృష్టికి వస్తే చాలా బాధ వేసేది. ఎదురు పడితే పళ్ళు ఊడగొట్టాలన్నంత  కోపమూ వచ్చేది.

            విజయవాడకు ఒక గొప్పతనం వుంది. ముదిగొండ పద్మ అనే ఒక కమ్మర్షియల్ సెక్స్ వర్కర్ ను  కేఎస్ వ్యాస్ కాలంలో (1987 లో కావచ్చు) ఓ పోలీసు స్టేషన్ లో శిరోముండనం చేశారు. దానితో ఆగ్రహించిన విజయవాడ పౌరులు రోడ్ల మీదకు వచ్చి పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. ఇప్పటి తరం మొద్దుబారిపోయింది. సామాన్య స్త్రీల మీద అత్యాచారం, అంతకన్నా ఘోరం జరుగుతున్నా స్పందించడంలేదు.

            నేను పాత్రికేయుడ్ని అయిన తరువాత సంచలనం రేపిన అలాంటి కేసు వేల్పూరు కల్పన ది. నిందితులు విజయవాడ నగరంలో చాలా పెద్ద వారు. Conquerors of the Golden city. అలాంటప్పుడే రిపోర్టింగ్ లో కిక్ వస్తుంది.  నాది క్రైమ్ బీట్ కానప్పటికీ అప్పటి ఆంధ్రభూమి ఎడిషన్ ఇన్ చార్జి తాడి ప్రకాష్ ఆ కేసును నాకు అప్పగించారు. కేసును తప్పుతోవ పట్టించిన డాక్టరుతో పాటు నిందితులు అందరూ అరెస్టు అయ్యేవరకు  కథనాల పరంపర సాగించాను.

            అందులో ఇప్పటికీ నాకే ఆశ్చర్యం కలిగించే విషయం విజయవాడ పోలీస్ కమీషనర్ మీద నేను చేసిన వ్యాఖ్యలు.  

            ‘కల్పన ఎలాగూ చచ్చిపోయింది. ఆమె మరణ రహాస్యం మాత్రం బతికే వుంది. దాన్ని చంపే ప్రయత్నం జరుగుతోందనే పత్రికల ఆందోళన. కల్పన మరణం మిస్టరీ కాదు. ఆ రహాస్యం శేషగిరికి తెల్సు, డాక్టర్ జయప్రకాష్ కు తెల్సు. పోలీస్ కమీషనర్ భాస్కర రెడ్డికి తెల్సు. మనిషి చచ్చిపోయినా నిజం చచ్చిపోకూడదు. కల్పన – ఏ కుట్రా జరక్కుండా – తీసుకున్న విషం వల్లనే చనిపోతే ఆ వాస్తవమే కావాలి. కొందరు ఆస్తిపరుల నోట్ల కట్టల కింద మట్టుబెడితే ఆ చేదు నిజమే కావాలి. మనిషి ప్రాణం తీయడానికి వెనుకాడని క్రూరులు నవ్వుతూ మన మధ్య తిరక్కూడదు.   మరో కల్పనను కాంథారీ హొటల్ మెట్లెక్కించకూడదు”. – ఇదీ లీడ్. (బాక్స్ ఐటమ్ లో వుంది. ఎన్ లార్జ్ చేసి చదవండి)

            “కల్పనను ఎవరు చంపారో నాకు తెలుసని మీరు ఎలా రాస్తారూ?”  అని   పోలీస్ కమీషనర్ భాస్కర రెడ్డి అడిగారు. “మిగిలిన రిపోర్టర్లను పిలిచి మీకు తెలియదని ఒక ప్రకటన చేయండి. మీకు ఎలా తెలుసో రేపటి ఎపిసోడ్ లో వివరిస్తాను” అన్నాను. వారు ఆ తరువాత మాట్లాడలేదు. పోలీస్ కమీషనర్ ఆఫీసులో కమీషనర్ తో అలా మాట్లాడడం అంత సులువైన వ్యవహారం కాదు.

            నేను AP Timesలో వుండగా ఏలూరులో ఒక సంఘటన జరిగింది. పవర్ పేట రైల్వేస్టేషన్ దగ్గర పూలు అమ్ముకునే మహిళల్ని ఓ రాత్రి ఎక్సైజ్ పోలీసులు ఎత్తుకుపోయి అత్యాచారం చేశారు.

            “What if they were sex workers? Police were not empowered to rape them. The Excise Superintendent’s vehicle was not intended to kidnap the hapless women. The Assistant Commissioner’s office compound is not supposed to be used as a hideout for gang rapes. But all this took place in Eluru, the head quarters of West Godavari district, on the moonlit night of April 25” అని మొదలెట్టాను.  

            అప్పట్లో పశ్చిమ గోదావరి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఒక ముస్లిం. పేరు గుర్తులేదు. “నిజంగా నాకు ఈ విషయాలు తెలియవు” అన్నారు వారు. “మీ ఆధీనంలో వున్న ఆఫీసు కాంపౌండ్ లోనే జరిగిందని నాకు స్పష్టంగా తెలుసు” అన్నాను. అప్పుడు ఏపి టైమ్స్ ఎడిటర్ సామ్ రాజప్ప, బ్యూరో చీఫ్ నిమ్మకాయల శ్రీరంగనాథ్.

            పూర్తి స్థాయి ఎవిడెన్స్ నా దగ్గర వున్నప్పుడే వున్నతాధికారిని కలిసే వాడిని. “స్టోరీ ఆపమని మాత్రం అడగొద్దు. స్టోరీ ఆగదు. మీరు ఇచ్చుకునే వివరణ ఏదైనా వుంటే చెప్పండి. అది కూడా కలిపి  ప్రచురిస్తాను. అదొక్కటే మీకు వున్న ఆప్షన్” అనేవాడిని.  

            మన వెనుక మన సంస్థ నైతిక మద్దతు వుందనే ధీమా బలంగా వున్నప్పుడే జర్నలిస్టులకు ఇలాంటివి రాయడం సాధ్యం. రాయడం నా గొప్పకావచ్చుగానీ దాన్ని ప్రచురించడం ఎడిటర్ల గొప్పతనం. తాడి ప్రకాష్, సామ్ రాజప్ప, నిమ్మకాయల శ్రీరంగనాథ్ లకు మరొక్క సారి ధన్యవాదాలు. మరో ఎడిటర్లు దానికి సాహసించరు. అందరికీ పోలీసులంటే భయం. జర్మలిస్టులకు ఆ మాత్రం పొగరు వుండాలి.


            జర్నలిజం విలువలు పెరగడమైనా పతనం కావడమైనా ప్రధానంగా మేనేజ్ మెంట్ అనుసరించే విధానాల మీదనే ఆధారపడి వుంటాయి. మేనేజ్ మెంట్‍ ప్రోత్సహిస్తే జర్నలిస్టులు దూకుడుగా పోతారు. మేనేజ్ మెంటు వంగి వుండమంటే జర్నలిస్టులు నేల మీద పాకుతారు. పోలీసు డిపార్టుమెంటులో  హోంగార్డ్స్ వ్యవస్థ లాగ జర్నలిజంలో స్ట్రీంగర్స్ వ్యవస్థ వచ్చాక అనేక అవలక్షణాలు వచ్చాయి. స్ట్రీంగర్లకు కష్టం ఎక్కువ ఆదాయం తక్కువ. కొన్ని మీడియా సంస్థలు స్ట్రీంగర్లకు లైన్ అకౌంట్ ఇవ్వడం కూడ మానేశాయి. పైగా, మండలాల వారీగా కమ్మర్షియల్ యాడ్స్ తెమ్మని వత్తిడి తేవడం మొదలెట్టాయి. దానితో స్ట్రింగర్లు  స్థానిక రాజకీయ నాయకులకు పర్సనల్ అసిస్టెంట్లుగా, కాంట్రాక్టర్లకు మీడియా మేనేజర్లుగా  మారిపోయారు. ఓ పది పన్నేండేళ్ళుగా అయితే, మేనేజ్ మెంటే రాజకీయ పార్టీలకు మీడియా హౌస్ ను బాహాటంగా లీజూకు ఇచ్చేస్తున్నారు. “కవర్ ఇస్తేనే కవరేజి” అనేది ఒకప్పుడు కింది స్థాయిలో వుండేది. ఇప్పుడు అది మేనేజ్ మెంట్ స్థాయిలోనే అధికార విధానంగా మారిపోయింది.  ‘మీడియా పార్ట్ నర్స’ అనేది ఇప్పుడు కొత్త నినాదం.  

రచన :  6 అక్టోబరు 2019
ప్రచురణ :

No comments:

Post a Comment