ఫాసిజానికి కుక్కచావు
డానీ
1.
తాను సర్వశక్తివంతురాలని
(omnipotent), తనను ఎవరూ ఎదిరించలేరని (invincible) చెప్పుకుంటూ ఫాసిజం
విర్రవీగుతుంది. ఫాసిజం అజేయశక్తి ఏమీకాదు. ఫాసిజాన్ని ఓడించడం కష్టసాధ్యమేగాని అసాధ్యం
ఏమీకాదు.
2.
పోరాడేశక్తులు, పోరాడే
వాతావరణం, పోరాడే సంస్థ లేకుండా పోరాటాల్లో విజయం సాధ్యంకాదు. ఇవి మూడు వున్నప్పుడు
ఎంతటి ఫాసిస్టు శక్తులనైనా ఓడించవచ్చు.
3.
అడాల్ఫ్ హిట్లర్ కళ్ళెప్పుడూ
సోవియట్ రష్యా మీదనే వుండేవి. జర్మనీకి ఆహార సమస్య వచ్చినపుడెల్లా తాను తూర్పు దిక్కుకు
చూస్తాననీ, అక్కడ తనకు రష్యా కనిపిస్తుందనీ, రష్యాను ఆక్రమించుకుంటే అక్కడి యూదు రైతులు
జర్మనీ కోసం ఆహారాన్ని పండించి పంపిస్తారని హిట్లర్ ‘నా పోరాటం’ (Mein Kampf 1925)
పుస్తకంలో రాసుకున్నాడు.
4.
రష్యాను ఆక్రమించడానికి
వీలుగానే జర్మనీకి తూర్పున వున్న పోలెండును ముందుగా ఆక్రమించాడు. ఆ రోజుల్లో పోలెండుకు
తూర్పున సోవియట్ రష్యా వుండేది. ఇప్పుడు ఆ
ప్రాంతంలో యుక్రైన్, బైలారస్, లిథుయానియా దేశాలు ఏర్పడ్డాయి.
5.
బెనిటో ముస్సోలిని
కళ్ళు ఎప్పుడూ ఇటలీకి దక్షణ దిక్కున వున్న ఆఫ్రికా ఖండం మీద వుండేవి. ఆఫ్రికాను ఖాళీ
చేయించేసి అక్కడ ఒక కోటి మంది ఇటలీ ప్రజలకు నివాసం కల్పిస్తే, ఇటలీలో జనసాంద్రత తగ్గి
ఛాతీ నిండా గాలిపీల్చుకోవచ్చు అనేవాడు ముస్సోలిని.
6.
జర్మన్ సైన్యాలు
1941 జూన్ నెలలో రష్యాలోనికి ప్రవేశించి చాలా దూరం వరకు చొచ్చుకుని పోయాయి. చరిత్రలో
ఇది అతిపెద్ద సైనిక చర్య. దీనికి అలనాటి ‘పవిత్ర రోమన్’ చక్రవర్తి ఫ్రెడెరిక్ బార్బరొస్సా పేరు పెట్టాడు హిట్లర్.
7.
1942 జులైలో ముస్సోలిని
సేన ఉత్తర ఆఫ్రికా దేశాలైన ఈజిప్టు, లిబియా, టునీషియా, అల్జీరియాలపై విరుచుకు పడింది.
సూయజ్ కెనాల్ ను స్వాధీనం చేసుకుని ప్రపంచ రవాణా రంగాన్ని శాసించాలనేది దాని లక్ష్యం.
8.
ఈజిప్టు, లిబియాల్లో
ముస్లింలు అత్యధికులు. ఆ రెండు దేశాలు ఫాసిజాన్ని వీరోచితంగా ఎదుర్కొన్నాయి. అంత వరకు
ఓటమి అనేదే తెలియకుండ అప్రతిహతంగా సాగిపోతున్న అక్షరాజ్యాలకు 1942 నవంబరులో ఈజిప్ట్
లోని ఎల్ ఆలమీన్ (El Alamein) నగరం వద్ద తొలి ఓటమి ఎదురైంది. ఇది పాసిజం అంతానికి ఆరంభం.
9.
ఆ తరువాత అక్షరాజ్యాలకు
ఒక్క విజయం కూడ దక్కలేదు. పరాజయాలను తట్టుకోలేక
ఇద్దరు నియంతలు ముస్సోలినీ, హిట్లర్ తీవ్ర అసహనానికి గురయ్యారు.
10.
రెండవ ప్రపంచ యుధ్ధం
జరుగుతుండగానే ఇటలీలో బెనిటో ముస్సోలిని మీద ప్రజలకు నమ్మకం తగ్గిపోయి వ్యతిరేకత పెరిగింది.
1943 జులై నెలలో ప్రధాన మంత్రి పదవిని కోల్పోయాడు. 1945 ఏప్రిల్ నెలలో డ్యూస్ ఆఫ్ ఇటలియన్
సోషల్ రిపబ్లిక్ పదవిని కోల్పోయాడు.
11.
ఇటలీలో ముస్సోలిని
ప్రాణాల్ని కాపాడుకోవడమే కష్టమయిపోయింది. దొరికితే ఇటాలియన్ ప్రజలే అతన్ని చంపేసే పరిస్థితి నెలకొంది. తనతో సహజీవనం చేస్తున్న క్లారా పెటస్సీ తో కలిసి
స్విడ్జర్ ల్యాండ్ వెళ్ళి అక్కడి నుండి విమానంలో స్పెయిన్ కు పారిపోయేప్రయత్నం చేశాడు.
అప్పటి స్పెయిన్ ను ఇంకో నియంత జనరల్ ఫ్రాన్సిస్కో ఫ్రాంకో రాజ్యం చేస్తున్నాడు.
12.
స్పెయిన్ కు పారిపోతున్న
ముస్సోలినీ, క్లారా పెటస్సీని ఇటలీ - స్విడ్జర్
ల్యాండ్ సరిహద్దుల్లో 1945 ఏప్రిల్ 27న కమ్యూనిస్టు మిలీషియా పట్టుకుంది.
13.
అంతకు ముందు కమ్యూనిస్టు
కార్యకర్తలు ఎవరైనా దొరికితే ముస్సోలిని సృష్టించిన అల్లరిమూకలు ‘బ్లాక్ షర్ట్స్’ వాళ్ళను
రివాల్వర్లతో కాల్చి చంపి చాకులతో తోలు వలిచి గ్యాస్ స్టేషన్లలో కొక్కేలకు వేలాడదీసే
వారు.
14.
అందుకు ప్రతీకారంగా
అన్నట్టు కమ్యూనిస్టు కార్యకర్తలు కూడ ముస్సోలినీ, క్లారా పెటస్సీ లను 1945 ఏప్రిల్
28న రివాల్వర్లతో కాల్చి చంపి చాకులతో తోలు వలిచి గ్యాస్ స్టేషన్ లో కొక్కేలకు వేలాడదీశారు.
“ఫాసిజానికి కుక్కచావు” అని నినాదాలు చేశారు.
15.
అప్పుడు జర్మనీలో
హిట్లర్ పరిస్థితి కూడ బాగోలేదు. ప్రజలు ఏక్షణమైనా తిరగబడడానికి సిధ్ధంగా వున్నారు.
ప్రజా తిరుగుబాటుకు భయపడిన హిట్లర్ రాజభవనం రీచ్ స్టాగ్ ను వదిలేశాడు. బెర్లిన్ నగర శివార్లలో ఒక బంకర్ లో భయంభయంగా బతుకుతున్నాడు.
16.
హిట్లర్ వయస్సు అప్పుడు
56 సంవత్సరాలు. అప్పటి వరకు హిట్లర్ పెళ్ళి చేసుకోలేదు. కానీ ఇవా బ్రౌన్ అనే మహిళతో
సహజీవనం చేస్తుండేవాడు. అప్పుడయినా తనను పెళ్ళి చేసుకోమని ఇవా బ్రౌన్ కోరింది.
17.
ముస్సోలినీ హత్య వార్త
అప్పటికి హిట్లర్ కు చేరలేదు. ముస్సోలినిని ఖతం చేసిన రోజే అర్థరాత్రి దాటిన తరువాత
అంటే 1945 ఏప్రిల్ 29 తెల్లవారుజామున హిట్లర్ తన బంకరులో ఇవా బ్రౌన్ ను పెళ్ళి చేసుకున్నాడు.కొత్త
దంపతులు ఒకటిన్నర రాత్రి గడిపారు.
18.
ఏప్రిల్ 30 ఉదయం హిట్లర్
కు ముస్సోలిని మరణ వార్త తెలిసింది. తమకు చావు దగ్గరపడిందని హిట్లర్ దంపతులకు స్పష్టంగా
అర్ధం అయిపోయింది. ఆ రోజు సాయంత్రం ఇవా బ్రౌన్ సైనేడ్ తాగేసింది. హిట్లర్ తన రివాల్వర్
తో కణితిలో కాల్చుకున్నాడు.
19.
ఆ మరునాడు అంటే
1945 మే 1న అంటే మేడే నాడు ఎర్రసైన్యం బెర్లిన్ మహానగరం లోనికి ప్రవేశించింది. స్వల్ప
ప్రతిఘటన తరువాత మే 8న మూడో రీచ్ బేషరతుగా లొంగుబాటును ప్రకటించింది. దీనినే యూరోప్
లో విజయ దినం (VE Day) అంటారు.
20.
అక్షరాజ్యాల్లో మూడవ
ప్రధాన భాగస్వామి జపాన్ ఆసియా ఖండంలో మరికొంత కాలం యుధ్ధాన్ని కొనసాగించింది.
21.
అమెరిక 1945 ఆగస్టు
6, 9 తేదీల్లో జపాన్ నగరాలైన హీరోషీమా, నాగసాకీలపై అణుబాంబులు వేసింది. 1945 ఆగస్టు
15న జపాన్ లొంగుబాటును ప్రకటించింది. దీనినే జపాన్ పై విజయదినం (VJ Day) అంటారు.
22.
అలా ఫాసిజం కుక్క
చావుతో రెండవ ప్రపంచ యుధ్ధం ముగిసింది.
23.
సాధారణంగా కమ్యూనిస్టు
ఎర్రసైన్యమే ఫాసిజం- నాజీజాలను ఓడించింది అనే ఒక సాధారణ అభిప్రాయం చాలా మందిలో వుంటుంది.
ఇటాలియన్ ఫాసిజాన్ని ముందుగా ఓడించింది ముస్లిం దేశాలు. ఎర్రసైన్యం జర్మనీలో ప్రవేశించడానికి
రెండున్నరేళ్ళు ముందే ఈజిప్టులో ఇటలీ ఓడిపోయింది.
(నేను రాసిన జూలియస్
ఫ్యూజిక్ 1981/ 2013 నుండి)
రచన : 9 అక్టోబరు
2019
సవరణ : 2 మే 2023
No comments:
Post a Comment