Equality theory and the theory of Manu
సమతా సిధ్ధాంతం - మనుధర్మం
డానీ
మన
దేశ రాజకీయాల్లో ఓ పదేళ్ళుగా మనుస్మృతి ప్రస్తావన తరచుగా వస్తూ వుంది. ‘స్వేఛ్ఛా, సమానత్వం, సౌభ్రాతృత్వం’
లను ప్రవచించే ప్రస్తుత రాజ్యాంగాన్ని తొలగించి మనుస్మృతిని భారత రాజ్యాంగంగా ప్రకటించాలనే
కోరిక కొందరిలో బలంగా వ్యక్తం అవుతూనేవుంది. సంఘపరివారం పెద్దలు మాత్రమేగాక ప్రభుత్వంలో రాజ్యాంగ పదవుల్లో వున్నవారు సహితం
ఒక క్రమపధ్ధతిలో ఇలాంటి ఆకాంక్షల్ని బయట పెడుతున్నారు.
అలాగే,
దీనికి భిన్నమైన వాదాలు సహితం అనేకం ముందుకు వస్తున్నాయి. మనుస్మృతి అనేది ఎప్పుడో
మధ్యయుగాల్లో అమలు అయిందంటే నమ్మవచ్చుగానీ, దళితులు రాష్ట్రపతులుగానూ, శూద్రులు ప్రధాన
మంత్రులుగానూ పరిపాలన సాగిస్తున్న ఈ కాలంలోనూ అది
అమలవుతున్నదని చెప్పగలమా? అనేవారున్నారు. దేశంలో ‘అమ్మవొడి’ వంటి పథకాలతో దాదాపుగా
అందరికీ నిర్బంధ విద్య కొనసాగుతున్నప్పుడు శూద్రులు చదువుకోవడానికి వీల్లేదన్న మనువు
ఆదేశం చెల్లుబాటులో వుందనవచ్చునా? అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.
మనుస్మృతి
ఆదేశాలవల్ల సమాజంలో స్త్రీలు, శూద్రుల మీద శతాబ్దాల తరబడి కొనసాగిన అణిచివేతను దాచి పెట్టడానికి ఇంకొందరు గట్టి
కసరత్తులు చేశారు. మనువు కొనసాగించిన కఠిన వైఖరిని మృదువుగా మార్చడానికి పాత శ్లోకాలకు విరుధ్ధమైన కొత్త శ్లోకాలను ప్రక్షిప్తాలుగా
చొప్పించారు. మనువు చెప్పిందేమిటో చొప్పించిందేమిటో తెలీక కొత్త గందరగోళం తలెత్తింది.
మనుస్మృతి ఎన్నడూ ఏ రాజ్యంలోనూ అధికారిక స్మృతిగా లేదని మరికొందరు వాదిస్తున్నారు. అయితే, మౌర్య సామ్రాజ్య పతనం తరువాత మూడవ శతాబ్దంలో ఏర్పడిన
గుప్త సామ్రాజ్యంలోనూ, మహారాష్ట్ర ప్రాంతంలో 17-18 శతాబ్దాల్లో కొనసాగిన పీష్వాల సామ్రాజ్యంలోనూ మనుస్మృతి ప్రాబల్యం కొనసాగిందని ఇంకొందరు చరిత్రకారులు గుర్తు
చేస్తున్నారు.
భారత
దేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఆరంభమయిన కొత్తలోనే అంటే 1772 ప్రాంతంలోనే అప్పటి గవర్నర్
జనరల్ వారెన్ హేస్టింగ్స్ వివాహము, విడాకులు, సంతానం, సంపద, వారసత్వం, ధార్మిక సంస్థల
నిర్వహణ తదితర వ్యవహారాల విధివిధానాల కోసం పౌరస్మృతుల్ని నిర్ధారించాలని భావించాడు.
హిందూ, ముస్లిం ప్రతినిధులులు గవర్నర్ జనరల్ ను కలిసి మనుస్మృతి, షరియత్ లను తమ తమ
పౌరస్మృతులుగా ప్రకటించారు. బ్రిటీష్ వలస పాలనా
కాలంలో ఆ రెండు గ్రంధాలే ప్రామాణిక పౌరస్మృతులుగా కొనసాగాయి. ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనా
సౌలభ్యం కోసం బ్రిటీష్ అధికారి సర్ విలియమ్
జోన్స్ మనుస్మృతిని ఇంగ్లీషు లోనికి అనువదించి 1794లో ప్రచురించాడు. అయితే ఏ కాలంలో
అయినాసరే రాజ్యాంగం, చట్టాలు సంపూర్ణంగా అమలుకావు. వర్తమాన భారతదేశంలో రాజ్యాంగ విలువలు
స్పూర్తి సంపూర్ణంగా అమలు అవుతున్నాయని చెప్పలేముకదా! అలాగే స్మృతికీ ఆచరణకు మధ్య మినహాయింపులు వుల్లంఘనలు ఏ కాలంలో అయినా వుంటాయి.
మనుధర్మశాస్త్రంలో
12 అధ్యాయాలున్నాయి. ఒక్కో అధ్యాయంలో సగటున రెండు వందల చొప్పున మొత్తం రెండున్నర వేలకు
పైగా శ్లోకాలున్నాయి. ఒక ఆదర్శసమాజానికి అవసరమైన విధివిధానాలను మనుధర్మశాస్త్రం వివరిస్తుందని
దీని సమర్ధకులు అంటారు. బిఆర్ అంబేడ్కర్ అభిప్రాయం
అందుకు విరుధ్ధంగా వుండేది. అంతేకాదు; బౌధ్ధమత విలువల్ని సమూలంగా అణిచివేయడం కోసమే
మనుధర్మశాస్త్ర రచన సాగిందనే అభిప్రాయాన్ని కూడా అంబేడ్కర్ వ్యక్తం చేశారు.
‘స్వేఛ్ఛా, సమానత్వం, సోదరభావం’ (Liberty, Equality and Fraternity) అనే ఆదర్శాలను 18వ శతాబ్దపు ఫ్రెంచ్ విప్లవ సిధ్ధాంతకర్తలైన వాల్టైర్, రూస్సోల
నుండి బిఆర్ అంబేడ్కర్ స్వీకరించి భారత రాజ్యాంగంలో పొందుపరిచారనే అభిప్రాయం ఇప్పటికీ చాలామందిలో వుంది. కానీ, ఈ మూడు ఆదర్శాలను తాను బుధ్ధుని నుండి స్వీకరించినట్లు
అంబేడ్కర్ స్వయంగా చెప్పుకున్నారు.
ఎవరు
ఎన్ని రకాల అభిప్రాయాలను చెప్పినప్పటికీ, బ్రాహ్మణ, క్షత్రీయ, వైశ్య వర్ణాలను పాలకవర్గంగానూ,
శూద్రుల్ని శామికవర్గంగానూ స్థిరీకరించడానికి మనుధర్మ గ్రంధ రచన సాగిందని అనిపిస్తుంది. ఇక్కడ ఇంకో విశేషం
కూడా వుంది. తన ఆదర్శ సమాజంలో శూద్రులకు ప్రవేశం
కల్పించిన మనువు పంచముల్నీ, ఆదివాసుల్ని లోపలికి కూడా రానివ్వలేదు. వాళ్ళను ‘అన్యులు’గా
పరిగణించి బయటే వుంచాడు. ఈ “మనము” “అన్యులు” అనే సామాజిక విభజనే ఇటలీ, జర్మనీల్లో ఫాసిజం
నాజిజాలకు మూల సిధ్ధాంతంగా మారాయి.
“సమాజం
సక్రమంగా కొనసాగాలంటే ఎవరి పని వారు చేయాలి. కుక్క పని కుక్కలు చేయాలి. గాడిద పని గాడిదలు
చేయాలి”. “మనువు వర్ణాలకు శ్రమ విభజన చేశాడు. ఆ తరువాత కులాలకు శ్రమ విభజన జరిగింది”
“మనుధర్మం వర్ణ సమాజం కోసమే రాసింది కనుక కుల సమాజంలో దానికి ప్రాసంగికత లేదు” అనే
వారున్నారు. నిజానికి వర్ణ సంకరం ద్వార కులాలు ఏర్పడతాయని మనువే
సూత్రీకరించాడు. తన కాలంలోనే 30, నలభై కులాలను గుర్తించాడు. మనువు మార్కు శ్రమ విభజనని
అంబేడ్కర్ తీవ్రంగా వ్యతిరేకించాడు. “కులవ్యవస్థ శ్రమ విభజన మాత్రమేకాదు; అది శ్రామికుల
విభజన కూడ” అన్నాడు.
వర్ణం కూడ విశ్వవిద్యాలయాలు ప్రదానం చేసే డిగ్రీలువంటివనీ వాదించేవారు
కొందరు వున్నారు. అలాంటివారిలో ఎంవిఆర్ శాస్త్రి ఒకరు. మనుషులందరూ శూద్రులుగానే పుట్టి ఉపనయనం చేసుకుని విద్యాసంస్కారంవల్ల ద్విజులుగానూ, వేదాధ్యయనంవల్ల
విప్రులుగానూ, బ్రహ్మజ్ఞానాన్ని సాధించడంవల్ల బ్రాహ్మణులుగానూ ఆవిర్భవిస్తారని చెప్పే ఒక శ్లోకం
మను ధర్మశాస్త్రంలో వుందని వాళ్ళు అంటుంటారు. ఇలాంటివారి వాదన ప్రకారం ఎవరయినాసరే గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే వైశ్యుడు, పోస్ట్ గ్రాడ్యుయేషన్
పూర్తి చేస్తే క్షత్రీయుడు, డాక్టరేట్ పూర్తి చేస్తే విప్రుడు, పోస్ట్ డాక్టరేట్ పూర్తి
చేస్తే బ్రాహ్మణుడు అవుతారు. అయితే, సామాజిక ఆచరణ అలా లేదు. మన దేశంలో శిశువు పుట్టగానే ప్రసూతి కేంద్రం దస్తరంలోనే కులాన్ని నమోదు
చేస్తారనే వాస్తవాన్ని వీరు నిరాకరిస్తారు.
పుట్టుక రీత్య మనుషులందరూ సమానులే; జీవితకాలంలో వ్యక్తిగత ఆసక్తి,
కృషి, నైపుణ్య సాధన, సత్ప్రవర్తనల వల్ల వాళ్ళలో
వైవిధ్యం, బహుళత్వం ఏర్పడుతుంది అనంటే మనువాదం
ఒప్పుకోదు. సాధన ద్వార
శూద్రులు ఎంతటి నైపుణ్యాన్ని సాధించినా సరే దాన్ని మనువాదం గుర్తించదు; పైగా శూద్రునికి
శిక్షణ ఇవ్వడం మీదనే నిషేధాన్ని విధిస్తుంది. జర్మన్ తత్వవేత్త
ఫ్రైడ్రిక్ విల్ హెల్మ్ నీషే కు మనువాదం, చండాల (Tschandala) సిధ్ధాంతం, సూపర్ మేన్ ఆవిర్భావం అన్నీ గొప్పగా నచ్చాయి. అయితే నీషే సూపర్ మేన్ మనువు సూపర్ మేన్ ఒకటి కాదు.
పుట్టుకరీత్య కాకుండ సత్ప్రవర్తన (virtue) రీత్య సూపర్ మేన్ ఆవిర్భవిస్తాడని నీషే భావించాడు.
ఇంత
కష్టపడి మనువు శ్రమవిభజన, శ్రామికుల విభజన ఎందుకు చేసినట్టూ? ఇంతటి కసరత్తు చేసి అతను
సాధించదలచినది ఏమిటీ? “సామర్థ్యం వున్నప్పటికీ శూద్రుడు సంపదను సమకూర్చుకోకూడదు. సంపదను
సమకూర్చుకున్నశూద్రుడు బ్రాహ్మణునికి శోకాన్ని కలిగిస్తాడు” అంటుంది మనుధర్మశాస్త్రం.
(అధ్యాయం 10 శ్లోకం 129). మనుధర్మశాస్త్రం రూపంలో సాంస్కృతికం; సారంలో
ఆర్థికం. దానికి కొనసాగింపుగా విస్తరించిన
కులవ్యవస్థ కూడ సాంస్కృతిక వ్యవహారంగా కనిపించే పచ్చి ఆర్థిక కార్యకలాపం. ముస్లింలు,
క్రైస్తవులు, బౌధ్ధులు తాము ఒక ప్రత్యేక మత సమూహమనీ హిందువులకు భిన్నమనీ భావిస్తూ వుండవచ్చు.
కానీ, కులవ్యవస్థ వాళ్ళనూ ఒక కులంగానే పరిగణిస్తుంది.
ఆధునిక
కులవ్యవస్థలో మరీ అట్టడుగున వున్న ముస్లిం, క్రైస్తవ సమూహాలకు కేవలం వేధింపులు మాత్రమే వుండవచ్చు. గానీ, మిగిలిన అంతస్తుల్లో వున్నవారందరికీ
వేధింపులే గాకుండ ఇతరుల్ని వేధించే సౌకర్యం సౌఖ్యం కూడ వుంటాయి. బాల్యంలో వేధింపులకు
గురయినవారు పెద్దయ్యాక హింసా ప్రవృత్తిని సామాజిక ధర్మంగా భావిస్తారనేది మనస్తత్వ శాస్త్రంలో
ఒక ప్రాథమిక సూత్రం. ఇది కుల వ్యవస్థకు యథాతథంగా సరిపోతుంది. ఒక సామాజికవర్గానికి చెందినవాళ్ళు
తమకన్నా పైనున్న సామాజికవర్గాల నుండి అణిచివేతల్ని అనుభవిస్తూ వుంటారు. ఆ వేదనతో తమ
కింద వున్న సామాజికవర్గాలను అణిచివేయడం, వేధించడం తమ హక్కుగానూ సామాజిక ధర్మంగానూ భావిస్తూ
వుంటారు. అలా కులవ్యవస్థలో అణిచివేత ధర్మం సర్వత్రా నిరంతరాయంగా కొనసాగుతూ వుంటుంది.
(రచయిత సీనియర్ జర్నలిస్టు, సమాజ విశ్లేషకులు, ముస్లిం ఆలోచనాపరుల వేదిక కన్వీనర్)
మొబైల్ : 9010757776
రచన
: 26 సెప్టెంబరు 2019
ప్రచురణ
: మన తెలంగాణ, 6 అక్టోబరు 2019
No comments:
Post a Comment